
23, 24న కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదించనున్న రాష్ట్రం
ఇందుకోసం తెరపైకి కొత్తగా 16 ప్రాజెక్టులు
వాటికి ఇన్వెస్టిగేషన్లు, సర్వేలు, డీపీఆర్‌ల తయారీకి సర్కారు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలకు 382.48 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వినియోగంలోకి తీసుకురావడానికి 16 కొత్త ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పున:పంపిణీపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న విచారణ సందర్భంగా భవిష్యత్‌లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులకు మొత్తం 382.48 టీఎంసీల నీటి కేటాయింపులు జరపాలని వాదనలు వినిపించనుంది. ఇందులో భాగంగా ఆయా ప్రాజెక్టులకు ఇన్వెస్టిగేషన్లు, సర్వేలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఏపీ భారీగా కృష్ణా జలాలను తరలించి జలాశయాల్లో నిల్వ చేసుకుంటుండగా, తెలంగాణలో మాత్రం రాష్ట్ర అవసరాలకు సరిపడా కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి జలాశయాలు లేవని చాలాకాలంగా ఆందోళనలున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు నిల్వ సామర్థ్యం పెంచుకొని కృష్ణా మిగులు జలాలను వాడుకోవడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజర్వాయర్ల నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందింది. దీని ఆధారంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 16 కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌ల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జూరాల నుంచి 227టీఎంసీల తరలింపు..
227 టీఎంసీలను జూరాల ప్రాజెక్టు, 55 టీఎంసీలను శ్రీశైలం జలాశయం నుంచి తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వరదల సమయంలో జూరాల రిజర్వాయర్ నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున మొత్తం 100 టీఎంసీలను తరలించుకోవడానికి జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మించి ఇతర రిజర్వాయర్లు, చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని 11.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని ప్రతిపాదించింది.
⇒ వరదల సమయంలో జూరాల రిజర్వాయర్ వెనక భాగం నుంచి మరో 123 టీఎంసీల నీటిని తరలించి మహబూబ్‌నగర్ జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడానికి కోయిల్‌కొండ–గండీడ్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 45 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కోయిల్‌కొండ, 35 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో గండీడ్, 43 టీఎంసీల సామర్థ్యంతో దౌలతాబాద్ రిజర్వాయర్లను నిర్మించనుంది.
⇒ జూరాల రిజర్వాయర్ నుంచి మరో 4 టీఎంసీలను తరలించి అదనంగా 25వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో దశ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించింది.
⇒ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో శ్రీశైలం జలాశయం వెనక నుంచి రోజుకు టీఎంసీ చొప్పున 35 టీఎంసీలను తరలించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.99 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందించడానికి శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పొడవు పొడిగించనున్నట్టు తెలిపింది.
⇒ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండోదశ కింద కాల్వలు, హెడ్‌వర్క్స్, పంప్‌హౌస్ సామర్థ్యం పెంచి శ్రీశైలం జలాశయం నుంచి 13 టీఎంసీలను తరలించి అదనంగా 95,531 ఎకరాల ఆయకట్టుకు సాగునీరుతో పాటు 7.12 టీఎంసీల తాగునీటి సరఫరా చేయనున్నట్టు పేర్కొంది.