ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో... | Sakshi Editorial On Nandamuri Balakrishna by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో...

Sep 28 2025 12:45 AM | Updated on Sep 28 2025 12:45 AM

Sakshi Editorial On Nandamuri Balakrishna by Vardhelli Murali

జనతంత్రం

మహాభారత కథలోని గాంధారీ సుతుల్లో ఒకడికి దుశ్శాసను డనే పేరు పెట్టారు వేదవ్యాస మహర్షి. శాసనాన్ని ఖాతరు చేయనివాడని దాని అర్థం. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపులేనివాడు. ఒక్క మాటలో సంఘ విద్రోహి. నేటి ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుశ్శాసనుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ‘గజానికో గాంధారీసుతుడు... గాంధీ పుట్టిన దేశంలో’ అనే డైలాగ్‌ చాలా కాలం నుంచే తెలుగునాట బాగా పాపులరయింది. 

ఇప్పుడీ తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది. శాసనాలు చేయవలసిన వారు, పాలకులుగా ఎన్నికైనవారు కూడా దుశ్శాసనావతారాలు ఎత్తుతున్నారు. రాజ్యాంగ నియమాలకూ, చట్టాల సంరక్షణకూ కాపుకాయవలసిన కంచే చేను మేస్తున్నది. ఈ పరిణామానికి కలత చెందినవారు ‘మన స్వాతంత్య్రం మేడిపండు, మన ప్రజా స్వామ్యం రాచపుండై’ందని కన్నీరు పెడుతున్నారు.

పౌరుల ప్రాథమిక హక్కులకు అండగా నిలబడవలసిన రక్షకభటులే, వాటి భక్షక భటులుగా మారడంపై ఏపీ హైకోర్టు నిన్న ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. సవీందర్‌ రెడ్డి అనే ఒక సోషల్‌ మీడియా యాక్టివిస్టును మఫ్టీ పోలీసులు అరెస్ట్‌ చేసి, తాము అరెస్టు చేయలేదని సాక్షాత్తూ ఉన్నత న్యాయ స్థానాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆ విధంగా బుకాయించిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆయన్ని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. అది కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే విధంగానే! రిమాండ్‌ రిపోర్టులోనూ అతని అరెస్ట్‌ సమయాన్ని రకరకాలుగా నమోదు చేసి హైకోర్టుకు అడ్డంగా దొరికి పోయారు. 

గడచిన సంవత్సర కాలంగా పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులపై కనీసం డజను సార్లు హైకోర్టు హెచ్చరికలు చేసింది. అయినా తీరు మారని పోలీసుల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న న్యాయస్థానం సవీందర్‌ రెడ్డి సతీమణి దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై చేసిన విచారణలో కూడా వారి దొంగాట తేటతెల్లమవడంతో తీవ్రంగా స్పందించింది. ఈ అరెస్ట్‌ వ్యవ హారంపై సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ విచారణ జరపాలని ఆదేశించింది. రాజ్యాంగం 226వ అధికరణం కింద సంక్రమించిన అధికారం మేరకు ఈ ఆదేశాన్నిస్తున్నామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

పౌరుల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం నుంచి గానీ, మరోవిధంగా గానీ ప్రమాదం వాటిల్లిందని హైకోర్టు భావించినప్పుడు జోక్యం చేసుకునే అధికారాన్ని అధికరణం 226 కల్పిస్తున్నది. దాన్ని ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు రక్షణ లేదనే అభిప్రాయం న్యాయ స్థానానికి కలిగిందని భావించవచ్చు. ఇటువంటి కేసులోనే గతంలో కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్‌ రాజీనామా చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎమర్జెన్సీ సమయంలో కేరళ పోలీసులు రాజన్‌ అనే యువకుడిని నక్సలైట్‌ సంబంధాలు న్నాయనే అనుమానంతో మఫ్టీలో వెళ్లి అపహరించారు. అరెస్ట్‌ చూపలేదు. చిత్రహింసలు పెట్టి అతడిని చంపేశారు. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే రాజన్‌ తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు.

