
శకునాలను భావి పరిణామాలకు సంకేతాలుగా భావిస్తారు. శకునాల మీద నమ్మకాలు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఈ నమ్మకాలు ఏ ఒక్క దేశానికో, మతానికో పరిమితమైనవి కావు. ప్రకృతిలో అనుకోని ఉత్పాతాలు సంభవిస్తే, వాటిని దుశ్శకునాలుగా భావిస్తారు. ఎలాంటి శకునాలకు ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయో చెప్పే శకున శాస్త్రాలు కూడా ఉన్నాయి.
శకునాలకు వ్యాఖ్యానాలు చెప్పి, భవిష్యత్తును అంచనా వేసే జ్యోతిషులు, కాలజ్ఞానులు కూడా ప్రపంచంలో ఉన్నారు. శకునాల మీద నమ్మకాలు పురాతన సమాజంలో ఎంతగా ఉండేవో, శకునాలన్నీ ఉత్తవేనని కొట్టిపారేసే హేతువాదులు పురాతన కాలం నుంచి ఉన్నారు. ‘దేశ ప్రయోజనాల కోసం కత్తి దూసే యోధుడు శకునాన్ని చూసుకోడు’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త, కవి హోమర్.
క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దికి చెందిన ఆయన ఆనాటి హేతువాదానికి ప్రతినిధి. శకునాల మీద నమ్మకాలు బలంగా ఉన్న ప్రాచీన సమాజంలోనే హేతువాదం కూడా పురుడు పోసుకుందనేందుకు హోమర్ మాటలే ఉదాహరణ. ఆనాటికీ ఈనాటికీ కాలం ఎంతో మారింది. ఆధునికత పెరి గింది. అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ శరవేగంగా కమ్ముకొస్తోంది. అయినా ఇప్పటికీ శకు నాలను పట్టించుకోని హేతువాదుల కంటే శకునాలను నమ్మేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.
మన పురాణాలను చూసుకుంటే, శకునాల వర్ణన దాదాపుగా ఒకే తీరులో కనిపిస్తుంది. లోకకంటకులైన దుర్మార్గులు భూమ్మీద పుట్టినప్పుడు ఆకాశంలోని చుక్కలు తెగి రాలిపడటం; నక్కలు ఊళలు పెట్టడం; కుక్కలు మొరగడం; గాడిదలు ఓండ్రపెట్టడం; సముద్రాలు ఘూర్ణిల్లడం; తుపానులు చెలరేగడం వంటి ఉత్పాతాలు సంభవించేవి.
దుర్యోధనుడు పుట్టినప్పుడు ఇలాంటి దుశ్శకునాలే కనిపించాయట! ఆపదలు ఎదురయ్యే ముందు దుశ్శకునాలు గోచరిస్తాయని చాలామంది నమ్ముతారు. రామ రావణ యుద్ధంలో రావణుడి కొడుకు మేఘ నాదుడు లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు. చివరకు రావణుడే స్వయంగా రణరంగానికి బయలుదేరాడు.
అప్పుడు నక్కలు ఊళలు పెట్టడం; గద్దలు రథం మీద గిరికీలు కొడుతూ తిరగడం; గుడ్లగూబలు వికృత రావాలు చేయడం; రథం మీది గొడుగు విరిగిపోవడం వంటి దుశ్శకునాలు ఎదురయ్యాయట! చివరకు ఆ యుద్ధంలో రావణుడు హతమైపోయాడు. రామాయణ, మహాభారతాలు సహా అనేక పురాణాల్లో ఉన్న ఇలాంటి కథల మూలంగా శకునాల మీద నమ్మకాలు జనాల్లో తరతరాలుగా నాటుకుపోయాయి. పురాణ కాలంలోనే శకున శాస్త్రాన్ని గర్గ మహాముని రాశాడట!
‘స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ/ పురాణే మంత్రే వా స్తుతి హాస్యే ష్వచతురః/ కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే/ పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో’ అని ‘శివానంద లహరి’లో ఆదిశంకరాచార్యుడు అన్నాడు. అంటే, ‘శాస్త్ర పాండిత్యం లేదు. వైద్యం చేతగాదు. శకున శాస్త్రం రాదు. కవిత్వం చెప్పలేను. సంగీతం రాదు. పురాణం చెప్పలేను. మంత్రాలెరుగను. ఆటపాటలలో నేర్పు లేదు.
హాస్యం చెప్పలేను. ఇలాంటి సామాన్యుడినైన నా మీద రాజులకు ఎలా దయ కలుగుతుంది? వారిచ్చే ఫలాలు నాకేల? సర్వజ్ఞా! నన్ను నేనే ఎరుగని పశువును. నువ్వు పశుపతివి కదా! నన్ను నువ్వే దయతో కాపాడు’ అని పరమశివుడిని వేడుకున్నాడు. ఈ శ్లోకంలోని పారమార్థిక తాత్పర్యం ఎలా ఉన్నా, ఆదిశంకరాచార్యుని కాలంలో రాజాశ్రయం పొందడానికి అవసరమైన కీలక విద్యలలో శకునశాస్త్రం కూడా ఒకటని మనకు అర్థమవుతుంది.
తాజాగా గలిలీ సముద్రంలోని నీరు నెత్తుటిలా ఎర్రబడింది. బైబిల్‌లో ప్రస్తావించిన ఈ సముద్రం అకస్మాత్తుగా ఎర్రబడటంపై అక్కడి జనాలు ప్రపంచానికి ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏసుక్రీస్తు గలిలీ సముద్రం మీద నడిచి, తుఫాను శాంతింపజేశాడని; ఆ సముద్రం ఒడ్డునే తన శిష్యులకు అనేక బోధలు చేశాడని; ఐదువేల మందికి రొట్టెలు, చేపలతో ఆహారం పెట్టాడని బైబిల్ కథనం.
ఇదిలా ఉంటే, బానిసలుగా ఉన్న ఇజ్రాయెలీలను విముక్తులను చేసేందుకు ఈజిప్టు ఫారో అంగీకరించనందుకు ఆగ్రహించిన భగవంతుడు అందుకు హెచ్చరికగా నైలునదీ జాలాలను నెత్తుటిలా ఎర్రగా మార్చేశాడని పాత నిబంధన గ్రంథం చెబుతోంది. ఆ కథనమే ఇప్పటి ఆందోళనకు కారణం.
మన దేశ పరిస్థితులను చూసుకుంటే, ఏడున్నర దశాబ్దాలకు పైబడిన స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్ల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ నిండా బురదలో మునిగింది. ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంట నోట్ల కట్టలు దొరికిన ఉదంతం సుప్రీంకోర్టుకు చేరింది. రాజ్యాంగ వ్యవస్థలు ఇలా కళంకితం కావడం దేశానికి ఒక రకంగా దుశ్శకునాలు. ఇవి ఎలాంటి దుష్పరిణామాలకు సంకేతాలో కాలమే చెప్పాలి.