
కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెలువరించే నివేదికలు రెండు విధాల కీలకమైనవి. ఆ నివేదికలు మన సమాజం తీరుతెన్నులకు అద్దం పడతాయి. అదే సమయంలో పాలకుల సమర్థతకో, వైఫల్యాలకో ఆనవాళ్లుగా నిలుస్తాయి. మూడు రోజులనాడు విడుదల చేసిన 2023 నాటి ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని గణాంకాలు దిగ్భ్రమ కలిగించేలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ జాతీయ నేర రాజధానిగా కూడా ఉన్నదని నివేదిక చెబుతోంది. అక్కడ ప్రతి లక్షమంది జనాభాకూ 1,508.9 నేరాలు జరుగుతున్నాయి. 721.7 నేరాలతో కేరళ రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో వరసగా హరియాణా, తెలంగాణ, ఒడిషా ఉన్నాయి. జాతీయ స్థాయిలో వివిధ నేరాల శాతం పెరిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2023లో అవి గణనీయంగా తగ్గాయని నివేదికను విశ్లేషిస్తే అర్థమవుతుంది.
తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏలుబడి సాగిస్తున్న ఎన్డీయే కూటమి పక్షాల నీతిబాహ్యతనూ, వంచననూ బజారుకీడ్చింది. జగన్ అయిదేళ్ల పాలనలో విపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు మైకు దొరికింది తడవుగా అబద్ధాలు వల్లెవేయటం అలవాటుగా చేసుకున్నాయి. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వగైరాలు గూడుపుఠాణి అయి ఒక పద్ధతి ప్రకారం ప్రజలను పక్కదోవ పట్టించారు.
వీరికి యెల్లో మీడియా ఇతోధికంగా సహకరించింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయనీ, కల్తీ మద్యంమృతులు అపారంగా పెరిగిపోయారనీ, మహిళలు, బాలికల అదృశ్యం కేసుల సంఖ్యఆందోళనకర స్థాయిలో ఉన్నదనీ తప్పుడు లెక్కలు వల్లెవేశారు. వాలంటీర్లే మహిళలూ, బాలికలూ మాయం కావటానికి కారణమని కూడా పవన్ దుష్ప్రచారం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఈ విషయం తనకు చెప్పాడని దబాయించారు.
ఏకంగా 34,000 మంది ఆచూకీ లేకుండా పోయారని ఆయన చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవ మనీ, కల్తీ మద్యం మృతులు అసలు లేనేలేరనీ నివేదిక తేటతెల్లంచేసింది. ఏదో ఒకరోజు నిజానిజాలు నిగ్గుతేలుతాయనీ, అప్పుడు దోషులుగా మిగిలిపోతామనీ వీరిలో ఏ ఒక్కరికీ అనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఎప్పట్లాగే జాతీయ స్థాయిలో నేరాల సంఖ్య పెరిగిందని నివేదిక చెబుతోంది. ప్రతి లక్ష జనాభాకు 2022లో 422.2 నేరాలు జరిగితే, 2023కు అది 448.3కు ఎగబాకింది. సైబర్ క్రైం కేసులు 31.2 శాతం పెరిగితే, పిల్లలపై నేరాలు అంతక్రితంతో పోలిస్తే 9.2 శాతం మేరకు అధికమయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అన్ని రకాల నేరాలూ గణనీయంగా తగ్గాయి. హింసాత్మక ఘటనలూ, హత్యలూ, అపహరణలూ మాత్రమే కాదు... మహిళలు, బాలికలపై నేరాలు తగ్గాయి.
దేశవ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు, ఆర్థిక నేరాలు పెరిగితే ఏపీలో అవి నియంత్రణలో ఉన్నాయి. అలిగివెళ్లిన లేదా అపహరణలకు గురైన బాల బాలికల కేసుల్లో 85.7 శాతం మందిని పోలీసులు సురక్షితంగా వారి వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చగలిగారు. జాతీయ స్థాయిలో ఇది 54 శాతం మాత్రమే. నేరాలకు పాల్పడేవారిపై సత్వరం తీసుకునే చర్యలవల్ల వాటి నియంత్రణ సాధ్యమవుతుందంటారు నిపుణులు. నేరం జరిగిన రెండు నెలల్లో న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయటం పోలీసుల సమర్థతకు నిదర్శనం. ఆ పని జగన్ హయాంలో జరిగింది.
91.6 శాతం కేసుల్లో గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేసి దేశంలోనే మూడో స్థానంలో ఉంది. జగన్ సర్కారు రూ. 15 లక్షల కోట్లు అప్పుచేసిందని బీజేపీ నేత పురందేశ్వరి చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని అప్పట్లోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నేరాల విషయంలో సైతం వారివి తప్పుడు మాటలేనని తాజాగా రుజువైంది. నిజం బయటికొచ్చేలోగా అబద్ధం లోకాన్ని చుట్టేస్తుందని నానుడి.
ఏణ్ణర్థం క్రితం అబద్ధాలు, వంచనలతో అధికారానికి ఎగబాకిన ఎన్డీయే కూటమి నిజ స్వరూపాన్ని ఇన్నాళ్లకు ఎన్‌సీఆర్‌బీ నివేదిక బట్టబయలు చేసింది. ముద్దాయిలుగా బోనులో నిలబడాల్సిన ఈ నేతలు ఇప్పుడు ‘తగుదునమ్మా’ అంటూ సైబర్ నేరాలకింద దాదాపు 2,000 మంది సామాన్యుల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తుండటం ఒక వైచిత్రి.