హోంమంత్రి ఆదేశాలతోనే తన కుమారుణ్ణి పోలీసులు అపహరించారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో కరుణాకరన్‌ హోంమంత్రిగా ఉన్నారు. రాజన్‌ను తాము అపహరించలేదని కోర్టులో పోలీసులు తప్పుడు అఫిడవిట్‌ వేశారు. అప్పటికే రాజన్‌ను చంపేసిన ఆధారాలు జన సామాన్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి పీఠమెక్కిన కరుణాకరన్‌ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్‌ విధించి ఫలానా రోజులోగా రాజన్‌ను హాజరు పరచాలని ఆదేశించింది. 

చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేక పోవడం, ప్రజాగ్రహం వెల్లువెత్తడం, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో గద్దెనెక్కి నెల తిరక్కుండానే కరుణాకరన్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పోలీసు అధికారుల ప్రాసిక్యూషన్‌కు కూడా హైకోర్టు ఆదేశించింది. అదే తరహాలో ఇప్పుడు సవీందర్‌రెడ్డి కేసులో కూడా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం పోలీ సులు చేశారని స్పష్టమైంది.

ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పుతున్నది ఒక్క సోషల్‌ మీడియా యాక్టివిస్టులపైనే కాదు, రాజకీయ ప్రత్యర్థులపైన మాత్రమే కాదు – ‘సాక్షి’ వంటి మీడియా సంస్థపై కూడా! దేశంలో మిలియన్‌ కాపీల సర్క్యులేషన్‌ దాటిన అగ్రశ్రేణి దినపత్రికల సంఖ్య అన్ని భాషల్లో కలిపి డజన్‌కు మించి లేదు. వాటిలో ‘సాక్షి’ ఒకటి. ఈ లెక్క ‘సాక్షి’ చెప్పేది కాదు. 

దిన పత్రికల సర్క్యులేషన్ల లెక్కలు తీసే ‘ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌’ (ఏబీసీ) అనే ప్రామాణిక సంస్థ చెప్పే లెక్క. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కార్యాలయాల్లో అర్ధరాత్రి చొరబడి అల్లరి చేయడం, ఎడిటర్‌ ఇంట్లో దూరి సోదాలు చేయడం, ఎడిటర్‌తో సహా సీనియర్‌ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూడటాన్ని ఎలా అర్థం చేసు కోవాలి? ఈ వైఖరిని ఫాసిజమనాలా? నాజీయిజమనాలా? అధికారం తలకెక్కడమనుకోవాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు.

ఇక పవిత్రంగా ఉండవలసిన శాసనసభల నిర్వహణ తీరు ఎంత శోభాయమానంగా ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. మార్గ దర్శకంగా ఉండవలసిన రూల్‌ బుక్‌ అమలులో ఉన్నదా అటక మీద ఉన్నదా అర్థం కాని పరిస్థితి. అన్‌ రూలీ కామెంట్స్‌ విశృంఖలతకు అడ్డు చెప్పే పరిస్థితే లేదు. గురువారం నాటి సభలో చంద్రబాబునాయుడు బావమరిదీ ప్లస్‌ వియ్యంకుడు, సినీ నటుడైన బాలకృష్ణ ఆంగిక వాచికాభినయాలు చూసిన వారికి దిగ్భ్రాంతి కలిగించాయి. 

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ను ఉద్దేశించి తూలిన మాట కేవలం అన్‌ పార్లమెంటరీ మాత్రమే కాదు. పత్రికల్లో రాయడానికి కూడా అభ్యంతరకరమైనది. ఆయనట్లా య«థేచ్ఛగా మాట తూలుతుంటే పాలకపక్ష సభ్యులు హర్షధ్వానాలు చేయడం, నవ్వడం, ముఖ్యమంత్రితో సహా పెద్దలెవరూ వారించకపోవడం, సభా ధ్యక్ష స్థానంలో ఉన్నవారు కూడా మిన్నకుండటం చూసిన తర్వాత మెదళ్లను తొలిచే మొదటి ప్రశ్న: రూల్‌ బుక్‌ ఎక్కడ?

సభలో లేని ప్రతిపక్ష నేతనుద్దేశించి అవమానకరమైన రీతిలో కామెంట్లు చేస్తూ, వాటికి హర్షామోదాలు వ్యక్తం చేస్తున్న కూటమి సభ్యులు మరోపక్క ప్రతిపక్ష నేత హోదా లేకుండానే జగన్‌ అసెంబ్లీకి రావాలని డిమాండ్‌ చేయడం వెనుక ఉన్న గూడుపుఠాణీ అర్థం కావడం లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా రన్నింగ్‌ కామెంటరీతో అవమానించాలనే ఎత్తుగడ కాదా? లేకుంటే బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్‌ను రికార్డుల నుంచి తొలగించా లని సభ్యులెవరూ ఎందుకు కోరలేదు? స్వయంగా సభాధ్యక్షులే అప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదు? అలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు గతంలో కోకొల్లలుగా లేవా?

