పకడ్బందీగా ‘ఐబొమ్మ’డేటా నిర్వహించిన రవి
అతి తక్కువ మందితోనే టచ్‌లో..
ప్రహ్లాద్‌కుమార్ పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు
మెయిల్ ఐడీల ఆధారంగా గుర్తించినసైబర్ పోలీసులు
నేటితో ముగియనున్న కస్టడీ
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’నిర్వాహకుడు ఇమంది రవి పోలీసు కస్టడీ సోమవారంతో ముగియనుంది. ఇతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం నుంచి విచారిస్తున్నారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సహకరించాడన్నది ఇతడిపై ఉన్న ప్రధాన ఆరోపణలు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో రవి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంతో పాటు ‘ఐబొమ్మ’, సంబంధిత సైట్ల సర్వర్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కొన్ని కీలక అంశాలు గుర్తించారు.
ఇతర పైరసీ వెబ్‌సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆరేళ్లల్లో 21 వేల సినిమాలు సేకరించి వెబ్‌సైట్లలో ఉంచిన రవి.. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సర్వర్ ఏదీ ఏర్పాటు చేయలేదని పోలీసులు గుర్తించారు. క్లౌడ్ సర్వీస్ సేవలను సర్వర్‌గా వినియోగించుకున్నాడని తేల్చారు. బ్యాకప్ కోసం మరో క్లౌడ్ సర్వీస్‌ను వాడినట్లు గుర్తించారు.
వెబ్ డిజైనర్‌గా చెప్పుకుంటూ..
మూసాపేటలోని అపార్ట్‌మెంట్‌లో నివసించినప్పుడు అతి తక్కువ మందితోనే సంప్రదింపులు జరిపేవాడు. తన గురించిన వివరాలు పెద్దగా వెల్లడించకుండా.. వెబ్ డిజైనింగ్ సంస్థలో పని చేస్తున్నానని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో సేవలు అందిస్తుంటానని చెప్పాడు.
వెబ్ డిజైనింగ్ కోసమే తరచూ ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు వెళ్లివస్తుంటానంటూ చెప్పేవాడు. రవి కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర చిరునామాతో, తన ఫొటోను వినియోగించి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్నాడు. ఇందులో తన పేరును ప్రహ్లాద్‌కుమార్ వెల్లెలగా పేర్కొన్నాడు.
అందరి దృష్టినీ ఆకర్షించేందుకే..
తన ఈ–మెయిల్ ఐడీలకు సంబంధించిన పాస్‌వర్డ్స్ చెప్పడానికి రవి నిరాకరించాడు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో వాటిని ఓపెన్ చేసిన పోలీసులు ఈ సర్వర్‌తో పాటు బ్యాకప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు గుర్తించారు. ఓ నటుడితోపాటు తెలుగు పరిశ్రమకు సవాల్ చేయడం వెనుక ఆంతర్యం పైనా పోలీసులు ప్రశ్నించారు.
తన వెబ్‌సైట్ మరికొందరి దృష్టికి వెళ్లేలా చేయాలనే ఆ పని చేసినట్లు రవి బయటపెట్టాడు. ఇటీవల కాలంలో ఐబొమ్మ వన్‌తో పాటు మరో పేరుతో తెరపైకి వచి్చన వెబ్‌సైట్లకు, రవికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ రెండు ఓపెన్ చేసిన వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి గాలిస్తున్నారు. రవిని దర్యాప్తు అధికారులు సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.
న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. రవిపై సైబర్ క్రైమ్ ఠాణాలో మరో నాలుగు కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రవి నెట్‌వర్క్‌లో మరె వరూ లేరని స్పష్టం కావడంతో అతడి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లనున్నారు. 25 బ్యాంకు ఖాతాలు ఉండటంతో పాటు బిట్ కాయిన్ల రూపంలోనూ భారీ లావా దేవీలు నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


