
పరస్పరం కలహించుకుంటున్న రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సంధి కుదర్చటానికీ, సామరస్యం సాధించటానికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనధికార అధికార ప్రతినిధిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే కఠినాతికఠినంగా వ్యవహరిస్తామని అలాస్కా సమావేశానికి ముందు హెచ్చరించిన ఆయన... కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరగాలని చెబుతున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం వైట్‌హౌస్‌లో తనను కలిసినప్పుడు సైతం ఇలాంటి సలహాయే ఇచ్చారు. దీన్ని ఏదో మేరకు సరిదిద్ది, ఉక్రెయిన్‌కు కనీస భద్రత గ్యారెంటీనైనా సాధించాలన్న ధ్యేయంతో ఆరుగురు యూరొప్ దేశాల నేతలు ట్రంప్‌తో భేటీ అయ్యారు. అమెరికాతో పాటు రష్యా, ఉక్రెయిన్‌లు పాల్గొనే త్రైపాక్షిక చర్చలకు సుముఖంగా ఉన్నామని ట్రంప్ చెప్పటం ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. కానీ ట్రంప్ దానికైనా కట్టుబడతారా లేదా... పుతిన్‌ను ఒప్పించగలరా లేదా అన్నది చెప్పలేం.
జెలెన్‌స్కీకి మొన్న ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ఎదురైన చేదు అనుభవాలను నివారించి, ఆయన వెనక యూరప్ దేశాలన్నీ ఉన్నాయని చెప్పటానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడెరిక్ షుల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కలిశారు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నార్థకం. ఉక్రెయిన్‌కు ‘నాటో తరహా’ భద్రత కల్పించటానికి ట్రంప్ అనుకూలమే గానీ అదంతా యూరప్ దేశాలే చూసుకోవాలట. తమ వంతుగా గగనతల రక్షణ విషయంలో సాయంగా నిలుస్తారట!
అసలు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తారనే ఆదుర్దా కన్నా ఆయన నాటో పక్షాన ఉంటారా ఉండరా అనే బెంగ ఎక్కువైంది. జెలెన్‌స్కీతో మళ్లీ ఆయన లడాయికి దిగితే అటుతర్వాత తాము సైతం మాట్లాడే స్థితి ఉండకపోవచ్చన్న భయంతోనే యూరప్ అధినేతలు వైట్‌హౌస్‌కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. కోల్పోయిన భూభాగాల గురించీ, నాటో సభ్యత్వం గురించీ మరిచిపోవాలని తొలుత తనను కలిసిన జెలెన్‌స్కీకి చెప్పటంతో పాటు యూరప్ దేశాధినేతల ముందు కూడా ట్రంప్ ఆ మాటే అనటం గమనించదగ్గది.
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన నాటి నుంచీ పుతిన్ చెప్పిన మాటల్నే ట్రంప్ ఇప్పుడు వల్లిస్తున్నారు. చాలా అంశాల్లో పుతిన్‌కూ, తనకూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఇప్పటికే ప్రకటించారు. పుతిన్ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆక్రమించిన క్రిమియాలో పలు పట్టణాలు, నదులూ, పర్వతశ్రేణులూ ఉన్నాయి. విలువైన పంటభూములున్నాయి. ఇవిగాక మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలున్నాయి.
వీటిని వదులుకోవటమంటే జెలెన్‌స్కీకి ఆత్మహత్యా సదృశం. అయినా తమ కోసం ట్రంప్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చింది. జెలెన్‌స్కీకి అంతకన్నా గత్యంతరం లేదు. ఉక్రెయిన్‌కి ప్రస్తుతం అందుతున్న సాయంలో 47 శాతం వాటా అమెరికాదే. జర్మనీ 9, బ్రిటన్ 8, జపాన్ 6 శాతాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కెనడా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్ వంటివి ఒకటి, రెండు శాతాలకు మించి ఇవ్వడం లేదు. అందుకే జెలెన్‌స్కీ నోరెత్తలేకపోతున్నారు.
అమెరికా గత పాలకుల ప్రాపకంతో ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టి, రష్యాతో గిల్లికజ్జాలకు దిగేలా చేసిన యూరప్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుబోని దుఃస్థితి. నెలక్రితం ట్రంప్‌తో మాట్లాడాక అంతా సామరస్యంగా పరిష్కారమైందని, ఉక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోబోరని యూరప్ దేశాధినేతలు నమ్మారు.
అలాస్కా శిఖరాగ్రానికి వారం రోజుల ముందు కూడా వారంతా ట్రంప్‌ను కలిశారు. ఆ భేటీకి జెలెన్‌స్కీని కూడా తీసుకెళ్లారు. ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాలనీ, ఆ తర్వాతే ద్వైపాక్షికమో, త్రైపాక్షికమో చర్చలుండాలనీ ఆ భేటీలో అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్రంప్ త్రైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతున్నా పుతిన్ అందుకు సుముఖంగా ఉంటారా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది.
ఆ మాటెలా ఉన్నా అలాస్కా శిఖరాగ్రం భారత్‌కు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి. రష్యాపై ఆగ్రహంతో మనపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఆ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న మాటకు కట్టుబడి సాధ్యమైనంత త్వరలో త్రైపాక్షిక చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే... పుతిన్‌ను ఒప్పిస్తే అది శాంతికి దోహదపడుతుంది.