బాలకృష్ణ మాట్లాడటానికి ముందు బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్‌ మాట్లాడారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసమే పనిచేసే నాయకులు కొందరున్నారని అందరికీ  తెలిసిందే! వారిలో కామినేని శ్రీనివాస్‌ ముఖ్యులు. ‘సినిమా పరిశ్రమ నుంచి మాట్లాడటానికి వచ్చినవాళ్లను కలవకుండా జగన్‌ అవమానించారు, చిరంజీవి గట్టిగా అడగడంతో వచ్చి కలిశార’ని శ్రీనివాస్‌ ఆరోపించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ జగన్‌పై అభ్యంతరకర పదప్రయోగం చేశారు. పనిలో పనిగా చిరంజీవిపై తనకున్న వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నారు. 

‘ఎవడూ’ గట్టిగా నిలదీయలేదంటూ ఆయన్ను కూడా అవమానించే విధంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన చిరంజీవి... జగన్‌ తమను సాదరంగా ఆహ్వానించారనీ, ఆయనతో తాము జరిపిన చర్చల ఫలితంగానే అప్పట్లో తన సినిమా, బాలకృష్ణ సినిమాతోపాటు పరిశ్రమకు మేలు జరిగిందనీ ఒక లేఖ ద్వారా తెలియజెప్పారు. ఈ వివరణ తర్వాత విధిలేని పరిస్థితుల్లో కామినేని శ్రీనివాస్‌ తన వ్యాఖ్య లను రికార్డుల నుంచి తొలగించాలని శనివారం నాడు కోరవలసి వచ్చింది. కానీ, జగన్‌ను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ అలా కోరలేదు. సభా నాయకుడు గానీ, సభాధ్యక్షులు గానీ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్‌ను అవమానించాలనే ఎత్తుగడతో పాలక కూటమి పని చేస్తున్నదనడానికి ఇవి నిదర్శనాలే కదా!

ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే చిరంజీవిపైన బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను జనసేన నేతలు ఎవ్వరూ ఖండించకపోవడం! పవన్‌ కల్యాణ్‌ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. మిగిలిన వారెందుకు మాట్లాడలేదని జనంలో చర్చ మొదలైంది. ఆ సమయంలో సభలో ఉన్న జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేశ్‌ కూడా ఏమీ స్పందించలేకపోయారు. పైగా ఎఫ్‌డీసీ ఆహ్వాన పత్రికలో తన పేరును తొమ్మిదో పేరుగా ‘ఎవడు’ వేశాడని దుర్గేశ్‌ పట్ల కూడా బాలకృష్ణ దురుసుగానే మాట్లాడారు. సినిమా రంగంలో స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి ప్రస్థానంపై తొలినుంచీ బాలకృష్ణకు ఎంతో కొంత అసహనం ఉన్నదనే విషయం దాచేస్తే దాగేది కాదు.

మహానటుడిగా విశ్వవిఖ్యాతి గాంచిన తండ్రిగారు ముఖ్య మంత్రి అయిన తర్వాతనే సోలో హీరోగా బాలకృష్ణ సినిమా కెరీర్‌ ప్రారంభమైంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి సోలో హీరో పాత్రలు కావు. దాదాపు బాలకృష్ణ నటజీవితంతో సమాంతరంగానే చిరంజీవి ప్రయాణం సాగింది. సినిమా పరిశ్రమలో ఎవరి అండాదండా లేకుండా, కేవలం స్వయం ప్రతిభతో దూసుకెళ్లి ఎనభయ్యో దశకం చివరి నాటికే అగ్రహీరోగా చిరంజీవి ఎదిగిపోయారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించే వరకు దాదాపు పదిహేను పదహారేళ్ల పాటు చిరంజీవికి గట్టి పోటీగా బాలకృష్ణే కాదు, మరే హీరో కూడా నిలవలేకపోయారు. 

