హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి సతీమణి ప్రముఖ డిజైనర్ అనూశ్రీరెడ్డి వస్త్ర షోరూంలో భారీ చోరీ జరిగింది.ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి జానారెడ్డి కోడలు, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి సతీమణి భవానీ అనూశ్రీ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో అనూశ్రీరెడ్డి డిజైనర్ షోరూంతో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు.
ఈ నెల 6న రోజువారీ కలెక్షన్‌ను లాకర్‌లో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. 7వ తేదీన ఉదయం షోరూం తెరిచి బ్యాంక్‌లో జమ చేసేందుకు లాకర్‌లో చూడగా కనిపించలేదు. రూ.2.43 లక్షలు నగదు చోరీకి గురైందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోరూంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ బాయ్ అమీనుల్‌హక్ రెండు రోజుల నుంచి డ్యూటీకి రావడం లేదని, మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉందని, అతనిపై అనుమానం వ్యక్తంచేస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.


