
తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం..దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి 24 గంటల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయుగుండంగా మారొచ్చు. ఇది దక్షిణ ఒడిశా, ఉత్త రాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ ఉదయంకల్లా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్ల డించింది.
ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కొనసా గుతుంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్, సమీప బిహార్ ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం పశ్చిమ విదర్భ వరకు కొనసా గుతుంది. వీటి ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
25 శాతం అధిక వర్షపాతం
ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్ సంతృప్తికర వర్షాలనే నమోదు చేసింది. నైరుతి సీజన్‌లో ఈనెల 21వ తేదీ నాటికి 69.78 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 87.44 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 25% అధికంగా నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
⇒ నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు మెదక్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
⇒ మండలాల వారీగా పరిశీలిస్తే... 103 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 272 మండలాల్లో అధిక వర్షపాతం, 2,333 మండలాల్లో సాధారణ వర్షపాతం, 13 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యింది. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో వానలు సైతం భారీగా నమోదయ్యే అవకాశముంది. ఈ నెల 25న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోనూ భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.