హైదరాబాద్: జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఐబొమ్మ’ పైరసీ సినిమా వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు.
తనను ఏమీ అడిగినా గుర్తు లేదు.. మరిచిపోయా అనేది మాత్రమే చెబుతున్నాడు. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) మూడో రోజు విచారణలో భాగంగా పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించలేదు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు అడిగితే.. గుర్తు లేవు.. మరిచిపోయా అని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్‌లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బ్యాంక్ ఖాతాల వివరాలపైనా రవి నోరు విప్పడం లేదు. దాంతో రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసలు. ప్రతీ 20 రోజులకు ఒక్కో దేశానికి వెళ్లడంపై రవిని ఆరా తీయగా, విదేశీ పర్యటనలు అంటే ఇష్టం ఉండటం వల్లే వెళ్ళాను అని చెప్పినట్లు సమాచారం.
కాగా, సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ ఇమ్మడి రవికి నాంపల్లి హైకోర్టు ఐదురోజుల పోలీసు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. వారం రోజుల పోలీసు కస్టడీ కోరిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులో ఉన్న సాంకేతిక అంశాలు, డిజిటల్ ఆధారాలు, నెట్‌వర్క్ లింకులు తదితరాలను విశ్లేషించేందుకు రవిని ప్రత్యక్షంగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటివరకూ మూడు రోజుల విచారణ పూర్తి కాగా, ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది.


