సాక్షి, తాడేపల్లి: గుంటూరులోని హజరత్ కాలే మస్తాన్ షా అవులియా బాబా(నల్ల మస్తానయ్య) 134వ ఉరుసు ఉత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
హజరత్ కాలే మస్తాన్‌షావలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహనరావు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి తాడేపల్లి వెళ్లి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఉరుసు నేపథ్యంలో మస్తాన్ బాబాకు చాదర్ (శేషవస్త్రం), చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు వైఎస్ జగన్.


ఆ సమయంలో గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, రావి రామ్మోహన రావు సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి, తుమ్మూరు షమిత్ సాయి గణేష్ రెడ్డి, రావి జ్జానేశ్వర్ బావాజీ మస్తాన్ రావు, గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఉన్నారు.
హజ్రత్ కాలే మస్తాన్ షా ఔలియా బాబా గుంటూరు నగరంపాలెంలో ఉన్న ప్రసిద్ధ సూఫీ సంత్. ఆయన్ని హిందూ ముస్లింలు ఐక్యంగా ఆరాధిస్తారు. ఈ ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి 10 వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల చివరి రోజున బాబా ఆశీసులైన కుర్చీని యథాస్థానంలో ఉంచడంతో ఉత్సవాలు ముగుస్తాయి.


