
ఎటుచూసినా యుద్ధాలూ, ఊచకోతలూ, దురాక్రమణలూ కనబడుతున్న వర్తమానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరగబోతున్నాయన్న కబురు కాస్తంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే అలవికాని డిమాండ్లు పెట్టడంలో, మొండి పట్టుదలకు పోవటంలో ఇద్దరికిద్దరే గనుక ఈ చర్చల వల్ల ఒరిగేదేమైనా ఉంటుందా అన్నది సందేహమే. చర్చల ఫలితం మాట అటుంచి, వాటి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ట్రంప్ ‘త్యాగం’ చేశారా అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి.
చర్చల తేదీలు ఖరారు కాకపోయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వచ్చేవారం అధినేతలిద్దరూ సమావేశమవుతారని రెండు దేశాల అధికార వర్గాలూ ప్రకటించాయి. ఉక్రె యిన్‌తో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యాకు ట్రంప్ పెట్టిన గడువు శుక్రవారంతో ముగిసింది. చర్చలపై స్పష్టత వచ్చింది గనుక ఈ గడువు విషయంలో ట్రంప్ ఏం చేస్తారన్నది చూడాలి.
మూడున్నరేళ్లుగా సాగిస్తున్న యుద్ధాన్ని విరమించమని అధికారంలోకొచ్చింది మొదలు తన సొంత సామాజిక మాధ్యమం ద్వారా రష్యాను బెదిరించటం తప్ప, ట్రంప్ నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టింది లేదు. ఆయన దూత స్టీవ్ విట్‌కాఫ్ రష్యా ఉన్నతాధికార బృందంతో నాలుగు దఫాలు చర్చించిన మాట వాస్తవమే అయినా ఒరిగిందేమీ లేదు. ట్వీట్ల ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కారం కావని ఆర్నెల్ల తర్వాత ట్రంప్‌కు అర్థమైనట్టుంది. అమెరికా విజ్ఞప్తి మేరకు చర్చలు జరుగుతున్నాయని రష్యా ప్రతినిధి చెప్పటం గమనించదగింది.
మొన్న ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో మీడియా సాక్షిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఇష్టానుసారం మాట్లాడారు. అటు తర్వాత జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను అమెరికాకు దఖలుపరచటానికి అంగీకరించారు. ఆ తర్వాత నుంచి పుతిన్‌పై అమెరికా ఒత్తిళ్లు తీసుకురావటం మొదలెట్టింది. ట్రంప్‌లో అసహనం పెరుగుతున్నదని తెలిసినా రష్యా వెనక్కి తగ్గలేదు. పుతిన్ లక్ష్యాలు వేరు. ఉక్రెయిన్‌ను నాటో కూటమికి దూరంగా ఉంచటం, భవిష్యత్తులో నాటో విస్తరణ ఉండబోదన్న హామీ తీసుకోవటం వాటిల్లో ప్రధానమైనవి.
రష్యా ఆగ్నేయభాగంలో పాక్షికంగా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వైదొలగాలని, దాంతోపాటు ఉక్రెయిన్ నుంచి తమ దళాలు చేజిక్కించుకున్న డొనెట్‌స్క్‌తో పాటు మరో నాలుగు ప్రాంతాలూ, 2014లో తాము ఆక్రమించిన దక్షిణ క్రిమియా ద్వీపకల్పం రష్యాకే చెందుతాయని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. మొత్తంగా ఉక్రెయిన్‌కి చెందిన 1,719 చదరపు కిలోమీటర్ల భూభాగం రష్యా ఆక్రమణలో ఉంది.
పుతిన్‌తో సమావేశానికి ట్రంప్ ఎంత తహతహలాడుతున్నారో తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కాకుండా, జెలెన్‌స్కీని కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలైతేనే సమస్య పరిష్కారం తేలికవుతుందని అమెరికా ప్రతిపాదిస్తూ వచ్చింది. అయితే ఇందుకు రష్యా సుముఖంగా లేదు. ముందు అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరిగి, అవి సత్ఫలితాన్నిచ్చాకే త్రైపాక్షిక సమావేశం సంగతి చూడొచ్చని అది చెబుతోంది.
కానీ ఇందుకు జెలెన్‌స్కీ మొదటి నుంచీ వ్యతిరేకం. రష్యా దాడుల పర్యవసానంగా నష్టపోయేది తామైతే... చర్చల్లో తమ ప్రమేయం లేకపోవడమేమిటన్నది ఆయన ప్రశ్న. కానీ నెలలు గడిచాక ఆయన వైఖరి మారింది. శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతిస్తూ తాజాగా జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ఆయనకు అంతకన్నా గత్యంతరం లేదు.అమెరికా, రష్యాల మధ్య చివరిగా జో బైడెన్ హయాంలో 2021లో శిఖరాగ్రం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పుతిన్ దండయాత్ర మొదలైంది. ఆర్నెల్లుగా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని నేపథ్యంలో ఇప్పుడెలా సాధ్యమైందన్న ప్రశ్నకు రెండు పక్షాల నుంచీ జవాబు లేదు.
ఈ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఉక్రెయిన్‌ను కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలు సాగిస్తామనిఅంటున్నా అందువల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఘర్షణలకు మూలకారణం నాటో కూటమి, దాన్ని ప్రోత్సహించిన అమెరికా. ఉక్రెయిన్‌లో 2014లో ప్రజామద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు విక్టర్ యెనుకోవిచ్ రష్యాతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని అమెరికా, నాటోలు... అక్కడ అల్లర్లు రెచ్చగొట్టి ప్రజావిప్లవం సాకుతో ఆయన దేశం విడిచిపోయేలా చేశాయి.
అటు తర్వాత జెలెన్‌స్కీ దేశాధ్యక్షుడయ్యారు. నాటో ప్రాపకంతో రష్యాతో గిల్లికజ్జాలకు దిగింది జెలెన్‌స్కీయే. కనుక నాటో కూటమి, దాని ద్వారా కథ నడిపించిన అమెరికా తమ వైఖరులు మార్చుకోక తప్పదు. అధినేతగా దేశ ప్రయోజనాల కోసం పాటుబడాలి తప్ప అగ్రరాజ్యాల చేతుల్లో పావుగా మారకూడదని తాజా పరిణామాల తర్వాతైనా జెలెన్‌స్కీ గ్రహించాల్సి ఉంది.