
పులివెందులలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలను మెడ పట్టుకొని నెట్టివేస్తున్న పోలీసులు
కళ్లు మూసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షిగా, రౌడీమూకల్లా చెలరేగిన పోలీసుల సాక్షిగా మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పచ్చమందలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. నిజమైన ఓటర్లు పోలింగ్ కేంద్రాల సమీపానికి రాకుండా అధికార పక్షం దౌర్జన్యాలకు దిగితే.... వాటిని ఎదిరించి వచ్చినవారిని పోలీసులు తరిమికొట్టారు. ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడినవారిని సైతం కనికరించలేదంటే... ఓటర్ల దగ్గర స్లిప్‌లు గుంజుకుని, మీ దగ్గర స్లిప్‌లు లేవుగనుక ఓటేయటం కుదరదని పోలీసులు దబాయించారంటే ఏపీలో పరిస్థితేమిటో అర్థంచేసుకోవచ్చు.
ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం చేతగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని పాyð క్కించారు. దీన్ని కప్పిపుచ్చ టానికి బుధవారం రెండు కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ తంతు నిర్వహించి అయిందనిపించారు. తొలినాటి ఉదంతాలే మర్నాడూ పునరావృతమయ్యాయి. స్థానికేతర టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగిపోతుంటే చోద్యం చూసిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నాయకుల్ని అరెస్టులతో, గృహనిర్బంధాలతో ఎటూ కదలనివ్వలేదు. అభ్యర్థులను తిరగనివ్వలేదు.
అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్రమంగా నాలుగు గ్రామాల పోలింగ్ కేంద్రాలను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరాల్లోవున్న వేరే గ్రామాలకు తరలించటంతోనే ఈ ఉప ఎన్నికల ప్రహసనం మొదలైంది. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటేయటం వృద్ధులకూ, అనారోగ్యం బారినపడిన వారికీ అసాధ్యమని లెక్కేసుకుని ఈ మార్పు చేశారు. మహిళలు, వృద్ధులతోసహా సాధారణ ఓటర్లంతా ఇలాంటి మాయోపాయాలను బేఖాతరు చేశారు. కానీ వారికి రక్షణగా నిలబడాల్సిన పోలీసులే వృత్తి ధర్మానికి ద్రోహం చేసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలు మార్చటాన్ని హైకోర్టు తప్పుబట్టినా, చివరి నిమిషంలో సవరించటం అసాధ్యమని భావించింది. ఇదే అదునుగా జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు వంటి చోట్లనుంచి వచ్చిన రౌడీమూకలు ఎడాపెడా రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో వుండగానే దొంగ ఓటర్లు బారులు తీరారంటే ఈ బరితెగింపు ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలిసో తెలియకో తమ ‘ఘనత’ను చాటుకోవటానికి జిల్లా కలెక్టర్ ఈ ఫొటోలనే సామాజిక మాధ్యమాల్లో వుంచి నగుబాటుపాలై తిరిగి వాటిని తొలగించాల్సి వచ్చింది.
అధికారులకు వ్యక్తిగత స్థాయిలో ఇష్టాయిష్టాలుండొచ్చు. అధికార పార్టీకి పరిచారికలుగానో, పాలేళ్లుగానో మారాలని ప్రాణం కొట్టుమిట్టాడొచ్చు. అలాంటివారు రాజీనామా చేసి పోవాలితప్ప, జనం ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును నెలనెలా జీతాలుగా తీసుకుంటూ... కుటుంబాలను పోషించుకుంటూ కాలసర్పాల మాదిరిగా అదే జనాన్ని కాటేయాలని చూడకూడదు.
సిగ్గూ లజ్జా, మానాభిమానాలు వున్నవారెవరైనా ఇలాంటి హీనస్థితికి దిగజారతారా? ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరమటం మాత్రమే కాదు... కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి రానీయకుండా నిర్వహించిన ఈ ఉప ఎన్నికలు ‘ప్రశాంతంగా’ జరిగాయని ప్రకటించటానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం సిగ్గనిపించకపోవటం విస్మయం కలిగిస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించింది.
మరి అక్కడుండే వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? మంత్రి సమక్షంలోనే పోలింగ్ ఏజెంటును ఒక్కడిని చేసి అత్యంత దారుణంగా కొట్టారన్న సమాచారం ఆ సంఘానికి చేరిందా? అనేకచోట్ల ఏజెంట్లు లేకుండానే పోలింగ్ కొనసాగిన వైనం ఆ సంఘానికి తెలుసా? ఓటర్లెవరో, కానివారెవరో గుర్తించటానికి ఏజెంట్లుంటారు. పోలింగ్ పూర్తయ్యాక అంతా సవ్యంగా పూర్తయినట్టు వారినుంచి సంతకాలు తీసుకుంటారు. జరిగిన తంతు చూస్తుంటే ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేయదల్చుకున్నారా అనే సంశయం ఏర్పడుతోంది.
పోయే కాలానికి కుక్కమూతి పిందెలని నానుడి. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడటం ఆదినుంచీ అలవాటైన బాబుకు ‘అతని కంటె ఘనుడ’న్నట్టు పుత్రరత్నం తోడయ్యాడు. అందుకే ఈసారి బరితెగింపు అవధులు దాటిన వైనం కనబడుతోంది. ఇలాంటి దుష్టపోకడల్ని చూస్తూ వూరుకుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రహసన ప్రాయంగా మారిన ఈ ఉప ఎన్నికలను రద్దుచేయాలి. బాధ్యులైన అధికార్లను సాగనంపాలి. వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలి.