
రెండో ప్రపంచ యుద్ధంలోనూ, జపాన్ దురాక్రమణను ప్రతిఘటించటంలోనూ విజయం సాధించి ఎనిమిది దశాబ్దాలవుతున్న సందర్భంగా బుధవారం తియనాన్మెన్ స్క్వేర్‌లో నిర్వహించిన సైనిక పరేడ్‌లో చైనా తన రక్షణ పాటవాన్ని ప్రదర్శించటం కన్నా బలప్రదర్శనకు ప్రాధాన్యమిచ్చింది. వ్యూహాత్మక అణ్వస్త్రాలు తన దగ్గరున్నాయని, ఇక రాబోయేదంతా తన యుగమేనని చాటదల్చుకున్నట్టుంది. 1949లో ప్రజా రిపబ్లిక్‌గా ఏర్పడింది మొదలు ఆ దేశం పదేళ్లపాటు ఏటా ఇలాంటి ఆర్భాటాన్ని ప్రదర్శించేది.
ఎందుకో ఆ తర్వాత ఆపి, తిరిగి 1984లో పునరుద్ధరించింది. ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆ పరేడ్‌ను విక్టరీ డే ఉత్సవంగా మార్చారు. ఈ తరహా పరేడ్‌లకు విదేశీ అతిథుల్ని పిలవటం అందరూ పాటించే ఆనవాయితీ. అయితే చైనా ఒక్కసారి 1959లో మాత్రమే దాన్ని పాటించింది. మళ్లీ అరవై ఆరేళ్ల తర్వాత ఇన్నాళ్లకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. వారిద్దరే కాదు... చైనా సన్నిహితులుగా ముద్రపడిన ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి కూడా అధినేతలు హాజరయ్యారు.
ఈ పరేడ్‌ల సంప్రదాయం ఎవరు మొదలెట్టారోగానీ ఇందులో ప్రదర్శించేవన్నీ మారణాయుధాలు. ఈసారి పరేడ్‌లో చైనా వంద రకాల మారణాయుధాలను ప్రదర్శించింది. యుద్ధతంత్రాన్ని సమూలంగా మార్చగల ఆయుధాలే అందులో ఎక్కువ. సంప్ర దాయ యుద్ధంలోనూ, కొత్త తరహా యుద్ధంలోనూ తమ దరిదాపుల్లోకి రాగలవారెవరూ లేరని చైనా చెప్పదల్చుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది.
పొరుగునున్న తైవాన్ దురాక్రమణకు ఇదొక రిహార్సల్ కావొచ్చన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి. తైవాన్ జోలికెళ్తే అమెరికా దాడికొస్తుందన్న సంశయం చైనాకుండేది. కానీ ఉక్రెయిన్‌పై కత్తిగట్టిన పుతిన్ ముందు అమెరికా, పాశ్చాత్య దేశాలు నిస్సహాయులుగా మిగిలిన వైనం చూశాక తానూ తైవాన్‌లో ఆ మాదిరి ప్రయత్నం చేయొచ్చని చైనా భావిస్తూండవచ్చు. ఈ పరేడ్ ద్వారా చైనా దాన్నే చెప్పదల్చుకుందా?
పరేడ్‌లు చూసి తమ దేశం శక్తిమంతంగా తయారైందని, శత్రువులు వణుకు తున్నారని సంబరాలు చేసుకునేవారు అన్ని దేశాల్లోనూ కనబడతారు. కానీ క్షణాల్లో భూమండలాన్ని భస్మీపటలం చేయగల శక్తి తమకున్నదని చాటుకోవటంలో ఉండే ఆనందమేమిటో సామాన్యులకు అర్థం కాదు. అణ్వస్త్రాన్ని మొదటగా ఉపయోగించబోమని చైనా మొదటినుంచీ చెబుతోంది.
కానీ అది ప్రదర్శించిన అణు జలాంతర్గామి తీరు చూస్తుంటే ఆత్మరక్షణ కాదు... ఎదురుదాడికి చైనా సంసిద్ధమైందన్న అభిప్రాయం కలుగుతుంది. చడీచప్పుడూ లేకుండా, అమెరికా గూఢచర్యానికి దొరకకుండా ఏ ఖండంలోని సాగర జలాల్లోనైనా దాన్ని మోహరించ వచ్చంటున్నారు. నీటి అట్టడుగున ఎంత దూరమైనా దూసుకెళ్లగల డ్రోన్లు, 2000 కిలోమీటర్ల శ్రేణిలోని విమాన వాహక నౌకలను ధ్వంసం చేయగల వైజె–21 హైపర్‌సోనిక్ క్షిపణి వగైరాలను పరేడ్‌లో ప్రదర్శించింది. శబ్దవేగం కన్నా పదిరెట్ల వేగం దీని సొంతం.
ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు ముప్పు ముంచుకురాగలదన్న అనుమానంతో అమెరికా అతి జాగ్రత్తలు తీసుకునేది. ఇకపై దానికి జపాన్ రక్షణ బాధ్యత అదనం. ఇప్పటికే జపాన్ తీరం పొడవునా టైఫూన్, తోమహాక్, ఎస్‌ఎం–6 క్షిపణుల్ని మోహరించింది. ప్రపంచం గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. జరుగుతున్న పరిణామా లన్నీ ఉద్రిక్తతలను మరిన్ని రెట్లు పెంచేవే. చైనా పరేడ్ కూడా అటువంటిదే. ప్రపంచశాంతికి దోహదపడతామని ఒకపక్క చెబుతూ కండబలాన్ని ప్రదర్శించటం సరికాదన్న స్పృహ కూడా ఆ దేశానికి లేకపోయింది.
ఆహ్వానించిన షీ జిన్‌పింగ్‌తోపాటు అతిథులుగా వచ్చిన పుతిన్, కిమ్‌లు కూడా నియంత లక్షణాలు పుణికిపుచ్చుకున్నవారు. ఎన్నికలు లేకుండానో... బూటకపు ఎన్నికల ద్వారానో అధికారంలోకొచ్చినవారు. వీరికి జనమన్నా, వారి భద్రతన్నా ఏం పట్టింపు ఉంటుంది? సుంకాల యుద్ధంలో తలమునకలై అన్నిటినీ గాలికొదిలిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... జిన్‌పింగ్, పుతిన్‌లు ఉమ్మడిగా అమెరికాపై కుట్ర సాగిస్తున్నారని ఆరోపించారు. కనుక రాగల రోజుల్లో అమెరికా కండబల ప్రదర్శన అందరూ చూడాల్సి రావొచ్చు.