
ప్రకటించటానికి ముందే రివాజుకు భిన్నంగా అందరి నోళ్లలోనూ నానిన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది వెనిజులా విపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకుదక్కింది. ఆ దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసమూ... నిరంకుశత్వం నుంచి ప్రజాస్వా మ్యానికి న్యాయమైన, శాంతియుతమైన పరివర్తన సాధించేందుకూ ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా దీన్ని అందిస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పురస్కారంపై బాగా ఆశలు పెట్టుకున్నారు గనుక సహజంగానే ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్ తప్పుబట్టింది.
శాంతికన్నా రాజకీయాలకే కమిటీ ప్రాధాన్యమిచ్చిందని విమర్శించింది. కమిటీపై ఈ మాదిరి విమర్శలు గతంలో చాలా వచ్చాయి. మేధావులూ, సామాజిక అధ్యయనకారులూ ఆ పని చేసేవారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రాధాన్యతా అంశంగా భావించే వైపు ప్రపంచ ప్రజల చూపు మర ల్చటం కోసం నోబెల్ కమిటీ ప్రయత్నిస్తున్నదని విమర్శించేవారు. ఇప్పటికే ట్రంప్ వెనిజులాను అష్టదిగ్బంధం చేశారు. గత నెల మొదట్లో వెనిజులా స్పీడ్ బోట్లు రెండింటిపై అమెరికా సైన్యం విరుచుకు పడటంతో 17 మంది మరణించారు.
ఇంతవరకూ అవి మాదక ద్రవ్యాలున్న బోట్లని చెప్పే ఆధారాలేమీ అమెరికా ప్రకటించలేదు. ఇది కేవలం మొదటి దశ అని, రెండో దశ వెనిజులా గడ్డపై ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అది సైనిక జోక్యం కావొచ్చన్న అంచనాలున్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వీటన్నిటిపైనా మచాడో స్పందనేమిటో తెలియదు. నిజానికి ఈ ఏడాది సూడాన్‌లో అత్యవసర సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఈ రేసులో ఉంటా యని పలువురు అనుకున్నారు.
యుద్ధాన్ని వ్యతిరేకించటమో, కాల్పుల విరమణ సాధించటమో పురస్కారానికి అర్హత సాధించిపెడుతుందని ట్రంప్ అనుకున్నందుకు ఆయన్ను నిందించి ప్రయోజనం లేదు. అందుకు నోబెల్ కమిటీ బాధ్యత కూడా ఉంది. గతంలో కమిటీ ఇచ్చిన కొన్ని పురస్కారాలు గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ పురస్కారం ప్రకటించే నాటికి ఆయన అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైంది. ‘విశ్వ మానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ పురస్కారం ధ్రువీకరిస్తున్నద’ని ఒబామా ఘనంగా చెప్పుకొన్నారు.
కానీ ఆ బహుమతి తనకెందుకిచ్చారో ఇప్పటికీ తెలియటం లేదని 2016లో ఆయన నిజాయతీగా ఒప్పుకొన్నారు. బుష్ మొదలెట్టిన యుద్ధాలను ఆయన మరింత ముందుకు తీసుకుపోయారు. ఒబామా ఏలుబడిలో లిబియా, సిరియా, సోమాలియా, అఫ్గాన్‌లలో అమెరికా సైన్యం దాడుల్లో వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో నోబెల్ ఎంపిక కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన గీర్‌లెండ్‌స్టెడ్ అది ఘోర తప్పిదమని 2015లో అంగీకరించారు.
వాస్తవానికి 1973లో నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. 1971లో బొలీవియా, 1973లో చిలీ దేశాల్లో సైనిక తిరుగు బాట్లకు పథక రచన చేయటం, బంగ్లాదేశ్‌లో పాక్ సైన్యం సాగించిన నరమేధానికిఅండదండలీయటం, అనేక చోట్ల నియంతృత్వ ప్రభుత్వాలకు చేయూతనందించటం వగైరాల్లో ఆయన పాత్ర అత్యంత దారుణమైనది.
నిరాయుధీకరణకూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికీ చిత్తశుద్ధితో పనిచేసేవారికి మొదట్లో ఆ బహుమతి ఇచ్చేవారు. అటుతర్వాత ఇతరేతర ప్రయోజనాలూ, ఉద్దేశాలూ వచ్చిచేరాయి. వర్తమానంలో ఆయుధాలు పోగేసుకోవటం, బెదిరించటం, క్షిపణులూ, బాంబులతో విధ్వంసం సృష్టించటం ఘనకార్యాలుగా చలామణీ అవుతున్నాయి.
అలాంటి అధినేతలు దృఢమైన నాయకులుగా నీరాజనాలందుకుంటున్నారు. ఆ దృక్ప థాన్ని మార్చి శాంతి అంటే యుద్ధం లేకపోవటం మాత్రమే కాదనీ, సమాజంలో సమానత్వ సాధనకు కృషి చేయటం, ప్రపంచ శాంతికి దోహదపడటం అని అందరూ గుర్తించేందుకు నోబెల్ కమిటీ తన వంతు ప్రయత్నించిన దాఖలా లేదు. మరి ఈ పురస్కారాల పరమార్థం ఏమిటో ఆ కమిటీయే ఆత్మవిమర్శ చేసుకోవాలి.