
తవ్వకం ఒక పురాతన ప్రక్రియ. నాగరికతలు మొదలైన నాటి నుంచే తవ్వకం ప్రక్రియ మనుషులకు తెలుసు. రకరకాల ప్రయోజనాల కోసం మనుషులు నేలను తవ్వుతారు. వ్యవసాయ అవసరాల కోసం; రక్షణ అవసరాల కోసం; విలువైన ఖనిజాల వెలికితీత కోసం – మనుషులకు తవ్వకం అలవాటైన పనే! చనిపోయిన మనుషుల మృతదేహా లను, జంతువుల మృతకళేబరాలను పాతిపెట్టడానికి కూడా నేలను తవ్వడం పురాతన కాలం నుంచి వస్తున్న అలవాటే!
ఆధునిక కాలంలో తవ్వకాల తీరుతెన్నులు మారాయి. అమూల్య ఖనిజాల కోసమే కాదు, చారిత్రక అవశేషాల కోసం కూడా తవ్వకాలు జరపడం మొదలైంది. తవ్వకాల కారణంగానే అనేక చారిత్రక విశేషాలు బయటపడటం; ఒకప్పుడు భూమ్మీద జీవించి అంతరించిపోయిన జీవుల శిలాజాలు బయటపడటం మనకు తెలుసు. చారిత్రక, మానవ పరిణామ అవశేషాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.
ఒక్కోచోట తవ్వుతుంటే లంకెబిందెల వంటి నిధినిక్షేపాలు బయటపడుతుంటాయి. మరొక్కోచోట తవ్వుతుంటే పురాతన కంకాళాలు బయటపడుతుంటాయి. ఏవి బయట పడినా, వాటితో పాటు చరిత్ర కూడా బయటపడుతుంటుంది. ఘనమైన కట్టడాలను నిర్మించాలంటే, పునాదుల కోసం నేలను తవ్వాలి. మృతులను పూడ్చిపెట్టాలంటే, సమాధుల కోసం తవ్వాలి. కొందరు పాలకులు సమాధులను అద్భుత నిర్మాణాలుగా తీర్చి దిద్దిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. అలాంటి వాటిలో ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పుకొనే తాజ్‌మహల్ ఒకటి. అంతకంటే ముందు ఈజిప్టు సహా పలుచోట్ల సమాధుల మీద పిరమిడ్లు నిర్మించారు.
పంటపొలాలకు నీరు పారించడం కోసం కాలువలు తవ్వుతారు. జలసమృద్ధి కోసం బావులు, చెరువులు నిర్మించడానికి కూడా నేలను తవ్వుతారు. రాతికోటలకు రక్షణ కల్పించడానికి చుట్టూ అగడ్తలను తవ్వుతారు. చరిత్రలో పేరు నిలిచిపోవాలనే కోరికతో కొందరు, మరణానంతరం పరలోకంలో అక్కరకొచ్చే పుణ్యాన్ని సంపాదించుకోవాలనే ఆశతో మరికొందరు రాజులు తమ తమ రాజ్యాలలో వాపీ కూప తటాకాదులను శక్తివంచన లేకుండా తవ్వించేవారు.
సాధారణంగా నీటి అవసరాలు, రక్షణ అవసరాల కోసం మినహాయిస్తే; ఎక్కడైనా గోతులను తవ్వాక, పనులు పూర్తయిన వెంటనే వాటిని పూడ్చిపెడతారు. మన దేశంలోని పలు నగరాల్లో నగరపాలక సంస్థలు రకరకాల పనుల కోసం గోతులు తవ్వి, పనులు పూర్తయ్యాక వాటిని పూడ్చిపెట్టడం మరచిపోతుంటారు. ‘ఎవరు తవ్విన గోతిలో వారే పడతారు’ అనే సామెత ఉంది. కానీ, మన నగరపాలక సంస్థలు తవ్విపెట్టిన గోతుల్లో తరచుగా సామాన్య జనాలే పడుతుంటారు. కాబట్టి ఎవరు తవ్విన గోతిలో వారే పడతారు అనుకోవడాన్ని కేవలం ఒక అపోహగానే భావించాలి. అయితే, రాజకీయాల్లో మాత్రం గోతి కాడ నక్కల్లా మసలుకొనేవారే రాణిస్తుంటారు.
చారిత్రక, శాస్త్ర పరిశోధనల్లోనే కాదు; గోతులకు, సమాధులకు భాషా సాహిత్యా ల్లోనూ ప్రాధాన్యం ఉంది. ‘అర్ధంతరంగా విప్లవాన్ని ముగించిన వాడు తన గోతిని తానే తవ్వుకున్నవాడు అవుతాడు’ అని జర్మన్ రచయిత జార్జ్ బుక్నర్ అన్నాడు. తన గోతిని తానే తవ్వుకోవడం కంటే అవివేకం మరొకటి ఉండదు. ‘గత వైభవ మార్గాలన్నీ సమా ధుల వైపే దారితీస్తాయి’ అన్నాడు ఇంగ్లిష్ కవి థామస్ గ్రే. సమాధులను తవ్వేటప్పుడే గత వైభవానికి చెందిన ఆనవాళ్లు బయటపడిన సందర్భాలు కోకొల్లలు.
మానవ నాగరికత ప్రస్థానంలో ఇంతటి ప్రాశస్త్యమున్న గోతులు తవ్వే విద్యలో పోటీలు లేకపోవడాన్ని లోటుగా భావించిన హంగేరియన్లు– ఆ లోటు తీర్చడానికి సమాధుల కోసం గోతులు తవ్వే పోటీని ప్రారంభించారు. అలాగని ఇదేదో స్థానిక పోటీ కాదు, అంతర్జాతీయ పోటీ. హంగరీ శ్మశాన వాటికల నిర్వహణ సంఘం ఎనిమిదేళ్లుగా పోటీ నిర్వహిస్తూ వస్తోంది. ‘కరోనా’ కాలంలో రెండేళ్లు ఈ పోటీకి అవరోధం ఏర్పడినా, ఈ ఏడాది ఇటీవల జరిగిన పోటీల్లో లాజ్లో కిస్, రాబర్ట్ నేగీ అనే వారు శరవేగంగా నిర్ణీత కొలతల్లో సమాధి గోతిని తవ్వి విజేతలుగా నిలిచారు.