కారణం ఏదైనాగానీ, చిరంజీవి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో వెటకారంగానో, అసహనంగానో, అతిశయంతోనో బాలకృష్ణ స్పందించడం జనం గమనించారు. ‘రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఏమయ్యాడు?’ ‘మా బ్లడ్‌ వేరు, మా బ్రీడ్‌ వేరు’ అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘లేపాక్షి ఉత్సవానికి చిరంజీవిని పిలుస్తున్నారా’ అని ఎవరో అడిగితే ‘ఎవర్నో తెచ్చి నెత్తిన పెట్టుకుంటామా?’ అని రుసరుస లాడారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్ని ‘అలగా జనం’గా సంబోధించడం కూడా వివాదాస్పదమైంది.

అసెంబ్లీలో జగన్‌ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన అభ్యంతర కరమైన వ్యాఖ్యల తర్వాత బాలకృష్ణ ‘సైకో సర్టిఫికెట్‌’ ఉదంతం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ జరి పిన కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆస్థాన జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఆ కేసు సందర్భంగా తనకు మానసిక పరిస్థితి బాగాలేదనే ఒక ‘సైకియాట్రీ’ సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించారు. 

ఈ సర్టిఫికెట్‌ను ఏర్పాటు చేసిన డాక్టర్‌ కాకర్ల సుబ్బా రావును ఆ తర్వాత కాలంలో ఏబీఎన్‌ ఛానల్‌ అధిపతి రాధా కృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో బాలకృష్ణకు మీరు సాయం చేశారట గదా?’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు. ‘అవును సాయం చేశాను. చాలా పెద్ద సాయం. అతడిని (బాలకృష్ణను) ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తే ‘సైకియాట్రీ’ ఆలోచన వచ్చింది. ఇద్దరు నిపుణులతో చర్చించి, ఆ సమయంలో అలా చేయకపోయి ఉంటే తనను తాను కాల్చుకునే పరిస్థితి ఉండేది అనే విధంగా సర్టిఫికెట్‌ ఇచ్చాం. లేకపోతే ఈ కేసులలో బయట పడేవాడు కాద’ని డాక్టర్‌ కాకర్ల స్పష్టం చేశారు.

ఇప్పుడు ఇంకో సమస్య ముందుకు వస్తున్నది. బాలకృష్ణకు సైకో సర్టిఫికెట్‌ను వైద్యులు ఇచ్చిన మాట నిజం. దాన్ని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు పరిగణనలోకి తీసుకొని వెంటనే బెయిల్‌ మంజూరు చేసిన సంగతి నిజం. భారత రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం మతిస్థిమితం లేని వాళ్లకు ఓటు హక్కును నిరాకరించవచ్చు. ఓటు వేసే హక్కే లేనప్పుడు పోటీచేసే అవకాశం ఎలాగూ ఉండదు. ఆర్టికల్‌ 102 (1బి) ప్రకారం మతిస్థిమితం లేని ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించవచ్చు. అయితే ఇందుకు మెడికల్‌ సర్టిఫికెట్‌ ఒక్కటే సరిపోదు. ఆమేరకు న్యాయస్థానం నిర్ధారించాలి. 

బాలకృష్ణ కేసులో మెడికల్‌ సర్టిఫికెట్‌ ఉన్నది. దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఉదంతం కూడా ఉన్నది. ఆ తర్వాత కాలంలో చికిత్స అనంతరం ఆయన మానసిక స్థితి మెరుగైందని మళ్లీ ఓ మెడికల్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారా? అది న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లిందా అనే విషయాలపై సమాచారం లేదు. ఒకవేళ అటువంటిదేమీ జరక్కపోయుంటే ఎవరైనా పిటిషన్‌ వేస్తే బాలకృష్ణ శాసనసభ్యత్వం రద్దవుతుందా అనే విధంగా సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఏదో అవసరార్థం సర్టిఫికెట్లు తప్ప బాలకృష్ణకు మతిస్థిమితం లేదని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే ఆ ప్రచారంలో ఆయనకూ, ఆయన పార్టీ అధినేతలకూ ఓ సౌలభ్యం ఉన్నది. ఆ ముసుగులో ఎవరినైనా ఏమైనా అనేయవచ్చు. అధినేతలు అనలేని మాటలు బాలయ్య నోట అనిపించవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement