గద్దల రాజ్యం ప్రైవేట్‌ లిమిటెడ్‌! | Sakshi Editorial On Chandrababu TDP Coalition govt On Privatization | Sakshi
Sakshi News home page

గద్దల రాజ్యం ప్రైవేట్‌ లిమిటెడ్‌!

Sep 21 2025 12:32 AM | Updated on Sep 21 2025 12:32 AM

Sakshi Editorial On Chandrababu TDP Coalition govt On Privatization

జనతంత్రం

‘‘నెహ్రూ ఒక ఫ్యూడల్‌. ఆయనకు బాగా డబ్బులున్నాయి. లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన ఏ గేట్‌ దగ్గరికి వెళ్తే అక్కడికో కారు వచ్చేది. ఆయన అనుసరించిన విధానాల వలన సింగపూర్‌తో మనం పోటీపడలేక పోయాము. సింగపూర్‌ తొలి ప్రధాని లీ క్వాన్‌ యూ పోటీదారి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారు. నెహ్రూ వల్ల మనం సింగపూర్‌తో పోటీపడలేకపోయాము.’’ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయనకు బాకా ఊదే మీడియాలో రిపోర్టయింది.

బ్రిటిష్‌ వలస పాలన సంకెళ్లు తెగగొట్టడానికి మొట్ట మొదటిసారిగా లాహోర్‌ కాంగ్రెస్‌ సభలో ‘పూర్ణ స్వరాజ్‌’ శంఖా రావం చేసినవాడు నెహ్రూ. తొలి ప్రధానిగా పంచవర్ష ప్రణాళి కలు వేసి నవభారత సౌధ నిర్మాణానికి ఇటుకలు పేర్చిన వాడాయన. అంతర్జాతీయ వేదికపై రష్యా – అమెరికా కూటము లకు దీటుగా ప్రవర్ధ స్వతంత్ర దేశాలను కూడగట్టి ‘అలీనోద్య మా’న్ని నిర్మించిన ప్రపంచస్థాయి నేత నెహ్రూ. అటువంటి నెహ్రూ గురించి ఐఏఎస్‌ శిక్షణ పొందిన వారికి తాను చెప్పేది తప్ప ఇంకేమీ తెలియకపోవచ్చనుకోవడం బాబు ఆత్మవిశ్వాసా నికి ఓ మచ్చుతునక అనుకోవాలి.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి అనేక గేట్లుంటాయి. ఆయన ఏ గేటులోంచి బయటికి వస్తారో తెలియదు గనుక ప్రతి గేటు దగ్గరా ఒక కారుండేదని బాబు చెబుతున్నారు. అంత డబ్బున్న వాడు గనుక ఆయన ‘ఫ్యూడల్‌’ అంటున్నారు. బాగా డబ్బున్న వాళ్లను ‘ఫ్యూడల్స్‌’ అనాలేమో! ఈ థియరీ ప్రకారం బోలెడంత డబ్బున్న ఎలాన్‌ మస్క్, అంబానీ వంటి వాళ్లంతా పెద్దపెద్ద ఫ్యూడల్స్‌ అనుకోవాలి. 

బాబు ప్రేమించే సింగపూర్‌లో పెద్దసంఖ్యలో బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నారు కాబట్టి అక్కడున్నది ఫ్యూడల్‌ వ్యవస్థేమో! సరే, ఈ జ్ఞానామృత సేవనాన్ని పక్కన బెడితే... నిజంగానే నెహ్రూ సంపన్నుడు. ఆయన తండ్రి మోతీ లాల్‌ నెహ్రూ ఒక విజయవంతమైన న్యాయవాదిగా రెండు చేతులా ఆర్జించారు. అలహాబాద్‌ (ప్రస్తుత ప్రయాగ్‌రాజ్‌)లో ప్యాలెస్‌ లాంటి ‘ఆనందభవన్‌’ను నిర్మించుకున్నారు. అనంతర కాలంలో ఆ ప్యాలెస్‌ స్వాతంత్య్రోద్యమానికీ, కాంగ్రెస్‌ కార్యకలా పాలకూ కేంద్ర స్థానంగా మారింది.

లండన్‌లో నెహ్రూ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రతిష్ఠాత్మకమైన హారో స్కూల్‌లో జరిగింది. కాలేజీ చదువు ట్రినిటీ కాలేజీలో! ఇది కేంబ్రిడ్జి యూనివర్సిటీలో భాగం. ఆక్స్‌ఫర్డ్‌ కాదు. తర్వాత బారిస్డర్‌ శిక్షణ కూడా నెహ్రూ తీసుకున్నారు. చంద్రబాబు చెప్పిన ‘గేటుకో కారు’ అనే చందమామ కథను ఎక్కడి నుంచి సంగ్రహించారో తెలియదు. ప్రామాణిక గ్రంథాల్లో ఈ కథ ఎక్క డైనా ఉన్నదేమో అది చదివినవాళ్లే చెప్పాలి. బాబు జ్ఞానబోధ విన్న ఐఏఎస్‌లు, అధికారులంతా చరిత్ర ప్రసిద్ధిగన్న నెహ్రూ ప్రసంగం ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ పాఠాన్ని చదివే ఉంటారు. 

స్వాతంత్య్రం వచ్చిన నాటి అర్ధరాత్రి జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ స్వాతంత్య్రో ద్యమ లక్ష్యాల సాధన కోసం భారత్‌ మేల్కొంటున్నది. పేదరికం లేని, అసమానతలకు తావు లేని, రోగాలు రొష్ఠులెరుగని, అజ్ఞా నాన్ని పారదోలే వ్యవస్థను నిర్మించుకోవడమే జాతి లక్ష్యమ’ని నెహ్రూ ప్రకటించారు. 

ఇందులో ‘ఫ్యూడలిజం’ ఎక్కడ ఉన్నదో, పెత్తందారీతనమెక్కడ ఉన్నదో అధికారులే వెతికి పట్టుకోవాలి. సువిశాలమైన, వైవిధ్యభరితమైన, బహుళ సంస్కృతుల నిలయ మైన, అత్యధిక జనాభా కలిగిన భారత్‌ అభివృద్ధి గమనాన్ని ఒక చిన్న సిటీ స్టేట్‌ సింగపూర్‌తో పోల్చడం ఏ రకంగా విధాయకమో విజ్ఞులైన అధికారులు గ్రహించే ఉంటారు.

ప్రభుత్వ ఉద్దేశాలను వివరించడానికి, ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కార్యోన్ముఖులను చేయడానికి కలెక్టర్ల సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇటువంటి అధికారిక సమావేశాలను రాజకీయ వేదికలుగా మార్చడం తగునా? దేశ తొలి ప్రధానిని కించపరిచే ఉపన్యాసాలు చేయడం సమంజసమేనా? నెహ్రూ అమలు చేసిన డెమోక్రటిక్‌ సోషలిస్టు విధానాలు ప్రైవేట్‌ వ్యాపా రులకు ఊడిగం చేసే నేటి పాలకులకు నచ్చకపోవచ్చు. 

కానీ, వారసత్వంగా వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని కాలదన్ను కొని స్వాతంత్య్రోద్యమంలో ఒక ముఖ్య సేనానిగా పాల్గొని పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన త్యాగధనుడిగానైనా ఆయన్ను గుర్తించి గౌరవించాలి కదా! ‘సంఘ్‌ పరివార్‌’కు ఆది నుంచి నెహ్రూతో సిద్ధాంతపరమైన విభేదాలున్నాయి. చాలా కాలంగా అధికారంలో ఉండి అన్ని హంగులూ అమర్చుకున్నందువల్ల నెహ్రూ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని కేంద్ర సర్కార్‌ పెద్దయెత్తున చేపట్టింది.

వాళ్లను సంతృప్తి పరిచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు ఒకరితో ఒకరు పోటీపడు తున్నట్టున్నారు. బీజేపీ వాళ్లను మించి వీర సనాతనవాదిగా చలామణీ కావడానికి ఇటీవల పవన్‌ కల్యాణ్‌ పడిన పాట్లను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. నెహ్రూ విధానాల మీద నిందా ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు రకరకాల వేదికల్ని ఉపయోగించుకున్నారే గాని, చంద్రబాబు మాదిరిగా ఐఏఎస్‌ల సమావే శాన్ని మాత్రం ఉపయోగించుకున్నట్టు లేదు. ఈ రకంగా బాబు వాళ్లకు ఓ కొత్త దారిని చూపించాడనుకోవాలి. చంద్రబాబు పార్టీతో అంటకాగే అలవాటున్న ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.

ఇంతకూ బాబు చెబుతున్నట్టు దేశంలో అభివృద్ధి రాహిత్యా నికి కారణమైన నెహ్రూ విధానాలేమిటి? రెండు శతాబ్దాల వలస దోపిడీ అనంతరం భారత్‌ ఆర్థికంగా చిక్కి శల్యమైంది. యూరప్‌ పారిశ్రామిక విప్లవం తర్వాత దేశంలో కొత్తగా పరిశ్రమలు రాకపోగా పాతకాలపు పరిశ్రమలు, చేతివృత్తులు మూల పడ్డాయి. బ్రిటన్‌కు ముడిసరుకుల పంపిణీ చేసే దేశంగా మిగిలి పోయింది. ఫలితంగా స్వదేశీ పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందలేదు. 

అందువల్ల భారీ పరిశ్రమల్ని, రైల్వేలు, నీటిపారు దల ప్రాజెక్టుల వంటి వాటిని ప్రభుత్వమే తలకెత్తుకోవలసి వచ్చింది. స్వదేశీ పెట్టుబడిదారీవర్గం నిర్వహించగలిగిన పరిశ్ర మల స్థాపనకు వారికి అనుమతులివ్వడం జరిగింది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్‌ రంగం పక్కపక్కనే పనిచేయడం వల్ల ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత పెరిగింది. మెరుగైన వేతనాలు, సౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఒక కొత్త మధ్యతరగతి వర్గం తయారైంది.

కాలక్రమంలో ప్రైవేట్‌ రంగంలో పరిశ్రమల స్థాపనకు లైసెన్స్‌రాజ్, రెడ్‌ టేపిజమ్‌ ఆటంకంగా మారాయనే విమర్శలు మొదలయ్యాయి. నిజంగానే ఆ కాలంలో (1947–1991) ఆర్ధిక వృద్ధి రేటు నాలుగు శాతానికి మించి పెరగలేదు. ఫలితంగా ఉద్యోగాల కల్పన మందగించింది. అయితే ఇందుకు ప్రభుత్వ రంగం కారణం కాదు. కాలానుగుణంగా ప్రభుత్వాలు వ్యవహ రించి ఎగుమతి దిగుమతుల్లో ప్రొటెక్షనిస్టు పద్ధతులను సంస్కరించి, కొంతమేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించి, లైసెన్స్‌ రాజ్‌ – రెడ్‌ టేపిజాలను నియంత్రించి ఉంటే సరిపోయేదనే అభిప్రాయాలున్నాయి. 

కానీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత విచ్చలవిడిగా ప్రైవేటీకరణ చేయడమే అభివృద్ధి రహస్యమన్నట్టుగా కొందరు దళారీ రాజకీయవేత్తలు పరుగులు తీస్తున్నారు. వీళ్లకు చైనా విజయగాథ వినిపించదు. ప్రభుత్వ రంగమే ఆధిపత్యం వహిస్తూ ప్రభుత్వ నియంత్రణకు లోబడి ప్రైవేట్‌ పెట్టుబడి పనిచేస్తున్న ఈ ఆర్థిక వ్యవస్థ సృష్టించిన అద్భుతాలు చంద్రబాబు వంటి వారికి కనిపించవు.

ప్రైవేటీకరణ అనేది భారీగా కమీషన్లు పిండుకునే కామ ధేనువుగా సంస్కరణానంతర కాలపు రాజకీయవేత్తల్లో కొందరికి కనిపించింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే (1995–2004) ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థ లను కారుచౌకగా ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారు. ఇందులో 20 సంస్థల్లోనే 400 కోట్లు వెనకేసుకున్నారని ఆ రోజుల్లోనే సీపీఎం పార్టీ ఆధారాలతో సహా నిరూపించింది. 

ఇది పాతికేళ్ల కిందటి సంగతి. ఇప్పుడా విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్విన్‌ భూములు, రిపబ్లికన్‌ ఫోర్జ్, నిజాం షుగర్స్‌ నాలుగు యూనిట్లు, మరో అరడజన్‌ షుగర్‌ మిల్లులు, నూలు మిల్లులు అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టిన జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు వైఖరిలో ఏ మార్పూ రాలేదు. ఇప్పుడు ఏకంగా పది మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు ఆయన తెగబడ్డారు.

ఒక్కో కాలేజీకి ఖరీదైన 50 ఎకరాల స్థలంతోపాటు నిర్మా ణాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఏటా ఐదువేల రూపా యల నామమాత్రపు ధరకు 66 ఏళ్లపాటు వాటిని బినామీలకు లేదా కమీషన్లకు కట్టబెట్టబోతున్నారు. ఇది ప్రైవేటీకరణ కాదు. పీపీపీ మోడల్‌ అని ప్రభుత్వ పెద్దలు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పేరులోనే తేడా! సారం మాత్రం ఒకటే. ఆ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నట్టయితే పేద, మధ్యతరగతి విద్యార్థులు వారి డాక్టర్‌ చదువుల కలను సాకారం చేసుకొని ఉండేవారు. 

ఇప్పుడు లక్షలు పోసి కొనగలిగిన వారికే మెడికల్‌ సీట్లు. అనుబంధంగా ఏర్పడే పెద్దాసుపత్రుల్లో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ఉన్నత స్థాయి వైద్యం లభించేది. ఇప్పుడా వైద్యాన్ని కూడా కొనుక్కోవాలి. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యను కూడా ఎన్డీఏ ప్రభుత్వం, యెల్లో మీడియా అభివృద్ధికర చర్యగా ప్రచారం చేసుకోవడాన్ని బరితెగింపు వ్యవహారంగానే పరిగణించాలి.

ఆర్థిక సంస్కరణల తర్వాత పెరిగిన జీడీపీ వృద్ధి రేటు గురించి, ఉద్యోగాల గురించి పుంఖానుపుంఖాలుగా ప్రచార సాహిత్యం అందుబాటులో ఉన్నది. నిజమే, జీడీపీ వృద్ధి రేటు అంతకుముందున్న 4 శాతం నుంచి 6 శాతానికి ఎగబాకింది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్లనే ఇది సాధ్యమైందనే దండోరా కూడా వేస్తున్నారు. 

మరి పెరుగుతున్న ఆర్థిక అసమాన తల సంగతి? అసమానతలు పెరగడం అభివృద్ధికి సూచిక అను కోవాలా? మానవాభివృద్ధి సూచీలో మనం ఎక్కడున్నాం? స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో, 1950 దశకం ఆరంభంలో మన దేశంలో ఉన్న అగ్రశ్రేణి 1 శాతం (జనాభాలో) శ్రీమంతుల సంపద మొత్తం జాతి సంపదలో 13 శాతంగా ఉండేది. 

మూడు దశాబ్దాల తర్వాత (1982) అది 5 శాతానికి పడిపోయింది. ఈ ఒక్కశాతం శ్రీమంతులకు వారి దిగువశ్రేణిలో మరో 10 శాతం సంపన్నులను కలిపితే జాతి సంపదలో వారి వాటా 37 శాతంగా (1952) ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత అది 30 శాతానికి తగ్గింది. అదే సమయంలో జనాభాలోని అట్టడుగు 50 శాతం జనాభా వాటా స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 5 శాతంగా ఉంటే ముప్పయ్యేళ్ల తర్వాత అది 9 శాతానికి ఎగబాకింది. ఇది అభివృద్ధి నిరోధక పరిణామం?!

ప్రైవేటీకరణల కాలం లెక్కలు కూడా చూద్దాం. ఈ లెక్క లన్నీ ప్రపంచ అసమానతల డేటా బేస్‌ (డబ్ల్యూఐడీ)లోవి. ఇప్పుడు మన అగ్రశ్రేణి ఒక్క శాతం శ్రీమంతుల సంపద జాతి సంపదలో 40 శాతానికి చేరింది. ఇది కదా అభివృద్ధి! వీరికి తర్వాత శ్రేణిలోని పది శాతం సంపన్నులను కూడా కలిపితే వారి ఉమ్మడి సంపద 66 శాతానికి చేరుకున్నది. ఇక మిగిలిన అట్టడుగు 50 శాతం జనాభా ఉమ్మడి వాటా జాతి సంపదలో 3 శాతానికి పడిపోయింది. రెండు శతాబ్దాల బ్రిటిష్‌ వలస దోపిడీ అనంతరం ఈ వాటా 5 శాతంగా ఉండేది. ఈ పరిణామాన్ని కూడా అభివృద్ధే అందామా?

తెలుగువారి సెంటిమెంట్స్‌తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర సర్కార్‌ పూర్తిగా సహకరిస్తున్నది. తాజాగా 22 కీలక విభాగాలను ప్రైవేటీకరించడమే దానికి తార్కాణం. పాడి రైతులకు మేలు చేస్తున్న ‘అమూల్‌’కు పొమ్మనకుండా పొగబెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 22 టూరిజం హోటళ్లను ప్రైవేటీకరిస్తున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న పదివేల కోట్ల ఆస్తు లను కూడా కట్టబెడుతున్నారు. ఇకమీదట రాష్ట్ర పరిధిలోని రోడ్లను కూడా పీపీపీ మోడ్‌లో అభివృద్ధి చేస్తారట! అంటే పల్లె రోడ్ల మీద కూడా టోల్‌ కట్టాలన్నమాట. 

దేవాలయాల భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే సిద్ధాంతకర్తలు గద్దెలపై కూర్చున్నారు. జాతి సంపదలో నానాటికీ తమ వాటాను కోల్పోతున్న పేద ప్రజల కోసం ‘ఇంటికో జోలె’ పథకాన్ని అమలు చేస్తారట. దానికి ‘నాలుగు పీ’ల పథకంగా నామకరణం చేశారు. కొంతమంది సంపన్నుల ఇళ్లను వారికి కేటాయిస్తారు. కేటాయించిన ఇళ్ల ముందే పేదలు అడుక్కోవాలి. బౌండరీలు దాటకూడదు. పేదల జీవితాలను, ఆత్మగౌరవాన్ని కూడా ప్రైవేటీకరిస్తున్నారు. బహుజనులారా... బహుపరాక్‌!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement