Sakshi Guest Column
-
ఫ్లాష్‌బ్యాక్ తిరగేస్తే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే. కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేశ్‌లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాలలో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్ల ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్ కనుక ఆయిల్ పై ఉన్న పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా!. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం లేదని చంద్రబాబు పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. అమరావతి నిర్మాణాలలో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల చర్చలు ఇరువురూ కోరుకున్నట్లే సాగాయి. బీజింగ్ ప్రయాణానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, తమకు ‘అన్నింటికన్న వాణిజ్యం ముఖ్య’మన్నారు. షీ చెప్పిన ప్రధానమైన లక్ష్యాలు, ‘అమెరికాతో నిర్మాణాత్మకమైన సంబంధాలు, వ్యూహాత్మకమైన స్థిరత్వం’. నాయకులిద్దరి మధ్య మే 14, 15 తేదీలలో రెండు విడతల సమావేశం తర్వాత, అంతా సజావుగా జరిగిందన్నది ఉభయుల సంతృప్తి. అదే సమయంలో చైనా అధ్యక్షుడు తైవాన్ విషయమై అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు చేసి ఆశ్చర్యపరిచారు. ట్రంప్ నుంచి మౌనమే సమాధానమైంది.‘ఒకే చైనా’కు ఒప్పుకొంటారా?మిగిలినదంతా సవ్యంగానే జరిగినందున, అపశృతిగా మారిన తైవాన్ అంశంపై జరిగిందేమిటో ముందు చూడాలి. చారిత్రకంగా చూసినా, అంతర్జాతీయ చట్టాల ప్రకారమైనా తైవాన్ దీవి చైనాలో భాగం. అమెరికా సహా ప్రపంచమంతా ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీ కరిస్తున్నాయి. తైవాన్‌తో దౌత్య సంబంధాలు లేవు. అదే సమయంలో గమనించదగ్గదేమంటే... అమెరికా, దాని మిత్ర దేశాలు కేవలం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం తైవాన్‌కు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తూ, పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తైవాన్ చైనాదేననీ, కానీ వారికి ఇష్టం లేకుండా చైనాలో విలీనం చేసుకునేందుకు అంగీకరించ బోమనీ విచిత్రమైన వాదన చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాను సాధారణ దౌత్య మార్గంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన చైనా అధ్యక్షుడు, అమెరికా ‘సవ్యంగా వ్యవహరించని పక్షంలోరెండు దేశాల మధ్య విభేదాలు, చివరకు ఘర్షణ తప్పక పోవచ్చు’ నని ట్రంప్‌ను హెచ్చరించారు.విషయ తీవ్రత దృష్ట్యా ఇందు గురించి మరికొన్ని వివరాలు చూద్దాము: ఒకవైపు ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీకరిస్తూనే, మరొక వైపు తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా, తన ద్వంద్వ నీతికి ‘వ్యూహాత్మక అస్పష్టత’ (స్ట్రాటెజిక్ ఆంబిగ్విటీ) అనే పేరు తానే పెట్టింది. తైవాన్ను కాపాడటం తమ లక్ష్యమంటూ చట్టమే చేసింది. ఒకవేళ తైవాన్ను చైనా స్వాధీనపరచుకొనజూస్తే తాను తైవాన్‌కు సహాయం మాత్రమే చేస్తుందా లేక స్వయంగా యుద్ధంలో పాల్గొంటుందా అనే ప్రశ్నకు అవుననిగానీ, కాదనిగానీ స్పష్టం చేయటం లేదు. మరొకవైపు బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ఇండో– పసిఫిక్ స్ట్రాటెజీ (2022), ట్రంప్ తన రెండవ హయాంలో ప్రకటించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటెజీ (2025), నేషనల్ డిఫెన్స్ స్ట్రాటెజీ (2026) పత్రాలను పరిశీలించినప్పుడు, తైవాన్ను ఉపయోగించు కుని చైనాను నియంత్రించటం వారి ఉద్దేశమని లిఖితపూర్వకంగా, బహిరంగంగా ప్రకటించటం కనిపిస్తుంది.మౌనం ప్రస్తుతానికేనా?ఈ దిశలో అమెరికా ఇంకా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితిలోనే చైనా అధ్యక్షుడు, బహుశా విసుగెత్తి కావచ్చు, గతంలో ఎన్నడూ లేని రీతిలో పై విధమైన హెచ్చరికను ముఖాముఖీగా చేశారు. సమావేశాల సమయంలో, అంతకుముందూ ఇంకా ఏమేమి మాటలు వినిపించాయో గమనించాలి. తక్కిన విషయాలన్నీ ఎట్లున్నా, చైనాకు గల ‘ముఖ్యమైన ప్రయోజనాలలో అతి ముఖ్యమైన ప్రయోజనం’ తైవాన్ అన్నారాయన. ఈ అంశం సవ్యంగా తేలనట్లయితే ‘అత్యంత తీవ్రమైన ప్రమాదకర పరిస్థితికి’ దారి తీయగలదన్నారు. అమెరికా– చైనా సంబంధాలు యావత్తు ప్రమాదకరమవుతాయని హెచ్చరించారు. తైవాన్ స్వాతంత్య్రం, ఆ ప్రాంతంలో శాంతి అన్న రెండు మాటలు నీళ్లు–నిప్పు వంటివనీ, రెండింటికి పొసిగే ప్రసక్తి లేదనీ అన్నారు.తైవాన్ గురించి ఇంతింత చెప్పుకోవటం ఎందుకంటే, 1949లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం రావటానికి ముందు, వారికి చెందిన తైవాన్ దీవిని జపాన్ సైనికంగా ఆక్రమించింది. తర్వాత, మావోతో ఓడిపోయిన చాంగ్ కై షేక్ వర్గం తైవాన్‌కు పారిపోగా, ఆ వర్గాన్ని అమెరికా కూటమి, జపాన్ మద్దతిచ్చి నిలబెట్టాయి. మొదటి నుంచి చైనాకు చెందిన ఆ దీవిని తిరిగి తమ దేశంలో విలీనం చేసుకోవటం చైనా నాయకత్వానికి ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ లక్ష్యంగా మారింది. ఇపుడు ట్రంప్‌తో చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు ఈ విషయమై ఎన్నడూ లేనంత తీవ్రంగా మాట్లాడటానికి వెనుక ఈ సుదీర్ఘ నేపథ్యం ఉంది. విషయం అమెరికా పక్షానికి తెలియనిది కాదు. పరిస్థితి శాంతియుతంగా తేలనట్లయితే ఎప్పటికైనా సరే తైవాన్ను బలప్రయోగం ద్వారానైనా విలీనం చేసుకోగలమన్నది కూడా చైనా చెప్తున్న మాటే. జిన్‌పింగ్ హెచ్చరికలకు 14వ తేదీన ట్రంప్ స్పందించలేదు. కానీ ముందు రోజున ఆయన విదేశాంగ మంత్రి మార్కో రూబియో ‘మా విధానంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు. చైనా సైనిక చర్యకు పాల్పడితే అది పొరపాటు అవుతుంది’ అని మాత్రం అన్నారు. కొద్ది నెలల క్రితం ట్రంప్ ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ‘చైనా అభిప్రాయాలు తెలుసు. వారు తైవాన్ విషయమై పట్టుదలగా ఉన్నారు. కనీసం నా అధ్యక్ష కాలంలో సైనిక చర్య తీసుకోబోదని ఆశిస్తాను’ అన్నారాయన. గమనించవలసింది ఏమంటే, అధికారంలో ఉన్నది రిపబ్లికన్లా, డెమోక్రాట్లా అన్న దానితో నిమిత్తం లేకుండా, పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజ నాలకు, చైనాను కట్టడి చేసేందుకు తైవాన్ తమ పలుకుబడిలో ఉండాలన్నది అమెరికా వ్యూహం. ఇపుడు చైనా అధ్యక్షుని హెచ్చరిక ప్రభావం ఎట్లుండవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం.ట్రాప్‌లో పడొద్దు!చర్చల వివరాలను ఇతరత్రా గమనించినప్పుడు, ప్రధానమై నది పరస్పర ఆర్థిక సంబంధాలు. వాణిజ్యపరంగా ‘గొప్ప ఒప్పందాలు’ జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు. ఆయన వెంట సుమారు 30 అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలను తీసుకువెళ్లటంలోని ఉద్దేశమూ అదే. అమెరికాలోనూ అదే పద్ధతిలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశ మిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో అమెరికా, చైనాలు భాగస్వా ములుగా పరస్పరం సహకరించుకోవాలి తప్ప పోటీదారులు కారా దనీ, ఇరువురి సంబంధాలు స్థిరమైన విధంగా సాగాలనీ షీ అన్న మాటలు ట్రంప్‌కు నచ్చినట్లే కనిపించాయి. తమ సంబంధాలు ‘గతంలో ఎన్నడూ లేనంతగా’ ముందుకు పోగలవన్నారాయన.చైనా అధ్యక్షుడు తన పరస్పర సహకార సూచనలకు మద్దతుగా, క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలో స్పార్టా, ఏథెన్స్ల మధ్య జరిగిన ఒక యుద్ధాన్ని ఉదహరించారు. అగ్రస్థానంలో ఉండిన స్పార్టా, రెండవ స్థానంలో ఉండిన ఏథెన్స్ తనను మించి పోగదలనే భయంతో ముందస్తు యుద్ధం వంటిది చేస్తుంది. అట్లా భయంలో చిక్కుకోవటాన్ని తుసిడిడీస్ అనే చరిత్రకారుడు విశ్లేషించి చెప్పాడు. అప్పటినుంచి ఆ భయాందోళనల స్థితిని ‘తుసిడిడీస్ ట్రాప్’ అంటున్నారు. అమెరికా, చైనా అటువంటి ట్రాప్‌లో చిక్కు కోకుండా పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని జిన్‌పింగ్ సూచించగా, అటువంటి సహకారం గతంలో ఎన్నడూ లేనంతగా ఉండగలదన్నది ట్రంప్ ఇవ్వబూనిన భరోసా!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సంజయ్ మల్హోత్రా (ఆర్బీఐ గవర్నర్) రాయని డైరీ
మనసు ప్రశాంతంగా లేదు. అలాగని అశాంతి గానూ లేదు. ఉప్పునీటి ఉపరితలం మీద ఒలికిపోయి తేలుతున్న చమురు తెట్టులా ఉంది. సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్ 18వ అంతస్తు నుండి అరేబియా సముద్రాన్ని చూస్తూ పనిచేయటం ఎప్పటిలా ఇవాళ నన్ను ఆహ్లాదపరచటం లేదు! ఏదో ఒకటి మాత్రమే చేయగల మానసిక స్థితిలో ఉన్నాను. సముద్రాన్ని షట్‌డౌన్ చేసేసి లాప్టాప్లో సర్ఫింగ్ చేయటమా? లేక, లాప్‌టాప్‌ను స్కూబా ట్యాంక్‌లా వీపున తగిలించుకుని సముద్రంలోకి దూకేయటమా? ఏదో ఒకటే! కవాస్జీ పటేల్ రోడ్‌లోని ‘టమ్ టమ్ టీ పాయింట్’ నుండి తరచూ నేను అడిగి తెప్పించుకునే ఘాటైన రాజస్థానీ టీ... టేబుల్ మీద చిక్కగా చల్లబడి ఉంది. మీగడను పక్కకు ఊది, టీని కొద్దిగా చప్పరించాను. కొత్తగా ఉంది! కొత్తగా ఉన్నా బాగుంది. కాలం అనుకూలంగా లేనప్పుడు కాలానికి అనుకూలంగా మారటంలోనే మనిషి బాగోగులు ఉంటాయి. దేశానికి ఇప్పుడు పొదుపు కాలం. ప్రధాని ఇచ్చిన పిలుపు కాలం. చల్లబడిన టీని వదిలేసి వేడిగా ఇంకో కప్పును తెప్పించుకోవటానికి మనస్కరించని కాలం. ప్యాంటు జేబులోంచి పర్సు తీసి చూశాను. ఒక అరలో కొన్ని నోట్లు. ఇంకో అరలో బంగారు కడ్డీలు. మిగతా అరల్లో ఫారిన్ బాండ్లు, యూరోలు, పౌండ్లు. హుండీని నిండకుండానే పగలగొట్టి నట్లుగా పర్సును టేబుల్ మీద బోర్లించి మొత్తం ఉన్నదెంతో లెక్క చూశాను. 66 లక్షల 3 వేల 990 కోట్ల రూపాయలు. 145 కోట్ల మందికి పైగా కుటుంబ సభ్యులున్న ఇంటిని నెట్టుకు రావటానికి దాచుకుంటూ వచ్చిన ద్రవ్యం. మూడు నెలల క్రితం వరకూ పర్సు బరువుగా ఉండేది. ఇంటికి బలంగా ఉండేది. అందులో 69 లక్షల 84 వేల 640 కోట్ల రూపాయలు ఉండేవి! అదేమీ చిన్న మొత్తం కాదు. ఆ డబ్బుతో 10,000 టన్నుల బంగారం కొనొచ్చు. ఐదుగురు ఎలాన్ మస్క్‌లు లేదా ఆరుగురు జెఫ్ బెజోస్‌ల దగ్గర ఉండే మొత్తం సంపదను కలిపినా నా పర్సులో ఉన్న దానికంటే తక్కువే అవుతుంది! కానీ, దాచిన గుడ్ల కోసం ఏ కాలసర్పమో పొంచి ఉంటుంది. పర్సులో ఉన్న డబ్బులో 4 లక్షల కోట్లను ఈ రెండు నెలల్లోనే హార్మూజ్ జలసంధి మింగేసింది! ప్రధాని చెప్పినట్లు ఎంత పొదుపు చేసినా, మిగిలిన డబ్బుతో ఇంకొక పదకొండు నెలలు మాత్రమే హుండీపై బండి నడుస్తుంది. ఆ తర్వాత?! సముద్రమంత పొదుపైనా అది ఆదాయమూ కాదు, ఆస్తీ కాదు. మార్కెట్ జీవనదుల్లోంచి నిరంతరం డబ్బు ప్రవాహాలు వచ్చి కలుస్తుండాలి. ప్రధానికి ఓట్లు తగ్గకూడదు. ఆర్బీఐకి ధరలు పెరగకూడదు. ప్రధాని తన కంఠహారం తీసి ప్రజల్లోకి విసురుతారు; ఆర్బీఐ దానిని మధ్యలోనే ఒడుపుగా పట్టేసి, తిరిగి కోశాగారంలో బాధ్యతగా పెట్టేయాలి. ప్రధానికి ప్రజలు హ్యాపీగా ఉండటం కావాలి. ఆర్బీఐకి దేశం ధీమాగా ఉండటం కావాలి. మంచి చెడ్డలు చూసే ఆర్బీఐ, ప్రధానికి మంచీ చెడూ చెప్పకూడదా? ప్రధాని ఏదైనా చేసేముందు ఆర్బీఐ చెవిలో ఒక మాట వేయకూడదా? ప్రధాని నెహ్రూకి, ఆర్బీఐ గవర్నర్ బెనెగల్ రామారావుకి ఇక్కడే పడింది. ప్రధాని మన్మోహన్‌కి, ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావుకి ఇలాగే పడింది. ప్రధాని మోదీకి, ఆర్బీఐ గవర్నర్లు రఘురామ్ రాజన్‌కి, ఉర్జిత్ పటేల్‌కి, శక్తికాంత దాస్‌కి కూడా ఇందుకే పడింది. ఇప్పుడీ నడి సముద్రంలో నా వంతు! రాజీనామా లేఖను సమర్పిస్తే నౌక నుంచి నేనొక్కడినే నా స్వార్థం నేను చూసుకుని లైఫ్బోట్లోకి దూకేయటం అవుతుందా?! మెల్లిగా సీట్లోంచి లేచి, గాజు అద్దాల్లోంచి దూరంగా ఆకాశమూ, అరేబియా సముద్రమూ కలుస్తున్న చోటును చూస్తూ నిలబడ్డాను. ట్రంప్ యుద్ధ తంత్రం, మోదీ పొదుపు మంత్రం భూమ్యాకాశాల్లా కలిసిపోయిన క్షితిజ రేఖ నాకు అక్కడ కనిపించింది! -
ఇరాన్ సమాంతర శక్తి కేంద్రం
దాదాపుగా అన్ని దేశాల విషయంలో ఎన్నికైన ప్రభుత్వం, అధ్యక్షుడు, సైన్యం, పార్లమెంట్ వంటి వ్యవస్థలే ప్రధాన అధికార కేంద్రాలుగా కనిపిస్తాయి. కానీ ఇరాన్ విషయంలో పరిస్థితి కొంత భిన్నం. అక్కడ బాహ్యప్రపంచానికి కనిపించే ప్రభుత్వ వ్యవస్థలతో పాటు, మరొక సమాంతర శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. అదే ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ). పర్షియన్ భాషలో దీనిని ‘సెపాహ్–ఎ పాస్దారాన్–ఎ ఎంగెలాబ్–ఎ ఇస్లామీ’ అని పిలుస్తారు. దీని అర్థం ఇస్లామిక్ విప్లవ పరిరక్షక దళం. పేరుకు ఇది భద్రతా సంస్థ మాత్రమే. కాలక్రమేణా ఇరాన్ రాజకీయ ముఖచిత్రం, విదే శాంగ వ్యూహం, సామాజిక నియంత్రణ, ప్రాంతీయ వ్యూహాత్మక కార్యకలాపాలు వంటి అనేక రంగాలను ప్రభావితం చేసే కేంద్రంగా పరిణమించింది. అందుకే పశ్చిమ దేశాల విశ్లేషణల్లో ఐఆర్జీసీని ‘దేశంలో మరో దేశం’గా అభివర్ణిస్తుంటారు.1979 విప్లవంతో మొదలు...ఈ సంస్థ ఆవిర్భావాన్ని ఆకళింపు చేసుకోవాలంటే 1979 ఇరాన్ విప్లవాన్ని పరిశీలించాలి. అప్పటివరకు ఇరాన్లో పాలన సాగించిన షా మహమ్మద్ రేజా పహ్లవి – పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికా–బ్రిటన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. గణనీయ స్థాయి సహజ వనరులు కలిగిన ఇరాన్‌పై పాశ్చాత్య ప్రభావం పెరుగుతుండటం దేశంలో అసంతృప్తికి దారితీసింది. ఇస్లామిక్ వర్గాలు, జాతీయవాద శక్తులు, విద్యార్థులు, వామపక్షాలు ఐక్యంగా షా పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాయి. అప్పుడు మత పెద్దగా ఉన్న అయతుల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో జరిగిన విప్లవం షా పాలనకు చరమగీతం పాడింది. దాంతో, ఇస్లామిక్ రిపబ్లిక్కు అంకురార్పణ జరిగింది.కొత్త ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తాయి: విప్లవం ద్వారా ఏర్పడిన ఈ కొత్త వ్యవస్థను దీర్ఘకాలం ఎలా కాపాడాలి? పాత శక్తులు తిరిగి పుంజుకోకుండా ఎలా నిరోధించాలి? చమురు సంపదపై దృష్టి పెట్టిన పాశ్చాత్య దేశాల జోక్యాన్ని ఎలా ఎదు ర్కోవాలి? ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ పాలనను అంత ర్గతంగా, బాహ్యంగా సవాలు చేసే శక్తులను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా, అప్పటి ప్రథమ సుప్రీం లీడర్ ఖొమేనీ నాయకత్వంలో ఐఆర్జీసీ పురుడు పోసుకుంది.ఇక్కడే ఇరాన్ సంప్రదాయ సైన్యం ‘ఆర్టేష్’ అంటే అగ్ని, ఐఆర్జీసీ మధ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఇతర దేశాల సైన్యాల లాగానే ఆర్టేష్ విధులు దేశ సరిహద్దులను రక్షించడం, సాంప్రదాయ యుద్ధాలలో దేశాన్ని కాపాడటం. కానీ ఐఆర్జీసీ లక్ష్యం కేవలం భూభాగ పరిరక్షణ మాత్రమే కాదు, ఇస్లామిక్ విప్లవాన్నీ, దాని భావజాలాన్నీ కాపాడటం కూడా దీని ప్రధాన బాధ్యతగా నిర్దేశించ బడింది. అందువల్ల, బాహ్య శత్రువులతో పాటు అంతర్గత రాజ కీయ అస్థిరత, సామాజిక నిరసనల వంటి అంశాలను కూడా ఇది భద్రతా సమస్యలుగా పరిగణిస్తుంది. ఈ విస్తృత పాత్రే కాలక్రమేణా ఐఆర్‌జీసీకి ఎనలేని ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది.ప్రభుత్వం వర్సెస్ ఐఆర్జీసీఇరాన్ అధికార వ్యవస్థలో అత్యున్నత స్థానం ‘సుప్రీం లీడర్’ది. ఇది కేవలం రాజకీయ పదవి మాత్రమే కాదు; తొమ్మిది కోట్ల మంది ఇరానీయులను ఏకీకృతం చేయగల మతపరమైన అత్యున్నత అధి కార హోదా కూడా. ఖొమేనీ తర్వాత దశాబ్దాల పాటు అలీ ఖమేనీ ఆ పదవిలో తిరుగులేని అధికారం చలాయించారు. ప్రస్తుత ఉద్రి క్తతల నడుమ, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆ బాధ్యత చేపట్టారు. ఐఆర్జీసీ నేరుగా సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఎన్నికైన అధ్యక్షుడు, పార్లమెంట్, మంత్రివర్గం వంటి వ్యవస్థలకు ఇది పూర్తిగా లోబడి ఉండదు. ఫలితంగా, ఒకవైపు ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుండగా, మరోవైపు సుప్రీం లీడర్‌కు నేరుగా అనుసంధానమైన ఐఆర్జీసీ కూడా సమాంతరంగా పని చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు వ్యవస్థల బాధ్యతల మధ్య స్పష్టమైన విభజన రేఖ లేకపోవడం బాహ్యప్రపంచాన్ని సందిగ్ధంలో పడేస్తుంది. ఈ ద్వంద్వ నిర్మాణమే ఇరాన్‌ను పశ్చిమాసియాలో ఇతర దేశాలకంటే భిన్నంగా నిలబెట్టింది.కాలక్రమేణా ఐఆర్జీసీ ఒక విస్తృత భద్రతా వ్యవస్థగా ఎదిగింది. దీనిలో భూసేన, నౌకాదళం, వైమానిక విభాగం, క్షిపణి వ్యవస్థలు, గూఢచార యంత్రాంగం, సైబర్ సామర్థ్యాలు వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ‘ఖతమ్ అల్–అన్బియా’ వంటి కేంద్ర కమాండ్ వ్యవస్థలు సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇందులో సుమారు 1–2 లక్షల సంఖ్యలో సిబ్బంది ఉన్నారని అంచనా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చమురు, నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా దీని అనుబంధ సంస్థల ప్రభావం గణనీయంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక మాజీ ఐఆర్జీసీ పదాధికారులు ఉత్తరోత్తరా ప్రభుత్వ వ్యవస్థలో కీలక పదవులు చేపట్టారు. పార్లమెంట్, మంత్రివర్గం, ప్రాంతీయ పరి పాలన, వ్యూహాత్మక సంస్థలు వంటి అనేక రంగాల్లో వీరి ప్రభావం విస్తరించింది.ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలో ‘బసీజ్’ అనే అనుబంధ బలగం కీలక పాత్ర పోషిస్తుంది. ‘బసీజ్’ అంటే సమీకరణ అని అర్థం. ఇది సంప్రదాయ సైన్యం, పోలీసు, పారామిలిటరీ బలగాల వంటి వ్యవస్థీకృత విభాగం కాదు. విద్యార్థులు, కార్మికులు, ప్రభు త్వోద్యోగులు, వ్యాపారులు వంటి అనేక సామాజిక వర్గాలవారుఇందులో సభ్యులుగా ఉంటారు. అవసరమైనప్పుడు, ఐఆర్జీసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా సేవలందిస్తారు. ఇటీవలి సంవత్స రాల్లో ఇరాన్లో జరిగిన నిరసనల సమయంలో, బసీజ్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఉద్రిక్తతలను ఆపగలిగేది ఎవరు?ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న అంతర్జాతీయ వివాదాల్లో కూడా ఐఆర్జీసీ పేరు తరచూ వినిపిస్తుంది. యురేనియం శుద్ధి స్థాయులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థను అణు కేంద్రాల తనిఖీ లకు అనుమతించడంలో నియంత్రణలు, అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనా అనే అనుమానాలు– ఈ అన్ని చర్చల్లో ఐఆర్జీసీ కీలకంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఒక వైపు కొనసాగుతుండగా; భద్రతా–భావజాల వ్యవస్థగా ఐఆర్జీసీ సమాంతరంగా ప్రభావాన్ని, ప్రాభవాన్ని కొనసాగిస్తోంది. అధికారిక నిర్ణయాలు ప్రభుత్వం పేరుతో వెలువడినా; వాటి నేపథ్యాన్ని, దిశను ప్రభావితం చేయడంలో దీని పాత్ర స్పష్టం.ప్రస్తుతం ఇంకా పూర్తిగా సమసిపోని ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా ఉద్రిక్తతలను మరో మలుపు తిప్పగల సామర్థ్యం ఇరాన్ వ్యవస్థల్లో దేనికైనా ఉందంటే, అది ఐఆర్జీసీకేనని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్‌కు ప్రతి నిధిత్వం వహించిన భారీ బృందంలో ఐఆర్జీసీ సభ్యుల పాత్రే కీల కంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. హార్మూజ్ జలసంధి, దాని గుండా భారత్‌కు ప్రవహించే చమురు సరఫరాపై కూడా ప్రభావం చూపగల వ్యూహాత్మక స్థాయిలో ఐఆర్జీసీ నిలిచింది.వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు, పశ్చిమాసియాలో పనిచేశారు. -
పొదుపు సత్యాగ్రహం పనికొచ్చేనా?
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 11 నిర్దిష్ట అభ్యర్థనలు చేశారు. మరీ అవసరమైతే తప్పించి బంగారం కొనవద్దు, విదేశీ విహారయాత్రలకు వెళ్ళ వద్దు అన్నారు. ఎరువులు, వంటనూనెల వాడకం తగ్గించమన్నారు. సౌర శక్తితో నడిచే పంపుల ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. దీన్ని ప్రభుత్వం ధరలను పెంచేందుకు చేస్తున్న ముందస్తు సన్నాహంగా చాలామంది భావిస్తున్నారు. కానీ, మోదీ ప్రసంగంలో అంతకుమించిన పెద్ద ఆశయమే ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్) సంరక్షించుకోవడాన్ని సిసలైన జాతీయ ఉద్యమంగా మార్చాలన్నది ఆయన కోరిక. మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అలాంటి స్ఫూర్తితో మొత్తం జాతిని సమీకరించాలని ప్రధాని భావన. జాతీయ జెండాను ఎగురవేయడం దేశభక్తిని ఎలా చాటుతుందో... విదేశీ మారకద్రవ్య సంరక్షణకు తోడ్పడటం కూడా అంతే దేశభక్తి పూర్వకమైన చర్యకిందకు వస్తుందని ఆయన చెబుతున్నారు. ప్రధాని అభిమతం అభినందించదగిందే. ముడి చమురు, ఎరువుల తయారీకి అవసరమైన వస్తువులు, బంగారం, వంట నూనెలకు మనం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఈ బలహీనతను గుర్తించి దశాబ్దాలు గడుస్తున్నా విరుగుడు చర్యలను తీసుకున్నది లేదు. మోదీ దాన్ని ఇప్పుడు స్పష్టంగా వివరిస్తున్నారు. దైనందిన ‘ఫారెక్స్’ చెల్లింపులకు వ్యక్తిగత బాధ్యతను జోడిస్తున్నారు.గత ఉదంతాలులాల్ బహదూర్ శాస్త్రి 1965లో ఆహారం విషయంలో ఇదే తరహాలో పిలుపునిచ్చారు. దేశం యుద్ధాన్ని, ఆహార ధాన్యాల కొర తను ఎదుర్కొంటున్న ఆ కాలంలో సోమవారం సాయంత్రాలు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండవలసిందిగా శాస్త్రి విజ్ఞప్తి చేశారు. సోషలిస్టు పార్లమెంటేరియన్ మధు లిమాయే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. జాతీయ సంక్షోభాల సమయంలో స్వచ్ఛందంగా నిరాడంబర జీవితాన్ని గడపడం పౌరుల రాజ్యాంగపరమైన విధిగా లిమాయే ఒక సందర్భంలో పార్లమెంట్లో పేర్కొన్నారు. గాంధీ ఉప్పు సత్యాగ్రహం నైతిక శక్తిని సమీకరించుకోవడంలో ఉప్పుపై బ్రిటిష్ వాళ్ళు వేసిన పన్ను కూడా కొంత దోహదపడింది. ఉప్పుపైన పన్నుకన్నా దారుణమైన తిరోగమన చర్య మరొకటి ఉండదు. పైగా, అది పేదలను మరింత దెబ్బతీసింది. ఈ రకమైన అన్యాయం కారణంగానే గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టవలసి వచ్చింది. కానీ, ‘ఫారెక్స్’ సంరక్షణ ఉద్యమం ఏదో అన్యాయానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదు. అసలది స్వభావరీత్యానే తిరోగ మనమైనది. విదేశీ పైకం తక్కువ ఉన్నవారిని బాధను మాత్రం ఎక్కువ పంచుకోవాల్సిందిగా కోరుతోంది.లోపించిన సమానత్వంప్రధాని 11 అభ్యర్థనలను ఈ కోణం నుంచే చూడాలి. విదే శాలకు విహారయాత్రలకు వెళ్లడం, విదేశాల్లో ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళి పెళ్ళిచేసుకోవడం వంటివి పునరాలోచించవలసిన అవసరం ధనికులకే ఉంది. పేదవాళ్ళకు అది సంబంధం లేని విషయం. ఎలక్ట్రిక్ వాహనానికి మళ్ళాలన్నా దాన్ని కొనగలిగిన శక్తి ముందు ఉండాలి. ఇంటి నుంచి పనిచేయడం వైట్‌కాలర్ వృత్తి నిపుణులకు ఉన్న అవకాశం. దినసరి కార్మికులకు కాదు. వంట నూనె విలాసవంతమైన సరుకు కాదు. దాని వినియోగాన్ని తగ్గించుకోమనడం సాధా రణ ప్రజానీకానికి రుచించని విషయం. ప్రధాని అభ్యర్థనలలో కొన్ని సంపన్నులను దృష్టిలో పెట్టుకుని సరిగ్గా చేసినవే. మిగిలినవి మాత్రం దామాషాకు మించి త్యాగాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ దాదాపు 1,600 నుండి 1,700 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. గత పది వారాల్లో ఈ నష్టం ఒక లక్ష కోట్లు దాటింది. పెట్రోల్ మీద లీటరుకు రూ. 14, డీజిల్ మీద రూ. 18 చొప్పున నష్టం వస్తోంది. సామాన్యులపై భారం పడకుండా ఎక్సైజ్ సుంకంలో పెడుతున్న కోతల వల్ల కోశాగారానికి నెలకు రూ. 14,000 కోట్లకు పైగా ఖర్చవు తోంది. ఎరువులపై సబ్సిడీలు రూ. 1.71 లక్షల కోట్లుగా బడ్జెట్ వేసుకున్నారు. ఇప్పుడవి రూ. 35,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లను మించిపోయేవిగా ఉన్నాయి. బంగారం దిగుమతులు తగ్గించుకోవడం, విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవడం వంటివి కరెంట్ అకౌంట్‌కు నిజంగానే సహాయపడతాయి. కానీ, ఇంధన ధరల పెంపు పూర్తిగా భిన్నమైంది. అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ప్రభుత్వ ఆదాయ సమీకరణకు కూడా ఒత్తిడి పెరుగుతోంది. పన్నులు కట్టాలని ఆదాయ పన్ను శాఖ చేసిన డిమాండ్ కొన్ని అప్పీళ్లలో చెల్లుబాటు అయింది. దాని ప్రకారం రూ. 2.57 లక్షల కోట్ల వసూలుపై దృష్టి పెట్టవలసిందిగా 2026–27 ఆదాయ పన్ను శాఖ కేంద్ర కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తోంది. దీని ప్రకారం ‘పాన్’ కార్డులను ఆధారం చేసుకుని టాప్ 10 వేలమంది ఎగవేతదార్ల లావాదేవీలను పరిశీలిస్తారు. వర్గీకరించని బకాయిలు కూడా పెద్ద మొత్తంలో రూ. 7.88 లక్షల కోట్లుగా ఉన్నాయి. వాటిని జూలై నాటికి వర్గీకరించాలని నిర్ణయించారు. ముంబయ్ (రూ. 1.65 లక్షల కోట్లు), ఢిల్లీ (రూ. 1.21 లక్షల కోట్లు) వంటి మహా నగరాల నుంచే చాలా పన్నులు వసూలు కావలసి ఉన్నాయి. ఇలా బడా కంపెనీలు, పెద్ద మనుషుల నుంచి వసూలు కావలసిన పన్నులే రూ. 9 లక్షల కోట్ల మేరకు ఉండగా, వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవా లని ప్రభుత్వం ఎలా అడుగుతోంది? సమానత్వం లోపించిన నిరా డంబరత దేశభక్తి కిందకు రాదు.ఆదాయ మార్గాలుఅత్యధిక ఆదాయాలు ఉన్నవారిపై తాత్కాలికంగా సంక్షోభ సర్చార్జినీ, ప్రస్తుత కల్లోల పరిస్థితుల నుంచి లాభం పొందుతున్న కమోడిటీ ట్రేడర్లు, దేశీయ చమురు శుద్ధి కంపెనీలు వంటి సంస్థలపై విండ్‌ఫాల్ లెవీనీ విధించవచ్చు. సంపద పన్ను విధానాన్ని రూపొందిస్తే బహుళ ప్రయోజనాలు నెరవేరుతాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)లో సభ్యత్వం ఉన్న దేశాలు ఒడంబడిక నియమంగా 90 రోజులకు సరిపడ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వులు ఉంచు కుంటాయి. మన దేశ నిల్వలు ప్రస్తుతం సుమారు 9 నుంచి 10 రోజుల డిమాండ్‌ను తీర్చగలిగినవిగా మాత్రమే ఉన్నాయి. మొత్తం చమురు నిల్వలు (వాణిజ్యపరమైనవి, రిఫైనరీల వద్ద ఉన్నవి కూడా కలిపితే) దాదాపు 74–75 రోజులకు సరిపోవచ్చు. సమానత్వం విషయంలో నైతికంగా అభిశంసనకు తావులేనివి కాబట్టే, గాంధీజీ ఉద్యమాలు సఫలమయ్యాయి. ఇది భారతదేశపు ‘ఫారెక్స్’ సత్యాగ్రహమైతే, ఆశయానికి తగ్గట్లుగానే దాని రూప కల్పన కూడా ఉండాలి. భారాన్ని పంచుకోవడంలో అది ప్రగతిశీల మైనదిగా ఉండాలి. అమలులో నిష్కర్షత్వం చూపాలి. సంస్థాగత మైన విరుగుడు, ధరల పెంపుదలలో నిజాయతీ లేకుండా స్వచ్ఛందంగా ఎవరెంత సంయమనం పాటించినా ఫలితం ఉండదు. అజీత్ రానాడేవ్యాసకర్త ఆర్థికవేత్త (‘ద బిలియన్ ప్రెస్’ సౌజన్యంతో) -
నవ భారత యుద్ధ తంత్రం
భారతదేశ భద్రత, విదేశాంగ విధానా లలో ‘ఆపరేషన్ సిందూర్’ కీలక మలుపును సూచిస్తుంది. 1965, 1971 యుద్ధాలలో ఓడిపోయి, ప్రత్యక్షయుద్ధంలో భారత్‌ను ఎదుర్కోవటం అసాధ్యమని గ్రహించిన పాకిస్తాన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని తన విధానంగా మలుచుకున్నది. జియా ఉల్హక్ ‘బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్’ (వెయ్యి గాట్లతో భారత్‌ను గాయపరచటం) అనే సిద్ధాంతాన్ని అమలు పరిచాడు. అణ్వస్త్రాలను సమకూర్చుకున్నాక పాకిస్తాన్ ‘కత్తి–డాలు’ వ్యూహంలో భాగంగా ఒకవైపు ఉగ్రవాద మూకలను పెంచి పోషించి భారత్‌లో ఉగ్రవాద చర్యల ద్వారా అస్థిరతను కలుగజేస్తూ అణ్వస్త్ర ఛత్రం కింద రక్షణ తీసుకొన్నది. పాక్‌పై సైనిక చర్య/యుద్ధం ప్రారంభించాలంటే పాక్ అణ్వాయుధ దాడికి ఒడిగడుతుందా అన్న సందేహం, భారత్‌ను క్రమంగా ఆ న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌కు విరుగుడు చర్యలు తీసు కునేలా చేసింది. భారత్ బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరా లను లక్ష్యంగా చేసుకొని ఎల్ఓసీ దాటి ఉరి, బాలాకోట్‌లలో ఆప రేషన్లను సమర్థవంతంగా పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో పహల్ గామ్ దాడితో పాక్ నేరుగా భారత్‌కు సవాలు విసిరింది. పర్యవసా నంగా 2025 మే 7 తెల్లవారుఝామున 1 గంటకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. ఈ 88 గంటల దాడి ద్వారా పాకి స్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికీ ‘భారత్ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదనే’ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చి నట్లయింది. డీఆర్డీఓ, ఇస్రోలతో సమన్వయం!ఆపరేషన్ సిందూర్ మొదటి రోజున భారత వాయుసేన, సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు; పాకిస్తాన్లో నాలుగు; మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడి చేసింది. మురిడికేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యా లయాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులకు ప్రతిగా కశ్మీర్ నుండి కచ్ వరకు పాక్ భారీ స్థాయిలో దాడులు చేసింది. మే 9న ఢిల్లీ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఫత్తా క్షిపణితో దాడి చేయటం ద్వారా దుస్సాహసానికి ఒడిగట్టింది. దాంతో పాక్ న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్‌కు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత్ వ్యూహకర్తలు నిశ్చయించారు. మే 10న పాక్‌లోని 12 సైనిక స్థావరాలలో 20కి పైగా లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేయటంతో పాక్ దిక్కు తోచని పరిస్థితుల్లో సంధిని కోరటంతో ఆపరేషన్ సిందూర్ ముగిసింది. రావల్పిండిలో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, సిం«ద్ ప్రావిన్స్‌లోని భోలారి వైమానిక స్థావరం, ఎఫ్–16 యుద్ధ విమానాలుండే జాకోబాబాద్ వైమానిక స్థావరం, రహీమ్ యార్ ఖాన్ సైనిక స్థావరాలతో సహా పాక్‌లోని అన్ని ప్రధాన సైనిక స్థావరాలపై భారత్ కచ్చితత్వంతో దాడి చేసింది. రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌ల నుండి దిగుమతి చేసుకున్న సైనిక సామగ్రి, సైనిక పరిజ్ఞానాన్ని దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించటంలో డీఆర్డీఓ, ఇస్రో, భారత త్రివిధ దళాలు విజయవంతమయ్యాయి. భారత సైన్యం, వాయు సేన, నౌకా బలాలు పూర్తి స్థాయిలో సమీకృతం అయి ఆపరేషన్ సిందూర్‌ను సమర్థవంతంగా నడిపించాయి.ఆపరేషన్ సిందూర్‌లో తెరవెనుక కథ నడిపిన ఇస్రో పాత్రను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈ 88 గంటల దాడిలో మన సైనిక, గూఢచార ఉపగ్రహాలు కీలకమైన పాత్ర వహించాయి. కార్టోశాట్ ఛాయా చిత్రాల ద్వారా దాడుల కచ్చితత్వం నిర్ధారణ అయింది. వీటికి తోడు పాక్‌లో ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఉంచిన వీడియోలు దాడులకు మానవ నేత్రాన్నందించాయి. రిశాట్ ఉప గ్రహాలు శత్రువుల కదలికలపై రాత్రీ పగలు సమాచారాన్ని అందించాయి. జీశాట్ 7, 7ఏ ఉపగ్రహాలు... సైన్యం, వాయుసేన, నౌకా సేనల మధ్య సమాచారం, సమన్వయానికి సహకరించాయి. నావిక ఉపగ్రహ వ్యవస్థ, క్షిపణులను నేరుగా లక్ష్యాల వైపు మరల్చింది. సిందూర్ 2.0కు సిద్ధమా?పాక్, ఉగ్రవాద పంథాని వీడుతుందనుకోవటం భ్రమ. పాక్‌కు చైనా ఇంతవరకు క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమా నాలను సరఫరా చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో చైనా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా అందించింది. కానీ పూర్తి స్థాయిలో చైనా–పాక్ రక్షణ సైనిక వ్యవస్థలు ఒక్కటిగా పనిచేయలేదు. భవిష్యత్తులో చైనా–పాక్‌లను సమష్టిగా ఒకేసారి ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. పాక్ పెద్ద మొత్తంలో టర్కీ నుండి డ్రోన్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. టర్కీ కొద్ది రోజుల క్రితం ఆధునిక ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని ఆవిష్కరించింది. పాక్–టర్కీల మధ్య సైనిక వ్యవహారాలపై నిఘా ఉంచాలి. ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు, యూఎస్ఏ, ఇజ్రాయెల్‌లు డ్రోన్లు, క్షిపణుల కొరతను ఎదుర్కొంటు న్నాయి. ఇరాన్ ముందుచూపుతో పెద్ద మొత్తంలో డ్రోన్లు, క్షిప ణులను భూగర్భ బంకర్లలో నిలువ చేసుకొని అమెరికాను సవాలు చేయగలుగుతున్నది. చైనా–పాక్‌లతో యుద్ధం 88 గంటలు కాదు 88 రోజులుండవచ్చు. దీనికి సరిపడా డ్రోన్లు, క్షిపణుల తయారీ వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భాగంగా నిజానిజాలు తెలియజేయటానికి సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇల్లు కాలుతుంటే మంటలు ఆర్పటం కోసం బావి తవ్వటం లాగా సమాచారాన్ని అందించ టానికి అప్పటికప్పుడు ఎవరినో నియమించకూడదు. మన నిజం, శత్రువు అబద్ధాని కంటే ముందు ప్రపంచానికి తెలియాలి. వ్యూహంలో భాగమే ‘రింగ్’ అలర్ట్దీర్ఘకాల యుద్ధంలో జాతి మానసిక స్థితి కీలక పాత్రను పోషి స్తుంది. 1971 తరువాత ఇంతవరకు భారతదేశం గట్టి యుద్ధం చేయలేదు. 140 కోట్ల మంది భారతీయులలో సుమారు 88 శాతం మంది 1971 యుద్ధం తర్వాత జన్మించినవారే. వీరికి యుద్ధ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, యుద్ధం సందర్భంగా ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన గానీ, అంచనా గానీ లేవు. అందుకే గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యుద్ధ సమయంలో పౌర రక్షణకు సామాన్య పౌరులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి. క్షిపణి, డ్రోన్, వైమానిక దాడుల సైరన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇటీవల భారత ప్రభుత్వం పరీక్షించిన ‘సెల్‌ఫోన్ రింగ్ అలర్ట్’ ఈ వ్యూహంలో భాగమే. స్థానికంగా రక్షిత ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. శత్రువుల కదలి కల సమాచారాన్ని ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అందజేయ గలగాలి. ఉక్రెయిన్‌లో పౌరులకు డ్రోన్లను ఆపరేట్ చేయటంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధంలో సంభవించే నష్టానికి, కష్టాలకు ఓర్చు కొనే స్థైర్యాన్ని కూడా ప్రజలలో పెంపొందించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'రవాణాపై' పునరాలోచన అవసరం
పెరిగిపోతున్న వాహనాల రద్దీ, రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య, వాయు కాలుష్యం, తడిసి మోపెడవుతున్న చమురు దిగుమతి బిల్లు లాంటి సవాళ్ళతో సతమతమవుతూ మనం 2006 ఏప్రిల్‌లో ‘జాతీయ పట్టణ రవాణా విధా’నాన్ని (ఎన్‌యూటీపీ) రూపొందించుకున్నాం. వ్యక్తిగత మోటారు వాహనాల వాడకాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థల వైపు మొగ్గు చూపేటట్లు చేయడం, మోటారేతర ప్రయాణ పద్ధతులను అనుసరించేటట్లు చేయడం ప్రధాన లక్ష్యంగా ఆ విధానాన్ని తయారు చేశారు. దాని కనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థలపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. నడిచేవారికి, సైకిళ్ళపై వెళ్ళేవారికి సురక్షిత బాటలను కల్పించాలని నిర్ణయించారు. రోడ్లను విశాలం చేసేందుకు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కూడా పెట్టుబడులు తరలించారు. నిపుణులు, విద్యా వేత్తలు, పరిశ్రమకు చెందినవారు, ప్రభుత్వ అధికారులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వా తనే, ఆ విధానాన్ని రూపొందించారు. కేంద్ర మంత్రివర్గం 2006 ఏప్రిల్ 6న దానికి ఆమోద ముద్ర వేసింది. ఇరవై ఏళ్ల తర్వాత జరిగిందేమిటి?కాలక్రమంలో 20 ఏళ్ళు గడిచిపోయినా, ఆ లక్ష్యాలను అందు కోలేకపోయాం. చెప్పాలంటే, పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ప్రజా రవాణా వ్యవస్థలకు, మోటారేతర ప్రయాణ పద్ధ తులకు ఆదరణ పెరగకపోగా తగ్గింది. ఎవరి మోటారు వాహనా లను వారు ఉపయోగించడం ఎక్కువైంది. దేశంలో రిజిస్టరవుతున్న వాహనాల సంఖ్య పెరుగుతూండటమే అందుకు తిరుగులేని నిద ర్శనం. దేశంలో రిజిస్టరైన వాహనాల సంఖ్య 2005లో కేవలం 8.2 కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది 43.1 కోట్లకు పెరిగింది. మోటారు వాహనాల వాడకంలో వేగం విపరీతంగా పెరిగి, అనేక నగరాలలో గాలి స్వచ్ఛత క్షీణించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు స్వచ్ఛత పరిశీలనకు ఉన్నత స్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 2005లో 95,000 మేరకు ఉన్నది, 2022 నాటికి దాదాపు 1,65,000 లకు పెరిగింది. చమురు దిగుమతి భారం 2005లో రూ. 1.35 లక్షల కోట్లుగా ఉన్నది, 2025 నాటికి ఏకంగా రూ. 12.35 లక్షల కోట్ల మేరకు పెరిగింది. మనం ఎక్కడ పొరపడినట్లు? ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభుత్వం గణనీయంగా పెట్టుబడులు పెట్టడం ఈ విధానం తెచ్చిన సానుకూల ఫలితాల్లో ఒకటి. అయితే, హెచ్చు వ్యయదాయకమైన మెట్రో రైలు వ్యవస్థలపై పెట్టు బడులు పెట్టేసి చేతులు దులుపుకోవడంతో చిక్కు వచ్చినట్లు కనిపి స్తోంది. ప్రయాణికులు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్ళేందుకు ఆయా స్టేషన్ల నుంచి అనుబంధ సదుపాయాలు కల్పించడంపై పెట్టుబడులు లేవు. ఉదాహరణకు, 23 నగరాల్లో 1,016 కిలోమీటర్ల నిడివిన మెట్రో రైలు సదుపాయాలు కల్పించేందుకు దాదాపు రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. అవన్నీ కలిపి రోజుకు సుమారు 75 లక్షల మంది ప్రయాణికులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. పెట్టుబడులు బారెడు. ప్రయాణికులు చారెడు. నగరాలలో మెట్రో రైళ్ళను వాటికవి ఒంటరి రవాణా వ్యవస్థలుగా పరిగణించి, ఇతర రవాణా సదుపాయాలతో అనుసంధానపరచకపోవడంతో, ప్రయాణికుల సంఖ్య ఆశించినంతగా లేదు. ఫలితంగా, ప్రయాణికులు మళ్ళీ రవాణా సదుపాయాలను వెతుక్కోవాల్సి వస్తోంది.కొత్త చూపు అవసరంమోటారేతర రవాణా మౌలిక సదుపాయాల కల్పన కూడా చెదురుమదురుగా, అరకొరగా ఉంది. ప్రైవేటు రంగాన్ని తోడు చేసుకుని, బస్సు సదుపాయాలను మెరుగుపరచే ప్రయత్నాలు అంతగా కనిపించడం లేదు. చాలా నగరాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రవాణా సంస్థల బస్సులపైనే ఆధారపడుతున్నాయి. ఆ ‘బీద’ బస్సుల్లో ఎక్కడం కంటే, ప్రైవేటు వాహనాన్ని నడుపుకోగలిగిన స్తోమత ఉన్నవారు వాటిని సమకూర్చుకుంటున్నారు. వారు వాటిని పక్కనపెట్టేటట్లు చేసేంతగా ప్రీమియం సేవలు అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వ రవాణా సంస్థలు కాస్త ధర పెంచి అయినా, మెరుగైన సేవలను అందించేందుకు ముందుకు రావడం లేదు. ఒకటి రెండు చోట్ల ఆ దిశగా కదలిక కనిపించినా, పెద్దయెత్తున సరైన బస్సులు దర్శనమివ్వడం లేదు. విధానంలో రెండు రకాల లొసుగులు కనిపిస్తున్నాయి. విధానాన్ని రూపొందించిన నాటికన్నా తర్వాత సమస్య బాగా ముదిరింది. అప్పట్లో, నిర్దిష్ట సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల, కొన్ని మార్గదర్శక సూత్రాలు లోపించాయి. ఉదాహరణకు, పట్టణాల్లో వస్తు రవాణా వ్యవస్థలపై అప్పట్లో విధానం తగినంతగా దృష్టి సారించలేదు. ఇప్పుడు ఆన్లైన్ షాపింగులతో గడప వద్దకు వస్తువులు వచ్చే సౌకర్యం పెరిగింది. పార్కింగ్ సమస్య పట్ల కూడా ప్రభుత్వ విధానం తగినంతగా దృష్టి పెట్టలేదు. ఇంటి నుంచి లేదా ఆఫీసు నుంచి బస్టాండు లేదా రైల్వేస్టేషన్ వరకు వెళ్ళేందుకు అవసరమైన సదుపాయాలను అప్పట్లో అంత ముఖ్యమైనవిగా భావించకపోవడం వల్ల, విధాన రూపకల్పన సమయంలో, వాటి గురించి చర్చించవలసినంతగా చర్చించలేదు. అప్పట్లో మార్కెట్లో ఉబెర్, ఓలా లాంటివి లేవు. ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్లడంలో రవాణా మాధ్యమాలను మార్చుకోవడం కూడా 2000 మొదట్లో, ఇప్పుడైనంతగా, ప్రాచుర్యం పొందలేదు. ఈ మధ్యస్థ రవాణా సదుపాయాల అభివృద్ధిపై 2017లో వేరే విధానాన్ని రూపొందించారు. కొంత దూరం నడక సాగించి, తర్వాత, అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థలను వాడుకునేటట్లు చేసే సమూ హాలను సృష్టించడం ఆ విధాన వ్యూహాలలో భాగమైంది. సరఫరా వైపు తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రాథమికంగా దృష్టి పెట్టడం ప్రభుత్వ విధానంలోని మరో పెద్ద లొసుగు. రద్దీకి కారణ మవుతున్నందుకు కొంత రుసుము వసూలు చేయడం లేదా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరచేందుకు ఇతర పద్ధతులను అనుసరించడం వంటివి చేయలేదు. దీనికీ ఒక సబబైన కారణమే ఉంది. భారతదేశపు మోటారు వాహనాల పరిశ్రమ పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తోంది. వాహనాలపై ఆంక్షలు విధిస్తే, అనేక మంది పొట్టకొట్టినట్లవుతుంది. అయినా, దీనిపై పునరాలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది. జాతీయ రవాణా విధాన 20వ వార్షి కోత్సవ సమయంలో, కొత్త వాస్తవికతలను దృష్టిలో పెట్టుకుని, తాజాగా విధానాన్ని తయారు చేసుకోవడం అవసరం. సుస్థిరమైన, కాలుష్య రహిత టెక్నాలజీల వైపు మళ్ళవలసిన అవసరాన్ని చాటుతూ కొత్త సిఫార్సులను పొందుపరచుకోవాలి. – ప్రొ‘‘ ఓ.పి. అగర్వాల్ ‘ ‘ఐఎస్‌పీపీ సెంటర్ ఫర్ అర్బన్ ట్రాన్సిషన్స్’ డైరెక్టర్; లూయి మిరాండా ‘ ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’(ఐఎస్‌పీపీ) కో–ఫౌండర్, చైర్ పర్సన్; శ్రేయేశ్ జంగం ‘ ‘ఐఎస్‌పీపీ’ రిసెర్చ్ అసోసియేట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
విజయ్ చూపగల తేడా ఏమిటి?
సుమారు ఆరు దశాబ్దాల పాటు అవిచ్ఛి న్నంగా సాగిన ద్రవిడ పార్టీల రాజకీయ పరంపరను భంగపరచటం వరకు విజయ్ ప్రతిభ, ప్రభావం కనిపిస్తున్నవే. భవిష్యత్తు వైపు చూసినపుడు ఒక ప్రశ్న ముందుకు వస్తున్నది. తమిళనాడులో సమ సమాజ భావనలు, సంక్షేమ రాజ్య భావనలు దేశ స్వాతంత్య్రానికన్నా ముప్పయి సంవత్సరాల ముందు నుంచే వ్యవస్థీకృత రూపంలో ఏర్పడ్డాయి. అవి కొనసాగుతూనే బలమైన తమిళ జాతీయవాదం కూడా ఇంచుమించు అప్పటినుంచే రూపు తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికారం స్వీకరించిన విజయ్– సమ సమాజం, సంక్షేమం, తమిళ జాతీయవాదం అనే మూడు అంశాలలో చూపగల తేడా ఏమైనా ఉండవచ్చునా?సారాంశంలో ద్రవిడవాదమే!ఇందుకు సమాధానం విజయ్ నాయకత్వాన తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పాలనలో మాత్రమే లభించగలదని వేరే చెప్పనక్కర లేదు. తమిళ సమాజంలో ఈ భావనలు విడదీయలేని అంశాలు. క్రీస్తు పూర్వం నుంచి గల తమ భాషా సాహిత్యాలు, మధ్య యుగాల నాటి వైభవోపేత రాజ్యాలు, వాటి పాలనలు అందుకు తోడై తమిళ జాతి, సంస్కృతులను తీర్చిదిద్దాయి. స్వాతంత్య్రానంతరం రాజకీయ క్రమంలో ద్రవిడ పదం వాడుకలోకి వచ్చి, ఉత్తరాది అనే ఒక ‘ప్రత్యర్థి’ని సృష్టించి ధిక్కారంగా నిలిచింది. ఇపుడు విజయ్ పార్టీ పేరును, చెదురుమదురు వ్యాఖ్యలను, పార్టీ మేనిఫెస్టోను, 10వ తేదీన ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించిన దానిని బట్టి, గతంకన్న తేడాలు ఏమైనా ఉన్నాయనిపిస్తున్నదా? డీఎంకే, అన్నాడీఎంకే అనే రెండు ‘ద్రవిడ’ పార్టీలు ఓడినందున, ద్రవిడ వాదం ఇక ముగిసిపోయిందని, విజయ్ ఆ వాదనకు ముగింపు పలికారనే వ్యాఖ్యలు వెంటనే మొదలయ్యాయి. అవి తొందరపాటు మాటలనాలి. విజయ్ పార్టీ పేరులో ద్రవిడ అనే పదం లేకున్నా తమిళ అనే పదం ఉంది. అక్కడి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రపంచంలో ద్రవిడ–తమిళ పర్యాయ భావనలు. ఒకటి లేక రెండవ దాని మనుగడ లేదు.ద్రవిడ వాదానికి ప్రాణప్రదమైన అంశాలు వేటినీ విజయ్ వదలలేదు. తన ఆరాధ్యులలో పెరియార్ రామస్వామిని చేర్చారు. ద్రవిడ భావజాలంలో సమసమాజం, సంక్షేమం మొదటి నుంచి ఉన్నవి గనుక, అందుకు స్వాతంత్య్రానంతర కాలంలో ప్రధాన ప్రతి నిధి అయిన అంబేడ్కర్‌ను స్వీకరించారు. తమ చరిత్రలో సమాజం కోసం పాటుపడిన ఇద్దరు మహిళలు వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్లను ప్రముఖంగా నిలిపారు. దీనంతటి అర్థమేమిటో వేరే చెప్పనక్కర లేదు. పైగా, సంక్షేమ సంబంధమైన పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చిన ఆయన, ఆ విషయాలలో ‘ఎంత మాత్రం రాజీ పడబో’మని ప్రమాణ స్వీకార సందర్భంగా ప్రకటించారు. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆకలిదప్పుల బాధ తెలుసునని ముక్తాయించారు. సారాంశంలో ఇదంతా ద్రవిడవాదమే.సుపరిపాలన అందేనా?ఇది చాలదనుకుంటే, పెరియార్ రాజకీయ వైఖరిని, ద్రవిడ వాద రాజకీయ సంప్రదాయాన్ని విజయ్ స్పష్టంగానే కొనసాగిస్తు న్నారనుకోవాలి. నిజానికి డీఎంకే లోగడ (1999–2003) కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ భాగస్వామి కాగా, అన్నాడీఎంకే గురించి చెప్ప నక్కర లేదు. విజయ్ రాగల కాలంలో ఏమి చేసేదీ చెప్పలేముగానీ, ప్రచార సమయంలో మాత్రం బీజేపీ తన ‘సైద్ధాంతిక ప్రత్యర్థి’ అని ప్రకటించారు. సెక్యులరిజ విధానాన్ని నొక్కి చెప్పారు. ఇదంతా ఆధునిక పరిస్థితులకు వర్తించే పెరియారిజమే అవుతుంది. తన ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతుపై ఆధారపడి ఉన్నందుకు మాత్రమే విజయ్ ఇట్లా మాట్లాడుతున్నారనలేము. ఆయన మౌలిక విధానమే అదయినట్లు ఎన్నికల ప్రచారంలోనేగాక, రెండేళ్ల ముందు పార్టీని స్థాపించినప్పటినుంచే అర్థమైంది.పరిపాలనకు సంబంధించి విజయ్ చేసిన సూత్రీకరణలురెండున్నాయి. ఒకటి సమర్థమైన సుపరిపాలన, రెండు అన్ని వర్గాలకు మేలు కలిగే సంక్షేమం. ఈ రెండూ ద్రవిడ పార్టీల విధానాలలో ఉన్నవే. ఆచరణకు వచ్చే సరికి సుపరిపాలన క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. అవినీతి పెచ్చు పెరిగింది. డీఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా. అన్ని వర్గాల మేలన్నది దళితులకు అంతగా వర్తించలేదన్న విమర్శ చాలా కాలం నుంచే ఉంది. విడుదలై చిరుతగళ్ కచ్చి (వీసీకే) కొంత కాలంగా డీఎంకే కూటమిలో ఉన్నా, ఇపుడు విజ య్కు మద్దతు ప్రకటించినా ఆ పార్టీ మూలాలు ఈ విమర్శలోనే ఉన్నాయి. అటువంటి వివక్ష తమ పాలనలో ఉండబోదన్నది కొత్త ముఖ్యమంత్రి ఇస్తున్న హామీ. ఈ వివక్షల మూలాలు తమిళ గ్రామీణ వ్యవసాయిక వ్యవస్థలో, కుల వ్యవస్థలో ఉన్నందున, ఈ సమస్యను గ్రామీణ నిర్మాణాలలో గానీ, పట్టణాలు కేంద్రంగా నడిచే ఆధునిక ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ వ్యవస్థలలో గానీ విజయ్ ఏ విధంగా సరిదిద్దవచ్చునన్నది ఆయన శ్రద్ధపై, చతురతపై ఆధార పడుతుంది.అసలు సవాళ్లు హామీలే!సుపరిపాలనకు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్‌ను (1954–63) విజయ్ చూపటంలో ధైర్యం ఉంది. ప్రశంసించదగ్గదే గానీ, ద్రవిడ ఉద్యమం అట్లుండగా సంక్షేమ విధానాలకు పేరుబడిన అణ్ణాదురైను ముందుకు తేకపోవటం ఆశ్చర్యకరం. పార్టీ ఏదైనా కామరాజ్ వలెనే అణ్ణాదురై తమిళనాడు చరిత్రలో మార్గదర్శ కుడయ్యారు. అక్కడ ఫెడరలిజాన్ని స్థిరపరచి దీర్ఘకాలికం చేసింది కూడా ఆయనే. ప్రగతిశీలం కాదనుకున్న అంశాలపై తన గురువు పెరియార్‌తో విభేదించి సాగారు. తర్వాత డీఎంకే చీలి అన్నాడీఎంకే ఏర్పడినా రెండు పార్టీలకూ ఆరాధ్యుడయ్యారన్నది విజయ్‌కు తెలియదనుకోలేము.మౌలిక సూత్రాలపై, సిద్ధాంతాలపై ఎంతమాత్రం రాజీపడబోనని, రాజకీయాల మౌలిక బలమే అదని ఆలోచింపజేసే విధంగా ప్రకటించిన తమిళ జెన్–జీ తార విజయ్‌కు పెద్ద పరీక్ష మాత్రం మేనిఫెస్టోలోని ఆర్థిక సంబంధమైన హామీల అమలులో ఎదురు కానున్నది. ఆ హామీలలో ఎన్నికలలో గెలిచేందుకు అవసరమైన పోటాపోటీ పాప్యులిజం తక్కువ లేదు. వాటి అమలుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని గ్రహించినందువల్ల మొదటి రోజునే గత ప్రభుత్వం మిగిల్చిన రుణభారమంటూ మాట్లాడి, హామీలు క్రమక్రమంగా తప్పక అమలు చేయగలమనీ, తనను నమ్మాలనీ ప్రజలను కోరారు. అదే విషయమై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక హెచ్చరిక బాణాన్ని కూడా వెంటనే వదిలారు మరి.ఈ నిర్వచనాలు, సాధకబాధకాలు ఎట్లున్నా, ద్రవిడ వాదాన్ని లేదా తమిళవాదాన్ని వర్తమాన కాలానికి అవసరమనుకున్న రీతిలో మెరుగులు దిద్ది గత పరిపాలనలకు తన పాలనకు గల తేడా ఏమిటో విజయ్ నిరూపించగలరని ఆశించాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సంతోషపు లెక్కల్లో పాశ్చాత్యుల పొరపాటు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లేదా చైనాలను ‘నరక కూపాలు’ అని పిలిచినప్పుడు అందరికీ కోపం రావడం సహజం. కానీ ఒక శాస్త్రవేత్తగా నాకు అది కేవలం అమర్యాదగా మాత్రమే అనిపించలేదు, ఇదొక కొలమాన లోపం అనిపించింది. వాషింగ్టన్ ఇప్పటికీ 1950ల నాటి పాత ఆలోచనలతోనే ప్రపంచాన్ని చూస్తోంది. తాను ఎంత విద్యుత్తును వాడుతున్నాను అనే దానినే గొప్పగా భావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసలైన తృప్తిని అర్థం చేసుకోవడంలో పొరబడుతోంది. నేను 1982లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి పీహెచ్డీ పూర్తి చేసి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి వెళ్ళాను. కొన్ని దశాబ్దాలుగా నేను జీవితంలోని రెండు వేర్వేరు ‘ఆపరేటింగ్ సిస్టమ్స్‘ను గమనిస్తున్నాను. వాషింగ్టన్ చూసే కోణం కేవలం ఆర్థిక గణాంకాల చుట్టూనే తిరుగుతుంది తప్ప, మనిషి అనుభవాన్ని నిర్దేశించే అసలైన విషయాలను పట్టించుకోదు. ప్రపంచాన్ని ‘ఆనందపు సామర్థ్యం’ అనే కోణం నుండి చూస్తే, ఆనందం అనేది డబ్బు (జీడీపీ) వల్ల మాత్రమే రాదని అర్థమవుతుంది. అది ఒక సామాజిక నిర్మాణం. ఈ కోణంలో చూసి నప్పుడు, బయటకు ‘నరక కూపం’లా కనిపించే దేశాలే మనిషి సంతోషంగా ఉండటానికి అనువైన ప్రదేశాలుగా కనిపిస్తాయి.ప్రమాణాల్లో తేడా నెల్లూరు జిల్లాలోని అల్లూరు మా స్వగ్రామం. 1980లో బెంగళూరులో నా పీహెచ్డీ స్టైపెండ్ నెలకు ‘50 డాలర్లు’(400 రూపాయలు). అమెరికా లెక్కల ప్రకారం ఇది పేదరికం. కానీ అప్పట్లో వాస్తవం వేరేలా ఉండేది. నా గది అద్దె 4 డాలర్లు, మరో 16 డాలర్లతో రోజుకు నాలుగు పూటలా మంచి భోజనం దొరికేది. వైద్యం అందరికీ అందుబాటులో ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా, నా సొంత పనుల కోసం నేను ఎప్పుడూ శారీరక శ్రమ చేయలేదు. మధ్యతరగతి జీవితాల్లో పనివారు అనే వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన, ఒక ముఖ్యమైన భాగం. నేను అమెరికా వెళ్ళాక ఒక వింత పరిస్థితి చూశాను. చికెన్, గుడ్లు, కూల్ డ్రింక్స్ వంటివి చాలా చౌకగా దొరికేవి. కానీ నా ‘జీవన ప్రమాణం‘లో ఒక లోటు వచ్చింది. నా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవడం వల్ల నేను ఒక కూలీలా మారిపోయాను. వంట, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి పనులకు మనుషులు దొరకరు, దొరికినా చాలా ఖరీదు. భారత్‌లో మధ్యతరగతి మనిషి మేధస్సు ఇటువంటి పనుల నుండి విముక్తి పొంది ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో సంపద ఉండవచ్చు కానీ, అక్కడ ‘సమయం, సామాజిక లోటు’ ఎక్కువ.2026 నాటికి, ఒక సగటు అమెరికన్ ఒక భారతీయుడి కంటే 12 రెట్లు ఎక్కువ కరెంటు వాడుతున్నాడు. ఇంత కరెంటు వాడినంత మాత్రాన 12 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందా? నేను 1986లో కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. నా అపార్ట్మెంట్ మేనేజర్, ఒక మైలు దూరంలో మంచి షాపు ఉన్నా కూడా, ఐదు మైళ్ల దూరంలో ఉన్న ‘మరింత శుభ్రమైన‘ షాపుకు నన్ను కారులో తీసుకెళ్లాడు. అమెరికాలో పెట్రోల్, కరెంటు చౌకగా దొరుకుతాయి కాబట్టి, ఆనందాన్ని ఇవ్వని చిన్న చిన్న సౌకర్యాల కోసం వాటిని వృథా చేస్తారు. కానీ ఇండియాలో మనం సామీ ప్యతకు, సమాజానికి విలువ ఇస్తాం. మనకు సంతోషం మన దగ్గర్లోనే దొరుకుతుంది. తక్కువ వనరులను వాడుతూ ఎక్కువ ఆనందాన్ని పొందడంలో భారతీయులు ముందున్నారు.వలసల వెనుక అసలు నిజంవలసల మీద విమర్శలు చేసేవారు ఒక విషయం మర్చి పోతున్నారు: గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజాలను నడిపిస్తున్నది ఈ దేశాల మేధావులే. అమెరికా తన బయోమెడికల్ రంగం కోసం, టెక్నాలజీ కోసం ఈ దేశాల శాస్త్రవేత్తలపై ఆధార పడుతోంది. ఇవేమీ ‘లూప్‌హోల్’ వలసలు కాదు. ఇది వ్యూహాత్మక వనరుల సముపార్జన. వై2కే సంక్షోభ సమయంలో, డిజిటల్ మౌలిక సదుపాయాలు కుప్పకూలకుండా కాపాడుకోవడానికి అమెరికాకు భారతీయ ప్రతిభావంతులే అక్కరకొచ్చారు. అలాంటప్పుడు వాటిని ‘నరక కూపాలు’ అనడం అమెరికా తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే అవుతుంది.అమెరికా నేర్చుకోవాల్సింది ఎంతో!సైన్స్ పరంగా చూస్తే, నిరంతరం సౌకర్యాల మధ్య ఉండటం వల్ల అమెరికన్లలో ‘హెడోనిక్ నంబ్నెస్‘ (ఆనందాన్ని ఫీల్ అవ్వలేని తనం) ఏర్పడుతోంది. ఏసీలు, కార్లు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల వాటి వల్ల వచ్చే కిక్ (డోపమైన్, సెరోటోనిన్) తగ్గిపోతుంది. కానీ వనరులు తక్కువగా ఉన్న చోట ఆనందం ఎక్కువగా ఉంటుంది. 25 షర్టులు ఉన్నవాడికి 26వ షర్టు వల్ల వచ్చే ఆనందం కంటే, 5 షర్టులు ఉన్నవాడికి 6వ షర్టు వల్ల వచ్చే ఉత్సాహం చాలా ఎక్కువ. అలాగే అమెరికన్ మధ్యతరగతి మనిషి భారీ ‘ఆందోళన పన్ను‘ (యాంగై్జటీ ట్యాక్స్) కడుతున్నాడు. లక్ష డాలర్ల జీతం వచ్చినా, ఇన్సూరెన్స్ బిల్లులు, ఇతర సేవల కోసం అది ఖర్చయిపోయి చేతిలో ఏమీ మిగలదు. ఇండియాలో మనకు కుటుంబం అనే భావోద్వేగ అండ ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖరీదైన వ్యవస్థల కంటే, పక్కనే ఉండే కుటుంబ సభ్యులు మనకు ధైర్యాన్ని ఇస్తారు.ప్రపంచాన్ని కేవలం ఒకే కోణం నుండి చూడటం ఆపాలి. ఇల్లు ఎంత పెద్దది, ఎంత వాడుతున్నాం అనే లెక్కలతో చూస్తే భారత్, చైనాలు పేదవిగా కనిపించవచ్చు. కానీ వాటి దగ్గర లెక్కించలేని సంపద ఉంది– అదే ఆపదలను తట్టుకునే శక్తి, సామాజిక ఐక్యత.ఏ దేశాన్నయినా తక్కువ చేసి చూసే ముందు, సంతోషం అనేది ఆయా దేశాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. ఈ దేశాల నుండి పాశ్చాత్య దేశాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాషింగ్టన్ ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకుంటే, ముందు ఈ అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రపంచం నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
డాక్టర్ తమిళిసై (బీజేపీ) రాయని డైరీ
గెలవటం ఏముంది?! నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్లెవరైనా ఒక్క అంగలో గెలిచేస్తారు. కానీ గెలుపు కోసం పరుగు ఆపకపోవటమే నిజంగా గెలవటం! ఐదేళ్లయినా, పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా, గెలుపోటములను పక్కన పెట్టి ప్రజల కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుండే ‘అసాధారణ విజేతలు’ ఏ కొద్దిమందో ఉంటారు. ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, ఎంపీగా మూడు సార్లు... నేను గెలుపెరుగని పోరాటం చేశాను. అసాధారణ విజయం ఇది. అసాధారణ విజేతను నేను. భారత ఎన్నికల కమిషన్ అనొచ్చు, ‘‘ఎన్నికల్లో విజేతలు మాత్రమే ఉంటారు. మీరంటున్న అసాధారణ విజేతలు ఉండరు’’ అని! అందుకు ఎన్నికల కమిషన్ చెప్పే లెక్క ఇలా ఉండొచ్చు– ‘‘మైలాపూర్ నియోజక వర్గంలో టీవీకే నుంచి పి.వెంకట రమణన్, డీఎంకే నుంచి ధా.వేలు, బీజేపీ నుంచి మీరు, నామ్ తమిళర్ కచ్చి నుంచి అరుణ్ అయ్యంగార్ పోటీ చేశారు. వెంకట రమణన్‌కు 70,070 ఓట్లు, ధా.వేలుకు 41,098 ఓట్లు, మీకు 32,328 ఓట్లు, మీ తర్వాత అరుణ్ అయ్యంగార్‌కు 4,499 ఓట్లు వచ్చాయి. కనుక వెంకట రమణన్ మాత్రమే విజేత అవుతారు. మిగతా వారు పరాజితులు అవుతారు. అంతే తప్ప అసాధారణ విజేతలు అవరు’’ అని ఎన్నికల కమిషన్ అనొచ్చు.కమిషన్ దగ్గర ఓట్ల లెక్కలు మాత్రమే ఉంటాయి. ఆగని పరుగుల లెక్కలు, వెనక్కి వేయని అడుగుల జాడలు ఉండవు. 2006లో రాధాపురం నుంచి నా పరుగు మొదలైంది. అక్కడి నుంచి నార్త్ చెన్నై (2009), అక్కడి నుంచి వేలచ్చేరి (2011), అక్కడి నుంచి విరుగంపాక్కం (2016), అక్కడి నుంచి తూత్తుకుడి (2019), అక్కడి నుంచి సౌత్ చెన్నైల (2024) మీదుగా... మొన్నటికి మైలాపూర్ (2026). రాధాపురం, వేలచ్చేరి, విరుగంపాక్కం, మైలాపూర్ అసెంబ్లీ ఎన్నికలు; నార్త్ చెన్నై, తూత్తుకుడి, సౌత్ చెన్నై లోక్‌సభ ఎన్నికలు – మొత్తం ఏడు ఎన్నికలు... ప్రజల కోసం పరుగులు తీస్తూనే ఉండే అసాధారణ విజేతగా నన్ను నిలబెట్టాయి. ‘‘కానీ, అక్కా... మీరు అంత పెద్ద పోస్టును కూడా వదులుకొని ఎన్నికల్లో పోటీ చేయటానికి వచ్చేశారు కదా, అది కరెక్టేనా?’’ అంటుంటారు పార్టీ కార్యకర్తలు. ‘‘అంత పెద్ద పోస్టు!’’ అని వారు అంటున్నది నేను వదిలేసి వచ్చిన గవర్నర్ పదవి గురించి! తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఐదేళ్ల కాలం పూర్తి కాకుండానే తిరిగి నేను ప్రజల దగ్గరకు వచ్చేయటానికి నాకు నేనుగా పరుచుకున్న రెడ్ కార్పెట్ అది. మనసు ప్రజల కోసం ఆరాట పడుతున్నప్పుడు, రాజ్యాంగం ఎంతకాలమని ఒక మనిషిని రాజ్ భవన్లో బంధించి ఉంచుతుంది? నా దృష్టిలో గవర్నర్ కన్నా పెద్ద పోస్టు... ‘కార్యకర్త’ హోదా! వరుసగా ఏడుసార్లు ఓడిపోయిన వాళ్లకు ఈ భూమి మీద జీవించే హక్కు లేదన్నట్లే మాట్లాడుతుంటారు నా రాజకీయ ప్రత్యర్థులు! మరి, గెలిచాక ప్రజల మధ్య ఉండని వాళ్లకు ఏ స్వర్గంలో జీవించే హక్కు ఉంటుంది?! నా చేతిని అందుకోవటానికి ఒక్క చెయ్యీ ముందుకు రానప్పుడు, ఒక్క హృదయాన్నైనా నేను స్పృశించలేక పోయినప్పుడు... అప్పుడు కదా నిజంగా నేను ఓడిపోవడం!! వరుసగా ఏడుసార్లు ఓడిపోవటానికి, వరుసగా ఏడుసార్లు గెలవటానికి ఉండే ఒకే ఒక్క తేడా... సభలో ఒక సీటు వరుసగా ఏడుసార్లు ఖాళీగా ఉండటం లేదా సభలో ఒక సీటు వరుసగా ఏడుసార్లు ఖాళీగా లేకుండా ఉండటం మాత్రమే. సీటు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏడేడు కాలాలు స్థిరంగా ఉండేది... ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పబలం ఒక్కటే. ఆ బలమే నన్ను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పుడిక నా దిశ 2029 లోక్ సభ ఎన్నికలు! -
చిరు ప్రయత్నంతోనే ప్రయోజనకరం
చిరుధాన్యాలలో ఐరన్, జింక్, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ‘న్యూట్రి–సిరియల్స్’గా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ పోషకాలు కేవలం ఉంటే సరిపోదు; మన శరీరం వాటిని ఎంతవరకు గ్రహిస్తుంది అనేదే వాటి నిజమైన ఆరోగ్య ప్రయోజనాన్ని నిర్ణయిస్తుంది. చిరుధాన్యాలను సమకాలీన ఆహారంలోకి పెద్ద ఎత్తున తిరిగి ప్రవేశపెట్టేటప్పుడు ఈ తేడాను గమనించడం కీలకం.శుద్ధి చేయని, సరిగ్గా ప్రాసెస్ చేయని చిరుధాన్యాలలో ఫైటిక్ యాసిడ్ (మయో–ఇనోసిటాల్ హెక్సాకిస్ ఫాస్ఫేట్)తో పాటు టానిన్లు, పాలీఫెనాల్స్, ఎంజైమ్ ఇన్హిబిటర్లు గణనీయమైన స్థాయిలో ఉంటాయి. ఈ సమ్మేళనాలు విత్తనానికి సహజ రక్షణ యంత్రాంగా లుగా పనిచేస్తాయి, కానీ మానవ పోషకాహారానికి సవాళ్లను విసురుతాయి.ఐరన్, జింక్, కాల్షియంతో కలిసి ఫైటిక్ యాసిడ్ కరగని సమ్మేళ నాలను ఏర్పరుస్తుంది; తద్వారా ప్రేగులలో వీటి శోషణను గణనీ యంగా తగ్గిస్తుంది.ప్రోటీజ్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్లు ప్రోటీన్ జీర్ణ క్రియకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే టానిన్లు ఎంజైమ్ కార్యకలా పాలను, రుచిని తగ్గిస్తాయి. సజ్జలలో గోయిట్రోజెనిక్ పదార్థాలు ఉంటాయి. ఇవి అధికంగా తీసుకున్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణకు ఆటంకం కలిగించవచ్చు. కొన్ని చిరుధాన్యాలలో ఉండే అధిక ఆక్సలేట్ స్థాయులు, ఆ సమస్య ఉన్న వ్యక్తులలో మూత్రపిండాల రాళ్లకు దారితీయవచ్చు. కాబట్టి, ప్రాసెస్ చేయని చిరుధాన్యా లను నేరుగా తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలకు విరుద్ధంగా సూక్ష్మపోషకాల లోపాలు, జీర్ణకోశ అసౌకర్యం కలగవచ్చు.సాంప్రదాయక జ్ఞానం ఏం చెబుతోంది?జీవరసాయన ప్రాధాన్యత కలిగిన అనుభవపూర్వక జ్ఞానం ఇక్కడ అవసరం. చరిత్రవ్యాప్తంగా అన్ని సంస్కృతులలో, చిరు ధాన్యాల వినియోగానికి ముందు నానబెట్టడం, పులియబెట్టడం, మాల్టింగ్ (మొలకెత్తించడం), నియంత్రిత ఉష్ణ చికిత్స వంటి ప్రక్రియలు చేసేవారు. ఇవి కేవలం వంట పద్ధతులు మాత్రమే కాదు, జీవరసాయన పరంగా మార్పులు చేసే ప్రక్రియలు.నానబెట్టడం (హైడ్రేషన్ ఫేజ్) వల్ల ‘ఫైటేజ్’ అనే ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసి, ఫైటిక్ యాసిడ్‌ను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది.పులియబెట్టడం (మైక్రోబియల్ హైడ్రోలిసిస్) వల్ల లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పీహెచ్ స్థాయిని తగ్గించి, ఫైటేజ్ చర్యను పెంచుతుంది; పోషక వ్యతిరేక పదార్థాలను క్షీణింపజేస్తుంది. ఇక మాల్టింగ్ (మొలకెత్తించడం) ధాన్యంలోని ఎంజైమ్‌లను ప్రేరేపించి, ఫైటిక్ యాసిడ్‌ను 50% వరకు తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. ఉడికించడం (హైడ్రోథర్మల్ ప్రాసెసింగ్) పిండి పదార్థ నిర్మాణాన్ని మారుస్తుంది; పోషక వ్యతిరేక సమ్మేళనాలను బలహీన పరుస్తుంది, తద్వారా పోషకాల లభ్యతను పెంచుతుంది.దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న సంప్రదాయ వ్యవస్థలు ఈ విషయంలో ధ్రువీకరించబడిన నమూనాలను అంది స్తాయి: తమిళనాడు (కూజ్), అరకు లోయ (అంబలి) ప్రాంతాల్లో పులియబెట్టిన చిరుధాన్యాల జావలు జీర్ణశక్తిని, ప్రోబయోటిక్ ప్రయోజనాలను మెరుగుపరుస్తాయని నిరూపితమైంది. రాయల సీమ (రాగి సంగటి – అంబలి)లో చేసేవిధంగా ప్రత్యేకమైన ఆవిరి పద్ధతి, వండిన తర్వాత పులియబెట్టడం వల్ల నానబెట్టకపోయినా పోషక వ్యతిరేక పదార్థాలు తగ్గుతాయి. ఆఫ్రికన్ వ్యవస్థల్లో (ఇంజెరా, ఉజీ, హౌసా కోకో) సుదీర్ఘకాలం (2–3 రోజులు) పులియబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ సమర్థవంతంగా తొలగిపోతుంది, ఖనిజాల లభ్యత పెరుగుతుంది. చిరుధాన్యం ఆరోగ్య ప్రదాయినిగా పని చేస్తుందా లేదా పోషకాహార భారంగా మారుతుందా అనేది దానిని మనం చేసే ‘ప్రాసెసింగ్’ మాత్రమే నిర్ణయిస్తుందని ఈ పద్ధతులు నొక్కి చెబుతున్నాయి.ఐరోపాలో మొక్కజొన్నను ప్రవేశపెట్టినప్పుడు దేశీయ ప్రాసె సింగ్ పద్ధతులను అనుసరించకపోవడం వల్ల, నియాసిన్ లోపం ఏర్పడి ‘పెల్లాగ్రా’ వ్యాధి వ్యాపించింది. ఈ చారిత్రక ఉదాహరణ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది: ఆహార వ్యవస్థలను వాటి సంప్రదాయ జ్ఞాన చట్రం నుండి వేరు చేస్తే ఆరోగ్యపరమైన విపరిణామాలు తప్పవు.సైన్స్‌తో కూడిన ఆచరణసురక్షితమైన, ప్రభావవంతమైన చిరుధాన్యాల వినియోగం కోసం ఈ మార్గదర్శకాలు పాటించడం మేలు.1. నానబెట్టే ప్రోటో కాల్: తృణధాన్యాలను 8–24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని పారబోయాలి. ఇది ఫైటిక్ యాసిడ్ విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. 2. పులియబెట్టే వ్యూహం: చిరుధాన్యాల పిండి లేదా జావలను రాత్రంతా పులియబెట్టాలి (పెరుగు లేదా మజ్జి గతో). ఇది పోషక వ్యతిరేక పదార్థాల విచ్ఛిన్నతను పెంచుతుంది.3. మాల్టెడ్/మొలకెత్తిన ఉత్పత్తుల వాడకం: వాణిజ్యపరంగా లేదా ఇంట్లో తయారుచేసిన మొలకెత్తిన చిరుధాన్యాల పిండి సులభంగా జీర్ణమవుతుంది, ఖనిజాలను శరీరానికి అందిస్తుంది.4. హైడ్రో థర్మల్ పద్ధతులు: ప్రెజర్ కుక్కర్ కంటే ఆవిరి మీద ఉడికించడం లేదా నెమ్మదిగా ఉడికించే పద్ధతులను ఎంచుకోవాలి.మరికొన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రోజువారీ తినడం సుమారు 50–60 గ్రాములకు పరిమితం చేయాలి. ఇవి అన్ని రకాల తృణధాన్యాలకు ప్రత్యామ్నాయం కాకూడదు. చిరు ధాన్యాలు బియ్యం లేదా గోధుమలకు తోడుగా ఉండాలి తప్ప, వాటిని పూర్తిగా భర్తీ చేయకూడదు. థైరాయిడ్ సమస్యలు, ఐబీఎస్, కిడ్నీలో రాళ్లు లేదా దీర్ఘకాలిక జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి.నానబెట్టడం, పులియబెట్టడం, నెమ్మదిగా ఉడికించడం ‘పాసివ్ బయో కెమికల్ ప్రాసెసింగ్’ రూపాలు. ఇక్కడ ఎంజైమ్, సూక్ష్మ జీవుల వ్యవస్థలు ‘ముందస్తు జీర్ణక్రియ’ను నిర్వహిస్తాయి. తయారీ సమయాన్ని తగ్గిస్తే, ఆ జీర్ణక్రియ భారం మానవ శరీరంపై పడుతుంది. ఇంకా దీర్ఘకాలిక జీవక్రియ, అంతస్స్రావ ప్రభావాలపై క్లినికల్ అధ్యయనాలు జరగవలసే ఉంది. నేషనల్ ఇన్‌స్టి్టట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంప్ర దాయ జ్ఞానాన్ని ఆధునిక పోషకాహార విజ్ఞానంతో అనుసంధానించే పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఇంత ఓపిక ఎక్కడిది?మీరు ఆత్రుతలో ఉన్నప్పుడు ఓపికగా ఎలా ఉండాలి? ఆఫీసుకి వెళ్లే ముందు చిరుధాన్యాలను నానబెట్టండి. మీరు 8–10 గంటల తర్వాత వచ్చేసరికి ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి, అవి వండుకోవ డానికి సిద్ధంగా ఉంటాయి. రాత్రి భోజనం తర్వాత చిరుధాన్యాలను వండి, మట్టి పాత్రలో కొద్దిగా మజ్జిగ పోసి ఉంచండి. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అంబలి సిద్ధంగా ఉంటుంది. ఆదివారం నాడు చిరు ధాన్యాలను నానబెట్టి, ఎండబెట్టి పిండి పట్టించుకోండి. ఇది వారం అంతా పోషకాలతో సిద్ధంగా ఉంటుంది. పడుకునే ముందు ఎలక్ట్రిక్ స్లో కుక్కర్లో పెడితే, ఉదయాన్నే క్రీమీగా ఉండే జొన్న లేదా కొర్రల జావ సిద్ధమవుతుంది. వారాంతంలో మొలకెత్తించే ప్రక్రియ చేపట్టండి. వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పని దినాల్లో 50% వేగంగా ఉడుకుతాయి. నానబెట్టడాన్ని అదనపు పనిగా భావించొద్దు. ఇది ‘పాసివ్ కుకింగ్’ అని గుర్తించండి. నీరు, సమయం మీ కోసం పని చేస్తున్నాయని గ్రహించండి. చిరుధాన్యాలు సహజంగా గొప్పవి లేదా తక్కువవి కావు– అవి మనం వాడే విధానంపై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రాసెసింగ్ ద్వారానే వాటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. – డా‘‘ కె. నాగయ్య ‘ చీఫ్ సైంటిస్ట్, సీఎస్ఐఆర్–ఐఐసీటీ, హైదరాబాద్;– ఫణిరాజ్ జి. ‘ ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్ఏ -
యూఏఈ నిష్క్రమణతో మనకేంటి?
పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైదొలగడం వెనుక సుదీర్ఘ ఒడుదుడుకుల చరిత్ర ఉంది. అబు ధాబీ నిర్ణయంపై మన దేశంలో సంతోషం వెల్లివిరియడం అపరిణతిని సూచిస్తోంది. అబు ధాబీ ఒక అమీరాత్గా ‘ఒపెక్’లో 1967లో చేరింది. యూఏఈ 1971లో ఏర్పడింది. ‘ఒపెక్’ కార్టెల్‌లో చేరిన ఆది నుంచీ అది నిర్ణయించే ఉత్పత్తి పరిమితికి యూఏఈ కట్టుబడిన దాఖలాలు లేవు. దుబాయ్ 1970లలో నేటిలా టూరిస్టు కేంద్రంగా ఏమీ లేదు. యూఏఈకి దుబాయ్ పెట్రోలియం కంపెనీ ముఖ్య ఆదాయ వనరుగా ఉండేది. యూఏఈపై ‘ఒపెక్’ విధించిన కోటాలకు కట్టుబడి ఉండేందుకు అది తిరస్కరించేది. కనుక, యూఏఈ ‘ఒపెక్’ లోపల ఉన్నా బయట ఉన్నా కార్టెల్‌కు వచ్చిన తేడా ఏమీ లేదు. ఇది భారతదేశపు చమురు విధాన నిర్ణేతలు గుర్తించడం ముఖ్యం. ర్యాంకింగులు, ఉత్పత్తి శాతాల పరామితులకు ప్రాధాన్యం లేదు. కనుక, ‘ఒపెక్’ నుంచి వైదొలగాలని యూఏఈ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆ కార్టెల్ బలహీనపడుతుందనుకోవడం భ్రమ.ధరలేం పడిపోవు!యూఏఈకి చెందిన మొదటి పెట్రోలియం–ఇంధన వనరుల మంత్రి మానా సయీద్ అల్ ఓతైబా 1982లో వియన్నాలో ‘ఒపెక్’ 63వ మంత్రుల స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించి తిరిగి వచ్చాక, ఈ వ్యాసకర్తను, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న మరో ఇద్దరు జర్నలిస్టులను పిచ్చాపాటీగా మాట్లాడేందుకు పిలిపించారు. వియన్నా సమావేశం గురించి అడిగినపుడు, అది ఏదైనా ఫలితాన్ని ఇస్తుందని తాను అనుకోవడం లేదని పెదవి విరిచారు. ‘ఒపెక్’ సమావేశం నుంచి తెచ్చిన వాటిలో రెండు కాగితాలను బయటకు తీశారు. రెండు కాగితాల్లోనూ వట్టి గీతలతో(డూడుల్స్) వేసిన బొమ్మలున్నాయి. ఓతైబా చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకే మంత్రి అయ్యారు. మంత్రి కాకముందు నుంచే ఆయనకు అలా బొమ్మలేసే, కవిత్వం రాసే అలవాటు ఉంది. ‘ఒపెక్’ సమావేశాలకు హాజరైనా, వక్తలు చెప్పేది నిరాసక్తంగా ఉన్నప్పుడు ఆయన తన వ్యాపకాన్ని కొనసాగించారన్నమాట!‘ఒపెక్’ చాలా సార్లు చీలికలను ఎదుర్కొంది. ‘ఒపెక్’ తన సభ్య దేశాల చమురు ఉత్పత్తిపై పరిమితి విధించేందుకు 1986లో జరిపిన మంత్రుల స్థాయి సమావేశాలన్నీ వివాదాస్పదంగానే ముగిశాయి. జెనీవాలో జరిగిన సమావేశం నుంచి ఓతైబా వాకౌట్ కూడా చేశారు. ‘ఒపెక్’లోని అభిప్రాయ భేదాల వల్ల ఆ ఏడాది (1985లో) చమురు ధరలు పీపాకు 24.51 డాలర్ల నుంచి 9.25 డాలర్లకు తగ్గాయని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్న రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ, ‘ఒపెక్’ దుకాణం ఏమీ మూత పడలేదు. కనుక, ఇపుడు యూఏఈ వైదొలగడాన్ని కార్టెల్‌కు దెబ్బగా అభివర్ణించలేం. చమురుకు సరైన ప్రత్యామ్నాయాలు వాడుకలోకి వచ్చే రోజు వస్తే తప్పించి, కేవలం ‘ఒపెక్’లో విభేదాల వల్ల, చమురు ధరలు మళ్ళీ పీపాకు 9.25 డాలర్లకు పడిపోతాయని భావించడంకన్నా నిర్హేతుకమైనది మరొకటి ఉండదు. వాళ్ల ప్రయోజనాలే వాళ్లకు ముఖ్యంయూఏఈతో స్నేహ సంబంధాల వల్ల భారత్ చమురు నిల్వలను పెద్ద యెత్తున పక్కన పెట్టుకుంటుందనే అభిప్రాయాన్ని ఇటీవల కలిగించారు. అబుధాబీ తన ఇంధన విధానాలను భారత దేశానికి అనువుగా రూపొందించుకుంటుందనే అభిప్రాయాల బూజు ఏమైనా ఉంటే దులిపేసుకోవడం మంచిది. అది దాని ప్రయోజనాలను కాపాడుకునే విధంగా విధానాలను రూపొందించు కుంటుంది. అబు ధాబీ ఇందన సంస్థల రంగం ఏకశిలా సదృశం కాదను కునే విషయంలోనూ భారత్‌లో అవగాహన అంతంతే. అది 1970 మధ్య నుంచే ఏకశిలా సదృశంగా లేదు. అప్పట్లో పెట్రోలియం మంత్రిత్వ శాఖను, అబు ధాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్)ని వేరు చేశారు. చమురు, ఇంధన వాయు కలాపాలకు ‘అడ్నాక్’ బాధ్యత వహిస్తే, చమురు విధానాలను మంత్రిత్వ శాఖ నిర్ణయించేది. ఇపుడు సుల్తాన్ అల్ జబేర్ గ్రూప్ సి.ఇ.ఓ.గాను, ‘అడ్నాక్’ మేనేజింగ్ డైరెక్టర్‌గాను రెండు బాధ్యతలనూ నిర్వహిస్తున్నారు. అల్ జబేర్‌తో భారత్ చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేగానీ, ‘ఒపెక్’ నుంచి వైదొలగిన యూఏఈ నుంచి తాను కచ్చితంగా ఏమి ఆశిస్తు న్నదన్న విషయంలో భారతదేశానికి స్పష్టత అవసరం. యూఏఈ–సౌదీ కవల సోదరులుఅమెరికా–ఇరాన్ మధ్య సైనిక ప్రతిష్టంభన ముగిసేవరకు, ఒపెక్‌కు యూఏఈ గుడ్ బై చెప్పినంత మాత్రాన, భారత్ వంటి అధిక ఇంధన వినియోగ దేశాలకు కలిగే మార్పులు ఏమీ ఉండవు. సైనిక ప్రతిష్టంభన వల్ల హార్మూజ్ గుండా ముడి చమురు రవాణా తక్కువగా ఉంది. హార్మూజ్ జలసంధితో పని లేకుండా, యూఏఈ చమురు ఎగుమతి చేయాలంటే, దాని అమీరాత్లలో ఒకటైన ఫుజైరాహ్ నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ, ఫుజైరాహ్ రేవుకు ఉన్న పైపు లైనులు రోజుకు 1.8 మిలియన్ల పీపాల చము రును మాత్రమే నిర్వహించగలవు. దానిలో ఎంత మొత్తాన్ని యూఏఈ మనకు విక్రయిస్తుంది? యూఏఈ నుంచి చమురు కొంటున్నది మనం ఒక్కళ్ళమే కాదుగా! యూఏఈ మీద పెట్టుకున్న ఆశలలో భారత్ ఈ కీలక పరిమితిని లెక్కలోకి తీసుకుందా? అంతిమంగా, అమీరాత్లు, సౌదీలు ‘సోదరులు’. భారతీయులు, చైనీయులు, జపానీయులు వారికి ‘స్నేహితులు’ మాత్రమే. యూఏఈ, సౌదీ అరేబియాల మధ్య తగవులు ఉన్నా అవి కవలల వంటివి. యూఏఈ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వాటి తాజా వార్షిక చమురేతర వాణిజ్యం మొత్తం 41.3 బిలియన్ల డాలర్లుగా ఉంది. సౌదీకి యూఏఈ రెండవ పెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి దారు. యూఏఈలో సౌదీ పెట్టుబడులు 4.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉన్నాయి. ఒకప్పుడు మూడు గల్ఫ్ దేశాలు ఖతర్ బహి ష్కరణకు ఊహించని రీతిలో ముగింపు పలికినట్టే... యూఏఈ –సౌదీ మధ్య విభేదాలు కూడా ఏదో దశలో సమసిపోతాయి. భారత్ తన విధానాల రూపకల్పనలో ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.కె.పి. నాయర్వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల నిపుణుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భద్రతా వ్యూహం... గ్రేట్ నికోబార్
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి మెగా ప్రాజెక్టుకు ఎట్టకేలకు 2026 ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యు నల్ (ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది. దీనిపై వస్తున్న విమర్శలకు సమాధానమా అన్నట్లు, మే 1న ప్రభుత్వం ప్రశ్నలు – సమాధానాలను విడుదల చేసింది. బంగాళాఖాతంలో 467 కి.మీ. పొడవున ఉత్తర దక్షిణంగా విస్తరించిన 836 దీవుల సమూహమే అండమాన్–నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ ద్వీప సమూహంలో పూర్తి దక్షిణంగా ఉన్న దీవి గ్రేట్ నికోబార్. భారతదేశపు దక్షిణ బిందువు ఇందిరా పాయింట్/ పిగ్మాలియన్ పాయింట్ నికోబార్ చివరి ప్రాంతం. ఈ దీవులు భారతదేశంలో భాగమయినప్పటికీ, మయన్మార్, ఇండోనేషియాలకు దగ్గరగా ఉన్నాయి. ఉత్తరాన అండమాన్ దీవుల నుండి కేవలం 55 కి.మీ. దూరంలో మయన్మార్‌కు చెందిన కోకో దీవులున్నాయి. దక్షిణాన గ్రేట్ నికోబార్ దీవుల నుండి 150 కి.మీ. దూరంలో ఇండోనేషియా ఆబే దీవులున్నాయి. గ్రేట్ నికోబార్‌లోని గలాతియా నుండి కేవలం 74 కి.మీ. దూరంలో కీలకమైన మలక్కా జలసంధి ఉన్నది.నీతి ఆయోగ్ 2021లో గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదించింది. భారత ప్రభుత్వం 2025లో రేవుపట్టణ ఆధారిత అభివృద్ధిని ఉద్దేశించి ప్రారంభించిన ‘సాగర్మాల’ బృహత్ ప్రణాళికలో ఈ పథకం ఒక భాగం. 166 చ.కి.మీ విస్తీర్ణంలో గ్రేటర్ నికోబార్ సమగ్ర అభివృద్ధికి మూడు దశలలో 81,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2047 కల్లా పూర్తి చేయాలని ఈ పథకాన్ని ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా నాలుగు భాగాలున్నాయి. 1. గలాతియా బే ఇంటర్నేషనల్ కంటెయినర్ ట్రాన్స్పోర్ట్ టర్మినల్ (ఐసీటీటీ). 2. గ్రేట్ నికోబార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 3. గ్యాస్–సౌర ఆధారిత విద్యుచ్ఛక్తి కేంద్రం (450 ఎంవీఏ). 4. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులు. నౌకల మరమ్మత్తు, స్వేచ్ఛా వాణిజ్య మండలం ఏర్పాటుకూ వీలు కల్పించారు.విమర్శలు దేనికి?ప్రాజెక్టుకు అవసరమైన 166 చ.కి.మీ. భూభాగంలో సుమారు 131 చ.కి.మీ. అటవీ ప్రాంతం దట్టమైన సతత హరితారణ్యాలతో కూడి ఉన్నది. సుమారుగా 7.2 లక్షల వృక్షాలను నరికివేయాల్సి ఉంటుంది. తీరంలోని 20 వేల ప్రహళ సమూహాల (కోరల్ కాలనీస్)పై దుష్ప్రభావముంటుంది. అరుదైన సముద్ర తాబేళ్లకు ఈ దీవి తీరం బ్రీడింగ్ గ్రౌండ్. నిర్మాణ కార్యకలాపాల వలన ఈ సముద్ర తాబేళ్ళు అంతరించి పోవచ్చును. గ్రేట్ నికోబార్ దీవులు అంతరించిపోతున్న షాంపేన్, నికోబా రీస్ ఆదిమ తెగలకు ఆవాసం. వీరిని పర్టిక్యులర్లి వల్నేరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)గా గుర్తించారు. దీవుల అంతర్భాగంలో సుమారుగా 200–300 మంది షాంపేన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. తీరానికి దగ్గర్లో 1000–1100 మంది నికోబారీస్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఆధునిక నాగరికత ఛాయ కూడా పడకుండా వేల సంవత్సరాల జీవన విధానాన్ని వారు కొనసాగిస్తున్నారు. వీరు నివసిస్తున్న 751 చ.కి.మీ. ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్‌గా ప్రకటించారు. సుమారు 84 చ.కి.మీ. ట్రైబల్ రిజర్వ్ ప్రాంతం ప్రస్తుత ప్రాజెక్టు పరిధిలోనికి వస్తుంది. ఈ ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్ నుండి డీనోటిఫై చేయాల్సి ఉంటుంది. భూభౌతిక శాస్త్ర పరంగా ఆలోచిస్తే ఈ దీవి భూకంప ముప్పు అధికంగా ఉండి విస్తృత నిర్మాణ కార్య కలాపాలకు అనువయినది కాదు. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 6.5 లక్షల మంది స్థానికేతరులు అదనంగా రావటంతో స్థానిక తెగల సంస్కృతికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిమే 1న ఎఫ్ఏక్యూ రూపంలో ప్రభుత్వం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ప్రాజెక్టులో జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ, స్థానిక తెగల సంరక్షణ అంశాలను సమీకృతం చేసినట్లుగా పేర్కొన్నది. హిందూ మహాసముద్రంలో విదేశీ నౌకా శక్తులను ఎదుర్కోవటానికి గ్రేట్ నికోబార్ దీవిలో శాశ్వత సైనిక బలం అవసరాన్ని నొక్కి వక్కా ణించింది. ప్రభావితమయ్యే అటవీ భూమి విస్తీర్ణం (131 చ.కి.మీ.) మొత్తం అండమాన్–నికోబార్ దీవుల విస్తీర్ణంలో 1.82 శాతమే. దీనికి ప్రతిగా మధ్యప్రదేశ్, హరియాణాల్లో కొత్తగా అడవుల పెంప కాన్ని ప్రతిపాదించింది. ఆదిమ తెగలను వారి నివాస ప్రాంతాల నుండి తరలించాల్సిన ఆవశ్యకత లేదని భరోసా ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ పట్టించుకోని అభివృద్ధి నిలకడగా ఉండ దనేది నిర్వివాదాంశం. పర్యావరణానికి ఏమాత్రం హాని కలుగకుండా అభివృద్ధి సాధ్యపడదనేది కూడా వాస్తవం. స్థానిక అభివృద్ధి పథకాలను మదింపు చేసేటప్పుడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోణంలో నుండి పరిశీలించటం అభిలషణీయం కాదు. దేశ ప్రయో జనాల కోణం నుండే విశ్లేషించాలి. పాశ్చాత్య దేశాల అండతో నడిచే కొన్ని పర్యావరణ స్వచ్ఛంద సంస్థలు ప్రపంచ దేశాలలో అభివృద్ధికి మోకాలడ్డిన సందర్భాలు చాలా ఉన్నాయి. సంతులిత, నిలకడ కలిగిన అభివృద్ధి దిశగా భారత్ తనదైన శైలిలో అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు కీలకం?గలాతియాలో నిర్మించే రేవు పట్టణం సాధారణ నౌకాశ్రయం కాదు. ఇది ట్రాన్షిప్మెంట్ పోర్ట్ – అతి పెద్ద కంటెయినర్షిప్పుల నుండి సరకులను చిన్న చిన్న షిప్పులలోకి మార్చే సదుపాయం ఉంటుంది. భారీ కంటెయినర్ నౌకలు లంగరు వేయటానికి మన పోర్టులలో అవకాశం లేదు. అందువలన మన రేవులలో ఎగుమతి– దిగుమతి చిన్న నౌకలలోనే జరుగుతుంది. మన రేవులలో చిన్న నౌకలలోనికి ఎక్కించబడిన సరకులు కొలంబో, సింగపూర్, క్లాంగ్ (మలేషియా) ట్రాన్షిప్మెంట్ పోర్టులలో పెద్ద కంటెయినర్ షిప్పుల లోకి ఎక్కించబడుతున్నది. సాలీనా సుమారు 200–200 మిలియన్ డాలర్లను మనం చెల్లించాల్సి వస్తున్నది.ఏప్రిల్ 2024న కేరళలోని విజింజామ్లో మొదటి ట్రాన్షిప్మెంట్ పోర్టును ప్రారంభించారు. కానీ ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి 5 గంటల కాలం పడుతుంది. కొలంబో కేవలం అర గంట దూరంలో ఉన్నది. గ్రేట్ నికోబార్‌లోని గలాతియా ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి అరగంట దూరంలో ఉండటం వలన కంటెయినర్ ట్రాన్షిప్మెంట్ పోర్టుకు అత్యంత అనుకూలం. హిందూ మహాసముద్రంలో అండమాన్–నికోబార్ దీవులను భారత్‌కు మొదటి రక్షణ శ్రేణిగా పరిగణించవచ్చు. సముద్రం గుండా వచ్చే దాడిని ఎదుర్కోవాలంటే అండమాన్–నికోబార్‌లో మన సైనిక శక్తిని కేంద్రీకరించాల్సిందే. ఈ వ్యూహంలో భాగంగానే అండమాన్‌లో మొట్టమొదటి ట్రైసర్వీస్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తర అండమాన్ నుండి గ్రేట్ నికోబార్ వరకు వరుసగా సైనిక–పౌర ఎయిర్–ఫీల్డ్స్, రేవు పట్టణాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్న కాంప్‌బెల్ బేలోని ఐఎన్ఎస్ బాజ్, గలాతియాలోని చింగాన్ ఎయిర్‌ఫీల్డ్‌లు మలక్కా జలసంధిపై నిరంతర నిఘా నేత్రంగా పని చేయనున్నాయి. ఉత్తర అండమాన్ సమీ పంలోని మయన్మార్‌కు చెందిన కోకో దీవిలో చైనా సైనిక కదలికల సమాచారం అందుతున్నది.అవునన్నా కాదన్నా భారత్‌కు చైనానే ప్రధాన వైరి దేశం. చైనా ఆర్థిక, వాణిజ్య వ్యవస్థకు కీలకం మలక్కా జలసంధి. చైనా చమురు, ఇతర దిగుమతులంటూ సుమారుగా 80 శాతం మలక్కా జలసంధి ద్వారానే జరుగుతుంది. మలక్కాను దిగ్భందిస్తే చైనా ఆర్థిక వ్యవస్థను దిగ్భదించినట్లే. చైనా ప్రధాని హ్యూ జింటావో 2003లోనే దీన్ని ‘మలక్కా డైలమా’గా గుర్తించాడు. మలక్కాను దిగ్భందించే అవసరం/ సత్తా యూఎస్ఏ, జపాన్ లేదా భారత్‌లకు మాత్రమే ఉన్నది. లద్ధాఖ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ (హిమాలయా)లలో చైనా కవ్వింపులకు సరైన సమాధానం అండమాన్–నికోబార్ల నుండే జరగాలి. అరుణాచల్‌ప్రదేశ్‌లో సరైన రవాణా, విద్యుత్, సమాచార, సైనిక సదుపాయాల లేమి వలన 1962 యుద్ధంలో ఎంత నష్టపోయామో గుర్తించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'ప్రత్యామ్నాయం' వైపు పలు దేశాలు
హార్మూజ్ దిగ్బంధనాల అడకత్తెరలో చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతున్న వేళ, దక్షిణ అమెరికాలోని కొలంబియా అనే చిన్న దేశంలో గమనార్హమైన సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 24 నుంచి 29 వరకు సుమారు 60 దేశాల భాగస్వామ్యంతో జరిగిన ఆ సమావేశాల అజెండా – పెట్రోల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు మళ్లటం ఎట్లాగన్నది. ఇది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంవల్ల ఏర్పడిన ఒత్తిడికి పర్యవసానం. పర్యావరణ అంశాలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన 30 సంవత్సరాలకు పైగా సదస్సులు జరుగుతుండటం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు గురించి తీర్మానాలు, ఒప్పందాల మాట తెలి సిందే. కానీ ఇపుడు మొదటిసారిగా ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా, అమెరికాను కనీసం ఆహ్వానించకుండా ఈ సమావేశాలు జరగటం విశేషం. పెద్ద దేశాలకు లేదు ఆహ్వానంఅమెరికాయే కాదు. రష్యా, చైనా, ఇండియా, గల్ఫ్ దేశాల వంటివి కూడా అందులో పాల్గొనలేదు. కానీ, సమావేశాలకు సహనిర్వాహకురాలైన నెదర్లాండ్స్‌తో పాటు పలు యూరోపియన్ దేశాలు వెళ్లాయి. ఇందులో అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ను న్నాయి. అమెరికాను ఆహ్వానించకపోవటం ఎందువల్ల? దీనికి నిర్వాహకులు చెప్పిన సమాధానం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన ఎన్నో సమావేశాలు జరిగినా ఆ తీర్మానాలను అమెరికా వీటో చేస్తూ వస్తున్నది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అయితే అసలు శిలాజ ఇంధనాల వినియోగం సమస్యే కాదంటూ కొట్టివేసి ప్యారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. తక్కిన పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలావరకు ఇటువంటి ఇంధనాలతోనే ముడిబడి ఉన్నాయి. వారు ప్రత్యామ్నాయాల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా, చైనాలో తప్ప ఇతరచోట్ల మందకొడిగానే సాగుతున్నాయి.ఈ పరిస్థితుల మధ్య మిగిలిన దేశాలు శిలాజ ఇంధనాల పరిధి నుంచి వీలైనంత వేగంగా బయట పడటం తప్పనిసరి అవుతున్నది. ఇదెంత అత్యవసరమో ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో ఒకసారి తెలిసి రాగా, ఇపుడు ఇరాన్ యుద్ధంవల్ల మరింత తీవ్ర రూపంలో అర్థమవుతున్నది. చమురును, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే దేశాలు, వాటి వ్యాపారాన్ని నియంత్రించే కంపెనీలు గల రాజ్యాలు, వాటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు మొత్తం శిలాజ ఇంధన రంగం బందీ అయిపోయింది. ఇంధన ఉత్పత్తులు, ధరల నియంత్రణను కొందరు తరచు ఆయుధంగా ఉపయోగించుకున్నారు. అటువంటి ఇంధన వనరులు గల ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకునేందుకు రాజకీయంగా, సైనికంగా అనేకం చేశారు. ఈ స్థితి ఇప్పుడు ఇరాన్ యుద్ధ సందర్భంగా పరాకాష్ఠకు చేరింది. ఇంత క్లిష్ట స్థితి చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నది నిపుణుల మాట.యుద్ధంతో పెరిగిన ఒత్తిడిఈ ప్రభావాలు చిన్న దేశాలపై సరేసరి కాగా అభివృద్ధి చెందిన యూరప్‌పై కూడా పడుతున్నాయి. అందువల్లనే కొలంబియా సమావేశాలకు నెదర్లాండ్స్ సహ నిర్వాహకురాలు కాగా, వచ్చే సంవత్సరం పసిఫిక్ ద్వీప దేశమైన తువాలూ సమావేశాలకు ఐర్లండ్ సహనిర్వాహకురాలు కావాలని నిర్ణయించారు. పర్యావరణ మార్పులతో సముద్ర జలాల స్థాయి పెరిగి 2100 నాటికి తువాలూ దేశం 90 శాతం మునుగుతుందన్నది అంచనా. కొలంబియా సమా వేశాలకు పలు యూరోపియన్ దేశాలు వెళ్లటాన్ని బట్టి, ఇరాన్ యుద్ధంతో తలెత్తిన శిలాజ ఇంధన సమస్యలు వారికి కూడా ఎంత ఇబ్బందికరంగా మారాయో గ్రహించవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగాలను 2050 నాటికి దశల వారీగా నిలిపి వేయాలని నిర్ణయించాయి కూడా.కొలంబియాలో జరిగిన నిర్ణయాలు అన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి దేశాలూ, కంపెనీలూ, వాటిని నియంత్రించే శక్తులతో ప్రమేయం ఉండని విధంగా ఇతర ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లాలని. అవి, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, అణు విద్యుత్తు, ఎలక్ట్రికల్, బ్యాటరీ రంగాలు, జల విద్యుత్తు, సముద్ర కెరటాల విద్యుత్తు వంటివి. ఇవి శిలాజ ఇంధన రంగం నుంచి విముక్తం చేయటంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చి పర్యావరణ సమస్యల నుంచి పరిష్కారాలను చూపుతాయి. వీటన్నింటి ప్రభావంతో బయటి శక్తుల ప్రభావాలు తగ్గి, దేశాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటివి సులభమవుతాయి. అమెరికా, జర్మనీలకు చెందిన మాజీ ఇంధన మంత్రులైతే, ఒక దాదాకు, గుత్తాధికారం గల శక్తికి గల ప్రభావం నుంచి బయట పడేందుకే ఈ ప్రయత్నాలు జరుగు తున్నాయని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఈ విధమైన వివిధ అంచనాలను గమనించినపుడు, శిలాజ ఇంధనాలన్న ఒక్క అంశంతో ముడిబడి ఎన్నెన్ని ఉన్నాయనే ఆశ్చర్యం కలుగుతుంది.పర్యావరణ ప్రజాస్వామ్యంకొలంబియా సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆ దేశ పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్, ‘ప్రపంచ పర్యావరణ ప్రజాస్వామ్యానికి ఈ చర్చలు ఆరంభ’మని అన్నారు. మరొక విధంగా చెప్పాలంటే, ప్రపంచంలోని ‘పెట్రో నియంతృత్వాలకు, ఎలక్ట్రో ప్రజాస్వామ్యాలకు మధ్య విభజనకు ఇది నాంది అవుతున్న’ దని ప్రకటించారు. ఈ పరిణామాలను గమనించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అధిపతి సైమన్ స్టియెల్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై చమురు పరిశ్రమ ఆధిపత్యం కారణంగానే ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వాలు కళ్లు తెరిచాయని అన్నారు. జాతీయ భద్రతలు, ఆర్థిక సుస్థిరతలు, విధానపరమైన స్వయం నిర్ణయాలు, మౌలికమైన రీతిలో సార్వభౌమాధికారాల పరిరక్షణల కోసం కూడా ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థలు అవసరమని స్పష్టం చేశారు. కొన్ని దేశాల సైనిక సలహాదారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది.అయితే, కొలంబియాలో 60 దేశాలు చూపిన చొరవ, ఆ దిశగా ఆయా దేశాలు వచ్చే సమావేశాల నాటికి ప్రణాళికలు రూపొందించనుండటం గొప్ప విషయమేగానీ, లక్ష్యసాధనకుగల సమస్యలు తక్కువ కాదు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు కాగల ఖర్చు శిలాజ ఇంధనాల కన్న చాలా తక్కువే. ఆ పని దశల వారీగా కూడా చేయవచ్చు. అసలు సమస్య సాంకేతిక నైపుణ్యాలు, ప్రత్యామ్నాయ ఇంధన పరికరాల ఉత్పత్తికి సంబంధించినది. ఈ రెండు విషయాలలోనూ చైనా అగ్రస్థానంలో ఉంది. వారు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయగలరుగానీ, ఇతర దేశాల స్వయం సమృద్ధికి సహకరించగలరా? అదెట్లున్నా కొలంబియా చొరవ హర్షించదగ్గది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జీవిత సాఫల్యానికి 'మూడు పాఠాలు'
రిషి సునాక్: నేను ప్రాథమికంగా సంఖ్యల మనిషిని. గణితం, గణాంకాలు, కోడింగ్ ఉపయోగించి ఫైనాన్స్ రంగంలో పెట్టుబడి వ్యూహాలు రూపొందించే నిపుణుడిని. అది మా మామగారు ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తితో నా అనుబంధం బలపడటానికి సహాయపడింది. ‘‘మేం దేవునిపై విశ్వాసం ఉంచాం. డేటాను ఒక చోటికి చేర్చడమే మిగిలిన వారందరి కర్తవ్యం’’ అన్నదే ఆయన నమ్మే మంత్రం. నాదీ అదే బాట. డేటా, దాని విశ్లేషణ పట్ల నాకు అపారమైన గౌరవం. స్టాన్ఫోర్డ్ విడిచిపెట్టాక, నేను నిర్వహించిన ప్రతి పాత్రలోనూ అది నన్ను విజయుడిని చేసింది. డేటా, దాని ననుసరించి తీసుకునే డెసిషన్లు నాకు చాలా ఉపకరించాయి.1. అంతరాత్మ చెప్పినట్లు కూడా నడుచుకోండి!నేను ఇక్కడ నేర్చుకున్న టెక్నిక్కులు, పదిహేనేళ్ళ తర్వాత, ఎస్.ఐ.ఆర్. మోడళ్ళను అర్థం చేసుకోవడంలో సాయపడ్డాయి. ఎస్ అంటే సస్కెప్టిబుల్. వ్యాధికి ఇంకా లోనుకానివారు. దాని బారినపడటానికి అవకాశం ఉన్నవారు. ఐ అంటే ఇన్ఫెకు‡్ష్యవస్. వ్యాధి బారినపడి, దాన్ని ఇతరులకు వ్యాపింపజేసే స్థితిలో ఉన్నవారు. ఆర్ అంటే రికవర్డ్/రిమూవ్డ్. వ్యాధి నుంచి కోలుకుని, శాశ్వత రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నవారు. వారు మరోసారి వ్యాధికి లోనయ్యే అవకాశం లేదు. వ్యాధితో మరణించినవారు కూడా ఇదే వర్గంలోకి వస్తారు. మహమ్మారులు ప్రబలినపుడు జనాభాను ఈ మూడు వర్గాలుగా విభజించి వ్యాధి వ్యాప్తికి ఉన్న అవకాశంపై లెక్కలు కడుతూంటారు. కోవిడ్ కారణంగా నెలల తరబడి లాక్డౌన్లతో బాధపడ్డాక, 2021లో ఒమిక్రాన్ అంటూ కోవిడ్‌లో కొత్త రకం మొదలైంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఆ వైరస్, బ్రిటన్‌లో విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది. నేను అపుడు బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో, అమెరికా పర్యటనలో ఉన్నాను. ఆందోళన కనబరుస్తూ, హఠాత్తుగా వచ్చిన ఫోన్ కాల్‌తో, పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని బ్రిటన్‌కు వెళ్లిపోయాను. మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలంటూ ఒత్తిడి వస్తోంది. డేటా పట్ల సరైన అవగాహన ఉన్నవాడిని కనుక సరిపోయింది. లేకపోతే, నేనూ అదే రకమైన అభిప్రాయాన్ని బలపరచేవాడినేమో. దక్షిణాఫ్రికాలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరాన్ని డేటా సూచించింది. అది నాలో ప్రశ్నలను రేపింది. ‘కానీ’ ఏమైనా అయితే అనే సందేహమూ తొలుస్తోంది. డేటా సరైన పరిష్కారాన్ని సూచిస్తుందని నమ్మేవాడినే కానీ, నేను ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే, డేటా అన్ని వైపుల పరిస్థితిని చూపలేదని ఆషా(అక్షత) నేను గ్రహించేటట్లు చేసింది. లాక్డౌన్ విధిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయి. నాడు 2021 డిసెంబర్లో ఎటూ తేల్చుకోలేని స్థితి. అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 50 శాతం మంచిదనిపిస్తుంది. వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం 50 శాతం మంచిదనిపిస్తుంది. కేవలం డేటా విశ్లేషణపైనే ఆధారపడి నిర్ణయాలు తీసుకునే పక్షంలో ఆ పని ఎవరైనా చేయగలరు. నాయకుని బల్ల దాకా రానక్కరలేదు. కనుక, డేటాతోపాటు అంతఃకరణపైన కూడా ఆధారపడాలి. అంతరాత్మ ప్రబోధాన్ని కూడా వినాలి. రెండింటిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అక్షతా మూర్తి: రెండవ పాఠం ఆదర్శవాదంతో కనే పెద్ద పెద్ద కలలకు, ఆచరణవాదంతో వేసే చిన్న చిన్న అడుగులకు సంబంధించినది. దీన్ని నేను రిషి నుంచి నేర్చుకున్నాను. నేను ధనికులకు–పేదలకు మధ్య అగాధం ఎక్కువగా ఉన్న దేశంలో పెరిగాను. నా తల్లితండ్రులు విస్తృతమైన మార్పు తీసుకురావాలనే స్ఫూర్తిని అందించారు. స్టాన్‌ఫోర్డ్‌లో విధిగా రాయవలసిన మొదటి వ్యాసంలో విద్య, ప్రభావం, సేవల గురించే ఎక్కువ చెప్పాను. మిగిలినవాటన్నింటికన్నా ఆదర్శమే సర్వోత్తమమైనదనే అభిప్రాయం ఉండేది. దానికోసం ఏం చేయదలచుకున్నావు అనే ప్రశ్న రిషి నుంచి ఎదురైంది. వాస్తవికతతో ముడిపెట్టని ఆదర్శాల వల్ల ప్రయోజనం శూన్యమని రిషి అభిప్రాయం. బాహ్య ప్రపంచంలో దైనందిన జీవితంలో స్పష్టంగా కనిపించే చిన్ని అడుగుల ద్వారానే పెద్ద స్థాయిలో రూపాంతరీకరణ సాధ్యమవుతుందని రిషి నుంచి నేర్చుకున్నాను. ఆదర్శాలను వల్లిస్తే సరిపోదు. ఆ దిశగా చిన్న అడుగులైనా వేయడం ప్రారంభించామా లేదా అన్నదే ముఖ్యం.2. ఆచరణాత్మక దృక్పథమూ అవసరమే!జీవితాలను మార్చాలన్నా, సామాజిక చేతనను పెంచాలన్నా చదువు ద్వారానే సాధ్యమని మా ఇద్దరి అభిప్రాయం. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్నపుడు, ‘లెసన్స్ ఎట్ 10’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అది బ్రిటన్ నలుచెరగులా యువతను విద్యావంతులను చేసి, వారిలో స్ఫూర్తిని నింపేందుకు చేపట్టిన కార్యక్రమం. రిషి, నేను కలసి ‘రిచ్మండ్ ప్రాజెక్టు’ను కూడా ప్రారంభించాం. గణితాన్ని చూసి బెదిరిపోకుండా యువతలో ధైర్యం నింపడం, వారిలోని సంఖ్యా పరిజ్ఞాన పాటవాలకు మెరుగులు దిద్దడం, ఫైనాన్షియల్ అక్షరాస్యతను పెంపొందించడం ఆ కార్యక్రమం లక్ష్యం. ఆచరణాత్మక దృక్పథం నేను ఒకప్పుడు అమాయంగా భావించినట్లుగా, అది ఆదర్శవాదానికి వ్యతిరేకమైనది కాదు. అది ఆదర్శానికి తోటి భాగస్వామి లాంటిది. పెద్ద పెద్ద కలలను సాకారం చేసుకునేందుకు ఆ రెండూ అవసరమే. రిషి సునాక్: ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకపోవడం మేం నేర్చుకున్న ముఖ్యమైన మూడవ పాఠం. ఈ భావనను సంస్కృతంలో ‘ధర్మం’గా పిలుస్తారు. మనం చేసే పనుల నుంచి ఫలితాలను ఆశించకుండా మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం. నాయకత్వం వహిస్తున్నప్పుడు విజయాలు, వైఫల్యాలు రెండింటినీ చవి చూడవలసి వస్తుంది. ఆ మాటకొస్తే, మనం ఏ రంగంలో ఉన్నా దూషణ భూషణలను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్లిప్తంగా ఎవరి పని వారు చేసుకుపోవాలని నేను చెప్పడం లేదు. విమర్శల పట్ల భయంతో కాక, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాననే భావనతో ఏ పనైనా చేయాలి. 3. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి!ఆషా నేనూ కలసి గడ్డు కాలాన్ని ఎదుర్కోవడంలో ఈ విద్యుక్త ధర్మ భావన ఎంతో సహాయపడింది. కన్సర్వేటివ్ పార్టీ నాయకునిగా, ప్రధాన మంత్రిగా తిరిగి పరిణమించే ప్రయత్నంలో 2022 వేసవిలో నేను విఫలమయ్యాను. ఎంతో శ్రమపడ్డ తర్వాత కూడా ఫలితం అనుకూలంగా రాకపోవడం బాధ పెట్టింది. కానీ, తర్వాత, అదీ మంచికే అనిపించింది. ఒక సాధారణ పార్లమెంట్ సభ్యునిగా చేయవలసిన పనులపై మరింత దృష్టి పెట్టగలిగాను. ఒక భర్తగా, తండ్రిగా కుటుంబానికి మనుపటికన్నా ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగాను. ఆరు వారాలు గడిచాక, నాకన్నా, ముందు ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. పౌండ్ విలువ వేగంగా పతనమవడం ప్రారంభించింది. ద్రవ్యోల్బణం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకుంది. పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ, క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడే దేశానికి సహాయపడటం ధర్మమని ఆషా గుర్తు చేసింది. రెండు రోజుల తర్వాత, ప్రధాని నయ్యాను. ప్రజాహిత రంగంలోనే కాదు ఎక్కడైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించేందుకు ముందుకు రావాలి. అంతకుముందున్న పరిస్థితులను లెక్కలోకి తీసుకోకూడదు. అహంకారానికి తావు ఇవ్వకూడదు. జీవితాన్ని సఫలం చేసుకునేందుకు అదొక్కటే మార్గం. మనం సాధ్యమని భావిస్తున్న దానికన్నా ఎక్కువగా సాధించడానికి అది తోడ్పడుతుంది. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కాపురముండిన మొదటి స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్లం మేమే. కానీ, ఒక ముఖ్యమైన సమయంలో, ఒక ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించిన చివరివాళ్ళం మేమే కాకూడదని మా ఇద్దరి కోరిక. -
విజయ్ (తమిళ్ స్టార్) రాయని డైరీ
‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలాంగరై బీచ్ హౌస్ బయట నా అభిమానులు చేస్తున్న నినాదాలు పోటెత్తిన వేసవి సాయంత్రపు అలల్లా వచ్చి నన్ను ఢీకొని, చల్లటి చిలకరింపుగా నా ముఖాన్ని తాకుతున్నాయి. ఎంత హాయి! వారి వైపు చూస్తూ చేతులు జోడించాను. ‘‘అలా కాదు తలపతీ, ఇలా...’’ అంటూ వెయ్యి పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేచాయి! వెయ్యిన్నొక్క చెయ్యిగా వారితో నా పిడికిలి కలిపాను. చేతిని గాలిలో ఊపుతూ... ‘‘ఎన్ నెంజిల్ కుడియిరుక్కుమ్’’ అని నేను అంటుండగానే, ‘‘ఎన్ అన్బు రసిగర్గళుక్కు వణక్కమ్’’ అని ఎప్పటిలా వారు నా మాటను చటుక్కున పూర్తి చేశారు! అది నాకూ, వారికి మధ్య ఏర్పడిన పద–బంధం. ‘‘నా హృదయంలో కొలువై ఉన్న...’’ అంటానా, ‘‘నా ప్రియమైన అభిమానులకు నమస్కారాలు...’’ అని వారు అందుకుంటారు.యువ నావికుడికి దారి చూపటానికి చెన్నై నగరం నుంచి బీచ్ ఒడ్డుకు చేరుకున్న వెలుతురు నౌకలా ఉన్నారు వారంతా! ‘‘ధన్యవాదాలు స్నేహితులారా. ఇక చాలు. చీకటి పడుతోంది, క్షేమంగా ఇల్లు చేరండి. మన సోదరీమణులను జాగ్రత్తగా వాళ్ల ఇళ్ల దగ్గర దింపాకే మీరు వెళ్లండి’’ అని విజ్ఞప్తి చేసి లోపలికి వచ్చాను. లివింగ్ రూమ్‌లోకి రాగానే నిలువెత్తున వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్!! ఈ వీరనారుల ధైర్య సాహసాలకు వారసులైన తమిళ మహిళలనేనా... ‘‘భద్రంగా ఇళ్ల దగ్గర దింపి వెళ్లండి’’ అని నేను నా యువసేనకు బాధ్యతలు అప్పగించింది! నాలో నేను నవ్వుకున్నాను. నాచ్చియార్ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన 18వ శతాబ్దపు రాణి! అంజలై అమ్మాళ్ దక్షిణ ఆర్కాట్ స్వాతంత్య్ర సమరయోధురాలు!వారి చిత్రపటాలనే చూస్తూ నిలబడి పోయాను. ఆ పక్కనే ఉన్న పెరియార్, అంబేడ్కర్, కామరాజ్ నవ్వుతూ నా వైపే చూస్తున్నట్లుగా ఉంది! ‘‘విజయ్, ఆల్ ద బెస్ట్ రా... సినిమాల అబ్బాయీ’’ అని నన్ను దీవిస్తున్నట్లుగానూ ఉంది. పెరియార్ ఎన్నడూ సినిమాలను ఇష్టపడలేదు. కానీ పెరియార్ సిద్ధాంతాలు సినిమాలుగా వచ్చాయి! ‘పరాశక్తి’, ‘వేలైక్కారి’, ‘నల్ల తంబి’ ఆయన సిద్ధాంతాల నుంచి తయారైన సినిమాలే. పెరియార్‌లా అంబేడ్కర్‌కు సినిమాలపై వ్యతిరేకత లేదు. జీవితాన్ని నవ్వుతూ స్వీకరించటం ఎలాగో సినిమా నేర్పిస్తుంది అనేవారట అంబేడ్కర్! కామరాజ్ కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తరం నాయకులు. సినిమాలను, సినిమా వాళ్లను ఆయన చిన్నచూపు చూసేవారనీ, ‘‘ముఖాలకు రంగులు వేసుకునేవాళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడపగలరు?’’ అనేవారనీ విన్నాను. కానీ నడిపారు! సినిమాలకు రాసి, పాడి, అభినయించిన వారు, రాజకీయ నాయకులకు దీటుగా తమిళనాడును నడిపారు. అన్నాదురై సీఎం కావటానికి ముందు నాటక రచయిత. నాటకాల్లో నటించారు; కళైజ్ఞర్ కరుణానిధి సీఎం కావటానికి ముందు స్క్రీన్ రైటర్, పాటల రచయిత; ఎంజీ రామచంద్రన్ సీఎం కావటానికి ముందు సూపర్‌స్టార్; జయలలిత అమ్మ సీఎం కావటానికి ముందు తమిళ సినిమా సామ్రాజ్ఞి; స్టాలిన్ సర్ కూడా సీఎం కావటానికి ముందు సినిమాల్లో నటించారు. తమిళనాడులో ప్రతి ముఖ్యమంత్రీ సినిమాలతో బంధమో, అనుబంధమో ఉన్నవాళ్లే. రంగుల లోకం నుంచి వచ్చి, ప్రజల జీవితాల్లో కాంతులు నింపినవాళ్లే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు. ‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ అంటూ, నడిరేయిలో లీలగా హోరు వినిపిస్తోంది. నా నీలాంగరై బీచ్ హౌస్‌ను తాకి వెళుతున్నది అలలా... తమిళ ప్రజల కలలా?! -
వేడెక్కుతున్న వేసవి విడుదులు
దేశంలోని చాలా ప్రాంతాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా, జనం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలోని వేసవి విడుదులకు ప్రయాణం కడుతున్నారు. సిమ్లా, కులు, మనాలి, నైనితాల్, ముసోరి, ధర్మశాల వంటి టూరిస్టు కేంద్రాలతోపాటు, పర్వత ప్రాంతాలలోని పుణ్య క్షేత్రాలకు కూడా తరలివెళుతున్నారు.ఏటా ‘చార్ ధామ్’ (బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్ర కూడా వేసవిలోనే మొదలవుతుంది. ఇటీవలి దశాబ్దాలలో ఆ ప్రాంతాలు పర్యావరణ ఉపద్రవాలను చవి చూశాయి. వాతావరణం క్షణానికో రకంగా మార్పులకు లోనవుతోంది. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నేలలు కుంగిపోతున్నాయి. దాంతో అడ్డూఆపూ లేని టూరిజంతో పర్వత ప్రాంతాలపై పడుతున్న ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.సున్నితమైన ప్రాంతాలువివిధ పుణ్య క్షేత్రాలు హిమాలయాల లోపలి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలు సన్నని లోయలు, హిమానీనదాలు ఏర్పరిచిన పల్లపు ప్రాంతాలతో కూడుకుని ఉన్నాయి. భూగర్భంలోని పలకలు కదులుతూంటాయి. వర్షం పడినా, భూకంపనాలు చోటుచేసుకున్నా ఆ ఒత్తిడికి వాలు ప్రాంతాల్లోని రాళ్ళు కిందకు జారిపడిపోతూంటాయి. ఎతై ్తన కొండ ప్రాంత గడ్డిభూములు, పర్వతాగ్రాలలోని సరస్సులు, పెళుసైన వృక్షజాల ప్రాంతాలు ఆ రకమైన ఒడుదుడుకులను తట్టుకుని తేలిగ్గా కోలుకోగల శక్తి కలిగినవి కావు.అందుకనే, అనాది నుంచి అక్కడ మానవ ఆవాస ప్రాంతాలు తక్కువ. వాతావరణం అనుకూలంగా ఉండే సీజనులో వచ్చే యాత్రికుల వల్ల కూడా అక్కడి జీవావరణ వ్యవస్థ చెదిరిపోతోంది. పెద్ద సంఖ్యలో వచ్చే కార్లు, బస్సులు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వ్యర్థ పదార్థాలను సక్రమమైన రీతిలో జారవిడిచే సదుపాయాలు లేవు. పెరుగుతున్న మానవ కార్యకలాపాల (టూరిజం, నిర్మాణ కలాపాలు, భారీ ప్రాజెక్టులు వంటి వాటి) వల్ల హిమాలయాల జీవావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది. కోర్టులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ఒత్తిడి వల్ల ఆ వాస్తవాన్ని విధాన నిర్ణేతలు గుర్తించకపోలేదు. కానీ, క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు అంతంతే.చార్ ధామ్‌కు వెళ్ళే దినసరి సందర్శకుల సంఖ్యపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఒక పరిమితిని విధిస్తున్నా, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటోంది. ఒక రోజులో బదరీనాథ్‌కు 1,000, కేదార్ నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400లకు మించి యాత్రికులను అనుమతించకూడదని 2021లో నిర్ణయించారు. ఆ యా ప్రాంతాలు తట్టుకోగల శక్తిని బట్టికాక, కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయానికి వచ్చారు. ఈ ఏడాది కూడా, సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను మాత్రం తప్పనిసరి చేశారు. ఎంతమందిని అనుమతించొచ్చు?కేదార్, బదరీ, గంగోత్రి, యమునోత్రి తట్టుకోగలిగిన సామర్థ్యానికి సంబంధించి ‘వీర్ చంద్ర సింగ్ గడ్వాలీ ఉత్తరాఖండ్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’, ‘జి.బి. పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్’ సైంటిస్టులు 2025లో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ఎత్తు, వాలు, వృక్షజాల వ్యాప్తి అనే మూడు కీలక భౌగోళిక సూచికలను ఆధారం చేసుకుని వారు ఆ పత్రాన్ని రూపొందించారు. ఆ నాలుగు మందిరాల వద్ద, వాటి చుట్టుపక్కలనున్న హిమంతో కప్పుకున్న హిమానీనద ప్రాంతాలను విశ్లేషించినపుడు ఆ హిమనదాలు 2002–2020 మధ్యకాలంలో గణనీయంగా కుంచించుకుపోయినట్లు వెల్లడైంది. వాటిలో ఎక్కువగా (ఏడాదికి 22.36 మీటర్ల చొప్పున) గంగోత్రి, యమునోత్రి (ఏటా 20 మీటర్లు), బదరీనాథ్ (ఏటా17.32 మీటర్లు), కేదార్నాథ్ (14.14 మీటర్లు) కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఆ నాలుగు ప్రాంతాల్లో (1990–2020 మధ్య కాలానికి సంబంధించి) వాతావరణ డేటాను కూడా విశ్లేషించారు. ఆ ప్రదేశాలన్నింటిలోను, మూడు (వర్షాకాలానికి ముందు, వర్షాకాలంలో, వర్షాకాలం తర్వాత) సీజన్లలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ధోరణి కనిపించింది. నాలుగు ప్రదేశాలు సంరక్షణ ప్రాంతాల లోపల లేదా వాటి చుట్టుపక్కల పరిసరాలలో ఉన్నాయి. బదరీనాథ్ మందిరం ‘నందాదేవి నేషనల్ పార్క్’ పరిధిలోకి; ‘కేదార్నాథ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ పరిధిలోకి కేదార్నాథ్; ‘గంగోత్రి నేషనల్ పార్క్’ పరిధిలోకి గంగోత్రి; ‘గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ’ పరిధిలోకి యమునోత్రి వస్తాయి. ఆ విశ్లేషణను ఆధారం చేసుకుని చార్ ధామ్ దినసరి సందర్శకుల సంఖ్యపై గణనీయమైన పరిమితి విధించాలని పరిశోధకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక రోజులో బదరీనాథ్‌కు (11,833 నుంచి 15,778), కేదార్‌నాథ్‌కు (9,833 నుంచి 13,111), గంగోత్రికి (6,133 నుంచి 8,178), యమునోత్రి (4,620 నుంచి 6,160) సందర్శకులను పరిమితం చేయాలని వారు కోరారు. వాహనాల క్రమబద్ధీకరణ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. కొండ ప్రాంతాల్లోని ఇతర నగరాలు, పట్టణాలకున్న భరణ శక్తిని గణించేందుకూ ఈ గ్రూపు అభివృద్ధిపరచిన పద్ధతిని వర్తింపజేసుకోవచ్చు. సిమ్లా కూడా దాని శక్తికి మించి సందర్శకులను భరిస్తున్నట్లు కొన్ని మదింపులలో తేలింది. ఏం చేయాలి?భరణ సామర్థ్యాన్ని శాస్త్రీయమైన రీతిలో మదింపు చేస్తే, సముచితమైన చర్యలు తీసుకునే వీలుంటుందని సుప్రీంకోర్టు 2024 జూన్‌లో, మొత్తం 13 హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. నగరాలతో సహా వేసవి విడుదులు, పర్యావరణపరంగా సున్నితమైన మండలాల భరణ సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు 2020లోనే మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆ తర్వాత కోర్టుకు తెలియజేసింది. నిపుణుల కమిటీలను నియమించడం లేదా వాయు పరిశీలన పరికరాలను నెలకొల్పడం వంటి పైపై చర్యలకు పరిమితమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అరకొర విధానాలనే అనుసరిస్తున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలు తమ సమస్యను పరిష్కరించుకునేందుకు సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవాల్సి ఉంది. లేదంటే నిష్క్రియాపరత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేదార్ నాథ్ వరదల నుంచి జోషీమఠ్ కుంగిపోవడం వరకు ప్రకృతి ఉపద్రవాల పరంపరను ఇప్పటికే చవిచూశాం. తీవ్ర వాతావరణ పరిస్థితులు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటివాటికి పుడమి వేడిమితో ప్రపంచం మొత్తంమీద వాతావరణంలో వస్తున్న మార్పు, ఆ యా ప్రాంతాల్లోని భౌగోళిక స్థితిగతులు కారణం కావచ్చు. కానీ, టూరిజం, పరిమితికి మించి జనం మీదపడడం, ప్రణాళికాబద్ధత లేని పట్టణీకరణ, అడవులను నరికేయడం, భారీ ప్రాజెక్టులు చేపట్టడం వంటి మానవ ప్రేరేపిత చర్యలు ఉపద్రవాలకు మరింత ఊతం ఇస్తున్న సంగతిని మరువకూడదు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా?
మొదటి విడత చర్చలు ఏప్రిల్ 12న విఫలమై, రెండవ విడతకు ముహూర్తమైనా కుదరని స్థితిలో, తాను దౌత్యానికి మారదలచుకున్నారా లేక దాదాగిరీ పద్ధతిలోనే కొనసాగుతారా అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చుకోవలసి ఉంది. లేదంటే ఇరాన్‌తో మళ్ళీ చర్చలు గానీ, సమస్య పరిష్యారం గానీ జరిగే సూచనలు లేవు. రెండవ విడత కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామాబాద్‌కు ఏప్రిల్ 24, 25వ తేదీలలో వెళ్ళి చర్చల పునరారంభానికి తమ షరతులేమిటో చెప్పి తిరిగిపోవటం, తమ ప్రతినిధుల ప్రయాణాన్ని ట్రంప్ అకస్మాత్తుగా రద్దు చేయటాన్ని బట్టి అర్థమవుతున్నది ఇదే. అరాగ్చీ ప్రతిపాదించిన షరతులేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, అవి గతానికన్నా భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. అసలు విషయం అది కాదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్ష్యాలు మారటమన్నది మౌలిక ప్రశ్న. ఒకసారి అది తేలితే ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రాజీలు కుదరటం సాధ్యమవుతుంది. మొదట్నుంచీ అదే వైఖరిఈ మాట అనటం ఎందుకంటే, ఇరాన్ పట్ల దౌత్యానికి బదులు దాదాగిరీ వైఖరిని తన మొదటి విడతలోనే (2017–21) ప్రదర్శించిన ట్రంప్, ఈ రెండవ విడతలోనూ అదే పని చేస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు ఆరంభించటం మొదలుకొని, మొదటి విడత చర్చల వైఫల్యం మీదుగా ఈ రెండవ విడత చర్చల అనిశ్చితి వరకు తను చూపుతున్నది ఆసాంతం దాదాగిరీయే. తమ అసమానమైన ఆర్థిక, సైనిక శక్తులు మినహా ఆయన నోటి నుంచి మరొక మాట వినిపించదు. వాటిని ఉపయోగించి ఇరాన్ సహా ఎవరినైనా సర్వనాశనం చేయగలమంటారు. ఇందులో దౌత్య విధివిధానాలు ఆవగింజంతయినా కనిపిస్తున్నాయా?ట్రంప్‌లో దౌత్య నీతి లక్షణాలుంటే, యురేనియం శుద్ధి విషయమై ఇరాన్, అమెరికాల మధ్య (రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిపి) 2015లో కుదిరిన ఒప్పందం సజావుగా సాగుతుండగా 2018లో దానిని అకస్మాత్తుగా రద్దు చేసేవారు కాదు. ఇరాన్‌పై యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎంత ఒత్తిడి చేసినా బుష్, ఒబామా, బైడెన్లు నిరాకరించిన స్థితిలో, తాను దాడులకు సిద్ధమయ్యేవారు కాదు. పరిష్కారం లభించవచ్చుననుకున్న ప్రతి దశలోనూ ఆ అవకాశాలను ఇజ్రాయెల్ భంగపరుస్తుండగా మౌనం వహించేవారు కాదు. వాస్తవానికి దాదాగిరీ లక్షణాన్ని ఆయన చూపుతున్నది ఇరాన్ విషయంలోనే కాదు. రెండవసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పనామా కాలువ, కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజులా విషయమై చేసిందేమిటో తెలిసిందే. యుద్ధాలు ఆపే ప్రతిజ్ఞలు చేసిన మనిషి, 9 యుద్ధాలు ఆపానంటూ ఇప్పటికి కొత్తగా 8 సైనిక దాడులు సాగించారు. టారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాల అరాచకం సరేసరి. ఇందులోనూ గమనించదగ్గ విశేషం ఒకటున్నది. తన పులి చారలు, కోరలను అనునిత్యం ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టజూసే ఆయనలో ‘కాగితం పులి’ లక్షణాలు కూడా ఉన్నాయి. అది, బలహీనుల ముందు విజృంభించి బలవంతుల ఎదుట తగ్గి ఉండటం. పనామా, వెనిజులా విషయంలో జరిగింది ఒకటైతే, తనను ధిక్కరించిన కెనడా, గ్రీన్‌ల్యాండ్ (యూరప్), బ్రెజిల్, దక్షిణాఫ్రికాల సంగతి వేరయ్యింది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను లొంగదీయలేక తానే రాజీకి ప్రయత్నిస్తున్నారు. చైనా మాట అయితే చెప్పనక్కరలేదు. ఇరాన్ ప్రతిఘటనలు మరొక దృష్టాంతం.పరిష్కారానికి రాజమార్గంకొంత లోతుకి వెళ్ళినట్లయితే, ట్రంప్ ద్వారా ప్రదర్శితమవుతున్న ఈ లక్షణాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడుతూ... దానికి స్లో–మోషన్ సంకేతాల వంటివి. అమెరికన్ నాయకత్వపు ‘నాటో’ కూటమిలోనే పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు, కనీసం ఇరాన్ దిగ్బంధానికైనా ఏ ఒక్కరూ కలిసి రాకపోవటం, మరొక స్థాయిలో బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు విస్తరిస్తుండటం ఈ మార్పులను ప్రతిఫలిస్తున్నాయి. ఈ పలు విధాలైన పరిణామాల దశలో ఇరాన్ ఒక హీరోలా లేచి నిలుచున్నది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు వాస్తవాలను కనీసం ఇప్పటికైనా గుర్తించి, ఇజ్రాయెల్ ప్రభావం నుంచి బయటపడి, దౌత్యమార్గం వైపు మళ్లటం మంచిదవుతుంది. తమ సార్వభౌమతను, హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్ చూపుతున్న దృఢ సంకల్పం, ప్రతిఘటన సాధారణమైనవి కావు. మనం స్వయంగా చూసినంతవరకు వియత్నాం(1955–75), అఫ్గానిస్తాన్(2001–21) తర్వాత, 1953 నుంచి మొదలై నేటికీ సాగుతున్న ఇరాన్ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యురేనియం శుద్ధి తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా దాడులు జరిపి ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వాలను నిర్మూలించటం నుంచి మొదలు కొని, ఇరాన్ రేవులను దిగ్బంధించటం వరకు గల క్రమం అంతా చూపుతున్నది అమెరికా దౌత్య నీతినా లేక బస్తీ రౌడీ లక్షణాలనా? ఇరాన్ రెండవ విడత చర్చలకు నిరాకరించటమే సరైనదని భావించక తప్పదు. విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇస్లామాబాద్‌లో 25వ తేదీన మరోమారు అన్నమాట: అమెరికాకు విశ్వసనీయత లేకుండా పోయిందనీ, అది కుదిరేవరకు తాము చర్చలకు వెళ్లబోమనీ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనీ. ఆ తర్వాత ఒమాన్, రష్యా సందర్శనల వెనుక ఆయన తెహ్రాన్‌కు తిరిగి వెళ్ళి అన్ని పరిస్థితులను సమీక్షించుకున్నపుడు, వైఖరి అంటూ మార్చుకోవలసింది స్వదేశంలోనూ విశ్వసనీయతను కోల్పోతున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి రాజమార్గం ఎదుటనే ఉంది. అది అంతర్జాతీయ నిబంధనల మేరకు అణుశుద్ధికి ఇరాన్‌కు గల హక్కులకు అడ్డుచెప్పకపోవటం, పాలస్తీనా సృష్టిని అంగీకరించటం, గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని రద్దు చేయటం!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
50 శాతం ఫార్ములాతో దక్షిణాదికి మేలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా 1996 సెప్టెంబర్ 13న మహిళా ఎంపీలందరూ పార్టీలకతీతంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఏకతాటిపైకి వచ్చారు. లోక్‌సభలో ఈ విషయంపై గళమెత్తారు. మహిళా బిల్లును జాయింట్ కమిటీకి పంపడంపై దివంగత నేత సుష్మా స్వరాజ్ ‘దేశ మహిళలపై జరిగిన భారీ కుట్ర’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లును జాయింట్ కమిటీకి పంపి వెంటనే లోక్ సభను రద్దు చేశారు. దీంతో మళ్లీ మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి 27 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం 2023లో ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లు తీసుకొచ్చింది. 2034 నాటికి రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉండగా, 2029 నాటికే మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ, స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50%గా ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి, డీలిమిటేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం చేజారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ఈ రెండు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినవి. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరచడం– ఇవి రెండూ దేశ భవిష్యత్తును నిర్ధారించే కీలకమైన అంశాలు.దాదాపు 3 దశాబ్దాలుగా ఈ బిల్లును తీసుకురావాలని, మహిళా లోకానికి సాధికారత కల్పించాలని చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు దీన్ని అడ్డుకున్నాయి. 1996లో దేవేగౌడ హయాంలో... ఆ తర్వాత 1998, 1999, 2002లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది. ఎన్డీయే ఒత్తిడితో యూపీఏ హయాంలో 2008–10 మధ్యలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా, తమ మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనవసర దుష్ప్రచారండీలిమిటేషన్పై చర్చలు మొదలైనప్పటినుంచే, విపక్షాలు దక్షిణాదిపై ఎక్కడలేని ధృతరాష్ట్ర ప్రేమను కురిపించాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్ ఆడిన ఈ నాటకానికి డీఎంకే, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు వంతపాడాయి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమని ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదే పదే చెప్పినా దుష్ప్రచారం ఆగలేదు.అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచేందుకు తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 సీట్లు 50% పెరిగి 195 సీట్లకు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 26కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరిగేందుకు వీలుండేది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెంచేలా మోదీ సర్కారు సరికొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ద్వారా దక్షిణాది సీట్లకు ‘జనాభా ప్రాతిపదికన’ నష్టం జరగకుండా, ఆ మాటకొస్తే ప్రత్యేకమైన లాభం జరిగేలా ఈ ఫార్ములా మేలు చేకూర్చేది. దీనివల్ల ఆ యా పార్టీలకు ఏం ఒరిగిందో తెలియదు కానీ... 70 కోట్ల మంది మహిళలకు, 30 కోట్ల మంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచే అవకాశాన్ని కూడా కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు దెబ్బకొట్టాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఎస్సీలకు 21 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు రిజర్వేషన్లుండగా... 50% సీట్లను పెంచితే, ఎస్సీలకు 32 స్థానాలు, ఎస్టీలకు 8 స్థానాలు దక్కేందుకు వీలుండేది. అలాచేస్తే దక్షిణాదికి నష్టంమహిళా బిల్లు విషయంలోనే కాదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాల విషయాల్లోనూ కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు, ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిసినా వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి దేశ సమగ్రతను బలపరిచే ప్రయత్నం చేసినప్పుడూ వ్యతిరేకించింది. రైతుల అభివృద్ధి కోసం తెచ్చిన సంస్కరణలను రాజకీయ కారణాలతో వ్యతిరేకించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థంలేని కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. దీని ప్రకారం... తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15కు తగ్గుతాయి. ఇది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం. రేవంత్ రెడ్డి ఫార్ములా ప్రకారం తెలంగాణే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాకుండా, ఈ ఫార్ములా ప్రకారం... ఏపీ 16 సీట్లు, తెలంగాణ 11 సీట్లు, కర్ణాటక 16 సీట్లు, కేరళ 16 సీట్లు, తమిళనాడు 27 సీట్లు... ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు 86 సీట్లు నష్టపోనున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చైతన్యవంతులు. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది. మహిళల గౌరవం, దేశ సమగ్రత, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. జి.కిషన్ రెడ్డివ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి -
దక్షిణాదికి ద్రోహం చేసిన విపక్షాలు
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది. భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్‌సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థభారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది. 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.దక్షిణాదికి న్యాయం జరగాలంటే...మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది. భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం. ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
చైతన్యంతోనే డిజిటల్ మోసాలకు చెక్
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తోందో, అదే స్థాయిలో డిజిటల్ మోసాలు ప్రబలుతున్నాయి. 2021లో నమోదైన డిజిటల్ మోసాల సంఖ్య 2.6 లక్షలు కాగా, నష్టం రూ. 551 కోట్లు. అదే 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 28 లక్షల కేసులకు, నష్టం దాదాపు రూ. 23,000 కోట్లకు పెరిగింది. ఈ సమస్యను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు ప్రతిపాదనలతో కూడిన ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై మే 8 లోగా అభిప్రాయాలను తెలియజేయాలని పౌరులను కోరింది. ఆర్బీఐ ఉద్దేశం మంచిదే. కానీ కొద్దిమంది మోసగాళ్లను పట్టుకోవడానికి కోట్లాది మంది సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. నేటి డిజిటల్ మోసాలన్నీ సిస్టమ్ హ్యాక్ చేయడం వల్లనో, పాస్వర్డ్లు దొంగిలించడం వల్లనో జరిగేవి కావు. సీబీఐ ఆఫీసర్లమని బెదిరించి హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలి జీవితకాల పొదుపును కాజేస్తున్నారు. కస్టమ్స్ అధికారి అని చెప్పి ఒక 30 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర 2, 3 దఫాలుగా రూ.80,000 దోచేశాడు ఇంకో ప్రబుద్ధుడు. అవగాహన లేని సామాన్యులను భయాందోళనకు గురిచేసి మోసగాళ్లు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు.‘ఒక గంట నిలుపుదల’ సమంజసమా? రూ. 10,000 దాటిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత లావాదేవీలను, అలాగే చిన్న వ్యాపారుల ఖాతాలకు వెళ్లే డబ్బును ఒక గంట పాటు నిలిపివేయాలని ఆర్బీఐ మొదటి ప్రతిపాదన సూచిస్తోంది. మోసగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ గంట సమయం ఉపయోగపడుతుందని ఆర్బీఐ ఆలోచన. కానీ, ప్రతిరోజూ సరుకుల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి సప్లయర్లకు డబ్బు పంపే చిన్న వ్యాపారి పరిస్థితి ఏమిటి? వెంటనే జరిగే యూపీఐ లావాదేవీలే అప్పుడప్పుడు ఒక రోజు కూడా తీసుకుంటాయి. అలాంటిది అధికారంగా గంట నిలుపుదల చేస్తే ఇంకా ఎంత సేపు వేచి చూడాల్సి వస్తుందో! టెక్నాలజీలో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు స్థాయికి చేరుకున్న మనం, ఎవరో కొందరు మోసగాళ్లను అరికట్టాలని అందరినీ ఇలా 2 దశాబ్దాల వెనక్కు తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు?ఆర్బీఐ 10,000 రూపాయలు దాటిన ప్రతి ఒక్క లావాదేవిని నిలిపివేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మోసగాళ్లు పలు దఫాలుగా 9,999 పంపీయమని అడగొచ్చు. అప్పుడు ఆర్బీఐ రెండవ 9,999 లావాదేవీని నియంత్రిస్తుందా? దీనివల్ల ప్రజలు మళ్లీ నగదు లావాదేవీలు నిర్వహించే ఆస్కారం లేకపోలేదు. ఇది భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా సిద్ధాంతానికి విరుద్ధం. దీనికి ప్రజలను చైతన్యవంతులను చేయడమే అసలైన పరిష్కారం. ప్రాంతీయ భాషల్లో ‘జాతీయ మోసాల అవగాహన పరీక్ష’ను ప్రవేశపెట్టాలి. ఎలాంటి సమస్య అయినా అవగాహనతో పరిష్కారం అవుతుంది. మ్యూల్ ఖాతాలకు మొదట్లోనే అడ్డుకట్టకరెంటు ఖాతాల వార్షిక జమ పరిమితిని రూ. 25 లక్షలకు కుదించడం, అంతకు మించితే ఖాతాను స్తంభింపజేసి విచారణ జరపడం ఆర్బీఐ మూడో ప్రతిపాదన. ఈ నిబంధన వల్ల నేరస్థుల కంటే సామాన్య కాంట్రాక్టర్లు, ఐటీ డెవలపర్లు, చిరు వ్యాపారులే ఎక్కువ నష్టపోతారు. ఇప్పటికే కరెంటు ఖాతా ప్రారంభించడానికి చిన్న మధ్య తరహా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఖాతాలు ఫ్రీజ్ చేసే విచక్షణాధికారం బ్రాంచ్ అధికారుల చేతిలో పెడితే, అది సామాన్యుల పట్ల వేధింపులకు దారితీస్తుంది. ఇది భారత ప్రభుత్వం చెప్తున్న సులభతర వ్యాపార విధానానికి విరుద్ధం. నూతన వ్యాపార ఖాతాలకు ఆన్లైన్ పోలీస్ వెరిఫికేన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయాలి. అప్పుడు నేర చరిత్ర ఉన్న మోసగాళ్లు గేటు వద్దే ఆగిపోతారు. వాళ్లకు సహకరిద్దామనే మ్యూల్ అకౌంట్ నిర్వాహకులు పోలీసులపై ఉండే సహజమైన భయంతో అకౌంట్ల నిర్వహణకు ముందుకు రారు. నిజమైన వ్యాపారులకు ఖాతాలు సులభంగా లభిస్తాయి.వృద్ధులకు కావలసింది గౌరవం, సంరక్షకుడు కాదు!70 ఏళ్లు పైబడిన వారు రూ. 50,000కు మించి లావాదేవీ చేయాలంటే కుటుంబ సభ్యుల (నమ్మదగిన వ్యక్తి) అనుమతి తప్పనిసరి చేయడం మరో ప్రతిపాదన. ఈ నిబంధన వారిని కుటుంబ సభ్యుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుంది. మన సమాజంలో వృద్ధులు కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఆర్థిక మోసాలకు గురవుతున్న సందర్భాలు అనేకం. దీనికి బదులుగా, ‘లైసెన్స్డ్ ట్రస్టెడ్ అథెంటికేటర్ సర్వీస్’ను నామమాత్రపు రుసుముతో ప్రవేశపెట్టాలి. దారిద్య్ర రేఖ దిగువ ఉన్నవాళ్లకు ఈ సేవ ఉచితంగా అందించాలి. వీరు వృద్ధులతో వారి సొంత భాషలో మాట్లాడి లావాదేవీని ధ్రువీకరించాలి. అప్పుడు వృద్ధుల ఆత్మగౌరవం దెబ్బతినదు. ఈ నూతన సేవ వల్ల ఇంకొన్ని ఉద్యోగాలు సృష్టించినట్టు కూడా అవుతుంది.డిజిటల్ మోసాల సమస్య తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు అవసరమే. కానీ, అవి సామాన్యుల స్వేచ్ఛను హరించకూడదు. ప్రజలకు సరైన సాధనాలు అందిస్తే, వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని విధాన నిర్ణేతలు విశ్వసించాలి.– బూరుగుపల్లి మఠం అఖిల్ ‘ యువ ఆంట్రప్రెన్యూర్ -
మూడు విశ్వాసాల కేంద్రం
ఇటీవలి ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల్లో కొంతకాలం నిర్బంధాలకు గురైన జెరూసలేం నగరంలోని ప్రార్థనా స్థలాలు, కాల్పుల విరామ సమయంలో మళ్లీ తెరుచుకున్నాయి. ‘వెయిలింగ్ వాల్’గా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోడ వద్ద యూదులు; అల్–అఖ్సా మసీదులో మహమ్మ దీయులు; పరిశుద్ధ సమాధి ఆలయంలో క్రైస్తవులు– ఇలా మూడు ముఖ్య మతాలవారూ ఒకేసారి ప్రార్థనలు చేస్తున్న ఈ చిన్న నగరం ఎందుకు ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తోంది? యుద్ధ మేఘాల మధ్య కూడా ఆధ్యాత్మిక ఆకర్షణను ఎలా నిలబెట్టుకోగలుగుతోంది?క్రీ. పూ. 1000 ఏళ్ల ప్రాంతంలో పాత ఇశ్రాయేలును పాలించే యూదురాజు దావీదు ‘జెబూసులు’ అనే స్థానిక తెగల నుంచి జెరూసలేం నగరాన్ని జయించి, దానిని ఏకీకృత ఇశ్రాయేలు రాజ్య రాజధానిగా చేశాడు. అతని కుమారుడు సాలమన్ ఆ నగరంలో నేడు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తున్న కొండపై మొట్ట మొదటి యూదు ఆలయం నిర్మించాడు. ఆ ఆలయాన్ని తరువాతి కాలంలో బాబిలోనియన్లు, ఆ తరువాత రోమన్లు ధ్వంసం చేశారు. మిగిలిన అవశేషమైన గోడను ఈ రోజు ‘ఏడ్పుల గోడ’గా పిలుస్తున్నారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ కొండ, దానిపై ఒకప్పుడున్న ఆలయం గుర్తుగా మిగిలిన అవశేషం యూదులకు పరమ పవిత్రమైన ప్రార్థనా స్థలాలు.క్రైస్తవ మతానుయాయులకు, జెరూసలేం యేసుక్రీస్తు జీవితంతో ముడిపడి ఉంది. యేసు ఇక్కడే బోధించాడు, శిలువ వేయబడ్డాడు, పునరుత్థానం చెందాడు. నాలుగవ శతాబ్దంలో ‘పరిశుద్ధ సమాధి’ నిర్మాణంతో ఇది క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మారింది. ‘గోల్గతా’ లేదా ‘కల్వరి’గా పిలిచే శిలువ వేయబడిన స్థలం, క్రీస్తు సమాధి అయ్యి పునరుజ్జీవం పొందిన అనంతరం ఖాళీ అయిన సమాధి, శిక్షాస్థలి నుండి శిలువ వరకు క్రీస్తు నడిచి వెళ్ళిన ‘వేదన మార్గం’ (లేదా డోలోరోసా), సమాధికి వెళ్ళే మార్గంలో, క్రీస్తు అనుభూతులను జ్ఞప్తికి తెచ్చే 14 ముఖ్య ప్రాంతాలు– క్రైస్తవులకు పరమ పూజనీయాలు.ముస్లింలు అల్–ఖుద్స్గా పిలుచుకునే జెరూసలేం నగరం వారికి మక్కా, మదీనాల తరువాత అత్యంత పవిత్రమైన స్థలం. ఇస్లాం మొదటి రోజుల్లో జెరూసలేం వైపే ఖిబ్లా, అంటే ‘నమాజు చేసే దిక్కు’ ఉండేది; తరువాతి రోజుల్లో కారణాంతరాల వల్ల ఈ దిక్కు మక్కాలోని ‘కాబా’ వైపునకు మారింది. మహమ్మద్ ప్రవక్త ఒక రాత్రి మక్కా నుంచి జెరూసలేం వచ్చి; హరామ్ అల్ షరీఫ్ (అదే ప్రాంతాన్ని యూదులు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తారు)లోని ‘పునాది శిల’ నుంచి స్వర్గారోహణ చేశాడని మహమ్మదీయులు విశ్వసిస్తారు. అదే శిలపై తరువాతి కాలంలో నిర్మించబడిన ‘రాతి గుమ్మటం’, దాని పరిసరాలలోని ‘అల్–అఖ్సా మసీదు’... ఇవన్నీ మహమ్మదీయులకు ఎనలేని ప్రాధాన్యం కలిగిన స్థలాలు. మహమ్మద్ ప్రవక్త స్వర్గారోహణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన ఇస్రా, మిరాజ్‌లకు కూడా ఈ ప్రాంతం కేంద్ర బిందువు.ఒకే మూల పురుషుడుఆరాధనా స్థలాలలోనే కాదు, ఆవిర్భావంలో కూడా ఈ మూడు మతాలకు విశేషమైన సారూప్యత, సామీప్యత ఉన్నాయి. ‘ఒకే దైవం’ అనే సిద్ధాంతాన్ని విశ్వసించి, బోధించిన ప్రప్రథమ ప్రవక్త ‘అబ్రహమ్’ లేదా ‘ఇబ్రహీమ్’. ఆ ప్రవక్త కుమారుడైన ఇసాక్‌కు జాకబ్ జన్మించాడు. ‘ఇజ్రాయెల్’ అనే దైవదత్త నామాంతరం కలిగిన జాకబ్ నుండి యూదులు ఉద్భవించటంతో, వారి ప్రాంతం ‘ఇజ్రాయెల్’గా పేరొందింది. జన్మతః యూదు మతస్థుడైన క్రీస్తు మరణానంతరం... ఆయనను విశ్వసించే యూదు సమూహం వారి అసలు మతాన్నుండి విడివడటంతో క్రైస్తవులుగా వారిని పిలుస్తున్నారు. అబ్రహమ్ మరో కుమారుడైన ఇస్మాయిల్ నుండి ఇస్లాం ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. ఇలా ఒకే మూల పురుషుడు గలిగిన మూడు మతాలవారు, ఒకే భౌగోళిక ప్రాంతంలో తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు నిర్వహించడం అసాధారణం కాదు.ఒకే ప్రవక్త నుండి ఉద్భవించి, ఒకే చరిత్రను పంచుకోవడం వల్ల జెరూసలేం మూడు మతాలవారికీ ముఖ్య కేంద్రంగా ఖ్యాతికెక్కింది. చిత్రంగా, అదే చారిత్రక వాస్తవం శతాబ్దాలుగా సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు – ఒక్కోసారి మానవ హననానికి కూడా కారణమవుతోంది. యుద్ధ విరామంలో ఈ పవిత్ర స్థలం తిరిగి అందరినీ అక్కున జేర్చుకోవడం సుస్థిరమైన శాంతిని స్థాపించే సుదీర్ఘ ప్రస్థానంలో చిన్న ఆశాకిరణం.కృష్ణబాలాజీ పల్లపోతువ్యాసకర్త ఎస్బీఐలో, పశ్చిమాసియా దేశాల్లో విధులు నిర్వహించిన విశ్రాంత ఉన్నతాధికారి -
నితిన్ నబిన్ (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ
పనంటే పూర్తయ్యేది కాదు. మొదలయ్యేది! ఇది మానవజన్మ సుకృతమా, లేక, మోదీజీ నాయకత్వానికి మాత్రమే పరిమితమైన శ్రమైక జీవన సౌందర్యమా?! ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్. ఆ రోజుతో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలూ పూర్తయినట్లు. ఎన్నికలు ‘పూర్తవడం’ అన్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కే గానీ, భారతీయ జనతా పార్టీ చీఫ్‌కి కాదు. పనితో మొదలై, మళ్లీ పనితోనే మొదలయ్యే ఆదీ అంతమూ లేని పదవీ కాలం బీజేపీ అధ్యక్షుడిది. అధ్యక్షుడిదే కాదు, పైనుంచి కింది వరకు పార్టీలోని ప్రతి కార్యకర్తదీ. జనవరిలో నేను జాతీయ అధ్యక్షుడిగా పనిలో పడ్డాక తొలిసారి జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలివి. ఉన్నచోట ఉన్నట్లు లేదు. తిన్న చోట తిన్నట్లు లేదు. పనే, నా కాలమూ దూరము, వేగము.మొత్తం 34 రోజులు, 65 రోడ్ షోలు! పశ్చిమ బెంగాల్లో 11 రోజులు, 22 రోడ్ షోలు; అస్సాంలో 9 రోజులు, 18 రోడ్ షోలు; కేరళలో 7 రోజులు; 12 రోడ్ షోలు; తమిళనాడులో 5 రోజులు; 8 రోడ్ షోలు; పుదుచ్చేరిలో 2 రోజులు, 5 రోడ్ షోలు. పనిలో ఉన్నవారికి అలసట ఉండదు. ప్రజల మధ్య ఉన్నవారికి భూమీ, ఆకాశం; బిహార్, ఢిల్లీ ఉండవు. బాలుర్‌ఘాట్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు బాలకృష్ణుడి చేతి నిండా వెన్న ముద్ద పెట్టినట్లుగా, బెంగాల్ ప్రజలు ప్రతిచోటా నాకు తియ్యటి ‘మిష్టీదోయి’ తినిపించారు. నా గుండె నిండింది కానీ... గొంతు గడ్డ పెరుగు అయింది. 24 పరగణాల జిల్లాలోని నైహతిలో కూడా మిష్టీదోయిని నా నోటికి అందివ్వ బోయిన వారిని ఆత్మీయంగా ప్రతిఘటించి, ‘‘ఈ పెరుగుకు బదులుగా ఒక గ్లాసు మామూలు నీళ్లు ఇవ్వగలరా?’’ అని వేడుకున్నాను. మదురై రోడ్ షోలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం రెండూ కలిసి ఉప్పొంగినట్లుగా జనం! నాలోంచీ భావావేశం ఉబికి వచ్చింది! తమిళంలో ‘‘వణక్కం’’ అంటూ చేతులు జోడించాను. ‘‘ఓ..’’ అంటూ ప్రజా హోరు! ఆ ఉద్వేగంలో పొరపాటున ‘‘భయ్యా..’’ అనేశాను. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ వెంటనే కేరింతలు కొడుతూ నవ్వులు. ‘‘నన్బా’’ అనబోయి అలవాటుగా ‘‘భయ్యా’’ అని అన్నానని తమిళ ప్రజలు నన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ‘‘నా హృదయం బిహార్‌దే కావచ్చు. అంతకన్నా విశాలమైన సముద్రం మీ హృదయం..’’ అని వారికి ధన్యవాదాలు తెలిపాను. అస్సాంలోని కమల్పుర్ సమీపంలో ఒక ఏనుగు నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో నా కాన్వాయ్ 15 నిముషాలు ఆగిపోవటం నాకొక ఆహ్లాదకరమైన జ్ఞాపకం. ఆ ‘వీఐపీ’ని ఫొటో తియ్యటం కోసం కారు దిగి వెళ్లాను. వన్యప్రాణుల రాజసానికి మోదీజీ ఒక్కరే దీటైనవారు అని ఆ క్షణాలలో నాకు అనిపించింది! ఆయనలో గర్జించే సింహమూ కనిపిస్తుంది, మనసుకు హాయినిచ్చే మయూరమూ పురి విప్పుతుంది. కేరళలో నిమ్మరసం, ఘాటైన మసాలాలు కలిపి తయారు చేసే అక్కడి సంప్రదాయ ‘సులేమానీ’ బ్లాక్ టీని గుటకేయటం కాస్త కష్టంగానే ఉన్నా, అందులో వారు జోడించిన ఆతిథ్య భావన పచ్చని కొబ్బరి చెట్ల వంటి ఆ రాష్ట్ర ప్రజలకు నన్ను కట్టిపడేసింది.పుదుచ్చేరిలో పార్టీ మండల అధ్యక్షులతో అర్ధరాత్రి జరిగిన సమావేశమైతే నాకొక ‘అత్యున్నత’ స్థాయి!! నాలోని జాతీయ అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్షుడిగా మారిపోయాడు. పనినే మోదీజీగా భావించే వారికి పదవుల పట్టింపులు ఉంటాయా? మే 4న కౌంటింగ్. ఆ రోజున వచ్చేవి ఎన్నికల ఫలితాలు కావు. ఆ ఐదు రాష్ట్రాల ప్రజలు మోదీజీకి చేతి నిండా కల్పించే పనులు. ఆయన చేతుల మీదుగా పార్టీ కార్యకర్తల దోసిళ్లలోకి కురిసే బాధ్యతల బంగారు నాణేలు! -
'రణక్షేత్రం' ఇండో పసిఫిక్‌కు మారేనా?
ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిపై ఉన్న ప్రస్తుత తరుణంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిశ్శబ్దంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరుక్కుపోకుండా ఉండాలని యూఎస్ అధ్యక్షుడు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఇదే అదనుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇండో– పసిఫిక్‌లో పావులు కదుపుతున్నాడు. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ (కేఎమ్‌టీ) నాయకురాలు చెంగ్–లీ–వున్కు చైనా పర్యటనలో ఘన స్వాగతం లభించింది. ఏప్రిల్ 10న జిన్‌పింగ్ కేఎమ్‌టీ నాయకురాలితో సమావేశమవటం చైనా కొత్త ఎత్తుగడను సూచిస్తున్నది. తైవాన్ విలీనమే చైనా లక్ష్యంతైవాన్ అధికార పార్టీ డీపీపీతో చైనా 2016 నుండి అధికారికంగా తెగదెంపులు చేసుకున్నది. ఆగస్టు 2022లో యూఎస్ఏ పార్ల మెంట్ స్పీకర్ నాన్సీ పొలేసి అధికారికంగా తైవాన్ను పర్యటించటంతో ఇండో–పసిఫిక్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ‘వ్యూహా త్మక సందిగ్ధత’ సిద్ధాంతం నుండి దూరంగా జరిగి ఈ పర్యటన ద్వారా యూఎస్ఏ తైవాన్‌కు బహిరంగంగా మద్దతిచ్చినట్లయింది. వెంటనే చైనా పెద్ద మొత్తంలో సైనిక విన్యాసాల రూపంలో బలప్రద ర్శనకు దిగింది. ఇటీవల కొత్తగా ఎన్నికయిన జపాన్ ప్రధాని సానయి తకాయిచి తైవాన్‌పై చైనా దాడి చేస్తే దానిని జపాన్ అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తామని ప్రకటించటం ద్వారా పసిఫిక్ యుద్ధంలో జపాన్ చూస్తూ ఊరుకోదని బహిరంగంగా హెచ్చరించింది. రానున్న దశాబ్దాలలో ప్రపంచ రాజకీయ చదరంగానికి ఇండో పసిఫిక్నే అడ్డా!రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో 1945లో తైవాన్ దీవులను జపాన్ నుండి చైనా హస్తగతం చేసుకున్నది. 1949లో చైనాలో అంతర్యుద్ధం సందర్భంగా చైనాలోని ఒక వర్గం తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్ఓసీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) ప్రభుత్వం ఏర్పడింది. 1950 నుండి 1970 వరకు పీఆర్సీ– ఆర్‌ఓసీల మధ్య సాయుధ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి 1971లో పీఆర్సీని చైనా ప్రభుత్వంగా గుర్తించింది. 1979లో యూఎస్ఏ కూడా గుర్తించింది. తైవాన్ను ప్రపంచ సమాజం ఒక స్వతంత్ర దేశంగా గుర్తించనప్పటికీ, అది యూఎస్ఏ మద్దతుతో ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా రూపొంది స్వయంపాలిత దీవిగా ఎదిగింది. ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమకు రాజధానిగా రూపుదిద్దుకున్నది. ప్రపంచ సెమీ కండక్టర్ ఉత్పత్తులలో తైవాన్ వాటా 60 శాతం. అధునాతన ఏఐ రంగంలో వాడే అత్యాధునిక చిప్స్ తయారీలో తైవాన్ వాటా 90 శాతానికి పైగా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థ, ఉదార విధానాలకు ప్రతీకగా ఉన్న తైవాన్ను విలీనం చేసుకోవాలనేదే చైనా విధానం. నేరుగా అమెరికాకు సవాలు!1997లో హాంకాంగ్ దీవి చైనాలో విలీనం అయాక, ఒకే దేశం – రెండు వ్యవస్థలు విధానాన్ని తైవాన్‌కు కూడా వర్తింపజేయాలని చైనా ప్రతిపాదిస్తున్నది. 2014లో హాంకాంగ్‌లో చైనా నియంతృత్వ, ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా గొడుగుల ఉద్యమం (అంబ్రెల్లా మూవ్మెంట్) జరిగింది. అప్పుడు తైవాన్‌లో అధికారంలో ఉన్న కేఎమ్‌టీ పార్టీ, చైనాతో ఉదార వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి వ్యతిరేకంగా పొద్దు తిరుగుడు ఉద్యమం (సన్‌ఫ్లవర్ మూవ్మెంట్) జరిగింది. హాంకాంగ్ విలీనం తర్వాత క్రమంగా అక్కడ పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులను చైనా అణచి వేసింది. ‘నిన్న హాంకాంగ్ – రేపు తైవాన్’ నినాదం కింద తైవాన్‌కూ హాంకాంగ్ గతి పడుతుందని తైవాన్ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఉత్తర పసిఫిక్ మహా సముద్రం చైనా, రష్యాలను – యూఎస్ఏను విభజిస్తుంది. ఈ ప్రధాన శక్తులు భౌగోళికంగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రానికి ఇరువైపులా మోహరించి ఉన్నాయి. భారతదేశం వరకు విస్తరించిన ఇండో పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ఏ, చైనా, రష్యా, జపాన్, భారత్‌ల మధ్య జియో పొలిటి కల్ యుద్ధం ప్రారంభమయింది. ఈ శతాబ్దంలో ప్రపంచ ఆధిప త్యాన్ని ఇండో పసిఫిక్ శాసిస్తుందని జియో పొలిటికల్ శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న చైనా సాయుధ శక్తి, తిరిగి పుంజుకున్న రష్యా ఆర్థిక వ్యవస్థ, జిన్‌పింగ్ నాయకత్వంలో ప్రపంచాన్ని శాసించాలనే చైనా ఆశలు– వేగంగా బలోపేతమవు తున్న భారత్, యూఎస్ఏకు సవాలు విసురుతున్నాయి.1945 నుండి గత 75 సంవత్సరాలుగా యూఎస్ఏ ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్నది. యూఎస్ఏను నేరుగా ఎదుర్కొనే శక్తి చైనా– రష్యాలకు మాత్రమే ఉన్నది. ఈ ఘర్షణ తైవాన్‌తో ప్రారంభమ వటానికి అవకాశాలు హెచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ‘ఈ తరంలోనే తైవాన్ విలీనం’ అని ప్రకటించటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. జిన్‌పింగ్ మూడవ పదవీ కాలం 2028లో ముగియ నున్నది. బహుశా 2027 లోపు తైవాన్ను చైనా ఆక్రమించవచ్చని వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, దాన్ని నేరుగా యూఎస్ఏకు సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. భారత నౌకాశక్తి కీలకంసైనిక వ్యూహ పరిభాషలో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ద్వీప సమూహాలను యూఎస్ఏ తన ‘రక్షణ శ్రేణులు’గా పరిగణిస్తుంది. మొదటి రక్షణ శ్రేణి – కుర్లీ దీవులు, ర్యుకూ దీవులు, తైవాన్ దీవులు. జపాన్ దీవులు, బానిన్స్, గువామ్, పలావు దీవులు– రెండవ రక్షణ శ్రేణి. అల్యూషియన్ దీవులు, హవాయి దీవులు, సమోవా దీవులను మూడవ రక్షణ గోడగా పరిగణిస్తారు. ఈ మూడు శ్రేణులు దాటితే అమెరికా ప్రధాన భూభాగాన్ని చైనా చేరుకోవచ్చు. అందుకే ఈ దీవు లపై చైనా పెత్తనాన్ని అమెరికా సహించదు. దానివల్ల జలసంధులు, జలరవాణా మార్గాల రక్షణ కీలకం కాబోతున్నది.మొదటి రక్షణ శ్రేణిలోని మియాకో, తైవాన్, లూజాన్, సుండా జలసంధులను రక్షించటానికి ఒకినావో (జపాన్), ఫిలిప్ఫైన్స్లలో యూఎస్ఏ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. గువామ్‌లోని అమెరికా సైనిక స్థావరం రెండవ వలయానికి రక్షణ కల్పిస్తున్నది. హవాయిలో సైనిక స్థావరం మూడో వలయానికి కేంద్రకం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా–రష్యాలను నియంత్రించడానికి అమెరికా ఇతర సైనిక శక్తులతో చేతులు కలిపింది. ఆస్ట్రేలియా, భారత్, యూఎస్ఏ, జపాన్ సభ్యులుగా 2004లో క్వాడ్ ఏర్పడింది. క్వాడ్‌ను ఆసియా నాటోగా పరిగణిస్తారు. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే సభ్యులుగా ఆకస్ కూటమి పనిచేస్తున్నది.ఉత్తర పసిఫిక్ ప్రాంతాన్ని ఆసియా–ఐరోపాలతో అనుసంధానం చేసే కీలక ప్రాంతంలో భారతదేశం ఉన్నది. ఈ ప్రాంతంలోని అండమాన్ నికోబార్ దీవులు, మలేషియా, సింగపూర్లను నాలుగవ రక్షణ శ్రేణిగా యూఎస్ఏ పరిగణిస్తుంది. ఇండో పసిఫిక్‌కు ముఖద్వారంలో భారతదేశం కొలువై ఉన్నది. చైనా ప్రపంచాన్ని భయపెట్టాలన్నా, ప్రపంచం చైనాను అదుపు చేయాలన్నా మలక్కా, తైవాన్ జలసంధులు కీలకం. మలక్కా, తైవాన్ జలసంధుల వద్ద సమీప భవిష్యత్తులో హార్మూజ్ ముఖచిత్రం ఆవిష్కృతం కావొచ్చు. తైవాన్ జలసంధిని చైనా అదుపులోకి తీసుకొంటే, ప్రతిగా మలక్కా జలసంధిని మూసివేయటానికి యూఎస్ఏ–జపాన్ ప్రయత్ని స్తాయి. ఇక్కడ భారత్ పాత్ర కీలకమవుతుంది. భారత్ తోడ్పాటు లేకుండా ఏ నౌకాశక్తి మలక్కాపై పెత్తనం చలాయించలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
శరవేగంగా నేపాల్ సంస్కరణలు
నేపాల్‌లో మార్చి 27న ఏర్పడిన బాలేంద్ర షా ప్రభుత్వం నెల రోజులైనా పూర్తి కాకముందే ప్రవేశపెడుతున్న పరిపాలనా సంస్కరణలను గమనించినపుడు, ఇంతటి వేగం ఆచరణలో సాధ్యమయేనా అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. రబీ లమిఛానే అధ్యక్షతన గల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) దేశ చరిత్ర లోనే ఎన్నడూ లేనంత మెజారిటితో గెలిచి, పాత పార్టీలన్నింటిని అక్షరాలా ఊడ్చిపెట్టిన స్థితిలో, ప్రధాని బాలేన్ ప్రభుత్వం నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్న మాట నిజం. అది తెలిసినందువల్లనే, 27న ప్రమాణ స్వీకారం తర్వాత రెండు రోజు లకు 29న జరిగిన మొదటి క్యాబినెట్ సమా వేశంతోనే ఆరంభించి వరుసగా అనేక చర్యలు తీసుకోవటం కనిపిస్తున్నది.100 అంశాల ప్రణాళికమనకు తెలిసిన ప్రజాస్వామ్యాన్ని, పరిపాలనను దృష్టిలో పెట్టు కుని చూసినపుడు ఆ చర్యలలో కొన్ని ఆశ్చర్యకరంగా తోస్తాయి. ఉదాహరణకు పరిపాలన వేగంగా, సమర్థవంతంగా సాగేందుకు, సామాన్యులకు కూడా ఉపయోగకరంగా ఉండేందుకు మొదటి క్యాబి నెట్ సమావేశంలోనే 100 అంశాల ప్రణాళిక ప్రకటించారు. వాటి అమలు తీరును ఎవరైనా సరే గమనించేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్‌ను సృష్టించారు. ఆ తర్వాత, 18 అభివృద్ధి రంగాలపై పూర్తి దృష్టి పెట్టి పనిచేయగలమంటూ 18 అంశాలతో ‘నేషనల్ కమిట్ మెంట్ డాక్యుమెంట్’ పేరిట ముసాయిదా పత్రాన్ని విడుదల చేసి, దానిపై పార్టీలు, సంస్థలు, మేధావులు, ప్రజల సూచనలను కోరారు. విశేషం ఏమంటే, ఓడిపోయిన పార్టీల మేనిఫెస్టోలలోని ముఖ>్యంశాలను కూడా ఈ డాక్యుమెంట్లో చేర్చారు. ఆ పార్టీల నాయకులు నలుగురికి కూడా ఒక కమిటీలో స్థానం కల్పించారు. దానిని బట్టి, నేపాల్ అధికార పక్షంతోపాటు యువ ప్రధాని ఆలోచనల తీరును అర్థం చేసుకోవచ్చు. ఇది ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన కొన్ని ప్రజాస్వామిక ప్రయోగాలను గుర్తు చేస్తున్నది. రాజీవ్ గాంధీ ప్రధాని అయినప్పుడు ఈ స్థాయి మార్పులైతే చేయలేదు గానీ, ముఖ్యమైన విధానపర అంశాలపై ప్రతిపక్షాలను సంప్రదించే పద్ధతిని ప్రవేశపెట్టి ప్రశంసలు పొందారు. తదనంతర పరిణామాల వల్ల అంతా భంగపడిందన్నది వేరే విషయం. అప్పుడే తప్పుకున్న ఇద్దరు మంత్రులుజెన్–జీ ఉద్యమం నేపాల్ రాజకీయ వ్యవస్థను అంతగా కుదిపి వేయటానికి ఒక ముఖ్య కారణం అవినీతి అన్నది తెలిసిందే. ఆ దృష్ట్యా, అవినీతిని అన్ని స్థాయుల్లో అరికట్టగలమన్నది ఆర్ఎస్పీ ఇచ్చిన హామీ. అందుకు అనుగుణంగా, ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు వారాలలోనే ప్రధాని సహా మంత్రులంతా తమ ఆస్తులను ప్రకటించారు. రాజును 2006లో పడగొట్టగా, అప్పటినుంచి నేటి వరకు రాజు జ్ఞానేంద్రతో పాటు అందరు మాజీ ప్రధానులు,మంత్రులు, సీనియర్ నాయకులు, సీనియర్ అధికారుల ఆస్తులపై దర్యాప్తు కోసం కమిషన్‌ను నియమించారు. అంతలోనే ఒక నిర్ణయం దేశాన్నంతా ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు వారాల క్రితం నియమితుడైన కార్మిక మంత్రి దీపక్ కుమార్, ఒక పని చేయని ఆరోగ్య బీమా బోర్డులో అధికారి అయిన తన భార్యను కొనసాగించేందుకు అధికార దుర్వినియోగం చేశారంటూ వెంటనే క్యాబినెట్ నుంచి తొలగించారు. ఆ దుర్వినియోగాన్ని పట్టించుకోనందుకు ఆరోగ్యమంత్రి నిషా మెహతాకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కొద్ది రోజులలోనే మనీ లాండరింగ్ కేసులో మాజీ ప్రధాని దేవుబా దంపతులకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయగా, కొద్దిమంది పెద్ద వ్యాపారులను అరెస్టు చేశారు. ఇది అనుమానించే కావచ్చు దేవుబా దంపతులు చికిత్స కోసమంటూ ముందే విదేశా లకు వెళ్లారు. (ఏప్రిల్ 22న ఏకంగా హోంమంత్రి సుధన్ గురుంగ్ రాజీనామా చేయడం మరో సంచలనమైంది. తన పెట్టుబడుల మీద తలెత్తిన ప్రశ్నల మీద నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగానే పదవి నుంచి తప్పుకున్నట్టు ఆయన వెల్లడించారు.) పరిపాలనా పరంగా తీసుకున్న ఒక ప్రధానమైన చర్య, ఫెడర లిజం సక్రమంగా అమలయ్యేందుకు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బాలేన్ జరిపిన చర్చలు. వారిలో అన్ని పార్టీల వారున్నారు. వాస్తవానికి ఫెడరలిజం ఏర్పాట్లు రాజ్యాంగంలో 2015 నుంచి ఉన్నాయి. కానీ వాటిని ఏరికోరి చేర్చిన కాంగ్రెస్, కమ్యూ నిస్టు, మావోయిస్టు పార్టీలు ఏవీ అమలుపరచలేదు. అందుకిపుడు పదేళ్ల తర్వాత మోక్షం లభిస్తున్నది. ప్రధానితో జరిగిన చర్చలలో ఆ ముఖ్యమంత్రులంతా తమకు చట్టపరమైన, ఆర్థికపరమైన, శాంతి భద్రతలపరమైన అధికారాలు సవ్యంగా లభించలేదని చెప్పారు.అమలులో ఎదురయ్యే సవాళ్లు18 అంశాల ‘కమిట్మెంట్ డాక్యుమెంట్’ గమనిస్తే, వాటిలో వ్యవసాయం, విద్యుత్తు, గనులు, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక రంగం, టూరిజం, పౌర విమానయానం వంటి ఆర్థికాభి వృద్ధిపరమైనవి కనిపిస్తాయి. అవిగాక ఉద్యోగ – ఉపాధి కల్పన, విద్య, వైద్యం, పరిపాలనా సంస్కరణలు; పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం మొదలైనవి ఉన్నాయి. దేనికైనా నిధులు తప్పని సరి కాగా, ఆ కొరత నేపాల్‌కు ఎక్కువే. వారికి గల తీవ్రమైన కొరతలు సహజ వనరులు, పరిశ్రమలు, ఉత్పత్తి రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పరిమితం కావటం. అయితే, ఇంతకుముందువలెగాక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, అధికార పక్షం పట్టుదల చూపటం, అవినీతిని నియంత్రిస్తుండటం వల్ల బయటినుంచి సంస్థాగతంగా, ప్రైవేట్ రంగం నుంచి, ప్రభుత్వాల నుంచి తోడ్పాటు లభించే అవకాశాలున్నాయి.ప్రత్యేకంగా నిధులతోగానీ, క్రమంగా జరగవలసిన అభివృద్ధితో గానీ సంబంధం లేని చర్యలు కొన్ని 100 అంశాల ప్రణాళికలో ఉన్నాయి. అవి సాధారణ పరిపాలనాపరమైనవి. ఉదాహరణకు ఆస్తుల వెల్లడి, అవినీతిపై దర్యాప్తులు, విద్యా సంస్థలలో పార్టీ అనుబంధ యూనియన్ల రద్దు, ప్రైవేటు ఆసుపత్రులలో 10 శాతం పడకలు పేదలకు ఉచితంగా కేటాయింపు, ప్రజావసరాలు, సర్వీ సులు వారి గుమ్మం వద్దకే చేరటం వంటివి. ఇవి అమలైనకొద్దీ ఒకవైపు ప్రభుత్వంపట్ల ప్రజలకు నమ్మకం పెరగటం, వారి జీవి తాలు మెరుగు పడటం జరుగుతుంది.బాలేంద్ర షా కాఠ్మండూ మేయర్‌గా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చేసిన అభివృద్ధి పనులు, తను అవినీతిపరుడు కాకపోవటం ఈ ఎన్నికలలో బాగా కలిసి రావటం తెలిసిందే. ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లమీఛానేకు కూడా ముక్కుసూటి మనిషి, మంచి వక్త, సమ ర్థుడనే పేరున్నది. ఇద్దరూ ఇంతకాలం పాత పార్టీలను, వాటి అక్రమాలను వ్యతిరేకించినవారు. అందువల్ల జాగ్రత్తగా, ఇదే పట్టుదలతో వ్యవహరించినట్లయితే నేపాల్ ముఖచిత్రం క్రమంగా మారగలదని చెప్పవచ్చు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేత, టి.జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా రేవంత్, కేసీఆర్‌లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్ కాళేశ్వరం వెళ్లాడని జీవన్ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టమే. బహశా అందుకే రేవంత్ ఆయన పేరు ప్రస్తావించి ఉండాలి. ‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్ఎస్లోకి వెళ్లాడు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్‌ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్లో జీవన్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్‌పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సొంతంగా తన కేడర్‌ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది. అయినా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. అయితే.. ఈ పరిణామం బీఆర్ఎస్కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్‌ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్‌ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్ ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్ ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్‌సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్‌ను పాపాల భైరవుడని.. ఆయన చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే ఆయన ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు. తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు పిల్లర్లు కుంగిన అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్గా కనిపిస్తుంది. తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న డౌట్లు రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు కూడా ఈ హైడ్రా పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు ఉండవచ్చు. కానీరాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే.. అది కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్ లేవనెత్తారు. కాగా కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ నిజానికి తన పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు పగిలేదాక.. అంటూ కొన్ని పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్ యత్నించారు. తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్ కొంతమేర పైచేయి అయినట్లు అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విజేతను నిర్ణయించేది 'విజయ్ ఫ్యాక్టర్!'
ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు హీరో విజయ్ నిర్ణాయక అంశం కాబోతున్నారు. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా, ఓట్ల చీలికలో విజయ్ ప్రభావం వల్ల విపక్ష ఏఐడీఎంకే–బీజేపీ కూటమి కన్నా పాలక డీఎంకే–కాంగ్రెస్ కూటమికే మేలు జరిగే సూచనలున్నాయి. ఢిల్లీ పెత్తనం వర్సెస్ ‘తమిళ ప్రైడ్’ తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశముంది. విపక్షాల్లో అనైక్యత లాభించి, తండ్రి కరుణానిధి సాధించలేని ఘనత – డీఎంకేను వరుసగా రెండోసారి గెలిపించడం తనయుడు స్టాలిన్ సాధించనూవచ్చు!తమిళనాట ద్రవిడ పార్టీల రాజకీయాలది ఆరు దశాబ్దాల చరిత్ర! 1967 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో తమకంటూ సొంతంగా బలం, బలగం లేకపోయినా... డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కు, ఏఐడీఎంకే మద్దతు బీజేపీకి ఢిల్లీలో కావాలి. అందుకే ఆ రెండు ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలు ద్రవిడ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని, అల్ప భాగస్వాములు (తోక పార్టీలు)గా పోరాడుతున్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ ప్రాంతీయ శక్తులు భాగం పంచుకుంటాయి తప్ప, రాష్ట్ర అధికారంలో మాత్రం జాతీయ పార్టీలకు ఎప్పుడూ భాగమి వ్వవు. ఒక పరిమితిని (8 నుంచి 10 శాతం ఓటు వాటా) మించి ఆయా పార్టీలను రాష్ట్రంలో ఎదగనీయవు. ఈసారి విశేషమేమంటే, సినీ కెరటం విజయ్, అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగి ఈ రెండు కూటములకు గట్టి సవాల్ విసురు తున్నారు. గ్రామీణ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల యువతలో విజయ్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. పాలక ‘లౌకిక ప్రగతిశీల కూటమి’లో డీఎంకే, కాంగ్రెస్‌లతో పాటు డీఎండీకే, వీసీకే తదితర ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య సయోధ్య, సీట్ల సర్దుబాటు ఒకింత సామరస్యంగా జరిగింది. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ బలపడనీయకుండా గట్టి సంకేతం ప్రజాక్షేత్రంలోకి పంపగలిగారు. విపక్ష ఎన్డీయే కూటమి భాగస్వా ముల మధ్య సఖ్యత గొప్పగా లేదు. కూటమిలో ఆధిపత్యానికి మొదట కొంత యత్నించిన బీజేపీ, చివరకు విధిలేని పరిస్థితుల్లో పొత్తుల్లో ఏఐడీఎంకే ఆధిపత్యానికే తగ్గింది. గణాంకాలు చెప్పేవి అర్ధ సత్యాలే!రాజకీయాలు అంకగణితం కాదు, 2+2 నాలుగవటం లెక్కల్లోనే తప్ప రాజకీయాల్లో అవాలని లేదు. 2+2 ఆరు అవొచ్చు, జీరో అవొచ్చు. 234 స్థానాలున్న అసెంబ్లీలో అధికారానికి 118 సీట్లు కావాలి. ఈసారి ఏ ఒక్క పార్టీకి ఆ సంఖ్య దక్కకపోవచ్చు. 2021 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వపు ఎస్పీయే కూటమి 45.3 శాతం ఓటు వాటాతో 159 స్థానాలు గెలిచింది. అంతకు ముందు స్టాలిన్ మేయర్‌గా చేసిన చెన్నై మహానగర్ పరిధిలోని 22 అసెంబ్లీ స్థానాల్లో ఏఐడీఎంకేకు ఒక సీటు కూడా రాలేదు. ఎన్డీయే కూటమి 39.7 శాతం ఓటు వాటాతో 75 స్థానాలు నెగ్గింది. 2016 ఎన్నికల్లో జయ లలిత గెలుపు తర్వాత మరే ఎన్నికల్లోనూ ఏఐడీఎంకేకు ఆధిపత్యమే దక్కలేదు. అదే యేడు చివర్లో జయలలిత మరణం తర్వాత... పళనిస్వామి, పన్నీరు సెల్వమ్ల మధ్య వివాదాలతో పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలు (38/39), తర్వాతి అసెంబ్లీ (2021) ఎన్నికలు (159/234), అటు తర్వాత మూడేళ్లకు జరిగిన 2024 లోక్‌సభ (39/39), స్థానిక సంస్థల ఎన్నికలు, 2021–2026 మధ్య దాదాపు అన్ని ఉపఎన్నికలు... ఇలా అన్నిటా డీఎంకే మిత్రులు గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో చివరి పెద్దపోరు 2024 లోక్‌సభ ఎన్నికల్లో, 221 అసెంబ్లీ సెగ్మెంట్లలో డీఎంకే కూటమికి ఆధిక్యత లభిస్తే ఏఐడీఎంకేకు 10 చోట్ల, పీఎంకేకు 3 చోట్ల ఆధిక్యత దక్కింది. ఆ ఎన్నికల్లో బీజేపీ, ఏఐడీఎంకేలు విడిగా పోటీ చేశాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పీఎంకేకు 3 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత లభించింది తప్ప బీజేపీకి ఒకచోట కూడా ఆధిక్యత రాలేదు. గణాంకాల పరంగా చూసినపుడు డీఎంకే కూటమి బలంగా కనిపిస్తోంది. 1984లో ఎంజీ రామచంద్రన్, 2016లో జయలలిత తప్ప వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని గెలిపించుకొని, తిరిగి ముఖ్యమంత్రి అయినవారు లేరు. కరుణానిధికి అదెప్పుడూ సాధ్యపడలేదు. స్టాలిన్ మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయితే తండ్రిని మించి రికార్డు నెలకొల్పినట్టే!ఢిల్లీ వర్సెస్ తమిళ గాలిప్రాంతీయ, భాష, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వ భావో ద్వేగాల రాష్ట్రం తమిళనాడు. అవి రగిలినపుడు, జనం ఎటువైపు మళ్లినా ఉప్పెనలా ఎగిసిపడతారని ప్రచారం. జాతీయ పార్టీలు, జాతీయ అంశాల ప్రభావం నామమాత్రమే! స్టాలిన్ నెమ్మదిగా రాజకీయ పోరాటాన్ని ఢిల్లీ పెత్తనం వర్సెస్ తమిళ గౌరవం కిందకు మార్చే యత్నం చేస్తున్నారు. త్రిభాషా సూత్రం, బీజేపీయేతర ప్రభుత్వాలపై గవర్నర్ల ద్వారా దొడ్డిదారి పెత్తనం, నిధుల కేటాయింపులో వివక్ష, నియోజకవర్గాల పునర్విభజనలో ప్రాతినిధ్య తగ్గింపు ప్రమాదం... ఇలా పలు అంశాలతో ప్రచారం చేస్తున్నారు.తమిళ సమాజం మీద మొదటి, రెండో తరం నాయకులంత పలుకుబడి, ప్రభావం కలిగిన నేత కాదు స్టాలిన్. అయినా ఈతరంలో స్టాలిన్‌కు దీటుగా నిలువగలిగే నాయకులు లేరు. మొదటి తరంలో రాజాజీ, కామరాజ్ నాడార్, అన్నాదురై లాంటి హేమాహేమీలుంటే, తర్వాతి తరంలో సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత ఒక వెలుగు వెలిగారు. సినీరంగం నుంచి కమల్‌హాసన్, విజయ్‌కాంత్ (దివంగత), సీమాన్... ఇలా కొందరు ప్రయత్నించినా నిలదొక్కుకున్నది లేదు. కానీ, హీరో విజయ్ భిన్నంగా కనిపిస్తున్నారు. గత సంవత్సరం కరూర్ ర్యాలీ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన తర్వాత పెద్ద ర్యాలీలు, సభల్ని విజయ్ నిరాకరిస్తున్నారు కానీ, లోలోపల యువ తలో ఆసక్తి రేపుతున్నారు. తమిళ ఓటర్లలో 40 శాతం మంది 40 ఏళ్లలోపు వారే! రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ యువత విజయ్ వైపు మొగ్గితే ఎన్నికల సమీకరణాలే మారొచ్చు.తమిళ ఆకాంక్షలే ప్రతిఫలిస్తాయి!‘ఎన్నికల ఉచితాల’కు పేరుబడ్డ తమిళనాడులో వాటికి, నగదు బదిలీలకు మించి అదనంగా తమిళ ప్రజలు ఏదో కోరుకుంటు న్నారని ఈ ఎన్నికల సరళి చెబుతోంది. స్టాలిన్‌ను వెంటనే గద్దె దించేయాలన్నంత కోపం మూకుమ్మడిగా తమిళ ప్రజల్లో లేదు కనుక ‘విజయ్’ ఫ్యాక్టర్ విపక్షాలకు ఉపయోగపడకపోవచ్చు. దించేయాలన్నంత వ్యతిరేకత ఉంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్ చేసిన ప్రచారమంతా డీఎంకేని ఓడించగలిగే ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే–బీజేపీ కూటమి ఖాతాలో చేరేది. కానీ, 2009 ఏపీ ఎన్నికల్లో ‘చిరంజీవి’ (ప్రజారాజ్యం), జయప్రకాశ్ నారాయణ (లోక్‌సత్తా) ఫ్యాక్టర్ పాలకపక్షం కాంగ్రెస్‌కు లాభించి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసినట్టు ఇక్కడ కూడా విజయ్ కారకం స్టాలిన్‌కే లాభం చేకూర్చవచ్చు. కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ కన్నా మెరుగ్గా ఏం లేకపోయినా ప్రధాని మోదీ సానుకూలత ఎంతో కొంత తగ్గి, రాహుల్ ప్రజాదరణ పెరిగినట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. మహిళల ఓట్లు ఈసారి మూకుమ్మడిగా ఒక వైపు వెళ్లే పరిస్థితి లేదు. ఇలా అనేక అంశాలతో పాటు ‘విజయ్ ఫ్యాక్టర్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విజేతను తేల్చనుంది.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
విశాల ప్రయోజనమే విజయ రహస్యం
జీవితానికి ఒక ప్రయోజనం అంటూ ఉండాలని ఇటువంటి సందర్భాల్లో చాలామంది చెబుతారు. నేనూ అదే కోవలో మీరొక లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలో చెప్పబోవడం లేదు. సహస్రాబ్దిలో పుట్టిన వారిగా, ఏం చేయాలో మీకు సహజసిద్ధంగానే తెలుసు. కానీ, మన కంటూ ఒక ప్రయోజనం ఉంటే సరిపోదు. అమెరికా మాజీ అధ్య క్షుడు జాన్ ఎఫ్. కెనడీ ఒకసారి ‘నాసా’ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. అక్కడ ఒకతను చీపురు పట్టుకుని వెళుతూండటం చూసి, ఏం చేస్తున్నావని అడిగారు. ‘‘స్వామీ, చంద్రుని మీద ఓ మనిషి కాలుమోపేందుకు సహాయపడుతున్నాను’’ అని జవాబిచ్చాడు. మనం చేస్తున్న పని ఏదైనా కానివ్వండి. విస్తృత ప్రయోజనం కోసం పాటుపడుతున్నామనే అటువంటి భావన చాలా అవసరం. అనుసంధానంలో ఆనందంఫేస్బుక్ ప్రారంభించిన రోజు నాకు గుర్తుంది. హార్వర్డ్ కమ్యూనిటీ నంతటినీ అనుసంధానపరచగలగడం ఉత్తేజదాయకంగా ఉందనీ, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మొత్తం ప్రపంచానికి వారధి కల్పిస్తారనీ ఒక మిత్రునితో చెప్పాను. ఆ ఎవరో ఒక వ్యక్తి మనమే ఎందుకు కాకూడదనే ఆలోచనే నాకు రాలేదు. దాని గురించి మనకు ఏమీ తెలియదు కదా! వనరులు పుష్కలంగా ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఆ పని చూసుకుంటాయి అనిపించింది. కానీ, ప్రజలందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారని మాత్రం నాకు నిస్సందేహంగా తెలుసు. ఆ దిశగా మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాం. మీకూ అటువంటి లక్ష్యాలు ఏవో ఉంటాయి. ప్రపంచంలో మార్పు తేవాలని ఉంటుంది. ఎవరో తెస్తారని అనుకుంటారు. కానీ, ఎవరూ తీసుకురారు. మీరే ఆ పని చేయాలి. అలా మీకొక లక్ష్యం నిర్దేశించుకోవడమే కాదు, ఇతరులకూ ఒక ప్రయోజనాన్ని కల్పించ గలగాలి. ఒక కంపెనీని నిర్మించాలని నేను కోరుకోలేదు. ఒక ప్రభా వాన్ని కనబరచాలని అనుకున్నా. కంపెనీ పెట్టిన రెండు మూడేళ్ళ తర్వాత, దాన్ని కొనడానికి కొన్ని పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ, నేను అమ్మాలని అనుకోలేదు. మరింత మందిని అనుసంధానపరచగలమా అనే ఆలోచిస్తూ వచ్చాను. కంపెనీలో ప్రతి ఒక్కరూ అమ్మేయడమే మంచిదనే భావించారు. అమ్మకూడదనే నిర్ణయానికి వచ్చినందుకు జీవితాంతం బాధపడతావు అంటూ ఒక సలహాదారు నన్ను హెచ్చ రించారు కూడా. మనుషుల స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నా నిర్ణయం నచ్చక, మేనేజ్మెంట్ బృందంలోని దాదాపు ప్రతి ఒక్కరూ కంపెనీ నుంచి నిష్క్రమించారు. అది నేను ఎదుర్కొన్న కష్టకాలం. నా నిర్ణయంలో పొరపాటు ఉందేమోనని కూడా ఒక దశలో అనిపించింది. కొన్నేళ్ళ గడిచాక, ఒక విస్తృత ప్రయోజనం అంటూ లేకపోతే అటువంటి పరిస్థితులే తలెత్తుతాయని అర్థమైంది. ఆ విశాల ప్రయో జనాన్ని కల్పించాల్సిన బాధ్యత మనదే. అపుడు అందరం కలసి కట్టుగా ముందుకు సాగగలం. ఊడిపడదు అద్భుతంఈ జీవితంలో తమకంటూ ఒక లక్ష్యం ఉందని ప్రతి ఒక్కరూ భావించే విధంగా ప్రపంచాన్ని తీర్చిదిద్దుకునేందుకు అనుసరించ వలసిన మూడు మార్గాల గురించి చెబుతాను. ఒకటి – అర్థవంత మైన భారీ ప్రాజెక్టులను కలసికట్టుగా చేపట్టాలి. రెండు – లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించేందుకు అనువైన విధంగా సమానత్వ భావనను పునర్నిర్వచించాలి. మూడు – ప్రపంచ వ్యాప్తంగా సమాజాలను నిర్మించుకోవాలి. టెక్నాలజీల వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతున్నా అంతకుమించిన ఉద్యోగాలను సృష్టించుకోగలిగిన సామర్థ్యం మన కుంది. ప్రతి తరం నిర్వర్తించవలసిన కర్తవ్యాలుంటాయి. చంద్రు నిపై ఒక మనిషి కాలుమోపేందుకు, ఆ గచ్చు ఊడ్చే పనివాడితో సహా మూడు లక్షల మందికి పైగా పనిచేశారు. పోలియో సోకకుండా టీకాలు వేయడంలో లక్షలాది మంది కార్యక్తలు శ్రమించారు. ఆన కట్టలు నిర్మించడంలోనూ ఎంతో మంది శ్రామికుల కృషి ఉంది. ఐడియాలు ఎప్పుడూ పూర్తిరూపం సంతరించుకుని రావు. మొదటే అన్నీ తెలియవలసిన పని లేదు. దేనికైనా సరే శ్రీకారం చుట్టడం ముఖ్యం. ప్రజలను అనుసంధానపరచడం గురించి పూర్తిగా మొదటే తెలిసి ఉంటే, నేను ఫేస్ బుక్‌ను ప్రారంభించి ఉండేవాడిని కానేమో. క్రమంగా ఒక్కొక్క విషయం తెలుస్తూ వస్తుంది. హఠాత్తుగా అద్భుతాన్ని సృష్టించలేమని గుర్తించాలి. ఆద ర్శాలు నిలుపుకోవడం మంచిదే. కానీ, ఆ విషయంలో, మనల్ని ఎదుటి వారు ఎగతాళి చేసినా, ధైర్యంగా తట్టుకోగలగాలి. ఒక సంక్లిష్ట సమస్య పరిష్కారానికి నడుం బిగించినపుడు, దాని ఆనుపానులు తెలుసుకోకుండా దిగావంటూ నిందించే వారు ఎప్పుడూ ఉంటారు. మనం చొరవ చూపడం గిట్టనివారు ఉంటారు. ఏ విషయంలోనైనా మనల్ని వెనక్కి లాగేవారు ఉంటారు. వారి మాయలో మనం పడకూడదు. ఒకరి కోసం అందరంమన తల్లితండ్రులు, తాత ముత్తాతల మాదిరిగా జీవితాంతం స్థిరమైన ఉద్యోగాలు చేసే రోజులు గతించాయి. ఇపుడు వ్యవస్థాపక సామర్థ్య సంస్కృతి విస్తరిస్తోంది. అయితే, కొత్త ఆలోచనలు అనేకం ఆచరణలో పెట్టి చూసేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే ఆ సంస్కృతి వర్ధిల్లుతుంది. ఫేస్‌బుక్‌కు ముందు నేను గేమ్‌లు, చాట్ సిస్టంలు, స్టడీ టూల్స్, మ్యూజిక్ ప్లేయర్లు నిర్మించాను. హ్యారీ ప్యాటర్ ప్రచురణకు నోచుకోకముందు జె.కె. రౌలింగ్ రచనలు 12 సార్లు తిరస్కరణకు గురయ్యాయి. విఫలమైనా ఫరవాలేదనుకునే స్వాతంత్య్రం ఉన్నప్పుడే గొప్ప విజయాలు సిద్ధిస్తాయి. ఒక వ్యక్తి తన ఆలోచనను అమలులోపెట్టి, దాన్ని ఒక గొప్ప సంస్థగా మలచే స్వాతంత్య్రం లేనప్పుడు, నష్టపోయేది ఆ ఒక్క వ్యక్తి కాదు, అందరూనని గుర్తించాలి. గొప్ప ఐడియా తట్టినంత మాత్రాన లేదా కష్టపడి పనిచేసినంత మాత్రాన సఫలం కాలేక పోవచ్చని మనకు తెలుసు. ఆవగింజంత అదృష్టం కూడా కలసి రావాలి. నిరంతరం మారిపోతున్న టెక్నాలజీ వల్ల మనం ఎప్పటి కప్పుడు కొత్తవాటిని నేర్చుకోవడం కూడా నిరంతర ప్రక్రియగా మారాలి. సమాన అవకాశ భావనను ప్రోత్సహించేందుకు నేను, నా భార్య ప్రిసిల్లా మా సంపదలో కొంత భాగాన్ని వెచ్చించే ఏర్పాటు చేశాం. చాన్ జుకెర్‌బర్గ్ ఇనీషియేటివ్ ప్రారంభించాం. అందరూ నగదు సహాయాన్నే అందించాలన్న రూలు లేదు. ఎదుటివారు బాగుపడటానికి తమ సమయాన్ని కూడా కొంత వెచ్చించవచ్చు. పేదరికాన్ని, వ్యాధులను అంతమొందించగలిగిన శక్తి నేటి తరానికి ఉంది. ఏ ఒక్క దేశమో పోరాడినంతమాత్రాన వాతావరణ మార్పును అరికట్టలేం. మహమ్మారులను నివారించలేం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రపంచవ్యాప్త పరిష్కారాలు అవసరం. మనం ఒంటరివారం కాదు. ఒక విస్తృత ప్రయోజనానికి పాటుపడుతున్నామనే భావన రావాలి. ‘మన ముందు తరాలను ఆశీర్వదించిన, దైవిక శక్తి ఏదైతే ఉందో, అది మాకు ధైర్యం సమ కూర్చడానికి సహాయపడుగాక! ఈ జీవితాన్ని ఒక వరప్రసాదంగా మేం తీర్చిదిద్దుకునేటట్లు చేయుగాక!’ అనే ప్రార్థనతో మీ వద్ద సెలవు తీసుకుంటాను. -
బయో–ఆర్థిక వ్యవస్థపై లేని గొప్పలు
బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ) ఇటీవల భారతీయ బయో–ఆర్థిక వ్యవస్థ పదవ వార్షిక నివేదకను విడుదల చేసింది. భారత్ బయో ఆర్థిక వ్యవస్థ 2014లో ఉన్న సుమారు 10 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 195 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని శాస్త్ర–సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రక టించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం బయో టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, గత దశాబ్దంలో అద్భుతమైన ప్రగతిని సాధించి ఉండాలి. ఈ నివేదిక ప్రకారం, 2024లో 167 బిలియన్ డాలర్లుగా ఉన్న భార తీయ బయో ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2025లో సుమారు 195 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డీబీటీ వల్ల వెలుగు చూసిన నవీక రణలు, బయోటెక్నాలజీ పరిశోధన–అభివద్ధి విభాగం (ఆర్ అండ్ డీ) వల్ల గడచిన పదేళ్ళలో భారతదేశపు బయో ఆర్థిక వ్యవస్థ అసా ధారణమైన వేగంతో దూసుకు వెళ్లిందనే అభిప్రాయాన్ని ఈ నివేదిక కలుగజేసింది. అన్నింటినీ లెక్కల్లో కలిపేసి...లోతుల్లోకి వెళితే అసలు వాస్తవాలు బయటపడతాయి. పద్దు లలో, నిర్వచనాల్లో చేసిన తెలివైన మార్పుల వల్ల సంఖ్యలు నాటకీ యంగా పెరిగాయేగానీ ఆర్ అండ్ డీ చేసిన కృషి వల్ల కాదు. గతంలో లెక్కలోకి తీసుకోని లేదా పాక్షికంగా మాత్రమే చేర్చు కున్న మొత్తం ఉప రంగాలన్నింటినీ కలిపేసుకోవడం వృద్ధిలో ప్రధాన భాగానికి కారణమని తేలుతుంది. బయోటెక్ ఆధారిత వ్యాక్సీన్లు, ఫార్మాస్యూటికల్స్‌తో పాటు బీరు, డిటర్జెంట్ల నుంచి... ఇంధనంలో ఎథనాల్ కలపడం వరకు పెక్కు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు, సేవల విలువను ఆ సంఖ్యలకు జోడించడం వృద్ధికి అసలు కారణం. నిజానికి, 195 బిలియన్ డాలర్ల విలువలో సుమారు సగ భాగం బయో–పారిశ్రామిక వస్తూత్పత్తి (ఆల్కహాలిక్ పానీయాలు 25 బిలియన్ డాలర్లు), పశు గ్రాసం (23 బిలియన్ డాలర్లు), ఇంధనంలో ఎథనాల్‌ను మిళితం చేయడం (12 బిలియన్ డాలర్లు), ఆహారం–పాడి పరిశ్రమ ఉత్పత్తుల (8 బిలియన్ డాలర్లు) నుంచి చేకూరినవని తేలుతుంది. కణాలు, ప్రొటీన్లు, కణజాలాల నుంచి తయారు చేసిన ఔషధాలు లేదా వైద్య ఉత్పత్తులు, వైద్య సాధనాలు, వ్యాధి నిర్ధారణ, టీకాలతో కూడిన బయో–ఫార్మా విలువ 64 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. పెరుగు బయోటెక్నాలజీ ఉత్పత్తి?పాడి పరిశ్రమ ఉత్పత్తులను కూడా కలుపుకోవడం గమనిస్తే చాలు, బయో ఆర్థిక వ్యవస్థ గణనలోని డొల్లతనం ప్రస్ఫుట మవుతుంది. పులియడం వల్లనే పెరుగు తయారవుతుంది. పాల లోని లాక్టోస్‌ను ల్యాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ల్యాక్టిక్ యాసిడ్‌గా మార్చి, కేజిన్ ప్రొటీన్లు గడ్డకట్టడానికి సాయపడుతుంది. పులియ బెట్టిన డెయిరీ పదార్థాల ఉత్పత్తి బయోటెక్నాలజీ వినియోగానికి సంకేతమని చెబుతున్నారు. విలువను జోడించేందుకు, పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఆ ప్రక్రియ సాయ పడుతోంది కనుక దాన్నీ తమ వృద్ధి విజయగాథలో భాగం చేసుకుంటాం అంటున్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం, పెరుగు కూడా బయోటెక్నాలజీ ఉత్పత్తి కిందనే లెక్కన్న మాట! సజీవ సూక్ష్మ జీవులైన స్టార్టర్ కల్చర్లను ఉపయోగించి పాలను పులియబెట్టి సృష్టి స్తున్నది కనుక, పెరుగు బయో–పారిశ్రామిక ఉత్పత్తి కింద లెక్క. బయో సర్వీసుల విభాగాన్ని (25 బిలియన్ డాలర్లు) చేర్చడం కూడా బయో ఆర్థిక వ్యవస్థ చూపిన తళుకు బెళుకు సంఖ్యలకు మరో కారణం. ఇవేవీ కీలకమైన ఆర్ అండ్ డీ సర్వీసుల కిందకు రావు. ఫార్మాస్యూటికల్ కంపెనీలకు క్లినికల్ అధ్యయనాలు, వాటి సంబంధిత సేవల కిందకు వస్తాయి. బహుళజాతి జీవ శాస్త్రాల సంస్థలకు ఔట్ సోర్సింగ్ సేవల కిందకు వస్తాయి. జీవ శాస్త్రాలకు సంబంధించిన సుమారు 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్, బెంగళూరుల్లోనే ఉన్నాయి. ఈ యూనిట్లు వాటికి మాతృసంస్థలకు చెందిన వివిధ (పరిశోధన, రెగ్యులేటరీ, ఎనలటిక్స్, ఎంటర్ప్రైజ్) పనులను చక్కబెడతాయి. ఇక్కడ మాతృసంస్థలంటే, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, మెడికల్ సాధనాల కంపెనీలన్న మాట. బయో ఆర్థిక వ్యవస్థ విలువను గణించడంలో మొత్తం జీసీసీలను లెక్కలోకి తీసుకున్నారు. చోద్యం ఏమిటంటే, సాఫ్ట్వేర్ సర్వీసులకు చెందిన పరిశ్రమ సంస్థ ‘నాస్కామ్’ విడుదల చేసిన డేటా కూడా టెక్నాలజీ ఔట్ సోర్సింగ్‌లో భాగంగా అవే జీసీసీలను పరిగణనలోకి తీసుకోవడం!బలహీనతలు కప్పిపుచ్చుకునేందుకే!బయో ఆర్థిక వ్యవస్థ నివేదికను తయారుచేసే కసరత్తును మొదట్లో బయోటెక్నాలజీ నేతృత్వ సంస్థల సంఘం నిర్వహించేది. అది 2016లో దాన్ని మొదలుపెట్టింది. ఆ పరిశ్రమకు సంబంధించి పన్నుల్లో రాయితీలు గట్రా రాబట్టే లాబీయింగ్ గ్రూపుగా అది పని చేసేది. తర్వాత, ఆ బాధ్యతను బయోటెక్నాలజీ శాఖ తలకెత్తుకుంది. కాగా, ఆకర్షణీయమైన సంఖ్యలను సమర్పించే పని మూడేళ్ళ క్రితమే మొదలైంది. బయో–పారిశ్రామిక రంగాన్ని చేరుస్తూ, బయో ఆర్థిక వ్యవస్థ నిర్వచనంలో 2023లో మార్పు తెచ్చారు. ఆ నిర్వచనం, పూర్వం నుంచి అమలులోకి వచ్చే విధంగా, 2020, 2021, 2022 సంవత్సరాల సంఖ్యలను సవరించారు. డీబీటీ రూపుదిద్దుకునేందుకు పదేళ్ళకు ముందే, అంటే 1986లోనే, దేశీయ పరిజ్ఞానంతో ఎంజైములను తయారు చేసే సంస్థను కిరణ్ మజుందార్ షా నెలకొల్పారు. ఆల్కహాలిక్ పానీయాలు, సబ్బులు, డిటర్జెంట్లు, పశుగ్రాసం, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, ఇతర ప్రోబయోటిక్స్, టెక్స్టైల్స్, తోలు పరిశ్రమ... ఇలా చెబుతూ వెళితే చాలా వాటి తయారీలో పారిశ్రామిక ఎంజై ములను ఉపయోగిస్తారు. పారిశ్రామిక బయోటెక్నాలజీ వాణిజ్య వినియోగం చాలా ఏళ్ళుగా సాగుతోంది. దాన్ని వినియోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలకు డీబీటీ ఆర్ అండ్ డీ ఫలితాలు నామమాత్రంగా పనికొచ్చాయని చెప్పవచ్చు. కొన్ని సంస్థలకు ఏ విధంగానూ ఉపకరించిందీ లేదు. డీబీటీ ఒక విధంగా ‘క్రెడిట్ చోరీ’కి ప్రయత్నిస్తోంది. గొప్పగా చెప్పుకుంటున్న సంఖ్యలు బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే తోడ్పడుతున్నాయి. బయోటెక్నాలజీ రంగం ఆ సంఖ్యలు సూచిస్తున్నంతగా పరిణతి చెందలేదు. ప్రభుత్వం 2025 ఏడాదికి సాధించిన ప్రగతికి సంబంధించి చెప్పిన సంఖ్యలో దాదాపు సగ భాగం బయో–పారిశ్రామిక విభాగం చలవేనని చెప్పాలి. అది ఇంధనంలో ఎథనాల్ మిళితం చేయడం వల్ల ఒనగూడిన హంగు.చైనా బయోటెక్నాలజీ రంగం 300 బిలియన్ల డాలర్లకు పైగా విలువతో వర్ధిల్లుతోంది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏరుకొచ్చిన సంఖ్యలపై ఆధారపడే బదులు భారతదేశపు బయోటెక్నాలజీ ఆర్ అండ్ డీ – నవీకరణ రంగం సాధించిన ప్రగతి, అది వాణిజ్య పరంగా ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ, ఆర్ అండ్ డీకి మార్కెట్లకు మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒక నివేదికను ప్రచురిస్తే సముచితంగా ఉంటుంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఎం.కె. స్టాలిన్ (ముఖ్యమంత్రి) రాయని డైరీ
అసలొక మనిషిని పట్టించుకోకూడదని మనం అనుకుంటున్నామంటేనే, ఆ మనిషిని వదిలించుకోలేనంత గట్టిగా మనం పట్టుకొని ఉన్నామని! ‘అతడి’ పేరును నేను ర్యాలీలలో రానివ్వటం లేదు. మీటింగులలో రానివ్వటం లేదు. మాటల్లో, ‘మాటకు మాట’ల్లో కూడా రానివ్వటం లేదు. అతడిని నేను ఏదైనా అనాలని, అతడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు! ‘స్టాలిన్ అంకుల్’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ‘తీమై శక్తి’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ‘యాంటీ పీపుల్’ అన్నాడు. నేను పట్టించు కోలేదు. ఒకటీ రెండుసార్లు ‘చీఫ్ మినిస్టర్’ అని కూడా అన్నాడు! అదీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ‘స్టాలిన్ సర్’ అంటున్నాడు. అది మాత్రం నేనెందుకు పట్టించుకోవాలి? అతడివన్నీ సినిమా మాటలు! సినిమాల నుంచి వచ్చిన ఎంజీఆర్, డీఎంకేని ‘తీమై శక్తి’ అనేవారు. సినిమాల నుంచే వచ్చిన జయలలిత కూడా డీఎంకేని ‘తీమై శక్తి’ అన్నారు. ఇప్పుడు అదే మాటను అతడు పట్టుకున్నాడు!‘తీమై శక్తి’ అంటే దుష్ట శక్తి. అదేం పెద్ద మాట కాదు కానీ, పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అతడు ఇంకా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ‘‘ఈ ఎన్నికలు డీఎంకేకి, బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు; ప్రజలకు, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అని అంటున్నాడు. ప్రజలు అంటే అతడు, అవినీతి అంటే నేను! మంచి డైలాగే. ‘స్టాలిన్ అంకుల్’ అనటం కూడా ఒక ఎత్తుగడ. నన్ను ‘నిన్నటి తరం మనిషి’గా చూపించి, తను ‘రేపటి తరం నాయకుడి పాత్రను పోషించాలని చూస్తున్నాడు! వరదలు, విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు కావలసింది, తెడ్లతో పడవను నడుపుకుంటూ ఇంటి ముందుకు వచ్చే నాయకుడే కానీ, తెరపై కనిపించే కథానాయకుడు కాదు.నేను చెన్నైలోని కొళత్తూర్ నుంచి పోటీ చేస్తున్నాను. అతడూ చెన్నై నుంచే పెరంబూర్‌లో పోటీ చేస్తున్నాడు. ఆ ఒక్కచోట నుంచి మాత్రమే కాదు, తూర్పు తిరుచ్చి నుంచి కూడా నిలబడ్డాడు. ఇంకో మూడు రోజుల్లో స్టాలినా, మోదీనా అన్నది తమిళనాడు ప్రజలు తేల్చేస్తారు. తమిళులకు, ఢిల్లీ నియంతలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. అతడు అంటున్నట్లుగా అతడికి, నాకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు. డీఎంకే, డీకేఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే ఒకవైపు; అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకె ఇంకో వైపు. ఈ రెండు వైపుల్లో ఏ వైపూ అతడు లేడు. లేడు కానీ, లేకుండానూ లేడు! చెన్నై, మదురై, తిరుప్పూర్ జిల్లాల్లో అతడి ‘షో’కి కొన్ని టిక్కెట్లు తెగొచ్చు. ఆ తెగేవీ, మిగతా చోట్లవీ కలిపి అతడి ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీకి 25 – 45 సీట్లు వస్తే కనుక, అతడిని పట్టించు కోకుండా ఉండటం కుదరకపోవచ్చు. 118 సీట్ల మెజారిటీ ఏ వైపూ రాకుంటే డీఎంకే, బీజేపీ రెండూ అతడి వైపే చూడాల్సిందే.‘ఇళయ తలపతి’ యువతను ఆకట్టుకుంటున్నాడని అతడి గురించి డీఎంకే యూత్ వింగ్ చెబుతోంది. తమిళనాడులో వెండితెరకు, సచివాలయానికి మధ్య గీత కాగితమంత పలుచగా ఉంటుందని నాన్న చెప్పటం కూడా నాకు గుర్తుకొస్తోంది. అతడిని జాగ్రత్తగా డీల్ చేయాలి. మరీ గట్టిగా దాడి చేస్తే వీరుడు అవుతాడు. అసలే వదిలేస్తే ఏనుగంత ఐపోతాడు! మీడియా కెమెరాలు అతడిని ఎంతగానో ఇష్టపడటం నేనూ చూస్తున్నాను. కానీ గ్రామాల్లోని ప్రజలు అతడిని నమ్ముతారా? ఒకందుకైతే అతడిని మెచ్చుకుని తీరాలి. ఉదయించే సూర్యుడికి ఎదురెండలో నిలబడే ధైర్యం అతడిలో ప్రకాశిస్తూ ఉంది! పోలింగ్‌కి ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి. తమకు మూడు గంటల సినిమా హీరో కావాలా, లేక ఐదేళ్ల నాయకుడు కావాలా అన్నదిక పూర్తిగా ప్రజల నిర్ణయమే. -
నాటో కూటమి కథ కంచికేనా?
ఇరాన్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమి ‘నాటో’లో అంతర్యుద్ధానికి కారణమవటం ప్రపంచ జియో పొలిటికల్ చదరంగాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. తమ దేశాల నౌకా బలగాలను హార్మూజ్ జలసంధి వద్ద మోహరింప చేయాలన్న యూఎస్ అధ్య క్షుడి విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. తమ దేశాలలోని సైనిక స్థావరా లను వినియోగించటానికి అంగీకరించ లేదు. ఈ యుద్ధం మా (నాటో) యుద్ధం కాదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు నాటో కూటమిని ‘కాగితపు పులి’గా అభి వర్ణిస్తూ యూఎస్ఏ దాన్నుండి వైదొలుగుతుందని బెదిరించాడు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని (ఇరాన్ యుద్ధాన్ని) సమర్థించని, యూఎస్ఏకు సహాయపడని మిత్ర దేశాలను యూఎస్ఏ రక్షించ బోదని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించాడు. ఐరో పాను రక్షించటానికి మాత్రమే నాటో కూటమి ఏర్పడలేదనీ, యూఎస్ ఏను సమర్థించటం కూడా నాటో ప్రధాన విధి అనీ యూఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అభిప్రాయ పడ్డాడు.ప్రపంచాన్ని శాసించిన శక్తిరెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1949లో పన్నెండు దేశాలతో ఆవిర్భవించిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి ఇటీవల స్వీడన్ చేరికతో 32 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాను అడ్డుకోవటానికి యూఎస్ఏ నాయ కత్వంలో ఏర్పడిన ఈ సైనిక–రాజకీయ కూటమి గత 75 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను శాసించిందనటంలో సందేహం లేదు. ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా దానిని మొత్తం కూటమి మీద దాడిగా పరిగణిస్తుంది. 32 సభ్య దేశాలే కాకుండా, 40 ఇతర దేశాలతో కూడా ఈ కూటమి సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకున్నది. సోవియట్ రష్యాను నిలువరించటానికి స్థాపించబడిన ‘నాటో కూటమి’ని సోవియట్ విచ్ఛిన్నం తరువాత కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదు. రష్యా బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసు కొని ఈ కూటమి సోవియట్ ప్రాబల్య ప్రాంతాలలోనికి విస్తరించింది. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసింది. నాటో సభ్య దేశాలలో యూఎస్ఏ నాయకత్వంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ స్థావరాలలో అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను ఎదుర్కొనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను, అమెరికన్ సైనికులను మోహరించి ఆ యా దేశాలకు యూఎస్ఏ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. సైనిక, గూఢచర్య సమాచారాన్ని, సైబర్ సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఈ దేశాలపై సోవియట్ యూనియన్ (రష్యా), ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్నది.యూఎస్ఏ నీడన ఐరోపా1990వ దశకం నుండి క్రమంగా నాటో దేశాలలో అలసత్వం ప్రవేశించింది. తమ దేశాల సైనిక, రక్షణ బాధ్యతను పూర్తిగా యూఎస్ఏ పైన తోసివేశాయి. తమ రక్షణ ఖర్చులను తగ్గించి, పూర్తిగా సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు రష్యా ముప్పుగా కనప డటం ఆగిపోయింది. నాటో కూటమి ఒప్పందం ప్రకారం ప్రతి సభ్య దేశం తన జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయా లనే నిబంధనను ఖాతరు చేయలేదు. మొత్తం రక్షణ వ్యయంలో 65 శాతం యూఎస్ఏ భరిస్తోంది. ఇదే సమయంలో ఈ ఐరోపా దేశాలు తమ తయారీ రంగాన్ని దాదాపుగా చైనాకు అవుట్సోర్సింగ్ చేశాయి. మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, మొరాకో, అల్జీరియా వంటి దేశాల నుండి చౌక శ్రామికుల వలసలను ప్రోత్సహించాయి. ఇంధన అవసరాలకు రష్యా నుండి చౌకగా వచ్చే గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డాయి. స్థూలంగా పరిశీలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ మొదలగు ఐరోపా దేశాలు గత నాలుగు దశాబ్దా లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎగుమతి–దిగుమతి వ్యాపారం, విలాస వస్తువుల తయారీ వంటి రంగాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్నత జీవన ప్రమాణాలను అను భవిస్తున్నాయి.ట్రంప్ 2025లో అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్’ నినా దాన్ని అందుకొన్నాడు. నాటో రక్షణ వ్యయంలో కూటమి దేశాలు తమ వంతు వాటాను భరించాల్సిందేనని మెలిక పెట్టాడు. ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను మోస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరాన్ యుద్ధంలో మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అమెరికా కోణంలో ఆలోచిస్తే ఈ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం తమ యుద్ధం కాదనేది యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వాదన. ఇదే కోణంలో ఆలోచిస్తే ఉక్రెయిన్ యుద్ధం కూడా యూఎస్ఏ యుద్ధం కాదు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటున్నది యూఎస్ఏ సైనిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, యూఎస్ఏ ఆర్థిక సహాయమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.మాటలతో మారిన తీరు2003 ఇరాక్ యుద్ధంలో కూడా నాటో దేశాలు పాల్గొనటం విషయంలో ఇదేరకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయిన ప్పటికీ యూకే, స్పెయిన్, ఇటలీ, పోలండ్ తమ సైనికులను యూఎస్ఏకు మద్దతుగా పంపించాయి. ప్రస్తుత ఇరాన్ యుద్ధం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించేముందు నాటో దేశాలతో చర్చించలేదు. గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఐరోపా దేశాలను ట్రంప్ బేఖాతరు చేశాడు. వ్యక్తిగతంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాధినేతలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వలసలను ప్రోత్సహిస్తూ ఐరోపా దేశాలు తమ నాగరికతను నాశనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించాడు. ఉక్రెయిన్‌కు సహాయం అందించటంలో యూరోపియన్ యూనియన్‌కు అడ్డుగా వ్యవహరించిన హంగరీ దేశాధినేత విక్టర్ ఓబ్రామ్ను సమర్థించాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓబ్రా మ్కు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ బహిరంగంగా మద్దతు పలి కాడు. అయితే ఈ ఎన్నికల్లో 16 ఏళ్లుగా హంగరీని పాలిస్తున్న ఓబ్రామ్ ఓడిపోయాడు. ఓబ్రామ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా సన్నిహితుడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైపు హంగరీ మొగ్గు చూపింది. పుతిన్ పరంగా ట్రంప్ మెతక వైఖరిని కొనసాగిస్తున్నాడు. ఇది ఐరోపా దేశాలకు మింగుడుపడటం లేదు. రష్యా నుండి చౌకగా లభించే గ్యాస్ దిగుమతులు ఆగిపోవటంతో ఐరోపా దేశాలు ఖతర్, యూఏఈ, సౌదీ నుండి ఎల్ఎన్జీ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. అందువలన హార్మూజ్ జల సంధి కేంద్రంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం కొనసాగటం వాటికి ఇష్టం లేదు. ఈ యుద్ధం కేవలం యూఎస్ఏ–ఇరాన్ మధ్య కాదు. ఇజ్రాయెల్ చేరికతో యుద్ధానికి ‘మతం రంగు’ అలుముకోవటం ఖాయం. ఫ్రాన్స్‌లో 6.7 మిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 10 శాతం. జర్మనీలో సుమారుగా 5.7 శాతం (4.7 మిలియన్లు) ముస్లిం జనాభా ఉన్నది. ఈ యుద్ధంలో భాగస్వా ములయితే తమ దేశాలలోని ముస్లిం పౌరుల మద్దతు ప్రమాదంలో పడుతుంది. నాటో దేశాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ బడ్జెట్లను పెంచి, సైనిక సామర్థ్యం వైపు దృష్టి పెడుతు న్నాయి. ఐరోపా దేశాల మధ్య సైనిక సంబంధాలను పటిష్ఠం చేయాలని చూస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ట్రంప్‌కు కళ్లెం వేసే మార్గమేమిటి?
ఇరాన్‌తో 12వ తేదీన జరిగిన చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన గమనించదగ్గది. చాలా అంశాలలో ఇరాన్‌తో ఏకాభి ప్రాయం కుదిరిందనీ, అణ్వాయుధాల తయారీని ఆపటంపై వారు పట్టుదల విడవలేదనీ, అందుకే చర్చలు విఫల మయ్యాయనీ అన్నారు. వారికి అణ్వస్త్ర ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ దక్కనివ్వ బోమని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులలో ప్రపంచ నాయ కుల స్పందనలను గమనించగా, ఆయన మాటలను ఎవరూ విశ్వ సించటం లేదని అర్థమవుతున్నది. చర్చలు, ఒప్పందాల విషయమై తమను లోగడ రెండుసార్లు మోసం చేసిన ఆయన ఈసారి కూడా తమ విశ్వాసాన్ని పొందలేకపోయారన్న ఇరాన్ వ్యాఖ్యలు సరేసరి!ఒప్పందం రద్దు ట్రంప్ పుణ్యమే!చర్చల మినిట్స్ అందుబాటులో లేనందున అణుపరిశోధనలు, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల ఉత్పత్తి విషయమై నిర్దిష్టంగా ఎవ రేమి అన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ కీలకమైన అంశంపై చర్చలకు ముందూ, తర్వాతా ఎవరేమన్నారో తెలిసిందే. అదే విధంగా గతంలో జరిగిందేమిటో కూడా. వాటన్నింటిని పరి గణనలోకి తీసుకున్నప్పుడు, ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావటా నికి కారణం ట్రంప్ వైఖరి అని తేలికగా అర్థమవుతుంది. అందుకే ఆయనకు మిత్రదేశాల నుంచి కూడా మద్దతు లభించటం లేదు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు, యురేనియం శుద్ధి విష యమై ఇరాన్‌కు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం గల అమె రికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లతో పాటు జర్మనీకి మధ్య 2015 లోనే ఒప్పందం జరిగింది. దానిని ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ అన్నారు. దాని ప్రకారం ఇరాన్ శాంతియుత అవస రాల కోసం యురేనియంను 3.67 శాతం వరకు శుద్ధి జరపవచ్చు. అణ్వాయుధాల తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం. ఈ శుద్ధి కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయవచ్చు.ఆ ప్రకారం 2015 నుంచి 2018 వరకు సజావుగానే సాగుతుండిన ఒప్పందాన్ని ట్రంప్ తన మొదటి హయాంలో ఆకస్మికంగా రద్దు చేయటంతో సమస్యలు మొదలయ్యాయి. అట్లా రద్దు చేసినా తమ వైపు నుంచి కొంతకాలం పాటు ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండిన ఇరాన్, ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోక పోవటంవల్లనే యురేనియం శుద్ధి స్థాయిని 60 శాతం వరకు తీసుకువెళ్లి ఆపింది. అణ్వస్త్ర తయారీ మాత్రం తమ అజెండాలో లేదని అయతొల్లా ఖమేనీ ఫత్వా సైతం జారీ చేశారు. అటువంటి ఆయుధాల ఉత్పత్తి ఇస్లాంకు విరుద్ధమన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే గాక, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు రోజు లలో అమెరికా, ఇరాన్ మధ్య ఒమాన్ మధ్యవర్తిత్వం ద్వారా తిరిగి చర్చలు, అవి దాదాపు ఒక కొలిక్కి రానుండగా దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యాన్నంతా గుర్తు చేసుకోవటం ఎందుకంటే, అణ్వస్త్రాలను ఆపటమే తమ అత్యంత ప్రాధాన్య లక్ష్యమనీ,అందుకు ఇరాన్ కలిసి రానందునే చర్చలు ముందుకు సాగలేదనీ ట్రంప్ వాదించబూనటం తెంపరితనం మాత్రమే అవుతుంది. ప్రపంచం అందువల్లనే ఆయనను నమ్మటం లేదు.దిగ్బంధనం– గందరగోళంఇస్లామాబాద్ చర్చలకు ముందే ఇరువురు తమ తమ షరతులు ప్రకటించారు. అవి ఇంచుమించు గత నెల షరతుల వంటివే. అయి నప్పటికీ, రాజీ అంటూ జరగాలి గనుక చర్చల సమయంలో కొంత పట్టువిడుపులు ఉంటాయనే భావన కలిగింది. ఇటువంటి దౌత్య చర్చలు ఎపుడైనా పలు విడతలుగా సాగుతూ క్రమంగా కొన్ని రాజీ లతో అంతిమ ఒప్పందం జరుగుతుంది. ఈసారి కూడా చర్చలు 21 గంటలపాటు సాగిన తర్వాత, రాగల రోజులలో తిరిగి చర్చలు ఉండగలవనే సంకేతాలు రెండు దేశాల ప్రతినిధుల నుంచి వినిపించాయి. కానీ, ‘ఖలునికి నిలువెల్ల విషముగదరా సుమతీ’ అన్నట్లు తన నిలువెల్ల ‘ఆయుధాలు, సైనిక బలం’ అన్న మిడిసిపాటు తప్ప దౌత్యనీతి అనే మాటకు చోటులేని ట్రంప్ మాత్రం వెంటనే హార్మూజ్ దిగ్బంధం అంటూ హెచ్చరించటంతో ఆగక, దిగ్బంధనం కోసం తమ నౌకా దళాలకు ఉత్తర్వులు జారీ చేశారు.దానితో ఇరాన్ లొంగి వస్తుందని ఆయన అంచనా వేసిన ట్లున్నారు. కానీ, జరిగిందేమిటి? ప్రపంచమంతటా చమురు ధరలు పెరిగి, స్టాక్స్ పడిపోయాయి. చర్చలు నెరవేరగలవన్న ఆశాభావా లతో తగ్గిన చమురు, పెరిగిన స్టాక్స్, ఆయన పుణ్యమా అని తిరిగి గందరగోళంలో పడ్డాయి. నిజానికి హార్మూజ్ ద్వారా రవాణా అయ్యే చమురు, ఇతర సరకులు అన్నీ ఇరాన్వేమీ కాదు. అరబ్ దేశాలవి, బయటి దేశాలవి కూడా గణనీయంగా ఉన్నాయి. అది తర్వాత బోధ పడి కావచ్చు, మొత్తం హార్మూజ్‌ను కాకుండా ఇరాన్ రేవులను మాత్రమే దిగ్బంధిస్తామన్నారు. అందుకు ఇరాన్ తాము ఆ ప్రాంతంలోని అరబ్ రేవులన్నింటిపై దాడులు జరపగలమని హెచ్చరించింది. ఆ జలసంధిలో మైన్స్ మరొకవైపు ఉండనే ఉన్నాయి. ఈ హెచ్చరిక లతో మళ్లీ గందరగోళం మొదలైంది.చట్టాలకు లోబడేట్టుగా...ఒప్పందాలు, ఒప్పంద చర్చలను ప్రతిసారీ భంగపరుస్తున్న ఇజ్రాయెల్ ఈసారి కూడా ఆ పని చేస్తుండటం మొదటినుంచీ కనిపించిందే. యుద్ధ విరమణ లెబనాన్‌కు సైతం వర్తించాలన్న షర తును ఇరాన్ మొదటనే విధించగా, అందుకు ట్రంప్ పాకిస్తాన్ ద్వారా సమ్మతి తెలిపారు. కానీ ఇజ్రాయెల్ తమకు దానితో నిమిత్తం లేదంటూ దాడులు కొనసాగించగా, ట్రంప్ కూడా అది వేరే అంశమంటూ వాదించారు. చర్చలపట్ల ట్రంప్, నెతన్యాహూల ఆంతరంగిక ఆలోచనలకు అద్దంపట్టిన విషయాలలో ఇదీ ఒకటి. అందుకు తగినట్లుగానే ట్రంప్ ఇజ్రాయెల్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తుండగా, మధ్యవర్తి పాకిస్తాన్ చేష్టలుడిగి మిన్నకుంటున్నది.అసలు వాస్తవం ఏమంటే, అమెరికాకు గానీ, ఇజ్రాయెల్కుగానీ ఇరాన్ అణు పరిశోధనలు వట్టి సాకు మాత్రమే. అమెరికాకు కావలసింది అక్కడ ఒక సామంత రాజ్యాన్ని నెలకొల్పి చమురు నిల్వలు తమ అధీనంలోకి తెచ్చుకోవటం. వెనిజులా వలెనే ఇరాన్ చమురు గురించి స్వయంగా ట్రంప్ చెప్పిందే. ఇజ్రాయెల్‌కు కావలసింది గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడి, ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక శక్తిగా మిగలక పోవటం. ప్రపంచమంతా ఇప్పటికే గుర్తించిన ఈ వాస్తవాలు తిరిగి రుజువవుతున్నాయి.ట్రంప్ అరాచకానికి కళ్లెం వేయగల మార్గం ఒకే ఒకటి కని పిస్తున్నది. ఇది ఇట్లానే అందరినీ చుట్టుముట్టరాదంటే రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఆసియాన్ కూటమి, ఆఫ్రికన్ యూనియన్, బ్రెజిల్ వంటి దక్షిణ అమెరికా దేశాలు కలిసి, అమెరికా పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఐక్యరాజ్యసమితి ద్వారా మాత్రమే వ్యవహరించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఒక నిర్ణీత వ్యవధిలో అందుకు అంగీకరించనట్లయితే అమెరికా, ఇజ్రాయెల్‌లతో దౌత్య సంబంధాలు రద్దు చేసుకోకున్నా, సస్పెండ్ చేయగలమని హెచ్చరించాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెండు చట్టాలు, రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి.చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతిపాదన దేశంలో దశాబ్దాలుగా నలుగుతోంది. చట్టం చేయాలన్న ఆలోచనలోనే పలు అవరోధాలు ఎదురై ఎట్టకే లకు 2023లో చట్టం ఏర్పడింది. అది కూడా 2024 సార్వత్రిక ఎన్ని కల వాకిట్లో ఆదరాబాదరాగా వచ్చిందే! అమలు ఎప్పట్నుంచి అన్న ప్రశ్న అప్పట్లోనే వివాదాస్పదమైంది. 2026 తర్వాత అందుబాటులో ఉండే తాజా జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు పరచాలని నిర్ణయించి, దాన్నే చట్టంలో పొందుపరిచారు. కోవిడ్ కారణంగా 2021లో జరగని జనగణన 2025లో చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తారనీ, వెంటనే పునర్విభజన జరిపి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు జరపొచ్చనీ భావించారు. కానీ, 2025లో జన గణన మొదలు కాలేదు. ఇప్పుడు చేపట్టినా వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిచేయడం, ఆపై పునర్విభజన కమిషన్ ఏర్పరచి తాజా గణాంకాలతో ఆ ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కష్టమనే కొత్త అభిప్రాయం బలపడింది. దాంతో, ఇక రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల్లోనే అనుకుంటు న్నారు. ఉన్నట్టుండి ‘లేదు లేదు, తాజా జనగణనతో నిమిత్తం లేకుండా పాత లెక్కలతోనే పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసేద్దాం’ అని ఎన్డీయే పెద్దన్న బీజేపీ తీసిన కొత్త రాగమే భిన్నాభిప్రాయాలకు కారణమైంది.మహిళా ఓట్లపై గురిచట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఇప్పించడంలో మాకున్నంత పట్టుదల మరెవరికీ లేదని బీజేపీ నాయకత్వం చాటు కోవాలనుకుంటోంది. అందుకే తెలివిగా రిజర్వేషన్ అంశాన్ని పునర్విభజనతో ముడిపెట్టింది. 2023 మహిళా రిజర్వేషన్ చట్టంలో ఉన్నట్టుగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అంటే అది తప్పనిసరిగా జాప్యమౌతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. కానీ, 2029 లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా అంతకుముందే జరిగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, కర్టాటక, తెలంగాణ – పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల్లోనూ మహిళా ఓట్ల మొగ్గుతో లబ్ధి పొందవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. ఈ అంశంపై జరిగే చర్చ ద్వారా ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగాల్సివున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మహిళా ఓటర్లనూ మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నది ఆశ! తాజా జనాభా లెక్కలు వచ్చాక, జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల సంఖ్యను పెంచితే ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దానికి విరుగుడుగా, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యకు ఏకరీతిలో అంతటా 50 శాతం పెంచడం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రచారం చేసేట్టు వ్యూహ రచన చేశారు. మరింత చర్చకు డిమాండ్పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరింత చర్చ జరగాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. పెంపు వెంటనే చేపడితే మూడో వంతు సీట్లు (50 శాతం పెంపు ద్వారా) కొత్తగా వస్తాయి కనుక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు పరచడంలో ఎవరికీ ఇబ్బందులుండవని పాలక పక్షం వివరిస్తోంది. అలా జరిగితే, తమకు రాజకీయంగా పట్టున్న అధిక జనాభా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఆధిక్యత లభిస్తుంది. తక్కువ మోతాదులో సీట్లు పెరిగే దక్షిణా రాష్ట్రాల్లో తమకు ఎలాగూ పట్టు లేదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడాల్సిన రాజకీయ అవసరం ఉండదనేది భరోసా! దీన్నే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరుగుదలకు కారణమైన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచి బహుమతినిస్తారా అని అవి ప్రశ్నిస్తున్నాయి.చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యలోనే మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ అమలు పరచాలని కాంగ్రెస్ అంటోంది. ఇందుకు పదిహేనేళ్లనాటి 2011 జనాభా లెక్కలు కాకుండా, వెంటనే జనగణన ముమ్మరం చేసి, 2027 మే నాటికి లభించే తాజా గణాంకాల్ని రిజర్వేషన్ల ఖరారుకు వాడుకోవాలని సూచిస్తోంది. ‘ఇండియా’ కూటమి అభిప్రాయం నేడు జరగనున్న వారి భేటీలో తేలవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేష న్ను జీఎస్డీపీకి లింక్ పెట్టాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు. దీనికి ఇతర రాష్ట్రాలు, పార్టీలు ఏ మేరకు మద్దతిస్తాయో చూడాలి.ప్రత్యామ్నాయం పరిష్కారంనియోజకవర్గాల పెంపు విషయంలో ఏ పద్ధతి అనుసరించాల న్నది ప్రశ్నార్థకంగా మారింది. అందరు ఓటర్లు విలువ సమానంగా, ఒకటిగానే ఉండాలని మొదట్లో భావించారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను, భౌగో ళిక స్వరూపాలను మార్చాలని నిర్ణయించారు. ఇందుకుగానూ ప్రతి పదేళ్లకోసారి ‘పునర్విభజన కమిషన్ల’ ఏర్పాటు ప్రతిపాదించారు. 1951, 1962, 1972లో అలా కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య 494 నుండి 522కు, 543కు పెరుగుతూ వచ్చింది. జనాభా ప్రాతిపదికగా నియోజక వర్గాల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుందనే ఆలోచన 1972 తర్వాత వచ్చింది. అందుకే నాటి లోక్‌సభ స్థానాల సంఖ్య 543కు కట్టడి విధించి, 2000 సంవత్సరం వరకు సంఖ్యను మార్చొ ద్దని నిర్ణయించారు. ఈ మేరకు 42వ రాజ్యాంగ సవరణ (1976)తో ఒకసారి, 84వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా మరోసారి సంఖ్యను పెంచకుండా 2026 వరకు కట్టడి చేయాల్సి వచ్చింది. 1913 నుండి ‘ప్రతినిధుల సభ’ సభ్యుల సంఖ్యను అమెరికాలో 435కి కట్టడి చేసినట్టు మన దగ్గర కూడా కట్టడి చేయడమో, మరో హేతుబద్ధమైన ప్రత్యామ్నాయ విధానాన్నో వెతకాలి. జనాభా ప్రాతిపదికన ఏకరీతి సర్దుబాటు లోక్‌సభ స్థానాల్లో జరిపి, జనాభా నియంత్రించిన వారికి ప్రోత్సాహాలిచ్చే పద్ధతి రాజ్యసభ స్థానాల్లో కల్పించవచ్చనే సూచన వస్తోంది. అంతే తప్ప, ఏపీ సీఎం చంద్ర బాబు చెబుతున్నట్టు ‘ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనండి, మనకు నియోజక వర్గాలు పెరిగి ప్రాతినిధ్యం పెరుగుతుంది’ అన్నది పరి ష్కారం కాదు. అది తప్పు అవుతుంది.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
నిషేధం కాదు... కంటెంట్ కావాలి!
సోషల్ మీడియాపై చర్చ కొత్త దశకు చేరుకుంది. 16 ఏళ్ల లోపు బాలల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తు న్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. డిజిటల్ వ్యసనం, ఆన్లైన్లో అపరిమిత కాలాన్ని వెచ్చిస్తున్నందువల్ల కొన్ని పరిమితులు తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు కూడా అదే బాట పట్టే అవకాశముందని వార్తలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మైనర్లను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ఒక చట్టం తెచ్చింది. అదే తరహా విధానాలు అనుసరించడంపై ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు చర్చిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, సైబర్ బెదిరింపులు, నిద్రలో అవాంతరాలు వంటి సమ స్యలు తలెత్తుతున్నమాట వాస్తవమే. ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ వంటి సంస్థల అధ్యయనాలు కూడా ఆ సంగతిని ధ్రువీకరిస్తున్నాయి. బాలలు ఎలక్ట్రానిక్ తెరల ముందు రోజూ ఏడు గంటలకు పైగా గడుపుతున్నారని అవి తెలుపుతున్నాయి.సోషల్ మీడియా ‘కత్తి’ లాంటిది!ఎడతెగని ఫార్వర్డ్లు, సంచలనాత్మక అభిప్రాయాలు వ్యక్తపర చడం గురించి సోషల్ నెట్వర్క్ వాడకందారులు ఎవరికైనా వేరే చెప్పనవసరం లేదు. వాట్సాప్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫారాలు తప్పుడు సమాచారానికి కారణమవుతున్నాయని నిందలు మోస్తున్నాయి. ఎన్నికల సందర్భాలలోనైతే చెప్పనే అక్కర లేదు. ఏది బూటకమో, ఏది వాస్తవమో నిర్ధారణ కాకపోయినా ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ముద్ర వేసుకుని వచ్చేస్తాయి. ఫలితాలను ప్రభావితం చేయడంలో, హింసకు పురిగొల్పడంలో వాటి పాత్రను తోసిపుచ్చలేం. ఢిల్లీలో 2020 నాటి అల్లర్లను దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నిషేధించడం, లేదా నియంత్రించడం తప్ప గత్యంతరం లేదు. కానీ, ఆ యా వేదికలది తప్పా, లేక వాటిని వినియోగించుకుంటున్న మన తీరులో లోపం ఉందా అనే ప్రశ్న వెన్నాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియా దానికదే విషపూరితమైనది కాదు. క్యాట్ వీడియోలు, కుట్ర సిద్ధాంతాలు, కవ్వించే మాటల వంటి అల్పమైన విషయాల వరదలో టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, ఘర్షణ ప్రాంతాల నుంచి పౌరులు నేరుగా నివేదించే కథనాల వంటి మంచి సంగతులు కూడా కొట్టుకొస్తాయి. ఇస్రో రాకెట్ ప్రయోగాల ప్రత్యక్ష వీడియోల వంటివి యువతలో స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి సంగతులు మాధ్యమం తటస్థమైనదేననే సంగతిని గుర్తుచేస్తాయి. ఇదీ కత్తి లాంటిదే! దానితో కూరగాయలు తరగ వచ్చు. ఒంటికి గాయమూ చేసుకోవచ్చు. చరిత్ర నేర్పుతున్న పాఠాలుగూటెన్బర్గ్ 1440లో ముద్రణా యంత్రం కనుగొనడంతో విషయ పరిజ్ఞానం అందరికీ అందడం మొదలైంది. పునరుజ్జీవన, సంస్కరణవాద ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. యూరప్‌లో అక్షరాస్యత 10 శాతం నుంచి దాదాపు నూరు శాతానికి చేరుకుంది. అదే సమయంలో మూఢ నమ్మకాలను, కక్ష సాధింపు ప్రాపగాండాను పెంపొందించే కరపత్రాలు కూడా పుట్టుకొచ్చాయి. అయినా, నిషేధాలు నిలువలేదు. టెక్నాలజీయే కొనసాగింది. రేడియో వాడుకలోకి వచ్చినప్పుడు కూడా అదే ధోరణి పునరా వృతమైంది. జర్మనీలో 1930లలో హిట్లర్ విద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తికి అది కారణమైంది. ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ ఉత్తేజపూరిత ప్రసంగాలు అమెరికా ఐక్యానికి దోహదపడ్డాయి. టెలివిజన్ రాకతో నిరాధారమైన ఆరోపణలతో ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేసే పద్ధతి ఊపందుకుంది. అదే సమయంలో, పౌర హక్కులకు రక్షణ కల్పించి, మార్పునకు చేయూతనందించింది. నేడు సోషల్ మీడియా కూడా అదే బాటలో ఉంది. 50 కోట్ల మంది యూజర్లు, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్‌గా మన దేశాన్ని మార్చారు. ‘నాసా’ కృష్ణబిల చిత్రాలను కొన్ని అందిస్తే, భ్రమలను తొలగిస్తూ నోబెల్ బహుమతి గ్రహీతలు చెప్పే మాటలను మరికొన్ని అందిస్తున్నాయి. వన్యప్రాణులపై డిస్కవరీ ఛానల్ రీల్స్ వస్తున్నాయి. అలా వేదికలు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. వదంతులను వ్యాప్తి చేస్తోందని ట్విట్టర్‌ను తిట్టుకున్నాం. కానీ, కోవిడ్ మృతుల విషయంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇచ్చిన తాజా సమాచారాన్ని కూడా ట్విట్టరే ఎప్పటికప్పుడు అందించింది. డిజిటల్ ఎకో సిస్టంనిజమైన సవాల్ నిషేధించడంలో కాక, ఎకో సిస్టంను సుసంపన్నం చేయడంలో ఉంది. దేశంలోని 1.4 బిలియన్ల మందిలో మూడొంతుల మంది 35 ఏళ్ళ లోపువారు. వార్తలకు వారు డిజిటల్ మార్గాలపైనే ఆధారపడుతున్నారు. యువతలో 80 శాతం మంది సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి పొందు తున్నారు. ప్రజానిధులతో ప్రభుత్వం కూడా బోలెడంత సమాచా రాన్ని ఎత్తిపోస్తోంది. వాటిలో నీతి ఆయోగ్ నివేదికలు, విశ్వ విద్యాలయ గ్రాంట్ల సంఘ పరిశోధన పత్రాలు, రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ నవీకరణలు కూడా ఉన్నాయి. కానీ, అవన్నీ ప్రాచుర్యానికి నోచుకోని ఎక్కడెక్కడో సైట్లలో పీడీఎఫ్‌ల రూపంలో మూలుగుతున్నాయి. కొందరు ఉన్నత విద్యావంతులు మాత్రమే వాటిని చూస్తున్నారు. మంత్రిత్వ శాఖల నివేదికలలో 70 శాతం ఏటా వెయ్యికన్నా తక్కువ మంది చూపరుల దృష్టికి మాత్రమే ఆనుతున్నాయని 2023 నాటి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తేలింది. సోషల్ మీడియా ఒక పరిష్కారాన్ని ఇవ్వజూపుతోంది. వ్యవసాయ చట్టాలను, లేదా వాతావరణ డేటాను వివరించే రీల్స్ చేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లతో వివిధ మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యం కుదుర్చుకుంటే? ప్రాచీన చరిత్రపై విశ్వవిద్యాలయాలు టిక్‌టాక్ సిరీస్ చేస్తే? వేదాలను వైరల్ చేస్తే? నివేదికలను ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చేందుకు యువ క్రియేటర్ల సేవలను ఇస్రో, ఐఐటీలు, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థలు వినియోగించుకుంటే? వేదికలను సద్వినియోగం చేసుకునేటట్లు విద్యావేత్తలు, స్కాలర్లు తమ వంతు పాత్ర పోషించాలి. ‘పనికిమాలిన’వంటూ ప్లాట్ ఫారాలను చిన్నచూపు చూసే బదులు వారు క్వాంటమ్ ఫిజిక్స్, లేదా ఎన్నికల డేటాపై థ్రెడ్లను పోస్ట్ చేయవచ్చు. ఉన్నత ప్రమా ణాలతో కూడిన కంటెంట్ పెడుతున్నవారిని ఆ యా ప్లాట్ ఫారాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కాకపోతే విచక్షణా జ్ఞానంతో అన్వేషిస్తూ పోవాలి. మేరీ క్యూరీ 1 గ్రాము రేడియం కోసం 8 టన్నుల పిచ్ బ్లెండ్ను జల్లెడ పట్టవలసి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. సోషల్ మీడియా కూడా అదే రకమైన శ్రమను డిమాండ్ చేస్తోంది. చిందర వందర మధ్యలో అసలైన దాన్ని వెతికి పట్టుకోవాలి. సైట్ విశ్వస నీయతకు సంబంధించి న్యూస్ గార్డ్ వంటి టూల్స్ రేటింగ్ ఇస్తున్నాయి. ప్రభుత్వం కేవలం పోలీసుగానే వ్యవహరించకుండా, స్వయంగా క్వాలిటీ కంటెంట్ అందించాలి. వార్తాహరుడిని చంపే బదులు అతన్ని సమాచారంతో బలోపేతం చేయాలి.శివప్రసాద్ ఖేనేడ్వ్యాసకర్త సైన్స్ కమ్యూనికేటర్, మ్యూజియంవృత్తి నిపుణుడు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
తీర ప్రజలకు 'కారిడార్' ముప్పు
ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలు చూడాలి. మంచీచెడూ ఆలోచించాలి. విచక్షణ ఉండాలి. మరికాస్త సంయమనం పాటించాలి. వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా, సంస్థకైనా ఇది లోపించినప్పుడు ఆ వ్యవస్థలోని సమూ హాలు అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కార్పొరేట్ల దోపిడీకి చట్టబద్ధత కల్పించే విధాన నిర్ణయాలు తీసుకోవడంతో నివారించ వీల్లేని ప్రమాదాన్ని విజనరీ ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్నాయి. బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాలకు ఏపీ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అనుసరించే విధానం రాబోయే కాలంలో పెను ముప్పు కాబోతుందని పర్యావరణ నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం లోపల ఖనిజాలు, లోహాలు; సముద్ర తీర ఇసుకలో ఉన్న ఖనిజ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆటంకంగా ఉన్న ఆదివాసీ చట్టాలను బలహీనం చేస్తున్న ప్రభుత్వాల వ్యవహారం తెలిసిందే. ఇప్పుడు అదేవిధంగా విలువైన ఖనిజం ఎక్కడున్నా కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో ‘డబుల్ ఇంజన్లు’ వెళ్తున్నాయి. సముద్ర గర్భంలోని అపార ఖనిజ, లోహాలను వెలికితీసే ప్రణాళిక రూపొందించి, సముద్రంలో ఖనిజాలు గుర్తించడానికి ‘డీప్ ఓషన్ మిషన్’ కింద 4వేల కోట్లు పైగా కేంద్రం కేటాయించింది. జాతీయ భద్రతా మండలి సచివాలయం... సర్వే ఆఫ్ ఇండియా తాజా లెక్కల ప్రకారం 11,098 కిలోమీటర్ల భారత సముద్రతీరంలో ఖనిజ తవ్వకాలకు ప్రణాళిక తయారు చేసింది. భారత సముద్ర తీరంలో అత్యధిక పరిమాణంలో మైనింగ్ ప్రాసెసింగ్, పరిశోధన, తయారీలకు ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ప్రత్యేక ‘రేర్ ఎర్త్ కారిడార్’గా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఖనిజ తవ్వకాలకు ముందుకొచ్చే కార్పొరేట్లకు పెట్టుబడి ప్రోత్సాహం, భారీ రాయితీలు ఇచ్చేందుకు 2026–27 బడ్జెట్లో రూ. 7,280 కోట్లు కేటాయించింది. ఖనిజ దిగుమతిపై చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు వెతకడం అమెరికా ప్రారంభించింది. సొంత ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, భారత్ నుంచి ఎగుమతి చేసుకోవడం సురక్షితమని అమెరికా భావిస్తోంది. అమెరికా మాట కాదని చెప్పలేని కేంద్ర పాలకులు, వారికి అంగుదారునిగా తయారైన ఏపీలోని కూటమి ప్రభుత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చేలా ఖనిజ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాయి. అందుకనే రేర్ ఎర్త్ కారిడార్ పల్లవిని డబుల్ ఇంజన్ సర్కార్ ఎత్తుకుంది.రాష్ట్ర పరిధిలోని హక్కులను బలహీనం చేసి, ఆధిపత్యం పెంచుకునే కేంద్ర దుశ్చర్యలపై చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడడం లేదు. శాంతిభద్రతలు, సహజ వనరులు, ఖనిజాలు, మారిటైమ్, పట్టణ విధానం, భూ చట్టాలు, వ్యవసాయం వంటివి రాష్ట్ర పరిధిలో ఉన్నప్ప టికీ, నేరుగా కేంద్రం జోక్యం చేసుకొని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల దోపిడీకి అనుకూలమైన చట్టాలను కేంద్రం చేస్తోంది.బీచ్‌శాండ్ అపారంసర్వే ఆఫ్ ఇండియా తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని తీర ప్రాంతంలో బీచ్‌శాండ్ నిల్వలు 241 మిలియన్ టన్నులకు పైగా ఉన్నాయి. దేశంలోని బీచ్‌శాండ్ నిల్వలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రపంచంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగ వృద్ధికి ప్రాధాన్యం పెరుగుతుందన్న నేపథ్యంలో 2030 నాటికి రేర్ ఎర్త్ పర్మినెంట్ మ్యాగ్నెట్ల వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సముద్రతీరంలో మోనజైట్ నిల్వలు 35 శాతం ఉన్నాయి. సాంద్రత కల్గిన సముద్ర ఇసుకలో లభ్యమైన ఇల్మనైట్, జిర్కాన్, మోనజైట్, గార్నెట్, రూటైల్ వంటి ఖనిజం నుంచి వచ్చే థోరియం, యురేనియం, టైటానియం వంటి వాటిని విమానయాన, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాలు, విండ్ టర్బైన్లలో వినియోగించడంతో ప్రపంచంలో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో అత్యంత నాణ్యమైన ఖనిజం 40 వేల ఎకరాలలో ఉన్నట్లు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎమ్డీసీ) గుర్తించింది. సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలాల తీరంలోని 2,500 ఎకరాల్లో ఖనిజ తవ్వకాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీచ్‌శాండ్ ఖనిజ తవ్వకాలు, ప్రాసెసింగ్‌ను ఓ కార్పొరేట్ కంపెనీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సముద్రతీర ఇసుకలోని ఖనిజం ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వకూడదన్న కోర్టు తీర్పులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సముద్ర ఇసుకలో దొరికే అరుదైన ఖనిజాలు కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. పొంచి ఉన్న ప్రమాదాలుబీచ్శాండ్ ప్రాసెసింగ్ క్రమంలో వచ్చే శబ్దాలు, ప్రకంపనలు, సముద్రంలో విడిచిపెట్టే ఇంధనాలు, రసాయ నాలతో మత్స్య సంపద భారీగా దెబ్బతినడంతో పాటు జీవ, మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక దిబ్బలు కోతకు గురైతే సమీప నివాసిత ప్రాంతాల్లోకి ఉప్పునీరు ప్రవేశించి తాగునీటి సమస్య రానుంది. నిర్మాణాలు తొందరగా దెబ్బతింటాయి. సముద్ర తీరంలో ఔషధ, రసాయన పరిశ్రమలు విడిచిపెడుతున్న వ్యర్థాలతో చేపల ఉత్పత్తి తగ్గడంతో మత్స్యకారుల జీవనోపాధి తగ్గింది. ఇసుక తవ్వకాలతో ఉన్న కొద్దిపాటి ఉపాధి కూడా మత్స్యకారులకు లేకుండాపోతుంది. మోనజైట్ ఖనిజం నుంచి వెలువడే థోరియంతో చర్మ, క్యాన్సర్, ఊపిరి తిత్తుల వ్యాధులకు గురయ్యేవారి సంఖ్య పెరుగుతుంది. ఇన్ని అనర్థాలు, నష్టాలు, దుష్ప్రభావాలున్నా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఇవన్నీ సాధారణ ప్రజలు అనుభవించాలన్నట్లు ప్రభుత్వాల తీరుంది. బీచ్‌శాండ్ మైనింగ్ ముప్పును ముందుగా గుర్తించి నిలువరించకపోతే జీవా వరణానికి ముప్పు తప్పదు.– గుల్ల కాంతారావు ‘ సీనియర్ జర్నలిస్టు -
వి.కె. శశికళ (‘చిన్నమ్మ’) రాయని డైరీ
తిరుప్పరన్కుణ్రం నుంచి అరప్పాలయం కూడలికి చేరుకోగానే ‘అక్క’ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అక్క ఆ కూడలిలో ఎన్నోసార్లు ఆగారు. అక్క రాక కోసం అక్కడివాళ్లు చెట్ల నీడల్ని చాపల్లా పరుచుకుని, మిద్దెల పైన ఎర్రటి ఎండల్లో కనురెప్పల్ని గొడుగుల్లా తెరిచి పట్టుకుని ఎదురు చూస్తుండేవారు. కళ్లూ చెవులే కాదు, ఆత్మనూ అప్పగించి అంతా అక్క మాటల్లో కొట్టుకుపోయేవాళ్లు! అక్క గొంతులో అమ్మతనం ఉండేది. కరుణానిధి మాటొస్తే అక్క స్వరం అగ్నిపర్వతం అయ్యేది. అక్క నాతో అంటుండేవారు, ‘‘శశీ! ప్రజల్లోకి వచ్చావంటే, నువ్విక నాయకురాలివి కాదు, ప్రజలే నీ నాయకులు’’ అని! నేనిప్పుడు ప్రజల్లోకి వచ్చాను. ప్రజలు అనే నాయకులు ఇప్పుడు నాకు రెండు ఆదేశాలు ఇచ్చారు. ‘‘చిన్నమ్మా... దుష్ట సంహారం చెయ్’’, ‘‘చిన్నమ్మా... నీ అడుగడుగునా మాకు ‘అమ్మ’ను గుర్తు చెయ్’’ అంటున్నారు. తేనిలోని ఆండిపట్టి దగ్గర కూడా ఇదే విధమైన భావోద్వేగం నన్ను కమ్మేసింది. ‘‘చిన్నమ్మా! మీరు దిగులు పడకండి. మీకు అండగా మేమున్నాం’’ అని ప్రజలు గట్టిగా అరిచి చెప్పారు. ఒక్కసారిగా నా కళ్లలోంచి నీరు ఉబికి వచ్చింది.అక్క కూడా నాతో ఇలాగే అనేవారు. ఇద్దరం వ్యాన్‌లో సభలకు వెళుతున్నప్పుడు, అకస్మాత్తుగా... ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్ శశీ?’’ అని అడిగేవారు! ‘‘ఏమీ ఆలోచించటం లేదక్కా’’ అనేంత లోనే – ‘‘నువ్వు వెనక సీట్లో ఉన్నా, నేను ఉన్నది ముందు సీట్లో కాదు. నీ పక్క సీట్లోనే...’’ అని వెనక్కు తిరిగి, నా వైపు చూసి నవ్వేవారు. ఇప్పుడు వ్యాన్‌లో అక్క నా ముందు సీట్లో లేరు, నా పక్క సీట్లో లేరు. నేనే అక్క సీట్లో ముందు వైపు ఉన్నాను. ప్రజల దగ్గరికి అక్క ఆశీస్సులు మాత్రమే నన్ను నడిపిస్తున్నాయి. తిరుమంగళం, ఉసిలంపట్టి, మేలూరు, శంకరన్ కోయిల్, ముత్తుకుళత్తూరు, పరమకుడి, శివగంగ, మన్నార్గుడి, మైలాడుదురై, తంజావూరు, తూర్పు తిరుచ్చి, మదురై సెంట్రల్... అన్నీ, అమ్మ తన కన్నబిడ్డల్లా చూసుకున్న దక్షిణ ప్రాంతాలే! ఇప్పుడా కన్నబిడ్డలు ఈ చిన్నమ్మను కడుపులో పెట్టుకోకుండా ఉంటారా, చిన్నమ్మ కొత్త పార్టీ ‘ఆలిండియా పురట్చి తలైవర్ మక్కళ్ మున్నేట్ర కజగం’ను చేరదీయకుండా ఉంటారా? ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయటం లేదు. 2027 వరకు నేను ఎన్నికల్లోనే పోటీ చేయటానికి లేదు. కానీ అక్కకు ఎంజీఆర్ ఇచ్చిన అన్నాడీఎంకే పార్టీని, అక్క నాకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన అన్నాడీఎంకే పార్టీని... ఎడప్పాడి పళనిస్వామి లాగేసుకున్నాడు. అతడి నుంచి తిరిగి అన్నాడీఎంకేను దక్కించుకోవాలి. పార్టీ బ్యానర్ల మీద శ్రీ ఎంజీఆర్ పక్కన అక్క; అక్క పక్కన నన్నూ చూసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ ‘చిన్నమ్మ’ను ‘త్యాగ తలైవి’ అని కొనియాడుతున్నారు!సొంతంగా 80 చోట్ల, ‘పాట్టాళి మక్కళ్ కట్చి’తో కలిసి మొత్తం 234 స్థానాల్లో,ఈ త్యాగ తలైవి నిలబడవలసి వచ్చిందంటే... వచ్చే సీట్ల కోసం కాదు, పళనిస్వామికి పోగొట్టవలసిన సీట్ల కోసం అని ప్రజలందరికీ తెలుసు. కొందరు నన్ను అడుగుతున్నారు... ‘‘పార్టీ మీ దగ్గర లేదు, రెండాకుల గుర్తు మీ దగ్గర లేదు, మీరెలా గెలుస్తారు?’’ అని. నేను నవ్వుతాను. ‘‘పళనిస్వామికి పార్టీ ఆఫీసు తాళాలు దొరికి ఉండవచ్చు, కానీ కోట్లాది మంది కార్యకర్తల గుండెల్లో ఉండే ‘అమ్మ’ గది తాళం నా దగ్గరే ఉంది!’’ అని చెబుతాను. ఈ ఎన్నికల్లో నేను గెలవకపోవచ్చు,కానీ ద్రోహులు గెలవకుండా చూడగలను. రేపటి చరిత్రలో... ద్రోహం అక్రమంగా సింహాసనాన్ని అధిరోహిస్తే, ధర్మం కోసం త్యాగం ఆ సింహాసనాన్నే కూల్చేసిందని ప్రజలు చెప్పుకుంటారు. అదే నా గెలుపు! అదే... అక్కకు నేను పట్టే హారతి! -
అగాథంలో నిద్రిస్తున్న 'అద్భుత స్వప్నం'
20వ శతాబ్దంలో అలల మీద తేలియాడిన ఓ అద్భుత మహా నగరం ఏదైనా ఉందంటే అది ‘టైటానిక్’ అనడం అతిశయోక్తి కాదు. బెల్ఫాస్ట్ నగరంలోని ‘హార్లాండ్ అండ్ ఊల్ఫ్’ సంస్థ ఈ ఓడను నిర్మించింది. 882.5 అడుగుల పొడవు, 92.5 అడుగుల వెడల్పు, 52,000 టన్నులను మించిన బరువున్న ఈ ఓడ మాన వుడు అప్పటివరకూ సాధించిన సాంకేతిక అతిశయానికి ప్రతీక! ఓడ లోపల ఉన్న సౌకర్యాలు అప్పట్లో మరే ఇతర ఓడలోనూ లేవు. మొదటి తరగతి ప్రయాణికుల కోసం స్విమ్మింగ్ పూల్, జిమ్, లైబ్రరీ, నాలుగు ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. మూడవ తరగతిలో ఉన్న వారికి కూడా ఇతర ఓడల కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించారు. దీనిని తయారు చేసిన ఇంజనీర్లు 16 వాటర్ టైట్ కంపార్ట్మెంట్లను నిర్మించారు. వీటిలో నాలుగు గదులు పూర్తిగా నీటితో నిండిపోయినా ఓడ మునిగిపోదని వారు బలంగా నమ్మారు. అందుకే దీనిని ‘మునగని ఓడ’ అన్నారు.మొదటి ప్రయాణం1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్‌లోని ‘సౌతాంప్టన్’ నుంచి వేలాది మంది కలలను మోసుకుంటూ టైటానిక్ అమెరికాలోని న్యూయార్కుకు తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఖరీ దైన ఈ ట్రిప్‌ను ‘మిలియనీర్స్ స్పెషల్’ అని పిలిచారు. ఎడ్వర్డ్ జె. స్మిత్ ఈ ఓడకు కెప్టెన్. సుమారు 2,200 మంది ప్రయాణికులు, సిబ్బందితో టైటానిక్ అట్లాంటిక్ అలల మీద ముందుకు సాగింది. ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలోనే రేడియో ఆపరేటర్లకు ఇతర ఓడల నుంచి మంచుకొండలకు సంబంధించిన హెచ్చరికలు రాసాగాయి. ఏప్రిల్ 14న అనేకసార్లు ఈ సమాచారం అందింది. ఓడ వేగాన్ని మాత్రం తగ్గించలేదు. కెప్టెన్ స్మిత్ ఓడ దిశను కొద్దిగా మార్చినప్పటికీ, గంటకు 22 నాట్ల వేగంతో ప్రయా ణాన్ని సాగించారు. ఆ రాత్రి సముద్రం ప్రశాంతంగా ఉంది. అలలు లేకపోవడంతో మంచుకొండలను గుర్తించడం కష్టమైంది. రాత్రి 11:40 సమయంలో ఓడ ముందు ఒక భారీ మంచు కొండ ఉన్నట్లు గమనించారు. వెంటనే ఓడను పక్కకు తిప్పే ప్రయత్నం చేశారు, ఇంజిన్లను ఆపేశారు. కానీ అప్పటికే జరగా ల్సిన నష్టం జరిగిపోయింది. ఓడ కుడి భాగం ఆ మంచుకొండకు గట్టిగా తగిలింది. ఓడ కింద భాగంలో రంధ్రాలు పడ్డాయి. ఐదు గదుల్లోకి నీరు చేరడం మొదలైంది. ఓడ డిజైనర్ థామస్ ఆండ్రూస్ పరిస్థితిని గమనించి, మునగడం ఖాయమని తేల్చారు. కెప్టెన్ స్మిత్ వెంటనే ఆపద సంకేతాలను పంపమని ఆదేశించాడు. దగ్గరలో ఉన్న ‘కార్పాతియా’ ఓడ ఈ సంకేతాలను అందు కుంది. అది టైటానిక్‌కు 58 మైళ్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి కనీసం నాలుగు గంటలు పడుతుంది. మరోవైపు టైటానిక్‌లో లైఫ్ బోట్ల సంఖ్య తక్కువగా ఉంది. ఉన్న 20 బోట్లలో 1,178 మందే ప్రయాణించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 తెల్ల వారుజామున 2:00 గంటలకు ఓడ ముందు భాగం పూర్తిగా మునిగిపోయింది. వెనుక భాగం గాలిలోకి లేచింది. భారీ ఒత్తిడి వల్ల ఓడ రెండు ముక్కలుగా విరిగింది. 2:20 నిమిషాలకు పూర్తిగా అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగంలోకి చేరుకుంది. ఈ సంఘటన నౌకాయాన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రతి ఓడలో ప్రయాణికులందరికీ సరిపోయే లైఫ్ బోట్లు ఉండాలనీ, రేడియో నిరంతరం పనిచేయాలనీ కొత్త నిబంధనలు తెచ్చారు. మంచుకొండలను గమనించడానికి ‘ఇంటర్నేషనల్ ఐస్ పాట్రోల్’ సంస్థను ఏర్పాటు చేశారు. మునిగిపోయిన 73 ఏళ్ల తర్వాత, 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలోని బృందం టైటానిక్ శిథిలాలను కనుగొంది. సముద్రం లోపల 12,500 అడుగుల లోతులో ఓడ రెండు ముక్కలుగా పడి ఉంది. రాబోయే కొన్నేళ్లలో ఆ ఓడ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జేమ్స్ కామెరూన్ తీసిన ‘టైటానిక్’ సినిమా, ఇతర డాక్యుమెంటరీలు ఈ ఓడను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపి ఉంచాయి. కెప్టెన్ స్మిత్ -
మండిన ఎండ... కరిగిన గుండె
జనం గుండెల్లో ఉండేవాడు, జనక్షేమం కోసం పరితపించేవాడు, జనం మధ్య ఉంటూ, జనం మధ్య తింటూ బతుకంతా సమాజానికి ఇచ్చేవాడు నిజమైన ప్రజా నాయకుడు. అలాంటి వ్యక్తి ఉన్నా లేకున్నా ప్రజలు అతడిని స్మరిస్తారు, కొలుస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో డా‘‘ వైఎస్.రాజశేఖర రెడ్డి చిరునవ్వు నిత్య హరితం, నిత్య స్మరితం. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం అంటే 2003 ఏప్రిల్ 9వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చేవెళ్ళ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన, మొదటి సుదీర్ఘ పాదయాత్ర అది. అదంతా నిన్న మొన్న జరిగినట్లు ఉంది. ఆ యాత్ర ఒక చరిత్ర. ఓ పరిపాలనా విప్లవానికి నాంది. రాజశేఖరరెడ్డి నాకు గురువు, దైవం, హితుడు, స్నేహితుడు, ఆత్మీయుడు... అన్నీ! ఆ యాత్రలో ఆయనతో పాటు నేనూ ఉండటం నా అదృష్టం. ఆ అరవై అయిదు రోజుల్లో ప్రతిరోజూ ఓ కొత్త విషయం తెలుసుకున్నాను. కొత్తపాఠం నేర్చుకున్నాను. ముఖ్యంగా రాజశేఖరరెడ్డిలోని మంచితనపు విశ్వరూపాన్ని చూశాను.చుట్టంలా... స్నేహితుడిలా...వైఎస్ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు. వారి నమ్మ కాన్ని ఆయన వందశాతం నిలుపుకొన్నారన్నది సత్యం. పాదయాత్రకు ముందు ఆయన నిరంతర అంతర్మథనానికి గురయ్యాడు. నిత్యం వేలాది మంది ఆయనను కలిసి కష్టసుఖాలు చెప్పుకునేవారు. ‘మనం ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది కర్ణా’ అనేవాడు. రాష్ట్రంలో ఉన్న కర్షకుల స్థితి, కార్మికుల స్థితి, ఉద్యో గులు, విద్యార్థులు, మహిళలు, చేతివృత్తులవారు, చిన్న వ్యాపా రులు, రోడ్లు, సౌకర్యాలు, వైద్యం, ఆదాయం, విద్యుత్తు – అన్నీ ప్రత్యక్షంగా చూస్తే తప్ప వారికి ఏం చేయాలో తెలుసుకోలేం అన్నది ఆయన ఆలోచన. ‘ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే అధికారంలోకి వచ్చాక ప్రజలకు అవన్నీ చేయవచ్చు. రాకపోతే అవన్నీ చేయాలని ప్రతిపక్షంలో ఉండి పోరాడవచ్చు. అందుకే జనం మధ్యకు నడుచు కుంటూ వెళ్తాను. ఓ చుట్టంలా, స్నేహితుడిలా పలకరిస్తాను. రైతు పొలంలోని బురదలోకి దిగి మాట్లాడతాను. అతని బావిలో నీరు ఉందో లేదో స్వయంగా తొంగి చూస్తాను. చెట్టు కొమ్మన, చీర ఉయ్యాలలో పసిపాపను నిద్ర పుచ్చుతున్న తల్లి గుడిసెలోకి వెళ్ళి ఆ కుండల్లో కూడుందో లేదో చూస్తాను’... అలా ఆయన దీక్షగా చెబుతూవుంటే మాకు తెలియని కొత్త రాజశేఖరరెడ్డిని చూస్తున్న ట్లుగా అనిపించింది. ఎండలో... వానలో...2003, ఏప్రిల్ 9. ఎండ మండిపోతూ ఉంది. మాకు ఎండ కనిపిస్తోంది. ఆయన జనం గుండెల్ని, వాటి వెనక బాధల్ని చూస్తున్నారు. వాటి వెనక ఉన్న కన్నీటి కథలను చూస్తున్నారు. కాలిన పెనంలా రోడ్డు. అయినా చిరునవ్వుతోనే నడక సాగిస్తున్నారు. మొత్తం జనం, పల్లెలు, పట్టణాలు కదలివస్తున్నాయి ఆయనను చూడటానికి, మాట్లాడటానికి! వారి మాటలు వింటూ ఉంటే అప్పటి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సమస్యలు తప్ప మరేవీ లేవు అనిపించింది. కరవు, నిరుద్యోగం, అనారోగ్యం. కరెంటు లేకపోవడం, అప్పులు, వడ్డీలు, ఎముకల గూడు లాంటి మనుషులు, ఎడారిని తలపిస్తున్న పొలాలు, ఎటుచూసినా దైన్యం. అదంతా చూసి రాజశేఖరరెడ్డి ఎంత చలించిపోయారంటే అనేకసార్లు ఆయన కన్ను చెమ్మగిల్లడం చూశాను. అసలు ఆ ఎండలో, ఆ ఉక్కలో, ఏ సౌకర్యాలు లేక అలా ప్రయాణించడం ఆయనకు తప్ప మరే నాయకుడికీ సాధ్యం కాదు.పాదయాత్రలో ఒకసారి జోరున వర్షం కురిసింది. తడవకుండా పక్కనే ఉన్న జీపు ఎక్కాను నేను. కానీ ఆయన అలా తడుస్తూనే, నడుస్తూనే ఉంటే, అది చూచి నాకు ఎంత బాధనిపించిందో! ‘ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది వానకు తడిసి, నిలువ నీడలేక నిల బడుతున్నారో కర్ణా! అందరికీ ఇళ్ళు ఇవ్వాలి. అప్పుడే ఆనందం’ అన్నాడాయన. కరవు కాటకాల్ని, బరువు గుండెలను చూశారు రాజశేఖరరెడ్డి. అందుకే ప్రజలు ఆయనను అంతగా ప్రేమించారు, నమ్మారు. గ్రామాలు, పట్టణాలు ‘మండుటెండలో రాజన్నా... మహాత్ముని అడుగుజాడల్లో నీవన్నా’ అన్న నినాదాలు గోడల మీద రాసి ఆయనను ఆహ్వానించాయి. మాట ఇస్తే మన్నించే మనిషిగా ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు.మోసం చేసి మీసం తిప్పుతున్న ఈనాటి ప్రజాకంటక పాలకు లకు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ప్రజలలోకి వస్తున్నారనే భయం పట్టుకుంది. వస్తే ఆయనకు లభించే జనాదరణను తట్టుకోలేమన్న విషయం వారికి తెలుసు. ఇరవై మూడు సంవత్సరాలైనా ఆ రాజశేఖరుడి పాదస్పర్శ ఈ నేల తల్లి మరచిపోలేదని తెలిసి ఆనందంగా ఉంది. ఆయన రాజశేఖరుడు. ఆయన కుమారుడు జగన్మోహనుడు. కదిలితే... కాలం తెల్లబోతుంది. జన ప్రవాహ సునామీ చుట్టు ముడుతుంది. జేజేల నాదాలు గగనాన్ని కంపిస్తాయి. ఆసత్య ప్రచార గ్రామసింహాలు తోక ముడుస్తాయి. అది గుర్తు చేసుకుంటూ... రాజశేఖరుని రాజస ధర్మదీక్షా దక్షతకు, సుపరిపాలనకు నమస్కరించి, తిరిగి స్వాగతం పలుకుతున్నాను.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్(ఏప్రిల్ 9: 2003లో వైఎస్ పాదయాత్ర ప్రారంభమైన రోజు) -
సమష్టిగా నారీశక్తిని బలోపేతం చేద్దాం!
మరికొన్ని రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండగ వాతావ రణంతో సందడి మొదలు కాబో తున్నది. అస్సాం ప్రజలు రొంగాలి బిహు జరుపుకొంటే, ఒడిశా ప్రజలు మహా బిషుబ పాన సంక్రాంతి నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో పొయిలా బైశాఖ్ బెంగాలీల నూతన సంవత్సరానికి నాంది పలికితే, కేరళలో సంబరంగా విషు పండగ నిర్వహిస్తారు. తమిళనాడులో పుత్తాండు పర్వదినాన్ని, పంజాబ్ సహా ఉత్తర భారతంలోని ఇతర ప్రాంతాల్లో బైశాఖీ వేడుకను చేసుకుంటారు. ఇవన్నీ ఆశాభావాన్నీ, సానుకూల దృక్పథాన్నీ పెంపొందిస్తాయి. దేశ విదేశాల్లో ఈ వేడుకలను నిర్వహించుకొనే వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర ఉత్సవాలు అందరి జీవితాల్లోనూ ఆనందాన్నీ, సౌభాగ్యాన్నీ తీసుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.ఏప్రిల్ 11 నుంచి మహాత్మా ఫూలే 200 జయంత్యుత్సవాలను మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ నెల 14న జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు యావత్ భారతదేశం నివాళి అర్పిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భాలే కాకుండా, మన హృద యాలూ, ఆలోచనలూ పునర్నవీకరణ స్ఫూర్తితో నిండిన వేళ... మన దేశం మరో చారిత్రక విజయం ముంగిట నిలబడింది. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్ఠం చేసుకోవడానికీ, సమానత్వం, సమ్మి ళితత్వం దిశగా మన సమష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడానికీ లభించిన గొప్ప అవకాశమిది.ప్రత్యేకమైన సందర్భంమహిళల రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన బిల్లుపై చర్చించేందుకు, ఆమోదించేందుకు ఏప్రిల్ 16న పార్లమెంటు సమా వేశం కానుంది. దీనిని ఓ శాసనపరమైన కార్యక్రమంగా పేర్కొంటే ఈ బిల్లు ప్రాధాన్యాన్ని తగ్గించినట్టే అవుతుంది. భారత్‌లోని కోట్లాది మహిళల ఆకాంక్షలకు ఇది ప్రతిబింబం. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే సమాజం పురోగమిస్తుందనే మన సుదీర్ఘ నాగరికతా స్ఫూర్తికి ఇది నిదర్శనం. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే. ఈ దేశానికి వారు అందిస్తున్న సేవలు అపారమైనవి, అమూల్యమైనవి. ప్రతి రంగంలోనూ మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు నేడు భారత్ కేంద్రంగా మారింది. శాస్త్ర, సాంకేతిక రంగాల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక రంగం వరకు, క్రీడల నుంచి రక్షణ బలగాల వరకు, సంగీతం నుంచి కళల వరకు దేశాభివృద్ధిలో మహిళలే అగ్రగామిగా ఉన్నారు. కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు స్త్రీ సాధికారత దిశగా అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. చదువుకునేందుకు పెరిగిన అవకాశాలు, మెరుగైన ఆరోగ్య సేవలు, విస్తరించిన ఆర్థిక సమ్మిళితత్వం, అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక అవసరాలు... ఆర్థిక, సామాజిక కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృతం చేశాయి. అయినప్పటికీ, సమాజంలో మహిళలు పోషిస్తున్న పాత్రకు అనుగుణంగా రాజకీయ రంగంలో, శాసనసభల్లో వారికి ప్రాతి నిధ్యం లభించలేదు. ఇది దురదృష్టకరం. పరిపాలనలో, నిర్ణయాధి కారంలో మహిళలు భాగస్వాములైతే... వారిదైన ఆలోచనలనూ, అనుభవాలనూ జోడించడం ద్వారా ప్రజోపయోగ చర్చలు, పాలనా సామర్థ్యం మరింత మెరుగవుతాయి. రానున్న అంటే... 2029లో లోక్‌సభ, వివిధ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగే నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం అనివార్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు దక్కా ల్సిన ప్రాధాన్యాన్ని అందించేందుకు గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాయి. కమిటీలు ఏర్పాటయ్యాయి. ముసా యిదా బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చ లేదు. అయినప్పటికీ... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగా లన్న అంశంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. ఈ ఏకాభి ప్రాయ స్ఫూర్తితోనే 2023 సెప్టెంబరులో ‘నారీ శక్తి వందన్ అధి’ని యవ్ును పార్లమెంటు ఆమోదించింది. నా జీవితంలోని అత్యంత ప్రత్యేకమైన సందర్భాల్లో ఒకటిగా నేను దీనిని భావిస్తాను.ఏకతాటి పైకి రావాల్సిన సమయంమహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ అవకాశం మన రాజ్యాంగ స్ఫూర్తిలో ప్రతిధ్వనిస్తోంది. ఆచరణాత్మక రూపంలో సమానత్వానికి ప్రాతినిధ్యం ఉన్న సమాజాన్ని నిర్మించాలని మన రాజ్యాంగ నిర్మా తలు ఆకాంక్షించారు. ఈ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా చేపడుతున్న ప్రయత్నాల్లో ప్రధానం... శాసన వ్యవస్థల్లో మహిళల పాత్రను బలోపేతం చేయడం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి పౌరునికీ సమాన భాగస్వామ్యాన్ని అందించే సమాజాన్ని నిర్మించడంలో మా చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుంది. మహిళల ప్రాతినిధ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి జాప్యం జరిగినా... ప్రజాస్వామ్య సమ్మిళితత్వాన్నీ, ప్రజాస్వామ్య స్ఫూర్తినీ మనం వాయిదా వేసినట్లే! శాసన వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని దశాబ్దాల కిందటే గుర్తించారు. ఇప్పుడు గనుక దీనిని వాయిదా వేస్తే... మనం గుర్తించిన, సరిదిద్దగలిగిన అసమతౌల్యాన్ని మరింత పెంచడమే అవుతుంది. నిర్దిష్ట లక్ష్యంతో, ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు సాగు తున్న ఈ తరుణంలో ప్రజలు, ముఖ్యంగా జనాభాలో సగభాగంగా ఉన్నవారి ఆకాంక్షలను మన శాసన వ్యవస్థలు ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. సకాలంలో చేపట్టే చర్యలు దీర్ఘకాలంగా నెరవేరని వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ప్రగతి వేగాన్ని సైతం కొనసా గిస్తాయి. మన ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రాతినిధ్యం కల్పించే దిగా తీర్చిదిద్దేందుకు ఇది నిజంగా చరిత్రాత్మక అవకాశం.ఇది ఏ ఒక్క ప్రభుత్వానికో, పార్టీకో లేదా వ్యక్తికో సంబంధించిన అంశం కాదు. దీనిని సాకారం చేసుకునే దిశగా దేశమంతా ఏకతాటి పైకి రావాల్సిన సమయం. మన నారీశక్తికి మనం అందించాల్సింది ఇదే. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు లభించే ఆమో దంలో విస్తృత ఏకాభిప్రాయం వ్యక్తం కావాలి. మన కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం పనిచేయాలనే స్ఫూర్తిని ఇలాంటి అవకా శాలు మనకు అందిస్తాయి. మార్పులను స్వీకరిస్తూ, మరింత సమ్మిళి తత్వాన్ని సాధించడంలోనే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగి ఉందన్న సంగతిని గుర్తు చేస్తున్నాయి. చరిత్రాత్మకమైన ఈ పార్లమెంటు సమావేశం సమీపిస్తున్న నేపథ్యంలో... భారతీయ మహిళల కోసం చేపడుతున్న ఈ ముఖ్య మైన కార్యక్రమానికి మద్దతు అందించాలని పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యున్నత ప్రజా స్వామ్య విలువల కోసం కలిసి నడుద్దాం. జాతీయ ప్రయోజనాల విషయంలో విభేదాలను పక్కన పెట్టి, ఐక్యంగా వ్యవహరించ గలదని భారత్ ఎల్లప్పుడూ రుజువు చేస్తూనే ఉంది. ఇది అలాంటి సందర్భమే! రాజ్యాంగ విలువలను బలోపేతం చేద్దాం. దేశ ప్రగతి కోసం నారీశక్తికి సాధికారత కల్పిద్దాం. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ముగింపు లేని యుద్ధోన్మాదం
ట్రంప్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేయడం వారి విజ్ఞతకు నిదర్శనం. యుద్ధంలో గెలిచే శామనీ, ఇరాన్ లొంగిపోయిందనీ ట్రంప్ చేసిన ప్రకటనను మొదట్లో అందరూ నిజమేనని నమ్మారు. కానీ ఇరాన్ ప్రతిఘటన తీవ్రంగా ఉండటం, పెద్ద సంఖ్యలో అమెరి కన్ సైనికులు చనిపోవడం, హోర్మూజ్ జలసంధిని ఇరాన్ పరిరక్షించుకోవడం వంటి పరిణామాలు చూసిన తరువాత యుద్ధానికి సంబంధించి అధ్యక్షుడు తమకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని వారికి అర్థమైంది. ఇప్పటికే అమెరికాలో చమరు, గ్యాస్ ధరలు పెరిగాయి. తమ దేశం ఈ యుద్ధంలో అడ్డంగా ఇరుక్కుపోయిందనీ, దానినుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు పడుతున్నారనీ ప్రజలు గ్రహించారు. ‘ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని ఎన్నో ఏళ్లుగా వింటున్నాం. అలాగే అక్కడ ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తున్నారని కూడా విన్నాం. ఇప్పుడు నాకు అవేవీ వినబడటం లేదు. నా దేశంలో నేను కొనే గ్యాస్ (పెట్రోల్) ధర అమాంతం పెరిగిపోవడం ఒక్కటే నన్ను బాధిస్తోంది’ అని ‘బీబీసీ’ వార్తా సంస్థతో ఓ సగటు అమెరికన్ అనడం పరిస్థితికి అద్దం పడుతోంది. యుద్ధ విరమణ చేయించాలంటే తమకు భారీ ఎత్తున నష్టపరి హారం చెల్లించాల్సిందేనని ఇరాన్ షరతు విధించడం అమెరికాకు ఊహించని పరిణామం. ఇరాన్‌ను తక్కువగా అంచనా వేసి ఎదురు దెబ్బతిన్న నేపథ్యంలో, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న నిర్ణయం తనది కాదని చెప్పుకోవడానికి ట్రంప్ తెగ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలోని వివిధ నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతా లలో కూడా ట్రంప్‌కు వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘నోకింగ్స్’ పేరుతో సాగుతున్న ఈ నిరసన జ్వాలలు యూరప్ నగరా లకు సైతం పాకాయి. భారత్ మాత్రం ఈ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు... ట్రంప్‌కు మోదీ లొంగిపోయాడని విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధాని సంయ మనం పాటిస్తున్నారు.స్వప్రయోజనాలే మిన్న ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింప జేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో కొన్ని దేశాలు తమ సొంత ప్రయోజ నాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం మరో పార్శ్వం. హోర్మూజ్ జలసంధి నుంచి తమ రవాణా నౌకలు సజావుగా ప్రయా ణించడానికి సహకరించాలని ఇరాన్‌కు చైనా విజ్ఞప్తి చేసింది. అయితే ఇరాన్ మాత్రం యుద్ధంలో తమ పక్షాన నిలవాలని చైనాకు షరతు విధించింది. ప్రçస్తుతం చైనా కూడా తటస్థ వైఖరితోనే ఉంది. మరోవైపు ఇరాన్‌తో జరిపే చర్చలకు అమెరికా తమ దేశాన్ని వేదికగా చేసుకోవాలని కోరుతున్న పాకిస్తాన్ ఇరుపక్షాల నుండి లబ్ధి పొందాలని చూస్తోంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నట్లు పాకిస్తాన్ దళారీ పాత్ర పోషించి రెండు వైపులా లాభాలు పిండుకోవడానికి ఆరాటపడుతున్నది. ఇరాన్ కనుక హోర్మూజ్ జలసంధిని మూసివేసినట్లయితే భారత్ సహా పలు దేశాలు ఆర్థికంగా దెబ్బ తినడం ఖాయం. అందువల్ల ఇరాన్‌ను అమెరికాతో యుద్ధ విరమణ సంధికి ఒప్పించడానికి పశ్చిమాసియా, యూరప్ దేశాలు ఆతృత పడుతున్నాయి. ఇంగ్లాండ్‌లో ఆర్థిక పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. అందువల్లనే ఆ దేశం కూడా వీలైనంత త్వరగా యుద్ధానికి స్వస్తి పలకాలని ట్రంప్‌కు సూచిస్తోంది.రష్యన్ మహా రచయిత టాల్‌స్టాయ్ చెప్పినట్లు, ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికాకు రోజుకో బిలియన్ డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాణాలు కోల్పోయిన అమాయకులు, వారి కుటుంబ సభ్యులకు జరిగిన నష్టాన్ని లెక్కించడానికి ఏ కొలమానం ఉంది? ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అందుకే దాడి అని చెప్పిన ట్రంప్ మాటల్లోని డొల్లతనం కూడా ప్రపంచానికి అర్థమయ్యింది. ఇరాన్‌కు నిజంగానే అణ్వాయుధాలు ఉన్నట్లయితే వాటిని ఇంత కాలం ప్రయోగించకుండా ఉంటుందా? దేశ సార్వభౌమాధికారాన్ని ఎంత శక్తిమంతమైన దేశం ప్రశ్నించినా... చిన్న దేశాలు సహించవని చెప్పడానికి ఇరాన్ ఒక ఉదా హరణగా నిలుస్తుంది. గతంలో అమెరికాకు వియత్నాం, క్యూబాల నుంచి కూడా ఇటువంటి ప్రతిఘటనలే ఎదురయ్యాయి. ఆ చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోని అమెరికన్ పాలకులు పదేపదే అవే తప్పులను చేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధ నియ మాలను ఉల్లంఘిస్తూ వైరిపక్షాలు ఆడుతున్న ఈ వికృత క్రీడకు ఇప్పట్లో ముగింపు ఉంటుందా?డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు -
ఆఫ్రికాలో కొత్త చైతన్యాలు
పాశ్చాత్యులు ‘చీకటి ఖండ’మని పిలిచి 500 వందల సంవత్సరాలకు పైగా భౌగోళిక వలస పాలనను, ఆర్థిక వలస పాలనను సాగించిన ఆఫ్రికాలో కొత్త చైత న్యాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి వీటిని రెండవ విడత చైతన్యాలనాలి. ఉద్యమాల ద్వారా, ఎక్కువగా సాయుధ తిరుగుబాట్లతో 1950ల నుంచి ఆరంభించి రాజకీయ స్వాతంత్య్రాలను సాధించుకున్న తర్వాత, ఇపుడు ఆర్థిక స్వాతంత్య్రం కోసం కదలుతున్నారు.లిథియం ఎగుమతులపై నిషేధంఅరుదైన లోహాలు, ఖనిజాల కోసం గత కొద్ది నెలలుగా పారిశ్రామిక దేశాలు హోరాహోరీన తలపడుతుండగా, జింబాబ్వే గత నెలలో ఆకస్మికంగా చిన్న భూకంపాన్నే సృష్టించింది. బంగారం, వజ్రాలు, ప్లాటినంతోపాటు, ప్రస్తుత పరిణామాలలో కీలకంగా మారిన లిథియం ఎగుమతులను నిషేధించింది. లిథియం ఉత్పత్తిలో జింబాబ్వేది ప్రపంచంలో నాల్గవ స్థానం. ఎగుమతుల నిషేధానికి వారు చెప్పిన కారణం, తమ వనరులను ముడిసరకుల రూపంలో ఎగుమతి చేయటం వల్ల తమకు లభిస్తున్నది అతి స్వల్పం కాగా, వాటిని శుద్ధి చేసి ఉపయోగించుకుంటున్న దేశాలు, కంపెనీలు అనేక రెట్లు లాభపడుతున్నాయి. ఆ శుద్ధి తమ దేశంలోనే జరిగితే ధర ఎంతో ఎక్కువగా వస్తుంది. కనుక, ఆ కార్యక్రమం కోసం నిషేధిస్తున్నామని! అదే రోజుల్లో జాంబియా అదే పని చేసింది.లిథియం కీలకంగా మారినందున జింబాబ్వే, జాంబియా చర్యలు సంచలనమైనాయి గాని, 2023 మొదలుకొని 13 ఆఫ్రికన్ దేశాలు అనేక ఖనిజాలు, లోహాలను ముడి ఉత్పత్తుల రూపంలో ఎగుమతి చేయటం ఆపివేశాయి. ఆఫ్రికా ఖండంలో దక్షిణాదిన గల జింబాబ్వే, జాంబియాల నుంచి ఒకసారి ఉత్తరాన వాయవ్య దిశలో గల నిజేర్ (ఫ్రెంచ్ ఉచ్చారణ) అనే చిన్న దేశానికి వెళదాము.రెండేళ్ల కిందట నిజేర్, దానికి పొరుగున గల బుర్కినా ఫాసో,మాలి అనే మరొక రెండు చిన్న దేశాలు కలిసి కూటమిగా ఏర్ప డ్డాయి. మూడింటా యురేనియం తదితర విలువైన నిల్వలు భారీగా ఉన్నాయి. గతంలో తమ వలసలు అయిన ఈ మూడింటిలో నిజేర్ నిల్వలను వినియోగంలోకి తెచ్చిన ఫ్రెంచ్ కంపెనీలు కిలో యురేనియంకు 0.25 డాలర్లు చెల్లించి, దానిని శుద్ధి చేసిన తర్వాత కెనడాకు 25 డాలర్లకు (వంద రెట్లు) అమ్ముతుండేవి. పై మూడు దేశాలలో స్థానిక యువ నాయకత్వాలు తిరుగుబాట్లు చేసి అధికా రానికి వచ్చిన తర్వాత, ఒక కూటమిగా ఏర్పడి, అదే 25 డాలర్లు తమకు చెల్లిస్తే తప్ప యురేనియంను ఎగుమతి చేయబోమన్నాయి. చివరకు ఫ్రెంచ్ కంపెనీలు నిష్క్రమించక తప్పలేదు. ఫ్రెంచ్ సైనిక స్థావరాల మూతయురేనియం ఒక్కటే కాదు. ఆ మూడు దేశాలలో బంగారం సహా అనేక నిక్షేపాలున్నాయి. వారు ఆ గనులన్నింటిని ఫ్రాన్స్ అధీనం నుంచి స్వాధీనపరచుకోవటమే గాక, తమతోపాటు మరో మూడు దేశాలలోని ఫ్రెంచ్ సైనిక స్థావరాలను మూసి వేయించారు. ఇందుకు ప్రతీకారంగా ఆ కూటమి నాయకుడైన బుర్కినా అధ్యక్షుడు ట్రవోరేపై ఇప్పటికి అయిదుసార్లు కుట్రలు జరిగాయి. ఆర్థిక స్వాతంత్య్రం లేనిదే రాజకీయ స్వాతంత్య్రం బలపడ దన్నది తెలిసిందే. ఇది లోగడనే గుర్తించిన ఆఫ్రికన్ దేశాలు, ఖనిజాలు, లోహాల విషయంలో తాము ఎంత సంపన్నమైనవో తెలిసినందున, ఆ విషయమై సమావేశాలు, సంస్థల ఏర్పాటు అయితే 30 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాయి. కానీ తమ వనరులను తామే వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్తు తగినంత లేనందున ఆ కార్యక్రమం వేగంగా సాగటం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ నేతలు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఫిబ్రవరిలో సమావేశమై, ఈ దిశగా తమ చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించటం గమనించదగ్గది.విలువైన ఖనిజాలు, లోహాలు, చమురు, అటవీ సంపదలు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉండగా, ఆ విషయంలో అగ్రస్థానంలో గల ఏడు దేశాలు – దక్షిణాఫ్రికా, నైజీరియా, ఆంగోలా, ఘనా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గబోన్, జింబాబ్వేల ఉమ్మడి విలువ సంవత్సరానికి సుమారు 260 బిలియన్ డాలర్లు. ఈ ఉత్పత్తుల నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నది బయటి దేశాలే. అందువల్లనే ఆఫ్రికా ఇంత పేదదిగా మిగిలిపోయి ప్రజలు కనీస ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస పోవలసిన దుఃస్థితికి గురవుతున్నారు. నమ్మశక్యం కాని ప్రగతివివిధ సంస్థల అంచనాల ప్రకారం ప్రపంచంలోని బంగారం నిల్వలలో 30 శాతం, అత్యధిక భాగం వజ్రాలు, 50 శాతం కోబాల్ట్, అభ్రకం, 20 శాతం రాగి, బాక్సయిట్, అవిగాక ప్లాటినం,లిథియం, యురేనియం భారీ నిక్షేపాలు అక్కడున్నాయి. వాటి నుంచి మొదటినుంచి పాశ్చాత్య దేశాలు, ఇటీవల చైనా ఎంత తర లించుకుపోతున్నా ఆఫ్రికా ఒక తరగని గనిగానే ఉంది. ఇవి గాక అటవీ సంపద మాట తెలిసిందే. సారవంతమైన భూములు విస్తా రంగా ఉండి, వాటిని సాగులోకి తెచ్చే సాధనాలు స్థానికులకు లేనందున బయటివారు ఒక్కొక్కరే అక్షరాలా లక్షలకు లక్షల ఎకరాలను దీర్ఘకాలిక లీజులకు తీసుకుని స్థానికులను కూలీలుగా మార్చు తున్నారు. ఇటువంటి లీజులలో కొన్నింటిని నేను స్వయంగా చూశాను. వాటిలో భారతీయులవి కూడా ఉన్నాయి.ఇంతింత దోపిడీ సాగుతున్నా ఆఫ్రికా ఆర్థిక పురోగమనాన్ని చూస్తే, ఒక వేళ వారు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధిస్తే మరెంత అద్భు తంగా ఉండగలదో అనిపిస్తుంది. ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొన్న దానినిబట్టి ఈ 2026లో ఆఫ్రికా ఆర్థిక ప్రగతి ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ఆసియాను మించిపోనున్నది. ఆసియాలో చైనా, జపాన్, ఇండియా, ఆసియాన్ కూటమి వంటి దిగ్గజాలు ఉండటంతో ఈ అంచనాలు ఎంతో నమ్మశక్యం కాకుండా తోస్తు న్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న 20 దేశాలలో సగం ఆఫ్రికాలోనే ఉన్నాయి. విచారం ఏమంటే, భారతదేశం వలెనే శతాబ్దాల పాటు వలస దోపిడీకి గురై సుదీర్ఘ ఉద్యమాల ద్వారా స్వతంత్రమైన ఆఫ్రికా గురించి మనకు తెలుస్తు న్నది స్వల్పం.ఆఫ్రికాలో ఈ కొత్త చైతన్యాలకు కారణాలున్నాయి. అక్కడి ప్రజలలో, ముఖ్యంగా యువతలో కొత్త చదువులు, ప్రాపంచిక దృక్పథాలు, తమ దేశాల భవిష్యత్తు గురించిన స్పృహలు కలుగుతున్నాయి. మేధావి, రచయిత వర్గాలు కదలుతున్నాయి. కొత్త రాజకీయ నాయకత్వాలు వస్తుండగా వాటిపై ఈ ప్రభావాలు పడుతున్నాయి. ఎన్నెన్నో ఆధునీకరణలతో ప్రపంచం పురోగమిస్తుండగా, సకల వనరులూ గల తాము ఇంకా ఎంత కాలం బయటి వారికి ఉపయోగపడుతూ వెనుకబడి ఉండాలనే భావనలు బలపడు తున్నాయి. అంతకన్నా కావలసింది ఏమున్నది!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మొదటి విడత రేసులో మొగ్గెవరికి?
మళ్లీ అధికారం మాదే అని అసోమ్‌లో బీజేపీ నేతృత్వపు ‘ఎన్యీడీఏ’ ధీమాగా ఉంటే, కేరళంలో కమ్యూనిస్టు నేతృత్వపు ‘లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్’ (ఎల్డీఎఫ్) ఆపసోపాలు పడుతోంది. రెండు చోట్ల అవే కూటములు రెండో పర్యాయం అధికారంలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి మరో ప్రభుత్వం నడుస్తున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాలక కూటమే ముందంజలో ఉంది. ఈ నెల 9న పోలింగ్ జరగాల్సి ఉన్న ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. తమిళనాడు (ఏప్రిల్ 23), పశ్చిమ బెంగాల్ (ఏప్రిల్ 23, 29)లలో ప్రచారహోరు తీవ్ర స్థాయికి చేరింది. సిద్ధాంతాలు, నిబద్ధతల కన్నా ‘పొలిటికల్ న్యారేటివ్స్’ ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎన్నికల తుది ఫలితాలు తేలేది మాత్రం మే 4న ఓట్ల లెక్కింపు తర్వాతే!ఎక్కడో 4 వేల కిలోమీటర్ల దూరంలోని పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ దక్షిణ ధ్రువపు కేరళం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా? 30 లక్షల మంది మలయాళీలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉండటం, అత్యధికులు తరచూ స్వస్థలాలకు వస్తూ–పోతూ ఉండే స్వభావ రీత్యా ఎన్నికల్ని వారు ప్రభావితం చేస్తుంటారు. దేశ ఈశాన్యపు శీర్షాన ఉన్న అసోమ్ రాష్ట్రంలో 2023లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజన, ఫలితంగా తగ్గిన ముస్లిం ఆధిపత్య నియోజక వర్గాల సంఖ్య ఎన్ని కల సరళిని ప్రభావితం చేయనుంది. మూడు భౌగోళిక ముక్కలుగా ఉన్న పుదుచ్చేరికి ‘రాష్ట్ర హోదా కల్పించడమ’నే డిమాండ్ ప్రస్తుత ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశ ముంది. ఓడినా, గెలిచినా చరిత్రే!సంపూర్ణ చదువరుల రాష్ట్రం కేరళంలో ప్రతిసారీ విపక్షాలను గెలిపించే జనం నైజం వల్ల ఎల్డీఎఫ్, యూడీఎఫ్ (యునైటెడ్ డెమా క్రటిక్ ఫ్రంట్) ఒకటి తర్వాత మరొకటి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయి. కానీ, 2021 ఎన్నికల్లో పాలక ఎల్డీఎఫ్ అధికారం తిరిగి నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది. మూడోసారి గెలిస్తే, కేరళంలో కొత్త చరిత్రే! లోగడ పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలుండేవి. ఓడిపోతే, దేశంలో ఎక్కడా కమ్యూ నిస్టు సర్కారు లేని పరిస్థితి వస్తుంది. 2021 ఎన్నికల తర్వాత యూడీఎఫ్ పుంజుకోవడం ఎల్డీఎఫ్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయిదేళ్లలో జరిగిన 5 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 4 చోట్ల గెలిచిన యూడీఎఫ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మంచి (18/20) ఫలితాలు పొందింది. 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో 565/941పంచాయతీల్లో నెగ్గి కమ్యూనిస్టులకు షాకిచ్చింది. మరోవైపు బీజేపీ పుంజుకోవడమూ ఎల్డీఎఫ్ను కలవరపరు స్తోంది. 2016, 2021 ఎన్నికల్లో 11 శాతం ఓటువాటా పొందిన బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం (త్రిస్సూర్–సురేశ్ గోపి) గెలవడంతో పాటు 11 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 98 చోట్ల పోటీ చేస్తున్నా, 15 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపి, వనరులన్నీ కేంద్రీకృతపరచి ప్రచారం నిర్వహిస్తోంది. సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై లోగడ ఎప్పుడూ లేనంత అవినీతి ఆరోపణలు, తిరుగుబాట్లు, దన్నుగా ఉండే కులాలు, ఉపకులాల్లో చీలికలు ఎల్డీఎఫ్ నాయకత్వా నికి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ పంచాయతీ ఉంది. అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ కు జనాదరణ ఉంటే, పార్టీ అధిష్ఠానంలో ముఖ్యుడైన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేశ్ చెన్నితల రేపటి సీఎం పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుత, మాజీ ఎంపీలైన ప్రియాంక, రాహుల్ గాంధీ యూడీఎఫ్ ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నారు. వారి బాట లోనే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లి, ఎల్డీఎఫ్కు బీజేపీ దన్నుగా ఉందని చేస్తున్న విమర్శ వారికిక్కడ కమ్యూనిస్టులతో పొత్తుకేమీ ఇబ్బంది రాదా అన్నది ప్రశ్న!స్థిరీకరణ బాటలో...అధికారాన్ని సుస్థిరపరచుకునే అన్ని ఎత్తుగడల్నీ అసోమ్‌లో బీజేపీ అనుసరిస్తోంది. వరుసగా మూడోసారి అధికారం నిలుపుకొనే దిశగా సాగుతోంది. బీజేపీ ఏజీపీ, బీపీఎఫ్ తదితరులతో కూడిన ‘నార్త్ ఈస్ట్ డెమాక్రటిక్ అలయెన్ ్స’ (ఎన్ ఈడీఏ) ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్‌పోల్ సర్వే (2) ప్రకారం, ఈ కూటమికి 39 శాతం ఓటువాటా లభించనుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎఎస్ఎమ్’ 36.5 శాతం పొందే అవకాశాలున్నాయి. వ్యత్యాసం రెండున్నర శాతమే అయినా అధికార కూటమి పక్షాల మధ్య చక్కని సమన్వయం వల్ల సీట్ల సంఖ్య కాంగ్రెస్ మీద రెట్టింపు కన్నా ఎక్కువ బీజేపీకి సొంతంగానే లభించే సూచనలున్నాయి. కాంగ్రెస్ కూటమి ముస్లిం ఓటర్ల సానుకూలతపై ఆధారపడ నుంది. అందుకే, 2023 నియోజకవర్గాల పునర్విభజనలో ముస్లిం ఆధిపత్యమున్న నియోజకవర్గాల సంఖ్యను 29 నుంచి 21కి ప్రభుత్వం నియంత్రించింది. అసోమ్‌లోనే కాక ఈశాన్య భారతంలో బీజేపీని వృద్ధి చేస్తున్న ‘వ్యవహార దక్షుడి’గా పేరుబడ్డ సీఎం హిమంత బిశ్వశర్మ నేతృత్వం వహిస్తున్న తొలి ఎన్నికలివి. 2021 ఎన్నికల్లో పార్టీని నాటి సీఎం శర్బానంద సోనోవాల్ నడిపారు. ప్రభుత్వంపై అవినీతి, అక్రమ మైనింగ్‌కు ప్రోత్సాహం, డ్రగ్స్‌పై ఉదాసీనత వంటి ఆరోపణలున్నాయి. 40 లక్షల మంది మహిళల అకౌంట్లలోకి రూ.9 వేల చొప్పున, ఏకంగా 3,600 కోట్లను మార్చి 10న ముఖ్యమంత్రి బట్వాడా చేశారు. ‘అరుణోదయ్’ స్కీమ్ కింద మొత్తం రూ.17,000 కోట్లు మహిళలకు పంపిణీ చేసినట్టు ఆయనే చెప్పారు. విభజన రాజకీయాలనే కీలకం చేస్తూ, ‘వలసదారుల్ని వదిలించుకుందాం’ అని పిలుపునిచ్చారు. విపక్షాల సీఎం అభ్యర్థిగా ఉన్న గౌరవ్ గొగోయ్ మూడు పర్యాయాలు కాంగ్రెస్ సీఎంగా ఉన్న తరుణ్ గొగోయ్ తనయుడు. కాంగ్రెస్ నుంచి బిశ్వశర్మ నిష్క్రమణకు కారణమైన ఆయన ఒంటెత్తు ‘వైఖరి’లో ఇప్పటికీ మార్పు లేదు.రాష్ట్ర హోదా దక్కేనా?పూర్వపు ఫ్రెంచ్ కాలనీ అయిన పుదుచ్చేరి భౌగోళిక స్వరూపం మూడు ముక్కలుగా ఉంది. తమిళనాడు పక్కనున్న ప్రధాన భూభాగంతో పాటు కాకినాడ సమీపంలోని ‘యానాం’, కేరళ సమీ పంలోని ‘నెహం’ కలిసి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ నుంచే విడిపోయిన ఎన్.రంగస్వామి, ‘ఎన్.ఆర్. కాంగ్రెస్’ ఏర్పరచి, బీజేపీ పొత్తుతో ముఖ్యమంత్రయ్యారు. నిరాడంబరంగా ఉండే రంగస్వామి జనంలో కలిసిపోయి, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామనీ, అది ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమనీ ప్రచారం చేస్తున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న సభలో కనీసం 14 గెలిచినా మ్యాజిక్ నంబర్ (17)ను (గవ ర్నర్ నామినేటెడ్ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిపి) దాటుతారు కనుక ప్రభుత్వం వారిదే! విపక్ష ‘ఇండియా గుంపు’లో ఆఖరు నిమిషం వరకు సీట్ల పంపకాల్లో స్పర్థలున్నాయి. డీఎంకే బలమైన పక్షం (6 ఎమ్మెల్యేలు) అయినా 14 చోట్ల పోటీ చేస్తుంటే, ఇద్దరే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 16 చోట్ల పోటీ చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానంకైవసం చేసుకున్న కాంగ్రెస్, అప్పుడు మెజారిటీ (28/30) స్థానాల్లో తమకు ఆధిక్యం దక్కిందనే వాదనతో పొత్తుల్లో ఎక్కువ స్థానాలు పొందింది. నియోజకవర్గానికి 30–35 వేల ఓట్లే కావడంతో చిన్న రాజకీయ పరిణామం కూడా స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో గెలుపోట ముల్ని ప్రభావితం చేయొచ్చు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా?
ఒకపక్క దేశంలో వేలాది మంది ఎల్పీజీ సిలిండర్ల కోసం బారులు తీరి నిలబడితే మరోపక్క ప్రభుత్వం నుంచి ఒక విచిత్ర ప్రకటన వెలువడింది. వాతావరణ మార్పును అరికట్టేందుకు ఉద్గారాలను మరింతగా తగ్గించుకుంటామని ప్రకటించింది. శిలాజేతర ఇంధన వనరుల వైపు మళ్ళే విషయంలో నిర్దేశించుకుంటున్న లక్ష్యాలను పెంపొందించుకోవడం వినడా నికి చెవులకింపుగానే ఉంటుంది. కానీ, వంట చేసుకునేందుకు, స్కూటర్లకు, కార్లకు అవసరమైన ఇంధనం నిమిత్తం జనం అవస్థలు పడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడటమే చోద్యం. వాతావరణ మార్పును నిరోధించే ఐక్యరాజ్య సమితి ఒడంబడిక కింద దేశాలు ప్రకటించవలసి ఉన్న లక్ష్యాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. సందర్భమే వింత గొలిపేదిగా ఉంది. ఎందుకీ హెచ్చుతగ్గులు?శిలాజేతర ఇంధన వనరుల వాటాను (2031 నుంచి 2035 మధ్య కాలంలో) 60 శాతానికి పెంచుకుంటామని ప్రభుత్వం మాటి చ్చింది. వాటిని జాతీయ దృఢసంకల్ప వాగ్దానా (ఎన్డీసీ)లుగా పిలుస్తున్నారు. దానికి మార్చి 25న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 2035 నాటికి ఉండే విద్యుదుత్పాదన సామర్థ్యంలో 60 శాతం వాటా శిలాజేతర ఇంధన వనరుల ద్వారా సమ కూరుతుందని అర్థం. మన దేశం 2026 ఫిబ్రవరి నాటికే శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 52.57% మేరకు సాధించినట్లు ప్రభుత్వం చెప్పుకొంది. ప్రకటించిన తేదీల కన్నా ముందే తమ వాగ్దానాలను నిలబెట్టుకున్నామని కూడా గొప్పగా చాటుకుంది. వాస్తవంలో అటు వంటి విద్యుదుత్పాదన సామర్థ్యం 22% మాత్రమే.దేశంలో 2026 ఫిబ్రవరి నాటికి నెలసరి విద్యుదుత్పాదన సామర్థ్యంలో పునరుత్పాదక (భారీ జలవిద్యుచ్ఛక్తి, సౌర శక్తి) ఇంధన వనరుల వాటా 22.73% మాత్రమేనని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పేర్కొంది. మొత్తం మీద (2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్ర వరి మధ్య కాలానికి) సంఖ్యలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆ కాలంలోని మొత్తం విద్యుదుత్పాదనలో తాప(థర్మల్) విద్యుత్ వాటా 70.40% కాగా, పునరుత్పాదక ఇంధన వనరులది 26.16%. వాతావరణ పరిస్థితులు, వేసవి, శీతాకాలం, వర్షాకాలం వంటి అంశాల వల్ల విద్యుదుత్పాదనలో హెచ్చుతగ్గులను అర్థం చేసు కోవచ్చు. కానీ, ఇంతటి భారీ వ్యత్యాసానికి (30%) ఆ అంశాలు మాత్రమే కారణ మని అనుకోలేం. సప్లై చెయిన్లు చైనా చేతిలో...అంతర్జాతీయ ఒడంబడిక మేరకు ఐక్యరాజ్య సమితికి నివేదిస్తున్నవి కనుక ఈ సంఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఈ సంఖ్యలను ఉటంకిస్తూ ఇంధన పరిణామ క్రమంలో తాను గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్నట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో భారత్ ఘనతను చాటుకుంటోంది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్ళడం, బ్యాటరీలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు భౌగోళిక రాజకీయాలు, శిలాజ ఇంధనాల సరఫరాలకు దిగుమతులపై ఆధారపడటం వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. పవన, సౌర విద్యుదుత్పాదన కూడా ఒక రకంగా కీలక సామగ్రి, సబ్–సిస్టంలు, ఎక్విప్మెంట్ దిగుమతులపై ఆధారపడి ఉంది. తిరిగి ఈ దిగుమతు లలో చాలా భాగం గ్లోబల్ సప్లై చెయిన్లతో ముడిపడి ఉన్నాయి. వాటిలో చాలా భాగం చైనా అధీనంలో ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల పరికరాల తయారీకి రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం. అవి చైనా చేతిలో ఉన్నాయి. బ్యాటరీలు, విండ్ టర్బైన్లు వంటి రేర్ ఎర్త్ ఇన్పుట్స్ హెచ్చుగా ఉన్న సబ్–సిస్టంల దిగుమతికి మనం ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతున్నాం. కాలుష్య రహిత శక్తి వినియోగంలో చాలా వాటికి లిథియం బ్యాట రీలు కావాలి. వాటిలో శక్తిని నిల్వ చేయడం కుదురుతుంది. తెలుపు రంగులో ఉండే ఈ క్షార లోహానికీ చైనాయే ప్రధాన సరఫరాదారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఫొటో–వోల్టాయిక్ వ్యాఫర్ ఉత్ప త్తిలో 2023 నాటికే 98% చైనా గుప్పెట్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విండ్ టర్బైన్ల తయారీలో 70% చైనాయే చేజిక్కించుకున్నట్లు చెబు తున్నారు. హరిత హైడ్రోజన్ ఉత్పాదనలో, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో చైనా 2024 నాటికే ఏకైక పెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిందని యూరోపియన్ యూనియన్ ఇన్స్టిట్యూట్ ఇటీవల జరిపిన అధ్య యనంలో వెల్లడైంది. కీలక వస్తువుల ఎగుమతులు, టెక్నాలజీ బదిలీపై చైనా ఆంక్షలు విధించింది. మిగిలిన దేశాలు పారిశ్రామికంగా తనపై ఆధారపడ టాన్ని చైనా ఒక ఆయుధంగా మలుచుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళడం కూడా భౌగోళిక రాజకీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని తేలుతోంది. పరికరాల విషయంలో చైనాపై ఆధారపడటం వల్ల మరో బెడద ఉంది. దాని నుంచి గ్రిడ్లు దిగుమతి చేసుకుంటే, వాటిలో అది నిక్షిప్తం చేసిన కంట్రోళ్ళ వల్ల అవాంత రాలు ఏర్పడవచ్చు. భద్రతాపరంగా అది ముప్పే! సోలార్ ఇన్స్టలే షన్లతో బ్యాక్–డోర్ కమ్యూనికేషన్‌కు ఉద్దేశించిన ఇన్వెర్టర్లను చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. వాటిలో తమకు అంతు బట్టని మరికొన్ని భాగాలు ఉన్నట్లు అమెరికా గతేడాది గుర్తించింది. ప్రత్యామ్నాయమే శరణ్యంపశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభానికి గురి చేసింది. ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలో, సరఫరాలో ఇంతటి విఘాతం ఎన్నడూ ఏర్పడలేదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ చెబుతోంది. ఎంతమాత్రం వీలున్నా సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని కోరాలని చెప్పింది. హైవేలలో వేగాన్ని గంటకు కనీసం 10 కిలోమీటర్ల మేరకైనా తగ్గించాలని చెప్పింది. ప్రైవేటు కార్ల బదులు బస్సులు, రైళ్ళ వాడకానికి మారాలని సూచించింది. వాహనాలు కూడా అన్నీ రోజూ రోడ్డుపైకి రాకుండా సరి, బేసి సంఖ్యల పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పింది. ఎల్పీజీ వంటింటికి ఎక్కువ అవసరం కనుక, దాన్ని ఉపయోగించే వాహనాలు పెట్రో లుకు మారాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు ఉన్నపుడు విమాన ప్రయాణాల జోలికి వెళ్ళవద్దంది. చాలా దేశాలు తమ పరిస్థితులను బట్టి వాటిలో కొన్నింటిని అమలులోకి తెస్తు న్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సంప్రదాయ, పునరుత్పా దక ఇంధన వనరుల పరిశోధన–అభివృద్ధిపై గణనీయమైన పెట్టు బడులు పెట్టక తప్పదు. ఇంధన రంగానికి అంకితమైన పరిశోధన కేంద్రాలు మన దేశంలోనూ చాలా ఉన్నాయి. కానీ, అవి పారిశ్రామిక స్థాయిలో ఆలోచించకుండా వేటికవి విడివిడిగా పనిచేస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనం వైపు ఏనాడో మళ్ళిన దేశాలలో భారత్ కూడా ఉంది. సోలార్ కుక్కర్లు, హీటర్లు, బయోమాస్, బయోగ్యాస్, చివరకు బ్యాట రీలతో నడిచే బస్సుల వాడకంలో కూడా చొరవ చూపిన దేశాల్లో మనమూ ఉన్నాం. 1973లో ఎదుర్కొన్న చమురు సంక్షోభంతోనే ఆ దిశగా ఆలోచించాం. భౌగోళిక రాజకీయ వాస్తవికతల నేపథ్యంలో ఇంధన భద్రత ప్రణాళికా పటాన్ని తిరిగి రూపొందించుకోవాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
జి.సుధాకరన్ (79) సీపీఎం రాయని డైరీ
సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా లేడు. ఉదయించటానికి సంశయిస్తున్నట్లుగా ఉన్నాడు! తూర్పున, ‘అరుణ’వర్ణంలో ఏదో మార్పు! దేనికది సంకేతం?! మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి యుగాంతం సంభవించబోతోందా?! కేరళలో యుగాంతమే అయితే, ఈసారి అది ఒక్క కేరళలోనే కాదు, మొత్తం దేశంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వాలకు యుగాంతం అయినట్లు! యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1976లో ఇలా జరిగింది. ఆ ఏడాది దేశంలో ఎక్కడా కమ్యూనిస్టు సూర్యుడే ఉదయించలేదు. ఆనాటి చీకట్లే మళ్లీ 2026లో దేశాన్ని కమ్ముకో బోతున్నాయా? ఈ ఎన్నికల్లో కేరళ కమ్యూనిస్టులు గెలవలేకపోతే జరిగేది అదే!బాల్కనీ లోంచి తిరిగి నా గదిలోకి వచ్చాను. బయటి వెలుతురు కన్నా, లోపలి టేబుల్ లైట్ ఎక్కువ కాంతిమంతంగా ఉంది. టేబుల్ డెస్క్లోంచి అంబలప్పుళ నియోజకవర్గ ప్రజా సమస్యల ఫైల్‌ను బయటికి తీశాను. అంబలప్పుళ ఐదేళ్లుగా నా నియోజక వర్గం కాదు. అంబలప్పుళ ప్రజలు మాత్రం ఎప్పటికీ నావాళ్లే! 2021 వరకు వరుసగా మూడు టెర్మ్‌లు వాళ్లు నన్ను ఎన్నుకుంటూ వచ్చారు. తర్వాత ‘టూ–టెర్మ్ రూల్’ వచ్చింది. రూల్ ప్రకారం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయటానికి లేదు! పార్టీ నియమాలు పార్టీ నాయకులను పొలిమేర దాటకుండా చేయగలవుగానీ, నియోజకవర్గ ప్రజల్ని తమనాయకుడి వైపు పూలదండను విసరకుండా ఆపగలవా?!‘‘కామ్రేడ్! మీరు మళ్లీ రావాలి’’ అని గత ఐదేళ్లుగా నన్ను అడుగుతూనే ఉన్నారు అంబలప్పుళ ప్రజలు. వాళ్ల కోసం, కేవలం వాళ్ల కోసమే ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నేను పోటీ చేయవలసి వస్తోంది. ఆరు దశాబ్దాలకు పైగా ఏ జెండా నీడలోనైతే నడిచానో, ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఉన్నానో... ఈ రోజు అదే జెండాకు దూరంగా, ఒక ‘స్వతంత్ర’ గొంతుకతో నిలబడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఈ ఎన్నికల్లో నేను ఒంటరిని. ప్రజలు వెంట ఉండి, పోటీ చేయిస్తున్న అభ్యర్థిని. గోడలపై ఇప్పుడు నా పేరు పక్కన ‘కొడవలి–సుత్తి’ గుర్తు లేకపోవచ్చు. కానీ నా గుండెల్లో అవి ఎప్పటికీ చెరిగిపోవు. నేను కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాననీ, పదవుల కోసం ఆశ పడుతున్నాననీ నా సొంత పార్టీ వాళ్లే నన్ను విమర్శిస్తున్నప్పుడు, ఆ విమర్శలు వింటూ సీఎం విజయన్ మౌనంగా ఉన్నారు! అంటే, ఆయన అనదలచుకున్నవే వారు అంటున్నారనా? ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట క్షణమైనా ఉండటం కమ్యూనిస్టు యోధుడి లక్షణం కాదు. వెంటనే పార్టీ నుండి బయటికి వచ్చేశాను. నేను కమ్యూనిస్టు పార్టీని వీడి రావచ్చు. కమ్యూనిజం నుంచి ఎప్పటికీ విడిపోను. సీఎం విజయన్ 1970లలో వరుసగా రెండుసార్లు, ’90లలో వరుసగా రెండుసార్లు, 2016 నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ‘టు–టైమ్ రూల్’ ఆయనకు వర్తించదా?!ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనిప్పుడు పోటీ చేస్తున్నానంటే కారణం... అసమ్మతి కాదు, పార్టీ రూల్‌లోని అసమానతపై నిరసన. కేరళకు ఎంత గొప్ప చరిత్ర ఉంది! ప్రపంచంలో, ప్రజలు ఎన్నుకున్న తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళదే! తిరిగి కేరళతోనే ఇండియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు తుది దశకు చేరుకుంటాయా?! బెంగాల్, త్రిపుర, ఇక ఇప్పుడు కేరళ?! రాజకీయాల్లో మార్పు తేవటం అంటే, ప్రజల జీవితాల్లో మార్పు రావటం అనే సంగతిని విజయన్ విస్మరించినట్లున్నారు! కమ్యూనిస్టులు ఓడిపోవటానికి బయటి కారణాలు ఉండవు. బయటికి రాని కారణాలే ఉంటాయి. -
ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ
మన దేశంలోని గ్రామీణ, అటవీ ప్రాంత బాలలు ప్రకృతి ఒడిలో ఎక్కువ సమయం గడపడం నేను గమనించాను. వాళ్లంతా రకరకాలుగా ఆడుకునే ప్రయత్నం చేస్తారు. నేలపై గీతలు గీయడం, కొన్ని ఆకారాలతో ఆట స్థలాలను సృష్టించడం, ఎండిన పండ్ల గింజలను పాచికలుగా – పావులుగా వాడటం వంటివి చేస్తుంటారు. ఎండిన ఆకులు, చింకిపాత లతో బంతులు చేస్తారు. వెదురు బొంగులతో హాకీ, ఫుట్‌బాల్ గోల్‌పోస్టులను తయారు చేస్తారు. చాలామంది బూట్లు లేదా జెర్సీలతో నిమిత్తం లేకుండా ఉత్సాహంగా ఆటపాటల్లో మునిగిపోతారు. చెరువులు, సరస్సులలో ఈదులాడుతూ ఆనందిస్తారు. ఒడిషాలోని జాజ్‌పూర్ వాస్తవ్యురా లైన 15 ఏళ్ల అంజలి ముండా ఇదే తరహాలో తనకు అందుబాటులో గల వనరులు, శిక్షణతో ఈతలో తన ప్రతిభకు సానబెట్టుకుని, ‘ఖేలో ఇండియా తొలి గిరిజన క్రీడలు–2026’లో తొలిరోజునే 3 స్వర్ణ పత కాలను కైవసం చేసుకుని యువతలో ఎనలేని స్ఫూర్తి నింపింది.ఏకలవ్యుడి వారసత్వంగిరిజనులకు విలువిద్యపై సహజంగా మక్కువ. సంథాల్ సమాజం తమపై దోపిడీని ఎదిరిస్తూ 1855లో బ్రిటిష్ పాలకులపై సాగించిన భీకర పోరాటం ‘సంథాల్ హూల్’ (తిరుగుబాటు)గా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. బ్రిటిష్ దళాలు ఆధునిక ఆయుధాలతో ఆ తిరుగుబాటును అణచివేసినప్పటికీ, సంథాల్ యోధుల యుద్ధ నైపుణ్యాన్ని ప్రత్యేకంగా గ్రంథస్థం చేశారు. నేను జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అక్కడి ‘ఊరి –మారి’ గ్రామంలోగల ‘సంథాల్ హూల్’ వీరులు, అమర సోదరు లైన సిధో–కన్హు, చండ్–భైరవ్ సహా శౌర్యశీలురైన సోదరీమణులు ఫూలో–ఝానోల విగ్రహావిష్కరణ భాగ్యం నాకు దక్కింది. అసమాన విలుకాడిగా పూజలందుకునే ఏకలవ్యుని ఖ్యాతిఎంతటిదో భారతదేశంలోని ఏ బిడ్డను అడిగినా గొప్పగా వర్ణిస్తాడు. ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా గిరిజనులకు ఏకలవ్యుడు స్ఫూర్తి ప్రదాత మాత్రమేగాక విలువిద్యలో ఆదర్శప్రాయుడు. ఆయన వార సత్వానికి అనుగుణంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లోని ‘క్రీడా నైపుణ్య కేంద్రాలు’ బాలలకు ఆధునిక క్రీడా సౌకర్యాలు, విధా నాలను చేరువ చేస్తున్నాయి. నా వంతు కృషి ఫలితంగా మా స్వగ్రామంలోనూ నిరుపేద బాలల కోసం ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటైంది. మరికొంత ప్రయ త్నంతో ఆ పాఠశాల ప్రాంగణంలో విలువిద్యా శిక్షణకూ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు చిన్నచిన్న వ్యక్తిగత, సమష్టి ప్రయత్నాల ద్వారా గిరిజన బాలల్లో సహజ క్రీడా ప్రతిభ ఇనుమ డిస్తుందనడంలో సందేహం లేదు.క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధమా గ్రామంలోని ఇతర గిరిజన బాలల తరహాలోనే నేను కూడా చిన్నతనంలో ఈత కొట్టడం సహా ఇతర కసరత్తులు, క్రీడలపై ఆసక్తి చూపేదాన్ని. మా పాఠశాల క్రీడా పోటీలలో తరచూ ప్రథమ స్థానంలో నిలవడం నాకు పరిపాటి. అలాంటి ఓ పోటీ సందర్భంగా నా నేస్తానికి ప్రథమ బహుమతి ఆనందానుభూతినిచ్చే ఉద్దేశంతో నేను కావాలనే వెనుకబడటం ఓ మధుర జ్ఞాపకం. క్రీడలు బాలల్లో జట్టు స్ఫూర్తిని పెంచి, బలమైన సామాజిక స్నేహానుబంధాలకు తోడ్పడతాయి. మైదానంలో తీవ్రంగా పోటీపడే క్రీడాకారుల నడుమ సాధారణంగా స్నేహబంధం పటిష్ఠంగా ఉంటుందన్నది వాస్తవం.మా సోదరుడు ఫుట్‌బాల్ చక్కగా ఆడేవాడు కానీ తీవ్ర గాయంతో ఆటలో కొనసాగలేకపోయాడు. మా కుటుంబ సభ్యు లందరూ వివిధ క్రీడలలో రాణించినవారే. గిరిజన కుటుంబాలకు ఉజ్వల క్రీడా సంప్రదాయం సహజాతమని చెప్పడానికే నా వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నాను. వారి జీవితాల్లో క్రీడలు ఒక వినోదంగా, సామాజిక కార్యకలాపాల సాధనంగా మాత్రమే మిగిలి పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2018లో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కొన్ని క్రీడా సంస్థల సహకారంతో శ్రీకారం చుట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం నలు దిశలా నిబిడీకృతమైన ప్రతిభను విశేషంగా వెలుగులోకి తెస్తోంది.మన దేశంలో కొన్నేళ్ల కిందటి దాకా కేవలం పెద్ద నగరాల్లోనే ఉత్తమ క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉండేవి. గిరిజన ప్రాంతాల్లో క్రీడల అకాడమీలు, శిక్షణ సౌకర్యాలు లభ్యమయ్యేవి కావు. కానీ, ఇవాళ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో బాలలకు క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపటం నుంచి ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ వంటి అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.ఖేలో ఇండియా!నా విద్యార్థి దశలో– అయిదారు గ్రామాల క్రీడా ఔత్సాహికులు ఏకమై, గ్రామీణులను సమీకరించి పోటీలు నిర్వహించడం నాకింకా గుర్తుంది. అలాగే, కొన్ని ఆధ్యాత్మిక–సాంస్కృతిక సంస్థలు కూడా గిరిజన ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ, అలాంటి పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు గ్రామీణ స్థాయిని దాటి ఎదగలేకపోయేవారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా కొన్నేళ్ల నుంచీ ప్రశంసనీయ కృషి సాగుతోంది. ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ అలాంటి చర్యలకు మరింత ఉత్తేజమిచ్చాయి. భారత్ తన క్రీడాకారుల సహజ ప్రతిభ వల్లనే 1928 ఒలింపిక్ క్రీడల్లో తొలి హాకీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆనాటి ఘన విజయంలో కీలక పాత్రధారులు గిరిజన క్రీడాకారులే. అప్పటి నుంచీ దిలీప్ టిర్కీ, సుబోధ్ లక్రా, సలీమా టెటే వంటి క్రీడాకారులు భారత కీర్తికిరీటంలో మణిమాణిక్యాలై హాకీ క్రీడకే వన్నెతెచ్చారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం ‘ఖేలో ఇండియా’ కింద స్థానికం నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని భౌగోళిక ప్రాంతాలు, సామాజిక వర్గాలు, సంస్థలకు తగిన క్రీడావరణం కల్పించేందుకు కృషి కొనసాగుతోంది. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ‘అస్మిత’ పథకం అమలవుతోంది. దీనిద్వారా మన గిరి పుత్రికల సామర్థ్యం ఇనుమడించడమే కాకుండా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్–2026’ ఇచ్చిన ఉత్తేజాన్ని నిరంతరం బలోపేతం చేయాలి. తదనుగుణంగా గిరిజన క్రీడాకారులను స్థిరంగా ప్రోత్సహిస్తే మన దేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలబెట్టగల క్రీడాకారుల సమూహం రూపొందుతుంది.‘బస్తర్, సుర్గుజా ఒలింపిక్స్’లో ఏడు లక్షల మందికిపైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నక్సలిజాన్ని వీడి, క్రీడలనే సానుకూల మార్గంగా ఎంచుకున్న యువతరం కూడా వారిలో ఉన్నారు. గిరిజన వర్గాలు సహా మన యువతరం క్రీడాప్రతిభ, దేశానికి అమూల్య సామాజిక మూలధనం. ఈ వెలలేని వనరును సద్వినియోగం చేసుకోవడం ద్వారా జాతీయ క్రీడా రంగం ఎన్నో అద్భుత ప్రమాణాలను నెల కొల్పగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ‘ఖేలో ఇండియా! ఖూబ్ ఖేలోఇండియా!’ అంటూ నా వంతుగా నినదిస్తున్నాను.ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి(మార్చి 25న ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలి ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ నేటితో ముగియనున్నాయి.) -
వీళ్ళు బయట మనల్ని ఎలా చూపుతున్నారు?
తెలుగు ప్రజలు రెండుగా విడిపోయి పదేళ్ళు అయింది. ఈ అనుభవం తర్వాత కూడా ఇంకా మనగురించి మనం చెప్పు కునేప్పుడు; ‘నేను’ అనాలా, లేక ‘మేము’ అనాలా అనే మీమాంస అలాగే ఉంది. ఇది ‘జీఐ’ (జియోగ్రాఫికల్ ఐడెంటిటీ) అనే మన భౌగోళిక గుర్తింపు దృష్టి నుంచి అంటున్న మాట. సీఎం అంటేనే ‘ప్రభుత్వం’ అయినప్పుడు, రాష్ట్ర ‘ప్రజలు’, ‘ప్రాంతము’– ఈ రెండింటికి ఆయన ప్రతినిధి. అటువంటిది, ఏపీ గురించి ముఖ్యమంత్రి బయట మాట్లాడేటప్పుడు, ఆయన రాష్ట్ర ప్రజలైన మనల్ని కూడా కలుపుకుని ‘మన’ అంటున్నారా, లేక తనమట్టుకు మాత్రమే పరిమితం చేసుకుని ‘నేను’ అంటున్నారా? ఇటీవల పార్లమెంట్లో జరిగింది చూసినప్పుడు, ఈ అంశం చర్చించకుండా ఉండలేకపోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ చారిత్రక వైభవాన్ని పరిరక్షించి మన ‘హెరిటేజ్’ని కొత్త తరాలకు చేర్చే ‘ఆర్కియాలజీ’ శాఖ పనితీరు గురించి, దానికి నిధుల కేటాయింపు గురించి చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు (కూటమి) ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. ‘అందుకు కారణం కేంద్రం వద్ద నిధులు లేకపోవడం కాదు, మీ రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి రానందున, మీ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు’ అని మంత్రి అన్నారు. తరుచూ ‘టూరిజం’ చుట్టూ పెరిగే వృద్ధి గురించి, దాని విస్తరణ గురించి మాట్లాడే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇటువంటి లోపానికి కారణం ఏమిటి అని చూస్తే, మళ్ళీ అది మరొక ‘అకడమిక్’ అంశం అవుతున్నది. సామాజిక శాస్త్రాలకు తల్లి వంటి చరిత్ర కనుక ఈ ప్రభుత్వానికి గుర్తు ఉండివుంటే, పురావస్తు శాస్త్రం (ఆర్కియాలజీ) దానితో జంటగా కలిసే ఉంటుంది కనుక, అది కూడా వారికి గుర్తు ఉండి ఉండేది. మూడు దశాబ్దాల క్రితం సామాజిక శాస్త్రాల చదువులు అక్కరలేదు అనే వైఖరి ఈ ప్రభుత్వం తీసుకుంది కనుక; ఇక ఇప్పుడు వారికి ‘టూరిజం’ అంటే హోటళ్లు, కాటేజీలు, ‘ఫుడ్’, వినోదం, విలాసం మాత్రమే ‘టూరిజం’ అవుతుంది. అందుకే గడచిన పదేళ్ళలో ఇంకా దొరకాల్సిన చరిత్ర కోసం ఇక్కడ వెతకాలని, అందుకు ‘ఆర్కియాలజీ’ కార్యకలాపాలు అవసరం అని ఈ ప్రభుత్వం అనుకోలేదు. ఢిల్లీలో మార్చి 5–7 మధ్య ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ జరిపిన పదకొండవ ‘రైసీనా డైలాగ్– 26’ సదస్సులో మన తీరు కూడా అటువంటిదే. పైగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ దీనికి స్పాన్సర్ కూడా. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సదస్సుకు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు. బీజేపీ తన ముద్రకోసం దాన్ని – ‘సంస్కార’ అనే బ్యానర్ కింద జరిపినా ‘ధ్రువీకరణ, వసతి, పురోగతి’ అనే మూడు అంశాల దృష్టితో ఇది జరిగింది. కానీ కొత్త రాష్ట్రానికి ప్రతినిధిగా మాట్లాడిన ఏపీ సీఎం బాబు వెయ్యి కిలోమీటర్ల తీరం ఉన్న ఈ రాష్ట్రం ఉనికిని ఇతరులకు అదొక భౌగోళిక అవకాశంగా ఆ వేదికపై చూపలేదు. దీని పర్యాటక ప్రాధాన్యం గురించి అక్కడ చెప్పకుండా పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాన్ని చేజేతులా వదిలివేశారు. ఆ వేదికమీద నుంచి ‘ప్రపంచం అంతా ఇండియన్స్ ఉన్నారు, సిలికాన్ వ్యాలీ, అమరావతి ‘టెక్నాలజీ హబ్’, ‘ఏఐ’, ‘డేటా సెంటర్’, ‘క్వాంటమ్ వ్యాలీ’, ‘వరల్డ్ క్లాస్ ఎకో సిస్టం’ అంటూ చెప్పాక, చివరికి ఈ మధ్య మన జిల్లాల్లో ఎక్కువ పిల్లల్ని కనండి అని చెబుతున్నట్టుగా, అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు 25 వేలు ఇస్తాము అని చెప్పేశారు. పైగా దీన్ని– ఫైవ్ పిల్లర్ మోడల్’ అని వెల్లడించారు. అంటే– అమ్మా నాన్న, ముగ్గురు పిల్లలు కలిసి ‘ఐదు స్తంభాలు నమూనా’ అని. పైగా ఇది ‘పాపులేషన్ కేర్’ కార్యక్రమం అని కూడా అన్నారు. అయితే, ఇందులో ఎక్కడ ‘మనం’ ఉన్నామో వెతకడం ఎలా?జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఆనందం ఉన్నచోటనే ఐశ్వర్యం
అభిరుచికి తగ్గ రంగాన్ని ఎంచుకోండని చెప్పిన మాటలను విని విని మీరు ఎంతగా విసిగిపోయి ఉంటారో నేను ఊహించగలను. నేనైతే మక్కువ లేదు గిక్కువ లేదు అనే అంటాను. మీరు చేయగలిగిన ఏదైనా గొప్ప పనిని చేపట్టవలసిందని చెబుతాను. అటువంటి దాన్ని ప్రయత్నించి విఫలమైనా ఫరవాలేదు. స్వతహాగా దేనిమీద మక్కువ ఉందో కనిపెట్టి దాన్ని చేప్టటా లనే ఆలోచనను వదిలేయండి. నాకు బాగా అభిరుచి కలిగిన ఉద్యోగ మంటూ చొక్కాలు చించుకోవద్దు. ఏ ఉద్యోగంలో చేరినా ఆ ఉద్యో గానికి మీ శక్తియుక్తుల మేరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించండి. ఆ పనిని ఇష్టపూర్వకంగా చేసేందుకు సుముఖులు కండి. భావావేశంతో అతిగా శ్రమించి ఆయాసపడనక్కర లేదు. అది మీ తోటి ఉద్యోగులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఆడుతూ పాడుతూ చేస్తే చాలు. చెమటలు కక్కనవసరం లేదు. మూడు కీలక సూత్రాలుజీవితంలో నేను అనుసరించిన మూడు కీలక సూత్రాలను చెబుతాను. ఒకటి– శక్తి సామర్థ్యాలన్నీ వినియోగించండి. రెండు– దృష్టి పెట్టండి. మూడు– ప్రేమలో పడండి. మీరు ఏ పని చేపట్టినా సరే– అది మీ ఉద్యోగం, కాలక్షేపం, లేదా సాంగత్యం ఏదైనా కావచ్చు. అది ఏ రకమైనదో అనవసరం. కానీ, చేసే పనిలో ప్రయత్న లోపం ఉండకూడదు. కృషి ఫలించి తీరుతుంది. అది సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ ఫలితం మనం ఆశించి నట్లుగా రాకపోయినా, ప్రయత్న లోపం లేదనే తృప్తి మనకు మిగులుతుంది. ఇది జీవన సూత్రం. జీవితంలో చాలా విషయాల్లో ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు. సముద్ర గర్భంలోకి తీసు కెళ్ళే వస్తువులో కూర్చున్నారనుకోండి. మునిగిపోయిన టైటానిక్ ఓడ దగ్గరకు వెళుతున్నారు. కెప్టెన్ చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. సముద్ర గర్భం నుంచి ఆ నౌకను తిరిగి రేవుకు చేర్చడం కుదిరే పని కాదని మీకే అర్థమవుతుంది. చేపలకది సహజ నివాస ప్రాంతం కనుక, మనకన్నా తేలికగా అవి అక్కడ సంచరించగలుగుతాయి. అది వాటి సహజ సామర్థ్యం అనుకుని వదిలేయాలి. మనం ఏదో చేయలేకపోతున్నామని మనో వేదనకు గురికాకూడదు.అలాగే, మనుషులతో ప్రేమలో పడటం తేలిక. కానీ, ఇది అది అని కాకుండా అన్నింటితోను ప్రేమలో పడండని చెబుతాను. మీకు ఏది లభిస్తే దానిపైనే మక్కువ పెంచుకోండి. అది మీరు తాగే కాఫీ, వేసుకునే స్నీకర్స్ లేదా కారు నిలిపే పార్కింగ్ ప్లేస్ ఏదైనా కావచ్చు. లభించిన దానిపై ఇష్టం పెంచుకోవాలి. చిన్న చిన్న వాటిని చూసి కూడా ఆనందించడం నేర్చుకోవాలి. జీవితంలో పెద్ద పెద్ద సమస్య లను పక్కనపెట్టి, అందుబాటులో ఉన్న చిన్నవాటిపైనే దృష్టి పెడుతూ జీవితాన్ని ఆనందంగా గడిపాను. మీకు ఏది మంచిదని పిస్తోందో దాన్ని కనుగొనండి. దానిలో కొన్ని చెడ్డవి ఉంటే వాటిని పట్టించుకోవద్దు. ఏది సౌకర్యకరంగా ఉంటుందో, ఒత్తిడిని ఎంత వరకు భరించగలరో చూసుకోండి. జీవితంలో విజయానికి ఇది బంగారు బాట. పని, వ్యాయామం, సాంగత్యాలు హింసకు గురి చేస్తాయి. కానీ, అవి నూరు శాతం కాదు, వెయ్యి శాతం అందుకు అర్హమైనవే. కనుక, కష్టపడటంలో తప్పు లేదు. శ్రమలోనే సౌందర్యంపనికన్నా అద్భుతమైనది మరొకటి లేదు. చేస్తున్న పనిలో మమేకం అయ్యే వారి గురించి వినే ఉంటారు. వారు అలా ఎక్కువ సమయాన్ని ఆఫీసుకు ఎలా వెచ్చించగలుగుతారో తెలుసునా? అది చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. అంకిత భావంతో పనిచేయ లేనప్పుడు ఆ ఉద్యోగాన్ని పట్టుకుని వేలాడటం కన్నా దాన్ని వదిలే యడమే మంచిది. లేకపోతే అది స్వయం కృతాపరాధం అవుతుంది. పనిని నిందించవద్దు. ఏ పనైనా అద్భుతమైనదే. నేను అంత కష్టపడి ఉండాల్సింది కాదు, తక్కువ పని చేసినా సరిపోయేది అనే సందర్భం జీవితంలో ఎన్నడూ రాకూడదు. అలా అనిపించే పక్షంలో అసలు ఆ పనిలో కొనసాగకపోవడమే మంచిది. ఏడీ, ఏమై పోయాడు అని ఎవరైనా అడిగితే, తినడానికి ఏదో తెచ్చుకుంటానని వెళ్ళాడు అని ఎవరో ఒకరు జవాబిస్తారు. వద్దు అనుకున్నాక మళ్ళీ ఆ గడప తొక్కకూడదు.హాస్య చతురతను కోల్పోవద్దు!జీవితంలో హాస్య స్ఫూర్తి చాలా అవసరం. అది జీవితంలో కష్టమైన దశల్లో కూడా ఊరట కల్పిస్తుంది. ఇవాళ దాని గురించే ప్రధానంగా చెప్పాలనుకున్నాను. ఇక్కడున్న వారిలో రెండు తరా లకు చెప్పదగిన విశ్వాసం, అనుభవం నాకున్నాయి. నేను 70వ పడిలో పడ్డాను. జీవితంలో ఇప్పుడిప్పుడే మీరు అడుగులేయడం ప్రారంభిస్తున్నారు కనుక ఈ విషయంలో మీకు నేను సహాయపడ దలచుకున్నాను. ఒక్కోసారి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే హాస్య మైనా ఫరవాలేదు. దాన్నేదో చక్కదిద్దడానికి మనం ప్రయత్నించ నవసరం లేదు. అది మరీ హద్దులు దాటేదిగా ఉండకూడదంతే. మరింత న్యాయబద్ధమైన, సమ్మిళిత సమాజ నిర్మాణానికి మీరు కంటున్న కలలను నేను పూర్తిగా అభినందిస్తున్నాను. ఎదుటి వారి మనసు నొచ్చుకోకుండా ఉండేందుకు మీరు చూపుతున్న జాగరూకత కూడా అద్భుతమైనదే. శతవిధాలా అందుకు ప్రయ త్నించవలసిందే. కానీ, ఒక కమెడియన్‌గా నేను మీకొక సంగతి చెప్పదలచుకున్నాను. హాస్య చతురతను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. హాస్యాన్ని హాస్యంగా స్వీకరించడం అలవరచుకోవాలి. జీవితంలో మున్ముందు దశల్లో ఒడుదుడుకులను తట్టుకుని ముందుకు సాగేందుకు అది ఎంతగా సహాయపడుతుందో, జీవితంలో ప్రస్తుత దశలో మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. హాస్య స్పూర్తి లేకుండా జీవితంలో బతికి బట్టకట్టడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో మనసు చివుక్కుమనిపించినా, తట్టుకుని, చతురోక్తి విని ఆనందించగలగాలి. జీవిత చరమాంకంలో, అరే, మనం జీవి తంలో హాస్యాన్ని అంతగా అనుభవించలేకపోయామే అనే పరిస్థితి రాకూడదు. మానవ అనుభవాలనే ప్రవాహంలో ముందుకు సాగేందుకు హాస్యం శక్తిమంతమైన నావలా పనిచేస్తుంది. మానవులంద రికీ ఉండి తీరవలసిన లక్షణం హాస్య చతరుత. జీవితంలో డబ్బు ఎలాగో ఒకలా సంపాదించుకుంటాం. దాని గురించి ఎక్కువ మథనపడిపోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్జన అనే మాయాజాలంలో చాలామంది చిక్కుకుపోవడాన్ని గమ నిస్తున్నాను. దాన్నికాస్త పక్కన పెట్టండి. సంపాదనపై కాక, ఉన్నంతలో ఆనందంగా గడపడమెలా అనే దానిపై దృష్టి పెట్టండి. మీరే ఒక సంపదగా పరిణమించండి. ఆనందం ఎక్కడ ఉంటుందో ఐశ్వర్యం అక్కడ ఉంటుంది. -
తన ఆటలో తానే పావయిందా?
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ముగింపు సూచనలు లేవు సరికదా మరింత తీవ్రతరమవటమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఇరాన్ తరఫున యెమెన్‌లోని హవుతీలు కూడా రంగంలో దిగటంతో పర్షియన్ గల్ఫ్‌తో బాటుగా ఎర్ర సముద్రంపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎర్ర సముద్రం, బాబెల్ మెండెబ్ జలసంధి గుండా సుమారు 12 శాతం ప్రపంచ చమురు, గ్యాస్ రవాణా జరుగు తున్నది. అంటే, ఇరాన్ ఈ యుద్ధాన్ని మరొక అంచెకు తీసుకొని వెళ్లటానికి నిశ్చయించినట్లు లెక్క.అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం, సంక్షోభం తలెత్తినా, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ యూఎస్ఏ పాత్ర ప్రస్ఫుటం. ప్రచ్ఛన్న యుద్ధ (1945–1991) కాలంలో యూఎస్ విదేశాంగ విధానం సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని అడ్డుకోవటం లక్ష్యంగా రూపొందించబడి నది. సోవియట్ విచ్ఛిన్నం (1991) తరువాత యూఎస్ఏ నాయక త్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికన్ ప్రయోజనాలకు విఘాతం నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడు లను నిస్సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకొన్నది.యుద్ధంతో శాంతా?ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ఏ ఇక యుద్ధాలు చేయటం లేదా ప్రోత్సహించడం ఉండదని ప్రకటించాడు. బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యూఎస్ఏను యుద్ధాల ఊబిలోనికి లాగి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించాడు. అదే సమయంలో సుంకాల యుద్ధానికి (టారిఫ్ వార్) తెరతీశాడు. క్రమంగా ట్రంప్ ప్రభుత్వం ‘యుద్ధాలకు ముగింపు’ విధానం నుండి మళ్లీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగదీసు కోవటం మొదలుపెట్టి, ఉక్రెయిన్‌కు సాయుధ సహకారాన్ని మరింత విస్తరించి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తున్నది. ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం, వెనిజులాలో సైనిక చర్యతో యూఎస్ తన పంథా మార్చుకోలేదని అర్థమయింది. గ్రీన్‌ల్యాండ్‌ను యూఎస్ఏకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో కలహానికి శ్రీకారం చుట్టాడు.ఇటీవల 2025లో యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025) యూఎస్ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలం, సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యూఎస్ ప్రతిపా దిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి (వార్ ఫర్ పీస్) అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్ వివిధ దేశాలను సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తి ద్వారా లోబర్చుకొనే విధానాన్ని అమలుపరుస్తున్నాడు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరించాడు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనకడుగు వేశాడు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, ఈయూ, భారత్‌లతో ట్రంప్ వెనకడుగు వేశాడు.డీప్ స్టేట్ మద్దతు లేదా?యూఎస్ఏ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఆ దేశంలోని డీప్ స్టేట్ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రిపబ్లికన్ల చేతిలో ఉన్నా, డెమోక్రాట్ల చేతిలో ఉన్నా డీప్ స్టేట్ చెప్పుచేతల్లో ఉండాల్సిందే. సీఐఏ, పెంటగన్, ఎన్ఐఏ, మీడియా లాబీ, ఆయుధ కంపెనీల లాబీలు, టెక్ కంపెనీ లాబీలు, బడా మదుపరుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్ స్టేట్ ప్రభుత్వ విధానాలు తన లక్ష్యాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూస్తుంది.డీప్ స్టేట్ కనుసన్నల్లో ఉండే యూఎస్ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్ లక్ష్యాలతో పాటుగా అమెరికన్ లాబీల ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదారవాద ముసుగులను కప్పి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుం టారు. తాత్కాలికంగా యూఎస్ ఆధిపత్యానికి నష్టం కలిగినా సరే, యూఎస్ డీప్ స్టేట్ లాబీల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది.యూఎస్ అధ్యక్షులెవరయినా యూఎస్ డీప్ స్టేట్ ప్రయోజనా లకు విరుద్ధంగా వెళ్లలేరు. గత ఎన్నికలలో బైడెన్‌పై ట్రంప్ ఓటమికి డీప్ స్టేట్ సహకరించిందని అనుమానం. అందుకే ట్రంప్ డీప్ స్టేట్‌ని పక్కకి నెట్టి హెగ్సెత్, కుష్నర్, లిండ్సే, విట్కాఫ్ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నారు. డీప్ స్టేట్ భాగస్వామ్యం లేకపోవ టంతో ఇరాన్ వ్యూహంలో డొల్లతనం కన్పడుతున్నది.ఎంతవరకు పోరాడగలవు?ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యాలలో వైరుధ్యం కన్పడుతున్నది. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్‌ను ముక్కలుగా చేయటం, సుదూర భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ సవాలు చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమయిన జెరూసలెం వంటి ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్‌కు ఉనికి, అస్తిత్వాల సమస్య ఉన్నది. సామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్లు, ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాల్. అందుకే ఈ రెండు దేశాలది ‘నిండా మునిగిన వాడికి చలేమిటి?’ పరిస్థితి. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలూ వెనుకాడవు.ఇరాన్ నుండి తమను రక్షించుకోవటానికి అమెరికా ఛత్ర ఛాయలోకి దూరిన సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు, ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్ నాశనాన్నే కోరుకుంటాయి. భవిష్యత్తులో మరెప్పుడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్‌ను ధ్వంసం చేయాలని ఈ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఇవి యుద్ధం ఆగాలని కోరుకోకపోవచ్చును. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాది అస్తిత్వ సమస్య. అందుకే ఎంత నష్ట పోయినా, నాలుగేళ్లయినా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.కానీ యూఎస్ఏ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించినది కాదు, మనుగడకు సంబంధించినది కాదు. యుద్ధ లక్ష్యాలలో గందరగోళం స్పష్టంగా ఉన్నది. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సుముఖంగా లేడు. కానీ అర్ధంతరంగా కాడి పడవేస్తే అది యూఎస్ ప్రతిష్ఠకు మాయని మచ్చ. ఇప్పటికే యూఎస్ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్‌పై ఒత్తిడి పెంచారు. యూఎస్ఏ జీడీపీ సుమారుగా 31.89 ట్రిలియన్ డాలర్లు. కానీ అప్పుల భారం 38.5 ట్రిలియన్ డాలర్లు. బాండ్ మార్కెట్ ద్వారా యూఎస్ చైనా, జపాన్, ఈయూ దేశాల నుండి పెద్ద మొత్తాలలో పెట్టుబడులను సేకరిస్తున్నది. ఈ పెట్టుబడులను వినియోగించే ఖరీదైన యుద్ధాలను నిర్వహిస్తున్నది. యూఎస్ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్ గ్యాస్ మార్కెట్లను సంక్షోభంలోనికి నెట్టివేస్తే, దీర్ఘకాలంలో యూఎస్ బాండ్ మార్కెట్ తద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యూఎస్ డీప్ స్టేట్ లాబీలు ట్రంప్‌ను ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
భూతల దాడులు తప్పనట్లేనా?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికాలోని యూదు లాబీల ఒత్తిడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ బయట పడలేకపోయి నట్లయితే, ఇరాన్‌తో పదాతి సేనల యుద్ధం తప్పక పోయేటట్లే కనిపిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28తో ఆరంభించి దాదాపు అయిదు వారాలుగా సాగిస్తున్న వైమానిక, నౌకా, క్షిపణి యుద్ధం ఇరాన్‌ను తీవ్రంగానే నష్టపర చినా, సమీప భవిష్యత్తులో ఓడించగల సూచనలు లేకపోవటంతో, కనీసం పదాతి యుద్ధంతోనైనా ఆ పని చేయగలమా అనే మీమాంసలో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిఘటనతో తమకు, ఇజ్రాయెల్‌కు, గల్ఫ్ రాజ్యాలకు, ప్రపంచ ఇంధన వ్యవస్థకు కలుగుతున్న నష్టాలు, అమెరికన్ ప్రజ లతో పాటు తన ‘మాగా’ మద్దతుదారులలో ఎదురవుతున్న వ్యతిరేక తలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నట్లు తోస్తున్నది.స్వభావమే సమస్యఅయినప్పటికీ ఏమీ చెప్పలేని స్థితి. అందుకు కారణం నెతన్యాహూ ఒత్తిడి అన్నది సరేసరి కాగా, స్వయంగా ట్రంప్ స్వభావం ఒక పెద్ద సమస్య అవుతున్నది. ఇరాన్‌ను తుదముట్టించాలన్నది తన ‘40 సంవత్సరాల కల’ అని, అందుకు తగిన అవ కాశం ఇప్పుడు వచ్చిందని నెతన్యాహూ అంటూ, అది నెరవేర్చగల నాయకుడు అమెరికన్ చరిత్రలో మొదటిసారిగా ఆవిర్భవించాడని చెప్తున్నారు. ఇరాన్‌పై ఈ తరహా యుద్ధం సాగించాలన్న ఒత్తిడులు ఒబామా, బైడెన్ కాలాలలోనూ వచ్చినా, వారు ఆంక్షలతో సరిపెట్టి యుద్ధానికి నిరాకరించారు. అణుశక్తి విషయమై చర్చల ద్వారా ఒప్పందం జరిగింది (2015) కూడా అప్పుడే. ఆ ఒప్పందాన్ని ఎటువంటి కారణం లేకుండా రద్దు చేసిన ట్రంప్, రెండవసారి అధ్యక్షుడైనప్పటినుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కనిపిస్తు న్నదే. ఆయనను నెతన్యాహూ అంతగా పొగడటం అందువల్లనే. ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాలలోనూ ట్రంప్ మొదటినుంచి గత 14 మాసాలుగా ప్రవర్తిస్తున్న తీరు ఇదే విధంగా ఉంది. ఆయన ‘స్వభావం’ అనే మాట ఉపయోగించవలసి రావటం అందువల్లనే.ప్రస్తుతం గడువులు, షరతులు, చర్చలు అనే ప్రహసనం మరొకసారి సాగుతున్నది. ఇరాన్ లొంగుబాటుకు 48 గంటల గడు వన్నారు. ఆ సమయం పూర్తి కావస్తుండగా అయిదు రోజులన్నారు. అది ముగియకముందే పది రోజులకు పెంచారు. అది ఏప్రిల్ 6న గడవనున్నది. ఈలోగానే 15 షరతులతో ఒక రాజీ ప్రతిపాదన అమె రికా నుంచి వచ్చింది. అందుకు మారుగ ఇరాన్ 5 షరతులన్నది. ఆ రెండింటిలో ఏదీ రాజీకి వీలయ్యేది కాదని ఎవరైనా వెంటనే చెప్ప గలరు. అసలు అణుశుద్ధి కార్యక్రమాన్నే పూర్తిగా ఆపివేయాలనీ, క్షిపణుల సామర్థ్యం, సంఖ్య తాము చెప్పినట్లే ఉండాలనీ, (ఇరాన్) అనుబంధ మిలిటెంట్ సంస్థలకు మద్దతు పూర్తిగా నిలిపి వేయాలనీ, హార్ముజ్‌పై సార్వభౌమాధికారం వదలుకోవాలనీ షరతులు విధిస్తే అందుకు ఇరాన్ అంగీకరించగలదా? అదే విధంగా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలన్నీ ఖాళీ చేసి పోవాలన్న ఇరాన్ షరతు అమెరికాకు సమ్మతం కాగలదా? కనుక అది కాలక్షేపపు వ్యవహారం మాత్రమే. ఆ మాట తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు, చాలా షరతులను ఇరాన్ అంగీకరించి వేసిందని ఈ 30వ తేదీన మరొకమారు ప్రకటించారు.గెలిచే యుద్ధమేనా?ఎంతో వెనుకకు పోనక్కర లేదు. అమెరికా, ఇరాన్ మూడవ విడత చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో ఫిబ్రవరి 26న జరిగాయి. పరస్పర అంగీకారం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు ఒమన్‌తో పాటు అమెరికన్ ప్రతినిధులు ప్రకటించారు. తర్వాతి విడత చర్చలు మార్చి 2న జరగవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆ మధ్యలోనే ఇజ్రాయెల్, దాని వెనువెంట అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఏ ఇరాన్ నాయకుని అనుమతితో చర్చలు జరుగుతుండెనో అదే నాయకుడిని కుటుంబంతో సహా ప్రాణాలు తీశాయి. చర్చలు ఒక పక్క జరుపుతూనే మధ్యలో దాడులు చేయటం ట్రంప్‌కు అది రెండవసారి.అందుకే చర్చల నాటకాన్ని ఇరాన్ మాత్రమే కాదు, ఎవరూ నమ్మటం లేదు. అమెరికన్లు కూడా. నాలుగు వారాల వైమానిక యుద్ధం ట్రంప్ లక్ష్యాలను సాధించలేక పోయినప్పుడు పదాతి యుద్ధంతో అది జరిగేది కాదని అమెరికన్ రిటైర్డ్ జనరల్స్, యుద్ధ విషయాల చరిత్రకారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అందుకు వారు గట్టి కారణాలు కూడా చెప్తున్నారు. లిబియా, ఇరాక్, అఫ్గాని స్తాన్లకు, ఇరాన్‌కు చాలా తేడాలున్నాయి. వాటికి భిన్నంగా ఇక్కడ విశాలమైన దేశం, పెద్ద జనాభా, బలమైన ప్రభుత్వం, భారీ సైన్యం, సైనిక సంపత్తి ఉన్నాయి. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహం భిన్నమైనది. ఇరాన్లో అధిక భాగం పర్వతాలమయం. వారి ఆయుధ నిల్వలు కొండల అడుగున చాలా లోతైన బంకర్లలో ఉన్నందునే అమెరికన్ బంకర్ బస్టర్లు సైతం వాటిని ఛేదించలేక పోతున్నాయి. వీటన్నింటికీ అదనంగా, ఇరానియన్ ప్రభుత్వం, ప్రజలు కూడా తమ అస్తిత్వాన్ని ఏ విధంగానైనా కాపాడుకుని తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అక్కడి ప్రజలు ప్రజాస్వా మికంగా ఎన్నుకున్న మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికా, బ్రిటన్ కలిసి 1953లో కూలదోసినప్పటి నుంచి గల 72 సంవత్సరాల చేదు అనుభవాల దృష్ట్యా పాశ్చాత్య దేశాలను, ఇజ్రాయెల్‌ను ఎంత మాత్రం నమ్మరన్నది ఆ నిపుణులు చెప్తున్నమాట.కపట నీతిఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు గత 12 రోజులలో మూడు సార్లు మార్చిన గడువులుగానీ, చర్చల కోసమంటున్న షరతులు గానీ, ఇస్లామాబాద్‌లో జరుగుతాయనే మధ్యవర్తిత్వాలు గానీ ప్రహసనం తప్ప మరొకటి కాదు. అయినా, ఇరాన్‌పై యుద్ధాన్నిఇంకా తీవ్రం చేయండంటూ ట్రంప్‌కు మూడు రోజుల క్రితం చెప్పిన సౌదీ అరేబియా, అంతలోనే ఈజిప్టు, టర్కీలతో కలిసి పాకిస్తాన్‌కు మధ్యవర్తి ప్రతినిధులను పంపటం కపట నీతికి పరాకాష్ఠ వంటిది. ఇటువంటి రాజీలేవీ కుదిరేవి కాదని ఒమన్ దౌత్య వైఫల్యంతో గ్రహించలేనిదేమీ కాదు పాకిస్తాన్. అయినప్పటికీ చొరవ తీసుకోవటంలో తమ ఆలోచనలేవో తమకుండవచ్చుగానీ, అది జరిగే కార్యం కాదని అందరికీ తెలుసు. అంతకన్న ముఖ్యంగా, దానిని జరగనివ్వరాదని ఇజ్రాయెలీ ప్రధానికి తెలుసు. వీటన్నింటికి ఇరాన్‌పై అరబ్ షేఖ్‌లకు చిరకాలంగా గల వ్యతిరేకత పనిచేస్తున్నది.అందువల్ల, వెనిజులాతో చర్చలు చర్చలంటూ సైన్యాలను మోహరించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు, ఇరాన్‌తో చర్చలు చర్చలంటూ సైన్యాలను సమీకరించి ఉన్నట్లుండి యుద్ధం మొదలు పెట్టినట్లు, ఇప్పుడు మళ్లీ ఒకవైపు రాజీ ప్రతిపాదనలు ప్రకటించి ఇస్లామాబాద్‌లో చర్చలంటూనే పదాతి సేనలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అకస్మాత్తుగా ట్రంప్ 30వ తేదీన తన బ్రాండ్ మాట ఒకటి ప్రకటించారు. తనకు ఇరాన్ చమురు కావాలట. అందుకు ఖర్గ్ దీవిని ఆక్రమించుకుని హార్మూజ్‌ను తెరిపిస్తారట. కార్యసాధన తర్వాతగానీ ఇరాన్ నుంచి వెనుకకు మళ్లరట. ఒకవేళ రాగల రోజు లలో వైమానిక దాడులు, భూతల యుద్ధం జమిలిగా సాగితే ఏమి జరగవచ్చునన్నది అంచనా వేయలేము.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం) రాయని డైరీ
ఎంత వద్దనుకున్నా... కొన్ని జ్ఞాపకాలు, బ్రహ్మపుత్ర నదీ తీరాన జంటగా సాగే చక్రవాక పక్షుల్లా రెక్కలార్చుకుంటూ వచ్చి వాలుతుంటాయి. వాటిని ఆపలేము! ఎన్నికల ప్రచారానికి రేయింబవళ్లు సరిపోవటం లేదు. ఎంత ప్రయాణించినా దారులు తరిగిపోవటం లేదు. మధ్యలో – ఈ తలపుల గుంపులు రోడ్డుకు అడ్డంగా వచ్చి, కాన్వాయ్‌ని ఆపినట్లుగా ఆపేస్తున్నాయి! పోలింగ్‌కి ఇంకో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. పది రోజులంటే... సమయం ఉండటం కాదు, సమయం లేకపోవడం. ఇవాళ అమిత్ షా వస్తున్నారు. అమిత్ షా గానీ, మోదీజీ గానీ ఎప్పుడు అస్సాం వచ్చినా అదొక గొప్ప అస్సామీ సాంస్కృతిక వేడుకలా ఉంటుంది. ఇక ఈసారైతే ఏప్రిల్‌లో రావలసిన ‘బోహాగ్ బిహు’ పండుగ, కాస్త ముందే వచ్చినట్లు!నల్బారి జిల్లా టిహులో; సోనిత్‌పుర్ జిల్లా ధేకియాజులిలో... ఈరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు భారీ ర్యాలీలు ఉన్నాయి. దిగువ అస్సాంలోని టిహులో పునాది ఇంకా కొంచెం గట్టి పడాలి. బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలోని ధేకియాజులిలో తేయాకు తెగకు మరింతగా దగ్గరవ్వాలి. ఈ రెండు ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడతారు. ‘‘మీకు అండగా మీ సీఎం ఉన్నారు. మీ సీఎంకు అండగా నేను, మోదీజీ ఉన్నాం’’ అని ప్రజలకు నమ్మకం ఇస్తారు. కాంగ్రెస్‌కి, బీజేపీకి ఎంత తేడా!! కాంగ్రెస్ ఒకప్పుడు నాకు బ్రహ్మపుత్ర నది. ఆ నది ఒడ్డున ఉండే నారింజ–గోధుమ రంగుల చక్రవాక పక్షుల్లో నేనూ ఒకడిని. అందరం, అస్సామీ జానపద గాథల్లోని బ్రహ్మణ పక్షుల్లా ఒకరి పట్ల ఒకరం విశ్వాసంగా ఉండేవాళ్లం.కానీ రాహుల్ నన్నొక రోజు బ్రహ్మపుత్ర నుంచి తరిమేశారు! భౌగోళికంగా బ్రహ్మపుత్ర నదితో ఏమాత్రం దగ్గరితనం లేని ఢిల్లీలో కూర్చొని 2,000 కి.మీ. దూరం నుంచే నన్ను బ్రహ్మపుత్ర నుంచి విసురుగా వెళ్లగొట్టారు. మంచే జరిగింది! ఆ విసురుకు నేను బ్రహ్మపుత్ర నుండి ‘గంగానది’ గట్టున పడ్డాను. కాంగ్రెస్‌లోంచి బీజేపీలోకి వెళ్లటం నాకు గంగానదిలో స్నానం ఆచరించినట్లుగా ఉంది. నాకేదో ప్రక్షాళన జరిగినట్లుగా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న నన్ను ముఖ్యమంత్రిని చేయాలని సోనియా మేడమ్ నిర్ణయిస్తే, మేడమ్ నిర్ణయాన్ని కూడా కాదని, పది మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా లేని తరుణ్ గొగోయ్‌ని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వాలని రాహుల్ పట్టుపట్టారు! ఆ తర్వాతెప్పుడూ రాహుల్‌కు పట్టుపట్టే అవకాశం రాలేదు. పదేళ్లుగా అస్సాంలో కాంగ్రెస్సే లేదు. ఇంకో పదేళ్ల తర్వాతైనా కాంగ్రెస్ వస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని మాటలను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ రోజు – గులాం నబీ ఆజాద్ – నా గురించి రాహుల్‌తో మాట్లాడుతూ... ‘‘మెజార్టీ ఉన్న హిమంతను పక్కన పెడితే, పార్టీ నుంచి వెళ్లిపోతాడేమో’’ అని ఆందోళనగా అన్నప్పుడు... రాహుల్ అనిన మాట, ఒక నాయకుడు అనకూడని మాట! ‘‘పోతే పోయాడు, ఆరెస్సెస్లోకే కదా పోతాడు’’ అన్నారు రాహుల్! కాంగ్రెస్‌లోంచి నేను బయటికి వచ్చాక, బీజేపీ నన్ను ఆదరించింది. అస్సాంకి నన్ను ముఖ్యమంత్రిని చేసింది. నన్ను సీఎంని చెయ్యటం కోసం, నా ముందున్న శర్వానంద సోనోవాల్‌ను ఐదేళ్లు పూర్తి కానిచ్చి కేంద్ర మంత్రిగా పంపించిన మోదీజీ, అమిత్ షాల ఔన్నత్యం ఎక్కడ?! మెజారిటీ కోల్పోయి, రెండేళ్ల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉన్న తరుణ్ గొగోయ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించటం కోసం, మెజారిటీ ఉన్న నన్ను పక్కన పెట్టిన రాహుల్ సంకుచితత్వం ఎక్కడ?! నదులన్నీ పవిత్రమైనవే. పార్టీలన్నీ ప్రజాసేవ కోసం ఉండేవే. వ్యక్తులే... నదుల్ని, పార్టీలను కలుషితం చేస్తారు. -
రామ... రామ... రామనారాయణ!
‘దక్షిణ అయోధ్య’ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చినవారు అని కొందరుసందేహాలు లేవనెత్తుతున్నారు. దశరథ రాముడా, వైకుంఠ రాముడా అన్న ప్రశ్నకు సమాధానం భద్రాచల క్షేత్ర విశిష్టత తెలుసుకుంటే అర్థమవుతుంది. భక్తి మాత్రమే ఉన్నవాళ్లు భద్రాచలానికి వచ్చి శ్రీసీతారామచంద్రుడికి నిశ్చింతగా మొక్కు తీర్చుకుంటున్నారు. వాళ్లకేమీ సమస్య లేదు. కానీ ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించినది. రామనారా యణుడని పూజించే హక్కుకు సంబంధించినది. భద్రమహర్షి కథనమ్మకానికి రుజువులుండవు. భద్రాచల క్షేత్ర మహత్యంలో భద్ర మహర్షి తపస్సు కథ ఉంది. రామరావణ యుద్ధం ముగించి, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం తరువాత అనేక సంవ త్సరాలు తపస్సు చేసిన భద్ర మహర్షికి శ్రీరామచంద్రుడు శంఖ చక్రాలతో దర్శనమిచ్చాడు. ఆ స్వామిని వైకుంఠ రాముడని, మోక్ష రాముడని, చతుర్భుజుడైన ‘రామనారాయణు’డని క్షేత్ర మహా త్మ్యాలు వివరిస్తున్నాయి. భద్రమహర్షి తానే ‘అచలం’ అంటే కొండగా నిలిచి ఉన్నాడనీ, అందుకే భద్రాచల క్షేత్రానికి ఎంతో విశిష్టత వచ్చిందనీ అంటారు. శ్రీరాముడు ఎప్పుడైనా తాను దశర థుడి కొడుకునే అని అంటాడే కానీ, నేను వైకుంఠ నివాసిని అని రామాయణంలో చెప్పుకోలేదు. మానవులు, కోతుల చేతిలోనే రావ ణుడి మృత్యువు ఉందని భాగవతంలో కనిపిస్తుంది. రాముడు మనిషే కనుక రామాయణంలో రాముడికి శంఖ చక్రాలు ఉండవు. చతుర్భుజాలు ఉండవు. భద్రాచలం కథ కలియుగ కథ.భద్రమహర్షి తపస్సు చేసి నాకు రాముడే కావాలనీ, విష్ణువెవరో నాకు తెలియదనీ అంటాడు. ఆనాటి శంఖ చక్రాలు, నాలుగు భుజాలు అట్లాగే ఉంచేసుకుని రాముడి రూపాన్ని స్వీకరిస్తాడని భద్రాచల క్షేత్ర కథలో ఉంది. భద్రాచలంలో ఉన్న స్వామి అయోధ్య రాముడు కాదంటున్నారు. అయోధ్య రాముడిది వశిష్ట గోత్రం అవు తుంది. అయోధ్య రాముడే అని అనుకున్నా వారివారి ఇష్టం. సీతా ‘మహాలక్ష్మి’భద్రాచల క్షేత్రంలో రామచంద్ర స్వామిని నారాయణుడిగా భావించి సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవం దాకా షోడశో పచారాలతో పూజిస్తున్నారు. ఇక్కడ రామనారాయణుడని సంప్ర దాయం. కవులు తమ కావ్యాలు, భజన గీతాలలో రామనారాయణ అని అన్నారు. చట్టాలు, పూర్వనిర్ణయాలు (కోర్టు నిర్ణయాలు), కస్టమ్ అనే మూడు సూత్రాల ద్వారా శాసనం వస్తూ ఉంటుంది. కస్టమ్ అంటే కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగిస్తున్నారని రుజు వులు వస్తే, సంప్రదాయం చట్టంతో సమానమవుతుంది. భద్రా చలంలో మూలమూర్తి రామచంద్ర స్వామికి ముందు ఆంజనే యుడు కాకుండా ఎదురుగా గరుడ ఆళ్వార్ ఉంటాడు. అదే భద్రా చల స్వామి నారాయణ స్వరూపుడనడానికి ఆధారం అంటారు.ఆంజనేయుడి రూపాన్ని ఆలయం ఎదుట దూరంగా ప్రతిష్ఠించారు. భద్రాచలంలో సీతారామ కల్యాణం చాలా సుప్రసిద్ధమైందని తెలుసు. మిగతా కార్యక్రమాలకు సంవత్సరం దాకా అనేకానేక విశేష ఉత్సవాలు ఉంటాయి. చిలుకు ద్వాదశి రోజున స్వామికి మోహిని అవతారంలో అలంకారం చేస్తారు. అది మరి ఏ ఇతర రామా లయాల్లో లేదు. నరక చతుర్దశి ఉత్సవం, కృష్ణాష్టమి ఉత్సవం, వైకుంఠ ఏకాదశి ధనుర్ మాసంలో రాపత్తు (రాత్రి), పగల్‌పత్తు (పగలు) ప్రతిరోజు కూడా ఒక విశేష అలంకరణతో స్వామి వారికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భద్రాచల క్షేత్ర చరిత్ర అని 1971వ సంవత్సరంలో దేవస్థానం ప్రచురించిన చోట ఇక్కడ సీతా మహాలక్ష్మి అని వర్ణించారు. భద్రా చలం కల్యాణంలో జనక దశరథుల ప్రసక్తి ఉండదు. ఎన్నో ఏళ్లుగా తాళపత్ర గ్రంథాలలో భక్త రామదాసు, నరసింహదాసు ప్రస్తావించిన అంశాలు చదువుకోవచ్చు. అదే ఆనవాయితి ఉందన్న తరువాత ఇతర వాదాలు నిలబడవు. సీతారాములను లక్ష్మీనారాయణులుగా భావించి ఉత్సవాలు జరిపించవలసింది అనే శాసనాలు చెక్కారు. అచ్యుత గోత్రంభద్రాచలంలో సుమారుగా 80 ఏళ్ళు ఉన్న ఒక విశ్రాంత అర్చక స్వామి ఎన్నో కల్యాణాలు ప్రత్యక్షంగా జరిపించారు. 1950 నుంచి ఇప్పటివరకు వారికి ఊహ తెలిసిన దగ్గర నుంచి అక్కడ ఉన్న రామచంద్రస్వామి కల్యాణ ప్రక్రియలో అచ్యుత గోత్రమే చెప్తారని స్పష్టంగా తెలియజేస్తున్నారు. భద్రాచల క్షేత్రంలో ఎప్పుడూ కొత్తగా గోత్ర ప్రవరలు మార్చలేదనీ, ఎన్నో ఏళ్ల తరబడి అక్కడ ఉన్న పరంపర అదే చెబుతోందనీ వృద్ధ పురోహితులు వివరిస్తున్నారు.ప్రతి క్షేత్రానికి ప్రవరలు విడిగా ఉంటాయి. తిరుమల వేంక టేశ్వర కల్యాణ ప్రక్రియలో గోత్ర ప్రవరలు, కొండ దిగువన పద్మా వతి అమ్మవారి క్షేత్రంలో జరిగే కల్యాణ ప్రక్రియలో చెప్పే గోత్ర ప్రవరలు వైవిధ్యంగా ఉంటాయి. దానికి జవాబు ‘సంప్రదాయమే’. క్షేత్ర సంప్రదాయాన్ని, క్షేత్ర పరంపరను అనుసరించి అక్కడ చేసే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. రామచంద్రుడు సూర్యవంశానికి చెందినవాడు. వారిది కాశ్యప గోత్రం. రాముడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వారి ఆచార్యుడి గోత్రాన్ని అంటే వశిష్ఠులవారి గోత్రాన్ని కూడా చెప్పవచ్చును. కానీ వైకుంఠ రాముడు, నారాయణుడు అనుకుని అచ్యుత గోత్రమే అంటారు.పురుషోత్తముడు, సృష్టి ఆది నుంచి ఉన్న శక్తి శ్రీరాముడనీ, శ్రీకృష్ణుడనీ విభిన్న అవతారాలుగా ఉండటం వల్ల, ఆయా కుల గోత్రాలు, ప్రవరలు చెప్పుకునే అవకాశం ఉంది. భద్రాచల క్షేత్రంలో ఉన్న రామచంద్ర స్వామిని సీతారాముడు, రామ నారాయణుడు, లక్ష్మీనారాయణుడని అంటే సమస్య ఏమిటి? ‘ఇది తప్పు అది ఒప్పు’ అని ఎవరు తేల్చగలరు? అసలు స్వరూపమే లేని పరమా త్ముడనే వేదాంతాన్ని భాగవతంలో, భగవద్గీతలో కూడా వివరిస్తారు కదా! పరాశక్తి అనీ పరమాత్ముడనీ – అవన్నీ రూపాలే అనీ వినడం లేదా? అలాంటప్పుడు భద్రాద్రి రాముడిని రామనారాయ ణుడన్నా, అనంతుడన్నా, రామబ్రహ్మం అనుకున్నా వివాదాలు ఉంటాయా?మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్‌ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్‌లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్‌తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్‌కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్‌కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్‌కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్‌ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్‌కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్‌తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్‌కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్‌లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
గుర్రం లాగిన రైలుబండి
గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు, విలాసవంతమైన ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ లేదా మంచు కొండల గుండా సాగే ట్రాన్స్–సైబీరియన్ రైళ్ల గురించి గొప్పగా చెప్పుకొంటాం. కానీ కోట్లాది మంది సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిన ఈ రైలు ప్రయాణ విప్లవం ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. సరిగ్గా 219 సంవత్స రాల క్రితం (1807 మార్చి 25) తేదీన బ్రిటన్ సౌత్ వేల్స్‌లోని ఒక చిన్న సముద్ర తీర గ్రామంలో, కేవలం ఒక గుర్రం లాగే బండితో డబ్బులు చెల్లించి చేసే రైలు ప్రయాణ చరిత్ర ప్రారంభమయ్యింది. ఆ రోజుల్లో రైల్వే పట్టాలు కేవలం బొగ్గు, సున్నపురాయి వంటి ముడి సరుకులను రవాణా చేయడానికి మాత్రమే వాడే వారు. మంబుల్స్ గ్రామంలోని గనుల నుంచి బొగ్గును స్వాన్సీ ఓడరేవుకు చేరవేసేందుకు 1804 లోనే పట్టాలు వేశారు. అయితే ఆ పట్టాలపై వెళ్లే సరుకు బండ్లను చూసి పిల్లలు సరదాగా వాటిపై ఎక్కి సవారీ చేసేవారు. ఆ దృశ్యాన్ని చూసిన ‘బెంజమిన్ ఫ్రెంచ్’ అనే వ్యాపారవేత్తకు మనుషులను కూడా పట్టాలపై రవాణా చేయాలనే ఆలోచన వచ్చింది. 12 సీట్లు ఉన్న ఒక గుర్రపు బండిని సిద్ధం చేశాడు. అది స్వాన్సీలోని ‘ద మౌంట్’ నుండి ‘ఆయిస్టర్ మౌత్’ వరకూ ఐదు మైళ్ల దూరం ప్రయాణించేది. దీనికి రెండు షిల్లింగుల వరకు ఛార్జీ వసూలు చేసేవారు. ‘ద మౌంట్’ ప్రపంచంలోనే తొలి రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. అక్కడ ప్లాట్ ఫారమ్ లేకపోవడంతో ప్రయాణికులు పట్టాల పక్కనే ఉన్న ఒక మట్టి దిబ్బ మీద నుంచి బండిలోకి ఎక్కేవారు.ఇంతింతై...ప్రపంచంలోనే అత్యధిక రకాల శక్తి వనరులను వాడిన రైల్వేగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గుర్రంతో మొదలైన ఈ రైలు ప్రయాణం, క్రమంగా ఆవిరి యంత్రాలు, గాలి (సెయిల్), డీజిల్, గ్యాసోలిన్, చివరకు విద్యుత్ శక్తి వరకు వినియోగించుకుంటూ ఎదిగింది. మొత్తం ఆరు రకాల ఇంధనాలను వాడిన రైళ్లు పరుగులిడిన ఏకైక రైలు మార్గమిది. 1877లో ఆవిరి యంత్రాలు వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకే సారి 15 బోగీలతో సుమారు 1,300 మందిని ఇది తీసుకెళ్లేది. 1928లో ఈ లైన్‌ను విద్యుదీకరించారు. ఆ సమయంలో బ్రిటన్ లోనే అతిపెద్దవైన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ట్రామ్ కార్లను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఒక్కో రైలులో 212 మంది వరకు కూర్చునే అవ కాశం ఉండేది. 1940వ దశకంలో ఏడాదికి దాదాపు 50 లక్షల మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించారంటే దీనికి ఆదరణ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.ఈ రైలు ప్రయాణం కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, అది ప్రజల జీవితాల్లో ఒక తీపి జ్ఞాపకం. అప్పటి ప్రయా ణికులు ఆ రైలు సీట్లు మెత్తని చర్మంతో ఉండేవనీ, పట్టాలపై వెళ్తున్నప్పుడు ఆ బండి చేసే శబ్దం ఎంతో దూరం వరకు వినిపించేదనీ గుర్తు చేసుకుంటారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తరువాత పరిస్థితులు మారిపోయాయి. చమురు నియంత్రణలు తొలగిపోవడంతో కార్లు, బస్సుల వాడకం పెరిగింది. పాతబడిన పట్టాల మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని భావించిన అధికారులు, దీనిని మూసివేయాలని నిర్ణయించారు.చివరకు 1960 జనవరి 5వ తేదీన ఈ చారిత్రక రైలు తన చివరి ప్రయాణాన్ని సాగించింది. ఆ రాత్రి వేలాది మంది ప్రజలు విచారంతో రోడ్ల మీదకు వచ్చారు. తమ ప్రియమైన రైలుకు వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియల తరహాలో నల్లటి బట్టలు ధరించి, ఒక ఖాళీ శవపేటికను మోస్తూ పాటలు పాడారు.నేడు స్వాన్సీలో అక్కడక్కడా కొన్ని శిథిలాలు తప్ప ఈ చారిత్రక రైలుకు సంబంధించిన ఆనవాళ్లు పెద్దగా లేవు. కానీ, ఈ రైలు ప్రయాణం చరిత్రలో ఎప్పటికీ ఒక అద్భుత అధ్యాయంగానే నిలిచిపోతుంది. -
ముగుస్తున్న సమాంతర చరిత్ర
దేశంలో ‘నక్సలిజం అంతానికి’ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఆపరేషన్ కగార్ గడువు మరికొద్ది రోజులలో మార్చి 31న ముగియనున్నది. మరునాడు ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఎక్కడా నక్స లైట్లు గానీ, నక్సలిజం గానీ జాడలేని పరిస్థితి ఏర్పడుతుందా అన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గానీ, గత 59 సంవత్సరాలుగా మనం చూస్తున్న తరహా ఉద్యమం మాత్రం ముగింపునకు వస్తున్నదనటంలో సందేహం లేదు. ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు చనిపోవడం లేదా నాయకులతో సహా లొంగిపోవటం జరుగుతున్న ప్పుడు, ఉద్యమం ఇప్పటివలె ఇంకా కొనసాగగలదని భావించటం నిర్హేతుకమవుతుంది.అరవై ఏళ్ల పోరాటంభారతదేశం 1947లో స్వతంత్రాన్ని సాధించుకోగా, తర్వాత 20 సంవత్సరాలకే 1967లో నక్సలిజానికి బీజాలు పడ్డాయి. అప్పటి నుంచి దేశ చరిత్రకు సమాంతరంగా నక్సలిజం చరిత్ర దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాగింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఒక నియంతృత్వ వ్యవస్థలో రైతాంగం, ఆదివాసీలు, పేదలు ఇంత సుదీర్ఘమైన విప్లవోద్యమాన్ని సాగించి ఉంటే అది వేరు. కానీ, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఇట్లా ఎందుకు జరిగిందన్నది జాగ్రత్తగా, నిర్వికారంగా అర్థం చేసుకోవలసిన విషయం.అనేక శతాబ్దాల పాటు రాచరిక ఫ్యూడల్ వ్యవస్థలలో, తర్వాత బ్రిటిష్ వలస పాలనలో తీవ్రమైన పీడనకు గురైన ఇండియా వ్యవ సాయిక దేశం. పీడనకు గురైన ప్రజలలో అత్యధికులు రైతులు, కౌలు దార్లు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన వివిధ వృత్తులవారు, ఆదివాసీలు. దేశ స్వాతంత్య్రం కోసం ఉద్య మించిన కాంగ్రెస్ తదితర పార్టీల నాయకత్వాలు ఈ సమస్యను మొదటి నుంచి గుర్తించాయి. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చేపట్టిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం రైతాంగం కోసమే. అది, బిహార్‌లోని చంపారన్‌లో 1917లో నీలిమందు రైతుల సమస్యలపై. ఆయన తన ప్రథమ శిష్యునిగా ప్రకటించిన వల్లభ్ భాయ్ పటేల్ ఆ మరుసటి సంవ త్సరమే గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో మహత్తరమైన రైతాంగ పోరాటం నడిపారు.ఈ నేపథ్యంలోకి వెళ్లటం ఎందుకంటే, నక్సలైట్లు ఏ పేద రైతాంగం కోసమైతే పశ్చిమ బెంగాల్‌లోని సిలిగుడిలో 1967లో సాయుధ ఉద్యమం ఆరంభించారో, అంతకు సరిగా 50 సంవత్స రాల ముందు, కాంగ్రెస్ నాయకత్వం అదే రైతుల కోసం ఉద్యమించింది. మరొక విధంగా చెప్పాలంటే, దేశ స్వాతంత్య్రానికి 30 సంవత్సరాల క్రితం అన్నమాట. అంతే కాదు– చంపారన్, ఖేడా రైతుల సమస్యల పరిష్కారంతో వారు దేశ రైతాంగాన్ని మరవలేదు. వారి విషయమై ఏఐసీసీ సమావేశాలలో తీర్మానాలు చేస్తూ పోయారు. బ్రిటిష్ ప్రభుత్వానికి మహజర్లు సమర్పించారు. గవర్న మెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 ప్రకారం ఎన్నికలు జరిగి రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు ఏర్పడినపుడు రైతాంగ అనుకూల చర్యలు తీసుకున్నారు.ఎందుకు తలెత్తినట్టు?స్వాతంత్య్రం తర్వాత ఇదే ధోరణి కొనసాగిస్తూ నెహ్రూ ప్రభుత్వం అనేక వ్యవసాయ సంస్కరణలను ప్రవేశ పెట్టింది. భూమిపై యాజమాన్యం సాగుచేసే రైతులకు మాత్రమే ఉండాలని, ఎవరెంత సాగు చేయగలిగితే అంతమాత్రమే లభించాలన్న గాంధీజీ సూచనల స్ఫూర్తితో భూపరిమితి చట్టాలు, జమీందారీ రద్దు, భూపంపిణీలు, కౌల్దారీ చట్టాల వంటివి చేశారు. రైతులకు ఉప యోగపడే సహకార చట్టాలు, పంచాయతీ రాజ్‌లను కూడా అమ లుకు తెచ్చారు. రుణ పరపతి విధానం ప్రవేశ పెట్టారు.విషయం ఏమంటే, 1947 కన్న ముందటి వ్యవసాయ రంగ పరిస్థితులను అంతగా అర్థం చేసుకుని, ఆ తర్వాత ఇన్నిన్ని చర్యలు తీసుకున్నప్పుడు, 20 సంవత్సరాలు గడిచేసరికి పేద రైతాంగం, రైతు కూలీల కేంద్రంగా నక్సలైట్ ఉద్యమం అసలు తలెత్తి ఉండ కూడదు. అదంతా ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు కనిపించే ఏకైక సమాధానం, పైన పేర్కొన్న వేర్వేరు ప్రభుత్వ చర్యలలో కొన్ని అరకొరగా అమలుకాగా, కొన్ని అసలు కాకపోవటం. నిజమైన ఆధిపత్యం చాలావరకు పెద్దవారి చేతులలోనే మిగిలి పోవటం. రాచ కుటుంబాల వారు, జమీందారీ తరగతులు, ఇతర ప్రాబల్య వర్గాలు కాంగ్రెస్‌లో చేరి, అధికారుల సహాయంతో రకరకాల యుక్తుల ద్వారా భూసంస్కరణలతో పాటు నెహ్రూ ప్రభుత్వపు అనేక సంస్క రణలను వీలైనంత బలహీనపరచారు. 1964లో ఆయన మరణం తర్వాత ఇక వారికి ఏ అడ్డూ అదుపూ లేకపోయింది. మరొక మూడేళ్లు గడిచేసరికి నక్సల్బరీకి అంకురార్పణ జరిగింది.‘అభివృద్ధి’కి ఇక అడ్డేమిటి?1917 నుంచి ఆరంభించి 1950ల వరకు కాంగ్రెస్ పార్టీ రైతాంగం పట్ల, ఆదివాసీల పట్ల చూపిన శ్రద్ధ మేరకు కార్యాచరణ జరిగి ఉంటే, స్వతంత్ర భారతదేశ చరిత్రకు సమాంతరంగా నక్సలైట్ ఉద్యమ చరిత్ర అంటూ ఒకటి ఉండేదే కాదు. దానిని ‘అంతం’ చేయవలసిన అవసరమంటూ ఇపుడు ఏర్పడేది కాదు. మొదట అనుకున్నట్లు మొత్తానికి ఉద్యమమైతే ఇక ముగిసి పోతు న్నది. అందుకు ఒక ముఖ్య కారణం ప్రభుత్వాల అణచివేత. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల సమన్వయంతో గతంలో లేనంత తీవ్ర మైన చర్యలు తీసుకుంటుండవచ్చు. కానీ, గత ప్రభుత్వాల చర్యలు తక్కువేమీ కాదు. రెండవ ముఖ్య కారణం ఉద్యమంలోని అనేక లోపాలు. సైద్ధాంతిక అవగాహనలో, దాని అన్వయంలో, వ్యూహ రచనలో, వ్యవస్థల నిర్మాణంలో, ఆచరణలో... ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అనేక లోపాలు కొనసాగినపుడు ఎంతటి ఉద్యమ మైనా క్రమంగా విఫలం కాక తప్పదు.విచారకరం ఏమంటే, కాంగ్రెస్‌కు 1917 నుంచి గణనీయమైన స్పృహ ఉండి, 1947 నుంచి ఎన్నో చర్యలు తీసుకుని, 1967 నుంచి తీవ్ర స్థాయిలో నక్సలైట్ ఉద్యమం జరిగిన తర్వాత కూడా, దేశం 2027 ముంగిట ఉండగా, రైతులూ, ఆదివాసీల స్థితిగతులు అసలు మెరుగుపడలేదనలేము. కానీ, మెరుగుపడవలసింది ఇంకా చాలా ఉందన్నది వాస్తవం. వారిలో గల అసంతృప్తి కూడా తక్కువ కాదు. అందువల్ల, నక్సలిజమైతే ‘అంతమవుతున్నది’ గానీ, అందుకు కార ణమైన సమస్యలను కూడా అంతం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఏమి చర్యలు తీసుకోగలవో వేచి చూడవలసి ఉంది. నక్స లైట్లను ఇంతకాలం అభివృద్ధికి అడ్డుపడుతున్న శక్తులుగా నిందించిన మీదట, ఇక అటువంటి అడ్డులనేది లేకుండా ఈ నెల 31తో తొలగి పోతున్నందున, రైతులు, కౌలుదార్లు, కూలీలు, వృత్తి పనులవారు, ఆదివాసీలు, నిరుద్యోగులు తదితర వర్గాల సమస్యలను శీఘ్రగతిన తొలగించి అభివృద్ధి పరచేందుకు ఇపుడు మార్గం పూర్తిగా సుగమ మవుతున్నది. ఆ పని చేయనున్నారా?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దారి తప్పుతున్న ఉపగ్రహాలు
నావిగేషన్ సిస్టం ఇపుడు సుపరిచితమైన పదబంధమే. దారి ఎవరినీ అడుగన వసరం లేకుండా మ్యాప్ చూసుకుంటూ గమ్యస్థానం చేరేందుకు ఉపగ్రహాలు మార్గదర్శనం చేస్తాయి. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్ట్సలేషన్ (నావిక్) పేరుతో భారత్ కూడా ఒక ఉపగ్రహ నావిగేషన్ సిస్టంను అభివృద్ధి చేసుకుంది. అది ఇపుడు అంతరిక్షంలో కొన ఊపిరితో ఉంది. శాస్త్ర–సాంకేతిక మంత్రిత్వ శాఖ రెండేళ్ళ క్రితమే దీనిపై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రపంచ ఉపగ్రహ నావిగేషన్‌లో భారత్ స్వావలంబనకు అదొక తార్కాణంగా నిలిచిందని పేర్కొంది. కానీ మన నావిగేషన్ ఉపగ్రహాల స్థితిగతుల గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి పొడసూపుతున్న సమాచారం చూస్తూంటే, మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనే నానుడి ’నావిక్’కు సరిగ్గా అతికినట్లుగా కనిపిస్తోంది. ఆటమిక్ క్లాక్‌ల పనితీరు?కార్గిల్ యుద్ధం (1999) నేపథ్యంలో ఒక భారతీయ నావిగేషన్ సిస్టంను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం తలెత్తింది. అమెరికా నిర్వహిస్తున్న జీపీఎస్ నావిగేషన్ సిస్టం నుంచి అందుబాటులోనున్న సంకేతాలు అప్పట్లో కార్యాచరణకు సంబంధించి కొన్ని సవాళ్ళకు కారణమయ్యాయి. దాని కనుగుణంగానే ‘ఇస్రో’ ‘నావిక్’ డిజైన్, అభివృద్ధిని పూర్తి చేసింది. అది 2016 నుంచి పని చేయడం మొద లెట్టింది. ఎతై ్తన ప్రాంతాలలో గ్లోబల్ సిస్టంల నుంచి సిగ్నల్స్ ఒక్కోసారి అందుబాటులోకి రావు కనుక, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఉపయోగపడే విధంగా ‘నావిక్’కు డిజైన్ చేశారు.నావిగేషన్ ఉపగ్రహానికి ‘ఆటమిక్ క్లాక్’ గుండెకాయ లాంటిది. సెకనులో బిలియన్ వంతు లోపల కూడా అది సరైన స్థితిని చూప గలదు. ఈ రూబీడియం ఆటమిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్స్ (ఆర్.ఏ. ఎఫ్.ఎస్.) క్లాక్‌లను ఒక స్విస్ తయారీ సంస్థ నుంచి ‘ఇస్రో’ సమీకరించింది. కానీ, వాటిలో కొన్ని సరిగ్గా పనిచేయలేదు. మొదటి క్లాక్ 2018లో విఫలమైంది. మిగిలిన క్లాక్‌లలో లోపాలను సరిదిద్దుతారనీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. అయినా, లోపాలు కొనసాగుతూనే వచ్చాయి. దాంతో దాదాపు ఐదు ఉపగ్రహాలు ఉపయోగపడనివిగా తయారయ్యాయి. యూరో పియన్ స్పేస్ ఏజెన్సీ కూడా దాని గెలీలియో ఉపగ్రహ కాన్ట్సలే షన్లో అవే రకమైన లోపాలు తలెత్తినట్లు వెల్లడించడం ఒక్కటే ప్రభుత్వానికి కాస్త ఊరటనిచ్చింది. ఆ ఏజెన్సీ కూడా స్విట్జర్లాండ్ సరఫరా చేసిన ఆటమిక్ క్లాక్లనే ఉపయోగించుకుంది. ఇక లాభం లేదనుకున్న ‘ఇస్రో’, అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్లో సొంతంగా రూబీడియం ఆటమిక్ క్లాక్‌లను తయారు చేయడం మొదలు పెట్టింది. వాటిని 2023 మే నెలలో ప్రయోగించిన ఎన్వీఎస్–01 ఉపగ్రహంలో ఉపయోగించారు. వాటి పనితీరుపై ‘ఇస్రో’ ఎలాంటి డేటాను పంచుకోలేదు కనుక, సవ్యంగానే పనిచేస్తున్నాయని భావించడం తప్ప చేయగలిగింది లేదు. స్మార్ట్ఫోన్లలో నావిక్ తక్కువే!అంతరిక్ష విభాగం కుంటుపడినా, అవసరమైన గ్రౌండ్ విభాగాలను అభివృద్ధి చేయడం ‘ఇస్రో’ కొనసాగించింది. నావిగే షన్ సేవలను ఉపయోగకరమైనవిగా తీర్చిదిద్దేందుకు సర్వే గ్రేడ్ రిసీవర్లు, కాంపాక్ట్, లో–కాస్ట్ రిసీవర్ మాడ్యూళ్ళతో సహా పొత్తు కుదిరే హార్డ్‌వేర్ అవసరం. ‘నావిక్’ ఆధారిత స్మార్ట్ ఫోన్లు సరేసరి. నావిక్ ఆధారిత ట్రాకింగ్ సాధనాలను అమర్చుకున్న రైళ్ళు ఏ సమయంలో ఎక్కడున్నాయో పరీక్షించి చూసుకున్నారు. చేపల వేటకు వెళ్ళే మర పడవల గమనాన్ని కూడా ‘నావిక్’ ఆధారిత ట్రాన్స్పాండర్లతో గమనించారు. వివిధ రకాల మోటారు వాహనా లను కూడా ఈ పరీక్షలకు ఉపయోగించుకున్నారు. అయినా, అటు కమర్షియల్‌గా కానీ, ఇటు ప్రజోపయోగంలోకానీ ‘నావిక్’ విని యోగం తక్కువ స్థాయిలోనే ఉంది. భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం దాదాపు 20 మేజర్ బ్రాండ్లు, 700 రకాల ఫోన్లు ఉన్నాయి. వివిధ తయారీ సంస్థల నుంచి వస్తున్న 60కి పైగా స్మార్ట్ ఫోన్ మోడళ్ళు ‘నావిక్’ విని యోగానికి అనువైనవని గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్‌కు తెలిపారు. ‘నావిక్’ ఆధారిత ఫోన్లను ఉపయోగిస్తున్న వారి మొత్తం సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ రెండింటిలోనూ మార్పులు చేస్తేనే భారతీయ నావిగేషన్ సిస్టంకు వీలైన హ్యాండ్సెట్లు అందుబాటులోకి వస్తాయి. కొన్ని చిప్ సెట్ల తయారీ సంస్థలు‘నావిక్’కు అనువైన ప్రాసెసర్లను మన దేశానికి పంపుతున్నాయి. కానీ, చాలా ఫోన్లలో ‘నావిక్’ సిగ్నల్స్ కనిపించడం లేదనీ, హార్డ్‌వేర్ పరంగా మద్దతు ఉన్నా, తక్కువ–స్థాయి డ్రైవర్లు సిగ్నల్స్‌ను ఫిల్టర్ చేస్తున్నాయనీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, పుణేలోని విశ్వకర్మ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. భారతీయ స్మార్ట్ ఫోన్ వాడకందారులు ‘నావిక్’ను వినియోగించేటట్లు చేయడానికి చేయ వలసింది ఇంకా చాలా ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. సాధ్యమయ్యే లక్ష్యాలేనా?మొదటి తరం నావిగేషన్ ఉపగ్రహాల పనితీరులో అటు అంత రిక్షంలోనూ, ఇటు క్షేత్ర స్థాయిలోనూ అదే పనిగా సమస్యలు తలె త్తుతూండటంతో ‘ఇస్రో’ రెండవ తరం శ్రేణి ఉపగ్రహాల తయారీకి నడుం బిగించింది. ఈ శ్రేణిలోని మొదటి ఉపగ్రహం విజయవంతమైంది. కానీ, 2025 జనవరిలో ప్రయోగించిన ఎన్వీఎస్–02 ఉప గ్రహం నిర్దేశించిన కక్ష్యను చేరుకోలేకపోయింది. గత సంవత్సరాంతంలో ఎన్వీఎస్–03 ప్రయోగించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం 2025 ఆగస్టులో ప్రకటించింది. తదుపరి ఆరు నెలల్లో ఎన్వీఎస్–04, ఎన్వీఎస్–05 ప్రయోగాలు కూడా ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత కొద్ది నెలలు గడిచాక, 2026 లాంచ్ షెడ్యూల్ విడుదల చేశారు కానీ, వాటిలో ఎన్వీఎస్–శ్రేణి ఉపగ్రహాల ఊసు లేదు. స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన కీలక విభాగాల్లో ‘ఇస్రో’ కొన్ని దశాబ్దాలుగా స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తోంది. అయితే, ప్రభుత్వ వినియోగానికి అంకితమైనవాటిని మినహాయిస్తే, ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే స్పేస్ టెక్నాలజీని అందించడంలో ‘ఇస్రో’ పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. కమ్యూనికేషన్లు, బ్రాడ్ కాస్టింగ్, రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలనకు వివిధ విజయవంతమైన భారతీయ ఉపగ్రహాలు ఉన్నప్పటికీ, కమర్షియల్ వాడకందారులు ఇప్పటికీ విదేశీ ఉపగ్రహాలపైనే ఎక్కువగా ఆధార పడుతున్నారు. దూర శ్రవణ విద్యకు అంకితమైన ఎడ్యుశాట్ టెక్నికల్‌గా సఫలమైనప్పటికీ, ప్రోగ్రమాటిక్ వైఫల్యాన్ని చవిచూసింది. నెట్వర్క్ కనెక్టివిటీ, కంటెంట్ జనరేషన్లో వెలితులు, బలమైన మేనేజ్మెంట్ వ్యవస్థ కొరవడటం దానికి కారణాలని ఆ ప్రోగ్రామ్ ఆడిట్ నివేదికలో వెల్లడైంది. ఇపుడు నావిగేషన్ సేవల ప్రహసనాన్ని చూస్తున్నాం. ‘ఇస్రో’ లోతైన ఆత్మపరిశీలన చేసుకోక తప్పదు. 2022 కల్లా మానవ సహిత అంతరిక్ష నౌకను ప్రయోగించాలని ప్రధాని 2018లో ఒక అవాస్తవిక లక్ష్యాన్ని ‘ఇస్రో’ ముందుంచారు. ఈ ప్రయోగానికి ఇంకా ఒకటి రెండేళ్ళు పట్టేటట్లు ఉంది. అంతలోనే ప్రధాని, భారత్‌కు 2035 కల్లా సొంత అంతరిక్ష కేంద్రం ఉండాలనీ, 2040 కల్లా చంద్రునిపైకి మనం వ్యోమగామిని పంపగలగాలనీ ఆశావహమైన కార్యక్రమాలను ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ‘ఇస్రో’పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇటీవలి వైఫల్యాల నేపథ్యంలో అంతరిక్ష రంగానికి సంబంధించి తన ప్రాధాన్యాలను ప్రభుత్వం సవరించు కోవాల్సి ఉంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
శివశక్తి తత్వం
భారతీయ కాలగణనలో షష్టిపూర్తి పద్ధతిలో అరవై సంవత్సరాలు ఒక చక్రంగా తిరుగుతుంటాయి. ఈ అరవై నామ సంవత్సరాలకు ఒక్కొక్క దానికి ఒక్కో వైశిష్ట్యం, గూఢార్థం ఉన్నాయి. అయితే, ‘పరాభవ’ నామ సంవత్సరం గురించి వినగానే సామాన్య ప్రజల్లో ఆందోళన కలగడం సహజం. లోకరీత్యా ‘పరాభవం’ అంటే ఓటమి, భంగపాటు లేదా అవమానం అని అర్థం ఉండటమే దీనికి ప్రధాన కారణం. కానీ శాస్త్ర ప్రమాణాల ప్రకారం... ముఖ్యంగా సంస్కృత మూలాలను పరిశీలిస్తే, ఈ పేరు వెనుక అత్యంత ఉదాత్త మైన ఆధ్యాత్మిక పరమార్థం దాగి ఉంది. పరతత్వంఈ నామాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ‘పరా’, ‘భవ’ అనే రెండు పదాలను విడివిడిగా చూడాలి. ‘లలితా సహస్ర నామ’ స్తోత్రంలో అమ్మవారిని ‘పరా’ అనిసంబో ధిస్తారు. యోగశాస్త్రం ప్రకారం వాక్కు నాలుగు దశలలో ఉద్భవిస్తుంది. అవి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇందులో ‘పరా’ వాక్కు అత్యున్నతమైనది. ఇది నాభి మూలంలో, అంటే మూలాధార చక్రంలో నిశ్శబ్దంగా ఉండే ఆదిశక్తి స్వరూపం. ‘పరా’ అంటే శ్రేష్ఠమైనది, పర బ్రహ్మ విద్యకు మూలమైనది, సకల శక్తులకు ఆధారం అని అర్థం. లోకంలో మనం వాడే ‘పరాభవం’ అనే పదం బాహ్యమైన వైఖరి స్థాయికి సంబంధించినది. కానీ ఈ సంవత్సరం పేరులోని ‘పరా’ అనేది ఆ పరతత్వాన్ని సూచిస్తుంది. ‘భవ’ అంటే శివ స్వరూపం. ఈశ్వరుడి అష్ట మూర్తులలో ‘భవుడు’ ఒకరు. సృష్టి కార్యానికి మూలమైనవాడు ఆ పరమేశ్వరుడు. అలాగే ‘భవ’ అంటే ప్రాప్తి, పుట్టుక లేదా మంగ ళకర మైన స్థితి అని కూడా సంస్కృత నిఘంటువులు చెబు తున్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ‘పరాభవ’ అంటే ‘అత్యున్నతమైన శివతత్వం కలగడం’ లేదా ‘పరాశక్తి ద్వారా శివ సాయుజ్యం సిద్ధించడం’ అని అర్థం వస్తుంది. సంస్కృతంలో పరా అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ప్రధాన అర్థాలు: శ్రేష్ఠమైనది, అత్యున్నతమైనది; పరబ్రహ్మ స్వరూపం; పరాశక్తి (దేవి పరమ శక్తి); పరా వాక్ – వేదాల్లో చెప్పిన నాలుగు వాక్కులలో అత్యున్నత స్థాయి; అత్యంత దివ్యమైన జ్ఞానం (పరా విద్య). లలిత సహస్ర నామంలో దేవిని ‘పరా’, ‘పరాశక్తి’, ‘పర బ్రహ్మ స్వరూపిణి’ అని పేర్కొంటారు. అంటే పరా అనే పదానికి పరమమైన దైవశక్తి అని అర్థం చెప్పుకోవచ్చు. అజ్ఞానానికి పరాభవంనిజానికి ఈ సంవత్సరం మనలోని అజ్ఞానానికి పరాభవం (ఓటమి) జరిగి, జ్ఞానోదయం కలిగే సమయంగా భావించాలి. అరిషడ్వర్గాలను జయించి, పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందగోరే సాధకులకు ఈ ఏడాది అత్యంత శుభప్రదమైనది. ఇది శివ–శక్తుల ఐక్యతను, శక్తి–జ్ఞాన సమన్వయాన్ని సూచిస్తుంది. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం/ న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి... శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టికి సమర్థుడవుతాడు. అలా కాకపోతే, ఆ దేవుడు కదలడానికి కూడా శక్తిహీనుడు అని అర్థం. బాహ్య ప్రపంచంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, అంతరంగంలో పరాశక్తిని ధ్యానించేవారికి ఈ కాలం వరప్రసాదం వంటిది. తెలుగు పంచాంగంలో ఉన్న 60 సంవత్సరాల చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ పేర్లు తప్పనిసరిగా శుభం లేదా అశుభం సూచించవు. అవి కేవలం కాల చక్రాన్ని సూచించేవి మాత్రమే. దుర్ముఖి, ఖర, వికారి, విరోధి వంటివి వినడానికి ప్రతికూలంగా ఉన్నా, అవి కాల సూచికలు మాత్రమే. కాబట్టి, ‘పరాభవ’ అనే పేరు విని భయపడవలసిన అవసరం లేదు. పేరులోని అక్షరాల వెనుక ఉన్న తత్వాన్ని గ్రహించినప్పుడు భయం పోయి భక్తి, విశ్వాసం కలుగుతాయి. ఈ ఉగాదిని కేవలం కాలాంతర మార్పుగా కాకుండా, మనలోని పరబ్రహ్మ తత్వాన్ని మేల్కొలిపే ఒక నూతన అధ్యాయంగా ఆహ్వానిద్దాం. ఈ పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో అత్యున్నతమైన శుభాలను ప్రసాదించాలని కోరుకుందాం!పి. విజయబాబువ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు -
ఒక కేశవుడు
‘డా‘‘ హెడ్గేవార్ ఎంతో దూరదృష్టితో సంఘ్‌ను స్థాపించారు. మనువు అరచేతిలో నున్న ఒక చిన్న చేపపిల్ల పెరిగి పెద్దదై, ప్రళయ కాలంలో మనువు నౌకను ఎలాగైతే కాపాడిందో, అలాగే డాక్టర్జీ స్థాపించిన ఈ సంఘ్ కూడా భవిష్యత్తులో బృహత్తర రూపం సంతరించుకొని, దేశాన్ని కాపాడుతుందని నేను నమ్ముతున్నాను’ అన్నారు వీర్ సావర్కర్ (30 జూలై, 1939). స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీర సావర్కర్ ఇలా ఎలా ఊహించగలిగాడు అని ఇప్పటి తరానికి సందేహం. దానికి సమాధానం 1920 దశకం ఆరంభంలో జరిగిన సంఘటన. అరవింద్ ఘోష్ కీలకపాత్ర వహించిన వందే మాతరం ఉద్యమం ఉవ్వెత్తున ప్రజల్లో ఉత్సాహాన్ని, దేశభక్తిని రగిల్చింది. ఘోష్ సహా అనేక మంది జైలుపాలయ్యారు. ఆయన జైలునుంచి తిరిగివచ్చేసరికి ఆ ఉద్యమం తాలుకు ఊపు, ఉద్వేగం తగ్గిపోయాయి. అప్పటి కాంగ్రెస్ సభల్లో కార్యకర్తగా పాల్గొన్న హెడ్గేవార్‌లో అది మథనానికి కారణమైంది. తాత్కాలిక ఆవేశాలను రగిల్చే ఉద్యమాలు శాశ్వతమైన, సుస్థిరమైన దేశభక్తిని ప్రజల మనసుల్లోకి చొప్పించలేవు... ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో, ప్రతి క్రియలో దేశం గురించే తపించే యువశక్తి నిర్మాణం జరగటమే దేశం ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం కాగలదన్న సంకల్పం డాక్టర్జీలో కలిగింది. దీని ఫలితంగానే 1925లో కొద్దిమంది యువకులతో కలిసి ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ను స్థాపించారు. నాయకత్వ లక్షణాలుహెడ్గేవార్ 1889 సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జన్మించారు. నిరుపేద పౌరోహిత్య కుటుంబంలో తెలంగాణ నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనే గ్రామంలో ఆయన జన్మించారు. తరువాత కాలంలో వారి కుటుంబం మహారాష్ట్రలోని నాగపూర్‌కు వలస వెళ్లింది. ఆయన తండ్రి బలిరాం మంచి విద్యావేత్త. కేశవుడు ఆంగ్ల విద్యను అభ్యసించాలని ఒక మంచి పాఠశాలలో చేర్పించారు. అప్పటి బ్రిటిష్ పాలకురాలు విక్టోరియా మహారాణి జన్మదినం రోజున స్కూల్లో మిఠాయిలు పంచితే, వాటిని తీసుకువెళ్లి చెత్తబుట్టలో వేసి, ఒక విదేశీ రాణి జన్మదినం నాకెందుకు అని ప్రశ్నించారు; వందేమాతరం అని నినదించటమే నేరంగా ఉన్న కాలంలో తన సహ విద్యార్థుల చేత వందేమాతరం అని నినదింపజేసి, ఆ పని తనదే అని అంగీకరించటంతో ఆయనను పాఠశాల నుండి బహిష్కరించారు. హనుమాన్ జయంతులను నిర్వహించడం, అఖాడాల ఏర్పాటును ప్రోత్సహించడం వంటి సంఘటనలు కౌమార దశలోనే హెడ్గేవార్ దేశభక్తికి అద్దం పడతాయి. 1909లో కలకత్తా నగరంలోని ఒక మెడికల్ కళాశాలలో ఆయన ప్రవేశం పొందారు. డాక్టర్ బి.ఎస్. మూన్జే ఆర్థిక సహాయంతో వైద్య విద్యను అభ్యసించడం ప్రారంభించారు. మూన్జే బ్రిటిష్ – భారత ఆర్మీలో మెడికల్ ఆఫీసర్. హిందుత్వం పట్ల గాఢమైన నిష్ఠ కలిగిన మూన్జే పరిచయం హెడ్గేవార్‌లో దేశభక్తి, జాతీయత పట్ల బలమైన విశ్వాసాన్ని నింపింది. స్వదేశీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న అరవై సంవత్సరాల మౌల్వీ లియాఖత్ హుస్సేన్ పరిచయం హెడ్గేవార్ ఆలోచనల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. 1911 ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ తోడ్పాటుతో అనేక సమావేశాలు నిర్వహించడంతో హెడ్గేవార్‌లో నాయకత్వ లక్షణాలు మరింత పెరిగాయి. కలకత్తాలో ఉన్న సమయంలోనే ‘అనుశీలన సమితి’ వంటి అనేక విప్లవవాద సంస్థలతో, వాటిని నడిపే నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో దేశంలో ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఎక్కువ. హెడ్గేవార్ ఇతర విద్యార్థుల సహాయంతో ‘సేవా సమితి’ని స్థాపించి, సమాజంలో ఐక్యతను పెంపొందించేందుకు ప్రయత్నించారు. 1914లో బాల గంగాధర్ తిలక్ మాండలే జైలు నుండి విడుదలైన తర్వాత హెడ్గేవార్ ఆయనకు ముఖ్య అనుచరుడిగా మారారు. తరువాత జరిగిన పరిణామాల వల్ల సంఘాన్ని ప్రారంభించి, శాఖ అనే నిత్య సాధనా వేదికను ప్రవేశ పెట్టారు. క్రమంగా ఆ శాఖలలో వేలాది మంది స్వయంసేవకులు పాల్గొనడం ప్రారంభించారు. హెడ్గేవార్ దీర్ఘదృష్టితో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ ఎంతోమంది నిస్వార్థ సేవాభావం కలిగిన ప్రచారకులను, కార్యకర్తలను తీర్చిదిద్దింది. దేశ సౌభాగ్యమే లక్ష్యంసంఘంలో చేరటానికి కులమూ, విద్యార్హత, ఆర్థిక స్థాయి వగైరాలు అర్హతలు కాదు. దేశాన్ని ప్రేమించటం ఒక్కటే యోగ్యత. సమాజంలో ఉన్న కుల, మత, వర్గ, వర్ణ విభేదాలను తగ్గించి సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ఈ శాఖలు ఉపయోగపడతాయని ప్రముఖులెందరో భావించారు. గాంధీజీ, నేతాజీ, డా‘‘ అంబేడ్కర్ లాంటి నాయకులెందరో శాఖలను సందర్శించారు. సంఘ లక్ష్యం ప్రతి స్వయంసేవకుడిలో రెండు గుణాలు నింపటం – వ్యక్తి సౌశీల్యం, జాతీయ సౌశీల్యం.సంఘం హింసను బోధించదు. సంఘం సమాజాన్ని ద్వేషించటం బోధించదు. ప్రతి స్వయంసేవకుడిలో దేశ సౌభాగ్యాన్ని గురించి ఆలోచించే తత్త్వాన్ని, విలువలను మాత్రమే కథల రూపంలో, ఆటల రూపంలో చొప్పించే కార్యక్రమాలు చేస్తూంటుంది. ఇప్పుడు సంఘంలో స్వయంసేవక్ కావటం అంటే ఒక దేశభక్తుడు తయారవ్వటమే అని అందరూ భావిస్తున్నారు. అలా పెరిగిన సంఘ్‌కు ఇప్పుడు నూరేళ్లు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని సంఘటితం చేయడం, సమాజాన్ని సుసంపన్నంగా నిర్మించడం, అలాగే భారతమాతను విశ్వగురువుగా నిలబెట్టడం మనందరి కర్తవ్యం. ఆ మహత్తర లక్ష్య సాధనలో మనందరం భాగస్వాములుగా నిలవడమే హెడ్గేవార్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది.బండారు దత్తాత్రేయవ్యాసకర్త మాజీ గవర్నర్ (ఉగాది రోజున హెడ్గేవార్ జయంతి) -
ఆత్మనిర్భరతకు సామ్రాజ్యవాద సవాల్
నాలుగు కీలకమైన అంశాల్లో విదేశాలపై ఆధారపడటం ద్వారా స్వతంత్ర భారతదేశం తన అభివృద్ధి ప్రక్రియకు శ్రీకారం చుట్టుకుంది. అవి ఆహారం, విదేశీ మారకద్రవ్యం, రక్షణ సామగ్రి, ఇంధనం. దేశం 1957–58లో ఎదుర్కొన్న విదేశీ మారక ద్రవ్య సంక్షోభం బయట నుంచి ఎదురు కాగల ద్రవ్యపరమైన అవరోధాలను వెల్లడించింది. చైనాతో 1962లో రేగిన యుద్ధం రక్షణ సామగ్రి కొరతను బహిర్గతం చేసింది. 1965–67లో ఏర్పడిన దుర్భిక్ష పరిస్థితులు ఆహార దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో తెలిపాయి. గల్ఫ్ యుద్ధం (1990) చమురు ధరలు ఒక్కసారిగా పెరగడానికి దారితీసి, విదేశీ మారక ద్రవ్య చెల్లింపులలో సంక్షోభానికి పురికొల్పింది. అప్పటి ప్రభుత్వాలు ఆ యా సంక్షోభాల నుంచి ఆర్థిక, విదేశాంగ విధాన పాఠాలను నేర్చుకున్నాయి. విదేశాంగ విధానంపై ఒత్తిడిచైనాతో యుద్ధ (1962) కాలంలో రక్షణ పరికరాల లోటుతో అప్పటి ప్రధాని నెహ్రూ గత్యంతరం లేక అమెరికా సాయాన్ని కోరవలసి వచ్చింది. అమెరికా–వియత్నాం యుద్ధంలో భారత్ వైఖరిని మార్పు చేసేందుకు ఆహార ఎగుమతులను పావుగా వాడుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ప్రయత్నించారు. చమురు ధరలు 1990లో అమాంతం పెరిగాయి. తదనంతరం, 1991లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిన సంక్షోభంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ దగ్గర భారత్ చేయి సాచాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌ను దౌత్యపరంగా గుర్తించడం దాని పర్యవసాన ఫలితమే. ఈమధ్య కాలంలో, ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, జి–7 (కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా) దేశాలు బ్యాంక్ ఖాతాలను స్థంభింపజేయడం వంటి చర్యలతో ఆర్థిక లావాదేవీలను ఒక ఆయుధంగా మలచుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంధన సరఫరాలను ఒక ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టారు. ఇవి విదేశాంగ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించేందుకు అడ్డుపడుతున్నాయి. స్వావలంబనను సాధించడం వ్యూహాత్మకంగా ఎంత ముఖ్యమో తెలియజెబుతున్నాయి. నమ్మక ద్రోహంఅన్ని రకాల వాణిజ్యాలను ముఖ్యంగా ఇంధనం, రక్షణ సామగ్రిని, అధునాతన, కీలక టెక్నాలజీలను ఆయుధంగా వాడుకునే ప్రస్తుత విధానాన్ని అమెరికా ఇకముందు కూడా కొనసాగిస్తుందని మన జాతీయ భద్రతా నిర్వాహకులు గుర్తెరగవలసి ఉంది. గత ఫిబ్రవరిలో అమెరికా–భారత్ చేసిన సంయుక్త ప్రకటన కొంత ఆశలను రేకెత్తించింది కానీ, కడచిన పన్నెండు నెలల పరిణామాలు, అటువంటి భ్రమలేవీ పెట్టుకోకపోవడం మంచిదని సూచిస్తున్నాయి. సైనిక భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను పెంపొందించపజేసుకోవాలని, 21వ శతాబ్దానికి అవసరమైన వాణిజ్యం, టెక్నాలజీలను వేగవంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న భారత్–అమెరికా దానికి సంక్షిప్తంగా ఇంగ్లీషులో ‘కాంపాక్ట్’ అనే సంకేత నామాన్ని కూడా పెట్టుకున్నాయి. ‘ట్రస్ట్’గా మరో సంక్షిప్త నామంతో పిలుచుకుంటున్న ఒప్పందం పైన కూడా మోదీ, ట్రంప్ సంతకాలు చేశారు. వ్యూహాత్మక టెక్నాలజీని వినియోగించుకుంటూ అమెరికా–భారత్ తమ సంబంధాలను రూపాంతరం చెందించుకుంటున్నాయని ఆ మాటకు అర్థం. ‘ఇంధనం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేటట్లు చూసేందుకు, ఇంధన మార్కెట్లలో ధరల స్థిరీకరణకు’ వాగ్దానం చేసిన ప్రకటన పైన కూడా ట్రంప్ సంతకం చేశారు. ఆ వాగ్దానానికి విరుద్ధంగా నడచుకోవడం ద్వారా ట్రంప్, గత 25 ఏళ్ళుగా భారత్–అమెరికా మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు సాగుతున్న కృషికి తిలోదకాలిచ్చారు. గత పదిహేను రోజుల పరిణామాలు చూశాక, ఇంధన భద్రత విషయంలో ట్రంప్ నేతృత్వంలోని అమెరికాను ఇక ఎంతమాత్రం నమ్మడానికి లేదని భారత్ గ్రహిస్తోంది. పశ్చిమాసియా ఘర్షణలు భారత్ ఇంధన భద్రతకే కాక, ఈ ప్రాంతంలో భారత్ సమీకరించుకోగల ఆర్థిక ప్రయోజనాలకు కూడా చేటు తెస్తాయి. గల్ఫ్‌లో భారత్ సముపార్జించుకున్న భౌగోళిక–ఆర్థిక ప్రాబల్యానికి అమెరికా–ఇజ్రాయెల్ చర్య ఎసరు పెట్టింది. ఆ రెండు దేశాలు ఒక రకంగా నమ్మక ద్రోహానికి పాల్పడ్డాయి. అవి చేసిన తప్పిదాన్ని ప్రధాని ధైర్యంగా పార్లమెంట్లో ప్రకటించగలగాలి. ట్రంప్ ఆర్థిక–భౌగోళిక రాజకీయ విధానాలు ఏ దిశగా సాగుతున్నాయో తెలుస్తోంది. కనుక, ట్రంప్ పదవీ కాలంలో, అమెరికాతో ఇక ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు మనం సుముఖత చూపకపోవడం మంచిది. మోదీ ప్రభుత్వ ‘ఆత్మనిర్భరత’ విధానం, అమెరికా అనుసరిస్తున్న ‘నయా–సామ్రాజ్యవాద’ విధాన సవాల్‌కు ఎదురొడ్డి తీరాలి. స్వావలంబన మనకు మనం సాధించుకునేది. అది ఎవరో మంజూరు చేస్తే వచ్చేది కాదు. మూడు దేశాలతో జాగ్రత్త!ఈ బాహ్యపరమైన ఒత్తిడులు కొత్తగా వచ్చిపడుతున్నవి కావు. వాటిని సజావుగా ఎదుర్కొంటూనే భారత్ ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం, ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరింత అస్థిరంగా, క్లిష్టమైనవిగా పరిణమిస్తున్నాయి. దాంతో మనవైపు కొత్త దుర్బలత్వాలు బయటపడుతున్నాయి. భారతీయ సంతతకి చెందిన వారిని భారత్ చాలా కాలంగా ‘సున్నితమైన శక్తి’గా పరిగణిస్తూ వచ్చింది. విదేశీ మారక ద్రవ్య వనరుగా చూస్తూ వచ్చింది. ట్రంప్ అనుసరిస్తున్న వలస వ్యతిరేక, ‘అమెరికా ఫస్ట్’ విధానాలు, గల్ఫ్‌లో యుద్ధం, భారతీయ సంతతికి చెందినవారి బలహీన పునాదులను బయటపడేటట్లు చేస్తున్నాయి. పైపెచ్చు, అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను చూపి, మన విధానాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విధంగా, వాటి ఘర్షణల్లోకి మనల్ని లాగుతున్నాయి. బయట నుంచి మనల్ని భయపెట్టే పోకడలను కడసారిగా 1960లు, 1970లలో, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చూశాం. మనం అలీన విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, బాహ్య పాత్రధారులకు భారత్ ఒక రంగస్థలంలా మారింది. మరోసారి అదే రకమైన కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలానికీ, ఇప్పటికీ మధ్య ఒక వైచిత్రి ఉంది. ఒకవైపు భారత్ ఇపుడు మరింత అభివృద్ధి చెందిన, మరింత పలుకుబడి చూపగలిగిన దేశంగా అవతరించిందికానీ, మరోవైపు మరింత దుర్భలమైనదిగా, బాహ్య ప్రభావానికి లోనయ్యేదిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. అనేక రకాల విధానాల విషయంలో ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా మోదీ కనిపిస్తున్నారు. పాలనాపరమైన ముద్రను చాటడంలో ఆయన అచ్చం ఇందిరను తలపిస్తారు. కానీ, బాహ్యపరమైన ఒత్తిడులకు లొంగకుండా ఎదురు నిలవడంలో ఆమెకున్న నిబ్బరాన్ని ఆయన ఇంకా సమీకరించుకున్నట్లు లేదు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం బాగానే ఉంది కానీ, అగ్ర దేశాల తప్పులను ఎత్తి చూపడంలోనూ అదే రకమైన తెగువను ప్రదర్శించాలి. మూడు (అమెరికా, రష్యా, చైనా) దేశాలతో సంబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వేటిపై ఆధారపడుతున్నామో అవి మనల్ని లొంగదీసుకునే ఆయుధాలుగా ఉపయోగించుకోకుండా చూసుకోవాలి.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మీడియా సలహాదారు -
నేర్చుకోవాల్సిన కీలక టీకా పాఠాలు
మన దేశంలో కౌమారంలోకి ప్రవేశించిన బాలికలకు రానున్న వారాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) టీకాలు వేయనున్నారు. దీంతో జాతీయ టీకా కార్యక్రమాల కింద ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మొత్తం 13 రకాల టీకాలు వేయడాన్ని మన దేశం అమలుపరచినట్లు అవుతుంది. బాల్యంలో వేయవలసిన టీకాలు అన్నింటినీ పూర్తి చేయడం ద్వారా భారత్ ఒక మైలురాయిని సాధించినట్ల యింది. అనారోగ్య నివారణకు కౌమారాన్ని ముఖ్య దశగా గుర్తించ డంలో నిర్ణయాత్మకమైన అడుగు వేసినట్లు కూడా అవుతోంది. రోగ నిరోధక శక్తిని పెంచే సార్వత్రిక కార్యక్రమంలో ప్రత్యేకించి యువతులకు వేయనున్న మొదటి టీకాగా హెచ్‌పీవీ నమోదు కానుంది. ఇంతవరకు జాతీయ రోగ నిరోధక ప్రయత్నాలు శిశు వులు, చిన్న పిల్లలు, గర్భవతులను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇప్పుడీ విధానపరమైన పరిణామం పరిణతితో కూడిన దార్శనికతకు సంకేతంగా నిలుస్తోంది. నివారణ యత్నాలు కేవలం చిన్న వయసు వారితోనే ఆగడానికి లేదనీ, ఆగకూడదనీ గుర్తించినట్లయింది. 18 ఏళ్ల నిరీక్షణఇది కేవలం పాలనాపరమైన పరిణామమే కాదు. ఈ అనివార్య నిర్ణయానికి దాదాపు 18 ఏళ్ళపాటు తర్జనభర్జనలు సాగాయి. ఈ విషయంలో ప్రాథమిక పరిశీలనకు, వాస్తవిక ఆచరణకు మధ్య జరి గిన కాలయాపన ప్రజారోగ్య కార్యక్రమాలన్నింటికీ ఒక పాఠంలా నిలుస్తోంది. మొదటి హెచ్‌పీవీ టీకాకు 2006లోనే లైసెన్సు లభించింది. అది 2008 ఆరంభం నుంచి మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు అంకురార్పణ పలకడం విశేషం. లాభాపేక్ష లేని ‘పాత్’ అనే అంతర్జాతీయ సంస్థ నేతృత్వంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2008–09లో హెచ్‌పీవీ టీకా పరిచయ కార్యక్రమం మొదలైంది. సాధ్యా సాధ్యాలు, ఆమోద యోగ్యత, విస్తృతి, భిన్న ప్రాంతాల్లో టీకా అందించడానికయ్యే ఖర్చు విషయంలో ప్రత్యక్ష ఫలితాల ఆధారాలను సేకరించడం వంటి వాటి లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమం కింద 10–14 ఏళ్ళ బాలికలకు ఖమ్మం జిల్లాలోనూ, గుజరాత్‌లోని వడోదరా జిల్లాలోనూ టీకాలు వేశారు. టీకా అందించడంలో వివిధ రకాల నమూనాలను పరీక్షించి చూశారు. అయితే, ఈ టీకా వేయించుకున్న బాలికలలో కొందరు మృత్యు వాత పడినట్లు 2009లో వార్తలు రావడంతో ఆందోళన చోటు చేసుకుంది. మరణాలకు ఆ టీకాతో సంబంధం లేదని తదనంతర దర్యాప్తులో తేలినప్పటికీ వేయించుకునే వారి నుంచి అనుమతి పొందడంలో విధానాలను అరకొరగానే అమలుపరిచారన్న ఆరోప ణలు వచ్చాయి. ముఖ్యంగా బలహీన, గిరిజన వర్గాల విషయంలో నైతికపరమైన లోటుపాట్లు బహిర్గతమయ్యాయి. ఈ విషయంపై పార్లమెంటులో కూలంకషంగానే చర్చ సాగింది. కేంద్ర ప్రభుత్వం 2010లో ఈ కార్యక్రమానికి తెరదించింది. ఔషధాల తయారీ సంస్థలు అమ్మకాలు పెంచుకునేందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నాయంటూ నిందలు మోపడం ప్రారంభించారు. ఫలి తంగా, హెచ్‌పీవీ టీకా కార్యక్రమానికి గ్రహణం పట్టింది. రోగ నిరో ధకతపై ప్రభుత్వమే ఏర్పాటు చేసినవి అయినప్పటికీ స్వతంత్రమైన సాంకేతిక సలహా బృందాలు ఈ టీకా వేయాలని తరచూ సిఫా ర్సులు చేసినా, జాతీయ టీకా కార్యక్రమంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేర్చడా నికి మన దేశం వెనుకాడుతూ వచ్చింది. ప్రజా విశ్వాసం కొరవడితే శాస్త్రీయ ఆధారాలు ఎంత బలంగా ఉన్నా అక్కరకు రావని ఈ ఉదంతం ద్వారా వెల్లడైంది. కోల్పోయిన అవకాశంఈ జాప్యానికి పెట్టిన పణాన్ని కోల్పోయిన కాలంతో లెక్కించ కూడదు. రోగనిరోధకతను పెంచుకునే అవకాశాలను బలపరచు కోలేకపోయామని వాపోవాలి. ఎప్పుడు టీకా బాగా పనిచేస్తుందో ఆ వయసు దాటి బాలికలు చాలా మంది బయటకొచ్చేశారు. మిగిలిన చాలా దేశాలు ఆ టీకాను సంతోషంగా అక్కున చేర్చుకుని ఆరోగ్య రక్షణను పెంచుకున్నాయి. దాదాపు 164 దేశాలు 2026 జనవరి నాటికే హెచ్‌పీవీ వ్యాక్సీన్ ప్రవేశపెట్టి, 50 కోట్లకు పైగా డోసులను అందించాయి. ఫలితంగా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలు ఒక ప్రజారోగ్య సమస్యగా గర్భాశయ క్యాన్సర్‌ను ఇంచుమించుగా నిర్మూలించిన స్థితికి చేరుకోగలిగాయి. మన దేశంలో మహిళలకు వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండవదిగా ఉంది. ఏటా దాదాపు 80 వేలకు పైగా మంది కొత్తగా దాని బారినపడుతున్నారు. సుమారుగా 42 వేల మందికి పైగా ఏటా ఈ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. అత్యధి కులు హై–రిస్క్ హెచ్‌పీవీ రకాల (ముఖ్యంగా టైప్ 16, టైప్ 18) ఇన్ఫెక్షన్ వల్లనే గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్నారు. మన దేశంలో వేయనున్న గర్దాసిల్ వ్యాక్సిన్ ఈ హెచ్‌పీవీ టైపుల నుంచి బాలికలను రక్షిస్తుందని భావిస్తున్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్లు సజీవేత రమైనవి. ఇన్ఫెక్షన్ కలుగజేసే శక్తి వాటికి ఉండదు. ఏ రకాల పాపి లోమా వైరస్ వల్ల గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయని భావిస్తు న్నారో వాటిని నివారించడంలో ఆ వ్యాక్సీన్ అత్యంత ప్రభావశీల మైన రీతిలో 93 నుంచి 100 శాతం సఫలమైనట్లు వెల్లడైంది. 9 నుంచి 14 ఏళ్ళ వయసున్న బాలికలకు సింగిల్ డోసు వేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో పేర్కొంది. సింగిల్ డోసు ఎక్కువ మంది వేయించుకోగలిగిన రేటుకు అందుబాటులో ఉంటుందనీ, కార్యక్రమం సఫలమవడానికి అవకాశాలు ఎక్కువనీ పేర్కొంది.నిరంతరం కార్యక్రమంహెచ్పీవీ వ్యాక్సినేషన్లో భారత్ ఏనాడో చేరవలసి ఉన్నా, ఇప్పటికైనా చేరడం మహత్తరమైనదే. టీకాపై రేగిన వివాదం వల్ల దాన్ని ప్రవేశపెట్టడంలో దాదాపు 15 ఏళ్ళు జాప్యమైంది. ఈ వ్యవ హారం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది. టీకా కార్యక్రమాన్ని రూపొందించేటప్పుడే కమ్యూనికేషన్ దానిలో అంతర్భాగంగా ఉండాలి. దాని ఉపయోగాలను ప్రచారం చేయడం తదనంతర ఆలో చనగా ఉండకూడదు. టీకా ఎందుకు వేయబోతున్నారో, అది ఎలా పని చేస్తుందో, దానివల్ల దుష్ప్రయోజనాలు కలుగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకున్నారో సమాజానికి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో వివరించాలి. డేటా ఒక్కటే నమ్మకాన్ని కలిగించలేదు. సంస్థాగత స్పందనలు అస్పష్టంగా లేదా ఆత్మరక్షణ ధోరణిలో ఉంటే, కాకతా ళీయంగా సంభవించిన ప్రతికూల పరిణామాలు కూడా చక్కని కార్య క్రమాన్ని అస్థిర పరచగలవు. సత్వర, స్వతంత్ర దర్యాప్తులు జరపడం, నిగ్గుదేలిన విషయాలను పారదర్శకంగా వెల్లడించడం వల్ల విశ్వసనీ యతను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. ప్రజారోగ్య కార్యక్రమా లలో ముఖ్యంగా యువత, బలహీన వర్గాల విషయంలో, నైతిక ప్రమాణాలను పాటిస్తున్నట్లు కనిపించడం కూడా చాలా అవసరం. త్వరలోనే హెచ్‌పీవీ టీకాలను ఉచితంగా వేయడం వల్ల వివిధ సామాజిక ఆర్థిక వర్గాలలో సమానత్వాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. గర్భాశయ క్యాన్సర్‌ను రూపుమాపడానికి టీకా వేయించు కోవడం ఒక్కటే సరిపోదని కూడా మనం గుర్తుంచుకోవాలి. పాప్ స్మియర్లు లేదా హెచ్‌పీవీ పరీక్షలు కొనసాగించడం ద్వారా జల్లెడ పట్టడం సాగాలి. ముఖ్యంగా, వ్యాక్సిన్లు వేయించుకోని వృద్ధ మహిళ లకు ఆ పరీక్షలు నిర్వహించాలి. టీకాలు వేయడంతోపాటు, పరీక్షలు నిర్వహించడం, సకాలంలో చికిత్సలు అందించడంతో కూడిన సమగ్ర వ్యూహాన్ని అనుసరించినప్పుడే మార్గం మెరుగుపడుతుంది. డా‘‘ చంద్రకాంత్ లహరియావ్యాసకర్త ప్రముఖ వైద్యుడు–ఆరోగ్య విధాన నిపుణుడు -
మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) రాయని డైరీ
ఒంటికి ‘నీలి’ రంగును పులుముకున్నంత మాత్రాన ‘అసలు రంగు’ దాగుతుందా?! గొంతుకు ఘీంకారాన్ని మెడలో గంటలా తగిలించుకుంటే మాత్రం ఏనుగు నడిచి వెళుతున్నట్లుగా ఉంటుందా?! సడి లేని పిడికిలి పూరించే బహుజన సమైక్య శంఖారావం దిక్కులను దద్దరిల్లిస్తుందా?! పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లను ముందే బుక్ చేసుకున్నట్లుగా, పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే కాన్షీజీని మెల్లిగా ‘ఓన్ ’ చేసుకుంటున్నాయి!! కాంగ్రెస్ ‘సామాజిక పరివర్తన్ దివస్’ జరుపుతోంది. సమాజ్‌వాదీ ‘పిచ్డా దళిత్ అల్ప్సంఖ్యాక్ దివస్’ అంటోంది. బీజేపీ కాన్షీజీ విగ్రహాలకు పూలదండలు వేసి, రోడ్ షోలు ఇచ్చేందుకు తయారైంది! లక్నో వీధుల్లో ఎవరెన్ని షోలు చేసినా, ర్యాలీలు తీసినా మాన్యవర్ కాన్షీ రామ్‌జీ కి ఎవరూ వారసులు అవలేరు. బహుజనుల బంధు మిత్రులు అసలే కాలేరు. కాన్షీజీ వెళ్లి ఇరవై ఏళ్లు! నేటికీ ఆయన స్వరం వింటున్నట్లే ఉంటుంది నాకు! అది గర్జన కాదు. గాండ్రింపు కాదు. ధరామండల జ్వాలారవం! నిన్న – నేడు – రేపు అనేవే ఉండని అనంత జీవన ఝరి. ఆకాశమే ఎందుకు ఉరమాలి అనేవారు కాన్షీజీ! భూమిపైన ఉన్న ప్రతి అట్టడుగు మనిషీ ఆకాశం వైపు ఉరిమి చూడాలి అని ఆకాంక్షించేవారు. ‘‘ధ్వనికి ప్రతిధ్వని అవొద్దు, ధ్వనిని మింగేసే మహాధ్వనివి నువ్వు’’ అనేవారు.‘‘అధికారానికి మాస్టర్ ‘కీ’ ఢిల్లీ డ్రాయింగ్ రూమ్‌లలో ఉండదు, అది బండబారిన బహుజనుల చేతుల్లో ఉంటుంది...’’ అని చెప్పేవారు. ‘‘ఎవరూ మనల్ని ఏదీ అవనివ్వరు మాయావతీ! చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మనకై మనమే ఫస్ట్ బెంచీలోకి వచ్చి కూర్చోవాలి...’’ అనేవారు!! పార్టీని పెట్టకముందే కాన్షీజీ నన్ను ఫస్ట్ బెంచ్లోకి తెచ్చేశారు. ఆ రోజు – ఢిల్లీలో, ఇందర్పుర్లోని మా ఇంటిని వెతుక్కుంటూ ఆయన వచ్చినప్పుడు, నా పుస్తకాల గుట్టల్లోంచి తలెత్తి మొదటిసారిగా నేను ఆయన్ని చూశాను.‘‘అమ్మాయీ... నా పేరు కాన్షీరామ్. యూనియన్ హెల్త్ మినిస్టర్ రాజ్ నారాయణ్ అంతటివారితోనే కాన్ స్టిట్యూషన్ క్లబ్లో వాదించావట కదా! మాతో కలుస్తావా? దళిత ఉద్యమానికి నీ ఆవేశం, నీ మాటల ప్రవాహం అవసరం...’’ అన్నారు! ‘‘కానీ కాన్షీ రామ్‌జీ! శ్రీ రాజ్ నారాయణ్‌తో నేను వాదించలేదు. దళితులను ఆయన గౌరవంగా ‘హరిజనులు’ అనటం పైన మాత్రమే నా అభ్యంతరం తెలిపాను. ‘దళితులను దళితులు అనే అనండి, అదే మీరు వారికిచ్చే గౌరవం’ అన్నాను. ఆ రోజు ఆడియెన్స్‌లో మీరున్నా అదే మాట అని ఉండేవారు కాన్షీజీ. అంబేద్కర్ కూడా ‘దళితులు’ అనే అన్నారు తప్పితే, మృదువుగా ‘హరిజనులు’ అనలేదు కదా...’’ అని నేను అన్నాను. కాన్షీజీ కళ్లు మెరిశాయి. ‘‘నువ్వు మాతో ఉంటే బాగుంటుంది అమ్మాయీ...’’ అని మళ్లీ అన్నారు. ‘‘నేను ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతున్నాను కాన్షీజీ. ఐఏఎస్ ఆఫీసర్ని అవాలి’’ అన్నాను. ‘‘మంచి విషయమే అనుకో! కానీ, ఒక ఐఏఎస్ కాదు, మొత్తం ఐఏఎస్‌లంతా నీ ఆదేశాల కోసం వరుసలో నిలబడేంత పెద్ద నాయకురాలిని చేస్తాను నిన్ను... మాతో వస్తావా...’’ అన్నారాయన! ఆ మాట నాకు ఇన్ స్పైరింగ్‌గా అనిపించింది. ఒకవేళ ఆయన, ‘‘పెద్ద నాయకు రాలు అవటం ఏముంది? పెద్ద నాయకురాలి ఆదేశాల కోసం వరుసలో నిలబడే ఐఏఎస్‌లలో ఒకరిగా ఉండటమే గొప్ప...’’ అని అన్నా కూడా ఆ మాట నాకు ఇన్ స్పైరింగ్గానే ఉండేది. కాన్షీజీ మాటల్లోని అదను, పదును అది! ఇవాళ కాన్షీజీ జయంతి! మిగతా పార్టీల్లా, కాన్షీజీ జయంతి రోజు మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీకి సూర్యోదయం నీలి వర్ణంలో అవదు. -
రెండు పడవల ప్రయాణం మంచిదే!
ఇక్కడ ఇలా న్యూయార్క్‌లో రోజ్ హిల్‌పై నిలబడి స్నాతకో పన్యాసం చేసే అవకాశం దక్కడం నాకు సంతోషంగా ఉంది. ఇదే ఫాదమ్ యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తిని ఈ ఆవరణలోని చర్చిలోనే పెళ్లాడాను. నేను ఫాదమ్ నుంచి పట్టభద్రు రాలినైనపుడు స్నాతకోపన్యాసం చేసిన వ్యక్తి, అందరూ ఇచ్చే సలహాలనే ఇచ్చారు. కలలను సాకారం చేసుకొమ్మన్నారు. కష్టపడి పనిచేయమన్నారు. ప్రపంచానికి ఏదైనా నవ్యతను చూపమన్నారు. అది తప్పకుండా సరైన సలహానే! కానీ, ఎవరూ చెప్పని ముఖ్యమైన విషయం ఒకటుంది. నేను అది 22 ఏళ్ల వయసులోనే గ్రహించి ఉంటే బాగుండేదనిపిస్తోంది! ఊగిసలాట ఎటూ వెళ్లనివ్వదు!అందరూ వెళ్లే ఉపాధి దారిలో వెళ్లాలా? లేక అభిరుచిని బట్టి జీవించాలా అనే ఊగిసలాటను వదిలేయండి. ఒకే సమ యంలో ఈ రెండింటినీ హాయిగా అనుసరించవచ్చు. అది రెండు పడవల ప్రయాణం కాదా అనుకోకండి! అయితే మాత్రం ఏమిటి? నిజం చెప్పాలంటే, అదే సరైన మార్గం. నాకు ఇది ఎవరూ చెప్పలేదు. నా స్వానుభవాన్నే వివరిస్తా. ఇక్కడ చదువు కుంటున్నప్పుడే రచనా వ్యాసంగంలో మునిగిపోయాను. ఒక వార్తా పత్రికకు పని చేసేదాన్ని. ఆ పత్రిక ఇయర్ బుక్ రూపొందించడంలో లెక్కలేనన్ని గంటలు గడిపాను. వార్తా కథనాలు రాయడం, ఇంటర్వ్యూలు చేయడం, అచ్చులో నేను రాసిన వాటిని చూసుకోవడం నాలో జవజీవాలను నింపేవి. నా రచనలు నేనేమిటో తెలిపాయి. రచయితగా రాణించాలన్నదే నా కల. అలా అభిరుచి ననుసరించి నడచుకోవడంతో, ప్రపంచానికి ఏదో అర్థవంతమైన దానిని అందిస్తున్నానని సంతృప్తిగా ఉండేది. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేసరికి నేనూ మనలో చాలామంది లాగానే ఆలోచించాను. చదువుకు చేసిన రుణాలు తీర్చాలి. కుటుంబం నా మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలి. దాంతో రచనా వ్యాసంగం కుదిరే పని కాదని అనిపించింది. ఏదైనా ఉద్యోగం చూసుకుని, అందులో స్థిరపడిన తర్వాత రచనలు కొనసాగించవచ్చు అనుకున్నాను. మొదట ఆఫీస్ మేనేజర్‌గా చేరాను. ఒడుదొడుకులు లేని ఉద్యోగం. గౌరవ ప్రదమైంది. ఆరోగ్య బీమా సదుపాయం కూడా ఉంది. ఠంచనుగా జీతాలిస్తారు. ‘ఇది తాత్కాలికమే. ఆర్థికంగా పునాదులను పటిష్ఠపరచుకుని, పరిస్థితులు కుదుటపడ్డాక నేను ఇష్టపడే జర్నలిజంలోకి దూకేస్తానులే! అని నాకు నేను సర్ది చెప్పు’ కున్నాను. వాయిదా వేస్తే కలలు ఫలించవు!మనకు మక్కువ ఉన్న దానిపై దృష్టి పెట్టకపోతే తాత్కా లికం అనుకున్న పరిస్థితులు శాశ్వతమై కూర్చుంటాయి. ఏళ్లు గడిచాయి. పెళ్లయింది. ముగ్గురు పిల్లల తల్లినయ్యాను. జీవితంలో ఒక్కొక్క దశ గడుస్తున్నకొద్దీ నాకు ఎంతో ఇష్టమైన రచనా వ్యాసంగం కూడా దూరమవుతూ వచ్చింది. అందుకు కారణం నాకు ఇష్టం తగ్గడం కాదు. ‘‘కుదిరితేనే ఇష్టపడే రంగంలోకి వెళ్లాలి. లేకపోతే, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి’’ అనుకోవటమే నేను చేసిన తప్పు. మీలో కొందరు వైద్యం, న్యాయం, పూర్తి సమయం కేటాయించవలసిన తదితర వృత్తుల వైపు మళ్లవచ్చు. మీరు ఇష్టపడి చేయాలనుకుంటున్న పనికీ, వాటికీ పొంతన కుదరదు అనిపించవచ్చు. కానీ, ఆ రంగాలలో ఉంటూ కూడా మీరు మీకు ఇష్టమైన వ్యాసంగాన్ని విడిగా కొనసాగించవచ్చు. ఉద్యోగం చేసుకుంటూనే ఇతర ఆసక్తులను స్వీకరించవచ్చు. ఏదైనా ఒక ప్రయోజనం కోసం పాటుపడ వచ్చు. కోరుకునే పరిపూర్ణమైన జీవితాన్ని గడించుకోవచ్చు. మీ కలలను సాకారం చేసుకునేందుకు మిగిలిన అవకాశాలన్నింటినీ కాలదన్నుకోనవసరం లేదు. నేను కూడా నా రచనా వ్యాసంగాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చి ఉండవలసింది. భోజన విరామ సమయాలలో ఏ ఆర్టికల్స్ రాస్తే బాగుంటుందో ఆలోచించుకుంటూ వారాంతాలలో ఫ్రీలాన్సింగ్ చేసుకుని కూడా ఉండవచ్చు. కానీ అలా చేయలేకపోయాను. ఎవరికి వారే సృష్టించుకోవాలి!‘ఏదో ఒక నాడు’ నా కలలను నెరవేర్చుకుంటాననే మూస ధోరణిలో నేను ఉండిపోయాను. అన్నీ కలిసొచ్చే రోజు ఏదో ఒకనాడు వస్తుందని నాకు నేను చెప్పుకుంటూ రోజులు దొర్లించాను. వాస్తవం ఏమంటే, ఆ ‘ఏదో ఒక నాడు’ దానంతట అది రాదు. దాన్ని మనమే సృష్టించుకోవాలి. ఎట్టకేలకు నేను వృత్తిపరంగా రాయడం మొదలుపెట్టాను. కానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ విధంగా మొదలుపెట్టగలిగి ఉండేదాన్నో ఆ తర్వాత కూడా అదే విధంగా శ్రీకారం చుట్టవలసి వచ్చింది. దాంతో నాకు ఇష్టమైన రంగంలో స్థిరపడేందుకు మామూలుగా పట్టాల్సిన దానికన్నా ఎక్కువ కాలమే పట్టిన మాట నిజం. కానీ, ఆ ప్రయాణం నాలో మనోనిబ్బరాన్ని ఏర్పరచింది. జీవితానుభవా లను కలిగించింది. అవి నా రచనలను పరిపుష్టం చేశాయి. విజయం సాధించేందుకు ‘సరైన ముహూర్తం’ పెట్టుకోనవసరం లేదని గ్రహించాను. మీరు కంటున్న కలలకు మీరున్న పరిస్థి తులు అనువుగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడు న్నారో అక్కడ నుంచే, అందుబాటులో ఉన్నవాటితోనే అభిరు చికి తగ్గ పనికి శ్రీకారం చుట్టవచ్చు. ఈ క్షణం నుంచే ఆ పని మొదలుపెట్టవచ్చు. మీకో నెట్వర్క్ నిర్మించుకోండి!ఏ పనైతే మీలో కళాకాంతులను నింపుతుందో ఆ పనిని త్యజించేందుకు బాధ్యతను ఒక సాకుగా చూపే ప్రయత్నం చేయకండి! ఉదాహరణకు, మీరు చిత్ర దర్శకులు కాదలచుకుంటే, నెలకొక చిన్న వీడియో మీ ఫోన్‌తో తియ్యండి. ఆన్లైన్లో పోస్ట్ చెయ్యండి. వీక్షకుల స్పందనల నుంచి పాఠాలు నేర్చుకోండి. లాభాపేక్ష లేని సంస్థను నెలకొల్పదలిస్తే, ఉద్యోగం సజావుగా చేసుకుంటూనే, ప్రతి శనివారం రెండు గంటలు స్వచ్ఛంద సేవకు వెచ్చించండి. వ్యాపార సంస్థను ఏర్పాటు చేయదలిస్తే, వచ్చే ఆరు నెలలపాటు ప్రతి ఆదివారం, మీ వ్యాపార ప్రణాళికకు మెరుగులు దిద్దుకుంటూ రండి. ఒక నెట్ వర్క్‌ను నిర్మించుకోండి. నారు, నీరు పూర్తిగా మీ బాధ్యతే!ఇపుడు మనం నివసిస్తున్న కాలం మనకు ఎన్నో అవకా శాలు కల్పిస్తోంది. ఆన్లైన్ వేదికల ద్వారా రచనా సామర్థ్యాన్ని వృత్తి జీవితంగా మలుచుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా ఫోటోగ్రఫీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా కన్సల్టింగ్ ప్రాక్టీసు ప్రారంభించవచ్చు. నిధుల సేకరణ ద్వారా సృజనాత్మక ప్రాజెక్టుకు కార్యరూపం ఇవ్వ వచ్చు. ఇవన్నీ, చేస్తున్న ఉద్యోగం మానకుండానే చేయవచ్చు. అదో ఇదో – ఏదో ఒకటే అనుకోవద్దు! రెండింటినీ నిర్వహించ గలమని అనుకోండి. మీరు ఆచరణాత్మకంగానూ ఉండవచ్చు, మక్కువ కలిగిన దానినీ చేపట్టవచ్చు. బాధ్యతాయుతంగా మెలగుతూనే, రిస్క్ తీసుకునేందుకు మొగ్గు చూపవచ్చు. దేనికీ లోటు లేకుండా చూసుకుంటూనే కలలను కార్యరూపంలో పెట్ట వచ్చు. అయితే, కలలను నిజం చేసుకోవాలనే బలమైన కోరిక అవసరం. దానికి నారు, నీరు పోసే బాధ్యత మీదే! నాకు 22 ఏళ్ల వయసప్పుడే నాకు ఎవరన్నా ఈ సంగతి చెప్పి ఉండాల్సిందని నేను అనుకునే మరో సంగతిని మీకు ఇప్పుడు చెబుతాను. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేక పదం కాదు. విజయంలో అదొక భాగం. నేను రాసిన వాటిలో ఎడిటర్ తిర స్కరించిన ప్రతి వ్యాసమూ, నా కళకు, పరిశ్రమకు సంబంధించి నాకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూ వచ్చింది. నేను పూర్తి చేసిన ప్రతి ఫ్రీలాన్స్ ప్రాజెక్టు, నాకు పారితోషికం పెద్దగా తెచ్చిపెట్టనివి కూడా, నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు, ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప జేసుకునేందుకు సహాయపడ్డాయి. ప్రయత్న లేమి... నిజమైన వైఫల్యం!మీరు అనుకుంటున్న దానికన్నా మీరు ఎక్కువ సమర్థులనీ, చతికిలపడినా తిరిగి నిలబడగల శక్తి మీలో ఎక్కువే ఉందనీ, మీరూ సృజనశీలురేననీ గుర్తు పెట్టుకోండి. అన్నింటి పైనా ఈరోజే అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగ భద్రత – మనం కంటున్న కల, రెండి టిలో ఏదో ఒక దానినే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. చిన్న అడుగులు వేయడంతో ప్రారంభించండి. తప్పటడుగులైనా ఫరవాలేదు. నడక మొదలెట్టడం ముఖ్యం. అవసరాలు తీర్చగల ఉద్యోగంలో చేరండి. కానీ, అది మీ ఆత్మను మింగేయకుండా చూసుకోండి! ఆచరణాత్మక పంథాను అనుసరిస్తూనే, కలల బాటను కూడా సజీవంగా ఉంచుకోండి. వయోజనులుగా బాధ్యతతో మెలగండి. కానీ, వయసు మోసుకొచ్చే బాధ్యత మీ కలలను సమాధి చేయకుండా చూసుకోండి. భద్రతతోపాటు అనిశ్చితిని కూడా అక్కున చేర్చుకోండి. ఉద్యోగాలు చేస్తూనే, సొంత కలలను సాకారం చేసుకోండి. అది మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని నమ్మండి. -
ఏం కావాలో ‘ట్రంప్’కు తెలుసు!
‘ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు’ అని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తనకి ఏమి కావాలో ట్రంప్‌కు బాగానే తెలుసు. తెలియంది తల్మీజ్కే! ఇరాన్లో చమురు ఉంది. గ్యాస్ ఉంది. అది తనకి కావాలి. ఈ మాట మనం చెప్పడం కాదు; ట్రంపే స్వయంగా చెప్పాడు. 2019లో సిరియా యుద్ధం గురించి మాట్లాడుతూ ‘ఆ చమురు మనదే. దాన్ని మనమే ఉంచుకోవాలి అని నేను ఎప్పటినుంచో చెబు తున్నాను’ అని అన్నాడు. ఇరాన్ సుమారుగా 4,800 పై చిలుకు బావులున్న ప్రాంతం. వాటి మీద అనాదిగా అమెరికా కన్ను ఉంది.‘ఇరాన్ అణ్వాయు ధాల్ని తయారు చేస్తుంది అందుకే దాడుల్ని చేశాము’ అనేది పైకి చెప్పే మాట. చమురు, గ్యాస్ ఉన్న ప్రాంతాలన్నిటినీ కబళించాలనేది అమెరికా చిరకాల వాంఛ. ఇరాక్, లిబియా, సిరియాల మీదా అందుకే దాడి చేసింది. అవి ఆక్రమణలోకి రాక పోవొచ్చు. అది వేరే సంగతి. ‘అవి రావు’ అని కూడా అమెరికాకు తెలుసు. కానీ తన ప్రయత్నం మానదు. అ ప్రయత్నం వల్ల కొంత లొంగుబాటు ఉంటుంది. రాజీలు ఉంటాయి. టెక్నాలజీ పేరుతో ప్రపంచంలో పెద్ద చమురు కంపెనీలైన ఎక్సోనా మొబైల్, చెవ్రోనా (అమెరికా), బీపీ (బ్రిటన్), షెల్ (నెదర్లాండ్), టోటల్ ఎనర్జీస్ (ఫ్రాన్స్) లాంటి కంపెనీలను అక్కడ దించుతుంది. ఎక్కువ కమి షన్లను రాబడుతుంది. ఇది ఇప్పటి కథ కాదు, అనాదిగా జరుగుతున్నది ఇదే! ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో చమురు ఉంది. కానీ టెక్నాలజీ ఉండేది కాదు. 1940–1970 మధ్యకాలంలో ‘సెవెన్ సిస్టర్స్’ అని పెద్ద చమురు కంపెనీలు ఉండేవి. ఇవి ఆ యా దేశాల్లోకి వెళ్లి తక్కువ ధరలకే ఒప్పందాలు చేసుకుని, ఎక్కువ లాభం వేసుకునేవి. ఈ దోపిడీని భరించలేక, 1960లో కొన్ని చమురు దేశాలు కలిసి ‘ఒపెక్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సంస్థ ద్వారా చమురు ధరలపై ఆ యా దేశాల స్వయం నియంత్రణ పెంచడం, పాశ్చాత్య కంపెనీల ప్రభావాన్ని తగ్గించడం చేశాయి. 1973లో జరిగిన ఒక పెద్ద సంఘటన ప్రపంచ చమురు రాజకీయాలను పూర్తిగా మార్చింది. దీనిని ‘చమురు ఆయుధం (ఆయిల్ వెపన్)’ అని అంటారు. 1973లో మధ్యప్రాచ్యంలో ‘యోమ్ కిప్పూర్’ పేరుతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది. దానికి ప్రతిగా చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు ‘అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు చమురు అమ్మకాలు ఆపివేయాలి’ అని ఒక నిర్ణయం చేశాయి. దీంతో ప్రపంచంలో పెద్ద సమస్య వచ్చింది: చమురు ధర 4 రెట్లు పెరిగింది. ఈ యుద్ధం వలన కూడా మళ్లీ అలాంటి సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు! – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త -
అణ్వస్త్రాలతో సర్వత్రా కలవరం!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఘర్షణలు ప్రపంచాన్ని మరోసారి అణ్వస్త్ర యుద్ధం ముంగిట నిలిపాయి. అణు శక్తి సదుపాయాలపై దాడులు జరిగిన సూచనలు ఇంతవరకు అయితే ఏవీ లేవని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) పేర్కొంది. అయితే, ఈ ప్రాంతీయ యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగానికి అవ కాశం హెచ్చుగానే ఉంది. ఇరాన్, ఇజ్రా యెల్‌తో పాటు సైనిక దాడులను ఎదు ర్కొంటున్న ఆ ప్రాంతంలోని అనేక ఇతర దేశాల్లో అణు విద్యుదు త్పాదన కేంద్రాలున్నాయి. అణు పరిశోధనా రియాక్టర్లతో పాటు, అణు ఇంధన స్టోరేజి సదుపాయాలున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నాలుగు అణు రియాక్టర్లున్నాయి. జోర్డాన్, సిరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలు ఏదో ఒక రూపేణా అణుశక్తిని వినియోగించుకుంటున్నాయి. ‘ఫిసైల్’పై చర్చలు ముగియక ముందే..!ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి ఆలంబనగా నిలుస్తు న్నట్లు అనుమానిస్తున్న సదుపాయాలపై ఇజ్రాయెల్–అమెరికా 2025 జూన్‌లో వైమానిక దాడులకు దిగినపుడు కూడా ఇదే రకమైన ఆందోళనలు పొడసూపాయి. రష్యా–ఉక్రెయిన్ వంటి ఇతర అణ్వా యుధ ప్రయోగావకాశ ఘర్షణలు గత ఏడాది కూడా గుబులు రేపాయి. బులెటిన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ అనే బృందం అణు వినాశనం సంభవించగల సమయానికి సంబంధించిన అంచనా లను వెల్లడిస్తూ ఉంటుంది. ఇరాన్ శుద్ధి చేసినట్లుగా భావిస్తున్న 400కు పైగా కిలోల యురేనియంను దృష్టిలో పెట్టుకుని, 2026 జనవరిలో ఓ రోజు అర్ధరాత్రికి 85 సెకన్ల ముందు అది ఆ అవకా శాన్ని సవరించింది. శుద్ధి చేసిన యురేనియంలో 60 శాతం ఫిసైల్ యురేనియం 235 ఐసోటోప్ ఉంది. అంటే, దాన్ని మరింత శుద్ధి చేయనవసరం లేకుండానే ఆ యురేనియంతో పెక్కు అణ్వా యుధాలు తయారు చేయవచ్చు. ఈ ఫిసైల్ పదార్థ వాడకం గురించి ఓ పక్క చర్చలు కొనసాగుతూండగానే ఇరాన్‌పై ఇటీవల అమె రికా–ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. గత ఏడాదే ముంచుకొచ్చిన ముప్పు!ఇరాన్లో అణుశక్తి మౌలిక వసతులు విస్తృతంగానే ఉన్నాయి. అది పైకి ప్రకటించిన సదుపాయాలే 13 నడుస్తున్నాయి. టెహ్రాన్ రిసెర్చ్ రియాక్టర్, ప్రాసెస్ రిసెర్చ్ ఫెసిలిటీ, మోలిబ్డెనమ్ అయోడిన్ అండ్ జినాన్ (ఎం.ఐ.ఎక్స్.) రేడియో ఐసోటోప్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, జబార్ ఐబిన్ హయన్ మల్టీపర్పస్ ల్యాబొరేటరీస్, మినియేచర్ న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్, లైట్ వాటర్ సబ్–క్రిటికల్ రియాక్టర్, హెవీ వాటర్ జీరో పవర్ రియాక్టర్, 10 మెగావాట్ల ఇస్పహాన్ రిసెర్చ్ రియాక్టర్, కరాజ్ వాటర్ స్టోరేజి ఫెసిలిటీ, బుషెహర్ అణు విద్యు దుత్పాదన కేంద్రానికి చెందిన నాలుగు యూనిట్లు, కరున్ న్యూక్లి యర్ పవర్ ప్లాంట్ వంటివి ఆ కోవలోకి వస్తాయి. గత ఏడాది జూన్‌లో జరిగిన దాడుల్లో ఫోర్డౌ వంటి కొన్ని సదుపాయాలు దెబ్బ తిన్నాయి. కోర్ రియాక్టర్లు చెక్కు చెదరకపోవడంతో అణు ధార్మికత లీక్ అవలేదు. సంరక్షణ చర్యలకు వీలుగా ఇరాన్ ఆ తర్వాత నూతన ఇస్పహాన్ అణు ఇంధన శుద్ధి కేంద్రం గురించి ఐఏఈఏకి తెలియ జేసింది. కానీ, ఆ కేంద్రం తనిఖీ ప్రక్రియ ఇంకా మొదలు కానేలేదు. తాజా విడత దాడుల్లో ఇస్పహాన్ లేదా మరి ఏ ఇతర అణు శక్తి సదుపాయమైనా దెబ్బతిన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. గడువు తీరిన ‘తగ్గింపు ఒడంబడిక’ మరొకవైపు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం వంటి అంత ర్జాతీయ ఒడంబడికల వల్ల సాధించిన పురోగతి ఏమీ కనిపించడం లేదు. పైగా, కొన్ని దేశాలు తమ అణ్వాయుధాలకు సాంకేతిక పరంగా మరింతగా పదును పెట్టుకుంటున్నాయి. ఈ స్థితిలో కొత్త అణ్వాయుధ పోటీ మొదలైనా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇటువంటి వాటిలో కడపటి ఒప్పందంగా చెప్పదగిన, అమెరికా–రష్యాల మధ్య నున్న నూతన వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒడంబడిక (న్యూ స్టార్ట్) గడువు 2026 ఫిబ్రవరి 5తో ముగిసింది. ఇన్నాళ్లూ (1971 నుంచి) ఆ ఒడంబడిక ఆ రెండు దేశాల అణ్వాయుధ శక్తులను పరి మితం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ రెండు దేశాలూ తమ వద్ద ఉంచుకోదగిన వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యకు సంబంధించి ఎటు వంటి పరిమితికీ చట్టబద్ధంగా కట్టుబడి ఉండనవ సరం లేదు. ‘పరిమితం’తో ఒరిగేదేమీ లేదు!అసలు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలవడంతోనే పరిమిత అణుయుద్ధ భావన తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అది చర్చకు వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రపంచ అణు యుద్ధానికి పురికొల్పకుండా, తమ నిర్దిష్ట సైనిక లేదా రాజ కీయ లక్ష్యాల సాధనకు పరిమితమైన రీతిలో అణ్వాయుధాలను ఉపయోగించుకుని యుద్ధం చేయడం గురించిన ఆలోచన 1980ల నుంచి ఉంది. వ్యూహాత్మక, రక్షణ నిపుణులు అడపాదడపా దానిపై చర్చిస్తూనే ఉన్నారు. పరిమిత అణు యుద్ధంలో పాల్గొనే దేశాలు తాము ప్రయోగించే అణ్వాయుధాల సంఖ్యలో, అవి విడు దల చేయగల శక్తిలో, లక్ష్యాలను ఎంచుకోవడంలో కొంత నిగ్రహాన్ని పాటిస్తాయన్నమాట. సిద్ధాంతపరంగా దాన్ని ‘పరిమిత’ యుద్ధంగానే పరిగణించవచ్చునేమో కానీ, అణ్వాయుధాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలదు. దౌత్యం ఒక్కటే నివారణ మార్గం!ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్ర ఆందోళనదాయకంగా ఉంది. అణు ధార్మికత విడుదలకు గల అవకాశాన్ని ఐఏఈఏ తోసిపుచ్చలేదు. పెద్ద నగరాలను మించిన విస్తృత ప్రాంతాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవలసి ఉంటుంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదన్నదే (మొదట్లో అనుకున్నట్లుగా) అమె రికా, దాని మిత్రపక్షాల లక్ష్యమైతే, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రాసి చెప్పినట్లుగా, రెండు పక్షాలూ దౌత్యానికీ, చర్చ లకూ తప్పనిసరిగా తిరిగి ఉపక్రమించాలి. అణు జ్వాల రేగకుండా నివారించేందుకు అదొక్కటే నివారణ మార్గం. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
అద్భుత విజయం... అనేక సవాళ్లు
నేపాల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా చూసినా అక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన విజయం అనాలి. అట్లాగే ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాళ్లు కానున్నాయి. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు ఇంతవరకు పాలించిన పార్టీల వైఫల్యం వల్ల తీవ్ర రూపానికి వచ్చినందున, అవి సులభంగా పరిష్కారమయేవి కావని వేరే చెప్పనక్కరలేదు. కొత్త ప్రధాని బాలేంద్ర షా ప్రభుత్వం ఆ దిశగా ఎట్లా పురోగమించగలదన్నదే ఇక గమనించవలసిన విషయమవుతున్నది. అందుకోసం వెంటనే కనిపిస్తున్న ఒక సానుకూల స్థితి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్.ఎస్.పి.)కి సుస్థిరమైన ఆధిక్యత లభించటం. 2008లో రాచరికం రద్దయి పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఈ 18 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారటమనే అసాధారణ స్థితిని బట్టి దేశంలో ఎంతటి అస్థిరత కొనసాగిందో గ్రహించవచ్చు. వాస్తవానికి 3 ప్రధాన పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్(యూఎంఎల్), మావోయిస్టు పార్టీలలో దేనికీ పూర్తి ఆధిక్యత రాకున్నా ఏ ఇద్దరో కలిసి తగిన మెజారిటీతోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. అటువంటప్పుడు 5 ఏళ్ళ పాటు పాలించేందుకు సమస్య ఉండకూడదు. గత 18 ఏళ్ళలో 4 ప్రభుత్వాలే రావాల్సింది. కానీ కేవలం పార్టీ నాయకుల అధికార దాహం, అవకాశవాదం, అవినీతి వల్ల ఏ ప్రభుత్వమూ సరిగా సాగలేదు. ఫలితంగా అస్థిరత అన్నది పరిపాలనా వైఫల్యాల కన్నా పెద్ద సమస్యగా మారింది. అనుభవం లేకపోయినా...ఎన్నికల ఫలితాలు కూడా జెన్–జీ తిరుగుబాటును పోలిన భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. తక్కిన మూడు పార్టీలు దశాబ్దాలుగా ఉన్నవి కాగా, ఇపుడు గెలిచిన ఆర్ఎస్పి కేవలం 2022లో ఏర్పడినట్టిది. దానిని స్థాపించిన రబీ లమిఛానే రాజకీయానుభవం ఎక్కువేమీ కాదు. గత ఎన్నికలలో సుమారు 20 సీట్లు గెలిచి కె.పి. శర్మ ఓలీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయిన తను, తర్వాత బయటకు వచ్చి స్వతంత్ర రాజకీయం సాగించారు. ఆయనకు రాజకీయ నాయకునిగా కన్నా జర్నలిస్ట్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా ఎక్కువ పేరుండటం గమనించదగ్గది. తన వృత్తి పరమైన కార్యక్రమాలలో ఆయన మూడు పార్టీలను తీవ్రంగా విమర్శిస్తుండేవారు. విశేషమేమంటే, అదే పద్ధతిలో విమర్శిస్తుండిన ర్యాప్ సింగర్ బాలేంద్ర షా, రాజకీయ అనుభవం ఎంత మాత్రం లేకున్నా, ఖాఠ్మండు మేయర్ పదవికి 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 61,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మంచి పనులు అనేకం చేసి ప్రజాదరణను మరింత పెంచుకుని, జెన్–జీ మద్దతుతోనే మధ్యంతర జస్టిస్ కర్కీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఇదంతా చెప్పటం ఎందుకంటే, ఇంచుమించు ఒకే విధమైన నేపథ్యాలు ఉండిన, అవి కూడా కొద్ది కాలపు అనుభవంతోనే కూడుకున్నవి అయినా, లమిఛానే, బాలేంద్ర షా కలిసి పాత పార్టీలను చిత్తు చేసి గత 18 ఏళ్ల పరిస్థితికి భిన్నంగా ఇపుడు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. వీరిద్దరికీ తమ స్థానాలలో ఘనమైన మెజారిటీలు రావడం, బాలేంద్రతో పోటీ పడిన మాజీ ప్రధాని ఓలీ తీవ్ర పరాభవానికి గురి కావటమన్నది జెన్–జీ తరంతో పాటు మొత్తంగా ప్రజలలోనే నెలకొన్న ఆలోచనలకు అద్దం పడుతున్న పలు దృష్టాంతాలలో కొన్ని మాత్రమే!మట్టి కరిచిన పార్టీలకు సంబంధించి చెప్పుకోక తప్పని విశేషం మరొకటి విశేషం. నేపాలీ కాంగ్రెస్ గత శతాబ్దం మధ్య నుంచే భారతదేశంలోని కాంగ్రెస్ స్ఫూర్తితో, మద్దతుతో రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం తీవ్రమైన ఉద్యమాలు సాగించింది. కొన్ని దశలలో ఆయుధాలు సైతం చేపట్టింది. కొంతకాలం తర్వాత మరొకవైపు కమ్యూనిస్టులు, వారి నుంచి చీలిన మావోయిస్టులు తమ ఉద్యమాలు తాము సాగించారు. చివరకు రాజరికం రద్దయి ప్రజాస్వామ్యం, కొత్త రాజ్యాంగం, ప్రజాస్వామిక పద్ధతి ఎన్నికలు అమలులోకి వచ్చాయి. ఇటువంటి గొప్ప నేపథ్యాలు గల పార్టీలు అధికారం సాగించినపుడు ఏవో కొన్ని వైఫల్యాలున్నా మొత్తం మీద తమ పాలన సుస్థిరంగా సాగి, తగినంత అభివృద్ధిని సాధిస్తూ, నీతిబద్ధమైన ప్రభుత్వాన్ని నడపవలసింది. కానీ అది జరగక, ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’ నేపాలీ కాంగ్రెస్‌తో పాటు, అన్ని రంగుల కమ్యూనిస్టులూ దారుణంగా విఫలమయ్యారు. ఇపుడు అంతే దారుణంగా ఓడారు. సిద్ధాంతం ఏమిటి?ఈ నేపథ్యమంతటిని బట్టి చూసినపుడు, నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసి, కొత్త అధ్యాయం మొదలవుతున్నట్లు స్పష్టంగా చెప్పవచ్చు. ఆ కొత్తదనం ఏమిటన్నది తెలియవలసిన విషయం. స్థిరత్వం ఒకటన్నది పైన చూశాము. అది కాక ముఖ్యమైనవి రెండుంటాయి. ఒకటి– ఇంతకాలం పాలించి విఫలమైన పార్టీలకు వలెనే ఆర్ఎస్పీకి గానీ, ఆ పార్టీ నాయకులు ఇద్దరికి గానీ ‘సిద్ధాంతాలు’ అనదగ్గవి ఏమైనా ఉన్నాయా? రెండు – సిద్ధాంతాల మాట అట్లుంచి పరిపాలన గురించి వారి ఆలోచనలు ఏమిటి? ఇంతవరకు తమ సిద్ధాంతాలు ఇవీ అంటూ ఇదమిత్థంగా ఏమీ ప్రకటించలేదు. లమిఛానే 2022 నుంచి ఒక పార్టీ వ్యవస్థాపకునిగా గానీ, బాలేంద్ర షా అదే సమయం నుంచి ఖాఠ్మండు నగరానికి మేయర్‌గా గానీ, ఇద్దరూ జతకలిసిన ప్రస్తుత ఎన్నికల సమయంలో గానీ, సాధారణ రూపంలో వారి మాటలు చేతలను బట్టి మనమే ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు ఆర్ఎస్పీ ఈ ఎన్నికల కోసం ప్రకటించిన మేనిఫెస్టో ఉంది. వీటన్నింటిని పరిశీలించినపుడు కలిగే అభిప్రాయం ఇద్దరు కూడా మధ్యేమార్గవాదులు. నిర్దిష్టమైన సిద్ధాంతాలుండిన పాత పార్టీలను వాటి వైఫల్యం కారణంగా ప్రజలు తిరస్కరించటం, ఆ పార్టీల నాయకుల వలెగాక వీరిద్దరిది యువతరం కావటం వారి మధ్యేమార్గానికి కారణమనుకోవాలి. జెన్–జీ తరం, ప్రజలూ గత ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై ఆగ్రహించినందున, తమ పాలన అందుకు భిన్నంగా ఉండగలదని ఎన్నికల మేనిఫెస్టోలో వివరించారు. అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనలకు వ్యతిరేకత, రాజ్యాంగం చెబుతున్నదానికి కట్టుబడటం, పారదర్శకత వంటివి అందులో కనిపిస్తాయి. అసలు పరీక్ష ఇతరత్రా ఉండబోతున్నది. అది వారు లక్ష్యాలుగా ప్రకటించినట్లు దేశంలో ఉత్పత్తిని పెంచి జీడీపీని 50 బిలియన్ డాలర్ల నుంచి రెట్టింపు చేయటం, తలసరి ఆదాయాన్ని అయిదేళ్ళలోనే 1,447 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెంచటం, 12 లక్షల ఉద్యోగాల సృష్టి, తద్వారా వలసల తగ్గింపు, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం వంటివన్నీ భారీ సవాళ్లు కానున్నాయి. దేశంలో అందుకు అవసరమైన సహజ వనరులు, పరిశ్రమలు లేక లోపలి నుంచీ బయటి నుంచీ పెట్టుబడులు పరిమితం అయి, విదేశీ సహాయ నిధులు కూడా అంతే అయినపుడు, ఈ లక్ష్యాల సాధన తేలిక కాదు. అయితే, సుస్థిరత కారణంగా పరిపాలన కూడా సమర్థంగా సాగితే ప్రభుత్వం పట్ల ఇంతవరకు లేని విశ్వాసం ఏర్పడి పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఒత్తిళ్లకు జడ్జీలు లొంగిపోకూడదు!
వలస పాలనకు వ్యతిరేకంగా అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించు కున్న స్వాతంత్య్రం ఫలితంగా భారత రాజ్యాంగం ఆవిర్భవించింది. రాజ్యాంగ తత్వాన్ని ప్రగాఢంగా గమనిస్తే అది చరిత్రను దృష్టిలో పెట్టుకుని సాగినదిగా తేలుతుంది. రాజ్యాంగం రూపొందుతున్న ప్పుడే అది పరివర్తనీయతను కూడా సంత రించుకుంది. చారిత్రక వారసత్వంగా వస్తున్న రెండు అన్యాయాలను అది చక్క దిద్దింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రాతినిధ్య ప్రజా స్వామ్యం మొదటి రూపాంతరీకరణకు గుర్తుగా నిలిచాయి. మరో విధంగా కూడా రాజ్యాంగం మార్పు తీసుకొచ్చింది. అది సమా జాన్ని పునర్నిర్మించింది. వేళ్లూనుకుని, విస్తరించి ఉన్న కుల, లింగ, వర్గ, జాతి తదితర వివక్షలను రూపుమాపింది. సామాజిక మార్పునకు పురిగొల్పే తత్వందక్షిణాఫ్రికా రాజ్యాంగాన్ని 1996లో రూపొందిస్తున్నప్పుడు ‘పరివర్తనాత్మక రాజ్యాంగవాదం’ అనే పదబంధం పుట్టుకొచ్చింది. కాకతాళీయంగా, ఆ రాజ్యాంగం ఈ ఏడాదితో మూడు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది. ‘‘చట్టంలో నిర్దేశించిన అహింసాయుత రాజ్యాంగ ప్రక్రియల ద్వారా భారీయెత్తున సామాజిక మార్పునకు పురిగొల్పే సాహసిక తత్వానికి పరివర్తనాత్మక రాజ్యాంగవాదం దర్పణంగా నిలుస్తుంది’’ అని అమెరికన్ విద్యావేత్త కార్ల్ క్లేర్ అంటారు. మన రాజ్యాంగం సరిగ్గా అలాంటిదే. అది 1949 నవంబర్ 26న మనం స్వీకరించినప్పటి నుంచి అలాగే ఉంది.మన రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగాన్ని ఒక సజీవవృక్షంగా భావించారు. అది శాఖోపశాఖలుగా విస్తరిస్తూపోతుంది. తరతరాలుగా అది నిలిచి ఉండాలని వారు కోరుకున్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, కోర్టుల ద్వారా మార్పు చోటు చేసుకుంటుందని మనందరికీ తెలిసిందే. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ అనే మూడు భావనల ద్వారా భారత రాజ్యాంగ పరివర్తనాత్మక దార్శనికతను స్థూలంగా మనం అర్థం చేసుకోవచ్చు. పేదరికం, నిరక్షరాస్యత, అంటరాని తనం, లింగ అసమానతల సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని వలస పాలనానంతర భారత దేశం గుర్తించింది. సామాజిక మార్పునకు చట్టం ముఖ్య ఉత్ప్రేరకంగా ఉంటుందని గుర్తించబట్టే వివక్షకు తావు లేని విధంగా సార్వత్రిక సమానత్వ హక్కులకు రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది.సౌభ్రాతృత్వం గురించి రాజ్యాంగ అవతారికలో స్పష్టంగా ప్రకటించారు. స్వేచ్ఛ, సమానత్వంతోపాటు సౌభ్రాతృత్వం కూడా సమసమాజ సాధనకు ఉపకరణంగా ఉంటుందని వారికి తెలుసు. పక్షపాతాలు, వివక్ష, ఆధిపత్య ధోరణి ఏనాటి నుంచో సమాజంలో ఉన్నవిగా చెప్పి తప్పించుకునే ప్రయత్నానికి అది అడ్డుకట్ట వేసింది. రాజకీయంగా ఒక సమూహంగా నిబద్ధులమై ఉండేందుకు అది సంకేతమిచ్చింది. మత విశ్వాసాలు, గుర్తింపులు, ఆచార విధానాలు ఆధిపత్య ధోరణికి లేదా పౌరులుగా ప్రత్యేక గుర్తింపునకు దారితీయడానికి లేదు. ప్రజాస్వామ్యం, దాని విలువలు మన సమాజంలో వేళ్ళూనుకునేటట్లు చేయడంలో అది గణనీయమైన పాత్ర వహించింది. పార్లమెంట్‌కు ఉన్న పరిధివ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా చూడటం పరివర్త నాత్మక రాజ్యాంగవాద అత్యంత ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. నచ్చినట్లుగా వ్యవహరించే, ఎంచుకునే, అసమ్మతి వ్యక్తం చేసే స్వేచ్ఛ పౌరులకు ఉంది. సమష్టి లేదా ప్రజాహితం పేరుతో వ్యక్తి గత స్వేచ్ఛను నీరుగార్చకుండా చూసుకోవాలి. అయితే, రూపాంత రీకరణతోపాటు సంయమనం కూడా అవసరం. మార్పు పేరుతో రాజ్యాంగం మౌలిక స్వరూపాన్నే మార్చేయకూడదు. రాజ్యాంగ పరంగానే అధికారాన్ని చెలాయిస్తున్నప్పటికీ, ఆ అధికారాన్ని వినియోగించడంలో కొన్ని పరిమితులున్నాయని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఈ సిద్ధాంతానికి బీజావాపన స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్ళలోనే పడింది. భూ సంస్కరణలు అమలు జరిపి, జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని పార్లమెంట్ కోరుకున్నప్పుడు, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రాజ్యాంగంలోని 368వ అధికరణం ప్రాథమిక హక్కులతో సహా వేటికీ మినహాయింపు లేకుండా రాజ్యాంగాన్ని సవరించే హక్కును పార్లమెంటుకు దఖలు పరుస్తోందని శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. తదనంతరం సజ్జన్ సింగ్ కేసులో కూడా అదే ప్రస్ఫుటమైంది. కాకపోతే, రాజ్యాంగానికి కొన్ని ‘మౌలిక స్వరూప స్వభావాలు ఉన్నా’యని జస్టిస్ ముధోల్కర్ పేర్కొన్నారు. ఆ తర్వాత, 1967లో గోలక్ నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించడానికి లేదంటూ సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. పార్లమెంట్ (1971లో) 24, 25, 29 సవరణల ద్వారా దాన్ని ఎదిరించే ప్రయత్నం చేసింది. ఈ వివాదం చరిత్రాత్మక కేశవానంద భారతి కేసుగా పరిణమించింది. రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకు ఉందికానీ, దాని మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.న్యాయమూర్తుల ధర్మంలిఖిత రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చిన రీతిలో సవరిస్తూపోతే అదొక సాధారణ శాసన రూపంగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అలాగని, అవసరమైనచోట కూడా సవరణలు చేపట్టకపోతే, కాలం చెల్లినదిగా తయారైపోయే ప్రమాదం ఉంది. ఆ విధంగా మౌలిక స్వరూప సిద్ధాంతం రాజ్యాంగం గుర్తింపును పరిరక్షిస్తూనే, అవసరమైన మార్పులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఒక విశిష్టతను సంతరించుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజ్యాంగాన్ని నీరుగార్చకుండా మౌలిక స్వరూప సిద్ధాంతం కాపాడుతోంది. కానీ న్యాయ సమీక్ష లేకపోతే, మౌలిక స్వరూప సిద్ధాంతం కేవలం నినాదంగా మిగిలిపోతుంది. అధికారాల విభజన, న్యాయవ్యవస్థకు స్వతంత్రత ఉన్నప్పుడే న్యాయవ్యవస్థ తన పాత్రను నిర్వర్తించగలుగుతుంది. రాజకీయంగా అప్రియమైనవైనా సరే, ఒక చట్టం చెల్లదని చెప్పగలిగే, ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును నిగ్రహించగలిగే స్వతంత్రత జ్యుడీషియరీకి ఉండాలి. అంతిమంగా, న్యాయమూర్తుల విశ్వాసం, తెగువ, స్వాతంత్య్రాలే గణనకు వస్తాయి. జ్యుడీషియల్ ధర్మాన్ని కాపాడతామని జడ్జీలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వృత్తి జీవితంలో ఎదురుకాగల పర్యవసానాలను లెక్క చేయకుండా న్యాయమూర్తులు ఆ ధర్మాన్ని పరిరక్షించాలి. లేకపోతే, న్యాయ సమీక్ష కేవలం ప్రతీకాత్మకమైనదిగా, వ్యక్తిగతంగా వెనుక ముందు లాలోచించుకుని చేసే పనిగా మిగిలిపోతుంది. న్యాయ పరిరక్షణ నిమిత్తం న్యాయమూర్తులంతా ఏకం కావాలి. ఎప్పుడైతే, స్వాతంత్య్రాన్ని కోల్పోతామో అప్పుడే మనం న్యాయమూర్తులుగా కొనసాగే హక్కును కోల్పోయినట్లు లెక్క. ఎటువంటి ప్రలోభాలకూ లొంగకుండా ‘కుదరదు’ అని చెప్పగలగాలి. రాజకీయ ఒత్తిడి, సంస్థా పరమైన వేధింపులు లేదా పాపులర్ డిమాండ్ల నుంచి జడ్జి స్వేచ్ఛగా వ్యవహరించగలగాలి. ప్రజాస్వామ్యమంటే స్వేచ్ఛకూ, సమానత్వా నికీ అంకితమవ్వడమే! జస్టిస్ బి.వి. నాగరత్న -
మమతా బెనర్జీ (ముఖ్యమంత్రి) రాయని డైరీ
కేంద్రం శుక్రవారం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొత్త ‘వైస్రాయ్’ ని పంపింది! పేరుకే గవర్నర్లు వీళ్లు. పోకడలు వైస్రాయ్లవి! ఎవరికి వారు లార్డ్ బెంటింక్లు, లార్డ్ మౌంట్ బాటెన్లు. లార్డులు వెళ్లేటప్పుడు ‘వెళ్తున్నాం’ అని, వచ్చేటప్పుడు ‘వస్తున్నాం’ అనీ చెప్పరు! సీవీ ఆనంద బోస్ అటు వెళ్లగానే, ఆర్.ఎన్. రవి ఇటు వచ్చి కూర్చున్నారు. ‘‘ఆయన ఎవరితోనూ మాట్లాడటం లేదు మేడమ్...’’ అన్నారు గౌతమ్ సన్యాల్ వచ్చి! నవ్వాను నేను.సన్యాల్ నా పీఎస్. నేను రైల్వే మినిస్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాతో ఉన్నారు. నా పక్కనే ఉంటూ నాతో పాటుగా ఈ ‘లార్డ్ వైస్రాయ్’ లందరినీ చూస్తూ వస్తున్నారు. ‘‘మరి, మీరైనా పలరించక పోయారా గౌతమ్?’’ అన్నాను, నవ్వుతూ. ‘‘బహుశా ఆయన ఇంకెవరి పలకరింపు కోసమైనా ఎదురుచూస్తున్నారేమో మేడమ్’’ అన్నారు సన్యాల్, సీరియస్‌గా. పెద్దగా నవ్వాన్నేను. ‘‘మేడమ్! ఈ రోజు మీ షెడ్యూల్ కాస్త హెక్టిక్‌గా ఉంది. 24 లక్షల మంది బతికున్న ఓటర్లను ఈసీ ‘చంపేసినందుకు’ నిరసనగా రెడ్ రోడ్లో బైఠాయింపు ధర్నా; పింక్ బూత్‌లు, ఉమెన్ పెట్రోలింగ్ టీమ్‌ల లాంచింగ్, పార్టీ లీడర్స్‌తో ఎలక్షన్ స్ట్రాటజీ మీటింగ్, బీజేపీ పరివర్తన్ యాత్రకు కౌంటర్ ఇవ్వటం, ఇక టైమ్ ఉంటే రాయ్దిఘిలో అభిషేక్ బెనర్జీ ర్యాలీకి అటెండ్ అవటం...’’ అని మొత్తం లిస్ట్ చెప్పారు సన్యాల్.సన్యాల్ సూపర్ పీఎస్! సూపర్ అంటే పెద్ద పెద్ద పనుల్లో తలమునకలై ఉండటమే కాదు, చిన్న చిన్న డీటెయిల్స్‌ను కూడా వేళ్లకు ఉంగరాల్లా తొడుక్కొని ఉండటం కూడా! ‘‘గౌతమ్... నాకనిపిస్తోందీ, ఈ కొత్త వైస్రాయ్ ప్లేస్‌లో మీరుంటే ఎంత బాగుంటుందీ అని!’ అన్నాను. గౌతమ్ ఎప్పటిలా ‘‘హా... మేడమ్’’ అని నవ్వి ఊరుకున్నారు. ఆయన చేతిలో ఫోన్ బ్లింక్ అయింది. ‘‘మేడమ్! సీఎం స్టాలిన్ లైన్లో ఉన్నారట. కనెక్ట్ చేయించమంటారా?’’ అన్నారు సన్యాల్.‘‘ఇవ్వండి’’ అన్నాను. ‘‘హలో సిస్టర్... హ్యాపీ ఉమెన్స్ డే’’ అన్నారు స్టాలిన్, లైన్లోకి వచ్చీ రావటంతోనే!‘‘హ్యాపీ మార్నింగ్ స్టాలిన్‌జీ... ఏమిటి విశేషం?’’ అన్నాను నవ్వుతూ. నిన్ననే నేను స్టాలిన్‌కి బర్త్ డే విషెస్ చెప్పాను.‘‘మా మణిరత్నాన్ని మోదీజీ మీకు ఉమెన్స్ డే గిఫ్ట్‌గా పంపినట్లున్నారు కదా...’’ అని పెద్దగా నవ్వారు స్టాలిన్. కొత్త గవర్నర్ ఆర్.ఎన్. రవి గురించే ఆయన అంటున్నది.‘‘స్టాలిన్‌జీ...! మణిరత్నం అని ఆయన్ని తక్కువ చేయకండి. అంతకన్నా విలువైన భారతరత్నం ఆయన’’ అన్నాను, నవ్వుతూ.‘‘నిజానికి అది కూడా సరిపోదు సిస్టర్. ఆయనకు మహిళారత్న ఇవ్వాలి. గవర్నర్ స్పీచ్‌లో ‘ఉమన్ ఎంపవర్మెంట్’ అనే మాటను తొలగించి చదివిన భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ ఆయన’’ అన్నారు స్టాలిన్.‘‘అవును, గుర్తుంది స్టాలిన్‌జీ. అదొకటే కాదు, తమిళనాడు పేరును ‘తమిళVýæం’ అని మార్చాలని కూడా అన్నట్లున్నారు కదా! అసలు ఈ మణిరత్న, మహిళారత్న, భారతరత్న కాదు... ఆయనకు తమిళరత్న ఇవ్వాలి...’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వారు స్టాలిన్. స్టాలిన్‌తో మాట్లాడి, ఫోన్ పెట్టేయగానే, సన్యాల్ వచ్చి చెప్పారు... ‘‘మేడమ్! కొత్త గవర్నర్ మిమ్మల్ని రాజ్ భవన్‌కి వచ్చి కలవమంటున్నారు’’ అని!నవ్వొచ్చింది నాకు. ‘‘వస్తున్నానని చెప్పండి. వస్తానో రానోనని పాపం ఆయన టెన్షన్ పడుతూ కూర్చోవటం ఎందుకు?’’ అన్నాను సన్యాల్‌తో. హవాయి స్లిప్పర్లతో ప్రజల దగ్గరికి లక్షల కిలో మీటర్లు నడిచిన నాకు, ప్రజల ప్రతినిధిగా రాజ్ భవన్ వైపు రెండు అడుగులు వేయటం ఏమంత చిన్నబుచ్చుకునే విషయం? -
సుదీర్ఘ యుద్ధానికి సన్నద్ధం!
అవసరం కొద్దీ చేసే యుద్ధాలుంటాయి. కావాలని చేసే యుద్ధాలుంటాయి. ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ సైనిక దాడులు రెండవ కేటగిరీలోకి వస్తాయి. దీనికి పూర్తి బాధ్యత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజ మిన్ నెతన్యాహూలే వహించాలి. అమెరికా–ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ప్రతిస్పందనగా ఇరానియన్ల ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్–4’ మొద లైంది. గత జూన్ నాటి ‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’కు ఇరాన్ నిర్ఘాంత పోయింది. కానీ, ఈసారి అది ఎదురు దెబ్బ తీసేందుకు పూర్తి సన్నద్ధమై ఉండటం అమెరికా–ఇజ్రాయెల్లను ఆశ్చర్యపరచింది.గగనతలం నుంచి వచ్చి పడుతున్న బాంబులను ఇరాన్ గట్టి గానే తట్టుకుని నిలబడింది. గల్ఫ్ దేశాలపైన, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు మొదలెట్టింది. బహ్రెయిన్ ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా నౌకాదళ 5వ యుద్ధ నావల సమూహాన్ని విస్తృతంగా నష్టపరచింది. కువైట్ గగనతలంలో నాలుగు అమెరికా యుద్ధ విమానాలను కూల్చి వేసింది.ఇరాన్... వెనెజులా కాదు!ప్రస్తుతానికి యుద్ధం సద్దుమణగే అవకాశం లేకపోగా ప్రాంతీయ యుద్ధంగా పరిణమించగల పెను ప్రమాదంలో ఉంది. గల్ఫ్ దేశాలు ఎప్పుడు ఎక్కడ రణరంగంలోకి దిగుతాయన్నదే ప్రశ్న. సౌదీ ఆర్మకో రిఫైనరీపై ఇరాన్ దాడితో గల్ఫ్ దేశాలు ఉలిక్కి పడ్డాయి. ‘‘అమెరికా సైనిక స్థావరాలకు చోటు కల్పించిన గల్ఫ్ దేశా లను (అమెరికా) గాలికొదిలేసింది. అవి ఇరాన్ దాడులకు సులభమైన లక్ష్యంగా మారాయి’’ అని సౌదీ అధికారి ఒకరు వాపోయారు. అమెరికా స్థావరాలకు తమ భూభాగాల్లో చోటిచ్చామనీ, కానీ దాని చర్యలకు తమకు సంబంధం లేదనీ నటించడం మానుకోవాలనీ గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ సభ్య దేశాలను ఇరాన్ గట్టిగానే హెచ్చరించినట్లయింది. వెనిజులాకూ, ఇరాన్లో పరిస్థితికీ పోలిక లేదు. ఇరాన్లో పాలనా వ్యవస్థ కుప్పకూలిపోతుందని అమెరికా వేసుకున్న అంచనాలు ఘోరంగా తప్పినట్లు కనిపిస్తోంది. అసలు యుద్ధ ఆశయాల పైన, ఆశిస్తున్న అంతిమ ఫలితంపైన అమెరికా–ఇజ్రాయెల్‌ల మధ్య తేడాలున్నాయి. వాటి మధ్య స్పష్టత కొరవడటం మరింత గందర గోళానికి కారణమవుతోంది. ఇరాన్ ఎన్నడూ లేనంత బలహీనమైన స్థితిలో పడిపోతుందని చాలా మంది అంచనా వేశారు. గత ఏడాది జూన్‌లో అమెరికా వైమానిక దాడులతో ఇరాన్ అణ్వస్త్ర నిర్మాణ కార్యక్రమం దెబ్బతిన్న మాట వాస్తవమే. అలాగే, ఇరాన్ ప్రాంతీయ మిత్రపక్షాలను ఇజ్రాయెల్ చావుదెబ్బ తీయడంతో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఆశించిన వ్యూహ పరిమితులు బహిర్గతమయ్యాయి. ఆ దేశాలు మొదటి రక్షణ కవచంగా ఉపయోగపడతాయనీ, ప్రతిఘటన ఇరుసు ఫలితమిస్తుందనీ కోర్ ఆశలు పెట్టుకుంది. తీరా అంచనాలు తలకిందులయ్యాయి. దేశవ్యాప్తంగా సామాజికంగా హాహాకారాలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. అవి పాలక మత వ్యవస్థను కుదిపేశాయి. చర్చలు సఫలమయ్యే దశలో...ఇరాన్–అమెరికాల మధ్య ఓ పక్క చర్చలు కొనసాగుతూండ గానే అమెరికా–ఇజ్రాయెల్‌లు దాడులను తీవ్రతరం చేశాయి. గత ఏడాది ఇరాన్‌పై సాగించిన 12 రోజుల యుద్ధంలో అనుసరించిన కుటిల నీతినే అమెరికా ఈసారి కూడా ప్రదర్శించింది. ఇప్పటి మాదిరిగానే అప్పుడు కూడా ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంపై రెండు దేశాలూ సవివరంగానే చర్చించుకున్నాయి. తాజా చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిత్వం వహించారు. ఇరాన్ తమ అణు కార్యక్రమంపై ఎంతో దిగివచ్చిందని ఇటీవలి జెనీవా సమావేశం తర్వాత ఆయన వెల్లడించారు. ‘‘ఇరాన్ ఎన్నటికీ అణుబాంబు తయారు చేయకపోవడమే అంతిమ లక్ష్యం అనుకుంటే, ఆ సమస్యను మేం పరిష్కరించగలిగామనే భావిస్తున్నా’’ అని ఆయన అన్నారు. తీరా, అమెరికా సైనిక దాడులకు దిగడం చూసి ఆయన ‘‘విస్మయం’’ వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (86) మృతికి దారితీసే విధంగా అమెరికా–ఇజ్రాయెల్‌ల వైమానిక దాడులకు దిగ కుండా ఉంటే, పరిస్థితులు ఇంత వేగంగా క్షీణించి ఉండేవి కావని పిస్తోంది. షియా వర్గీయులకు ప్రాణత్యాగం (షహదత్) కన్నా మించింది లేదు. మతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మృత్యువు కౌగిట జేరడాన్ని వారు గర్వకారణంగా భావిస్తారు. లెబనాన్, ఇరాక్ నుంచి పాకిస్తాన్ వరకు పలు దేశాల్లోని షియా వర్గీయులు ఆవేశంతో ఊగిపోతున్నారు. లెబనాన్ నుంచి ఇజ్రా యెల్‌పై దాడికి హెజ్బొల్లా కొత్త ద్వారాలు తెరచింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ సమయంలో కూడా మౌనంగా ఉన్న లెబనీస్ హెజ్బొల్లా ఈసారి కత్తులు నూరుతోంది. ఇరాన్ అనుకూల మిలీ షియా గ్రూప్ ఖతైబ్ హెజ్బొల్లా ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి దిగింది. వినాశకర పర్యవసానాలుఈ పరిణామాలన్నీ భారతదేశాన్ని తీవ్రంగా కలవరపరుస్తు న్నాయి. ఎందుకంటే, చమురు దిగుమతులకు మనం గల్ఫ్ పైనే ఆధారపడుతున్నాం. తొంభై లక్షలకు పైగా భారతీయులు గల్ఫ్‌లో వృత్తి వ్యాపారాల్లో ఉన్నారు. ఇరాన్ వెలుపల అత్యధిక షియా జనాభా భారతదేశంలోనే ఉన్నారు. లక్నో, హైదరాబాద్, కార్గిల్ లాంటిచోట్ల షియా అనుయాయులు ఎక్కువ. ఖమేనీ హత్య వారిలో ఆవేశకావేషాలను పెంచింది. ఇరాన్ కూడా సభ్యురాలుగా ఉన్న ‘బ్రిక్స్’కు భారత్ అధ్యక్షురాలిగా ఉంది. మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తన ఇరాన్ సహచరునితో మాట్లాడారు. సౌదీ ఆర్మకో రిఫైనరీపై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ప్రాంతీయ శాంతి–సుస్థిరతలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరారు. దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు.అమెరికా–ఇజ్రాయెల్ దుందుడుకు చర్యల వినాశకర పర్యవ సానాలు బహు విధాలుగా, బహుముఖంగా అనుభవానికి వస్తు న్నాయి. అంతర్జాతీయ నౌకల రాకపోకలపై ప్రభావం పడింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద రిఫైనరీలలో సౌదీ ఆర్మకోకు చెందిన రాస్ తనూరా చమురు శుద్ధి కర్మాగారం ఒకటి. పెద్ద ఎగుమతి టెర్మినళ్లలో కూడా ఒకటిగా అది లెక్కకు వస్తుంది. దాని మూసి వేతతో అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం ఆకాశానికంటే అవకాశం ఉంది. ఈ యుద్ధం మరికొన్ని వారాలపాటు సాగుతుందని ట్రంప్ య«థాలాపంగా చెబుతున్నారు. అది ఇరాన్‌కున్న స్థితిస్థాపక శక్తిని, పునర్ దాడి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడమే అవుతుంది. బహుశా, ఇంతగా పర్యవసానాలున్న ఘర్షణల్లోకి కొన్ని దశాబ్దాలుగా అమెరికా తలదూర్చింది లేదు.ఇతర దేశాల్లో మాదిరిగా చాలా తేలిగ్గా పాలక అధినేతను మార్చి వేయగలమని అమెరికా పెట్టుకున్న ఆశలు ఈ క్రమంలో అడియాసలే అవుతాయి. ఇరాన్లో మత పాలనా వ్యవస్థ ఒక్క సారిగా కుప్పకూలిపోతుందని అమెరికా పెట్టుకున్న అంచనాలు... బాంబులు, క్షిపణులు సృష్టిస్తున్న ఉష్ణోగ్రతలకు ఈపాటికే ఆవిరై పోయాయి. గడ్డం ధర్మేంద్రవ్యాసకర్త ఇరాన్లో భారత మాజీ రాయబారి -
కూటమి మోసంపై నిరుద్యోగుల కన్నెర్ర!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి సర్కారు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోగా... ఉద్యోగాలను పెద్ద ఎత్తున కల్పించినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటోంది. ఏపీ శాసన సభలో ఫిబ్రవరి 25న విద్యాశాఖ మంత్రి లోకేష్ తప్పుడు ఉద్యోగ కల్పన గణాంకాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,587 జాబ్ మేళాలు జరిపి, 1,08,747 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, సీడాప్ ద్వారా 74 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అందులో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించినట్లు సభలో ప్రకటించారు. అనేక సదస్సులు జరిపి 770 ప్రాజెక్టులతో ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగినట్లు గొప్పగా తెలిపారు. ఐదు లక్షల మంది నిరుద్యోగులకు పారా మెడికల్ శిక్షణ ఇచ్చి వారందర్నీ విదేశా లకు పంపాలని ప్రభుత్వం భావిస్తుందని అసెంబ్లీలో చెప్పు కొచ్చారు. నిజానికి లోకేష్ ప్రకటించిన గణాంకాలన్నీ వాస్తవ విరుద్ధ మైనవే! 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 ఉద్యోగాలు కల్పిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను, బహిర్గతం చేయాలి కదా! ఆ పని చేయలేదు. నిరుద్యోగుల్ని వంచించే కుట్ర ఇది. అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లోకేష్ నెత్తీ, నోరు బాదుకున్నారు. అధికారం చేపట్టగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ, సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనీ ‘యువగళం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ప్రతీ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇది జరగకుంటే తన చొక్కా కాలర్ పట్టుకుని నిలదీసి అడగండని నిరుద్యోగ యువతకి మాటిచ్చారు. అధికారం చేపట్టి ఇరవై నెలల సమయం అవుతున్నా ఈ హామీ ఏమయ్యింది?ఉద్యోగాలిచ్చేంత వరకూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ప్రతీ నెల మూడువేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారు. కానీ చిల్లిగవ్వ కుడా చెల్లించలేదు. రాష్ట్రంలో 1.75 లక్షల కుటుంబాలున్నాయి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు దాదాపు రెండేళ్లకి కలిపి రూ. 14,400 కోట్లు నిరుద్యోగ భృతికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. 2026 బడ్జెట్ కూడా కలుపుకొంటే మొత్తం రూ. 21,600 కోట్లు చెల్లించాలి. అంటే రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ప్రభుత్వం డెబ్భై రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి బాకీ ఉందన్నమాట.వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించారు. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఒకేసారి 1.30 లక్షల శాశ్వత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కల్పించారు. 2.66 లక్షల వాలంటీర్ల నియామకాలు చేపట్టారు. ఆప్కాస్ ద్వారా 96 వేల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల మంది ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. భారీ పరిశ్రమలలో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రంగంలో 32 లక్షల 79 వేల 970 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 40 లక్షల 13 వేల 552 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగ భృతి చెల్లించాలి. లేకపోతే యువత ఉద్యమిస్తుంది.– ఎ. రవిచంద్ర ‘ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ -
ఆత్మగౌరవాన్ని ఆలంబన చేసుకోండి!
అమెరికన్ గాయని, గీత రచయిత, నటి బియాన్స్ నౌల్స్ జాతి వివక్షను ఎదుర్కొంటూ పైకెదిగిన మహిళామణి. పురుషాధిపత్య వినోద ప్రపంచంలో తన ప్రతిభా పాటవాలు నిరూపించుకున్న వ్యాపారవేత్త. గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ఆమె చేసిన వర్చువల్ ప్రసంగ సంక్షిప్త పాఠం. ప్రియతమ పట్టభద్రులారా! మీ తరంతో సిసలైన మార్పు మొదలైంది. మునుపటి తరం కలలకు మీరు ప్రతిరూపాలు. మీలా విద్యావంతులు కావాలని వారు చేసిన ప్రార్థనలు మీ రూపంలో ఫలించాయి. విద్యాలయాన్ని వీడిన తర్వాత మనలోని అసలైన సామర్థ్యం బయట పడుతుంది. ఆ ప్రక్రియ అంత తేలికైనదేమీ కాదు. అది నాకూ తెలుసు. సినీ వ్యాపారంలో పురుషాధిపత్యం ఎక్కువ. ఫలితంగా, నాకు మహిళా ‘స్ఫూర్తి దాతలు’ ఎవరూ లేకపోయారు. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఎంటర్టైన్మెంట్ వ్యాపారంలో పైకొచ్చాను. సొంత కంపెనీ ఏర్పాటు చేసుకోగలిగాను. తర్వాత, నా లాంటి మహిళలతో పాటు ఇతరులకూ అవకాశం ఇచ్చే భాగ్యం నాకు లభించింది. మహిళలు కావడం వల్ల, లేదా జాతి వివక్ష కారణంగా అనేక మంది ప్రతిభా సంపత్తులుండి కూడా అవకాశాలకు నోచుకోని సంగతులు నాకు తెలుసు.విమర్శలే ప్రేరణ!ప్రతిభను కనబరచండి. మీ బలహీనతను చూసి భయపడకండి. శక్తి సామర్థ్యాలను పునర్నిర్వచించండి. హృదయం చెప్పినట్లుగా నడుచుకోండి. మన ప్రతిభను చాటేందుకు అనేక మార్గాలు న్నాయి. ప్రతి ఒక్కరికీ భగవంతుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చి ఉంటాడు. రూపలావణ్యాల విషయంలో జనాభిప్రాయాన్ని పట్టించుకోకండి. ఫలానా విధంగా మాట్లాడితేనే తెలివైనవారం అనిపించు కుంటామని అనుకోకండి. మీ స్వీయ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని మిగిలిన ప్రపంచానికి చాటండి. అవకాశాలు లభించని వర్గంలో ఉన్నవారు విచారిస్తూ కూర్చో కండి. మీకు మీరే ఒక వేదికను నిర్మించుకోండి. మిగిలినవారు మిమ్మల్ని చూసేటట్లు చేసుకోండి. విభిన్నంగా ఉండటం కూడా అందమేనని గ్రహించండి. తోటివారిని అర్థం చేసుకోవడం, వారి పట్ల దయతో వ్యవహరించడం, వారి తరఫున పోరాడటం కూడా సౌంద ర్యమే. గొంతు పెగలనివారు, అనాకారులు, స్థూలకాయులు, పనికి మాలినవారు, ప్రతిభా సంపత్తులేమీ లేనివారుగా ఎవరైనా ఎప్పుడైనా మీ గురించి మాట్లాడినా నీరుగారిపోవద్దు. అంటే అననివ్వండి. వచ్చే నష్టం ఏమీ లేదనే ధీమా కనబరచండి. అంతేగానీ ఎదుటివారి ప్రతికూలతలు, సంశయాలు మీపై రుద్దడానికి ప్రయత్నిస్తే అందుకు వీలు కల్పించకండి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యం నుంచి చెదిరిపోకండి. మనల్ని ఎవరైనా మాటలంటే మనకు కష్టంగా ఉంటుంది. అది నాకూ తెలుసు. కానీ, అటువంటి విమర్శలనే ప్రేరణగా చేసుకుని ముందుకు సాగండి. గౌరవం... ప్రాథమిక సూత్రంగౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోని చోట బాంధవ్యాలు నిలబడవు. మిమ్మల్ని మీరు ఎంత గౌరవించుకుంటారో ప్రపంచం మిమ్మల్ని అంత గౌరవప్రదంగా చూస్తుంది. ఉద్యమాలు కూడా గౌరవం ప్రాథ మిక సూత్రంగా ఉన్నప్పుడే విజయవంతమవుతాయి. విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉంటే ఉండనివ్వండి. నేను 24 గ్రామీ అవార్డులు సొంతం చేసుకున్న అదృష్టవంతురాలిని. నాకు అవి 46 సార్లు దక్కకుండా పోయిన సందర్భాలూ ఉన్నాయి. విజయం దక్కి తీరాలని ఎన్నడూ అనుకోకండి. కానీ, విజయ సాధనకు మరింత శ్రమించండి. చేతిలో ఉన్న పేకముక్కలతోనే ఆడగలం. ఉన్న శక్తియుక్తులతోనే సాధిద్దామని భావించాలి. అదే ఏనుగంత బలాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మరెవరితోనూ పోల్చుకోకండి. జీవితంలో లాభాలు, నష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అలాగే, విజయం తనతోపాటు సవాళ్లనూ మోసుకొస్తుంది. మీ విజయాలు చూశాక ఓర్వలేక మిమ్మల్ని ఎలా పడ గొట్టాలా అని కొందరు వారి సమయాన్ని, శక్తిని వెచ్చిస్తూపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. పరిస్థితులు మీ నియంత్రణలో లేవని లేదా ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందని ఎన్నడైనా అనిపిస్తే, ఆ బలహీనతను ప్రేరణగా తీసుకుని ఉన్నతిని సాధించేందుకు ప్రయత్నించండి. నాలోని సిస లైన శక్తిని నేను అలాగే కనుగొన్నాను. నేను ఎప్పుడూ ‘పనిలో పురోగతి’గానే ఉండేదాన్ని. అదే, వృద్ధి చెందడంలో ఉండే అందం.బాధ్యతలో భాగం తీసుకోవాలి!జీవితాన్ని దాని గతిన అది సాగనిచ్చి తదుపరి అడుగు ఎటు వెయ్యాలో సూచించే పనిని దానికే వదిలేసినపుడు నాకు జీవితం చాలా సంతోషంగా గడిచింది. ప్రతికూలతల గురించే ఆలోచిస్తూ, మాట్లాడుతూ, వాటినే మననం చేసుకోవడంలో విలువైన కాలాన్ని వెళ్ళబుచ్చితే నిష్ప్రయోజనం తప్ప వచ్చేది ఏమీ ఉండదు. ఒక నల్ల జాతి వ్యక్తికి(జార్జ్ ఫ్లాయిడ్) జరిగిన అన్యాయంపై సమష్టిగా పోరాడటం వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో మీరు గమనించారు. ఒక లక్ష్యం నిమిత్తం అందరూ చేతులు కలిపితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. కానీ, మార్పు తీసుకురావలసిన బాధ్యత మనపైనే ఉంది. మనకు మనమే జవాబుదారీ వహించాలి. మరో పదేళ్ళలో లేదా ఇరవై ఏళ్లలో ప్రఫంచం ఏ రూపం తీసుకున్నా దానిలో భాగమయ్యేదీ, లేనిదీ మన చేతుల్లోనే ఉంది. ఇంట్లో, ఆఫీసులో, ఉద్యమంలో, ఆధ్యాత్మికతలో ఎక్కడ ఆశా కిరణాలు కని పించినా వాటిని అనుసరించాలి. ఈ విషయంలో మీరు ఎన్నడూ ఒంటరివారు కారని తెలుసుకోండి. మీరు చేయదలచుకున్నవాటిపై ఉత్తినే కలలుకంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ఇతరుల నుంచి తోడ్పాటు లేదని వారిని విమర్శించను కూడా వద్దు. మీ కృషిని మీరు కొనసాగించండి. కోరుకుంటున్న మార్పు మీరే అయి చూపించండి. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు కూడా కొంత సమ యాన్ని, ధనాన్ని వెచ్చించుకోవాలి. అదే సమయంలో, సమాజానికి తిరిగి కొంత అందించడంలోని విలువను గ్రహించాలి. మీకు చేత నైనంతగా మీ సమాజాన్ని మీరు నిర్మించుకోవాలి. ఇతర వర్గాలకు చెందినవారి జీవితాలకూ విలువ నివ్వాలి. భయాలను పక్కనపెట్టి, ముందుకు సాగండి. నిరంతరం మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటూనే ఉండండి. సాధించి తీరగలనని మీపై మీరే పందెం కాసుకోండి. అభినందనలు. -
సమాచార హక్కుకు సమాధి?
పనిగట్టుకొని ప్రజల సమాచార హక్కును కాలరాస్తున్నారు. ‘పొమ్మనకుండా పొగబెట్టిన’ చందంగా హక్కును తొలగించకుండానే అది అమలు కాని వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. పాలనలో పారదర్శకతకు తిలోదకాలిచ్చి గోప్యతను మళ్లీ అందలాలెక్కిస్తున్నారు. ఒకవైపు స్వచ్ఛంద సమాచార వెల్లడిని ప్రభుత్వ విభాగాలు నిర్లక్ష్యం చేస్తుంటే మరోవైపు ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించాల్సిన అధికారుల జవాబుదారీతనం మంద గిస్తోంది. స్పందన లభించని దరఖాస్తులతో పాటు అప్పీళ్లు పెద్ద సంఖ్యలో పెండింగ్ పడుతున్నాయి. రెండో అప్పీళ్లూ సకాలంలో పరిష్కార మవట్లేదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన ‘తెలుసుకునే ప్రజల హక్కు’ మసకబారే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్లకు కడుతోంది.దేశ పౌరులు పోరాడి సాధించుకున్న సమాచార హక్కు చట్టం అమలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీరుగారుతోంది. భయమో, భక్తో... అంతకు ముందు అడగ్గానే సమాచారం ఇచ్చిన అధికారులు కూడా ఇప్పుడు నిరాకరించడం లేదా నిర్లక్ష్యం చేయడం రివాజయింది. ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించకపోయినా, సమా చారం ఇవ్వకపోయినా తమకు ఏమీ కాదనే ఓ గిడసబారుతనం అధికార యంత్రాంగంలో పెరిగింది. పారదర్శకతను భంగం చేసే కొత్త చట్టాలు– ఉన్న చట్టంలో మార్పులు, వివిధ స్థాయుల్లో తీసు కునే సర్కారు నిర్ణయాలు, పలు పరిణామాలు... పౌరులు తెలుసు కునే హక్కును పలుచన చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి తోడు సమాచార కమిషన్లు, న్యాయస్థానాల పనితీరు కూడా కొంత మేర కారణమవుతోంది.వ్యక్తిగత గోప్యత ముసుగులో....కేంద్రం ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రత– డీపీడీపీ చట్టం’ తీసుకువస్తూ సమాచార హక్కు చట్టం నడ్డి విరిచింది. వ్యక్తిగత గోప్యతా భద్రతకు సమాచార హక్కు చట్టం అవరోధమవుతోందంటూ, సదరు చట్టంలో ఇప్పటికే పొందుపరచిన ‘జాగ్రత్త’ను విస్మరించి, పారదర్శకత స్ఫూర్తినే భంగపరుస్తూ నిర్ణయం తీసుకుంది. డీపీడీపీ చట్టంలోని కొన్ని అంశాలు సమాచార హక్కు చట్టం మౌలిక పారదర్శక విధానానికే విరుద్ధం. 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడ్డ తర్వాత తొలిసారి, 2019లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలతోనే చట్టం బిగువును సడలించారు. కమిషన్ పదవీ కాలాన్ని, కమిషనర్ల హోదాని తగ్గించడమే కాకుండా పలు కీలక అంశాలను కేంద్రం పరిధిలోకి తెచ్చు కున్నారు. దాంతో ఆ చట్టానికీ, స్వతంత్ర ప్రతిపత్తికీ కొంతమేర కోరలు పీకినట్టయింది. డీపీడీపీ చట్టంలో పొందుపరచిన అంశాల వల్ల ఆర్టీఐలో వచ్చిన మార్పులు సదరు చట్టం అమలును మరింత నీరుగార్చాయి. పాలనా ప్రక్రియలో అధికారులకు ఏదో రూపంలో వ్యక్తిగత సంబంధం కలదిగా పరిగణించే ఏ సమాచారాన్ని డీపీడీపీ చట్టప్రకారం పౌరులకు ఇవ్వనవసరం లేదనే నిబంధనను కొత్తగా తీసుకువచ్చారు. ‘పర్సన్ ’ అనే పదానికి ఇప్పటికే ఉన్న విస్తృతార్థం దృష్ట్యా ఇది వ్యక్తులకే కాకుండా సంస్థలకు, విభాగాలకూ వర్తించి, అలా చాలా చోట్ల సమాచార నిరాకరణకు తాజా నిబంధన ఓ ఆయుధంగా మారుతోంది.జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (2017) కేసులో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వ్యక్తిగత గోప్యతను పౌరుల ప్రాథమిక హక్కులో భాగంగా స్పష్టం చేసింది. దరిమిలా పలు స్థాయి చర్చల తర్వాత డిజిటల్ వ్యక్తిగత గోప్య సమాచార భద్ర తకు ప్రత్యేక చట్టం తెచ్చే ప్రక్రియ మొదలైంది. చివరకు 2025 నవంబరు 13న డాటా ప్రొటెక్షన్ బోర్డు అమలులోకి వచ్చింది. డీపీడీపీ చట్టం దశల వారీ అమలు ప్రక్రియను ప్రారంభించి, 2025 నవంబరు 14న ఈ చట్ట నిబంధనల్ని (రూల్స్) అమలులోకి తెచ్చారు.ఇదివరకే ఆ భద్రత ఉంది!పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చడానికి చాలా ముందే ‘సమాచార హక్కు చట్టం’ పౌరుల గోప్యత హక్కును గుర్తించింది. వ్యక్తిగత గోప్యత పౌరుల తెలుసుకునే సమాచార హక్కుకు ప్రతిబంధకం కావొద్దనీ, అదే సమయంలో సమాచారం తెలుసుకునే హక్కు పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగకరం కాకూడదనీ ఎంతో జాగ్రత్త వహించిన తీరు మనకు ‘సమాచార హక్కు చట్టం–2005’లో స్పష్టంగా కనిపిస్తుంది. పౌరులు కోరినప్పటికీ ఏయే సందర్భాల్లో సమాచారం ఇవ్వన వసరం లేదో సమాచార హక్కు చట్టం సెక్షన్ 8(1)లో పలు సంద ర్భాలను పేర్కొన్నారు. అందులో, సబ్ సెక్షన్ 8 (1) జె ఒకటి.‘ప్రజావ్యవహారాలతో ఏ నిమిత్తం లేని, పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వనవసరం లేదు’ అని అందులో పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రజా సమాచార అధికారి (పీఐవో) నేరుగా నిరాకరించవచ్చు. కానీ, ‘అలా సమాచారం కోరటం ఒకరి వ్యక్తిగత గోప్యతలోకి అనుచితంగా చొరబడటం కాకుండా నిజంగా సదరు సమాచారానికి– ప్రజా వ్యవహారాలకు ప్రత్యక్ష సంబంధం ఉంటే, నిబంధనతో నిమిత్తం లేకుండా పీఐవో సమాచారం ఇచ్చి తీరాల్సిందే’ అన్న వివరణ ఆర్టీఐ చట్టంలో ఉంది. దీన్ని, ప్రస్తుత డీపీడీపీ చట్టం ద్వారా తొలగించారు. ఫలితంగా ప్రజా వ్యవహారాలతో సంబంధం ఉండే బోలెడు సమాచారాన్ని ‘వ్యక్తిగత గోప్యత’ కారణం చూపి డీపీడీపీ సెక్షన్ 44 (3) ప్రకారం నిరాకరించే ఆస్కారం ఏర్పడు తోంది. దీంతో నియామకాల ఫైళ్లు, ప్రొక్యూర్మెంట్ రికార్డులు, ఆడిట్ నివేదికలు, ప్రజానిధుల వ్యయ నివేదికలు... ఇలాంటివేవీ ప్రజలకు అందుబాటులో ఉండవు, ఆర్టీఐ చట్టం ఇప్పించదు. ఇది పాలనలో పారదర్శకతకు భంగకరం.కోర్టుల మాట పెడచెవిని పెట్టడమే!కమిషన్లు క్రియాశీలంగా ఉండటం సర్కార్లకు ఇష్టమున్నట్టు లేదు. అందుకే, కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదా స్పదం అవుతోంది. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే కమిషన్లను ఖాళీ ఉంచుతున్నారు. అందరూ రిటైరయి, కనీసం ఒక్క కమిషనర్ కూడా విధుల్లో లేని పరిస్థితి తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో దాదాపు రెండేళ్లపాటు సాగింది. ‘ఫలానా తేదీ లోపు చర్యలు తీసుకోండి’అంటూ అప్పటికే హైకోర్టు పలుమార్లు హెచ్చరించింది. 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కమిషనర్ల నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేసింది. జార్ఖండ్ ఆర్టీఐ కమిషన్ కు సంబంధించిన ఓ కేసు విచారిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. దేశ వ్యాప్తంగా సమాచార కమిషన్లలో ఉన్న ఖాళీలను సత్వరం భర్తీ చేయడమే కాకుండా, అప్పీళ్ల పెండింగ్ పరిస్థితిని బట్టి అవసరమైతే తగు సంఖ్యలో కొత్తగా అదనపు కమిషనర్లను నియమించుకోవాలని ఇదే నెలలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు, పూర్తిస్థాయి ‘అన్ లైన్ ఆర్టీఐ దరఖాస్తు’ విధానాన్ని ఏపీలో అందుబాటులోకి తెస్తున్నారు. ఎప్పుడో ప్రారంభించిన తెలంగాణలో ఇప్పుడిది అంత ఆశావహమైన స్థితిలో లేదు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో 98 శాతం పరిష్కారానికి నోచుకోకుండా పడి ఉన్నట్టు సమాచారం! ఇదీ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సేకరించిన అధికారిక సమాచారమే! పరిస్థితి ఇలా ఉంటే... ఇక పౌరులకు సమాచారానికి దిక్కేది? ఆర్టీఐ చట్టం అమలుకు దారేది?దిలీప్ రెడ్డివ్యాసకర్త ఉమ్మడి ఏపీలో సమాచార కమిషనర్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
అగ్రరాజ్యం అనుకున్నట్లే అవుతుందా?
అమెరికా, ఇజ్రాయెల్‌లు శనివారం వేకువ జామున ఇరాన్‌పై పరస్పర సమన్వయంతో దాడులు నిర్వహించాయి. గత వేసవిలో 12 రోజులపాటు సాగిన యుద్ధం తర్వాత ఈ మూడు దేశాలు కుతకుతలాడుతూనే ఉన్నాయి. శనివారంనాటి దాడులు ఆ ఘర్షణను తిరిగి రగుల్కొలిపాయి. అమెరికా–ఇజ్రాయెల్‌ల సంయుక్త దాడులు ఇరాన్‌లోని కీలకమైన అధికార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సీనియర్ నాయకులను హతమార్చాయి. ముఖ్యంగా 1989 నుంచి ఇరాన్‌ను పాలిస్తూ వస్తున్న సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నేలకొరిగారు. ‘‘చరిత్రలోని అత్యంత దుష్టమైన వ్యక్తులలో ఒకరు’’ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను అభివర్ణించారు. ఖమేనీని మట్టుబెట్టిన సంగతిని ట్రంప్ ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ ఘటనతో ఇరాన్ ప్రజానీకానికే కాదు, గొప్ప అమెరికన్లు అందరికీ న్యాయం చేకూరినట్లు అయింది’’ అని కూడా ట్రంప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. నిర్ణయాత్మక సైనిక చర్య!ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) కమాండర్ మహమ్మద్ పాక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదె, డిఫెన్స్ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షంఖానీ, ఆఖరికి ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదినెజాద్ సైతం దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ వార్తలు ప్రచురించింది. ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇరాక్, జోర్డాన్లతో సహా గల్ఫ్‌లో పలు ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన కూడా ఇరాన్ విరుచుకుపడింది. త్వరితగతిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణక్షణానికీ మారిపోతున్న పరిస్థితులు ఊహకు అందడం లేదు. సహజంగానే సంతోషాతిరేకంతో ఉన్న ట్రంప్ దీన్ని పరిమిత చర్యగా భావించడం లేదు. అమెరికాకు దీర్ఘకాలికంగా ఉన్న ముప్పును తుదముట్టించే నిర్ణయాత్మక సైనికచర్యగా చెబుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు ఈ బెడదను నేరుగా ఎదుర్కొనేందుకు విముఖత చూపారనీ, తాను దాడికి సాహసించగలిగాననీ ఆయన చెబుతున్నారు. దాడులకు దిగడానికి ముందు ఇరాన్‌కు చుట్టుపక్కలనున్న దేశాల మద్దతుతో అమెరికా దౌత్యపరమైన యత్నాలు సాగించింది. కానీ, అవి ఇరాన్ అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్య శక్తిని కట్టడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవి. ఆ యత్నాలు ఫలవంతమయ్యే స్థాయి వరకు ట్రంప్ ఓపికపట్టి ఉండాల్సింది. కానీ, ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికాలోని కన్జర్వేటివ్ పిడివాదుల ప్రభావానికి లోనై, ఇరాన్ బలహీనంగా ఉందని భావిస్తున్న ప్రస్తుత సమయంలో దానిపై దాడి చేయడానికే మొగ్గు చూపారు. ఇరాన్ ప్రజానీకం తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. ఇరాన్ ప్రభుత్వ మార్పునకు వాషింగ్టన్ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ‘‘తమ దేశాన్ని తిరిగి తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఇది ఇరాన్ ప్రజానీకానికి లభిస్తున్న ఏకైక మహత్తర అవకాశం’’ అంటూ ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. రెండేళ్ళ పైగా... రగులుతున్నదే!ఇరాన్‌పై ఇప్పుడే ఎందుకు దాడికి దిగారో మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ వారాంతపు దాడులు హఠాత్తుగా పుట్టుకొచ్చినవేమీ కావు. గత రెండేళ్లుగా ఇరాన్‌తో ఘర్షణ విస్తృత రూపం దాలుస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలోని హమాస్‌పైనే కాకుండా, తమ ఉత్తర సరిహద్దు పొడవునా హిజ్బుల్లా పైన, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులకు దిగుతున్న హూతీలపైన నిలకడగా సైనిక చర్యలను నిర్వహిస్తూ వచ్చింది. అది పరోక్షంగా ఇరాన్‌ను కూడా లక్ష్యంగా చేసుకుందని వేరే చెప్పనక్కర లేదు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇరాన్ ఫార్వర్డ్ రక్షణ వ్యూహానికి కోత పెడుతూ వచ్చాయి. దాని కేంద్ర సైనిక సామర్థ్యాలను బలహీనపరచాయి. సాపేక్షంగా చూస్తే, ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నది ఇరాన్ భూభాగం, చెదిరిపోకుండా ఉన్నది క్షిపణి కార్యక్రమం, అన్నింటికన్నా ముఖ్యంగా నాయకత్వ వ్యవస్థ అని చెప్పాలి. అమెరికా–ఇజ్రాయెల్‌ల దాడులు తక్షణ ఫలితాలనైతే ఇచ్చాయి. కానీ, యుద్ధాలు చాలా అరుదుగా మాత్రమే తొలుత రూపొందించుకున్న గతిన సాగుతాయి. అమెరికాకు సైనికపరంగా ఇరాన్ సమ ఉజ్జీ కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ, దాని వద్ద సాధనాలున్నాయి. రణరంగాన్ని విస్తరించడం అన్నది దానికి వాటమైన వ్యవహారం. యుద్ధ నష్టాలను ఇరుగు పొరుగు దేశాలు కూడా పంచుకోక తప్పని స్థితిని అది సృష్టించగలదు. ఆ విధంగా ప్రాంతీయ ప్రమాదాలను పెంచగలదు. ఇరాన్ ప్రతిదాడులు సరిగ్గా ఈ వ్యూహాన్నే సూచిస్తున్నాయి. గల్ఫ్‌లోని పొరుగు దేశాలతో టెహరాన్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ, అంతిమ కాల్పుల విరమణను సాధించేందుకు ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని నిలకడగా కొనసాగించడమే తనకున్న ఏకైక మార్గమని అది భావిస్తోంది. ఎవరి లక్ష్యం వారిది!కీలక పాత్రధారులైన మూడు దేశాలూ రణరంగంలోకి దిగడానికి, ఎవరికి వారికి ప్రత్యేక లక్ష్యాలున్నాయని గమనించాలి. ఇస్లామిక్ రిపబ్లిక్కేమో తన అస్తిత్త్వాన్ని కాపాడుకోవడం మొదటి లక్ష్యం. దాడులను తట్టుకుని నిలబడి, తగినంత సైనిక, రాజకీయ పొందికను తమ వైపు నుంచి కనబరచడం, సైనిక ప్రతిస్పందనను కొనసాగించడం ఇరాన్ ముందున్న పని. సంప్రదాయ ధోరణిలో యుద్ధంలో గెలిచేందుకు ఇరాన్ పోరాడడం లేదు. పాలనా వ్యవస్థను కొనసాగించుకునేందుకు శక్తియుక్తులను ఒడ్డుతోంది. దానికి విరుద్ధంగా, ట్రంప్ ఒక నిర్ణయాత్మక ఫలితాన్ని కోరుకుంటున్నారు. అమెరికాకున్న దీర్ఘకాలిక ప్రత్యర్థి మెడలు వంచినట్లు చాటుకోవాలని ఆయన తాపత్రయం. ‘‘ఈ వారం పొడుగూతా బాంబులు కురిపిస్తూనే ఉంటాం. మా లక్ష్యాన్ని సాధించే వరకు అవసరమైనంత కాలం పోరు సల్పుతాం’’ అని ఆయన చెప్పారు. ఇబ్బడిముబ్బడి శక్తితో ఇరాన్ మౌలిక వసతులను, వ్యూహాత్మక ఆస్తులను ధ్వంసం చేస్తూ, సీనియర్ నాయకత్వాన్ని మట్టుబెడుతూ పోతే, ఇరాన్ వ్యూహాత్మక వైఖరి సడలిపోతుందనీ, అది లొంగివస్తుందనీ, లేదా దేశం లోపల అస్తవ్యస్త పరిస్థితులు పాలనా వ్యవస్థ మార్పునకు దారితీసి తీరుతాయనీ ట్రంప్ నమ్మకంతో ఉన్నారు. ఇజ్రాయెల్ లక్ష్యాలు కూడా స్థూలంగా వాషింగ్టన్ వైఖరితో సరిపడినవే. కాకపోతే అది కొన్నింటిపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరానియన్లు తిరగబడాలనీ, పాలనా వ్యవస్థ మార్పునకు లభించిన చారిత్రక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ నెతన్యాహు పిలుపు నిస్తున్నారు. ఇరాన్ ఆంతరంగిక సమస్యలలో మునిగిపోతే చాలుననీ, శాశ్వతంగా కాకపోయినా... కనీసం ప్రస్తుతానికి వ్యూహపరంగా బలహీనపడాలనీ ఆయన కోరిక. ఇరాన్లో ఏం జరగవచ్చు?బాంబు దాడులు, ఖమేనీ అస్తమయం తర్వాత ఒకదానితో ఒకటి ముడిపడిన పలు మార్గాలు కళ్ళెదుట నిలువనున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో, అమెరికా తన చర్యలను నిలుపు చేయవచ్చు. ఇరాన్ గణనీయంగా దెబ్బతిని ఉంది కనుక, ఒత్తిడి చేస్తే దారికి రావచ్చని వైట్‌హౌస్ భావన. దయనీయ స్థితి ఉద్రిక్తతల సడలింపునకు దారితీయవచ్చని దాని అభిప్రాయం. ప్రస్తుత పాలనా వ్యవస్థలో మిగిలిన నాయకత్వం, వాషింగ్టన్ డిమాండ్లకు అంగీకరించడం ద్వారా తమ పట్టును కొంతవరకైనా కాపాడుకున్నట్లు అవుతుందని భావించవచ్చు.ఖమేనీ రంగంలో లేకపోయినంత మాత్రాన, వ్యవస్థ దానికంతట అది కుప్పకూలదు. అధికార బదలీకి రాజ్యాంగ యంత్రాంగం ఏదో ఒక ఏర్పాటు చేస్తుంది. నిపుణులు నూతన అధినాయకుడిని అధికారికంగా నియమించవచ్చు. అయితే, ఆచరణలో మాత్రం, నిర్ణయాత్మక శక్తి రివల్యూషనరీ గార్డ్, భద్రతా వ్యవస్థ చేతుల్లోనే కొనసాగవచ్చు. అధికార బదలీ పకడ్బందీగా సాగేట్లు, ఉన్నత స్థాయి నాయకత్వం చెదిరిపోకుండా నివారించేటట్లు... ఆ రెండు వ్యవస్థలు ప్రయత్నించి తీరుతాయి. పాలన కొనసాగేందుకు, తాత్కాలికంగానైనా ఉమ్మడి నాయకత్వ ఏర్పాటు జరగవచ్చు. అది అమెరికా–ఇజ్రాయెల్‌ల ఒత్తిడికి మరింత లొంగకపోవచ్చు కానీ, దేశంలోని సైనిక ఒత్తిడికి అది లొంగిపోయేదిగానే ఉంటుంది. సైనిక ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే ఇరాన్‌లోని ఉన్నతస్థాయి రాజకీయ వర్గాలలో ఉన్న విభేదాలు బయటపడనూవచ్చు. ఆర్థిక ఒడుదొడుకులు, సైనిక నష్టాలు, ఆంతరంగిక శత్రుత్వాలు కేంద్ర అధికారాన్ని బలహీనపరచి దేశీయంగా ఇతర వర్గాల నుంచి పోటీ ఎదురవడానికి పరిస్థితులు అనువుగా మారవచ్చు. ప్రతిపక్షాలు కూడా ఆ వర్గాలకు మద్దతు పలుకవచ్చు. అడ్డూ ఆపూ లేకుండా పాలక వర్గాలు చీలిపోతే మాత్రం అత్యంత అస్థిర పరిస్థితులు దాపురిస్తాయి. లిబియాయే అందుకు తిరుగులేని తార్కాణం. అక్కడ గడాఫీ పతనం క్రమబద్ధమైన అధికార బదలీ పరిణామక్రమానికి ఏమీ దారితీయలేదు. వ్యవస్థలు కుప్పకూలాయి. మిలీషియాల మధ్య పోటీ, బాహ్య జోక్యాలు దేశంలో ప్రత్యర్థి వర్గాల మధ్య ఆజ్యం పోశాయి. లిబియా కన్నా సంక్లిష్టమైన దేశమైన ఇరాన్లో వ్యవస్థలు బలంగా ఉన్నాయి. అధికార యంత్రాంగాలు వేళ్ళూనుకుని ఉన్నాయి. రాజకీయ అధికార బదలీని నిర్వహించకుండా పెద్ద తలకాయను తీసేసినంత మాత్రాన పరిస్థితులు చక్కబడవు. సాయుధ వర్గాలు అధికారాన్ని చెలాయిస్తూనే ఉంటాయి. ప్రచ్ఛన పోటీకి తెరతీసినట్లు అవుతుంది. ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో తాజా యుద్ధానికి ముందటి సమతుల్యత మాత్రం ఇక కచ్చితంగా ఉండదు. ఉద్రిక్తతలను సడలించేందుకు చొరవ చూపిన గల్ఫ్ దేశాలు ప్రతి దాడులను రుచి చూసి ఇపుడు మరింతగా బహిర్గతమయ్యాయి. ఇంధన మార్కెట్లు, ముఖ్యంగా కీలకమైన పాయింట్ల వద్ద సాగర భద్రత సున్నితమైన అంశాలుగా కొనసాగుతాయి. ఘర్షణలు మరింత ప్రబలడానికి కూడా అవి కారణాలుగా నిలువవచ్చు. అమెరికా – ఇజ్రాయెల్‌ల ప్రత్యక్ష చర్యను చూసిన ప్రాంతీయ దేశాలు తమ పొత్తులను, రక్షణ వైఖరులను పునః సమీక్షించుకుని తీరుతాయి. ఇరాన్ ఈ యుద్ధాన్ని భరించి నిలువవచ్చు. కానీ, ఇంతకాలం ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మనుగడ సాగించిన ఆ దేశం మార్పు చెందకుండా మునుపటిలా తన అస్తిత్వాన్ని మాత్రం కొనసాగించలేదు. ఈ ఘర్షణలోని నిర్ణయాత్మక దశ మొదటగా దాడులకు దిగడంలో లేదు. స్థిరమైన సైనిక ఒత్తిడితో క్రమబద్ధ రాజకీయ వ్యవస్థ ఆవిర్భవించడంలో ఉంది. అమెరికా తన తక్షణ లక్ష్యాలను సాధించుకుని ఉండవచ్చు. అయితే, తదనంతరం రూపుదిద్దుకునే ఇరాన్, దాని ఇరుగు పొరుగు దేశాల యవనికకు అది సిద్ధంగా ఉందా అన్నదే ప్రశ్న!డాక్టర్ సనమ్ వకీల్వ్యాసకర్త ప్రతిష్ఠాత్మక రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్‌లో మధ్య ప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ -
మోహన్‌లాల్ (అగ్ర నటుడు) రాయని డైరీ
ముఖ్యమంత్రి అధికార నివాసం ‘క్లిఫ్ హౌస్’లోని పచ్చికలో పినరయి విజయన్, నేను పక్కపక్కన నడుస్తున్నాం. ఇంటర్వ్యూ ఇంకా మొదలు కాలేదు. ‘‘ఒకటి చెప్పండి సీఎం గారూ! మీరెందుకు ఎక్కడా కూడా నవ్వుతూ కనిపించరు?! మోదీజీని చూడండి, నిరంతరం నవ్వుకు అందుబాటులో ఉంటారు. రాహుల్ గాంధీ అయితే, ‘నవ్వు పిట్ట’లా ఎప్పుడూ ఎవరో ఒకరి భుజం మీద వాలుతూనే ఉంటారు. మీరెందుకు అలా ఉండరు?’’ అని అడిగాన్నేను. ‘‘చూడండి మిస్టర్ లాల్... ‘నవ్వని మనిషి’ అని నా మీద ఈ పదేళ్లలో చాలానే దుష్ప్రచారం జరిగింది! నిజానికి, నేనూ నవ్వగలను’’ అన్నారు విజయన్ , సీరియస్‌గా.‘‘కానీ, సీఎం గారూ... నవ్వటం, నవ్వగలగటం రెండూ ఒకటేనంటారా?! నవ్వగలిగి ఉండీ, నవ్వక పోవటం అంటే నవ్వును ఆచరణలో పెట్టకపోవటమే కదా?’’ అన్నాను. ఆ మాటకు ఆయన నవ్వే ప్రయత్నం చేశారు కానీ, నవ్వటం ఆయన వల్ల కాలేదు. ‘‘ఆచరణలో పెట్టటానికి ‘నవ్వు’ అనేది పార్టీ సిద్ధాంతం కాదు మిస్టర్ లాల్! సహజసిద్ధమైన ఒక మెరుపు. నాలో మెరుపు కనిపించకుండానే నేను ఉరుమునై పోతానా! ముందు మెరుపు కనిపిస్తేనే కదా, తర్వాత ఉరుము వినిపిస్తుంది. నాలో మెరుపే లేకుంటే వీళ్లంతా అంటున్నట్లు ఉరుము ఎక్కడి నుంచి వస్తుంది! అది చెప్పండి’’ అన్నారు విజయన్ .మెల్లిగా ఆయన ఇంటర్వ్యూ మోడ్‌లోకి వస్తున్నట్లు నేను గ్రహించాను. ఇంటర్వ్యూ పేరు ‘ఇరువర్’. ‘విజయన్ సీరియస్ మనిషి’ అనే ఇమేజ్‌ని పోగొట్టి, విజయన్ కూడా మామూలు మనిషే! ఆయనా సినిమాలు చూస్తారు, ఆయనా పూల మొక్కల్ని చూసి ఆహ్లాదపడతారు అనే కొత్త ఇమేజ్ను తీసుకురావడమే ‘ఇరువర్’ ఉద్దేశం. 2019లో ప్రధాని మోదీజీని అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేస్తూ, ‘‘మోదీజీ! మీరు మామిడి పండ్లను ఎలా తింటారు? కోసుకుని తింటారా? లేక, కొరుక్కుని తింటారా?’ అని అడిగిన అత్యద్భుతమైన ప్రశ్న ఆనాడు దేశ ప్రజల్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క ప్రశ్నతో మోదీజీని దేశానికి ప్రియతమ నాయకుడిని చేసేశారు అక్షయ్.‘‘మోహన్ లాల్ గారూ! మీరు కూడా అక్షయ్ లానే, విజయన్ సార్‌ని మన రాష్ట్రానికి మూడోసారి ప్రియతమ నాయకుడిని చేయాలి’’ అని ముందే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇంటర్వ్యూ దర్శకుడు టీకే రాజీవ్. నిజానికి మోదీజీని అక్షయ్ ఇంటర్వ్యూ చేయటానికి ఎనిమిదేళ్ల ముందే, కేరళ కాంగ్రెస్ లీడర్ ఊమెన్ చాందీని నేను ఇదే ‘ఇరువర్’ పేరుతో ఇంటర్వ్యూ చేయవలసి వచ్చింది. అప్పుడు కూడా అన్నీ మామిడి పండ్ల ప్రశ్నలే! ఇప్పుడు విజయన్ ఇంటర్వ్యూలోనూ అవే పండ్లు! ఉదయం మీరు ఎన్ని గంటలకు లేస్తారు? తిరిగి రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు? మీ హాబీస్ ఏంటి? మీకు ఎవరి సినిమాలంటే ఇష్టం?... ఇలాంటివి!ఇంటర్వ్యూ మొదలవటానికి ముందు విజయన్ను నేను స్క్రిప్ట్‌లో లేని ప్రశ్నొకటి అడిగాను. ‘‘కేరళ ప్రజల కోసం మీరెంతో చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ‘నవ్వని మనిషి’ అయితే మాత్రం ఏమిటి?! అసలీ ఇంటర్వ్యూ అవసరం ఉందా?’’ అని అడిగాను. అప్పుడు నవ్వారు విజయన్ ! ఆ నవ్వు మెరుపులా ఉంది!! ‘‘మిస్టర్ లాల్! నవంబర్ 1న ‘కేరళ కంప్లీట్ డిజిటల్ లిటరసీ’ ప్రోగ్రాంకి మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినా మీరు రాలేదు. ‘దృశ్యం–3’ షూటింగ్లో ఉన్నానని చెప్పి తప్పించుకున్నారు! ఇప్పుడు వరుసగా మూడోసారీ కేరళలో మా పార్టీనే రావాలని నేను ఊహిస్తున్న దృశ్యం–3 నిజం కావాలంటే మీలా ఏ పార్టీకీ చెందని స్టార్లను, వారి ఫ్యాన్స్‌ని దగ్గర చేసుకోవాలి కదా! అందుకే ఈ ఇంటర్వ్యూ’’ అని మెరుపు ఉరిమినట్లుగా చెప్పారు విజయన్ ! ఆ ఉరుములో... నాకు ‘దృశ్యం–4’ కనిపించింది! -
ప్రజల ఒత్తిడే యుద్ధాల్ని ఆపగలదు!
నేటితో ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసి, నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. ఉక్రెయిన్ వరకూ చూస్తే – లక్ష మందికి పైగా సైనికులు చనిపోయారు. మూడు లక్షల మందికి పైగా గాయపడ్డారు. 15 వేల మందికి పైగా పౌరుల ప్రాణాలు పోయాయి. 40 వేల మందికి పైగా గాయపడ్డారు. రష్యా సైన్యంలో లక్షకు పైగా మరణాలు జరిగి ఉండవచ్చనీ, గాయపడిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆ యా ప్రభుత్వాలు చెప్పవు. ఐక్యరాజ్య సమితి, ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్, బ్రోకింగ్స్ ఇనిస్టిట్యూషన్ వంటి పరిశోధనా సంస్థల ద్వారా బైటకొచ్చిన సమాచారం ఇది. ‘ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోకూడదు! క్రిమియా, డొనెత్స్క్, లుహాన్స్క్, జపోర్జియా, ఖెర్సాన్ వంటి ప్రాంతాలను రష్యాకి చెందినవిగా ఉక్రెయిన్ అంగీకరించాలి! పెద్ద పెద్ద ఆయుధాల్ని, అలాగే పాశ్చాత్య దేశాల మద్దతుని తగ్గించాలి’ లాంటి రష్యా పెట్టే షరతులకు తలొగ్గడానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. ఆ షరతులకు తలొగ్గనిదే దిగిరావడానికి రష్యా సిద్ధంగా లేదు.అమెరికా ఒక పక్కన ఇరాక్, సిరియా, యెమెన్ లాంటి మధ్య ప్రాచ్య దేశాల పైన దాడులు చేస్తూ... ‘రష్యా దాడి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన’ అనడమూ; ‘ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతను కాపాడాలి’ అనడమూ హాస్యాస్పదం. ఉక్రెయిన్‌కు ఇప్పటివరకు అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సహాయం 100 బిలియన్ డాలర్లు పొందింది. 500 బిలియన్ డాలర్ల (దాదాపు 45 లక్షల కోట్లు) దాకా అమెరికాలో ఆయుధ వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా. ఇవి ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏజెన్సీ, యూ.ఎస్. డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంటి సంస్థలు ప్రకటించిన సంగతులే! ఇంక భారత దేశానికి వస్తే, ‘సమతుల్య తటస్థత’ అనే ఎత్తుగడని పాటిస్తూ, చాలా సందర్భాల్లో ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన వోటింగ్‌లో పాల్గొనకుండా, రష్యాను ఖండించే తీర్మానాలపైన కూడా ఓటు వేయలేదు. భారత ప్రధాని మోదీ 2022లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసినప్పుడు ‘ఇది యుద్ధ కాలం కాదు’ అని ఒక వ్యాఖ్యానం చేసి మౌన వ్రతాన్ని పాటించారు. ఇండియాకు రష్యా నుండి చౌకగా క్రూడ్ ఆయిల్ కావాలి. అలాగే రక్షణ రంగంలో సహకారం కావాలి. అందుకోసం దానితో స్నేహం తప్పదు. అలాగే పాశ్చాత్య దేశాలతో కూడా దానికి కొన్ని అవసరాలు ఉన్నాయి అంటే; ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, చైనా ప్రభావాన్ని పరోక్షంగా సమతుల్యం చేయడం, టెక్నాలజీ, వ్యాక్సిన్లు, సరఫరా వంటి అంశాల్లో సహకారం కావాలి. దానికోసమే క్వాడ్ (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి) వంటి వేదికల్లో పాల్గొనడం. వీటన్నిటికీ మించి చైనాతో ఇండియాకు 76 ఏళ్ళ పోరు ఉంది. అంతర్జాతీయ సంస్థలు కూడా యుద్ధాన్ని ఆపడానికి నిజాయితీగా ఏ ప్రయత్నాలూ చేయడం లేదు. పౌర ప్రాణాలకన్నా ఏదీ ముఖ్యం కాదు కాబట్టి, ముందైతే ‘కాల్పుల విరమణ’ జరగాలి. అది జరగాలి అంటే ఆయా దేశాల ప్రభుత్వాల మీద ప్రజల ఒత్తిడి పెరగాలి. అది మాత్రమే యుద్ధాన్ని ఆపగలదు. – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త (రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో నాలుగేళ్లు) -
సీమకు తలమానికం తిరునగరి
చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించు కోవడం. గతం లేనిదే వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తును ఊహించుకోలేము. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరానికి ఘనమైన నేపథ్యం ఉన్నది. అలాంటి తిరుపతికి అంకురార్పణ జరిగి నేటికి 896 సంవత్సరాలు. తిరుపతి నగరానికి అనుకుని ఉన్న ప్రస్తుత తిరుచానూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, పార్థసారథి ఆలయం చోళుల కాలంలో రూపొందితే, అటుపిమ్మట పద్మావతి అమ్మవారి ఆలయం వెలసింది. శ్రీ శుకమహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకుని తపస్సు చేసిన కారణంగా తిరుశుకనూరుగా పిలిచే వారనీ, అటుపిమ్మట కాలక్రమంలో తిరుచానూరుగా మారిందనీ అంటారు. నారాయణవనం కేంద్రంగా పాలన సాగించిన ఆకాశ రాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం 6 నెలల దీక్షా కాలాన్ని శ్రీనివాస మంగాపురంలో గడిపారు. దీక్షా కాలం తర్వాత శ్రీనివాసుడు తిరుమల వెళ్ళారు. ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి కాలంలో శ్రీనివాస మంగాపురం ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక అనుబంధమే పునాదిచారిత్రక ఆధారాల ప్రకారం, 1130 ఫిబ్రవరి 24న రామా నుజాచార్యుల నిర్ణయం మేరకు గోవింద రాజపురం ఆగ్రహారం నిర్మాణానికి పునాది వేశారు. అంటే నేటి తిరుపతి... గోవింద రాజపురంగా పునాది వేసుకుంది. అటు పిమ్మట గోవిందరాజ ఆలయం, దాని చుట్టూ అగ్రహారం నిర్మాణం నారాయణవనం రాజ్య పాలకుడు గట్టురాజు చేపట్టారు. తర్వాత 100 సంవత్సరాలకు ఇది తిరుపతిగా రూపాంతరం చెందింది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురం, శ్రీనివాస మంగాపురంతో సహా అనేక ఆలయాలకు గోపురాలు, అభివృద్ధి పనులు యాదవ రాజుల కాలంలో జరిగాయి. అందుకే టీటీడీ ఆలయాలలో యాదవులకు తొలి దర్శన అవకాశం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.తిరుపతి రూపుదిద్దుకుంటున్న ప్రారంభంలో తాళ్ళపాక వాసుల కృషి మరువలేనిది. శ్రీవారి ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో అన్నమయ్య కీర్తనలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే తాళ్ళపాకకు చెందిన తాతయ్య తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలిసిన గంగమ్మ ఆలయానికి ఆద్యులు. అందుకే ఈ ఆలయాన్ని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం అని అంటారు. తాళ్ళపాక వాసులు శ్రీనివాస మంగాపురం ఆలయ అభివృద్ధిలో కూడా పాలుపంచుకున్నట్లు చెపుతారు. తాతాచార్య వంశస్థులు తాతయ్య గుంట గంగమ్మ ఆల యానికి ఆద్యులు. వీరికి తొలి తీర్థం ఇస్తారు. తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు ఏడుసార్లు తిరుపతి పర్యటన చేశారు. తిరుపతి, తిరుమల, తాను పర్యటించిన నాగలాపురం, నారాయణవనంలో ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వారి తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం ఆలయాన్ని నిర్మించారు.మహానగరంగా మార్చే అవకాశంతిరుపతి, తిరుమల అంటూ ప్రస్తుతం పిలుచుకుంటున్నాం. కానీ చరిత్రను పరిశీలిస్తే రెండూ వేరు వేరు కాదని అర్థం చేసు కోవచ్చు. తిరుపతి నగరం స్వతంత్రం వచ్చే వరకు నార్త్ ఆర్కాట్ జిల్లా పరిధిలో ఉన్నది. నేటి కొండను పురాణాలలో వెంగడం అని పిలిచేవారు. పులికాట్ పరిసరాలను పాలించిన ప్రాంతానికి వెంగో రాష్ట్రం అన్న పేరు కూడా ఉంది. తిరుపతి, తిరుమలపై తమిళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తిరుపతి గానే పిలిచేవారు. తిరు అంటే శ్రీ అని అర్థం. పతి అంటే శ్రీనివాసుడు యజమాని అని. ఆ రకంగా శ్రీనివాసుడి అజమాయిషీలో తిరుపతి ఉంటుంది. ఎంత బాగుంది ఈ పిలుపు! చాలా కాలం వరకు తమిళంలో మేల్ తిరుపతి, కీల్ తిరుపతి (కింద తిరుపతి, పైన తిరుపతి) అని పిలిచే వారు. క్రమేణా కొండ అర్థం వచ్చేలా తిరుమలగా మారింది. తిరుపతిని అభివృద్ధి చేయడం అంటే శ్రీనివాసుడి అజమాయిషీలో ఉన్న ఆధ్యాత్మిక నగరాన్ని అభివృద్ధి చేయడమే. చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం తెలియనివారు తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చిస్తే అనవసర వివాదం చేస్తుంటారు. ఏపీ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన పరిశీలనలో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, ఉన్నవన్నీ గ్రామీణ పరిధి దాటని పట్టణాలు అని పేర్కొంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతోంది అనడానికి మంచి నగరాలుండటం ఒక కొలమానం. వెనుకబడిన రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం కూడా లేకపోతే ఇక అభివృద్ధికి ఆస్కారం ఎక్కడిది? ఈ వెలితిని తీర్చి మహానగరంగా మార్చగలిగే అవకాశం తిరుపతికి ఉన్నది. తిరుపతి నగరానికి అనుకుని చెన్నై, బెంగళూరు మహా నగరాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, భూమి సమస్య ఆ రెండు నగరాలకు ప్రతిబంధకంగా మారింది. ఆ ప్రతిబంధకమే తిరుపతి నగర అభివృద్ధికి అవకాశంగా మారుతుంది. తిరుపతి చుట్టూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో పాటు... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రోడ్డు, రైల్వే, విమాన మార్గాలు ఉన్నాయి. చెన్నై నగరానికి సమీపంలో మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీసిటీ ప్రత్యేక అర్థిక మండలి ఆసియా ఖండంలోనే అత్యంత విజయవంతం అయిన సెజ్‌గా మారింది. వాతావరణ సమతుల్యత అదనపు అనుకూలత. అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తిరుపతిని అత్యంత సౌకర్యవంతమైన నివాస యోగ్య నగరంగా గుర్తించాయి. తిరుపతి నగర పాలక సంస్థ తీర్మానం చేసినట్లు... చంద్రగిరి, కళ్యాణి డ్యామ్, వడమాల పేట, రాయలచెరువు, ఐఐటీ వరకు తిరుపతిని గ్రేటర్‌గా మార్చి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే అనతి కాలంలోనే మరో హైదరాబాద్‌గా మారుతుంది.తొలి దర్శనం నుంచి ప్రథమ పౌరురాలి వరకు...వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ప్రస్తావించడానికి ఇది సరైన సమయం. విజయనగర రాజుల తర్వాత యాదవ రాయలు తిరుపతి ఆలయాల అభివృద్ధిలో గొప్ప పాత్ర పోషించారు. శ్రీవారి ఆలయం ముందు భాగాన గొల్లమండపం నిర్మించి, గోవుల పెంప కంతో శ్రీవారి నైవేద్యానికి ఆ పాలను వినియోగించే వారని అంటారు. వివిధ కొలనులను వారి హయాంలోనే నిర్మించినట్లు ఆధారాలు కనిపిస్తాయి. దైవ దర్శనంలో కోనేటి స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. అందుకే శ్రీవారి ఆలయాలలో తొలి దర్శనం యాదవ వంశస్థులకు ఇస్తారు. అయితే ఈ సంప్ర దాయానికి సాధికారత ఇచ్చింది మాత్రం జగన్ గారే. అదే సామాజిక వర్గానికి చెందిన శిరీష యాదవ్‌ను తిరుపతి నగరానికి తొలి మేయర్‌గా చేసిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుంది. అది కూడా జనరల్ మేయర్ స్థానంలో బీసీలకు ఇవ్వాలనే నిర్ణయమూ, తిరు పతి అంకురార్పణలో కీలక భూమిక పోషించిన యాదవ సామాజిక వర్గానికి రాజకీయ గుర్తింపు ఇవ్వడమూ సముచిత నిర్ణయం. ఎంతో స్ఫూర్తినిచ్చే తిరుపతి నగర ఆవిర్భావ చారిత్రక సత్యాన్ని తన అధ్యయనం ద్వారా అందించిన చరిత్రకారుడు దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించి ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించిన నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అభినందనీయులు. మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
రాత్రి నిద్రలో కూడా ఆఫీస్ ఆలోచనలేనా?
పగలు ఆఫీసులో ఎనిమిది గంటలు పని చేస్తే.. రాత్రి నిద్రలో మరో ఎనిమిది గంటలు మెదడు అదే పనిని చేస్తూనే ఉందా?. బెడ్ మీద పడుకున్నాక కూడా రేపటి మీటింగ్, బాస్ అడిగే ప్రశ్నలు, పూర్తికాని రిపోర్టులు కళ్ళ ముందు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయా? అయితే మీరు 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా నిద్రలేమి, ఉదయాన్నే విపరీతమైన నీరసం మీ జీవితంలో భాగమైపోతున్నాయి.ఆలోచనలు ఎందుకు వస్తాయి? (The Zeigarnik Effect)మానసిక శాస్త్రంలో 'జైగార్నిక్ ఎఫెక్ట్' అనే ఒక సిద్ధాంతం ఉంది. మన మెదడు పూర్తి చేసిన పనుల కంటే, అసంపూర్తిగా వదిలేసిన పనులను (Unfinished Tasks) పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే శుక్రవారం వదిలేసిన ఫైలు ఆదివారం రాత్రి వరకు మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడు మాత్రం 'ఓవర్ టైమ్' పని చేస్తూనే ఉంటుంది.నా వద్దకు వచ్చిన రాకేష్ అనే టీమ్ లీడర్ అనుభవమే అందుకు ఉదాహరణ. అతను రాత్రి 2 గంటలకు కూడా మేలుకుని ఈమెయిల్స్ చెక్ చేసేవాడు. "మెయిల్ చెక్ చేయకపోతే ఏదో అపరాధం చేస్తున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పేవాడు. ఫలితంగా అతనికి 'క్రానిక్ ఇన్సోమ్నియా' (దీర్ఘకాలిక నిద్రలేమి) మొదలైంది. మేము అతనికి 'డిజిటల్ కర్ఫ్యూ' మరియు 'బ్రెయిన్ డంప్' టెక్నిక్స్ నేర్పించాం. పక్షం రోజుల్లోనే అతని నిద్ర నాణ్యత పెరిగింది, ఆఫీసులో పనితీరు కూడా మెరుగైంది.ఆఫీస్ ఆలోచనల నుండి విముక్తి పొందే 5 మార్గాలుబ్రెయిన్ డంప్ (Brain Dump): ఆఫీసు వదిలే ముందే లేదా పడుకోవడానికి గంట ముందు, మీ మెదడులో ఉన్న పనులన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. "ఇదిగో, ఈ పనులన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి, రేపు చూసుకోవచ్చు" అని మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వండి. అప్పుడు అది పదే పదే గుర్తు చేయడం ఆపుతుంది.వర్క్-హోమ్ రిచ్యువల్ (Work-Home Ritual): ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో ఒక నిర్దిష్టమైన పనిని అలవాటు చేసుకోండి. ఉదాహరణకు, ఆఫీసు ఐడి కార్డు తీసి బ్యాగులో పెట్టడం లేదా ఆఫీసు బట్టలు మార్చుకుని స్నానం చేయడం. ఇది మీ మెదడుకు "ఆఫీసు పని అయిపోయింది, ఇప్పుడు వ్యక్తిగత సమయం మొదలైంది" అని చెప్పే ఒక 'సైకలాజికల్ స్విచ్'.డిజిటల్ బౌండరీస్: పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టండి. ఆఫీసు వాట్సాప్ గ్రూపులను 'మ్యూట్' చేయండి. ఆ నీలి రంగు వెలుతురు (Blue light) మీ నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్‌ను దెబ్బతీస్తుంది.వర్రీ టైమ్ (Worry Time): మీకు ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించడానికి సాయంత్రం ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే వాటి గురించి ఆలోచించండి. బెడ్ మీదకు వెళ్ళాక ఆలోచనలు వస్తే, "దీని గురించి ఆలోచించడానికి రేపు సాయంత్రం టైమ్ ఉంది కదా" అని వాయిదా వేయండి.మైండ్‌ఫుల్ బ్రీతింగ్: నిద్రపోయే ముందు 4-7-8 టెక్నిక్ (4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు వదలడం) పాటించండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది.Today's Taskఈ రాత్రి పడుకునే ముందు, రేపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులను ఒక డైరీలో రాసి, ఆ డైరీని మూసి పక్కన పెట్టండి. మీ మెదడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గమనించండి.మీరు నిద్రపోవడం అంటే పనిని నిర్లక్ష్యం చేయడం కాదు.. రేపటి పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. గుర్రానికి విశ్రాంతి ఇస్తేనే అది రేపటి రేసులో పరిగెత్తగలదు. మీ మెదడు కూడా అంతే!- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్‌సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
మణి శంకర్ అయ్యర్ (84) రాయని డైరీ
‘‘మౌనం రాజ్యం ఏలుతోంది...’’ అని కవులు, రచయితలు అభివర్ణిస్తుంటారు. నిజానికి, మౌనం రాజ్యం ఏలదు. మౌనం వెనుక నక్కి ఉండే మనుషులే రాజ్యం ఏలుతుంటారు. ఆ రాజ్యంలో మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, మరో 81 మంది మాత్రమే ఉండరు. ఏదో ఒక మూల డబడబమని చప్పుడు చేస్తూ మణి శంకర్ అయ్యర్లు అనే నా వంటి గొడవ మనుషులూ ఉంటారు. గొడవ మనుషులు మౌనాన్ని – దాని పాటికి దాన్ని – ప్రశాంతంగా రాజ్యం ఏలనివ్వరు. ‘‘రాజ్యంలో మౌనానికి ఏం పని?!’’ అని మౌనాన్ని తరిమికొట్టటానికి వస్తారు.కనీసం అప్పుడైనా ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ఆ మరో 81 మంది మౌనం వీడరు. పవన్ ఖేరా వైపు మౌనంగా చూస్తారు. పవన్ ఖేరా బయటికి వచ్చి, ‘‘గౌరవనీయులు శ్రీ మణిశంకర్ అయ్యర్‌కూ, ఈ రాజ్యానికీ ఏ విధమైన సంబంధమూ లేదు...’’ అని ఒక ప్రకటన విడుదల చేసి, తిరిగి లోపలికి వెళ్లిపోతారు. వీళ్లంతా సీడబ్ల్యూసీ అనే రాజ్యంలోని మౌనవర్గ సభ్యులు. వాళ్లు మాట్లాడరు, ఎవరినీ మాట్లాడనివ్వరు.విమర్శలకు సమాధానం చెప్పలేని అసమర్థులే మౌనం అనే పూలచొక్కాను ధరిస్తారు. అసమ్మతిని సహించలేని వాళ్లే, గొంతు విప్పేవాడిని తీసుకెళ్లి ఊరి చివర చెట్టుకు కట్టేసి వస్తారు. ఆ చెట్టు పైన అప్పటికే ఉన్న ఒక పిట్ట ఏదైనా, ఆ సమయానికి ఏమీ తోచక కూసినా, ఆ కూయించింది ఈ మాట్లాడే మనిషే అయుంటాడని అనుమానపడతారు. మౌనానికి ఉండే దుర్లక్షణమే ‘అనుమానం’. మౌనంగా ఉండలేని వాడు చెట్టుకు కట్టేస్తే మాత్రం నోరు కట్టేసుకుంటాడా?! ‘‘కేరళలో ఈసారి కూడా కమ్యూనిస్టులదే అధికారం’’ అన్నాన్నేను. అంతేకాదు, కేసీ వేణుగోపాల్‌ని ‘‘రౌడీ’’ అన్నాను. పవన్ ఖేరాను ‘‘పలుకుల చిలక’’ అన్నాను. ఖేరా బయటికి వచ్చి మణి శంకర్ అయ్యర్‌కూ, మాకూ సంబంధం లేదు అని లోకానికి చాటి చెప్పింది ఇందుకే.మౌనం రాజ్యమేలే చోట, మనిషిని తప్పించటం కూడా చప్పుడు లేకుండానే జరిగి పోతుంది. ‘‘ఇక్కడ ఒక మనిషి ఉండాలే...’’ అనే సందేహం కూడా అక్కడెవరికీ రాదు! నాకు బాగా గుర్తు. 2023 ఆగస్టు 20. ఖర్గేజీ పార్టీ అధ్యక్షుడు అయిన పది నెలలకు తొలిసారి ఆ రోజు ప్రకటించిన కొత్త సీడబ్ల్యూసీలో నా పేరు లేదు! రెగ్యులర్ మెంబర్స్ లిస్ట్‌లో లేదు. పర్మినెంట్ ఇన్వైటీస్ లిస్ట్‌లో లేదు. స్టేట్ ఇన్‌ఛార్జిల లిస్ట్‌లో లేదు. కనీసం, అప్పటివరకు నేనున్న స్పెషల్ ఇన్వైటీస్ లిస్ట్‌లో కూడా లేదు.మాట్లాడే మనిషిని గొప్ప రాజనీతిజ్ఞతతో ఏమీ కాంగ్రెస్ తప్పించదు. నీతి లేనితనంగా తప్పిస్తుంది. ‘‘సీడబ్ల్యూసీలో ఉండే 25 మంది సభ్యుల సంఖ్యను 84కు పెంచి మరీ నిన్ను తొలగించామంటే, చోటు సరిపోక నిన్ను తీసేయటం కాదు, ఈ చోటుకు నువ్వు సరిపడవని తీసేయటమే...’’ అని చెప్పటమది!నాటి గాంధీజీ సీడబ్ల్యూసీ, ఈనాటి గాంధీల సీడబ్ల్యూసీ ఒకటి కాదు. ఎదురు మాట్లాడేవాళ్లు విరగబూసిన సీడబ్ల్యూసీ అది. నెహ్రూ, సుభాస్ చంద్రబోస్ నేరుగానే గాంధీజీతో వాదించారు, నేరుగానే గాంధీజీని విమర్శించారు. వారి మాటలకు గాంధీజీ విలువ ఇచ్చారు. ‘‘ఈ పార్టీని తండ్రి, కుమారుడు, సీడబ్ల్యూసీ అనే ఒక పవిత్రాత్మ కలిసి నడిపిస్తున్నారు’’ అని సుభాస్ చంద్రబోస్ గాంధీనీ, నెహ్రూనూ ఇద్దర్నీ కలిపి అన్నారు. దైవదూషణ వంటి అంత పెద్ద మాటకు కూడా బోస్‌ను ఆనాడు బహిష్కరించలేదు.వాదించేవాళ్ల వల్లే ఆవిర్భవించి, విభేదించే వాళ్ల వల్లే మనుగడ సాగించిన కాంగ్రెస్ పార్టీ... మాట్లాడక, మాట్లాడనివ్వక మౌనంతో రాజ్యం ఏలుతూ క్షీణదశకు చేరుకున్నట్లే ఉంది ఈనాటికి!! మాట ఈదురుగాలి. గట్టిగా లేని ఆకుల్ని రాల్చేస్తుంది. మౌనం వేరుకు పట్టిన చీడ. చెట్టునే కూల్చేస్తుంది. -
బహుళత్వ భావనకే గొడ్డలి పెట్టు
మన రాజ్యాంగ నిర్మాతలు జాతీయ గీతానికి ఏదో లాంఛనంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. భిన్నత్వాన్ని కనుమరుగు కానివ్వకుండానే ఏకత్వాన్ని చాటడానికి మన గణతంత్ర రాజ్యం ఉద్దేశపూర్వకంగానే ‘జనగణమన’ను జాతీయ గీతంగా ఎంచుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వు ఆ గీతానికి సంబంధించి ఇంతకాలం ఉన్న ప్రాధాన్యతా క్రమాన్ని మార్చేసింది. అధికారిక కార్యక్రమాలలో జాతీయ గీతానికి ముందు జాతీయ గేయమైన వందేమాతరాన్ని తప్పనిసరిగా ఆలపించాలని ఆ ఆదేశం సారాంశం. పైగా ఆరు చరణాలను పూర్తిగా ఆలపించాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులో ఆదేశించింది. అధికారిక కార్యక్రమాలలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తే చాలునని రాజ్యాంగ పరిషత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆ విధంగా పక్కనపెట్టినట్లయింది. ఈ వైఖరి జాతీయ గీతానికి అగ్ర ప్రాధాన్యం కట్టబెట్టిన రాజ్యాంగ అధికరణం 51(ఎ)ని అగౌరవపరచడమే!రాజ్యాంగ హోదాల్లో తేడాజాతీయ చిహ్నాల వరుస క్రమాన్ని నిర్వచించడానికీ, జాతీయ గీతం స్థానాన్ని తెలుపడానికీ రాజ్యాంగ పరిషత్ ఎంతో యోచించి నిర్ణయం తీసుకుంది. దాన్ని 1950లో ఉద్దేశపూర్వకంగానే సుస్థిర పరచారు. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో జాతి జనులను ఉత్తేజపరచిన మూడు గీతాలను పరిశీలించి, రెండింటిని ఎంపిక చేసుకున్నారు: అవి: జనగణమన, వందేమాతరం, సారే జహా సే అచ్ఛా!‘వందేమాతరం’ గేయం బంకించంద్ర ఛటోపాధ్యాయ 1882లో రాసిన ‘ఆనందమఠ్’ నవలలోనిది. దాన్ని రవీంద్రనాథ్ టాగోర్ స్వర పరిచారు. అది స్వాతంత్య్ర సమరాన్ని ప్రస్తుతించే శక్తిమంతమైన గేయం. అయితే, లౌకికవాదం, సమాన పౌరసత్వం పట్ల గణతంత్ర రాజ్యానికి ఉన్న రాజ్యాంగపరమైన నిబద్ధతను దృష్టిలో పెట్టుకున్న రాజ్యాంగ పరిషత్, దానిలో ఉన్న ప్రాథమిక ఆందోళనను గుర్తించింది. ప్రారంభంలోని చరణాలు మాతృభూమిని స్థూలంగా పౌర పదాలతో ప్రార్థిస్తే, తరువాతి చరణాలు భరతమాతను హిందూ దేవతగా అభివర్ణించాయి. అన్ని మతాలకు చెందిన పౌరులూ సమాన మేనని ప్రతిన బూనిన దేశంలో, దేశ మాతను ఆ రకంగా రూపుకట్టించడం చాలా మందికి రాజీపడటం కష్టమైన అంశంగా తోచింది. దానికనుగుణంగా, రాజ్యాంగ పరిషత్ కూడా జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న తేడాను గుర్తించింది. రెండింటికీ రాజ్యాంగపరంగా వేర్వేరు హోదాలు కల్పించింది. ఆ తేడాను సాక్షాత్తూ రవీంద్రనాథ్ టాగోర్ కూడా గుర్తించారు. దాంతో రాజ్యాంగ పరిషత్ నూతన గణతంత్ర రాజ్య సమ్మిళిత భావనా పూర్ణతనూ, బహుళత్వాన్నీ పూర్తిగా నింపుకొన్న గీతా నికి ప్రత్యేక స్థానాన్ని పదిలపరుస్తూ, స్వాతంత్య్రోద్యమంలో భావో ద్రేక పాత్ర వహించిన వందేమాతరాన్ని తగు రీతిలో గౌరవించింది.సమైక్యపరిచే ‘గీతం’భారతదేశ సార్వభౌమాధికారాన్ని, బహుళత్వాన్ని పంచుకుంటున్న రాజ్యాంగ భవిష్యత్తును అనునిత్యం గుర్తు చేసేదిగా ఉన్నందున రాజ్యాంగ పరిషత్ 1950 జనవరి 24న ‘జనగణమన’ను జాతీయ గీతంగా అధికారికంగా స్వీకరించింది. దానికి 52 సెకన్ల ఆలాపనను నిర్దేశించింది. భారత భాగ్యవిధాత అంటూ 1911లో స్వరపరచిన ఈ గీతాన్ని మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో కోల్‌కతాలో ఆలపించారు. ఒక్క చరణంలోనే భారత దేశాన్ని పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ,వంగ ప్రాంతాల సమ్మిశ్రితంగా పేర్కొంది. ఏక జాతీయతను డిమాండ్ చేయకుండానే అందరినీ ఆ తాను ముక్కలుగా పేర్కొంది. భారతీయ పాలితుడు ఆ విధంగా ఏకరూపతలో మిళితం అయి పోకుండానే, రాజకీయ భవితవ్యాన్ని పంచుకునేవాడు, బహుళ అస్తిత్వాలతో నివసించగల సామర్థ్యం ఉన్నవాడు. దేశ విభజన, మతపరమైన హింసాకాండ వేదనల నీడలో రాజ్యాంగ పరిషత్ చర్చలు జరుపవలసి వచ్చింది. భారత్ అధికా రికంగా లౌకిక పంథాను అనుసరించాలా లేక మెజారిటేరియన్ అస్తిత్వాన్ని సంతరించుకోవాలా అనే మీమాంస ఏర్పడింది. ఈ నేపథ్యంలో, జాతీయ గీతం ఎంపిక మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ విషయంలో రాజ్యాంగ నిర్ణేతల నిర్ణయం తాత్విక మైనదని కూడా చెప్పాలి. వారు సాంస్కృతిక మెజారిటేరియనిజం కన్నా పౌర జాతీయతనే ఎంచుకున్నారు. జాతీయ చిహ్నాలు సమైక్య పరచనూగలవు, మినహాయించనూగలవని వారికి తెలుసు. జాతీయ గీతానికీ, జాతీయ గేయానికీ మధ్యనున్న ఈ తేడా అలంకారప్రాయమైనది కాదు. సారభూతమైనది. మెజారిటేరియన్ ప్రేరణలు లేదా సాంస్కృతిక ఏకరూపత కన్నా సమాన పౌరసత్వ భావననే రాజ్యాంగ చట్రం ప్రతిబింబించింది. రాజ్యాంగ దృక్పథమే ఆదర్శంఅనేక దేశాల జాతీయ గీతాలకూ, భారతదేశ జాతీయ గీతానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది. చాలా జాతీయ గీతాలు సైనిక సమ రాన్ని లేదా విప్లవ హింసను ముందుంచుతాయి. కానీ ‘జనగణమన’ అలాంటిది కాదు. వివిధ ప్రాంతాలు, భాషా సమూహాల మధ్య ఐక్యతను ప్రబోధించేదిగా అది రూపొందింది. వైవిధ్య సహనశీలత రూపుదాల్చిన సమాఖ్య ప్రజాస్వామ్యానికి జాతీయ గీత నిర్మాణ రీతి అత్యంత అనువైనది. జాతీయ గీతంలోని పంక్తులు భారత రాజ్యాంగ సారాంశానికి అద్దం పడతాయి. ప్రస్తుత పాలనా యంత్రాంగం ఈ రాజ్యాంగ దృక్పథంతో తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ప్రభుత్వ తాజా మార్గదర్శకాలు రాజ్యాంగపరమైన చిహ్నాలపై ప్రభావం చూపేవిగా ఉన్నాయి. వందేమాతరం గేయాన్ని మొదట ఆలపించాలనడం అలాంటిదే. జాతీయ గేయాన్ని కొన్ని పంక్తులకే పరిమితం చేయడానికీ, ఆ రెండింటి మధ్య వరుస క్రమాన్ని మొదట్లోనే నిర్ణయించడానికీ రాజ్యాంగ పరిషత్‌ను పురిగొల్పిన ఆందోళనను ఇది మళ్ళీ ముందుకు తెస్తోంది.చర్చ, అసమ్మతి, ఆలోచనల తర్వాతనే 1950లో రాజీ సూత్రం ఏర్పడింది. ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఆ సమతూకాన్ని అస్థిరపరచడం ప్రభుత్వ ధోరణిని, ఎన్నికల రాజకీయాల సమీక రణల కసరత్తును మాత్రమే వెల్లడిస్తుంది. ‘జనగణమన’ ఆలాపన సమయంలో మనం నిల్చుంటున్నామంటే దాని శ్రావ్యతకు ముగ్ధులై మాత్రమే కాదు; ఇండియా పట్ల రాజ్యాంగానికి ఉన్న ఆలోచన, ఈ దేశంలో నివసిస్తున్న అందరికీ రిపబ్లిక్ సమానంగా చెందుతుందనే భావనను గౌరవిస్తూ, దానితో ఏకీభవిస్తూ నిలుచుంటున్నాం. ప్రతీకాత్మకంగానైనా లేదా సారభూతంగానైనా ఆ భావనకు కోత పెట్టడం జాతీయ గీత విస్తృత దార్శనికతను భంగపరచడమే అవు తుంది. ... జయ జయ జయ జయహే!జోయా హసన్వ్యాసకర్త జేఎన్‌యూలో ‘సెంటర్ ఫర్ పొలిటకల్ స్టడీస్’ ప్రొఫెసర్ ఎమిరిటా (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వారి త్యాగాలకు ఇదా విలువ?
ఏ వ్యవస్థను ఎక్కువ విశ్వసిస్తారని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే... సాయుధ దళాలు అగ్ర భాగాన నిలుస్తాయి. వరద జలాలలో వంతెనలు నిర్మించడం, మైనస్ ఉష్ణోగ్రతలలో సరిహద్దులను కాపలా కాయడం నుంచి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ సిందూర్ వరకు సైన్యం అందించే సేవలు వెల కట్టలేనివి. వారు విధి నిర్వహణలో రక్తాన్ని, చెమటను, కన్నీటిని చిందించవలసి ఉంటుంది. మనం మన సైనికుల గౌరవాన్ని ఎంతగానో కాపాడు తున్నట్లు చెప్పుకుంటాం. నిజంగా వారిని అంత నెత్తిన పెట్టుకుంటున్నామా? అదే నిజమైతే, 2026 బడ్జెట్ ప్రతిపాదనలలో కొన్నింటిపై మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సర్వీసు కాలం పూర్తయ్యేంత వరకు సేవలందించిన, అవయవాలను కోల్పోయిన సైనికులకు ఇచ్చే పెన్షన్‌పై పన్ను విధించే ప్రతిపాదన సబబేనా? సైనిక వికలాంగులపై పన్నా?సాయుధ దళాలకు ఇస్తున్న అంగవైకల్య పింఛను మొత్తాలు 1922 నుంచి పన్ను మినహాయింపు పొందుతున్నాయి. ఈ మినహా యింపును పరిమితం చేసే విధంగా ఆదాయ పన్ను చట్టాలకు సవరణ తీసుకురానున్నట్లు 2026 ఫైనాన్స్ బిల్లు పేర్కొంది. అవయవాలు కోల్పోయిన కారణంగా విధుల నుంచి పూర్తిగా వైదొలగవలసి వచ్చిన సైనికులకు మాత్రమే ఆ మినహాయింపును వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శరీరంలో ఏ అవయ వాన్ని అయినా కోల్పోయినా, విధులలో కొనసాగగల శక్తి సామర్థ్యా లున్నాయని మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ తెచ్చుకుని సర్వీసులో కొనసాగి రిటైరైనవారికి ఇచ్చే పెన్షనుకు ఆ మినహాయింపు వర్తించదు. వారు ఒక చెయ్యి లేదా కన్ను లేదా కాలు కోల్పోయినా పన్ను పడుతుంది. సర్వీసులో కొనసాగగల అర్హత లేనంతగా గాయపడిన వారు మాత్రం మినహాయింపు పొందగలుగుతారు. క్షతగాత్రులైన సైనికులను దయాదాక్షిణ్యాలపైన బతుకుతున్న వారిగా చూడకూడదు. వారు కూడా ఇంచుమించుగా అనన్య సామాన్యమైన శౌర్యవంతులే. తమకు కలిగిన గాయానికి భయపడ కుండా, దాని నుంచి మరింత శక్తిని, స్ఫూర్తిని కూడదీసుకుని తమకు అప్పగించిన విధులకు అంకితమవడం నిజానికి ప్రశంసించవలసిన విషయం.ముగ్గురు వీరుల ముచ్చటఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా 1971 యుద్ధంలో మనకు విజయాన్ని అందించారు. పాకిస్తాన్ సైన్యం లొంగుబాటు బాట పట్టేటట్లు చేసి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి తోడ్పడ్డారు. ఇంతవరకు మనకున్న ఇద్దరు ఫీల్డ్ మార్షళ్ళలో ఆయనొకరు. వృత్తి జీవితం ఆరంభంలోనే గాయపడిన చరిత్ర సామ్‌కు ఉంది. 1942 సిట్టాంగ్ యుద్ధంలో తన పటాలాన్ని జపాన్ సేనలకు వ్యతిరేకంగా నడిపిస్తూ బులెట్ల బారినపడ్డారు. ఆయన కడుపు, పేగులలోకి తొమ్మిది బుల్లెట్లు దూసుకుపోయాయి. ఎంత తీవ్రంగా గాయపడ్డారంటే, శస్త్ర చికిత్స చేసేందుకు సర్జన్ కూడా సంశయించారు. పైగా ‘ఒక కంచర గాడిద తన్నింది’ అంటూ సామ్ దాని గురించి హాస్యస్ఫోరకంగా చెప్పుకున్నారు. మేజర్ జనరల్ ఇయాన్ కార్డొజో అనుభవం కూడా తక్కువ దేమీ కాదు. సామ్ నేతృత్వం వహించిన 1971 యుద్ధంలో కార్డొజో కూడా పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్ అధికారి అయిన కార్డొజో అప్పటి తూర్పు పాకిస్తాన్లో భాగమైన సిల్హెట్లో మందుపాతర పేలుడులో తన కుడి కాలును కోల్పోయారు. ఆయన ఆ సంఘటనను ఎలా ఎదుర్కొన్నారో రోమాంచితమైన రీతిలో ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎముకలు కనిపించే విధంగా మాంసం ముక్కలు కాలు నుంచి కిందపడితే ఆయన తన పిడిబాకును బయటకు తీయించి ఛిద్రమైన ఆ భాగాన్ని తెగ్గొట్టవలసిందిగా కింది సిబ్బందిని ఆదేశించారు. ఆ అసాధారణ సైనికుడు మొదట ఒక బెటాలియన్‌కి, ఆ తర్వాత బ్రిగేడ్‌కి నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఒక అవయవాన్ని కోల్పోయిన అధికారి ఆ స్థాయిని అందుకోవడం అదే మొదటిసారి. ఒక కాలు లేకపోయినా, మంచులో నడుస్తూ కొండలపైకి ఎక్క గలననీ, చెప్పిన పనులు చేయగలననీ ఆయన పై అధికారులను ఒప్పించి చేసి చూపించగలిగారు. గాయం వల్ల డెస్కు పనులకే పరిమితమయ్యేందుకు తిరస్కరించారు. చివరగా, లెఫ్టినెంట్ జనరల్ విజయ్ ఒబెరాయ్ గురించి చెప్పు కుందాం. దేశంలో అత్యధిక పతకాలను అందుకున్న అధికారులలో ఆయనొకరు. భారత్–పాకిస్తాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో ఆయన కూడా కుడి కాలు కోల్పోయారు. అయినా, మరో నాలుగు దశాబ్దాలపాటు సైన్యానికి సేవలందించగలిగారు. కృత్రిమ కాలుతో మారథాన్లలో కూడా పాల్గొన్నారు. అవయవాలు కోల్పోయిన సైనికులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టే విధంగా ‘వార్ ఊండెడ్ ఫౌండేషన్’ను నెలకొల్పారు. ఆయన భారత సైన్య ఉప ప్రధానాధికారి స్థాయి వరకు ఎదిగారు. జీవన సంధ్యలో ఏదీ భరోసా?ఆదర్శంగా తీసుకోవలసిన జాతీయ హీరోల గాథలవి. అలాంటివారు చాలామంది ఉన్నారు. అటువంటి వీరుల డిజెబిలిటీ పెన్షన్‌పై పన్ను విధించడం సమంజసమా? అదీ వారి జీవన సంధ్యలో, ఆర్థిక భద్రత అత్యంత అవసరమైన కాలంలో పన్ను ప్రతిపాదన తీసుకురావడం ఎంతవరకు సముచితం? ధైర్య సాహసాలకుగానూ ఇటీవల వాయు సేనా మెడల్ అందుకున్న కార్పొరల్ వరుణ్ కుమార్‌ను దేశం కొనియాడింది. ఆపరేషన్ సిందూర్‌లో శత్రు క్షిపణి దాడిలో ఆయన తన కుడి చేతిని కోల్పోయారు. ఆయన చెరగని చిరునవ్వుతో తన ఎడమ చేయితోనే వైమానిక దళ ప్రధానాధికారికి శాల్యూట్ చేసిన ఫొటో ఎవరి హృదయాలనైనా కదిలిస్తుంది.నౌకా, వైమానిక, సైనిక దళాలకు చెందిన 10,000–12,000 మంది డిజెబిలిటీ పెన్షన్లు అందుకుంటున్నారని డేటా సూచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై పడిపోయే ఖర్చు కూడా పెద్దగా ఏమీ లేదు. జనరల్ మాలిక్ చెప్పినట్లుగా పెద్ద మొత్తాల ఖర్చులను గాలి కొదిలేసి, చిన్న మొత్తాల ఖర్చులను లెక్కలోకి తీసుకోవడం వివేకం అనిపించుకోదు. అసలిది ఖర్చుల కోణం నుంచి చూడవలసిన అంశం కాదు. ఒక సైనికుడి గౌరవ పరిరక్షణకు సంబంధించినది. దీని కోసం చర్చలు జరుపవలసిన లేదా పోరాడవలసిన అవసం ఏ సైనికుడికీ రాకూడదు. ఈ పన్ను ప్రతిపాదనను కేంద్రం పునః పరిశీలించి తీరాలి. బర్ఖా దత్‌వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎదగడానికి నాలుగు ట్రిక్కులు!
