సాక్షి, హైదరాబాద్: మహానగరంలో చలి మామూలుగా లేదు.. నగరవాసిని గజగజ వణికిస్తోంది.. సాధారణ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పడిపోతున్నాయి.. శీతల గాలులు విజృంభిస్తున్నాయి.. రాత్రిపూట చలిచలిగా ఉంటోంది.. ఉదయంపూట రోడ్లు ఖాళీఖాళీగా ఉంటున్నాయి.. మొత్తంగా నగరం చలి పంజాలో చిక్కుకుని ఉంది. సగటున నగరంలో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శివారు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ప్రజలు స్వెటర్లు, జాకెట్లు, దుప్పట్లను ఆశ్రయిస్తున్నారు. శీతల గాలుల ప్రభావంతో ఉదయం వేళల్లో రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి.
పార్కులు, మార్నింగ్ వాక్ చేసే ప్రాంతాల్లో ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గింది. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లేవారు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పేదల జీవనం చలితో మరింత కష్టంగా మారింది. రోడ్ల పక్కన నివసించే వారు ఉదయం వేళ చలి మంటలు వేసుకుని తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు పంపిణీ చేస్తూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే కొన్ని రోజులు కూడా చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశముంది. సాధ్యమైనంత మేరకు ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


