
ఆయనేమీ అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహిస్తున్నవాడు కాదు. కనీసం రాజకీయ నాయకుడు కూడా కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సైద్ధాంతిక ఉపకరణాలు అందిస్తున్నవారిలో... ‘అమెరికాను మళ్లీ మహోత్కృష్టంగా మారుద్దాం’ (మాగా) ఉద్యమానికి తోడ్పడుతున్నవారిలో అతి ముఖ్యుడు. మూడు పదుల వయసు లోని మితవాద క్రియాశీల కార్యకర్త చార్లీ కిర్క్‌ను యూటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో బుధవారం దుండగుడు కాల్చి చంపిన వైనం ఇప్పుడు అమెరికాను ఊపిరాడకుండా చేస్తోంది. ప్రముఖులను, ఉన్న పదవుల్లోని వారినీ భౌతికంగా నిర్మూలించాలని చూసే సంస్కృతి అమెరికాకు కొత్తగాదు. కానీ ఈమధ్య అది పెరిగింది. ట్రంప్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. మిన్నెసోటా ప్రతినిధుల సభ స్పీకర్ ఎమెరిటా మెలిసానూ, ఆమె భర్తనూ ఇటీవలే కాల్చి చంపారు.
అమెరికాలో తుపాకుల పరిశ్రమ పలుకుబడి అధికం. తుపాకి సంస్కృతిని రద్దుచేయటం మాట అటుంచి, కనీసం పరిమితులు విధించాలని చూసినా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తుపాకి కలిగివుండటం పౌరుల హక్కని, దాన్ని రద్దు చేయటమంటే జీవించే హక్కును కాలరాయటమేనని వాదిస్తారు. రిపబ్లికన్ పార్టీలో ఇలాంటివారు ఎక్కువున్నా, డెమాక్రటిక్ పార్టీలో కూడా తక్కువేం లేరు. కిర్క్ తుపాకులకు అనుకూలం. దానిపై ఒక విద్యార్థి ప్రశ్నకు జవాబు చెబుతుండగానే ఆయన హత్యకు గురయ్యారు.
అమెరికాలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా అసహనం పెరిగింది. ఒక అంశంపై వాదం, ప్రతివాదం సంస్కృతి కనుమరుగవుతోంది. వినాలన్న యోచన లేదు. ఉన్నా వాదనకు జవాబు చెప్పలేక, అతనికి/ఆమెకు దురుద్దేశాలు అంటగట్టడం, అభాండాలేయటం, దౌర్జన్యానికి దిగటం పెరిగింది. ఏకీభవించకున్నా ఆ వాదనను గౌరవించాలన్న స్పృహ కొరవడింది.
ఒక విశ్వాసాన్ని కలిగివున్న వ్యక్తిని హతమార్చినంత మాత్రాన ఆ విశ్వాసాన్ని నిర్మూలించటం అసాధ్యం. కానీ దురదృష్టవశాత్తూ దీన్ని నమ్ముకునే ధోరణి ప్రబలుతోంది. కిర్క్ డ్రాపౌట్ అన్న మాటేగానీ అసాధారణ ప్రతిభావంతుడు. కేవలం 18 యేళ్ల వయసులోనే ‘టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ’ సంస్థ నెలకొల్పి తన మితవాద భావాలను బలంగా చెప్పగలిగే ఉపన్యాసకుడిగా రూపొందాడు. ఖజానా బాధ్యతాయుత నిర్వహణ, స్వేచ్ఛాయుత మార్కెట్లు, పరిమిత పాలనా వ్యవస్థ తదితర అంశాలపై విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చాడు.
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడే 22 ఏళ్ల వయసులో ‘మాగా’ ఉద్యమానికి అంకితమై పనిచేశాడు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదై రిపబ్లికన్లకు ఓటేయటం వెనక కిర్క్ కృషిని గురించి చెబుతారు. అరిజోనా వంటి డెమాక్రటిక్ ప్రభావిత ప్రాంతం రిపబ్లికన్ల వైపు మొగ్గటంలో అతనిపాత్ర ప్రధానమైనది. మహిళలు, గర్భస్రావాలు, ట్రాన్స్‌జెండర్లు తదితర అంశాల్లోఅతని వైఖరిని చాలామంది జీర్ణించుకోలేరు. జాతి, మత, వర్ణ, లింగ వివక్షను నిషేధించే 1964 నాటి పౌర హక్కుల చట్టం పెద్ద తప్పిదమని కిర్క్ భావన. భారతీయులకు కిర్క్ తీవ్ర వ్యతిరేకి. ‘శ్వేత జాతీయులకు ఉద్యోగాలు రావాలి... మీరంతా ఖాళీ చేసి పొండి’ అని పిలుపునిచ్చాడు.
తన భావాలపై ప్రశ్నించవచ్చంటూ కాలేజీలు, వర్సిటీల సందర్శన మొదలు పెట్టాడు. ఆ భావాలను పూర్వపక్షం చేస్తే అతని వాదన బలహీనపడుతుంది. కానీ భౌతిక దాడికి దిగటం వల్ల కిర్క్ భావాల బలం పెరుగుతుంది. ఈ మరణం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో సామాజిక మాధ్యమాల్లోని వ్యాఖ్యలే చెబుతాయి. ‘మనది యుద్ధం. కిర్క్ నేలకొరిగిన యుద్ధ వీరుడు. వ్యక్తిగత భేదాలు పక్కనబెట్టి ఒక్కటై పోరాడాలి’ అని మితవాద వ్యూహకర్త స్టీవ్ బేనన్ పిలుపునిచ్చారు.
‘మనల్ని ప్రశాంతంగా బతకనీయకపోతే మనకున్న ప్రత్యామ్నాయాలు రెండే– పోరాడటం లేదా మరణించటం’ అని ఎలాన్ మస్క్ అన్నారు. ‘వామపక్షవాదులారా... మనం సంభాషించుకుందాం లేదా యుద్ధానికి దిగుదాం. మీ నుంచి మరో బుల్లెట్ బయటికొస్తే ఇక ఆఎంపిక మిగలదు’ అని నటుడు జేమ్స్ వుడ్స్ హెచ్చరించారు. ఏదేమైనా ఈ వాతావరణంలో అక్కడివారే కాదు... వలసపోయినవారూ అప్రమత్తంగా ఉండక తప్పదు.