చర్లపల్లి టెర్మినల్‌కు అందుబాటులో లేని ఎంఎంటీఎస్ రైళ్లు
రోజుకు ఒకే ఒక్క సరీ్వస్ రాకపోకలు
రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ
కనెక్టివిటీ లేకపోవడంతో ఇబ్బందులు
హైదరాబాద్‌లో నాలుగో టెర్మినల్ గా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి రైళ్లు, ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రతి రోజు సుమారు 5 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధితో పాటు ఇటీవల ప్రారంభించిన నాంపల్లి స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనుల దృష్ట్యా పదుల సంఖ్యలో రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. కానీ అందుకనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం ఒకే ఒక్క ఎంఎంటీఎస్ ట్రైన్ లింగంపల్లి నుంచి సనత్‌నగర్, సుచిత్ర, మౌలాలి, చర్లపల్లి మీదుగా ఘట్‌కేసర్ వరకు నడుస్తుంది. చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించి ఏడాది గడిచినా ఇప్పటి వరకు లోకల్ కనెక్టివిటీ పెరగకపోవడం వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకోవాలన్నా, చర్లపల్లిలో రైలు దిగి నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లాలన్నా ప్రయాణికులు చుక్కలు కనిపిస్తున్నాయి.
చర్లపల్లి టెర్మినల్ కు ఉదయం నుంచి సాయంత్రం వరకు సిటీ బస్సులు నడుస్తున్నప్పటికీ తెల్లవారుజామున, రాత్రి 11 తరువాత రైళ్లు వచ్చే సమయానికి బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించవలసి వస్తోంది. దీంతో ప్రయాణం ఆరి్థకంగా మరింత భారంగా మారుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రైళ్లు చర్లపల్లి నుంచే...
ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్, చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్,దర్భంగా బై వీక్లీ,సిల్చార్ వీక్లీ సూపర్ ఫాస్ట్, యశ్వంత్‌పూర్ ట్రై వీక్లీ గరీబ్ రథ సూపర్ ఫాస్ట్, తిరుపతి–ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్.నర్సాపూర్–నాగర్‌సోల్ సూపర్‌ఫాస్ట్, విశాఖపట్నం ట్రై వీక్లీ, నాగావళి సూపర్ ఫాస్ట్ ట్రై వీక్లీ ఎక్స్ ప్రెస్, తదితర రైళ్లన్నీ చర్లపల్లి నుంచే నడుస్తున్నాయి.అలాగే ప్రయాణికుల రద్దీకనుగుణంగా ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లను కూడా చర్లపల్లి నుంచే నడుపుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌ల నుంచి బయలుదేరే మరికొన్ని రైళ్లను త్వరలో చర్లపల్లి నుంచి నడిపేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. సికింద్రాబాద్–దానాపూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా–ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్, దక్షిణ్ సూపర్‌ఫాస్ట్, తదితర రైళ్లను సైతం చర్లపల్లి నుంచి నడిపే అవకాశం ఉంది.ఇలా దశలవారీగా రైళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ మేరకు కనెక్టివిటీ మాత్రం పెరగడం లేదు. బోరబండ, మెహదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి చర్లపల్లికి రాకపోకలు సాగించే బస్సులు చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల గంటల తరబడి బస్సుల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. చర్లపల్లి నుంచి నేరుగా లింగంపల్లి వరకు,అలాగే సికింద్రాబాద్,నాంపల్లి నుంచి కూడా చర్లపల్లి వరకు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తెస్తే కనెక్టివిటీ సమస్యకు చాలా వరకు పరిష్కారం లభిస్తుంది.
సంక్రాంతి రద్దీ ఎలా....
సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ రైళ్లతో పాటు నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 41 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లన్నీ చర్లపల్లి నుంచి బయలుదేరనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులు ఈ రైళ్లను అందుకోవడం చాలా కష్టం. మరో వైపు క్యాబ్‌ల ద్వారా చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఉదాహరణకు పంజాగుట్ట నుంచి చర్లపల్లికి క్యాబ్ చార్జీ రూ. 450 ఉంటే, ఆటో చార్జీ రూ. 350 , ర్యాపిడో బైక్ రూ.235 వరకు ఉంది. దూరప్రాంతాలకు వెళ్లే స్లీపర్ చార్జీల కంటే ఈ లోకల్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ట్రిప్పులు పెంచాలి
లింగంపల్లి నుంచి ఘట్‌కేసర్ వరకు ట్రిప్పులు పెంచాలి. ప్రతిరోజు కనీసం 15 ట్రిప్పులు రాకపోకలు సాగిస్తే ప్రయాణికులు చాలా వరకు ఊరట లభిస్తుంది. సుచిత్ర మీదుగా ఎంఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంది. – భరద్వాజ్, ఎంఎంటీఎస్,
సబర్బన్ రైల్వే ప్రయాణికుల సంఘం
ఐటీ ఉద్యోగులకు కూడా రవాణా సదుపాయం
ఉదయం, సాయంత్రం వేళ్లలో ఘట్‌కేసర్, చర్లపల్లి నుండి హైటెక్ సిటీకి, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులకు కూడా ఎంఎంటీఎస్ ఎంతో సదుపాయంగా ఉంటుంది. ప్రయాణసమయం, ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి.
– ఫణి, అధ్యక్షులు, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరమ్


