
దసరా పండుగంటే అందరికి సంబరమే. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన వస్తుంది. దీంతో మద్యం, మాంసాహార ప్రియులు ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో వివిధ శుభకార్యాలు, పండుగలు, ఫంక్షన్లు ఏదైనా.. మాంసం, మద్యం లేనిదే కిక్కు ఉండదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇది ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇక దసరా అంటేనే ఏ పండుగకి లేనంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్క, ముక్క ఉండాల్సిందే. మద్యంతో పాటు మటన్, చికెన్ కావాల్సిందే.
జోగిపేట(అందోల్): అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదే రోజు దసరా పండుగ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం దుకాణాలు మూసి వేయడం ఆనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు. ఆ రోజున చాలామందికి చుక్క లేనిదే ముద్ద దిగదు. అందుకోసం పండుగ రోజు ఎట్లా అని మద్యం, మాంసం విక్రయాలపై తర్జన భర్జన పడుతున్నారు.
విక్రయాలపై సందిగ్ధం..
దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే. పండుగ వేళ గొర్రె పొట్టేళ్లు, మేక పోతుల మంసానికి డిమాండ్ ఉంటుంది. నాటు, పారం కోళ్లు, చేపలకు కూడా మస్తు గిరాకీ ఉంటుంది.
ప్రతి రోజు కోట్లలో..
ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు రూ.10 కోట్ల వరకు, నెలకు సుమారుగా రూ.275 కోట్ల వరకు లిక్కర్ అమ్మకాలు జరుగుతాయి. అయితే ఒక్క దసరా రోజే ప్రతి యేట సుమారు రూ.20 కోట్లకు పైగా అమ్మకాలు జరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ సారి దసరా, గాంధీ జయంతి ఒకే రోజు రావడం, మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. దీంతో మద్యం అమ్మకాలపై, రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
మటన్‌షాపులకు అనుమతివ్వండి
ప్రతి సంవత్సరం దసరా రోజు మటన్, చికెన్ షాపుల్లో గిరాకీ ’ఉంటుంది. పండుగ రోజు విక్రయాలు జరగకపోతే ఆర్థికంగా నష్టపోతాం. అధికారులు స్పందించి అనుమతులివ్వాలి. పండుగ రోజు వందలాది మంది మార్కెట్‌కు మాంసం కోసం వస్తుంటారు.
– శేఖర్, మాంసం వ్యాపారి
మద్యం విక్రయాలు జరగవు
దసరా, గాంధీ జయంతి ఒకేసారి రావడంతో వైన్స్, బార్ షాపులు ప్రభుత్వ ఆదేశాల మేరకు బంద్ ఉంటాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలి.
– హరికిషన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్