18వ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయించిన కమిషనర్ సజ్జనార్
సభ్యులతో తొలి కీలక సమావేశం నిర్వహణ
దర్యాప్తునకు సంబంధించిన దిశానిర్దేశం
ప్రభాకర్‌రావు విచారణ జూబ్లీహిల్స్ ఠాణాలోనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటుచేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పడిన అధికారిక సిట్‌కు బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో (టీజీ ఐసీసీసీ) కార్యాలయం కేటాయించారు. అందులోని ఏ టవర్‌లో ఉన్న 18వ అంతస్తులో, తన చాంబర్‌కు సమీపంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ దీన్ని ఏర్పాటు చేయించారు. సిట్‌లో ఉన్న తొమ్మిది మంది సభ్యులతో ఆయన ఆదివారం తొలిసారిగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రభాకర్‌రావు విచారణ, జనవరి 16న సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన కీలక నివేదికతోపాటు కేసు దర్యాప్తునకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ అంశాలపై ఆయన సిట్‌కు దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ ఠాణాలోనే విచారణ
కేసు దర్యాప్తు కీలక దశకు చేరడంతోపాటు తుది చార్జిషీట్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిందితులు, బాధితులను మరోసారి విచారించాలని సిట్ యోచిస్తోంది. అవసరమైతే ట్యాపింగ్ బారినపడిన రాజకీయ నాయకులతోపాటు అధికారులను కూడా విచారించాలని నిర్ణయించారు. ప్రభాకర్‌రావును రెండో దఫా కస్టోడియల్ విచారణ చేస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, ఆయన్ను కూడా అక్కడకే తరలించి విచారించాలని తొలుత భావించారు.
అయితే ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. అక్కడ సిటీ పోలీసులు ఇప్పటివరకు దాఖలు చేసిన పత్రాల ప్రకారం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పైభాగంలో ఉన్న సిట్ కార్యాలయంలో ప్రభాకర్‌రావును విచారించాలి. ఇందులో ఏ విధమైన మార్పుచేర్పులు చేసినా ఆ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణ జనవరి 16న ఉండటంతో అప్పటివరకు అనుబంధ పిటిషన్లు దాఖలు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావును జూబ్లీహిల్స్ ఠాణాలో ఉన్న సిట్ కార్యాలయంలోనే ఉంచి విచారించాలని నిర్ణయించారు.
ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత
ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకట గిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును విచారిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు పశి్చమ మండల డీసీపీగా పనిచేసి, సిద్దిపేట సీపీగా బదిలీ అయిన ఎస్‌ఎం విజయ్ కుమార్ ఆది నుంచీ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. తాజాగా ఆయన్ను కూడా సిట్‌లోకి తీసుకున్నారు. దీంతో ఆయన కేసు పూర్వాపరాలు, ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచి్చన అంశాలను సమీక్షించి లూప్‌హోల్స్ వెలికితీయడంపై దృష్టి పెట్టారు.
సిట్ సభ్యుడిగా ఉన్న రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మాదాపూర్, మహేశ్వరం డీసీపీలు రితిరాజ్, కె.నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, ‘ఈగిల్’డీఎస్పీ సీహెచ్ శ్రీధర్, మెట్రో రైల్ డీఎస్పీ నాగేంద్ర రావుకు కొత్వాల్ సజ్జనార్ ఒక్కో బాధ్యతను అప్పగించారు. ఎప్పటికప్పుడు కేసు మొత్తాన్ని తానే సమీక్షిస్తానని ఆయన అధికారులకు చెప్పారు.