వృత్తిపరమైన ఐంద్రజాలికులు వాస్తవంగా ఉన్నవి నాలుగు రకాల ట్రిక్కులేనని చెబుతారు. అవి: ఒక రూపాన్ని మన కళ్ళకు కట్టించడం; దేన్నయినా అదృశ్యం చేయడం; రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం; చివరగా ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం. ఈ నాలుగింటినీ జీవితానికి అన్వయించుకుంటే మనమూ ఎదుటివారిని ఆశ్చర్యచకితులను చేయగలం. ఎలాగంటారా... మొదటి ట్రిక్కు: మన ఉనికిని చాటుకోవడమంటే, భౌతికంగా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు; మనల్ని మనం అత్యుత్తమమైన రీతిలో ప్రదర్శించుకోవడం! మనం ఊసరవెల్లి లాంటివాళ్ళం. తల్లితండ్రుల ముందు ఒకలా, స్నేహితుల వద్ద మరోలా ప్రవర్తిస్తాం. కానీ, ఈ బాహ్యమైన నేను కాకుండా ‘లోపల మరో నేను’ ఉంటాడు. మన అసలు స్వరూపం అదే! మనకు ఇష్టమైన వ్యాపకంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరింపజేసేది వాడే! మనం అరమరికలు లేకుండా ఎవరి వద్ద వ్యవహరించగలమో, ఎవరు మన ‘లోపలి మనిషి’ని అభినందించగలుగుతారో అలాంటి వాళ్ళ వద్దనే ఆ ‘లోపలి మనిషి’ బయటపడతాడు. మిషిగన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, బోస్టన్‌లో మొదటి ఉద్యోగంలో చేరాను. అక్కడి బాస్ నన్ను తీర్చిదిద్దుతానన్నాడు. నేనెంతో సంతోషపడ్డాను. తీరా, నేను ఉద్యోగంలో చేరేందుకు వెళ్ళేటప్పటికి, ఆయన కాస్తా ఉద్యోగం వదలి వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది అనుకున్నాను.తిరస్కరణతో... జీవితం తలకిందులవదు!‘‘ఈ ఏడాది ఏం చేయబోతున్నానో ‘నాకు లోపల’ తెలిసి పోతోంది. నా కష్టాలు, కన్నీళ్ళతోనే ఓ నవల రాస్తా’’నని నా స్నేహి తురాలితో చెప్పాను. అందుకామె నవ్వలేదు. ‘బ్రహ్మాండం. అదే పనిలో ఉండు’ అంది. ఆమె నా లోపలి మనిషిని గుర్తించి అతడి సత్తాపై నమ్మకం ఉంచిందన్నమాట. అలా వెన్ను తట్టేవారు మన అమ్మ, నాన్న, తాత, బామ్మ ఎవరైనా కావచ్చు. అటువంటి బేషరతు మద్దతు లభించినపుడు మనలోని నిజమైన సామర్థ్యం బయటకు వస్తుంది. అందుకని, ఇపుడు మీ స్నేహితులను అంటిపెట్టుకుని ఉండండి. వారి ప్రేమ, నమ్మకం ముందుకు నడిపిస్తాయి. నేనా పుస్తకాన్ని పూర్తి చేసి, ప్రచురణకు అభ్యర్థిస్తూ పంపిస్తే, ప్రచురించలేమంటూ 24 ఉత్తరాలొచ్చాయి. ప్రచురణకర్తలు ఉన్నది 20 మందే! అంటే, కొందరు రెండుసార్లు తిరస్కరించారన్నమాట. వాళ్లకు ఆ పుస్తకం నచ్చకపోతే మరో పుస్తకం రాస్తానని అను కున్నాను. అదీ నచ్చకపోతే ఇంకోటి రాస్తానని ధైర్యం చెప్పు కున్నాను. ఆ తదుపరి పుస్తకం ప్రచురణకు నోచుకుంది. భయాన్ని బలంగా మలచుకోండి!మనం అదృశ్యం చేయాల్సింది భయాన్ని! ఇదే రెండో ట్రిక్కు. హైస్కూలులో ఉండగా, ఓ చోట ఐస్‌క్రీమ్ అందించే ఉద్యోగం చేశాను. ఒకావిడ వచ్చి ఐస్‌క్రీమ్ ఆర్డరు చేసింది. ఒక్క క్షణంలో ఇస్తానన్నాను. ఈ క్షణంలోనే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. కానీ నేను బెదిరిపోలేదు. దాంతో ఈ దిక్కుమాలిన షాపులో జీవితాంతం గడుపుతావంటూ తిట్టిపోసింది. నిజం ఒప్పుకొని తీరాలి. నేను కలవరపడిన మాట వాస్తవం. కానీ, ఆ మహిళ నాలో రేకెత్తించిన భయం నాలో కసిని పెంచింది. కనుక, భయాన్ని పారదోలండి. భయం ఏదో చెరుపు చేస్తుందని కాదు. భయాన్ని ప్రేరణగా తీసుకుని ప్రయోజనం పొందే ప్రయత్నం చేయండి. ఒకరు తక్కువ అంచనా వేసినంత మాత్రాన కుంగిపోనవసరం లేదు. నిశ్శబ్దంగానే మీ విషయంలో వారి అంచనాలు తప్పు అని నిరూపించండి. దయాగుణంతో విప్లవం తేవచ్చు!రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం ఇంద్ర జాలంలో మూడవ ట్రిక్కు అనుకున్నాం కదా! ఇక్కడ సహానుభూతి గురించి చెప్పుకోవాలి. ఇతరుల కష్టాలను వారి దృక్కోణం నుంచి చూడటం అలవరచుకోవాలి. నాకు 13 ఏళ్ళపుడు మా నాన్న ఉద్యోగం పోయింది. దాంతో మేం బ్రూక్లిన్ నుంచి మయామీకి మకాం మార్చాం. అక్కడ మా తాత, నాయనమ్మ ఉన్నారు. అమ్మ, నాన్న, చెల్లి, నేను, ఆ పెద్దవాళ్ళు కలిసి మొత్తం ఆరుగురం కొన్ని నెలలపాటు సింగిల్ బెడ్రూమ్ అపార్టుమెంట్లోనే తలదాచు కున్నాం. ఇంతమంది ఏమిటంటూ కొందరు గొడవకు దిగారు. పొరుగునే ఉన్న మరో వాటా ఆవిడ తాను అపార్టుమెంటును ఖాళీ చేస్తున్నాననీ, పెద్దవాళ్ళు ఇద్దరూ అందులో ఉండ వచ్చనీ చెప్పి అనునయించింది. కాకతాళీయంగా ఆవిడ పేరు మెర్సీ. ఔను! పేరుకు తగ్గట్లు దయచూపిన మహాత్మురాలు. ఈ నిరాశావాద ప్రపంచంలో సిసలైన దయాగుణం గాయాలను మాన్పుతుంది. క్రూరంగా వ్యవహరించడం, విషం కక్కడం, అభిప్రా యాలతో ఏకీభవించనివారి పట్ల కరకుగా ప్రవర్తించడం మన సంస్కృతిలో భాగాలైపోయాయి. కానీ, క్రూరత్వం బలానికి రుజువు కాదు. బాధపడుతున్నవారి స్థానంలోకి మనం వెళ్ళ గలిగితే అది బలం అనిపించుకుంటుంది. ఇక్కడున్నవారిలో కొందరికి రకరకాల కష్టాలు ఉండ వచ్చు. నేటి గ్రాడ్యుయేట్లలో మా అబ్బాయి కూడా ఉన్నాడు. మా అమ్మ, నాన్న ఉండి ఉంటే, ఈ కార్యక్రమాన్ని చూసి ఎంత సంతోషించేవారో అని నాకూ అనిపిస్తోంది. జీవితంలో మున్ముందు మీకెదురయ్యే ప్రతి వ్యక్తీ మీకు పైకి కనిపించని సమస్యతో సతమత మవుతూ ఉండవచ్చు. వారి స్థానంలోకి వెళ్లి వారి గురించి ఆలోచించండి. ప్రపంచానికి మరింత సహానుభూతి, మరింత వినయ విధేయతలు, ముఖ్యంగా మానవ మర్యాదలను కనబరచడం అవసరం. మీరు నిజంగా ప్రపచాన్ని నివ్వెరపరచదలచుకుంటే, మీలోని దయా గుణాన్ని బయటకు తీయండి. మార్పు చెందుతూనే ఉండాలి!ఇంద్రజాలంలో చివరి ట్రిక్కు– ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం! అన్ని ట్రిక్కుల కన్నా ఇదే కష్టమైనది. రూపాంతరం చెందడం. చిన్నప్పుడు మనం రకరకాల రూపాలను ఇష్టపడినా, పెద్ద యిన తర్వాత, ఒక మూసలో ఒదిగిపోయేందుకు మొగ్గు చూపుతాం. ప్రపంచం పట్ల, మీపట్ల మీకొక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. కానీ, మారకపోతే మకిలిపట్టిపోతాం. ఆశలు, ఆశయాలను సమయానుకూలంగా సవరించుకోవడంలో తప్పు లేదు. మనల్ని మించినవారు లేరనుకుంటే పప్పులో కాలేసినట్లే. తమ ఆలోచనా ధోరణిని తామే ప్రశ్నించుకుని, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని భావించే లక్షణాన్ని నేను కొందరు అత్యంత ప్రజ్ఞావంతులలో గమనించాను. నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మారాలి. అన్నీ తెలిసిపోయాయని ఎన్నడూ అనుకోకండి. అవకాశాలు అనంతంగా ఉంటాయి. వాటిని అందుకునేందుకు సిద్ధ పడాలి అంతే! ఎక్కడెక్కడ మీ ప్రతిభా నైపుణ్యాలను కనబరచడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ అన్వేషించండి. ఒకటే మార్గంలో పయనించాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఒక్కొక్క నైపుణ్యాన్ని ఒక్కొక్కచోట ఉపయోగించుకోవచ్చు. -
దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఈ ఏడాది ఆదిలోనే హంస పాదు ఎదురైంది. శ్రీహరికోట నుంచి జనవరి 12న ప్రయోగించిన పోలార్ ఉప గ్రహ వాహక నౌక (పీఎస్ఎల్వీ) విఫలమైంది. ఈ వాహక నౌక వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు, మన దేశానికి చెందిన ఒక వ్యూహాత్మక ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉంది. మిగిలిన అంతరిక్ష పరిశోధనా సంస్థల మాదిరిగానే ఇస్రో కూడా గతంలో కొన్ని వైఫల్యాలను చవి చూసింది. కానీ, కొన్ని సందర్భాల్లో అంతరిక్ష ప్రయోగాలు ఆందోళనను రేకెత్తిస్తాయి. లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన, నిశితంగా సమీక్షించుకోవలసిన అవసరాన్ని చాటుతాయి. తాజా వైఫల్యం పలు కారణాల రీత్యా ఆ కోవకు చెందినదే!పరుగెత్తని పంచకల్యాణిపీఎస్ఎల్వీకి 63 సార్లు విజయం సాధించిన ఘన చరిత్ర ఉంది. చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయాలు దాని ఖాతాలోకే వస్తాయి. దాన్ని తమ పంచకల్యాణి గుర్రంగా ఇస్రో చెప్పుకొంటుంది. ఒకటి రెండు వైఫల్యాలు లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేనివిగానే కనిపించవచ్చు. కానీ, పీఎస్ఎల్వీకి ఇది వరుసగా రెండో వైఫల్యం. గతేడాది మే 18న ప్రయోగించిన దానికి కూడా ఇదే గతి పట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ రాకెట్ మూడవ దశలోనే లోపం తలెత్తింది. గత (2025) ప్రహసనం ఆధారంగా ఈసారి ఏమైనా మార్పులు చేసిందీ లేనిదీ ఇస్రో వెల్లడించలేదు. వైఫల్యాలను కూలంకషంగా విశ్లేషించుకునే బలమైన వ్యవస్థ ఇస్రోకు ఉంది. దీనికి 2021లో జియో ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ) వైఫల్యంపై వెల్లడైన నివేదికే ఉదాహరణ. క్రయోజనిక్ దశ జ్వలన సమయంలో దిగువ లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంకులో పీడనం, ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ సక్రమంగా పనిచేయక పోవడానికి కారణమైందనీ, ఫలితంగా మొత్తం మిషన్ విఫలమైందనీ ఆ ఉదంతంలో తేల్చారు. కానీ, 2025 మే నాటి వైఫల్యం గురించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. పారదర్శకంగా వ్యవహరించడంలో ఇస్రోకు మంచి చరిత్రే ఉంది. అది ఆ బాట నుంచి వైదొలగుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఉపగ్రహాలకే ఎదురుదెబ్బవరుసగా రెండు పీఎస్ఎల్వీ వైఫల్యాలతోపాటు, గతేడాది కాలంలో, ఇస్రో మరో వైఫల్యపు అపఖ్యాతిని కూడా మూట గట్టుకుంది. కానీ, అది రాకెట్ వైఫల్యం కాదు. ఉపగ్రహ వైఫల్యం! ఇస్రో 2025 జనవరి 29న చేపట్టిన జీఎస్ఎల్వీ ప్రయోగంతో శ్రీహరికోట నుంచి వంద సార్లు ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును సృష్టించింది. ఆ వాహక నౌక ప్రయోగానంతరం, అది ఎన్విఎస్–02 నావిగేషన్ ఉపగ్రహాన్ని దానికి ఉద్దేశించిన ట్రాన్స్ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించింది. అయితే, ఆన్‌బోర్డ్ థ్రస్టర్లను జ్వలింప జేసేందుకు ఆక్సిడైజర్‌కు వీలు కల్పించే కవాటాలు తెరుచుకోని కారణంగా, నిర్ణయించిన స్లాట్‌లో ఉపగ్రహం కుదురుకోలేక పోయిందని చెప్పింది. ఏడాది కాలంలో మూడు వైఫల్యాలు ఎదురవడం అటు ఇస్రోకు గానీ, ఇటు దాని దేశ, విదేశీ కస్టమర్లకు గానీ తీవ్ర పర్యవసానాలనే కలుగ జేస్తోంది. పైగా, ఈ వైఫల్యాల కారణంగా కోల్పోయిన మూడు భారతీయ ఉపగ్రహాలు కీలకమైన సైనిక ఉపగ్రహాలు. ఆశించిన కక్ష్యలో కుదురు కోలేకపోయిన ఎన్విఎస్–02 ఒక నేవి గేషన్ ఉపగ్రహం. అది స్టాండర్డ్ పొజి షనింగ్ సర్వీసులతో పాటు, ‘రిస్ట్రిక్ టెడ్ సర్వీసులను’ కూడా సమకూరు స్తుంది. గతేడాది వైఫల్యంతో ఇఓఎస్– 09 ఉపగ్రహాన్ని కోల్పోయాం. ఆపరేషనల్ అప్లికేషన్లలో ఉన్న ఏజన్సీలకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించేట్లుగా దాన్ని డిజైన్ చేశారు. దానిలో సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఇమేజ్‌లను సమకూర్చగల సామర్థ్యం ఆ పేలోడ్‌కు ఉంది. రక్షణ పరిశోధన ఏజన్సీలు అభివృద్ధి చేసిన ఇఓఎస్ –ఎన్1 (అన్వేషగా పిలుస్తున్నారు) భూ పరిశీలనా ఉపగ్రహాన్ని ఈ జనవరిలో ప్రయోగించిన పోలార్ వాహక నౌకలో అమర్చారు. అంతరిక్షం నుంచి సైన్యానికి ఉపయోగపడగలిగిన మూడు వ్యూహాత్మక ఆస్తులను కోల్పోవడం అంతరిక్ష, రక్షణ ఏజన్సీలకు మేలుకొలుపు కావాలి. అంతరిక్షం నుంచి సైన్యం ప్రయోజనాలను తీర్చగలిగిన దాదాపు 52 ఉపగ్రహాలను వచ్చే ఐదేళ్ళలో ప్రయోగించాలని బెంగళూరులోని డిఫెన్స్ స్పేస్ ఏజన్సీ ప్రణాళికలతో ఉంది. అంతరిక్ష ఆధారిత నిఘా (ఎస్బిఎస్) ప్రాజెక్టు 3వ దశ కింద వాటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఉపగ్రహాలను తయారు చేసినా, ప్రైవేటు కంపెనీల ద్వారా పొందినా, వాటిని అంతరిక్షంలోకి చేర్చవలసిన బాధ్యత ఇస్రోపైనే ఉంటుంది. వాణిజ్య నష్టం అపారంఈ నెలలో వెళ్ళిన వాహక నౌక ఇఓఎస్–ఎన్1తో పాటు దేశ, విదేశీ కస్ట మర్లకు చెందిన 15 ఉపగ్రహాలను మోసు కెళ్ళింది. వాటిలో ‘ధ్రువ స్పేస్’కు చెందిన ఐదు ఉపగ్రహాలున్నాయి. ఆ ఐదింటిలో నేపాల్‌ది ఒకటి. బ్రెజిల్‌కు చెందిన ఆల్టో స్పేస్‌కు చెందిన మరో ఐదు ఉపగ్రహాలున్నాయి. బ్రిటన్–థాయి లాండ్ సంయుక్త ఉపగ్రహంతోపాటు, భారతీయ కస్టమర్లకు చెందిన మరో రెండు చిన్న ఇతర ఉపగ్రహాలు, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ చేయూతతో స్పెయిన్ కంపెనీ తయారు చేసిన ‘కిడ్’ ఉపగ్రహం కూడా ఉంది. ధ్రువతోపాటు ఇతర భారతీయ అంకుర సంస్థలు పీఎస్ఎల్వీ పైనే ఆశ పెట్టుకున్నాయి. అవి పెద్ద మొత్తంలో నగదుతోపాటు విలువైన కాలాన్ని, అవ కాశాన్ని కూడా కోల్పోయినట్లు లెక్క. ఉప గ్రహాల సైజును బట్టి వాటిని తయారు చేసేందుకు కంపెనీలకు కొద్ది నెలల నుంచి కొద్ది ఏళ్ళు పట్టవచ్చు. కోల్పో యినవాటి స్థానంలో అవి కొత్త వాటిని వేగంగా తయారు చేసుకున్నా, పీఎస్ ఎల్వీలో చోటు కోసం అవి చాలాకాలం ఎదురుచూడక తప్పదు. దీనికితోడు, రాకెట్ విశ్వసనీయత దెబ్బ తినడం వల్ల బీమా ఖర్చులు పెరుగుతాయి. అది తిరిగి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుంది. వరుసగా రెండు వైఫల్యాల నేపథ్యంలో, భవిష్యత్ పీఎస్ఎల్వీ ప్రయోగాలను సమీక్షించుకోవడం ఇస్రోకు తక్షణ కర్తవ్యంగా మారు తోంది. ఈ ఏడాది మరికొన్ని ఇతర ప్రయోగాలు నిర్వహించవలసి ఉంది. ముఖ్యంగా గగన్‌యాన్ కార్యక్రమం కింద సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష నౌకను కక్ష్యలో తిప్పనున్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను పంపడంపై జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాం. ఈ స్థితిలో ఇస్రోపై బృహత్తర బాధ్యత పడుతోంది. అది టెక్నికల్, క్వాలిటీ, మేనేజీరియల్ ప్రక్రియలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాలి. విశ్వసనీయమైనదని ఉన్న పేరును కాపాడుకునేందుకు అదొక్కటే మార్గం! దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్‌టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్‌సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
నిందలతో సవాళ్లు సమసిపోవు!
పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ యోధులు జన వరి 31న బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచ్ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్ (24)గా బీఎల్ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్ దేశీయాంగ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.బుగతీ హత్యతో మరో తిరుగుబాటునఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్ ప్రాంతం పాక్‌లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్ పైపులైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ ఖాన్ బుగతీని అప్పటి పాక్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్ ఖేర్ బకష్ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్‌కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. వనరులు బలూచిస్తాన్వి అయినా...అక్బర్ ఖాన్ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్‌లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్‌లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. పాక్ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్ ఇపుడు ట్రంప్‌కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. మారిన పోరాట పంథాబలూచ్ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్‌కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.బీఎల్ఏకు 2018 నుంచి బషీర్ జెబ్ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్‌కు అల్లా నాజర్ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో జెబ్ డిప్లొమా చేయగా, నాజర్ వృత్తి రీత్యా డాక్టర్. వీరి నేతృత్వంలో బలూచ్ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్ఏ చెప్పుకొంది. నేటి సోషల్ మీడియా యుగంలో జెబ్, నాజర్ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.దాడులతో భంగపడిన సైన్యం బలూచ్ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రైతుల పాలిట పిడుగుపాటు
షేక్స్పియర్ నాటకంలోలాగా, ఎవరి మాటలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో తెలియని సంకటం. ‘అమెరికన్ రైతులకు మేలు చేసే విధంగా’ ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు ట్రంప్‌కు అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ కృతజ్ఞతలు తెలి పారు. సున్నిత అంశాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు తగు రక్షణ కల్పి స్తూనే అమెరికాతో ‘చారిత్రక’ ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు మోదీని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఒప్పందంలోని వివరాలు పూర్తిగా వెల్లడైన తర్వాతనే, అది రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాలకు ఉభయ తారకమైనదా లేక బెదిరింపు ధోరణితో మెడలు వంచి ఒప్పిస్తున్నదా అన్నది తేలుతుంది. కానీ, ఇంతవరకు బహిర్గతమైన వివరాలే రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముంచెత్తితే ప్రమాదమే!దేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే దయనీయ స్థితిలో ఉంది. ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా 30–40 శాతం తక్కువ ధరకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఈ స్థితిలో భారత మార్కెట్లోకి ద్వారాలు తెరిస్తే... హెచ్చు సబ్సిడీలు పొందు తున్న, చౌకైన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యవసాయ వనరుల నిర్వహణ (2020) సర్వే ప్రకారం, అమెరికన్ రైతులు ఏటా భారీ సబ్సిడీలు పొందుతున్నారు. అక్కడి రైతుకు ఏటా సగటున 66,314 డాలర్ల సబ్సిడీ లభిస్తున్నట్లు అంచనా. ఆ సబ్సిడీలు మార్కెట్లోని హెచ్చుతగ్గుల నుంచి అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయి. రైతులకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ (ఎఫ్బీయే) కింద ఎకరాకు వస్తు చెల్లింపుల కింద మొత్తం 12 బిలియన్ డాలర్లను సమకూర్చాలని అమెరికన్ ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ఆ పథ కాన్ని ‘ఒక పెద్ద అందమైన బిల్లు’గా అభివర్ణిస్తున్నారు. అయితే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకా లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. నాన్–ట్యారిఫ్ ప్రతిబంధకాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. రైతుల నిరసన హెచ్చరికలురైతుల ప్రయోజనాలను జాగ్రత్తగా ‘సంరక్షించిన’ తర్వాతనే ఒప్పందం కుదిరిందని మన వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రయోజనాలకు భంగం వాటిల్లదనే హామీలు వెలువడుతున్నా ఇది రైతుల్లో సందిగ్ధాన్ని సృష్టిస్తోంది. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేస్తే, ఆహార పదార్థాలు దేశంలోకి కుప్పతెప్పలుగా వచ్చిపడతాయని 2020–21లో న్యూఢిల్లీ చుట్టుపక్కల రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన సంయుక్త్ కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది. 2020–21 తరహాలోనే కొత్తగా నిరసనలకు దిగుతామని అది బెదిరిస్తోంది. భారతీయ రైతులు 2000–01 నుంచి 2024–25 మధ్య కాలంలో సమష్టిగా రూ. 111 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారని ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ‘‘అది రైతులకు అశని పాతమే కాదు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అవుతుంది’’ అని హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్ల తోటల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు హరీశ్ చౌహాన్ అంటున్నారు.యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్‌లతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆపిల్ పండ్లకు మార్కెట్ అసాధారణమైన రీతిలో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఆపిల్ తోటల పెంపకం పరిశ్రమ క్రమంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని భయ సందేహాలు వ్యక్తమవు తున్నాయి. సుంకాలు ఏమీ లేకుండా అమెరికా ఆపిల్ పండ్లు దిగు మతి అయితే, మన దేశంలో ఆపిల్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పోతుందని హరీశ్ హెచ్చరిస్తున్నారు. సుంకాలు లేకపోతే సమస్యే!పడిపోయిన ధరలతో పత్తి, సోయా, ఉల్లిపాయల రైతులు ఇప్ప టికే బిక్కుబిక్కుమంటున్నారు. సుంకాలు ఏమీ లేకుండా అవి దిగు మతి అయి, ధరలు మరింతగా పతనమైతే, వారు ఆ పంటలను వదిలేసి చేతులెత్తేయడం మినహా చేయగలిగింది లేదు. ఏడాదికి 500 బిలియన్ల విలువైన అమెరికన్ ఎగుమతుల గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. అందులో ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటి రంగాలవి కూడా ఉన్నాయి. అయితే, అది ఏడాదికి దాదాపు 100 బిలియన్ డాలర్ల చొప్పున ఐదేళ్ళ కాలానికి లెక్క చెప్పినదై ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తు న్నారు. అమెరికన్ ఎగుమతులన్నీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులతోనే నిండి ఉంటాయని భావించడం కూడా సబబు కాదు. పత్తి, పప్పుధాన్యాలు, ఉల్లిపాయల వంటి వస్తువుల విషయంలో ఒక కోటా మేరకు మాత్రమే మార్కెట్ అందుబాటులో ఉంటుందని వార్తలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడం లాంటిదేనని అర్థం చేసుకోవాలి. గత ఏడాది సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో, పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తొలగించినపుడు చౌక ధరకు పత్తి బేళ్ళు అపారంగా వచ్చిపడ్డాయి. దేశంలో పత్తి ధరలు తగ్గాయి. అందుకు వస్త్ర పరిశ్రమవారు సంతోషించారు కానీ, రైతులు నష్ట పోయారు. మూడు నెలల్లో 30 లక్షల పత్తి బేళ్ళు దిగుమతి అయ్యాయి. పత్తి ధర క్వింటాల్‌కు రూ. 1,000–రూ.1,500 వరకు పడిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దాలని ట్రంప్ చూస్తున్న నూతన వాణిజ్య వ్యవస్థ... ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకమైనది. ట్రంప్ తన కొత్త వ్యవస్థకు ‘యూరో పియన్ యూనియన్ కూడా తలొగ్గేట్లు చేయాలని చూస్తున్నారు. వాణిజ్య సంస్థ 1995లో ఏర్పడినప్పటి నుంచి అమెరికా పప్పులు ఉడకడం లేదు. అది ఇపుడు ఎలాగైనా తన పంతం నెగ్గించు కోవాలని చూస్తోంది. ఒత్తిడికి లొంగిపోతున్న దేశాలతో, నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిష్కృతమవుతోంది. ‘కండ గలవాడిదే రాజ్యం’ అన్న లోకోక్తి ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెప్పాలి. దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
అసమానతలను రాజేయనున్న ఏఐ
దావోస్‌లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో చర్చించిన ప్రాథమికాంశాలలో ‘కృత్రిమ మేధ (ఏఐ)– దాని ప్రభావం’ కూడా ఉంది. ఏఐని ఆశ్రయించక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అనుసరించడంలో మందగమనంతో సాగవచ్చు నేమోకానీ, ఏదో ఒకనాడు దాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. ఏఐని ఆశ్రయించడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి; అదే సమయంలో... అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలలో కొన్ని ఆందో ళనలున్నాయి. ‘ఫోరమ్’ సర్వే ఏం చెబుతోంది?ఆర్థికవేత్తలలో ఫోరమ్ ఈ అంశంపై నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటి స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని దాదాపు 54 శాతం మంది అంగీకరించారు. కంపెనీలు ఏఐని ఎక్కువ వినియోగించు కుంటే లాభాల మార్జిన్లు పెరుగుతాయని సుమారు 45 శాతం మంది నమ్ముతున్నారు. అంటే, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇది వివక్షకు దారితీయవచ్చని 21 శాతం మంది భయాలు వ్యక్త పరిచారు. వివిధ రంగాల పరిశ్రమల సామర్థ్యం ఏఐతో మెరుగుపడుతుందని మన దేశంలోనూ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐని ఎక్కువ వినియోగించుకోవడం వల్ల అన్ని కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ విభాగం సేవలు మెరుగుపడతాయి. ఆ విభాగం చాట్ బాట్స్‌ను సృష్టించుకోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దాదాపు అన్ని సేవా రంగాల పరిశ్రమలూ అటువంటి సాధనాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు రిటైల్ కస్టమర్లతో ప్రమేయమున్న అన్ని వ్యాపార సంస్థలూ ఏఐని ఆశ్రయించక తప్పదు. కీలక రంగాల్లో ఏఐ వినియోగంబ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగంలో రుణ యోగ్యతను మదింపు చేసేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. రుణం కోరుతున్న కంపెనీకి చెందిన మొత్తం సమాచారాన్ని ఏఐ సమీకరించి, తిరిగి చెల్లించగల సామర్థ్యంపై అంచనాలు అందివ్వగలదు. కలన గణితాలను ఆధారం చేసుకుని, ఏ మేరకు రుణం మంజూరు చేయవచ్చునో, ఎంత వడ్డీ వసూలు చేయవచ్చునో తెలుపుతుంది. ముందే నిర్ణయించిన సూచికలను ఆధారం చేసుకుని ఆ కంపెనీ ఎగవేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చెప్పగలుగు తుంది. ఏఐ వినియోగం వల్ల మోసాన్ని కనిపెట్టడం తేలిక. ఫలితంగా, ఆ రంగానికి ఎంతో మేలు చేసినదవుతుంది. ఐటీ రంగంలో ఇప్పటికే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం కోడింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ పనిని ఏఐకి అప్ప గిస్తున్నారు. ఈ కంపెనీలు సూచిస్తున్న పరిష్కారాలు క్లయింట్లకు ఉపయోగపడుతున్నాయి. ఆ క్లయింట్లు ఏఐ వినియోగంతో హెచ్చు సామర్థ్య స్థాయులతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటు న్నారు. రిటైల్ రంగంలో, కస్టమర్ సంబంధ మాడ్యూల్ మొత్తాన్ని ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఉత్పత్తులను సమర్థంగా డెలివరీ చేసేందుకు ఉపయోగపడుతోంది. స్టోరుకు వెళ్ళే వినియోగ దారుల ఇష్టాలు, అభిరుచుల సమాచారం మొత్తాన్ని ఏఐ క్రోడీక రిస్తోంది. వాటికి తగ్గట్లుగా ఆ యా ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తేలికవుతోంది. ఆరోగ్య రక్షణ రంగంలో సప్లై చెయిన్ నిర్వహణను ఏఐ సమకూరుస్తోంది. ఏ వ్యాపార రంగానికైనా ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోందనీ, దాన్ని ఉపయోగించు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ వీటివల్ల స్పష్ట మవుతోంది. కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా క్రమేపీ ఏఐని ఆసరా చేసుకుంటు న్నాయి. ఏఐ సాధనాలు అందించిన ఇన్పుట్ల ఆధారంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడే ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురుకాగల పోటీని అంచనా వేసుకోగలుగు తున్నాయి. కాకపోతే, ఏఐని ఒక టెక్నాలజీగా వినియోగించుకోవడం చౌక కాదు. విద్యుచ్ఛక్తి ఎక్కువ అవసరమవుతుంది. గ్లోబల్ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2035 నాటికి 1,200 టెరావాట్–గంట లను మించిపోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అంటే, 2024 స్థాయులకన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. ఏఐ వృద్ధికి సమాంతరంగా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచు కోవాలి. అయితే, మున్ముందు ఈ వ్యయాలు తగ్గుతాయనీ, లాభాలు పెంచుకునే వీలుంటుందనీ కంపెనీలు భావిస్తున్నాయి. ఖర్చుల మాట అట్టేపెట్టినా, మన దేశంలో పరిస్థితులు ఎలా మార తాయన్నది చూసుకోవాలి.దేశ కార్మికశక్తికి సవాల్మనది మిగులు కార్మిక ఆర్థిక వ్యవస్థ. ఉద్యోగాల అవసరం ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిపుణులైనవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. నైపుణ్యం పెద్దగా అవసరం లేని లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం ఒక సవాల్. ఏఐ వినియోగాన్ని పెంచుకుంటున్న కంపెనీలు ఇపుడున్న సిబ్బందిని తిరిగి నిపుణులుగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వారిని గాలికి వదిలేసినట్లు అవుతుంది. అయితే, కొత్తగా నైపుణ్యాలను నేర్పించడానికి వయసు ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. కనుక, ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగి తీరుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని అంతర్భాగం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే మాట కూడా నిజం. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మాత్రం కోతల బెడద తప్పకపోవచ్చు.సర్వేలో వెల్లడైన రెండవ పెద్ద అంశం– అసమానత. పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఏఐ నిచ్చెనమెట్లు ఎక్కేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటుంది కనుక, అది వాటికి సాధ్యం కాని పని. ఇది ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. కొన్ని సంస్థలు పోటీ పడలేక రంగం నుంచి వైదొలగక తప్పని స్థితి ఏర్పడవచ్చు. ఈ అసమానత సమస్య సిబ్బందికి కూడా వర్తిస్తుంది. అవస రమైన నైపుణ్యం ఉన్నవారికి వెంటనే ఉద్యోగాలొస్తాయి. మామూలు ఉద్యోగాలలో కంటే ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయి. మిగిలిన రంగాలవారి కన్నా ఐటీ రంగం ఎక్కువ జీతభత్యాలు ఇవ్వజూప గలగడం ఇప్పటికే చూస్తున్నాం. ఏఐ విషయంలోనూ అదే జరుగు తుంది. వస్తూత్పత్తి నుంచి కస్టమర్ సర్వీస్ వరకు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలకు అవసరమైన చట్రాలను డిజైన్ చేయగలిగిన ఏఐ నిపుణులకి ఎక్కువ జీతాలు ఇవ్వజూపుతాయి.మదన్ సబ్నవీస్వ్యాసకర్త ఆర్థికవేత్త, రచయిత -
రైతుకు భరోసానివ్వని బడ్జెట్
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా రోజుల క్రితమే ‘వ్యవసాయం, రైతాంగ సంక్షేమ’ మంత్రిత్వ శాఖ అనే పేరు పెట్టుకొంది. కానీ సంక్షేమం అన్నది మారిన పేరులో తప్ప క్షేత్ర స్థాయిలో కనబడటం లేదు. 2026 –27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను చూసినప్పుడు అతి కీలకమైన వ్యవ సాయ రంగం క్రమంగా తన ప్రాధా న్యాన్ని కోల్పోయిందన్న బాధ కలగక మానదు. బడ్జెట్‌కు ముందురోజు విడుదలైన ఆర్థిక సర్వే, వ్యవసాయ రంగ దుఃస్థితిని తేటతెల్లం చేసింది. మొత్తం జీడీపీ (దేశ స్థూలోత్పత్తి) 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4.6 నుంచి 3.1 శాతానికి తగ్గుతుందని తేల్చారు. సాధారణంగా వృద్ధిరేటు మందగిస్తుందని తెలిసినప్పుడు దానిని పైకి లాగే చర్యలు తీసుకోవడం సహజం. ఆశ్చర్యంగా, తాజా బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ. 1.62 లక్షల కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల (2025–26 ఆర్థిక సంవత్సరంలో) కంటే ఇది 5.3 శాతం మాత్రమే ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటే, ఈ పెరుగుదల నామమాత్రం.పరిశోధనలకు ఊతమేది?వ్యవసాయ రంగ ఉపరితల ముఖచిత్రాన్ని చూస్తే, గొప్ప గానే ఉన్నట్టు కనిపిస్తుంది. 2024–25లో 35.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండాయి. ఈ మొత్తం 145 కోట్ల జనాభాకు సరిపోవడమే గాక, ఎగుమతులు చేయడానికి ఆస్కారం ఉంది. పాడి, పండ్లు, కూరగాయలు, మత్స్య సంప దపై రాబడి సంతృప్తిగానే ఉంది. మరి సమస్యేమిటి? ఆర్థిక సర్వే వెల్లడించిన సమాచారం ప్రకారం – తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటల ఉత్పాదకత, ఉత్పత్తి గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ స్థాయితో పోల్చుకుంటే మనం అట్టడుగున ఉన్నాం. దానివల్ల పంటలు గిట్టుబాటు కావడం లేదు. వారసత్వంగా సంక్రమి స్తున్న మార్కెటింగ్ సౌకర్యాల లేమి, ఇన్‌ఫుట్స్ వ్యయం గణనీ యంగా పెరగడం, చీడపీడలు, అకాల వర్షాలు, వర్షా భావం మొదలైనవి వెంటాడుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ‘మన కర్తవ్యం’ అని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్... ఉత్పాదకత పెంపుదలకు అవసరమైన ‘వ్యవసాయ పరిశోధన, విద్య’కు గతేడాది కేటాయించిన రూ.10,281 కోట్ల నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,967 కోట్లకు తగ్గించి వేయడం ఓ వైచిత్రి. వ్యవసాయ రంగంలో పరిశోధన, విద్యకు చాలా దేశాలు తమ వ్యవసాయ బడ్జెట్లో 1 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. దీన్ని స్థిరమైన ఉత్పాదకత వృద్ధికి సంబంధించి బెంచ్‌మార్క్‌గా పేర్కొంటారు. కానీ మనం మాత్రం ఇందుకు 0.5 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నాం. వ్యవసాయ పరిశోధనలపై పెట్టే ప్రతి రూపాయీ అదనపు రాబడిని తెచ్చి పెడుతుందని శాస్త్రజ్ఞులు రుజువు చేసినా, మన ప్రభుత్వాలు ఎందుకనో వినవు, కనవు.పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు మేలు చేకూర్చేందుకు ఇంతకు ముందుకంటే ఈ రంగాలకు దాదాపు 27 శాతం నిధులు కేటాయించడం ఒక్కటే సానుకూల అంశం. ఈ రంగాల ద్వారా రాబడి ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా తీరప్రాంత రాష్ట్రాలకు మత్స్య సంపదపై వచ్చే ఆదాయాన్ని వ్యవసాయంలో కలిపేసి... వ్యవసాయ రంగంలో తమ అభివృద్ధి 10 నుంచి 15 శాతంగా ఉన్నట్లు మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా చెప్పుకొంటున్నారు. దిగుమతుల బెడదదేశీయ రైతాంగానికి మరో పెను సవాలు పెరగనున్న వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు. అమెరికాకు చేసే ఎగు మతులపై తాజాగా ట్రంప్ 18 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని ఓ చల్లని కబురు చెప్పిన మాట నిజమే. కానీ, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అన్నింటిపై భారత్ ఎటువంటి సుంకాలూ విధించబోదని ట్రంప్ పేర్కొనడం పిడుగులాంటి వార్తే! ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంచడం ద్వారా ఇక్కడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నూనె గింజల దిగుమతులపై సుంకం విధించకుంటే దేశీయ నూనెగింజల రైతులు మునిగిపోతారు. కానీ, బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలేమీ చేయలేదు. దేశీయ వ్యవ సాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వకుండా దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నారు? అమెరికా ఉత్పత్తుల దిగుమతు లపై పూర్తిగా సుంకం ఎత్తివేస్తే... భారత రైతాంగం ఇకపై కొన్ని రకాల పంటల సాగును శాశ్వతంగా మానుకోవాల్సిందే. ఇక, తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొబ్బరి బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో తెలియదు. ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని 1.7 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాది ఇది 1.86 లక్షల కోట్లు. సబ్సిడీలు అధికంగా ఇవ్వాల్సి వస్తుందని ఎరువుల లభ్యతను కావాలనే కేంద్రం తగ్గించేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఏదీ?అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించే అంశంలో చట్టబద్ధత కల్పించాలని ఎంతో కాలంగా రైతు సంఘాలు కోరుతున్నాయి. దాన్ని పెడచెవిన పెట్టారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపైన కూడా స్పష్టమైన దిశానిర్దేశం కొరవడింది. వ్యవసాయ పనిముట్లపై ఇంకా అధికశాతం జీఎస్టీ కొనసాగుతూనే ఉంది. కాఫీ గింజల్ని ప్రాసెస్ చేసే పరికరాల పైన కూడా కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలన్న కాఫీ గింజల ఉత్పత్తిదారుల డిమాండ్‌ను పట్టించుకోలేదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని గత రెండు, మూడేళ్లుగా చెబుతూనే ఉన్నా... దానిని అమలు చేస్తున్న రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. సంప్రదాయంగా వరి పండించే తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని కొబ్బరి, జీడి, చందనం వంటి పంటలకు మళ్లమని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ, ప్రభుత్వాల పరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎక్కడ? భవిష్యత్తులో వరి, గోధుమ వేసినట్లయితే నష్టపోతారని ఆర్థిక సర్వేలో చెప్పారు. వరి పండించే చిన్న సన్నకారు రైతాంగానికి తగిన అవగాహనతో పాటు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఫలితం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించు కోవడానికి ‘భారత్ విస్తార్’ పథకం ద్వారా రైతులకు వారి భాష లోనే సలహాలు, సూచనలు అందించాలన్న చొరవను స్వాగతించాల్సిందే. కానీ ముందుగా మౌలికమైన మార్పులు తేవడానికీ, ముఖ్యంగా పంటల మార్పిడికి రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికీ అవసరమైన నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: సాధ్యమేనా? లేక అపోహనా?
"ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి పనులు గుర్తుకొస్తాయి.. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫైళ్లు కళ్లముందు కదులుతాయి." ఇదీ ఈ తరం ఉద్యోగి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. చాలామందికి 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' అనేది కేవలం పుస్తకాల్లో కనిపించే పదంలా, లేదా కార్పొరేట్ కంపెనీలు గోడల మీద తగిలించే పోస్టర్లా మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ బ్యాలెన్స్ సాధ్యమేనా? లేక అదో అందని ద్రాక్షా?బ్యాలెన్స్ అంటే 50-50 కాదు!చాలామంది 'బ్యాలెన్స్' అంటే 24 గంటలను సమానంగా ఆఫీసుకి, ఇంటికి పంచడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే సమయాన్ని పంచడం కాదు..'ప్రెజెన్స్' (ఉనికిని)పంచడం. అంటే ఆఫీసులో ఉన్నప్పుడు 100శాతంఅక్కడే ఉండటం, ఇంటికి వచ్చాక ఆఫీసు ఆలోచనల నుంచి 100శాతంబయటపడటం. అది లేనప్పుడే అసలైన ఒత్తిడి మొదలవుతుంది.నా దగ్గరికి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ మేనేజర్ కిరణ్ (పేరు మార్చాను) అనుభవమే దీనికి నిదర్శనం. కిరణ్రోజూ 12 గంటలు పని చేస్తాడు. "నా భార్యాపిల్లల కోసమే కదా ఇంత కష్టపడుతున్నాను" అంటాడు. కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతని చేతిలో ఫోన్, మెదడులో ప్రాజెక్ట్ డెడ్ లైన్లు ఉంటాయి. పిల్లలు ఏదైనా అడిగితే చిరాకు పడతాడు. ఫలితంగా, అతను భౌతికంగా ఇంట్లోనే ఉన్నా, మానసికంగా ఎప్పుడో ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సమస్య 'సమయం' కాదు.. 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయలేకపోవడం.బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటోంది?• డిజిటల్ కనెక్షన్:వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్ నోటిఫికేషన్లు ఆఫీసుని మన బెడ్రూమ్ దాకా తీసుకొచ్చాయి.• గిల్ట్ (అపరాధ భావం): "నేను ఆన్ లైన్ లో లేకపోతే పని ఆగిపోతుందేమో" లేదా "నా బాస్ ఏమనుకుంటారో" అన్న భయం.• ‘నో’చెప్పలేకపోవడం:మన శక్తికి మించిన బాధ్యతలను మొహమాటానికి ఒప్పుకోవడం.'బ్యాలెన్స్' సాధించడానికి 5 ప్రాక్టికల్ టిప్స్1. Mental Gateway:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే దారిని ఒక వంతెనలా వాడుకోండి. ఆ ప్రయాణంలో సంగీతం వినడమో, లేదా ఆ రోజు జరిగిన పనుల గురించి ఆలోచనలను అక్కడే క్లోజ్ చేయడమో చేయండి. ఇంటి తలుపు తీసే ముందే ఆఫీసు టెన్షన్లను బయటే వదిలేయండి.2. Tech-Free Zone:రాత్రి భోజనం చేసేటప్పుడు లేదా పిల్లలతో ఆడుకునేటప్పుడు ఫోన్ ని పక్క గదిలో ఉంచండి. నోటిఫికేషన్ల శబ్దం మీ ప్రశాంతతను దోచుకోకుండా చూసుకోండి.3. Quality Vs Quantity:మీరు కుటుంబంతో ఎన్ని గంటలు ఉన్నారన్నది కాదు.. ఉన్న ఆ కాసేపు ఎంత quality time గడిపారన్నదే ముఖ్యం. రెండు గంటలు ఫోన్ పక్కన పెట్టుకుని కూర్చోవడం కంటే, ఫోన్ చూడకుండా 20 నిమిషాలు మీ భాగస్వామితో, పిల్లలతో మాట్లాడటం ఎంతో మేలు.4. Boundaries:పని వేళలు ముగిశాక, అత్యవసరమైతే తప్ప కాల్స్/మెయిల్స్ కి అటెండ్ అవ్వకూడదనే నియమాన్ని మీ బాస్ కి, కొలీగ్స్ కి సున్నితంగా చెప్పండి. మీ ప్రైవేట్ టైమ్ ని మీరు గౌరవిస్తేనే, ఇతరులు గౌరవిస్తారు.5. Self-Care:ఖాళీ గ్లాసుతో ఇతరుల దాహం తీర్చలేం. మీకు ఇష్టమైన హాబీని పాటించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మీ 'ఎనర్జీ లెవల్స్' పెరుగుతాయి. అప్పుడు మీరు ఆఫీసులోనూ, ఇంట్లోనూ యాక్టివ్ గా ఉండగలరు.మీ కోసం ఒక సెల్ఫ్-చెక్గత వారం రోజుల్లో, మీరు ఏకాగ్రతతో మీ కుటుంబ సభ్యుల కళ్లలోకి చూస్తూ కనీసం 10 నిమిషాలు మాట్లాడారా? లేకపోతే, మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారని అర్థం.గుర్తుంచుకోండి.. మీరు ఉద్యోగం మానేస్తే మీ సీటును భర్తీ చేయడానికి కంపెనీకి వారం రోజులు పట్టదు. కానీ మీ కుటుంబంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కెరీర్ లో ఎదగండి.. కానీ ఆ క్రమంలో మీ జీవితాన్ని కోల్పోకండి. అవసరమనిపిస్తే సైకాలజిస్ట్ లేదా కెరీర్ కోచ్ సహాయం తీసుకోండి.సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్‌సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
సినిమా రంగం అంటే సామాన్య ప్రజలకు అదొక రంగుల ప్రపంచం, కలల సౌధం. వెండితెరపై కనిపించే తారల వెలుగుల వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని అవమానాలు దాగి ఉన్నాయో బయటి ప్రపంచానికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రతిభ ఉంటే చాలు, ఆకాశమే హద్దుగా ఎదగవచ్చనే ప్రచారం ఈ పరిశ్రమలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఒక అగ్ర కథానాయకుడు మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనే సంస్కృతే లేదనీ, నటీనటులు క్రమ శిక్షణతో ‘స్ట్రిక్ట్’గా ఉంటే ఎవరూ ఇబ్బంది పెట్టరనీ ఉద్బోధించారు. తన కుమార్తెను కూడా ఈ రంగంలోకి రావాలని ప్రోత్సహించానని ఆయన ఉదాహరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళా నటీమణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. వెనుక అండదండలు ఉన్న వారసులకూ, ఏ అండా లేని సాధారణ యువతులకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వారు ఎత్తిచూపారు. ప్రతిభ ఉన్నా ‘కమిట్మెంట్’, ‘అడ్జస్ట్మెంట్’ పేరుతో శారీరక లొంగుబాటు కోరడం ఇక్కడ నిత్యకృత్యమనీ, అది లేకుండా అవ కాశాలు రావడం దాదాపు అసాధ్యమనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్ట్రిక్ట్’గా ఉండటం అంటే వచ్చిన అవ కాశాన్ని వదులుకుని వెనక్కి వెళ్లిపోవడమే తప్ప మరో మార్గం లేదని వారు కుండబద్దలు కొట్టారు. అసలు ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే మాటకూ అర్థం ఏమిటి? ‘కాస్టింగ్’ అంటే సినిమా నిర్మాణంలో నటీ నటులను, ఇతర సాంకేతిక నిపుణులను ఎంచుకునే ప్రక్రియ. ‘కౌచ్’ అంటే ఆ ఎంపిక సమయంలో చర్చలు జరిపే పెద్ద సోఫా. అది పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అమెరికన్ భాషా శాస్త్రవేత్త బెంజమిన్ జిమ్మెర్‌మ్యాన్ వివరణ ప్రకారం, సినిమాలో అవకాశం ఇవ్వాలంటే పడక సుఖం కోరడం అనే వికృత ధోరణే ఈ పేరుతో పిలవబడుతోంది. పైకి మాత్రం చాలా మర్యా దగా ‘కమిట్మెంట్’ ఉండాలనీ, కొంత ‘అడ్జస్ట్’ కావా లనీ అంటుంటారు. ఇది 1910–1920 కాలంలో హాలీవుడ్, బ్రాడ్వే నాటక రంగాల్లోనే ప్రబలంగా ఉండే దని చరిత్ర చెబుతోంది. నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే ఈ దోపిడీకి ‘కాస్టింగ్ కౌచ్’ అనే పేరు స్థిరపడిపోయింది.సినిమా రంగంలోని ఈ అనారోగ్యకర ధోరణు లను, దానిపట్ల ఉన్న ఆకర్షణ గురించి 80 ఏళ్ళనాడే చలం, తన ‘సినిమా జ్వరం’ అనే వ్యాసంలో సినిమా జాడ్యం ముసలివాళ్ళ దగ్గిర్నించీ పసిపిల్లల దాకా గట్టిగా పట్టుకుందనీ, ఇది మరింతగా విస్తరించబోతోందనీ జోస్యం చెప్పారు. పూర్వం యోగుల కటాక్షం కోసం శిష్యులు వేచి చూసినట్లు, నేటి యువతీ యువకులు ఒక్క అవకాశం కోసం దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సేవ చేస్తున్నారని ఆయన విమర్శించారు. సినిమా రంగం అత్యంత పవిత్రమైనదనీ, ఇక్కడ శీలానికి భయం లేదనీ చెప్పే దొంగ రాతలు ప్రజలను వంచించ డమేనని చలం ఘాటుగా స్పందించారు. ‘అడవిలో పాములు, పులులు ఉన్నాయని హెచ్చరించడం న్యాయం. జాగ్రత్తగా వెళ్ళు అనడం ధర్మం. కానీ పులిని బ్రహ్మస్వరూపంగా భావించమని, అడవిలో ఏమీ లేవని చెప్పి పంపడం ఘాతుకం’ అని ఆయన అభిప్రాయ పడ్డారు. వాస్తవాలను దాచిపెట్టి అబద్ధపు పేర్లతో లోకాన్ని మోసం చేయడం వల్లే సగం సమస్యలు పుడు తున్నాయని ఆయన ఆనాడే స్పష్టం చేశారు.హిందీ నుంచి తెలుగు దాకా...ఈ జబ్బు కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. హాలీవుడ్ చరిత్రకారుడు కారీ రిక్కే రాసిన దాని ప్రకారం... ఆనాటి సుప్రసిద్ధ నటి మార్లిన్ మన్రో హాలీ వుడ్‌ను ఒక ‘కిక్కిరిసిన వేశ్యావాటిక’గా అభివర్ణించింది. హారీ కోహ్న్ వంటి బడా నిర్మాతలు నటీమణులను పడక గదిలో పరీక్షించకుండా అవకాశాలు ఇచ్చేవారు కాదని ప్రతీతి. హాలీవుడ్లో ఈ జాడ్యంపై 2018–2020 కాలంలో ప్రపంచవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం పెల్లు బికింది. తెలుగు చిత్రసీమలో కూడా 2017లో ఫిలిం నగర్ సాక్షిగా ఒక నటి చేసిన అర్ధనగ్న నిరసన ప్రదర్శన పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనల తర్వాత వాస్తవాలను తేల్చడానికి, ఇటువంటి దుర్మా ర్గాలు జరగకుండా చూడటానికి కొన్ని కమిటీలు ఏర్పాటై నట్లు వార్తలు వచ్చినా, ఆశించిన మార్పు మాత్రం అగుపించలేదు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా కేవలం కమిటీలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని కాలం నిరూపించింది.సినిమా అనే విచిత్రమైన సరుకును తయారుచేసే పెట్టుబడిదారీ విధానంలోనే ఈ దోపిడీ మూలాలు ఉన్నాయి. సినిమాల ప్రారంభం నుండి స్త్రీ దేహాన్ని కేవలం ఒక భోగ వస్తువుగా, సెక్స్ సింబల్‌గా చూపే ధోరణి పెరిగింది. మహిళలను కేవలం లాభాలు తెచ్చి పెట్టే సరుకులుగా (‘కమోడిఫికేషన్’) మార్చే ఈ వ్యవ స్థలో మార్పు రానంత కాలం ఎన్ని నిరసనలు తెలిపినా ఫలితం శూన్యం. చలం తన వ్యాసంలో చెప్పినట్లు, స్టూడియోలు, దర్శకులు ఉన్నతమైన ఆశయాలు, ప్రజల మీద ప్రేమ గలవారైతే తప్ప పరిస్థితులు మారవు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అదొక కళ అనీ, అందులో పనిచేసే వారు మనుషులనీ గుర్తించినప్పుడే ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే వికృత క్రీడకు ముగింపు లభిస్తుంది.– బి.ఆర్. బాపూజీహైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ -
జనసేనలో మరింత ముదిరిన ముసలం
జనసేనలో అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు అంతరం పెరుగుతోందా? పార్టీని గంపగుత్తగా టీడీపీకి అనుబంధ సంస్థగా చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు నిరసిస్తున్నారా?. తిరుమల లడ్డూ వ్యవహారంలో పార్టీ వైఖరిని స్పష్టం చేయడంలోనూ పవన్ విఫలమయ్యారన్న అసంతృప్తి కేడర్‌లో కనిపిస్తోందా?. ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైనప్పటికీ సాటి కాపు నేతపై టీడీపీ గూండాలు దాడి చేస్తే మాటమాత్రంగానైనా ఖండించలేకపోవడం జనసేన బలహీనతైపోయిందని వారు వాపోతున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ ఇటీవల సమావేశమైంది. రాజకీయ పరిణామాలపై, అధికార టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేసిన దాడులపై చర్చించాలనుకున్నారు. కానీ.. ఎవరూ ఏ ప్రశ్న వేసే అవకాశమే ఇవ్వకుండా అధినేత పవన్ ఆ సమావేశం నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. కొంచెం సినిమాటిక్ డ్రామాగా అనిపించవచ్చు కానీ.. పవన్ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే ఇలా వ్యవహరించి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు పలు సందర్భాల్లో పవన్ చంద్రబాబు, లోకేష్‌లకు వత్తాసుగా నిలబడటం.. ఎన్ని అరాచకాలు జరిగినా.. సొంత పార్టీ కార్యకర్తలు నేతలను టీడీపీ వాళ్లు అవమానిస్తున్నా పట్టించుకోకపోవడంపై మొదటి నుంచి కూడా జనసేనలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. తమకంటూ సొంత అస్తిత్వం, వ్యక్తిత్వం లేకుండా పోతున్నాయని ఆ పార్టీ నేతలు తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం... తదనంతరం అంబటి కుమార్తె పవన్‌ను ఉద్దేశించి ఓ సూటి ప్రశ్న వేయడాన్ని జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రశ్నలు పవన్ కనీస సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా... పార్టీ వారందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని పవన్ చెప్పినట్లే.. పవన్ సహా జనసేన వారందరి జాతకాలు చంద్రబాబు వద్ద ఉన్న కారణంగానే ప్రశ్నించలేకపోతున్నారని కొందరు చమత్కరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని హిందువులు నమ్మే దేవదేవునికి అపచారం కలిగేలా మాట్లాడిన చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ సనాతని వేషం కట్టి దుర్గగుడి మెట్లు కడిగి, తిరుపతి వెళ్లి ‘‘అన్ అపాలజిటిక్ హిందూ’’ అని గంభీర ప్రకటనలు చేశారు. ఇక్కడే పవన్ తప్పటడుగు వేశారు. చంద్రబాబు ఏమి చెబితే అది గుడ్డిగా చేయకుండా కొంచెం ఆలోచించి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఆయనకు, జనసేనకు అపకీర్తి వచ్చేది కాదు. కానీ చంద్రబాబుతో పోటీ పడి అయోధ్యకు కూడా లక్ష కల్తీ లడ్లు వెళ్లాయని నిరాధార ఆరోపణ చేశారు. నిబద్దత ఉన్న నేత అయితే వెంటనే పొరపాటు జరిగిందని ప్రకటించి ఉండేవారు. కాని చంద్రబాబు దారిలోనే నడుస్తూ పవన్ ఆ విషయాన్ని దాటవేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేయడం, టీడీపీ హయాంలోనే బోలే బాబా కంపెనీ వచ్చిందని, 2019-24 మధ్య తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి వెనక్కి పంపిన నెయ్యి టాంకర్లను తిరిగి వాడారన్న విషయం వెలుగులోకి రావడం.. చంద్రబాబు, పవన్‌ల పరువు తీశాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ లోనే బుకాయించసాగారు. ఈ దశలో అయినా పవన్ కళ్యాణ్ కాస్త హేతుబద్దంగా ఆలోచించి ఉంటే పార్టీ క్యాడర్‌కు సరైన సంకేతం వెళ్లి ఉండేది. అలా చేయకపోగా పార్టీ జనరల్ బాడీ సమావేశం పెట్టి జనసేన నేతలు, కార్యకర్తలు ఎందుకు లడ్డూ అంశంలో వైసీపీని విమర్శించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై టీడీసీ వారు చేసిన దాడి, సృష్టించిన విధ్వంసాన్ని కూడా సమర్ధించే దశకు పవన్ వెళ్లారు. అంబటి కారుపై తొలుత కర్రలతో దాడి చేసి, నీచమైన రీతిలో బూతులు తిట్టిన టీడీపీ వారిని ఒక్క మాట అనకుండా.. అంబటినే తప్పు పట్టిన రీతిలో పవన్ మాట్లాడడం మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ తాము కూడా కాపు బిడ్డలమేనని, తమపైకి మహిళలని కూడా చూడకుండా కులం పేరు ప్రస్తావించి దాడి చేశారని, తన తండ్రిని హత్య చేయడానికి యత్నించారని, దీనిని సమర్ధిస్తారా అని పవన్‌ను ప్రశ్నించారు. అంతేకాక అసలు పవన్ తల్లిని దూషించింది ఎవరో ఆయనకు తెలియదా అని వ్యంగ్యంగా అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుడుతూ కాపులను వేధించడమే చంద్రబాబు లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కూడా పవన్ స్పందించలేదు. మొత్తం ఇష్యూని చర్చించి పార్టీ పరంగా ఒక అవగాహనకు రావల్సిన పరిస్థితి కాకుండా,అసలు ప్రశ్నించడానికే వీలు లేదన్నట్లుగా పవన్ ప్రవర్తించారు. ఇక్కడే క్యాడర్‌కు, పవన్‌కు మధ్య అంతరం బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ప్రశ్నించడానికి వచ్చిన జనసేన కేవలం టీడీపీకి భజనసేనగా మారిపోవడం ఏమిటన్న అంతర్మథనం జనసేన కార్యకర్తలలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా కొంతమంది జనసేన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా వాస్తవ పరిస్థితిపై ఆలోచించడం, మాట్లాడడం ఆరంభించారు. ఆ పార్టీకి చెందిన ఒక మహిళా న్యాయవాది రజని టీవీ డిబేట్లలో మాట్లాడుతూ టీడీపీ తీరును ఆక్షేపించారు. పుటుక్కున అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ వారు కర్రలతో వస్తున్నారు.. రేపు వైసీపీ వారు కత్తులతో వస్తారని హెచ్చరించారు. అసలు లడ్డూపై ఫ్లెక్సీలు పెట్టడం, అంబటిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు? రేపటి పరిణామాలను ఆలోంచుకుని వ్యవహరించాలని అంటూ ‘‘పచ్చ తమ్ముళ్లూ.. గుర్తు పెట్టుకోండి..’’ అని ఆమె స్పష్టం చేశారు. పవన్‌కు ఈ మాత్రం విజ్ఞత లేదా ధైర్యం లేకుండా పోయిందేమిటా అనే భావన జనసేనలో ఏర్పడింది. లాయర్ రజని చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె పార్టీకి దూరం అయ్యేలా జనసేన వ్యవహరించింది. ఈ వ్యవహారంలోనే కాకుండా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా పవన్ సరైన రీతిలో స్పందించలేకపపోయారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఏదో కమిటీ వేసి కాలయాపన చేయడం ఏమిటన్న భావన కూడా ఉంది. మహిళలకు సంబంధించి పవన్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలేమిటి? ఇప్పుడు స్పందిస్తున్న వైనం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. పైగా నేతలు ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ప్రకటన చేయడంపై అంతా విస్తుపోయారు. ఇప్పటికే టీడీపీ వారు విలువ ఇవ్వడం లేదని, నామినేషన్ పదవులలో అన్యాయం జరుగుతోందని రగులుతున్న జనసేన కార్యకర్తలలో ఈ తాజా పరిణామాలు మరింత బాధ కలిగిస్తున్నాయి. అందువల్లే పవన్ కల్యాణ్ తాను ఏమి చెప్పినా పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా క్యాడర్ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ మాట్లాడితే పదిహేనేళ్లు టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం, దానికి తగ్గట్లే టిడిపి వారు చేసే తప్పులను భుజనా వేసుకోవడం వంటివి కూడా వారికి నచ్చడం లేదు.కేవలం టిడిపిని మోయడానికే తాము ఉన్నామా అన్న ఆవేదనను పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాపు సామాజికవర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఒక విషయం వెల్లడించారు.పార్టీకి పనిచేసే వారికి పదవులు దక్కలేదని, పదవులు వచ్చినవారికి జనసేన పేరు తగిలించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అధినేతకు, క్యాడర్ కు మధ్య పెరుగుతున్న అంతరం ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్‌ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్‌బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్‌తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్‌లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్‌బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్‌ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్‌పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దారీ తెన్నూ లేని జెన్–జీ తుపాను
బంగ్లాదేశ్‌లో ఈ నెల 12న, నేపాల్‌లో వచ్చే నెల 5న పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, అక్కడ తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కూలదోసిన జెన్–జీ ఉద్యమాలు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ఆ రెండు తిరుగుబాట్లు చేసిన యువతరానికి అందుకు తగిన కారణాలైతే ఉన్నాయి. కొన్ని లక్ష్యాలనూ ప్రకటించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ తమ సిద్ధాంతాలు ఏమిటో తెలియక, తగిన రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేక, నాయకులను ఎంపిక చేసుకోలేక అన్ని విధాలా అయోమయాలకు గురయ్యారు. చివరకు ఎన్నికలు ప్రకటించే వేళకు అనేక గ్రూపులుగా మారి ఎవరి దారి వారిదయింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజాలు ఈ సరికే నిరాశకు గురైన స్థితిలో, ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిపాలనలు ఏ విధంగా ఉండేదీ అర్థంకాని పరిస్థితి కనిపిస్తున్నది.స్పష్టత లేని బంగ్లా యువతబంగ్లాదేశ్ విద్యార్థి–యువజనుల తిరుగుబాటు 2024 జూన్‌లో మొదలైంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా సాగించిన అణచివేతను తట్టుకుని మరింత తీవ్రంగా మారింది. రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిష్కరించలేక షేక్ హసీనా రాజీనామా చేసి భారత దేశానికి పారిపోయి వచ్చారు. ఆ దరిమిలా, నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్‌ను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రకటించారు.అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా, తిరుగుబాటుతరం ఏమి చేయగలదీ స్పష్టత రాలేదు. వారిలో పలు గ్రూపులు తయారు కాగా, కనీసం కొందరు ముఖ్యులతో కలిపి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేక పోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. కానీ అందులో ఐక్యత లేక పోయింది. అంతకన్నా ముఖ్యంగా, తమ సిద్ధాంతం ఫలానా అని నిర్ణయించుకుని దేశానికి తెలియజెప్పలేక పోయారు. నమ్మకం కోల్పోయిన తిరుగుబాటుతిరుగుబాటులో వారికి మద్దతుగా నిలిచిన ప్రజలు కోరుకున్నది నిర్దిష్టమైన నాయకత్వం, సిద్ధాంతాలు గల ఒక ప్రత్యామ్నాయ పార్టీని! విద్యార్థులు, యువకులు దేనికి నిరసనగా,ఏ లక్ష్యాలతో తిరుగుబాటు జరిపారో వాటి నుంచి, పాత పార్టీలకు భిన్నమైన ఒక కొత్త పార్టీని!! కానీ, తిరుగుబాటు రోజుల నుంచి సుమారు సంవత్సర కాలం గడిచినా ఇవేవీ జరగలేదు.షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఇక రంగంలో ఉండదని తేలిపోగా, మిగిలిన రెండు ప్రధానమైనవి ఖలీదా జియా మరణం తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రహమాన్ నాయకత్వాన గల‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’, ‘జమాతే ఇస్లామీ పార్టీ’లు. విద్యార్థుల తీరు వల్ల వారి పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లగా, ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఎన్పీ,జమాతే అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల పార్టీ ఎక్కడో వెనుకబడి పోయింది. దానితో ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకత్వం జమాతేతో పొత్తు కలవగా, ఒక మతతత్వ పార్టీతో ఐక్య సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు బయటకు పోయారు. బయటి సమాజంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నుంచి గెలిచేది ఎందరనే ప్రశ్న ఎట్లున్నా, వారి ఉద్యమం ఈ రోజున ఎక్కడ మిగిలింది, తమ లక్ష్యాలను ఏ మేరకు సాధించనున్నది, తమపై ఆశలు పెట్టుకుని బలపరచిన ప్రజలకు ఏమి చెప్పగలదన్నది మౌలికమైన ప్రశ్న. అందులో విఫలమైన పక్షంలో, ఇకభవిష్యత్తులోనూ అవే పాత పార్టీలు అధికారానికి రాగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, ఆ నాయకత్వాలు తామేదో మారామని బయటకు చెప్తున్నా అటువంటి ఆశలు ఎవరికీ లేని స్థితిలో, ఉద్యమ ప్రభావాలు శూన్యంగా మిగల నున్నాయంటే పొరపాటు ఉండబోదు. మునుముందు మరొక మారు తిరుగుబాటు తలెత్తితే ప్రజలు విశ్వసించటం తేలిక కాబోదు.చీలిన నేపాల్ గ్రూపులునేపాల్ను గమనించినా పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అక్కడి జెన్–జీ ఉద్యమం నిరుడు సెప్టెంబర్‌లో ఒకేమారు అగ్నిపర్వతం వలె పేలి కేవలం రెండు రోజులలో ప్రభుత్వాన్ని కూలదోసి, పార్లమెంటును రద్దు చేయించింది. వారి నిరసనలు కూడా బంగ్లాదేశ్‌లో వలె అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, బంధుప్రీతి, ఆర్థిక సమస్యలు, అసమర్థ పాలనకు సంబంధించినవే. అక్కడి ప్రజలు వారిని పూర్తిగా బలపరచి, వారి నాయకత్వాన ప్రత్యామ్నాయ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడగలవని ఆశించారు. తిరుగుబాటు ఆకస్మికం అయినందున దేశమంతటా ఎక్కడికక్కడ కలిపి మొత్తం సుమారు 60 జెన్–జీ గ్రూపులు ఉనికిలోకి రాగా, వాటిలో కనీసం కొన్ని ముఖ్యమైనవి ఒక్కటై ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవనుకున్నారు.కానీ, నెలలు గడిచిపోతున్నా అది జరగకపోగా అనేక గ్రూపులు తమ గత కాలపు సిద్ధాంతాలు, వ్యక్తిగత అనుబంధాలను బట్టి, లేదా టికెట్లు ఆశించి ప్రధానమైన అయిదు పాత పార్టీలతో చేరాయి. రెండు మూడు గ్రూపులు సొంత పార్టీలు ఏర్పాటు చేశాయి గానీ అవి బలహీనంగా మిగిలిపోయాయి. ఉద్యమకారులకు, ప్రజలకు కూడా తగినంత అభిమానం ఉన్నట్లు భావించే మాజీ ఉపప్రధాని రవి లమిఛానే, ఖాట్మండు మాజీ మేయర్ బాలేన్ షా, జాతీయ విద్యుత్ సంస్థ మాజీ ఎం.డి. ఘీషింగ్ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కొన్ని ఆశలు రేకెత్తించింది గానీ, మొదలైన వారం రోజులకే చీలిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇంతటి తిరుగుబాటు జరిగి, దాని నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధానులు ఓలీ పార్టీ, ప్రచండ పార్టీ, బాబూరాం భట్టరాయ్ పార్టీ, మాజీ ఉపప్రధాని లమిఛానే పార్టీలు ప్రకటించినా, ఆ పాఠాలు ఏమిటో, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటో వివరిస్తూ మేనిఫెస్టోలను ఏ ఒక్కరూ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు హతాశులై మిగిలారు.గత రెండేళ్ళలో బంగ్లాదేశ్, నేపాల్‌లోనే కాదు. మరొక డజను దేశాలలోనూ జెన్–జీ తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి రెండు చోట్ల కొన్ని రాయితీలు సాధించినా ప్రత్యామ్నాయాలన్నవి ఎక్కడా ఏర్పడ లేదు. ప్రతిచోటా వెనుకటి పార్టీల రాజ్యమే కొనసాగుతున్నది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఉద్యమాలు తగినంత కాలం సాగి, తమ వైన సిద్ధాంతాలు, నాయకత్వాలతో ఒక రూపానికి వచ్చి, ప్రజలను మెప్పిస్తే తప్ప, ప్రత్యామ్నాయాలు సిద్ధించవు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా?
మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో టీడీసీ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులు చేస్తూ... భౌతిక దాడులకు దిగుతూ రెడ్‌బుక్ అరాచకం సృష్టిస్తున్న పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... వీటన్నింటికీ కారణం వైసీపీనేనని, వారి ట్రాప్‌లో పడవద్దని కేడర్‌కు చెబుతున్నారట. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని టెలికాన్ఫరెన్స్‌లో ఆయనగారు వక్కాణించిన మాటలను కొన్ని విశేషణాలు చేర్చి యథాతథంగా ప్రచురించుకుని తరించింది ఎల్లో మీడియా! ప్రజలు మాత్రం ఇదేం చోద్యమన్నట్టు నోళ్లెళ్లబెడుతున్నారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడినే ఉదాహరణగా తీసుకుందాం. పక్కా రౌడీలు మాత్రమే అలాంటి విధ్వంసం సృష్టించగలరు. లకారాలతో ఈ దాష్టీకంలో పాల్గొన్న టీడీపీ మహిళ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావులు మాత్రం ఇప్పటివరకూ అరెస్ట్ కూడా కాలేదు. తెలుగుదేశం కార్యకర్తలు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రమంతటా అనుచితమైన ఫ్లెక్సీలు కట్టడంతోనే ఈ సమస్యంతా మొదలైంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిట్ స్పష్టం చేయడంతో చంద్రబాబు బృందం,ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతుల సాయంతో ఈ ఫ్లెక్సీల డ్రామాకు తెరలేపారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై నెపం నెట్టేస్తూ తప్పుడు ఆరోపణలతో కట్టిన ఈ ఫ్లెక్సీలను పోలీసులు సకాలంలో తీసివేసి ఉంటే పరిస్థితి చేయిజారేదీ కాదు. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించి.. ఆ ఫ్లెక్సీలను తామే తొలగిస్తామనడం అంబటి పాపమైంది. ఫ్లెక్సీ కట్టిన రోడ్డు ద్వారా గుడికి వెళ్లి వస్తూంటే... టీడీపీ కార్యకర్తలో లేక వారు తెచ్చుకున్న కిరాయి మూకో కర్రలతో అంబటి కారుపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో వీరు దాడులు చేస్తూంటే.. పోలీసులు వారికి రక్షణగా ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి అద్దం పడుతుంది. ఇది హింస అన్న విషయం చంద్రబాబుకు తెలియదా!. అంతేకాదు. గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ అయిన టీడీపీ మహిళా నేత అకారణంగా అంబటిని బండబూతులు తిట్టడం ఏ రకమైన సభ్యతో వారికే తెలియాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండించాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఆయన నిస్సహయత అనుకోవాలి. ఇంత జరిగిన తరువాత కదా అంబటి కూడా ఆవేశానికిలోనై ప్రతి దూషణకు దిగింది. అయితే ఆ వెంటనే ఆయన తన తప్పు తెలుసుకుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా... తాను ‘ఆ’ మాటలు అన్నది చంద్రబాబును ఉద్దేశించి కాదని కూడా స్పష్టం చేశారు. తనను అదే మాటలతో తిట్టిన వారినే తాను దూషించానని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ వారు వైసీపీ కార్యాలయం, అంబటి ఇంటిపై దాడులకు తెగబడ్డారు. విధ్వంసం సృష్టించారు. ఇళ్లపై దాడులు చేసి కార్లు, ఫర్నీచర్ పగులగొట్టిన టీడీపీ వాళ్లు అమాయకులు, శాంతికాముకులని చెప్పడం చంద్రబాబు మాటల్లోని ఉద్దేశమా? అంబటిపై జరిగింది హత్యా యత్నం! ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని స్వయంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్న కొన్ని గంటలకే అంబటి ఇంటిపై దాడి జరిగిన విషయం చంద్రబాబుకు తెలియదా? పైగా దీనికి నేతృత్వం వహించింది స్వయానా టీడీపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త. సిగ్గుచేటు. అంబటి దొరికి ఉంటే.. చంపేసేవారమని టీడీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఎవరు ఎవరి ట్రాప్లోపడ్డట్టు? బాధితులు ఎవరు?.. అంబటి భార్య, కుమార్తెలు ఇంటిలో ఉంటే మహిళా ఎమ్మెల్యే ఆద్వర్యంలో దాడి చేస్తారా? వారిని భయభ్రాంతులను చేస్తారా? వారు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. స్ల్రీల పట్ల కూడా కనికరం లేకుండా చంద్రబాబు మాట్లాడడమా! దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంత పాడడమా! ఎంత అన్యాయం. రెచ్చగొట్టేది, హింసకు తెగబడేది, బూతులు తిట్టేది, విధ్వంసం చేసేది టీడీపీ వారే. ఆఖరికి విధ్వంసకారులకు పోలీసులు తోడుగా నిలబడటం, రక్షించాలని వేడుకున్నా ఓ పోలీసు ఉన్నతాధికారి పట్టించుకోకపోవడం రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి దర్పణంగా నిలిచింది. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి, చివరికి బాధితుడైన రాంబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం ఎంత దారుణం? ఇలాంటి ఘటనలే కదా దేశవ్యాప్తంగా రాష్ట్రం పరువును పలుచన చేస్తున్నది? జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా ఈ ఘటనపై స్పందించిందంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత టర్మ్‌లోనూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పోలీసులతో ఎలా వేధించిందీ, ఆయన కుటుంబ మహిళలను ఎంత దారుణంగా దూషించిందీ కంటతడి పెట్టుకుని ముద్రగడే ఆవేదనతో చెప్పుకోవల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇంకో కాపు నాయకుడు అంబటి రాంబాబు కుటుంబంపై టీడీపీ గూండాలు దాడి చేయడం సహజంగానే ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అంబటి కుమార్తె మౌనిక ఒక ప్రశ్న వేశారు. తన తండ్రి ఆ క్షణంలో ఆవేశానికిలోనై ఒక మాట అన్నా... వెంటనే సారీ చెప్పారని, చంద్రబాబు గతంలో వైసీపీ నేత జగన్‌ను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలు ఒక కాపు మహిళపై దాడికి తెగబడితే కనీసం ప్రశ్నించలేవా? అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా వారు తన కుటుంబాన్ని దూషిస్తూ పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేసేందుకు అంబటి సాక్షాత్తూ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక మరో మాజీమంత్రి జోగి రమేష్ మంత్రి లోకేశ్‌ను రాజకీయంగా విమర్శిస్తే ఆయన ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి నిప్పు పెట్టారు. ఇలా దాడి చేసినవారి వెంట పోలీసులు ఉన్నా కనీసం ఆపే యత్నం చేయలేదు. మొక్కుబడిగా కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాజీమంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరీ బస్సులు దగ్దం చేయించారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో బంద్‌లలో హింస ఎలా చేయాలో చంద్రబాబు చెప్పేవారని తెలిపిన విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి హింసలకు టీడీపీ తెగబడుతోందంటే అధికార అహంకారంతో కాక మరేమిటి? చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలం కాదని ఎవరైనా అనుకుంటారా? ఇలా ఈ రెండేళ్లలో కనీసం ఇరవై మంది వైసీపీ నేతలపై దాడులు జరిగాయి. కార్యకర్తలపై ఎన్ని దాడులు చేసింది లెక్క చెప్పలేం. తిరిగి వీరిపైనే కేసులు పెట్టే ధోరణి ఇప్పడే చూస్తున్నాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్‌లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్‌రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!
వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం లేదు. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటకు పైనే సమయం.. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!తెలుగుదేశం గుండాల దాడిలో విధ్వంసానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలో బయలుదేరిన వైఎస్ జగన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు చేరేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. జననేతకు అడుగడుగునా వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నీరాజనం పట్టారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాలో మాట్లాడుతూ ఎవరికైనా దమ్ముంటే గుంటూరు రావాలని వస్తే వాళ్ళ లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఈసారి మేం చేసే విధ్వంసం చూస్తే వారి ఆస్తులు అమ్ముకున్న రికవరీ కాలేరు అంటూ గమ్మత్తైన వార్నింగులు ఇచ్చారు. అయితే ఇవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బాబు జంగిల్ రాజ్ పాలనపైనా ఆగ్రహంతో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఆపలేకపోయాయి. తాడేపల్లి, వడ్డేశ్వరం, నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ గేటు, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్ వెంట అశేషమైన ప్రజావాహిని తరలి వెళ్లింది. పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించాలని చూసినప్పటికీ వేలాదిగా కార్లు మోటార్ సైకిళ్లలో అభిమానులు జగన్‌ను అనుసరించారు. తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి.. ప్రజల్లో వైఎస్సార్సీపీని, జగన్‌ను పలుచన చేయడానికి చంద్రబాబు ఆయన మీడియా ఎన్నో ఎత్తులు వేసింది. కానీ, అవేవీ ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయని జగన్ వెంట ఇవాళ నడిచిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది.కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతప్రభుత్వ ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని జగన్ పర్యటనను దూరం నుంచి చూస్తున్న కొందరు పోలీసులే చెబుతున్నారు. జగన్ వెంట వేలాదిగా వచ్చిన వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదని, సామాన్యమైన ప్రజలు మహిళలు యువత విద్యార్థులు సైతం ఉన్నారని ఇది కచ్చితంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. జగన్ వెంట జనం సాధారణమైన విషయమే. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందో ళనలు ఉద్యమాలు చేపట్టింది. అంతేకాకుండా అధినేత వైఎస్ జగన్ సైతం పలు పరామర్శలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంలో కూడా ప్రజలు అభిమానులు విపరీతంగా ఆయన వెంట పరుగులు తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ గుంటూరు పర్యటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది అని పోలీసు వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ జనాదరణను చూసి కచ్చితంగా భయపడరంటారా?. వైఎస్ జగన్ వెంట ఇసుకేస్తే రాలనంత జనం చూస్తుంటే ఇది మరో ప్రజా ఉద్యమంలా ఉందని తటస్థ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.::సిమ్మాదిరప్పన్న -
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్‌తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్‌కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్‌నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్‌గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్‌కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్‌ను బ్యారేజ్‌గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
మరీ ఇంతలా దిగజారాలా?
ఏపీలో కూటమి నేతల ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య అస్సలు పోలికే ఉండటం లేదు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత కూడా అబద్ధాలు వల్లెవేయించడం కూటమి నేతల దిగజారుడు తనానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్నేళ్లుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయిందని చదివించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం క్షీణించిందని గత ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ఆవిష్కరణ, సంస్కరణలు, సమీక్షలు చేస్తోందని, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్‌తో పలికించారు. రాష్ట్రం కోలుకుంటోందని, మార్పు వైపు ప్రయాణం మొదలైందని, స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలను అమలు చేస్తున్నామని అనిపించారు. గవర్నర్ మాటలలో కొత్తదనం లేకపోవడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంపై బురదచల్లడం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న భ్రమ కల్పించడానికి ఈ ప్రసంగాన్ని వాడుకోవడం ఇంకో ఎత్తు. సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల వంటి జాతీయ ఉత్సవాలలో అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేసింది చెబుతూంటారు. గవర్నర్ ప్రసంగంలో ఆ భాగం ఉన్నట్లు మీడియాలో కనిపించలేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తరచు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. గవర్నర్‌తో కూడా ఆ మాట చెప్పించి ఉండకపోతే అది మంచి విషయమే.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు ఇప్పటికైతే గాలికి వదిలేసినట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆవిష్కరణలు ఏమిటో, అభివృద్ది పునరుద్దరణ ఎక్కడ జరిగిందో ఎవరికి కనిపించదు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు వ్యవస్థలను నీరు కార్చడం, వాటి పేర్లు మార్చి తామే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓడరేవులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం నిలిపి వేయడం అభివృద్ది ఎలా అవుతుంది? గవర్నర్ తన స్పీచ్‌లో రాష్ట్రంలో మార్పు మొదలైందని అనడంలో కూటమి ఉద్దేశం ఏమిటో కాని ఆ మార్పు ప్రజలకు అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా? అన్నది సమీక్షించుకోవాలి. విశాఖపట్నంలో తమ సమీప బంధువు, లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్‌కు చెందిన గీతం కాలేజీ ఆక్రమించిన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడానికి కార్పొరేషన్ చర్చ లేకుండా తీర్మానం చేయడం ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు కాబోలు. ఇందుకోసం ఫిరాయింపుల ద్వారా విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో మార్పుగా భావించాలి. ఈ భూమి విలువ సుమారు రూ.ఐదువేల కోట్లు అంటున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్నపాటి సంశయాన్ని కూడా వదిలేసి అధికారం అండగా బంధుప్రీతికి పాల్పడటం కూటమి తాలూకూ లేటెస్ట్ మార్పు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వంటి వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం మరో మార్పు. విశాఖలో ఒక మీడియా సంస్థకు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. ఇదే విశాఖలో వేలాది మంది నివసిస్తున్న దేవాలయ, ప్రభుత్వ భూములను రెగ్యులైరైజ్ చేయకపోవడం గీతం కాలేజీ యాజమాన్యంతోపాటు కొందరు నేతలు,పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేసిన భూములను గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వాటిని ఆక్రమణదారులకే ధారాదత్తం చేయడానికి వెనుకాడకపోవడం ఏ రకమైన మార్పో? వైసీపీ పాలన సమయంలో విజయసాయిరెడ్డి బంధువులు భూమి కొనుగోలు చేసినా, అదంతా దందా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు ఈ కబ్జాలకు వంత పాడుతుండడం కూడా మార్పే. గవర్నర్ ప్రసంగం ద్వారా అమరావతి రాజధానితోనే అన్ని జరిగిపోతాయన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. ఆ క్రమంలో మళ్లీ సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం తలపెట్టడంపై అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న దానిపై మాత్రం భరోసా ఇచ్చినట్లు కనిపించలేదు. కేంద్రం ఏదో అమరావతిని అవకాశాల గని అని పేర్కొందని ఎల్లో మీడియా తెలిపింది. ఒకప్పుడు కాణి ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అప్పుల ఊబిలో దింపుతున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమా? కాదా? అన్న దానిపై గవర్నర్‌తో వివరణ ఇప్పించి ఉంటే సబబుగా ఉండేది!. పేదరికం లేని సమాజం, ఉపాధి నైపుణ్యం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండ్ స్మార్ట్ గవర్నెన్స్ అంటూ పడికట్టు పదాలను గవర్నర్ స్పీచ్ వాడారు. వీటితో ఏపీ స్వర్ణాంధ్రగా మారిపోతుందని ప్రజలను నమ్మమంటున్నారు. కాని ఇది నిత్యం చెప్పే అబద్దాలలో భాగమేనని ప్రజలకు తెలియదా! సమాన అవకాశాలు కల సమాజాన్ని నిర్మిస్తున్నామని గవర్నర్‌తో చెప్పించారంటే అంతకన్నా పెద్ద అసత్యం ఉంటుందా? ప్రభుత్వం నిర్మించవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. విశాఖలో అతి ఖరీదైన ప్రభుత్వ భూములను పెద్ద, పెద్ద కంపెనీలకు వారు అడగకపోయినా 99 పైసలకే కట్టబెడుతున్నారు. ఇది అన్నిటికంటే అతి పెద్ద మార్పుగా ఏపీ ప్రజలు చూస్తున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కేవలం అమరావతిలోనే వ్యయం చేస్తున్నారు. హామీలు అమలు చేయండంటే పీపీపీ అంటున్నారు. అప్పులు, అవస్థలు ప్రజలకు, ప్రభుత్వ సంపదను కొంతమంది బడాబాబులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుతో ఎంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో క్షీణించిన శాంతిభద్రతలు చెబుతాయి. చివరికి అనుచితమైన విద్వేషపూరిత రాతలన్న ఫ్లెక్సీలకు టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని కాపలా కాస్తుంటే, పోలీసులు భద్రత కల్పించడమే మహా మార్పు. పంతొమ్మిది నెలల్లో తెచ్చిన రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులతో రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సేఫ్ గా ఉందని అనుకోవాలా? లేక అన్‌సేఫ్‌గా మారుతోందని భయం కలుగుతుందా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆర్థిక క్రమశిక్షణ
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆర్థిక లోటు 2025–26లో జీడీపీలో 4.4 శాతం కాగా, 2026–27లో 4.3 శాతంగా ప్రతిపాదించడం, కేంద్ర ప్రభుత్వ రుణంలోనూ 2025–26తో పోల్చినప్పుడు (జీడీపీలో 56.1 శాతం), 2026–27లో జీడీపీలో 55 శాతంగా ప్రతిపాదించడం ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా పేర్కొనవచ్చు. ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం తగ్గి ప్రాధా న్యతా రంగాలకు అధిక వనరులు సమకూరడంతోపాటు ద్రవ్యోల్బణంలో క్షీణత, స్థిర స్థూల ఆర్థిక వాతావరణం లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మరోవైపు సంక్షేమంపై వ్యయం తగ్గినట్లయితే వినియోగం, సమష్టి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.కనెక్టివిటీ సానుకూలంఆర్థిక వృద్ధి సాధనలో ప్రధాన అంశమైన మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఏడు కొత్త హై–స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ చర్యతో రోజువారీ ప్రయాణ సౌకర్యాల మెరుగుదల, ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాల మెరుగుదల, వివిధ ప్రాంతాల మధ్య వస్తు ప్రవాహం, ఉత్పాదకత పెరుగుదల, ప్రయాణ సమయాలలో తగ్గుదల వలన ‘ఆర్థిక హబ్’ల మధ్య కనెక్టివిటీ లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కారిడార్ల నిర్మాణం వలన తయారీ రంగం, సేవలు, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 2025–26 బడ్జెట్‌తో పోల్చినప్పుడు 2026–27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయంలో పెరుగుదలను 11.5 శాతంగా ప్రతిపాదించారు. తద్వారా నిర్మాణ రంగం, సిమెంటు, స్టీల్, యంత్రాలు, సేవలకు సంబంధించి డిమాండ్‌లో పెరుగుదల ఏర్పడవచ్చు. నిర్మాణ రంగంలోని శ్రామికులకు ప్రత్యక్షంగా ఉపాధి పెరగడంతోపాటు, లాజిస్టిక్స్; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సప్లయ్ గొలు సులో పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఎక్కువవు తాయి. మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వ పెట్టుబడు లలో పెరుగుదల వలన ప్రైవేటు సంస్థల వ్యయం, నష్ట భయం తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలంలో పురోగమించడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ లక్ష్య సాధనకు వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్ అయిన ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల లావాదేవీ పన్నును పెంచడం వలన నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్‌లో క్షీణత ఏర్పడింది. సెక్యూరిటీల లావాదేవీల పన్నును పెంచడంలో ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయి. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంపొందించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడు (ఎఫ్ఐఐ)లను ఆకర్షించడంతో పాటు, ఉన్న పెట్టుబడులను నిలుపుకొనే విధంగా చర్యలు తీసుకోవడం, రాబోయే రోజుల్లో కార్పొరేటు రాబడులు మెరుగవు తాయనే విశ్వాసం కల్పించడం లాంటి అంశాలు మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడతాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్‌ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్‌ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్‌ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్‌లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్‌తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అతి విశ్వాసంతో స్వారీ
మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కూడా ఆశించిన మేర ఆదాయ అంచనాలను చేరుకోలేదు. దీనిని బట్టి ప్రభుత్వపరంగానూ ఆయా అంశాలు, రంగాల్లో ఆశించిన మేర పెట్టుబడులు, ఖర్చు పెట్టలేదు. గత బడ్జెట్లోనూ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించినా అందులో రూ. 200 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రైవేట్ రంగం నుంచి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోతే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులు ఏ మేరకు ఉపయోగపడతాయనేది చర్చనీయాంశమవుతోంది. మన బడ్జెట్లన్నీ కూడా ఎక్కువ మటుకు పెట్టుబడి దారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. వీటిపై సమ తూకం సాధించే క్రమంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామనీ, దీనినుంచి మంచి ఫలితాలు వస్తా యనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందనేది చూడాల్సి ఉంది. 7.5 కోట్ల యూనిట్లలో 32 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలు కూడా క్రియా శీలమై కొంత శాతం ఉపాధిని కల్పిస్తే వీటి పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి. జాతీయస్థాయిలో 6.4 శాతం నుంచి 7.2 శాతం దాకా వృద్ధిరేటు సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వృద్ధి నుంచి ఏ వర్గానికి ఎంత పంపిణీ అవుతుందనేది ముఖ్యం. కొన్నేళు్లగా చూస్తే మన వృద్ధి ఎగుడుదిగుళ్లు గానే ఉంటోంది. ఉదాహరణకు.. తాజా ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం చూస్తే... మొత్తం వంద రూపాయల జీడీపీ ఉత్పత్తిలో పై వర్గానికి 60 శాతం, మధ్య తరగతికి 25 శాతం, దిగువన ఉన్న వారికి 15 శాతం వస్తోంది. అధిక ఆదాయం పొందుతున్న వారు కొంత అధిక పన్ను కట్టాల్సి ఉండగా ఈ వర్గాన్ని ముట్టుకునే సాహసం చేయడం లేదు. అదీగాకుండా ఆరోగ్య రంగం విషయాని కొస్తే... మెడికల్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా డబ్బు భరించగలిగిన విదేశీయులకు నాణ్యతా పరమైన వైద్యసేవలు అందించి, దేశంలోని పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేని సామాన్యులకు ఆ నాణ్యమైన వైద్య సేవలు ఏవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పౌరు లందరికీ సమానమైన వైద్య సేవలను అందించి... అప్పుడు వ్యాపారం చేస్తే బాగుంటుంది. బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, దానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల్లో గత కొన్నేళ్లలో ఎలాంటి వృద్ధీ లేదు. దీనికి భిన్నంగా భారత పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైంది. దేశీయంగా తగిన డిమాండ్ లేదనీ, తమ పరి శ్రమల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లేదనీ వారు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్లో... విదేశాల్లో పెట్టుబడులపై నిబంధనలను మరింతగా సులభతరం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం కంటే కూడా ఇక్కడి నుంచి బయటి దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా కేంద్రప్రభుత్వం మాత్రమే పెట్టు బడులు పెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు గతేడాది రూ.11.20 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.12.25 లక్షల కోట్లకు పెంచుతామని బడ్జెట్లో ప్రతిపాదించారు. వృద్ధిరేటును నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వపరంగా రోడ్లు, కమ్యూ నికేషన్లు, తదితరాలన్నీ చేస్తుంటే దానిని ప్రోత్సాహకంగా తీసుకుని, ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. కానీ అవి రావడం లేదు. మెరుగైన ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసం, నమ్మకం పెట్టుకోవడం వల్ల మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ రక్షణ బడ్జెట్‌ను ఒక్కసారిగా రూ.27 లక్షల కోట్లు (గతం కంటే 21 శాతం పెంపుదల) ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా విజయం సాధించామనే భావనతో ఈ రంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వృద్ధి రేటు 6–7 శాతం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రొఫెసర్ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్ -
సాగుకు ఒరిగేది తక్కువే!
డిజిటల్ వ్యవసాయం ద్వారా అద్భుతం సాధిస్తున్నామని చెబు తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణి బడ్జెట్ కేటాయింపుల్లోనూ కనిపించింది. అయితే భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్ల పట్ల బడ్జెట్లో ప్రతి స్పందన దాదాపు శూన్యం అని చెప్పాలి. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి, తగ్గుతున్న మార్కెట్ రాబడి కారణంగా రైతు ఆదాయాలు తరుగుతున్నాయి. పెరుగుతున్న వివిధ పంటల దిగుమతి, అమెరికా దేశం నుంచి ఒత్తిళ్లను ఆర్థిక సర్వే 2025–26 అంగీకరించినా బడ్జెట్లో కనీస స్పందన లేదు.పెరుగుతున్న వాతావరణ ప్రభావానికి, ప్రభుత్వ పెట్టుబడుల మధ్య పొంతన అసలు లేదు. ఆశించినట్టుగా 2026 –27 బడ్జెట్లో సహజ వ్యవసాయం వంటి పైలట్ కార్యక్రమాలకు నిధులను గణనీయంగా పెంచినట్లు కనిపించడం లేదు. డిజిటల్ వ్యవ సాయం మీద పెట్టుబడుల వల్ల ఒరిగేది చాలా తక్కువ. డిజిటల్ టెక్నాలజీ కేవలం ప్రకృతి వైపరీత్యాల గురించి హెచ్చరించడానికి మాత్రమే పనికొస్తుంది. స్థిరమైన పంటల ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతు ఆదాయ సంక్షోభాన్ని పరిష్క రించడంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ–నామ్, ధరల డ్యాష్‌బోర్డ్‌లు, గిడ్డంగి రసీదు వ్యవస్థలు వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు.ధరల స్థిరీకరణ, వైవిధ్యభరితమైన సేకరణ, వ్యవసాయ–ప్రాసెసింగ్ సామర్థ్యం, మార్కెట్ కార్యకలాపాలలో బలమైన ప్రభుత్వ జోక్యం లేకుండా... డిజిటల్ వ్యవస్థలనేవి రైతుల ఆదాయాలను రక్షించడం కంటే ధరలను అస్థిర పరచేందుకే అవకాశం ఎక్కువ ఉంది. వ్యవసాయానికి ఇచ్చిన మొత్తం నికర కేటాయింపు రూ.1,30,561 కోట్లు (2025–26 సవరించిన బడ్జెట్ కేటాయింపు కన్నా 6% ఎక్కువ). ఇందులో ప్రధానంగా ‘పీఎమ్– కిసాన్ సమ్మాన్ నిధి’కి రూ. 63,500 కోట్లు (49%), వడ్డీ సబ్సిడీలకు రూ. 22,600 కోట్లు (17%),పంట బీమా (పీఎమ్ఎఫ్బీవై)కు రూ. 12,200 కోట్లు (9%) కేటాయింపులు జరిగాయి.‘కృషియోన్నతి యోజన’కు కేటాయింపులు 65% (రూ. 6,800 నుండి 11,200 కోట్లకు) పెరిగాయి. ఇందులో కొత్తగా ‘కూరగాయలు/ పండ్ల మిషన్ ’ ఉంది. సహజ వ్యవసాయ మిషన్‌కు ఇచ్చిన నిధులలో కేవలం 3% వృద్ధి (రూ.725 నుండి 750 కోట్లకు) మాత్రమే ఉంది. ఇక, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 41% కేటాయింపులు పెరిగాయి.వడ్డీ చెల్లింపుల భారంబడ్జెట్లో కొత్త కార్యక్రమాలు (2026–27) చూస్తే... ‘భారత్–విస్తార్’ అనే బహుభాషా ఏఐ సాధనం ఏర్పాటుకు రూ. 150 కోట్ల కేటాయింపు జరిగింది. ఇది రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయం చేస్తుందని భావిస్తు న్నారు. అధిక విలువ కలిగిన వ్యవసాయ పంటలకు మద్దతు పేరిట తీరప్రాంత/కొండ ప్రాంతాలలో కొబ్బరి, గంధపు చెట్ల పెంపకానికి రూ. 350 కోట్లు ఇచ్చారు. మఖానా అభివృద్ధికి రూ. 90 కోట్లు ఇచ్చి, పసుపుకు మాత్రం ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదు.బడ్జెట్ వ్యూహాత్మక దృష్టి కేవలం డిజిటల్ వ్యవసా యానికి పరిమితం అయ్యింది. డ్రోన్లు, ఏఐ, డిజిటల్ వ్యవస్థల వంటివి భాగంగా ఉండే సాంకే తిక పరిజ్ఞానాన్ని వాడటం; ‘పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’కి అధిక నిధులను కేటాయించడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించడం, అధిక విలువ కలిగిన పంట లను వైవిధ్యీకరించడం, సహజ వ్యవసాయ పరి వర్తనకు స్థిరమైన నిధులను అందు బాటులోకి తేవడం వంటి వాటికి బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది.మొత్తం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు కేటాయించినది 2.7% మాత్రమే! మొత్తం బడ్జెట్ ప్రాథమ్యాలతో పోలిస్తే... ప్రభుత్వం అప్పులపై వడ్డీ చెల్లింపుల (రూ. 14.4 లక్షల కోట్లు) పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. వ్యవసాయానికి రూ. 1.3 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వం మీద ఉన్న అప్పుల భారం అభివృద్ధి మీద వ్యయాన్ని పరి మితం చేస్తుందని స్పష్టం అవుతున్నది. వ్యవసాయ బడ్జెట్ నిరాడంబరమైన వృద్ధిని చూపుతోంది. వాస్తవ అభివృద్ధి/ వ్యవసాయ రంగ పరివర్తన వ్యయం కేవలం రూ. 33,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వం ప్రతి 2 రోజులకు వడ్డీ చెల్లింపులపై చేసే ఖర్చు కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.డా‘‘ దొంతి నరసింహారెడ్డివ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
జాబ్ స్ట్రెస్.. శత్రువే కాదు మిత్రుడు కూడా!
నేటి కార్పొరేట్ యుగంలో ’ఉద్యోగం’ అంటే కేవలం పని మాత్రమే కాదు, అదో నిరంతర యుద్ధం. ఉదయం అలారం మోగినప్పటి నుండి, ఆఫీసు డెడ్లైన్లు.. బాస్ నుంచి వచ్చే కాల్స్.. టార్గెట్లు.. పక్క సీటు సహోద్యోగితో పోటీ.. అర్ధరాత్రి బాస్ పంపే మెయిల్,,, అన్నీ కలిసి జాబ్ స్ట్రెస్. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగిని ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు వెంటాడే భూతం ఇది.అసలు ఈ ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఇది ఎప్పుడూ మనకు శత్రువేనా? అంటే కాదనే అంటాను. అది మిత్రుడిలా మనల్ని ముందుకు నడిపించగలదు, శత్రువులా మనల్ని కుంగదీయగలదు. ఆ తేడాను గుర్తించడమే ’ఉద్యోగ పర్వం’లో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం.శాస్త్రీయంగా ఒత్తిడి రెండు రకాలు.. 1. యూస్ట్రెస్ (పాజిటివ్ ఒత్తిడి): ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కలిగే చిన్నపాటి భయం, ఒక కొత్త బాధ్యత తీసుకున్నప్పుడు వచ్చే ఉత్సాహం. ఇది మనల్ని ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. ఇది మనకు ’మిత్రుడు’.2. డిస్ట్రెస్ (నెగటివ్ ఒత్తిడి): పని భారం మితిమీరినప్పుడు, భవిష్యత్తుపై అభద్రతాభావం కలిగినప్పుడు వచ్చేది. ఇది మన ఆరోగ్యాన్ని, పనితీరును దెబ్బతీస్తుంది. ఇది మన ’శత్రువు’.శత్రువుగా మారినప్పుడు సంకేతాలు..ఒత్తిడి మీ నియంత్రణ తప్పుతోందని చెప్పడానికి మీ శరీరం కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది.· ఆఫీసు పేరు వింటేనే గుండెల్లో దడ మొదలవ్వడం.· ఆకలి మందగించడం లేదా ’స్ట్రెస్ ఈటింగ్’ (ఒత్తిడిలో ఎక్కువగా తినడం).· ఏకాగ్రత కుదరకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు.· చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం రావడం· ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినా పని గురించి ఆలోచిస్తూ కుటుంబానికి దూరం కావడం.· నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు· పని మీద ఆసక్తి తగ్గిపోవడం.రాజేష్ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్. అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ, గత ఆరు నెలలుగా అతను తీవ్రమైన మెడనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఆఫీసులో చిన్న విషయాలకే చిరాకు పడటం, ఇంటికి వెళ్ళాక పిల్లలతో సరిగ్గా గడపలేకపోవడం అతన్ని మానసిక వేదనకు గురిచేసింది. రాజేష్ తన టీమ్ చేసే ప్రతి చిన్న పనిని తానే పర్యవేక్షించాలనుకోవడం (Micromanagement ). ‘నేను లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది‘ అనే అపోహే అతని ఒత్తిడికి ప్రధాన కారణం. కౌన్సెలింగ్‌లో అతనికి ’డెలిగేషన్’ (పనిని ఇతరులకు అప్పగించడం), ’మైండ్‌ఫుల్‌నెస్’ టెక్నిక్స్ నేర్పించాం. మూడు నెలల తర్వాత, రాజేష్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అతని టీమ్ ఉత్పాదకత కూడా 30శాతం పెరిగింది.ఒత్తిడిని మిత్రుడిగా మార్చుకోవడానికి 5 సూత్రాలు..1. Circle of Control : మీరు మార్చగలిగే పనుల మీద (మీ పనితీరు, టైమ్ మేనేజ్మెంట్) దృష్టి పెట్టండి. మీరు మార్చలేని విషయాల గురించి (ఆర్థిక మాంద్యం, బాస్ మూడ్) చింతించడం మానేయండి.2. 2 మినిట్ బ్రీతింగ్: ఒత్తిడి పెరిగినప్పుడు 2 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది మెదడులోని ’అమిగ్డాలా’ను శాంతపరిచి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.3. డిజిటల్ డెటాక్స్: ఆఫీస్ సమయం ముగిశాక, కనీసం ఒక గంట పాటు ఫోన్‌ను పక్కన పెట్టండి. నోటిఫికేషన్ల మోత మీ మెదడును నిరంతరం అప్రమత్తంగా (Alert mode) ఉంచి ఒత్తిడిని పెంచుతుంది.4. శారీరక శ్రమ: కనీసం 20 నిమిషాల నడక మీ మెదడులో ’ఎండార్ఫిన్’లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడిని తగ్గించే సహజ సిద్ధమైన మందులు.5. Perfectionism వద్దు: అన్ని పనులూ 100శాతం పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదల ఒత్తిడిని పెంచుతుంది. ’ఎక్సలెన్స్’ మీద దృష్టి పెట్టండి, పర్ఫెక్షన్ మీద కాదు.మీ కోసం చిన్న పరీక్ష.. ఈ క్రింది ప్రశ్నలకు ’అవును’ లేదా ’కాదు’ అని సమాధానం చెప్పుకోండి:· ఆదివారం సాయంత్రం నుంచే మీకు ఆఫీసు గురించి ఆందోళన మొదలవుతోందా?· పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు లేదా ఆరోగ్యం దెబ్బతింటున్నాయా?· విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అపరాధ భావన (Guilt) కి గురవుతున్నారా?పై ప్రశ్నల్లో రెండింటికి ’అవును’ అనే సమాధానం వస్తే, మీరు మీ ఒత్తిడిని శత్రువుగా మార్చుకున్నారని అర్థం. ఒత్తిడిని జయించడం అంటే పనిని వదిలేయడం కాదు, పని చేసే విధానాన్ని మార్చుకోవడం. గుర్తుంచుకోండి. మీ కెరీర్ కంటే మీ ఆరోగ్యం.. మీ చిరునవ్వు చాలా విలువైంది.సైకాలజిస్ట్ విశేష్కెరీర్ – మైండ్‌సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ
మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్ తయారవుతారు! మునుపటి 8 బడ్జెట్లు కూడా నాకు ఇదే నేర్పించాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నా 9వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా మాత్రమే ఇది నా బడ్జెట్. అసలు కసరత్తంతా నా టీమ్‌ది. కనుక, బడ్జెట్ సమర్పణ కూడా అదృశ్యంగా నా టీమ్‌దే అవుతుంది. సెక్రెటరీలు ఆరుగురు, అడ్వైజర్ ఒకరు... మొత్తం ఏడుగురు అపర చాణక్యులు!బడ్జెట్లో ఏముందో ఇంకొన్ని గంటల్లో దేశ ప్రజలకు తెలిసిపోతుంది. బడ్జెట్‌ను తయారు చేయటంలో నా టీమ్ కష్టం ఎంతుందో చెప్పాలంటే మాత్రం అది బడ్జెట్ ప్రసంగాన్ని మించిన ప్రసంగమే అవుతుంది! టీమ్‌లోని అనురాధా ఠాకూర్ ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ. బడ్జెట్ రూమ్‌లోకి ప్రవేశించిన తొలి మహిళ! నేటి బడ్జెట్‌కు ప్రాథమిక రూపశిల్పి. హల్వాను అడుగంటకుండా ఉడికించటంలోని వివిధ స్థాయుల సన్నని మంటల గురించి తెలిసిన నిపుణురాలు. ఇంట్లో మనుషుల్ని కదిలించకుండానే ఇంటి గదుల్ని, గోడల్ని పునర్నిర్మించగల నేర్పరి.అజయ్ సేuЇ ఫైనాన్స్ సెక్రెటరీ. గ్రాండ్ మాస్టర్! బడ్జెట్ టీమ్‌లోని సెక్రెటరీలందరికీ కెప్టెన్. ‘ఆర్థిక లోటు’ వార్నింగ్ సిగ్నల్ ఎర్రగా వెలిగి ఆరిపోతున్నా కూడా చలించని శాంత మనస్కుడైన పైలట్! అరవింద్ శ్రీవాత్సవ రెవిన్యూ సెక్రెటరీ. బడ్జెట్లో కొత్త ముఖం. ముక్కులుపిండకుండా, బుగ్గలు పుణికి పన్నులు వసూలు చేయగల టాక్స్ కలెక్టర్. బడ్జెట్ స్పీచ్‌లో పార్ట్–బి ఆయనదే. పన్నుల పెంపు, తగ్గింపు ఉండేది ఆ పార్ట్‌లోనే. డిన్నర్ బిల్లుని సమానంగా పంచే ధర్మరాజు. ఒకరెవరైనా అదనంగా ఆర్డర్ చేసి ఉంటే, వారికి అదనంగా ‘వడ్డించే’ నియమబద్ధుడు.ఉమ్లున్మాంగ్ ఉవల్నామ్ ‘ఎక్స్పెండిచర్’ సెక్రెటరీ. ప్రభుత్వాన్ని దేనినీ కొననివ్వరు. ఏం అడిగినా సరే, ‘ఇప్పుడు కాదు బాస్’ అనేస్తారు.అనంత నాగేశ్వరన్ ఛీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. డేటా డిటెక్టివ్. సంక్లిష్టమైన ప్రపంచ గందరగోళాన్ని ‘ఆర్థిక సర్వే’గా అనువదిస్తారు. గాలివానలు సహాయకరంగా ఉంటాయా, లేక మనం తుపానులోకి వెళ్లబోతున్నామా అన్నది ఆర్థిక శాఖకు చెబుతారు. వర్షం వచ్చే ముందు మీ గొడుగు విరిగిపోయిందన్న విషయాన్ని కూడా కచ్చితంగా మీకు గుర్తు చేస్తారు.నాగరాజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ. బ్యాంకుల వైద్యుడు. బ్యాంకుల ఆరోగ్యాన్ని పరిరక్షించటం కోసం, మీరు ‘టీ’ తాగి చేసిన డిజిటల్ చెల్లింపులు లోప భూయిష్ఠంగా లేకుండా చూసుకునేది ఆయనే. అరుణిష్ చావ్లా ఇన్వెస్ట్మెంట్లు, పబ్లిక్ అసెట్ల కార్యదర్శి. ప్రభుత్వ కంపెనీల వాటాల కోసం కొనుగోలుదారులను వెతికి పెడతారు. వెతికి పడతారు. ఆయనొక ఇ–బే వేలం పవర్ సెల్లర్. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ఎవరి చేతనైనా ఏదైనా కొనిపించేస్తారు.నిజంగా, ఎంత గొప్ప టీమ్! కాకపోతే, ఇలాంటి టీమ్ ఉన్న ప్రతి లీడర్కీ ఎదురయ్యే సమస్య ఒకటే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ఇడ్లీ, వడ మాత్రమే అయినా ఆ రెండిట్లోంచి కూడా ఒక దానిని ఎంపిక చేసుకోలేక సతమతం అవటానికి తగినంత సమయాన్నింకా చేతిలో మిగిల్చే ఉంచుతారు! నాదీ ఇప్పుడు అటువంటి సమస్యే. ఏ కలర్ శారీ బాగుంటుందా అని ఆలోచిస్తూ, తెరిచి ఉన్న అల్మరా ముందు నిలబడి పోవటం అన్నది నాకు ఏనాడూ సమయం దొరకని పని. కానీ ఇవాళ నా టీమ్ నా చేత ఆ పనిని చేయించబోతున్నట్లే ఉంది! -
అమెరికా, ఫ్రాన్స్‌లు కాదన్నాయి.. భారత్ మాత్రం సాధించింది!
విద్యుత్ వృథా, ఛార్జింగ్‌కు ఎక్కువ టైం.. బరువైన బ్యాటరీలు.. సిలికాన్ ఆధారిత ప్రాసెసర్లతో విద్యుత్ వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అయితే.. ఇకపై ఈ సమస్యలేవీ ఎదురు కాకపోవచ్చు. గాలియం-నైట్రైడ్ టెక్నాలజీతో.. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, తేలికైన బ్యాటరీలతో ఎక్కువ దూరం రయ్‌మంటూ దూసుకెళ్లే అవకాశం కలగబోతుంది. ఇంతకీ ఈవీ రంగపు భవిష్యత్తును మార్చబోయే ఈ అరుదైన టెక్నాలజీ మనకు ఎలా సొంతం అయ్యిందో తెలుసా?.. టెక్నాలజీ రంగంలో భారత్ ఓ మహత్తర ఘట్టాన్ని నమోదు చేసింది. భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో)కు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల పుణ్యమా అని ఇకపై దేశం రక్షణ రంగంలోనే కాదు... విద్యుత్తు వాహనాలు, 5జీ నెట్‌వర్క్‌ల విషయంలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేయనుంది. గాలియం-నైట్రైడ్ విషయంలో డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం దీనికి కారణం. ఇంతకీ ఏమా గాలియం-నైట్రైడ్? డీఆర్డీవో సైంటిస్ట్ సాధించిన విజయమేమిటి? దాంతో దేశానికి, సామాన్యుడికి వచ్చే లాభమేమిటి?మీకు సిలికాన్ గురించి తెలిసే ఉంటుంది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోని ప్రాసెసర్లు ఈ అర్ధ వాహకంతోనే తయారవుతాయి. దశాబ్దాలుగా మన టెక్నాలజీ పురోభివృద్ధికి కేంద్రం ఈ సిలికానే. అయితే ఈ పదార్థంతో అనేక సమస్యలూ ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇప్పటివరకూ దీన్నే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్స్‌టు డాక్టర్ మీనా మిశ్రా. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. సిలికాన్‌తో వచ్చే సమస్యలను దాదాపుగా పరిష్కరించగల సరికొత్త అర్ధవాహకం గాలియం-నైట్రైడ్తో(Gallium Nitride GaN) ప్రాసెసర్ల తయారీకి మార్గం సుగగమైంది మరి. డీఆర్డీవో శాస్త్రవేత్తలు గాలియం-నైట్రైడ్ మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను విజయవంతంగా తయారు చేయగలిగారు. రక్షణ రంగానికి కీలకమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల్లో ఈ సర్క్యూట్లు కీలకం కానున్నాయి. భారతదేశం ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోనూ ఈ గాలియం-నైట్రైడ్ ఉంటుంది కానీ.. ఆ టెక్నాలజీని మనకిచ్చేందుకు ఫ్రాన్స్ నిరాకరించింది. గతంలోనూ ఇతర అగ్రరాజ్యాలు కూడా ఈ టెక్నాలజీని భారత్‌తో పంచుకునేందుకు నిరాకరించాయి. డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల ఫలితంగా ఇప్పుడు భారత్ గాలియం-నైట్రైడ్ టెక్నాలజీ కలిగిన ఏడవ దేశంగా ఎదిగింది. ఇప్పటివరకూ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, దక్షిణ కొరియా, చైనా, జర్మనీల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉండటం గమనార్హం.ఏమిటి దీని ప్రత్యేకతలు..ఒక్క ముక్కలో చెప్పాలంటే సిలికాన్‌తో పోలిస్తే గాలియం-నైట్రైడ్ ఎక్కువ వోల్టేజీలు, ఫ్రీక్వెన్సీ, ఉష్ణోగ్రతల్లోనూ సమర్థంగా పని చేయగలదు. విద్యుత్తు వాహనాల్లో బ్యాటరీల నుంచి విద్యుత్తును మోటారుకు.. మోటారు నుంచి బ్యాటరీలకు మార్చేందుకు ప్రస్తుతం సిలికాన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల విద్యుత్తు వృథా అవుతూంటుంది. గాలియం-నైట్రైడ్ ఆధారిత ప్రాసెసర్లతో ఈ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఒక అంచనా ప్రకారం సిలికాన్‌తో వచ్చే నష్టాలు 6 - 10 శాతం వరకూ ఉంటే.. గాలియం-నైట్రైడ్ ప్రాసెసర్లతో వచ్చే నష్టాలు 2 - 6 శాతం మాత్రమే. అంతేకాదు.. ఈ పదార్థంతో బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా వేగంగా జరిగి పోతుంది. బ్యాటరీల బరువు తగ్గడమే కాకుండా.. ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే.. విద్యుత్తు వాహనాల మైలేజీ పెరగడం, గంటలు పడుతున్న బ్యాటరీ ఛార్జింగ్ సమయం తగ్గడం జరిగిపోతుందన్నమాట. అలాగే సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే డైరెక్ట్ కరెంట్ (డీసీ)ను... మనం వాడుకునే ఆల్టర్నేట్ కరెంట్ (ఏసీ)కి మార్చే క్రమంలో అయ్యే నష్టాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. అంతేకాదు.. 5జీ నెట్‌వర్క్‌ల ద్వారా డేటా ట్రాన్స్ఫర్ వేగాన్ని పెంచేందుకు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే.. ‘‘డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం ద్వారా దేశం విదేశాల నిషేధాలను అధిగమించగలిగాము. దేశ భద్రత విషయంలో ఇదో మేలి మలుపు’’ అని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్. -
ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!
తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్ఎస్ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్ గుట్టు పోలీస్ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. కేటీఆర్‌ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్ఎస్కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా? అని అడిగితే ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది? నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్ వల్ల సంచలన విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్ మీ’’ అని ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్‌ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్‌పై ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై ఎదురు కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కేటీఆర్ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ ఫోన్లు ట్యాప్ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్‌కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్‌దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్ఎస్పై కోపంతో అన్నారా? లేక నిజంగానే ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా?
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. సిట్ ఛార్జ్‌షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!. సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది. లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్‌లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి. జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్‌లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు. ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్‌ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు. లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు. 2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్‌పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్‌ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్‌ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్‌కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
ఎల్లో మీడియా వారు సమర్పించు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటీకరణ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రైవేటు వారికి రాసివ్వడానికి కూటమి ప్రభుత్వం భూమిక సిద్ధం చేస్తోంది. ఇందుకు ఎల్లోమీడియా ఈనాడు విషపూరిత కథనాల ప్రచురణతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడింది. ‘అభివృద్ది కోసమే పీపీపీ’ అంటూ ఇటీవల ప్రచురించిన కథనం ఈ కోవలోనిదే. వీటి ప్రకారం.. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలతోపాటు పోర్టులు తదితర ప్రాజెక్టులు కూడా ప్రైవేటుపరం కానున్నాయి. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి కేటాయిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’’ అనిపించకతప్పదు. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పనంగా ప్రజల సొమ్ము అప్పగించి వారి సంపద పెంచే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోండటం గమనార్హం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే ఈనాడు ఇలాంటి కథనం ప్రచురించడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కూడా సొంతంగా వైద్యకళాశాలలను నిర్మిస్తుంటే.. చత్తీస్‌గఢ్‌లోనూ ప్రభుత్వమే కళాశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం అన్ని వసతులూ సమకూర్చి సిద్ధం చేసిన కాలేజీలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తారట. దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని కాపాడగల వైద్యకళాశాలకు రూ.5,000 కోట్లు కేటాయించలేక... రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగిస్తారన్న మాట. అన్నీ సిద్ధంగా ఉన్న కాలేజీలకు టెండర్లు పిలిస్తే అది ప్రభుత్వ సమర్థత అని పొగిడే స్థాయికి ఈనాడు దిగజారిపోయింది. పైగా పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే వైద్యకళాశాలలను కట్టడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతని కూడా నిస్సిగ్గుగా రాసుకుంది ఈనాడు. అలాగే రాష్ట్ర వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేయగల సామర్థ్యమున్న పోర్టుల నిర్మాణంపై కూడా ఈనాడు జగన్ ప్రభుత్వంపై ఆడిపోసుకుంది. ప్రైవేటు వారికి అప్పగించడాన్ని సమర్థతగా చెబుతోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన తరువాత రాష్ట్రాన్ని మౌలిక వసతుల సమస్య వేధిస్తోందని ఈనాడు రాసింది. మరి... మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామ, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రుల బాగుచేత వంటివన్నీ మౌలిక వసుతులు ఎలా కాకుండా పోయాయో కూడా ఈనాడు వివరించి ఉండాల్సింది. రిషికొండపై జగన్ రూ.250 కోట్లతో సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఒక ఆస్తిని సమకూరిస్తే దాన్ని ప్రైవేటువారికి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆత్మవంచన చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పీపీపీ కింద ప్రాజెక్టుల చేపట్టడానికి ప్రతిపాదనలు అడిగితే ఏపీ రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కోరిందట. విచిత్రంగా ఈ జాబితాలో ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన మూలపేట, రామాయంపేట పోర్టులు ఉన్నాయి. రామాయంపేట పోర్టులో ఒక బెర్త్ పూర్తయ్యేదశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, నాగార్జునసాగర్, కుప్పం, అమరావతి ఎయిర్ పోర్టులు పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయానికి విమానాలే రాని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలకు ఎవరు వస్తారు? విశాఖ, విజయవాడ విమానాశ్రయాలే నష్టాలలో ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలకు ఆశపడి మాత్రమే ఎవరైనా ఈ చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు కట్టేందుకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలను ఎగవేసినా అడిగేవారు ఉంటారా?అన్నది సందేహం. దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందో అందరికి తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీలకు చెందిన కొందరు ప్రముఖులు వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి హాపీగా పదవులలో ఉంటున్నారు కదా! ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అమలైతే ఆ జాబితాలోకి మరింత మంది చేరవచ్చేమో! వీటితోపాటు అప్పర్ సీలేర్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి పరషరా పథకం ప్రైవేటువారికి అప్పగిస్తారట. వారు ఈ స్కీమ్‌ను అమలు చేశాక డబ్బులు తిరిగి రాబట్టడం కోసం ఎంత వసూలు చేస్తారో తెలియదు. అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, తిరుపతి క్రీడా ప్రాంగణం, తిరుపతి బస్టాండ్ మొదలైనవి ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నట్టు ఈనాడు తన కథనంలో చెప్పింది. వీటన్నిటిలో ఒకటి అరా ఏమైనా పూర్తి అవుతాయేమో చెప్పలేం. ఏ ప్రైవేటు వ్యక్తి తన సొంత డబ్బు వినియోగించి ప్రజలకు సేవ చేయడు. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులలో అధిక శాతం బ్యాంకు రుణాల రూపంలోనే తీసుకుంటారు. ఎటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ సొమ్ము వస్తుంది. అయినా నడపలేక చేతులెత్తేస్తే చేసేదేమీ ఉండదు. బాగా నడిచేవి ఉంటే అవన్ని ప్రైవేటు వారికి సొంత ఆస్తులుగా మారతాయి. పైగా వాటిని వినియోగించేవారి నుంచి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తారు. రోడ్లకు, పేదవాడికి ఉపయోగపడే వైద్యకళాశాలలకు తేడా లేకుండా ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. గతంలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లోనే వాటిలో అధిక భాగం మూతపడడమో, లేక ప్రైవేటు వ్యక్తుల పరమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే, వాటిలో అధిక భాగం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి వారికి సంపద తెచ్చిపెట్టాయి. స్థూలంగా చూస్తే లాభాలు వస్తే ప్రైవేటుకు, నష్టాలు వస్తే ప్రభుత్వానికి అన్నమాట. ఇదే అభివృద్ది అని జనం మోసపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ ప్రక్రియ మళ్లీ మొదలవుతోందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆర్థిక సర్వేకు కొత్త రూపునివ్వాలి!
మన దేశం స్వాతంత్య్రం సంపాదించు కున్న కొత్తలో ముఖ్యమైన విధానపరమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయీ అంటే అవి ప్రణాళికా సంఘం ప్రచురించిన పంచవర్ష ప్రణాళికలే! ప్రణాళికా సంఘం ప్రాధాన్యం కోల్పోయి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాభవం పెరిగిన తర్వాత, బడ్జెట్‌కు ముందు ఆర్థిక శాఖ సమర్పించే ఆర్థిక సర్వే క్రమేపీ ఎక్కువ మందిని ఆకర్షించడం మొదలైంది. ఈ సర్వే కొన్నేళ్ళుగా పెక్కు ఉపయోగకరమైన విధానపరమైన ఐడియాలను, ఆలోచనలను రేకెత్తించే అంశాలను మన ముందు ఉంచుతూ వస్తోంది. ఉదాహరణకు, చైనాపై వాణిజ్య, పెట్టుబడులపరమైన ఆంక్షలను విధించడంలోని ఔచిత్యాన్ని 2023–24 ఆర్థిక సర్వే ప్రశ్నించింది. అప్పటికి భారత్–చైనా సంబంధాలు కదలని స్థితిలోనే ఉన్నాయి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే బదులు భారత దేశంలో వస్తూత్పత్తి చేసేందుకు చైనా సంస్థలకు అనుమతించడం మెరుగైన ఆలోచన అనిపించుకోవచ్చని సర్వే వాదించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మొదట్లో ఆ ఆలోచనను తోసిపుచ్చినా, అది పునః పరిశీలించదగ్గ ప్రతిపాదనేనని ఆ తర్వాత అంగీకరించింది. సంక్షేమ పథకాల ఫలాలు అందవలసిన వారికి అందడం లేదనీ, వాటిలో లొసుగులు ఉన్నాయనీ గతంలో ఆర్థిక సర్వేలు ఎత్తి చూపాయి. లబ్ధిదారులకు నేరుగా నగదు బదలీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాయి. ఈ ప్రతిపాదన 2009–10, 2010–11 సంవత్సరాల సర్వేలలో మొదట చోటుచేసుకుంది. దానిపై అప్పట్లో మొదట్లో పెద్ద దుమారమే రేగింది. కానీ, అప్పటి నుంచి రైతులు, మహిళలు, ఇతర ఉద్దేశిత లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా నగదు బదలీ చేయడం సంప్రదాయసిద్ధమైన విధాన సాధనాలలో అంత ర్భాగంగా మారింది. మరింత ఉపయోగపడేలా...ఆర్థిక సర్వే కొత్త ఆలోచనలను అందించి, ఎక్కడెక్కడ దిద్దు బాటు చర్యలు అవసరమో సూచించగలదు. కానీ, సర్వేలో పది సూచనలు ఉంటే, ఏదో ఒక దానిపై చర్చించి, అమలులోకి తెస్తు న్నారు. మిగిలిన తొమ్మిదింటిని గాలికి వదిలేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే, సర్వేలో చూపే టేబుల్స్, ఛార్టులలో గాఢత లోపిస్తోంది. మరి పౌరులు, సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రజా సేవకులకు మరింత ఉప యోగకరమైనవిగా ఆర్థిక సర్వేలు ఉండేటట్లు చేయడం ఎలా? మొదట... వాటిని ప్రాధాన్యం కలిగినవిగా మార్చాలి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో రూపుదిద్దుకోగలిగిన వివిధ సందర్భాలను సర్వే స్థూలంగా వివరించగలగాలి. ఆ యా సందర్భా లలో వివిధ మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటరీ ఏజన్సీలు విధాన పరంగా ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందో కూడా సూచించాలి. అటువంటి పరిణామాల విశ్లేషణ చిన్న వ్యాపార సంస్థలు రానున్న నెలలకు సంబంధించి అత్యవసర ప్రణాళికలు తయారు చేసుకునేందుకు సహాయపడుతుంది. బాహ్య వాతావరణం మార గానే, దానికి తగ్గట్లుగా విధానపరంగా చకచకా మార్పులతో స్పందించేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. రకరకాల ప్రత్యామ్నా యాలను లెక్కలోకి తీసుకుంటూ స్వల్ప, మధ్యకాలిక అంచనాలకు రావడంలో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్‌తో కలసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేయవచ్చు. ఈ అంచనాలను బట్టి ఎటువంటి పరిస్థితులు తలెత్తగలవో ప్రణాళిక వేసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో ప్రతి 3 నెలలకోసారి ఈ అంచనాలను అప్డేట్ చేయవచ్చు. ఏం చేయాలి?ఒకటి – చాలా భాగం భారతీయ వ్యాపార సంస్థలు సొంత ఆర్థిక, భౌగోళిక రాజకీయ సలహాదారులను నియమించుకోగలిగిన స్థోమత ఉన్నవి కావు. కీలక ఆర్థిక ప్రశ్నలపై మార్గదర్శనం చేయడం ద్వారా సర్వే బృందం ఆ లోటును భర్తీ చేయవచ్చు. రెండు – సర్వే చాట భారతంలా కాకుండా వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. అది భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఇయర్ బుక్లా కాకుండా ముఖ్యమైన ఆర్థిక సవాళ్ళపై దృష్టి కేంద్రీకరించిన సంగ్రహ డాక్యుమెంట్‌గా ఉండాలి. అప్పుడే అది నిజంగా ఉపయోగ పడుతుంది. నిర్ణయాలు తీసుకునేవారిలో చాలా మందికి సుదీర్ఘ పాఠాలను చదివేంత తీరిక ఉండదు. మూడు– ఆర్థిక సర్వే అందరి భాగస్వామ్యంతో రూపొంది నదిగా ఉండటం సముచితం. వివిధ ఆర్థిక మంత్రిత్వ శాఖలు,రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య లపై సర్వే బృందం ఇన్పుట్స్ సేకరించాలి. ఆ యా అంశాలపై ఆలోచించదగ్గ విధాన ప్రతిపాదనలు చేసిన వారికి విధాన నోట్సును తయారు చేసేందుకు స్వల్పకాలిక గ్రాంటులు మంజూరు చేయవచ్చు. ఆ సమావేశాల్లో పాల్గొనేవారు అకడమిక్ పరిశోధకులు, పాలసీ ప్రాక్టీషనర్లు ఇద్దరి మాటలను వినేవారుగా ఉండాలి. ఎటొచ్చీ వయసు విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకోవడం వాంఛ నీయం. విధాన నిర్ణయ ప్రక్రియలో యువత పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. బహిరంగ పోటీ వల్ల తుది ఎంపిక లను సీరియస్‌గా తీసుకోగల అవకాశం ఉంటుంది.హ్యాకథాన్ అవసరంఎవరో తెలివైన కొద్దిమంది పురుషులు, మహిళలతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ లాంటి సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం కష్టం. చాలామంది విధాన నిర్ణేతలు తాత్కాలిక ప్రాతి పదికపై బయటవారి సలహాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతూంటారు. కానీ, దీనికి ఒక విధానపరమైన బృందం అవసరం. ఆబృందాన్ని నేటి కంప్యూటర్ పరిభాషలో హ్యాకథాన్ అందాం. విద్యా వేత్తలు, విధానపరమైన పరిశోధకుల నుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే సంస్థాగత వేదికగా అది పని చేస్తుంది. నూతన విధాన పరిష్కారాలను ప్రతిపాదించేవారు సంకుచిత ప్రయోజనాల నిమిత్తం ఆ పని చేయడం లేదనీ, వారు పోటీతో కూడిన ప్రక్రియ ద్వారా ఎంపికై వచ్చినవారనీ విధాన నిర్ణేతలకు తెలిస్తే, వారు ఆ పరిష్కారాలను సానుకూలంగా పరిశీలించే అవ కాశం ఎక్కువ. హ్యాకథాన్ సూచించిన కొన్ని పరిష్కారాలు నేడు పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి కాకపోయినప్పటికీ, అవి రేపటికైనా ఉపయోగపడేవిగా ఉంటాయి. నేటి యువ హ్యాకథాన్ విజేత రేపటి సీనియర్ విధానపరమైన నిర్ణేతగా పరిణమించనూ వచ్చు.ప్రమిత్ భట్టాచార్య వ్యాసకర్త ‘డేటా ఫర్ ఇండియా’ రిసెర్చ్ హెడ్; ‘న్యూఇండియా ఫౌండేషన్’ ఫెలో (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కనబడే వృద్ధిలో కనబడనివి...
దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్టకేలకు అధిక వృద్ధి బాట పట్టిందని వ్యాఖ్యాతలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ముందస్తు అంచనాలను కూడా లెక్కలోకి తీసుకుంటే, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు 8.1 శాతం. నమోదైనవాటిలో ఇదే ఉత్తమం. కానీ, దీన్ని సందర్భానుసారంగా చూడాలి. గడచిన ఐదేళ్ళ రికార్డు, చతికిల పడిన స్థితి నుంచి చూసి చెబుతున్నది. కోవిడ్ ఏడాది 2020–21లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోవిడ్‌కు ముందరి ఏడాది (2019–20)ని ప్రాతిపదికగా చేసుకుంటే, తాజాగా ఆరేళ్ళలో వృద్ధి రేటు 5.7 శాతంగా తేలుతుంది. అంతకుముందు 19 ఏళ్ళలోని వృద్ధి రికార్డు కన్నా అది మందగమనం కిందనే లెక్క. కోవిడ్‌కు ముందరి ఏడాది వరకు సగటున 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది.తాజా వృద్ధిరేటు 2020–21 క్షీణత నుంచి ఏ మేరకు కోలుకున్నామనేదానికి ప్రాతినిధ్యం వహిస్తోందా అనేది కీలక ప్రశ్న. నిలకడగా సాధించగలిగిన వృద్ధిరేటు ఇపుడు ఎంతని చెప్పగలం? వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6.5 శాతం వృద్ధిరేటు ఉండగలదని కొందరు అంచనాలు వెల్లడించారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకుంటే, మూడేళ్ళ (2024–27) చక్రభ్రమణంలో సగటు వృద్ధి రేటు 6.8 శాతం ఉండవచ్చు. మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో కూడా అదే రేటు ఉంది. స్థిర వృద్ధి రేటులో గణనీయమైన పెరుగుదల ఇంకా ఏదీ లేదని ఇది సూచిస్తోంది. విరుద్ధ సూచికలుగతంలో చాలా సందర్భాలలో, ఏదో ఒక ఆర్థిక సూచి సరైన స్థితిలో లేనట్లుగానే కనిపించేది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండ టమో, లేదా ద్రవ్యలోటు మాదిరిగానే వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటమో జరిగేది. దానికి భిన్నంగా నేటి ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగ దశలో ఉన్నట్లుగా చిత్రితమవుతోంది. అయినా, స్థూల గణాంకాలు అప్రమత్తతను సూచిస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గుతున్న బాటలోనే ఉంది. కానీ, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో అది 4.4 శాతంగా ఉంది. అంటే, మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో (3.6 శాతం) కన్నా అధికం. ప్రభుత్వం పెట్టుబడుల ప్రవాహాన్ని ఉధృతం చేయడం, మరింత నిజాయతీతో కూడిన పద్దులు... బహుశా అందుకు కారణం కావచ్చు. ప్రభుత్వ రుణం కూడా తగ్గుతున్న సరళిలోనే ఉన్నప్పటికీ, అధికంగానే కొనసాగుతోంది. జీడీపీలో 81 శాతంగా ఉన్న ప్రభుత్వ రుణం, ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారితే, దాన్ని ఎదుర్కోగల ద్రవ్యాచరణకు అది వెసులుబాటు కల్పించగలిగినదిగా లేదు. కాగా, వృద్ధికి కీలకమైన పొదుపు, ఇన్వెస్ట్మెంట్ రేట్లు గతంలో కన్నా తక్కువగా ఉన్నాయి. స్థూల స్థిర మూలధన సమీకరణ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జీడీపీలో 30 శాతంగా ఉంది. ఇది 2012–13 వరకు ఉన్న ఎనిమిదేళ్ళ సగటు 34 శాతం కన్నా తక్కువ. ఆర్థిక కలాపంలో వస్తువులు, సరుకుల ఎగుమతుల వాటా కొంత కాలంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా, దీన్ని వేగవంతమైన వృద్ధి రేటుకు విరుద్ధమైన సూచిగానే చూస్తారు. బాగుంది కానీ...వృద్ధి రేటు పెరుగుతున్న సరళికి ఆలంబనగా నిలిచే డేటా ఏదైనా కావాలనుకుంటే, ఇతరత్రా సంఖ్యలను చూడక తప్పదు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ అభివృద్ధి సూచిలో మన దేశం ఈ ఏడాది ‘మధ్యస్థ’ నుంచి ‘అధిక’ కేటగిరీలోకి పురోగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది విద్యాస్థాయులు, ఆయుర్దాయం, ఆదాయాలలో వచ్చిన స్థిర మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. దీంతో మురిసిపోవడానికి లేదు. ఈ సూచిలో ‘అత్యధిక’ కేటగిరీ కూడా ఉంది. దానిలో 70కి పైగా దేశాలున్నాయి. ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే, పన్ను రేట్లు (కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, జీఎస్టీ) గతంలో కన్నా హేతుబద్ధంగా ఉన్నాయి. డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులు విస్తృత వినియోగాన్ని సంతరించుకున్నాయి. భౌతిక మౌలిక వసతుల్లో భారీ పెట్టుబడులు అభినందనీయం. ఇవి రోడ్డు, రైలు మార్గాలలో సరుకుల రవాణాను వేగవంతం చేశాయి. అదే సమయంలో, వాణిజ్య వాహనాల అమ్మకాలలో అది ప్రతికూల ప్రభావం చూపడం వేరే సంగతి. సంస్కరణల వల్ల స్థిరాస్తి, వస్తూత్పత్తి వంటి రంగాలు లబ్ధి పొందాయి. ఎలక్ట్రానిక్స్ రంగ నేతృత్వంలో వస్తూత్పత్తి ఎట్టకేలకు కొంత వేగాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా కింది స్థాయి వరకు కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. కానీ పారిశ్రామిక విభాగాల్లో మూలధన వస్తువుల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. తీవ్ర పేదరికం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరగడం శుభ సూచకం. కానీ, అది వినియోగ వస్తువుల డిమాండ్ బాగా పెరిగేటంతగా తోడ్పడకపోవచ్చు. వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నవారు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. దానిలోంచి కొందరు బయటకు రావడానికి బదులుగా కొత్తవారు కూడా ఉపాధికి అదే రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. చేయాల్సింది ఎంతో!ఆదాయ నిచ్చెనలో పై మెట్లపై ఉన్నవారి వినియోగ రుణం ఎక్కువగా ఉంది. గృహోపయోగ వస్తువులపై రుణాలు 2021–22లో ఉన్న రూ. 8.99 ట్రిలియన్ల నుంచి 2023–24లో రూ. 18.79 ట్రిలియన్లకు రెట్టింపయ్యాయి. ఇప్పటికే చేసిన అప్పులు చెల్లించ వలసి రావడం వల్ల భవిష్యత్ వినిమయంపై దాని ప్రభావం పడుతుంది. చాలా రంగాల్లో వృద్ధి ఇప్పటికే మందంగా ఉంది. ముఖ్యంగా, రైళ్ళలో ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగానే పెరుగుతూ వస్తోంది. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్న ప్పటికీ అదీ పరిస్థితి. వినియోగదారులలో అగ్ర భాగాన ఉన్న 20 శాతం మందిపైనే దృష్టి పెడుతున్నట్లు మొన్నామధ్య ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందుకే ఆశ్చర్యం కలిగించలేదు. కానీ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 వరకు గడిచిన ఐదేళ్ళలో 11 శాతం మాత్రమే వృద్ధి చెందింది. దేశం 1991లో సంస్కరణల బాట పట్టిన తర్వాత, ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పు తగినంత చోటుచేసుకోలేదని వీటన్నింటి బట్టి తెలుస్తోంది. తలసరి ఆదాయాలు దాదాపు ఐదు రెట్లు పెరిగినప్పటికీ, జీడీపీలో పరిశ్రమ వాటా అప్పటిలానే ఇప్పుడు కూడా ఒకటో వంతుగానే ఉంది. వ్యవసాయ రంగ వాటా కూడా క్షీణించింది. పంట దిగుబడులు ప్రపంచ ప్రమాణాల కన్నా తక్కువ స్థాయులలో ఉన్నాయి. సేవల రంగమే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగంగా పరిణమించింది. అది చాలా వరకు, ఆర్థిక వ్యవస్థలో అవ్యవస్థీకృత భాగంగానే కొనసాగుతోంది. సరైన ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా సత్వర సేవల రంగాన్ని చూపలేం. ఉత్పాదకత పెంపుదల మూడు సంస్థాగత మార్పులపై ఆధార పడి ఉంది. వస్తూత్పత్తి రంగం గణనీయమైన రీతిలో పెద్దదిగా మారాలి. ఆర్థిక వ్యవస్థ మరింత నియతమైనదిగా మారాలి. పట్టణీ కరణ వేగంగా సాగాలి. ఆర్థికవ్యవస్థ తగినంత వేగాన్ని పుంజు కోవడానికి చేయవలసింది చాలా ఉంది. టి.ఎన్. నైనన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రాజ్యాంగం ఓ ‘సోషల్ డాక్యుమెంట్’
రాజ్యాంగ పరిషత్‌లో 1949 నవంబర్ 26న ఆమోదించుకొని శాసనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రెండేళ్ల 11 నెలల 11 రోజుల సుదీర్ఘ కసరత్తు చేశాక బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ దేశానికి ఓ ఆదర్శ ప్రాయమైన రాజ్యాంగాన్ని అందించింది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వ భావనలను ఫ్రెంచ్ రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొన్నారు. పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, మార్గదర్శక సూత్రాలను ఐర్లాండ్ నుంచి, సుప్రీం కోర్టు విధివిధా నాలను జపాన్ నుంచి స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించే పరిపాలనకు రాజ్యాంగమే మార్గదర్శి. చట్టాల రూపకల్పనకు దిక్సూచి. దేశ ప్రజలకు రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. బాధ్యతలను అందించింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు, ప్రభుత్వాలు చేసిన హామీలను, చేసిన చట్టాల అమలులో లోపాల్ని సవాలు చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలోని అనేక దేశాలు రాజకీయ, సామాజిక అస్థిరతలతో కుప్పకూలాయి. కానీ, ఎంతో విశాలమైనదీ, అతి పెద్ద జనాభాతో కూడి అనేక భిన్న సంస్కృతులు, భాషలు, వర్గాలు,సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ ‘భిన్నత్వంలో ఏకత్వం’లా సుదృఢంగా భారతదేశం 8 దశాబ్దాలుగా నిలబడగలిగిందంటే నిస్సందేహంగా మనకున్న అతి గొప్పదైన రాజ్యాంగమే కారణం. రాజ్యాంగం కేవలం ఒక నియమాల సంకలనం కాదు. సమసమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు దారిచూపే ఓ ‘దీపం’. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించాలో నిరంతరం గుర్తు చేసే ఓ దార్శనిక పత్రం.ప్రవేశిక ప్రాధాన్యంరాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్దేశించింది. ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము’ అనే వాక్యంతో మొదలుపెట్టి ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాము’ అని ఉంటుంది. భారత రాజ్యాంగం దేశంలో ఏ ఒక్క వర్గానిదో, మతానిదో కాదు. కులం, మతం, వర్గం, భాష, లింగ వివక్ష, విద్య... ఇంకా ఇతర ప్రమాణాలతో నిమిత్తం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరి సమానత్వం కోసం ఏర్పరిచింది. సార్వభౌ మత్వం అంటే అర్థం ప్రజలు మాత్రమే సర్వాధికారులు. ప్రభుత్వా లన్నది ప్రజలకు సేవ చేయడానికి ఉనికిలో ఉంటాయి. ప్రభుత్వాల అధికారాలన్నీ ప్రజల చేత, ప్రజల తరఫున, ప్రజల కోసం పాలించ డానికి ఇవ్వబడేవే! రాజ్యాగం గొప్పదైనంత మాత్రాన ఆశించిన ఫలితాలు అంద వని ముసాయిదా ప్రతిని సమర్పించి 1949 నవంబర్ 26న చేసిన చరిత్రాత్మక ప్రసంగంలోనే అంబేడ్కర్ పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగం ఎలా పని చేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడిలేదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అనే అంగాలను మాత్రమే రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఆకాంక్షలను, రాజకీయాలను కోరుకొంటున్నారన్న దానిపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది’’ అంటూ స్పష్టం చేశారు.మంచీ... చెడూ...రాజ్యాంగబద్ధమైన పాలనలో దేశం కొన్ని మైలురాళ్లు చేరుకున్న మాట వాస్తవం. 1947లో దేశ ప్రజల సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పడు అది 72 సంవత్సరాలకు పెరిగింది. అక్షరాస్యత 16% నుండి 80 శాతానికి చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.773 కోట్ల టన్నులకు పెరిగింది. 1947లో కేవలం 1,500 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు దాదాపుగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యాలు ఏర్పర్చు కోగలిగాము. రహదారుల నిర్మాణం కూడా 4 లక్షల కిలోమీటర్ల నుంచి నేడు 60 లక్షల కిలోమీటర్లకు చేరుకోగలిగాము. అంటరాని తనం చట్టపరంగా తొలగించబడింది. దళితులు, గిరిజనులపై జరిగే అకృత్యాల నుండి పరిరక్షించే చట్టాలు రూపొందించబడ్డాయి. వివక్షకు గురైన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆహారం, సమాచారం హక్కుగా కల్పించబడ్డాయి. నిరాదరణకు గురైన సామా జిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రు లుగా, న్యాయమూర్తులుగా నియమించబడటం చెప్పుకోదగిన మార్పు. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందినవారి సంస్కృతి, మతపర విశ్వాసాలకు చట్టపరంగా రక్షణలు కల్పించడం జరిగింది. అయితే, రాజ్యాంగం కల్పించిన మహత్తర అవకాశాలను పూర్తి స్థాయిలో ఈ 8 దశాబ్దాల రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందనడం ఓ చేదు వాస్తవం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల స్ఫూర్తి అమలు కాలేదు. ఫలితంగానే, దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లోకి పోయింది. 90 శాతం సంపద 10 శాతం మంది వద్ద పోగుపడింది. ధనికులు మరింత ధనికులు కాగా, పేదలు మరింత పేదలు అవుతున్నారు. విధానపరమైన వైఫల్యాలే దేశాభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. రాజ్యాంగం ద్వారా రూపొందించే సంస్థలలో ప్రజా భాగస్వామ్యం, పాత్ర తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.అవగాహన పెరగాలి!రాజ్యాంగంలో ఏర్పర్చుకొన్న సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వాలు జరగడంతోనే ఈ సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. ఏటా ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్లలో సంక్షేమానికి కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇవి ప్రాధాన్య రంగాల స్థాయి నుంచి మొక్కుబడి స్థాయికి దిగజారి పోయాయి. ప్రభుత్వాలకు ఆదాయం ప్రజల పన్నుల ద్వారా సమకూరుతున్నదే. పన్నుల్లో ఎంతమేరకు తిరిగి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారో లెక్కలు తీస్తే సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్థం అవుతుంది. సామాజిక న్యాయం జరగకపోతే రాజ్యాంగం ఆశించిన తీరులో అభివృద్ధి జరగదు. రాజ్యాంగ సూత్రాల స్ఫూర్తితో పని చేస్తేనే పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడతాయి. అధికార వికేంద్రీకరణ జరగాలి. అన్ని వర్గాల ప్రజలను సాధికారుల్ని చేయగలిగితేనే... భారత రాజ్యాంగం ఆశించిన మేరకు ఫలితాలు అందుతాయి. భారత రాజ్యాంగాన్ని ఓ సోషల్ డాక్యుమెంట్‌గా అమలు చేసినప్పుడే ప్రజల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంత రాలు తగ్గుతాయి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పర్చుకోవాలి. రాజ్యాంగం అందించిన హక్కులను ఉపయోగించుకొని ప్రభుత్వాలను నిలదీయాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు (నేడు గణతంత్ర దినోత్సవం) -
సునీల్ మిత్తల్ (వ్యాపార కుబేరుడు) రాయని డైరీ
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా షేక్ చేస్తున్నారు ఆయన. షేక్ చేయటం అంటే, కదిపేయటం మాత్రమేనా, ‘కలిపేయటం’ కూడా! ట్రంప్ పిచ్చికి ఒక పద్ధతి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. పెద ఉప్పెన ఒకటేదైనా వచ్చిపడాలి... మనుషులంతా ఒకరిలోకి ఒకరు మునగదీసుకోవటానికి! దేశాలైనా అంతే, ఉపద్రవం వచ్చిపడితే హద్దులు చెరిపేసుకొని భూభాగాలన్నీ ఒకచోట చేరిపోవలసిందే. మనుషులకన్నా ఏం గొప్పవని ఈ దేశాలు!ట్రంప్ ఇప్పుడొక ఉప్పెన. ఒక ఉపద్రవం. నాకనిపిస్తోందీ... యూరప్ చాలా కాలంగా సెలవుల్లో ఉన్నట్లుగా ఉండటం వల్ల ట్రంప్‌ను తమాయించుకోలేక పోతున్నదని! సెలవుల నుంచి తిరిగొచ్చాక, ఇంట్లో పని ఉంటుంది; ఒంట్లో బద్ధకంగా ఉంటుంది. ట్రంప్ ఆ బద్ధకాన్ని వదిలించి, మూలన ఉన్న చీపురును చేతికి అందుకునేలా చేశారు. ‘‘గ్రీన్‌ల్యాండ్‌ను కలిపేసుకుంటాం’’ అని ఆయన ఒక్కమాట అనగానే ఐరోపా దేశాలన్నీ మెలకువలోకి వచ్చేశాయి! ఆయన ఒక్కసారిగా ట్యారిఫ్‌లు పెంచేయగానే ఇండియా వంటి దేశాలతో ట్రేడ్ డీల్స్ కోసం పరుగులు పెడుతున్నాయి. ఈయూ లీడర్లు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. ‘యూరోపియన్ కమిషన్’ ప్రెసిడెంట్ మిస్ ఉర్సులా వాండర్, ‘యూరోపియన్ కౌన్సిల్’ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా... రేపు జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులు. ఆ మర్నాడే ‘ఇండియా–ఈయూ’ సదస్సు. బహుశా, సెలవుల నుంచి ఎలా తేరుకొని ఎలా పనిలో పడిపోవాలో తెలుసుకునేందుకు ఇండియాతో ఆ సదస్సులో యూరప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇండియాకు వర్క్ తప్ప వెకేషన్ అలవాటు లేదు కనుక ప్రతిఫలంగా యూరప్ నుంచి వర్క్ తీసుకోవచ్చు. ట్రంప్ విషయంలో ఇండియా ‘‘ఇలా ఉండాల్సింది’’, ‘‘అలా ఉండాల్సింది’’ అని ఇండియాలోనే కొందరు విమర్శిస్తున్నారు! ‘ఉండాల్సింది’ అనే మాటను ఎప్పుడైనా సరే, భుజాల మీద బరువు లేని తేలికపాటి మనుషులు మాత్రమే అనగలరు. నేను బిజినెస్మేన్నే కావచ్చు. కానీ నేను జియోపాలిటిక్స్ స్టూడెంట్‌ని కూడా! ట్రంప్ ట్యారిఫ్ల శబ్దానికి ప్రతీకారంగా ఇండియా మౌనం వహించటమే దీటైన జవాబు అని నేను నమ్ముతాను. శబ్దానికి శబ్దంతో సవాలు విసిరితే అది తగాదా అవుతుంది. మౌనాన్ని అస్త్రంగా సంధిస్తే అవతలి వాళ్ల శబ్దాలు తాటాకు చప్పుళ్లుగా మాత్రమే మిగులుతాయి! ఇది కదా ప్రత్యర్థి ప్రకోపాన్ని శక్తిహీనం చెయ్యటం! గాజాను గొప్ప రియల్ ఎస్టేట్‌గా మారుస్తానని ట్రంప్ దావోస్ ఎకనమిక్ ఫోరమ్‌లో అన్నారు! ఒక పిచ్చివాడు అనలేని మాట అది. పచ్చి వ్యాపారి మాత్రమే అలా అనగలడు. చందమామ కోసం గెడకర్రతో ఆకాశాన్ని కదిలిస్తే కనీసం చుక్కలైనా రాలకపోతాయా అని ఆలోచిస్తారు ట్రంప్. ట్రంప్ అనే అధ్యక్షుడిలో ట్రంప్ అనే అనేకమంది వ్యాపారులు ఉన్నారు. లేకుంటే ఆయన గాజాను, గ్రీన్‌ల్యాండ్‌ను పునర్నిర్మించాల్సిన నివాస ప్రాంతాలుగా కాకుండా, కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్సులుగా ఎందుకు చూస్తారు? ఎకనమిక్ ఫోరమ్‌లో ట్రంప్ 72 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ప్రతి మాటలోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే క్లాసిక్ నినాదం చాలా కఠినంగా ధ్వనించింది!ఫస్ట్ అన్నప్పుడు పరుగెత్తి ఫస్ట్ రావాలి. కానీ ట్రంప్, అమెరికాను ఉన్నచోటనే ఉంచి, అమెరికా ఫస్ట్ అనిపించేలా ప్రపంచం ఉన్న ఆర్డర్‌ని మార్చాలని చూస్తున్నారు! ఆశ్చర్యం ఏముంది?! ఫక్తు వ్యాపారి అలాగే కదా చూస్తాడు, అలాగే కదా చేస్తాడు! -
బేఫికరుండు.. నాదీ గేరంటీ
‘ఏం తమ్మీ మంచి గున్నవా?’..‘మంచిగున్న అన్నా.. నిన్నిట్టా సీఎం పోస్టులో జూస్తాంటే బలే హేపీగా ఉన్నదన్నా’..‘మీ బాపూ చూపించిన దారే గద తమ్మీ. అందుకే గద తమ్మీ.. సార్‌ని నేను దేవుడంటా వుంటా’..‘నీ అసుంటి మంచోడు దునియాలోనే వుండడన్నా.. మంచి జేసినా గూడా యెనకాల గోతులు తవ్వేటోల్లే తప్ప.. ఇలా యాది పెట్టుకునేటోళ్లు యెవరుంటున్నారన్నా’..‘అరె ఛుప్. అలా గట్టిగా అనకురా తమ్మీ.. నీ బాపు గురించి నువ్వే సీక్రెట్స్ బయటపెట్టేస్తన్నావని.. అందరూ క్రిటిసైజ్ చేస్తారు మల్ల’.. ‘అర్రర్రె పాయింటు మర్చిపొయినా! అది మన హిస్టరీనే గదా.. బలే గుర్తుచేశావ్ రేవంతన్నా. మనలో మనం మురిసిపోవచ్చు గానీ.. బయటకు అనగూడదు కరక్టే.’‘నీ బాపు ఎక్కడ తమ్మీ.. కానొస్తలేడు. అందరం దావోస్ లోనే ఉన్నం. ఒకే చోట తిరుగుతున్నం. ఒకే పంచాయతీలు పెడుతున్నాం. పుటో దిగుతున్నం. డప్పు గొట్టిపిచ్చుకుంటున్నం.. అయినా మీ నాయిన కానొస్తలేడేంది తమ్మీ’.. ‘ఊకో అన్నా.. దావోస్ ల నువ్వు ఉన్నావంటేనే మా నాయినకు జొరమొచ్చేట్టుంది. దూరం నుంచి నువ్వు గనిపిస్తే చాలు.. తప్పించుకు తిరుగుతున్నాడు పాపం..’‘గదేంది తమ్మీ.. నీ బాపు గనిపిస్తే క్లోజ్డ్ రూంల సిటింగేసి ముచ్చట బెట్టాలనుకుంటి’‘ఊర్కో అన్నా. ఒక క్లోజ్డ్ రూం ముచ్చటనే బరాబర్ బజార్ల పెట్టేశావు. దునియా అంతా మా మొహాన దుమ్మెత్తి పోస్తాంటే లాక్కోలేక పీక్కోలేక నానా యాతన అవుతాంది. మా మినిస్టర్లను జూసినవా. నిన్ను ఒక్క మాటైన అననీకి, నువు జెప్పింది అబద్దం అననీకి దైర్యం లేదు. కానీ.. మా నాయిన మీద బురదని మాత్రం కడిగెయ్యాలి.. అందుకోసం ఎన్ని పాట్లు పడుతున్నారో జూసినవా..’‘మరైతే బాపును క్లోజ్డ్ రూం ల కలవడం కుదరదంటవా..’‘నువ్వింకోపాలి ఆ క్లోజ్డ్ రూం మాటెత్తితే దావోస్ నుంచే పారిపోయేట్టున్నాడన్న మా నాయిన’‘చల్ తియ్.. అయితే మాన్లె. నిన్నయినా ఇట్ట ఓపెన్ రూం కల్సులు అయ్యె ఈ తానకి’‘అయినా రేవంతన్నా.. ఏడాదికి మించి కుర్సీలో ఉండవేమో అనుకుంటినే’‘గట్లెట్ల అవుతది తమ్మీ.. నాదేమైనా గసుమంటి గిసుమంటి ట్రెయినింగనుకుంటివా? మీ బాపు దగ్గర నేర్చుకుంటినని యాద్ మరిసితివా? ఎవులైతే మన కుర్సీ మీద కన్నేసిన్రో.. ఆల్లందరూ ఇప్పుడు అవినీతి కంప్లయింట్ల బురదలో పడి కొట్టుకుంటున్నరు.. జూసినవా’‘అరె.. ఏం వుషారున్నవ్ రేవంతన్నా.. ఈ లెక్కన నీకు అయిదేళ్లూ కుర్సీ గ్యారంటీ స్కీముంటదేమో నన్నా’‘తప్పదు గద తమ్మీ.. వుషారుండాలె. దునియా అందరికీ నీ బోంట్ల కుర్సీలో కూర్సోబెట్టే బాపు వుండడు గద తమ్మీ’‘ఎక్కడన్నా.. కూర్సొనుడు కూర్సొనుడ అనుకోడమే గానీ.. ఎప్పుటికి గూర్సుంటనో ఏమో’‘నీకు మించి నీ బాపుకి మస్తు కోరికున్నది గానీ.. ఫికరు జెయ్యకు తమ్మీ.. జరూరు కుర్సీ నీదే..’‘మా సోపతోల్లు ఊకుంటరో లేదో నని చిన్న గుబులున్నది అన్నా’‘చల్ తియ్.. గింత బేకారున్నవేంది తమ్మీ. నీ సోపతుల్లో పవన్ కల్యాణు నీ కుర్సీ మోసేటందుకే ఎగబడుతోంటే నువ్వు ఫికరౌతవేంది. బేఫికరుండు.. అంతగైతే నేనున్న గద. మంత్లీ మంత్లీ డిల్లీకి జమాయిస్తన్నది కాస్తా ఓపాలి నీకు జమాయిస్త. గంతె. జబర్దస్త్ నువు కుర్సీలో కొస్తవ్.. నాదీ గేరంటీ’‘ఆ మాట అనబోకు రేవంతన్నా.. నీ ఆరు గేరంటీల్లోనే యిది గూడా కలిపేస్తావేమో’‘ఇంత పిచ్చోనివి ఎలా బతుకుతవ్ రా బై. మందికిచ్చేటిది.. నా దేముని కొడుకైన తమ్మీకిచ్చేటిది వొకటే అవుతదా’‘ఆ మాటన్నావ్.. దైర్యంగా వుందన్నా’‘చల్ పోదం పా. ఉన్నూర్లో ముచ్చట్లాడుకోవాలంటే.. గాలికి గూడా సెవులు మొలుస్తయ్.. యింటా వుంటయ్.. యింత కష్టపడి స్పెషలు గాలిమోటర్లేసుకుని దావోసు కొచ్చినం. యిక్కడైనా మన మనసులో ముచ్చట్లు పంచుకోకుంటే గెట్ల? యింక పోదాం తియ్’::రాజేశ్వరి -
'వ్యూహం' అమలు తీరు ఇదేనా?
అమెరికా గత నవంబర్‌లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్‌ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.మొత్తంగా వశమైతేనే...గ్రీన్‌ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్‌లోని డెన్మార్క్‌కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్‌ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్, యూరప్‌లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్‌తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్‌తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు. అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్‌ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్‌లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.మిత్రులు సైతం దూరంగ్రీన్ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్‌ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్‌కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్‌కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.వాడుకొని వదిలెయ్!ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్‌లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అది ముమ్మాటికీ ఎన్టీఆర్‌ను అవమానించడమే!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికి గౌరవమే. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదమూడేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా చేయని పనిచేసి ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్‌పై అభిమానం ఉంటే ఓకే కానీ.. ప్రజాధనాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఆక్షేపణీయమే. ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్‌ను అవమానించినట్లే కూడా. ఎందుకంటే.. ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని రామరావు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు. పైగా గుజరాత్లో రూ.3,500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో రూ.మూడు వేల కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తుందా? అని అప్పట్లో బాబుగారు నిలదీశారు కూడా. ఇప్పుడు ఆ జోరు లేదనుకోండి.ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒకపక్క నిధులు లేవని నిత్యం వాపోతూ, ఇంకోపక్క ఇలా విగ్రహానికి అంత ఖర్చు పెట్టడంపై అందరి అభ్యంతరం. చిత్రమేమిటంటే ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు విలువలు లేవని, సినిమా వాళ్ల రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే, తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తిరునల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఏపీలో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి దానిని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి, మరికొందరి విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్‌ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్‌కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్లో ఈ కార్టూన్లు కూడా పెడతారా? అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు.. దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏడాదిన్నర కాలంలోనే రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే, ఎన్టీఆర్ విగ్రహస్థాపనకు రూ.1750 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు రూ.250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. నిజంగానే ఏడాదిన్నరగా నిరర్ధకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు అడుగుతుంటే, వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజల కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు. గత టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది కాని, పనులు ముందుకు తీసుకువెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా, విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ,ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్లకపోగా.. దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేవారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటివారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. నీరుకొండలో 1986 ప్రాంతంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండేది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్నివర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలియదు కాని, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1750 కోట్లు వ్యయం చేయడానికిపూనుకోవడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నమాట నిజం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సంస్కరణలతోనే సత్వర వృద్ధి
ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోపక్క అమెరికా ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. ఈ కీలక ఘట్టంలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి ముందస్తు అంచనాలు కొన్ని శుభ వార్తలను మోసుకొచ్చాయి. స్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి రిజర్వ్‌బ్యాంక్ తొలుత అంచనా వేసినట్లు 6.5 శాతం కాక, 7.4 శాతం ఉండగలదనే అంచనాకు రావడం పరిస్థితులలో వచ్చిన మార్పును సూచిస్తోంది. సంస్కరణలు మార్పు తెచ్చాయనీ, వృద్ధి ఇదే స్థాయిలో నిలకడగా కొనసాగేందుకు వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనీ కూడా ఇది సూచిస్తోంది. వస్తువు – సేవల పన్ను (జీఎస్టీ)లో శ్లాబులను మార్చడం, చాలా వాటిపై పన్నుల శాతాలు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తేటపడింది. జీఎస్టీలోని నియంత్రణ సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ మార్పుచేర్పులు ఎప్పుడో చేసి ఉండ వలసింది.కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై!అలాగే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని చర్యలను ఇటీవలి కాలంలో తీసుకున్నారు. పార్లమెంట్ ఐదేళ్ళ క్రితమే ఆమోదించిన నాలుగు కార్మిక స్మృతులను అమలులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన దాదాపు 29 వేర్వేరు చట్టాల స్థానంలో ఆ స్మృతులు వచ్చి చేరాయి. వలస పాలన కాలంనాటి ఆ చట్టాలను కూడా ఎన్నడో మార్చి ఉండాల్సింది. చట్టాల సంఖ్య ఎక్కువ కావడంతో కార్మిక సమస్యలు ఏళ్ళ తరబడి చిక్కుముడులకు లోనవుతూ వచ్చాయి. ఫలితంగా, వ్యాపార సంస్థలు ఆ చట్టాలను అనుసరించడంలో గందరగోళం నెలకొంటూ వచ్చింది.కొత్త లేబర్ కోడ్స్ ఆర్థిక వృద్ధికి తక్షణం తోడ్పడగల సంస్కరణ కాకపోవచ్చు. కానీ, పెట్టుబడులు పెట్టదలచుకున్నవారికి తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్న అంశాల్లో అవి స్పష్టతను, సరళతను తెచ్చాయి. ఉదాహరణకు, ఇంటి నుంచి పని చేసే విషయంలో అవి మరింత వెసులుబాటుకు అవకాశం కల్పించాయి. పర్మనెంట్ ఉద్యోగాలకు బదులు స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్సర్ ఉద్యోగాలు పెరుగుతున్న ‘గిగ్’ ఆర్థిక వ్యవస్థలో వర్కర్లకు మరింత సామాజిక భద్రతను కల్పించేందుకు తోడ్పడనున్నాయి. ఆ స్మృతుల్లో ఇప్పటికీ లోపాలు ఉంటే ఉండవచ్చు; వాటిని భవిష్యత్తులో పరిష్కరించు కోవచ్చు. మొత్తానికి, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం వల్ల దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరం అయింది. వృద్ధి సానుకూలమే!ఇతర రంగాలలో కూడా సంస్కరణల అవసరం ఉంది. మొదటి ముందస్తు అంచనాలలో అన్నీ సానుకూలంగా ఏమీ లేకపోవడం ఆ వాస్తవాన్ని మరింత వెల్లడిస్తోంది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో వృద్ధి రేటు మందగించింది. మొదటి రెండు త్రైమాసికాలలో వరుసగా 7.8 శాతం, 8.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. తర్వాత, రెండు త్రైమాసి కాలలో ఇది 6.9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నారు. తిరిగి సానుకూలంగా ఉన్న అంశాల వైపు దృష్టి సారిద్దాం. వస్తూత్పత్తి 4.5 శాతం నుంచి 7.4 శాతానికి విజృంభించినట్లు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 2025–26 ఆర్థిక సంవ త్సరంలో అధిక వృద్ధి సాధించేందుకు ఊతం ఇచ్చింది. సగటున దాదాపు 8 శాతం చొప్పున, గత మూడేళ్లలో వృద్ధిలో కనిపించిన వేగం కూడా గణనీయమైన విషయమే. ఇప్పటికి కొద్ది ఏళ్ళ నుంచి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, మధ్య–ఆదాయ ట్రాప్ నుంచి తప్పించుకునేందుకూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకూ, ఇంకా వేగంగా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేటపుడు, ఆర్థిక మంత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. దృష్టి పెట్టాల్సినవి!అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల మారిపోతున్న ప్రపంచంలో వాణిజ్యమే పెద్ద అంశంగా కనిపిస్తోంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులు 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై మరికొంత సుంకాలు విధిస్తామని ఆయన బెదిరిస్తున్నారు. భారత –అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేక కారణాల రీత్యా, ముఖ్యంగా ట్రంప్ అహంకారం వల్ల, ఇప్పటికీ తుదిరూపు దిద్దు కోలేక పోతోంది. మన దేశానికి కొత్త అమెరికా రాయబారిగా వచ్చిన సెర్జియో గోర్ కనబరుస్తున్న సానుకూలత వల్ల, ఈ ఒప్పందం కుదరవచ్చని ఆశలు పొటమరిస్తున్నాయి. దానిమాటెలా ఉన్నా... ఎగుమతులపై ఆధార పడిన, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు బడ్జెట్ కొంత ఆసరా కల్పించవలసి ఉంది. రత్నాలు, ఆభరణాలు వంటి పరిశ్రమలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు అమెరికా సుంకాలతో బాగా దెబ్బతినిపోతాయని భయ పడిన మాట వాస్తవం. కానీ, అవి వేగంగా ఇతర మార్కెట్లకు విస్తరించడం వల్ల కనీసం తాత్కాలికంగానైనా ఆ ప్రభావాన్ని తట్టుకో గలుగుతున్నాయి. నవంబర్ (2025)కు సంబంధించిన డేటా, ఈ విభాగాల ఎగుమతుల్లో ఆశ్చర్యకరంగా పెరుగుదలను కనబరచింది. ఆ విభాగాల ఎగుమతులు 2025 నవంబర్‌లో దాదాపు 19 శాతం పెరిగాయి. ఎగుమతులలో వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల విభాగాలు ప్రధాన ఆలంబనగా నిలిచాయి. ఇంకా ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే, భారీ సుంకాల ప్రతిబంధకాలు ఉన్న ప్పటికీ, అమెరికాకు ఎగుమతులు 22 శాతం పెరిగాయి. మొబైల్ ఫోన్లు, ఎగుమతుల్లో ప్రధాన వస్తువుగా నిలుస్తున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే వాటి ఎగుమతులు మూడు రెట్ల పెరుగుదలను చవిచూశాయి. నిరుద్యోగిత రేటు మూడునెలల కాలంలో అత్యల్ప స్థాయికి అంటే 8.6 శాతానికి తగ్గిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ’ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం దానికి కారణంగా పేర్కొంది. అయితే, వ్యవసాయమే ఇప్పటికీ 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న వారిని తగినంతగా ఇముడ్చుకోగలిగినంతగా వస్తూత్పత్తి రంగం వ్యాకోచించలేదు. ఈ రంగం విషయంలోనే, భారత్, ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఇతర దేశాల్లో చిన్న, మధ్య తరహా వస్తూత్పత్తి సంస్థలు తగినంతగా విస్తరించగలిగాయి. వ్యాపార నిర్వహణ సులువుగా సాగే అవకాశాన్ని కల్పించే విధంగా బడ్జెట్ రూపొందాలి. అప్పుడే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవసరమైన స్థాయిల్లో వృద్ధి రేటును తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్సియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల?
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనకు తానే రాజకీయ బురద జల్లుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం లేదంటే మంత్రులపై పట్టు పెంచుకునే క్రమంలో ఆయన చేస్తున్న విన్యాసాలు కొన్నిసార్లు బెడిసికొడుతున్నట్లుగా ఉంది. దీనికి తోడు అనవసర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలలో తన విశ్వసనీయతను తానే దెబ్బ తీసుకుంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి మీడియా అధిపతి రాధాకృష్ణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అధికంగా నమ్ముకుంటున్నారన్న భావన కలుగుతోంది. దానివల్ల తెలంగాణ రాజకీయాలపై ఆ పత్రికలో ఏ కథనం వచ్చినా అది ఎంత వివాదాస్పదమైనా, చెత్త పలుకైనా అదంతా రేవంత్ భ్రీఫింగ్ వల్లేనని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మీడియాను ప్రమాణాలతో నిమిత్తం లేకుండా నీచమైన రాతలు రాసేవారిని నమ్ముకుంటే.. అది ఎప్పటికైనా భస్మాసుర హస్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పరిణామాల సారాంశంగా దీనిని తీసుకోవచ్చు. ఎన్టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన ఒక కథనం మహిళా ఐఏఎస్‌లను కించ పరిచేదిగా ఉందన్నది అభియోగం. దీనిని ఎవరూ సమర్థించరు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఖండన ఇవ్వడం, దానిపై ఆ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పింది. అయినా తప్పు చేశారని అనుకుంటే కేసు పెట్టవచ్చు. చర్య తీసుకోవచ్చు. కాని ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు. ఆ పోలీసులు విచారణ పేరుతో చట్టబద్దమైన నిబంధనలు పాటించకుండా ఆ టీవీ ఛానల్లో సోదాలు చేయడం, ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టింది. ఆ కేసులో ఫిర్యాదుదారు ఎవరు? బాధితులు ఎవరని కోర్టు ప్రశ్నించడంతో నీళ్లు నమలడం పోలీసుల వంతైంది. అంతటితో ఆ ఉదంతానికి ఫుల్స్టాప్ పడినట్లయింది. పోలీసులు ఈ వ్యవహారంలో అతిగా చేశారన్న విమర్శలు వచ్చాయి. అది వేరే కథ. ఇంతలో ఏమి జరిగిందో కాని సడన్‌గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో ఆ గాయాలను మళ్లీ కెలికారు. వ్యాపార ప్రయోజనం కోసమో, లేక ముఖ్యమంత్రి రేవంత్‌కు ఉపయోగపడుతందని అనుకున్నారో తెలియదు కాని ఓ కథ వండి జనం మీదకు వదిలారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఈ వివాదంలోకి లాగారు. ఎన్టీవీ యజమానికి సంబంధించిన కంపెనీకి బొగ్గు టెండర్ రావడానికి మల్లు భట్టి రూల్స్ మార్చారని ఆరోపించారు. పోనీ ఈ స్కామ్ వరకు రాసి ఉంటే అది వేరే విషయం అయ్యేది. అలా కాకుండా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కంపెనీకి ఆ టెండర్ దక్కకుండా ఉండడం కోసం ఎన్టీవీ ఆయనపై అనుచితమైన స్టోరీ ప్రసారం చేసిందని ఆరోపించారు. ఆ క్రమంలో ఆయనకు మహిళలపట్ల ఎంతో గౌరవం ఉన్నట్లు నటించారు. పనిలో పనిగా, ఆవు కథ మాదిరి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మీడియాకు స్వేచ్చ లేదంటూ ఒక పచ్చి అబద్దాన్ని కూడా జోడించారు. రాధాకృష్ణకు నిజంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన ఉంటే, సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన దారుణమైన అశ్లీల నృత్యాలపై ఎక్కడైనా సరైన రీతిలో స్పందించారా? ఎల్లోమీడియాలో వైసీపీ మహిళా నేతలపై కక్ష కట్టినట్లు ఎన్ని తప్పుడు కథనాలు వచ్చేవో కూడా తెలిసిందే. ఈ మధ్యనే మాజీ సీఎం జగన్‌పై నీచమైన శీర్షికలతో కథనాలు లో ప్రసారం చేశారో కూడా చూశాం. ఈయన ఒక వైపు నీచమైన రాతలు రాస్తూ, ఎదుటివారికి నీతులు చెబుతుంటారు. తన వ్యాసంలో మల్లు భట్టిపై ఆరోపణలు చేయడంతోపాటు రేవంత్ ను అమాయకుడన్నట్లు చిత్రీకరించే యత్నం చేశారు. సిట్ వేసిన సంగతి రేవంత్‌కు తెలియదని అందులో రాశారు. దీనివల్ల రేవంత్‌కు నష్టం జరిగింది. అయితే.. రేవంత్ భ్రీఫింగ్తోనే రాధాకృష్ణ ఈ వ్యాసం రాశారా అన్న సందేహాన్ని వివిధ రాజకీయ పక్షాలు కాని, చివరికి కాంగ్రెస్ లో కొన్ని వర్గాలు కాని అనుమానించాయి. దానికి తోడు టీవీ కథనం వచ్చిన రోజున కాని, కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన రోజున కాని రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, రాధాకృష్ణ వ్యాసం రాసిన తర్వాత స్పందించడం చర్చనీయాంశం అయ్యాయి. మీడియా సంస్థలు ఆంబోతుల మాదిరి తన్నుకుని తమను అందులోకి లాగవద్దని ఆయన అనడం విడ్డూరంగా అనిపించింది. ఒక వేళ నిజంగానే రాదాకృష్ణ తప్పుడు వ్యాసం రాసి ఉంటే ఆయనపై కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఉండవచ్చు! కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోనే ఈ గొడవలన్ని బయటకు వచ్చాయన్న భావన ప్రజలలో ఏర్పడింది. దాంతో ఆ బురదను కడుక్కోవడానికి రేవంత్ స్టేట్ మెంట్ ఇచ్చి మంత్రులను బద్నాం చేయవద్దని కోరారు అంతేకాక తమ ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పుకోవాల్సి వచ్చింది. మరో వైపు మల్లు భట్టి ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, రాధాకృష్ణ కథనం వెనుక ఎవరు ఉన్నారో తర్వాత చెబుతానని అన్నారు. పైగా తెలంగాణ వనరులు, సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత నేరస్తులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మరో మాట కూడా చెప్పారు. బీఆర్ఎస్కు లబ్ది జరిగేలా కథనాలు ఉండవద్దని అన్నారు. తనకు డామేజీ అవుతోందని అర్థం చేసుకుని ఈ వ్యాఖ్య చేసి ఉండాలి. నిజంగానే బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేయడం, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవులలో ఉన్న ముగ్గురి మధ్య కాంట్రాక్ట్ కోసం పోటీ జరిగిందని, మంత్రివర్గంలో పలువురు మంత్రులు దోచుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. రేవంత్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఖతం చేసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ఆయన అన్నారు. అదే ఎన్టీఆర్‌కు నివాళి అని కొత్త సూత్రీకకరణ చేశారు. అదేదైనా అయితే చంద్రబాబుకు కానుక అవుతుంది కాని, ఎన్టీఆర్‌కు ఎలా శ్రద్దాంజలి అవుతుందో తెలియదు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీకి ఉన్న కాస్తో, కూస్తో బలాన్ని, ఆ పార్టీకి ప్రధానంగా మద్దతు ఇచ్చే సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని రేవంత్ మాట్లాడినట్లు అనిపిస్తుంది. పైగా తెలంగాణలో టీడీపీ ఖతం అవడానికి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్‌ల పాత్ర కారణమన్నది బహిరంగ రహస్యమే కదా! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రేవంత్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఎగబాకారు. అయినా పాత వాసన వదులుకోలేక పోతున్నట్లు ఉంది. కాంగ్రెస్‌ను అంతం చేయడానికి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను రేవంత్ పొగడడంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సంతోషిస్తారో చెప్పలేం.ఏది ఏమైనా ఈ మద్యకాలంలో పలు ప్రకటనలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుటివారిపై బురద చల్లబోయి.. తనపై కూడా వేసుకుంటున్నట్లు ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీలో నాయకత్వ కోర్సులో చేరిన రేవంత్ బీఆర్ఎస్ గద్దెలు గ్రామాలలో లేకుండా చేయాలని అనడం ఏ పాటి నాయకత్వ ప్రమాణం అవుతుందో!. ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నవ లోకం... మన కోసం!
గతాన్ని సమీక్షించుకుంటూనే, రాబోయే కాలంలో శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ ఎటువంటి అద్భుతాలు సృష్టించనున్నది, ప్రపంచ యవనికపై మన దేశం ఏ ఏ మైలురాళ్లను అధిగమించబోతోంది అనే అంశాలను తరచి చూడాల్సిన సమ యమిది. శాస్త్ర – సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఎక్స్–రే వంటివి కనిపెట్టడాలు అనుకోకుండా జరిగినవే అయినా, భారీ ప్రాజెక్టులు మాత్రం పక్కా ప్రణాళికతోనే పట్టా లెక్కుతాయి. ఏళ్ల తరబడి సాగే కఠోర శ్రమ, వ్యూహాల ఫలితంగానే ఆ యా రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.1969 తర్వాత మళ్లీ ఇప్పుడు జాబిల్లిపై మనిషిని దించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టిమిస్’ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి పైకి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు చైనా సైతం తన ‘ఛాంగ్ ఈ–7’ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు సిద్ధమైంది. సూర్యరశ్మి సోకని ఈ ప్రాంతంలో ఘనీభవించిన నీటి జాడలు ఉన్నట్లు తేలడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. చైనా ఈ ఏడాదే ‘జున్టియాన్’ టెలిస్కోపును, ‘మెంగ్ఝౌ–1’ వ్యోమ నౌకను పరీక్షించనుంది. 2026 నాటికి ‘లాంగ్ మార్చ్–10’ ద్వారా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలన్నది చైనా లక్ష్యం.అంతరిక్ష రక్షణ విషయానికొస్తే, నాసా ’డార్ట్’ తరహాలోనే ఒక సరికొత్త ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘2015 ఎక్స్ఎఫ్261’ అనే ఖగోళ శకలాన్ని నేరుగా ఢీకొట్టి దాని మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేయనున్నారు. గతంలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లనే రాక్షసబల్లులు అంతరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. భవిష్యత్తులో అటువంటి ముప్పులు రాకుండా ఉండటంతో పాటు, ఆయా గ్రహశకలాల్లో ఉండే అరుదైన ఖనిజాలను మన అవసరాలకు వాడుకోవడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. కిలోమీటరు పొడవుండే ఉల్కా శకలాలను ఒడిసిపట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడం ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న సవాలు.గగన్ యాన్ పరీక్ష...భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంత రిక్ష ప్రయోగం ‘గగన్ యాన్ ’కు 2026 సంవత్సరం చాలా కీలకం కానుంది. అసలు ప్రయోగానికి ముందు సిబ్బంది లేకుండా అనేక ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హ్యూమనాయిడ్ రోబో ‘వ్యోమమిత్ర’, అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌక నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్, ప్యారాచ్యూట్ వ్యవస్థ పనితీరు, గగన్ యాన్ క్యాప్సూల్‌ను కక్ష్య వరకూ తీసుకెళ్లడం వంటివన్నీ ఉన్నాయి. ‘బ్లూ ఆరిజిన్’ తన హెవీ లాంచర్‌తో జాబిల్లిపైకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది అటు ప్రభుత్వ, ఇటు వ్రైవేట్ కంపెనీల అంతరిక్ష ప్రయోగాలు, జాబిల్లి యాత్రలు చాలానే ఉన్నాయన్నమాట. భారతదేశం దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన మూడంచెల అణు శక్తి కార్యక్రమం ఈ ఏడాది కీలకదశకు చేరనుంది. చెన్నై సమీపంలోని కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్) ఈ ఏడాది పని చేయడం మొదలుపెడు తుంది. ముందుగా ప్రయోగాత్మకంగా మొదలై... ఈ ఏడాది చివరి కల్లా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అంచనా. దేశంలో విస్తృతంగా లభ్యమయ్యే థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తుందీ రియాక్టర్. విజయవంతమైతే దేశ ఇంధన భద్రత మరింత పటిష్ఠమవుతుంది. దేశం మూడు దిక్కులా ఆవరించిన విశాల సముద్రాన్ని మానవ ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకోవాలన్న భారతదేశ ఆశయం ఈ ఏడాది కార్యాచరణ దిశగా అడుగులు వేయనుంది. సముద్రయాన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ‘మత్స్య– 6000’ జలాంతర్గామి ముగ్గురు శాస్త్రవేత్తలను ఆరువేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లనుంది. సముద్ర మట్టంతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతాల్లో జలాంతర్గామి తొడుగులోని ప్రతి చదరపు సెంటీమీటర్ 600 కిలోల బరువును తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత దృఢమైన ప్రత్యేకమైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు.వాతావరణ అంచనాలు అతి సంక్లిష్టమైన భారత దేశ వాతావరణ అంచనాల కోసం ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌ల వినియోగం మొదలు కానుంది. ఏడాది చివరికల్లా ఇది సిద్ధమవుతుందని అంచనా. ‘మిహిర్’ వంటి సూపర్ కంప్యూటర్ల సాయంతో ఆరు కిలో మీటర్ల పరిధికి సంబంధించిన వాతావరణ అంచనాలను పది రోజుల ముందే ఇవ్వవచ్చునని భారత వాతావరణ విభాగం చెబుతోంది. వరదల్లాంటి విపత్తుల నుంచి మెరుగైన సన్నద్ధత కలిగి ఉండేందుకు, వ్యవసాయానికీ, పర్యాటక రంగానికీ ఎంతో ఉపయోగపడనుంది ఇది. శిలాజ ఇంధన వినియోగాన్ని వేగంగా తగ్గించాలన్న లక్ష్యం వైపు భారత్ అడుగులేస్తోంది. ఇందుకు తగ్గట్టే సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పవన విద్యుత్తులో నాలుగో స్థానంలో ఉంటే... సౌరశక్తి సామర్థ్యంలో మనది మూడో స్థానం. అయితే భారతదేశ స్థాపిత విద్యుదుత్పత్తి 482.82 గిగావాట్లలో ఇది సగం కంటే కొంచెం ఎక్కువ. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మనం నాలుగేళ్ల ముందుగానే ఈ స్థాయికి చేరుకున్నాం. ‘ఒన్ సన్ ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ కార్యక్రమం కారణంగా సౌరశక్తి రంగంలో మన పురోగతి ఇకపై కూడా కొనసాగనుంది. కృత్రిమ మేధఏఐ వాడకంతో ఈ ఏడాది టిక్కెట్ల బుకింగ్ మొదలుకొని వాహ నాల రవాణా వరకూ అనేక విషయాలు మరింత సౌకర్యవంతం కానున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌తో చైనా సంస్థ అభివృద్ధి చేసిన ‘డీప్‌సీక్’ వంటివి ఏఐని మరింత వైవిధ్యభరిత అవసరాల కోసం వాడుకునే అవకాశం కల్పించనున్నాయి. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ వినియోగం కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా... ఇంగ్లీషులో కాకుండా కొరియన్ భాషలోనూ ఏఐ అందుబాటులోకి రావచ్చు. బయో టెక్నాలజీజన్యుపరమైన తప్పులను వెతకడం కంటే... వాటిని సరిచేయ డంపై ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. మన డీఎన్ఏలో జరిగే అతి చిన్న మార్పు కూడా వ్యాధులకు కారణ మవుతుందన్నది తెలిసిందే. ఈ మార్పులను సరిచేసేందుకు ‘క్రిస్పర్–క్యాస్9’ వంటి ఆధునిక జన్యు ఎడిటింగ్ టూల్స్ అందు బాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీలు ఒకే ఒక్క జన్యువులోని మార్పులను సరి చేసేందుకు ఉపయోగించవచ్చు.అంతేకాదు క్రిస్పర్ టెక్నాలజీతో అననుకూల వాతావరణాలను కూడా తట్టుకుని పండే పంటలను అభివృద్ధి చేసేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టు కోవడంలో, ఆహార భద్రత కోసం ఇది ఎంతో కీలకం. ఇలా ఈ ఏడాది సైన్స్–టెక్సాలజీ రంగంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసు కుని మానవ చరిత్రలో మైలురాళ్లు కానున్నాయి.టి.వి.వెంకటేశ్వరన్ వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ మొహాలీ -
శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!
ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.తప్పు జరిగితే వదిలేవారా?వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా? టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్‌కుమార్ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్‌కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.గోశాల గోవుల మరణాలుటీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్‌లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్‌గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్ గెస్ట్‌హౌస్ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్‌ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి? వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్‌గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బీఆర్ నాయుడు ఉన్నారు.అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.సంస్కరణలా? ఇబ్బందులా?సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? ‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
నయా వలసవాద కేంద్రం అమెరికా
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్‌ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్‌ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్‌తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్‌కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం 2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్‌పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. బుడ్డిగ జమిందార్వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
బాబు నువ్ సెప్పు.. ఆయన్ని కొట్టమని డప్పు!
ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోబుల్ పర్సన్ అట! కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ మేరకు ఆయనకు కితాబిచ్చినట్లు ఈమధ్యే ఈనాడు చాలా ప్రముఖంగా ప్రచురించింది. ఏపీ భవిష్యత్తు కోసం చంద్రబాబు తన జీవితాన్నే అంకితం చేశారని కూడా ఆయన అన్నట్టు.. వీళ్లు చెప్పుకున్నారు. రాజకీయ నేతలు ఒకరినొకరు ప్రశంసించుకోవడం మామూలే కానీ.. అవి కొంచెం అతిగా అనిపిస్తే మాత్రం మెచ్చుకున్న వ్యక్తిని కూడా శంకించాల్సి వస్తుంది. ఇంతకీ నోబుల్ అన్న పదానికి అర్థం తెలుసా?.. ఉత్తమమైన, ఆదర్శవంతమైన, విశిష్టమైన రీతి అని. .. చంద్రబాబు నలభై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో పైన చెప్పుకున్నవి మచ్చుకైనా కనిపించాయా అన్నదే ప్రశ్న! అధికారం కోసం ఎంతకైనా దిగజారే అవకాశవాదం చంద్రబాబుదని ప్రత్యర్ధులు అభివర్ణిస్తారు. ముఖ్యమంత్రి పీఠమెక్కేందుకు పిల్లనిచ్చిన మామనే కూలదోసిన చరిత్ర బాబుది. ఏ ఎండకా గొడుగు అన్నట్టు ఎన్నికలొచ్చిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తులు కలుపుకున్న వైనమూ అవకాశ వాద రాజకీయాన్ని ధ్రువీకరిస్తాయి. అంతెందుకు.. ప్రస్తుత ప్రధాని.. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఉగ్రవాదని ఆరోపించింది ఈయనే. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించిందీ బాబే. వ్యక్తిగత దూషణలు బహిరంగంగా చేసిందీ ఈయనే. కానీ.. 2024 ఎన్నికల సమయం రాగానే.. అవసరాన్నిబట్టి.. అన్నీ మరచిపోయి.. బీజేపీతో పొత్తుకు వెంపర్లాడింది కూడా ఈయనే. పోనీ అధికారంలోకి వచ్చిన తరువాతైనా ఈయన తీరు ఏమైనా మారిందా? ఊహూ లేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలకు ఎలాంటి పనులూ చేయవద్దని అధికారులను ఆదేశించడం ఏ రకమైన ఆదర్శమవుతుందో ఈనాడుకే తెలియాలి. 2019లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు సీబీటీడీనే ప్రకటించింది. ఆదాయపన్ను శాఖ మరో కేసులో ఆయనకు నోటీసు ఇచ్చింది. విచిత్రంగా.. కేంద్ర ప్రభుత్వం వాటి గురించి మళ్లీ అసలు ప్రస్తావించనే లేదు. నోబుల్ పర్సన్‌గా గుర్తించిందేమో మరి!. గడ్కరీ పొగిడిన వార్త వచ్చిన రోజునే వివిధ మీడియాలలో వచ్చిన కొన్ని వార్తలు గమనిస్తే ఇలా కూడా నోబుల్ కావచ్చా? అన్న సంశయం వస్తుంది. చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ కేసు వచ్చింది.స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణం ఇది. దీనిని తొలుత గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ, ఈడీ అధికారులే. కొంతమందిని ఈడి అరెస్టు కూడా చేసింది. వైసీపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా... చంద్రబాబు ఆదేశాల మేరకే బోగస్ కంపెనీకి రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తేలింది. షెల్ కంపెనీల ద్వారా కొన్ని నిధులు టీడీపీ బ్యాంక్ ఖాతాలలోకి కూడా వచ్చిందని సీఐడీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు 53 రోజులపాటు జైలులో ఉన్నారు. ఆరోగ్య కారణాలతో హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. 2024లో అధికారంలోకి రావడంతో ఈ కేసును క్లోజ్ చేసే పనిలో కొందరు ప్రముఖ లాయర్లను నియమించారు. వారు ఇందుకు మార్గాలను అన్వేషించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కొత్త టెక్నిక్ ను ప్రయోగించి కేసు పెట్టిన సీఐడీ ద్వారానే ఉపసంహరించేలా చేశారు. ఈ స్కామ్‌పై ఫిర్యాదు చేసిన అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి పిటిషన్ కూడా కోర్టు అనుమతించలేదు. చంద్రబాబు నిజంగానే నోబుల్ పర్సన్ అయిఉంటే ఆ కేసు విచారణను ఎదుర్కొని తన తప్పు ఏమీ లేదని రుజువు చేసుకుని ఉండవచ్చు!. దురదృష్టవశాత్తు అవినీతి కేసులను విచారణ చేయకుండా మూసివేతకు న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించడం ఎంతవరకు మంచి సంప్రదాయం అవుతుందన్న ప్రశ్నను పలువురు న్యాయ నిపుణులు వేస్తున్నారు. మద్యం స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్‌లలోనూ చంద్రబాబు కేసులు లేకుండా చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన తీర్పు సర్టిఫైడ్ కాపీలను థర్డ్ పార్టీకి ఇవ్వడానికి కూడా కోర్టు అంగీకరించకపోవడంపై కూడా పలువురు అభ్యంతరం చెబుతున్నారు.. పారదర్శకంగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థ ఇలా వ్యవహరించరాదన్నది న్యాయ నిపుణుల భావన. దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లారు. అది ఏమవుతుందో తెలియదు. కొద్ది రోజుల క్రితమే సాంకేతిక కారణాలతో కొందరు అధికారులపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తిరిగి విచారణకు ఆదేశించింది. అవినీతి కేసులను ఉపసంహరించే అధికారం కింది కోర్టులకు లేదని కూడా గతంలో పేర్కొంది. వీటితో సంబంధం లేకుండా చంద్రబాబు కేసుల నుంచి బయటపడడం విశేషం. ఇదంతా నోబుల్ పర్సన్ చంద్రబాబు చేయవచ్చని గడ్కరీ భావిస్తున్నారా?..పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టో, అందులోని అంశాలు, వాటిని అమలు చేయలేకపోయినా, అన్నీ చేసేసినట్లు కలరింగ్ ఇవ్వడం, మత రాజకీయాలు చేయడానికి వెనుకాడకపోవడం, చివరికి తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసినా, ఇంతవరకు దానిపై వివరణ ఇవ్వకపోవడం, తను చేసే తప్పులన్నిటిని ఎదుటివారిపై రుద్దడం, చివరికి ప్రజల ప్రాణాలకు హానికరమైన మద్యపానాన్ని ప్రమోట్ చేసేలా ఎన్నికలలో ప్రచారం చేయడం.. ఇలాంటి వాటన్నిటిని చేసినా నోబుల్ పర్సన్ అవుతారేమో తెలియదు! పోనీ ఇకనైనా అబద్దాలు చెప్పడం మాని చంద్రబాబు నోబుల్ పర్సన్ అనే పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తే సంతోషించవచ్చు.! ::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మూల రచయితలకు ద్రోహమేనా?
‘కృత్రిమ మేధ (ఏఐ) చేసే సృజన – కాపీరైట్’పై దేశంలోని ‘పారిశ్రామిక,ఆంతరంగిక వర్తక ప్రోత్సాహక శాఖ’ 2025 చివరలో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించింది. ఏఐ యుగంలో కాపీ రైట్ను కాపాడడమెలా అనే జటిలమైన అంశాన్ని ఒక నిపుణుల కమిటీ పరిశీలించి ఆ నివేదికను రూపొందించింది. సమీప భవిష్యత్తులో, ఈ అంశంపై భారత్ అనుస రించబోయే విధానానికి ఆ నివేదికలోని అంశాలే ప్రాతిపదికగా మారే అవకాశాలున్నాయి. ఛాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి జనరేటివ్ ఏఐ ప్రొడక్టులు భారీ లాంగ్వేజి మోడళ్ళు. యూజర్లు చేసే సూచనలను ఆధారంగా చేసుకుని అవి కంటెంట్‌ను సృష్టిస్తాయి. ఉదాహరణకు, మనం ఇతివృత్తాన్ని ఇచ్చి ఆర్.కె. నారాయణ్ లేదా ప్రేమ్‌చంద్ శైలిలో కథానికను రాసివ్వాలని ఛాట్ జీపీటీని అడిగితే అది రాసి పెడుతుంది. అలాగే డయల్–ఈ, మిడ్ జర్నీ వంటివాటికి మనం ఒక వచనాన్ని లేదా కవితను అందిస్తే, దాన్నిబట్టి అవి పెయింటింగ్ వేయడం లేదా వీడియో సృష్టించడం చేస్తాయి. జెమినీరాయ్ లేదా ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగుల మాదిరిగా ఉండాలని కూడా మనం కోరవచ్చు. అంతేకాదు, సత్యజిత్ రే తరహాలో ఒక చిన్న మూవీ క్లిప్‌ను రూపొందించి ఇమ్మని అడిగినా అవి ఆ పని పూర్తి చేసేస్తాయి.ఆ పని ఎలా చేయగలుగుతున్నాయంటే వాటికి ఇచ్చిన ట్రయినింగును అనుసరించి అని మనం జవాబు చెప్పు కోవాల్సి ఉంటుంది. నారాయణ్ నవలలు, హుస్సేన్ పెయింటింగులు వంటి రకరకాల వనరుల నుంచి అవి డేటాను గ్రహిస్తాయి. ఏఐ మోడళ్ళకు ట్రయినింగు ఇచ్చేటపుడు ఉపయోగించే డేటా వివిధ కేటగిరీలకు చెందినదై ఉండవచ్చు. అందులో కాపీరైట్ ఉన్నవీ, కాపీరైట్ గడువు తీరిపోయినవి కూడా ఉంటాయి. ‘సమంజస వినియోగానికి’ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న డేటా మాదిరిగా అది వివిధ వనరుల నుంచి తెచ్చుకున్నదై ఉంటుంది. జనరేటివ్ ఏఐ మోడళ్ళ కమర్షియల్ వెర్షన్లను టెక్నాలజీ సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి పుస్తకాలు, పరిశోధన పత్రాలు, ఫోటోలు, సినిమాలు, సృజనాత్మక శక్తిని వ్యక్తపరచిన ఇతర రూపాల లోని కాపీరైట్ మెటీరియల్‌ను వాడుకోవచ్చునా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే, ఏఐ డేటాబేస్‌కి అవి పునాదిగా మారాయి. ఇది సంక్లిష్టమైన లీగల్, నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ చిక్కు ముడులే ఇంకా విడలేదనుకుంటే, ఏఐ జనరేట్ చేసినవాటి కర్తృత్వం, కాపీరైట్ హక్కుల వర్తింపునకు సంబంధించిన అంశం మరో అపరిష్కృత అంశంగా తయారైంది. ఏఐ మోడళ్ళకు డేటా ట్రైనింగ్ అనే సరికొత్త సమస్యతో మనమే కాదు, చాలా దేశాలలోని ప్రభుత్వాలు, కోర్టులు సతమతమవు తున్నాయి. ఏఐ మోడళ్ళు కాపీరైట్ ఉన్న పుస్తకాలను లేదా ఫోటో లను కాపీ చేయడం లేదా చౌర్యం చేయడం లేదనీ, కనుక అవి కాపీరైట్ హక్కును ఉల్లంఘిస్తున్నట్లు కాదనీ ఇండియాలోని కంపె నీలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలు వాది స్తున్నాయి. కొత్త కంటెంట్‌ను జనరేట్ చేయడానికి వీలుగా సరళులు, శైలులు, నిర్మాణ రీతులకు సంబంధించి కలన గణితాలను ట్రైన్ చేసుకునేందుకు, గణాంకాలతో సరిపోల్చుకునేందుకు వాటిని విభా గిత డేటాసెట్లుగా మాత్రమే వినియోగించుకుంటున్నాయని చెబు తున్నాయి. సృజనాత్మక వర్కులను సమంజసమైన రీతిలో వినియో గించుకోవచ్చన్న సాధారణ ఆమోదిత లోకోక్తినే అవి అనుసరిస్తున్నా యని ఆ కంపెనీలు తమ వ్యాసంగాన్ని వెనకేసుకొస్తున్నాయి. కానీ, ఏఐ మోడళ్లు ఒరిజినల్ వర్కులను ‘కాపీ’ చేయడం లేదని, వాటి నుంచి ’నేర్చుకోవడం మాత్రమే చేస్తున్నాయని అనడం వాదనకు నిలిచే అంశం కాదు. ఏఐ సిస్టం ట్రైనింగ్ ప్రక్రియలో అనేక దశలుంటాయి. వాటిలో డేటా (ఒరిజినల్ వర్కుల) కాపీయింగ్, స్టోరేజి కూడా ఒకటి. అది కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది మహా అయితే ‘సాంకేతిక చొరబాటు’ కిందకు వస్తుంది కానీ, ‘లీగల్ పరమైన ఉల్లంఘన’ కిందకు రాదని ఏఐ పరిశ్రమ వాదించవచ్చు.ఏ విధమైన కాపీరైట్ లైసెన్సింగ్ అవసరం లేదనే భావనను నిపుణుల కమిటీ కూడా తిరస్కరించింది. భారత్‌లో అమలుకు ఒక హైబ్రిడ్ చట్రాన్ని సిఫార్సు చేసింది. కాపీరైట్ హక్కుదారులకు రాయల్టీ చెల్లించే పక్షంలో, కాపీరైట్ సంరక్షణ ఉన్న వర్కులను గ్రహించి ఏఐ డెవలపర్లు వాడుకోవచ్చని, ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని వినియోగించుకోవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. కానీ, ఏఐ సిస్టంలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ వర్కులను ఇవ్వకుండా నిలిపి ఉంచే అవకాశం కాపీరైట్ హక్కుదారులకు లేదు. ఏఐ డెవలపర్ల నుంచి ఆ (రాయల్టీ) చెల్లింపులను వసూలు చేసే బాధ్యత లాభాపేక్ష లేని ఒక కేంద్రీకృత సంస్థకు ఉండాలని కమిటీ పేర్కొంది. మొత్తానికి, అసలు సృజనశీలురకు రాయల్టీలను చేర్చ వలసిన బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలని చెప్పింది. కాపీరైట్ కంటెంట్‌ను వాడుకున్న ఏఐ సిస్టంలు తద్వారా గడించిన ఆదాయంలో కొంత శాతాన్ని ఆ కాపీరైట్ ఉన్నవారికి చెల్లించాలి. రేట్లను ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సిఫార్సుల పట్ల, కమిటీలో ఉన్న పరిశ్రమ (నాస్కామ్) ప్రతినిధి తన అసమ్మతిని వ్యక్తపర చారు.ఏఐ మోడళ్ళ రాబడిలో కొంత శాతాన్ని రాయల్టీలుగా చెల్లించాలన్న సిఫార్సుతో సదరు సభ్యుడు విభేదించారు. టీడీఎంకు వీలుగా తమ వర్కు పబ్లిక్‌గా అందుబాటులో లేకుండా నివారించుకోవలసిన బాధ్యత కాపీరైట్ హక్కుదారులపైనే పెట్టాలని ‘నాస్కామ్’ ప్రతినిధి సూచించారు. వారి రచన బహిరంగంగా అందుబాటులో ఉందని భావించినపుడు, దాన్ని ఇతరులు వాడుకునేందుకు వీలులేకుండా, ‘ఆప్ట్ ఔట్’ అవకాశాన్ని రచయిత లకు ఇవ్వవచ్చని ఆ ప్రతినిధి సూచించారు.ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కోట్లాది పుస్తకాలలోని అంశాలను టెక్నాలజీ కంపెనీలు తవ్వి తీసేశాయి. ఏఐ మోడళ్ళ ట్రైనింగుకు వాడుకు న్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆప్ట్ ఔట్’ కూడా ఆచరణసాధ్యమైన పరి ష్కారంగా కనిపించడం లేదు. నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడేవిగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చే విగా లేవు. దేశంలో కాపీ రైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరి శ్రమకు చెందినవారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడే విగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చేవిగా లేవు. దేశంలో కాపీరైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరిశ్రమకు చెందిన వారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన గురుశిష్యులు!
తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే.. తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్‌తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్‌కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది. తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్‌కు పేరు వస్తుందనా? లేక రేవంత్‌కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?.. చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ను విమర్శిస్తూ జగన్‌కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు. తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!. ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్‌కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్‌కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా! తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చెంతన ఉన్నది చేజార్చుకుంటారా?
డిసెంబర్ 2న 'షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కొత్తగా 200కు పైగా 'మర్చెంట్ షిప్స్' కొంటున్నట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా మారడం 'మీడియా'ను సైతం విస్మయపర్చింది. గత వైభవం తర్వాత కనుమరుగైన ఈ 'మినీరత్న' సంస్థ గురించి ఓ ఆంగ్ల పత్రిక వెంటనే ఒక 'బైలైన్ స్టోరీ' కూడా రాసింది. నిజానికి ఈ రంగం గత ఐదేళ్లుగా ప్రైవేట్ చేతుల్లోకి మారుతుండగా, అకస్మాత్తుగా మారిన కేంద్రం వైఖరి ఇది. ఈ కొత్త నౌకల కొనుగోళ్లను ప్రభుత్వమే చేయబోతున్నది.“ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న 'జియో పాలిటిక్స్' పరిణామాలు మనకు కూడా 'నేషనల్ షిప్పింగ్ సర్వీసెస్' ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. దేశ ఆర్ధిక భద్రత కోసం 'మర్చెంట్ నేవీ' ప్రాధాన్యం ఏమిటో ఇన్నాళ్ళకు ప్రభుత్వం గుర్తించింది" అని "నేషనల్ షిప్ ఓనర్స్ అసోషియేషన్' సీఈఓ అనిల్ దేవళి అన్నట్టు ఆ వ్యాసంలో రాశారు. మారుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా ఉంటే, డిసెంబర్ 24న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- 'క్వాంటమ్ టాక్ బై సీబీన్' కార్యక్రమంలో "రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు తయారుచేసి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తాము" అన్నారు..మన పక్కన వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం ఉన్నప్పుడు, ముందు 'మెరైన్ ఎకానమీ'లో మన వృద్ధి 'రికార్డు' అయితే పెరిగే వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'క్వాంటమ్ వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? ఉపాధితో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి 'మార్కెట్'లో ఇక్కడి ఉత్పత్తుల 'డిమాండ్' పెరుగుతుంది. సముద్రం ఎండేది కాదు. కనుక పెరిగే నౌకా వాణిజ్యంతో ఏపీ 'బ్లూ ఎకానమీ' స్టేట్ అవుతుంది. ఆ తర్వాత దశలో 'క్వాంటమ్ వ్యాలీ' వంటి మొదటి శ్రేణి సాంకేతికత గురించి కూడా మాట్లాడవచ్చు.అయినా వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? భౌగోళిక శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఒక ప్రాంతం సముద్ర మట్టానికి 1,850 మీటర్ల ఎత్తున ఉంటే, దాని శీతోష్ణ స్థితుల కారణంగా 'వ్యాలీ' అంటారు. మరి సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతిలో 'క్వాంటమ్ వ్యాలీ' అంటే, అది కేవలం 'మార్కెటింగ్ వ్యూహం కావొచ్చు.మన ఆలోచనలు అక్కడ ఉంటే, విశ్వకర్మ జయంతి సంద ర్భంగా గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ భావ నగర్ 'సముద్ర సే సమృద్ధి' సభలో మాట్లాడుతూ "ఒకప్పుడు స్వదేశీ నిర్మిత నౌకల ద్వారా మన రవాణా 40 శాతం సాగేది. మన నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడం మీద మనం శ్రద్ధ పెట్టాము. దాంతో, మన నౌకా వాణిజ్యం రెవెన్యూ 40 నుంచి 5 శాతానికి పడిపోయింది. ఒక 'రీసెర్చి' ప్రకారం 'షిప్ బిల్డింగ్ రంగంపై మనం ఒక రూపాయి. ఖర్చు పెడితే, అది రెండింతలై మనకు తిరిగివస్తుంది. 'షిప్ యార్డు'లో ఒక ఉద్యోగం మనం సృష్టిస్తే, బయట 'సప్లై చైన్' మార్కెట్లో ఆరేడు కొత్త ఉద్యోగాలు పుడతాయి. అంటే, వంద ఉద్యోగాలు ఇక్కడ వస్తే, బయట ఆరు వందల మందికి వేర్వేరు రంగాల్లో పని దొరుకుతుంది" అన్నారు."నౌకా వాణిజ్యంతో నావికుల ('సీ ఫేరర్స్') అవసరం పెరుగుతుంది. పదేళ్ళ క్రితం మన దేశంలో వీళ్ళు 1 లక్ష 25 వేలు ఉంటే, ఈ రోజున అది మూడు లక్షలు దాటింది. ప్రపంచ దేశాలకు వీరిని సరఫరా చేసే మూడు దేశాల్లో మనం ఉన్నాము. రాబోయే రోజుల్లో యువతకు ఈ రంగం వల్ల విశేషమైన ఉపాధి దొరుకుతుంది..." ఇలా ప్రధాని ప్రసంగం సాగింది. ఒక వారం తర్వాత 'కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' రీసెర్చ్ స్కాలర్ సంగమూన్ హన్‌సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో "ఇండియా ఎగుమతుల ఎకానమీ అంతా కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంది.గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 70 శాతం నౌకా వాణిజ్యం చేస్తుంటే, అందులో గుజరాత్ వాటా 33 శాతంగా ఉంది. రాజకీయంగా అన్నింటా ముందుండే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లో అది 5 శాతం మాత్రమే" అని రాశారు. ఏపీ ప్రభుత్వాలతో బీజేపీకి 'వర్కింగ్ రిలేషన్స్' ఉన్నప్పటికీ, మోదీ ప్రసంగంలో పదేళ్లనాడు ఏర్పడిన తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. పోనీ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళే బాబుకు మోదీ సలహా ఇచ్చారా? అంటే, 'ఎన్డీఏ' కూటమి 'మీకు మీరే మాకు మేమే' తీరుతో చివరికి రాష్ట్రం బలవుతున్నది. ఏపీ 'మెరైన్' రంగంలో ఈ పదేళ్ళలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మొదలైన పూనిక అంటూ ఏదైనా ఉందంటే, అది 'కోవిడ్' రోజుల్లో కూడా వైసీపీ పాలనలోనే కనిపిస్తున్నది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
'బురద' రాజకీయాలు మానాలి!
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.ఈ పథకం ద్వారా కేసీ కెనాల్‌కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్సీ నీటిని తోడవచ్చు. ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్సీలూ, కేసీ కెనాల్‌కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్ఎమ్సీ వద్ద రోజుకు మూడు టీఎమ్సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.అవగాహన లేని వ్యాఖ్యలుకొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
కాలుష్యం తగ్గేలా... పరిశ్రమ పెరిగేలా!
విద్యుత్ చలనశక్తి వైపు పెద్ద ఎత్తున మళ్ళడం కేవలం వాంఛనీయం కాదు, తక్షణావశ్యకమని ఢిల్లీ వాయు కాలుష్యం హెచ్చరిస్తోంది. ప్రపంచ మోటారు వాహ నాల పరిశ్రమ ఇప్పటికే ఆ క్రమంలో ఉంది. ఈ శతాబ్దంలోని పరిస్థితులు దాన్ని అనివార్య పరిణామంగా మారుస్తు న్నాయి. ఇదేదో వాతావరణ మార్పునకు పరిష్కారంగా తీసుకుంటున్న చర్య కాదు. పారిశ్రామిక పోటీ సామర్థ్యానికి, సాంకే తిక నాయకత్వానికి, జాతీయ ఆర్థిక స్థితిస్థాపక శక్తికి బ్యాటరీలతో నడిచే వాహనాలు నిర్ణయాత్మక శక్తిగా మారాయి.నేటి వ్యూహాత్మక అవసరంఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో గడచిన పదేళ్లలో మనం అడుగులు వేయడం ప్రారంభించాం. ఎక్కువ శక్తిని పొందుపరచు కునే కొత్త రకం బ్యాటరీల తయారీకి నడుం బిగించాం. కానీ, ఇతర దేశాలు నాటకీయంగా వేగం పుంజుకున్నాయి. పారిశ్రామిక ఆధిప త్యాన్ని చాటుకునేందుకు చైనా వీటిని కూడా ఒక వేదికగా చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈవీల సరఫరా క్రమంలో ప్రధాన విడి భాగాలపై అది పట్టు చేజిక్కించుకుంది. ఈవీలను వాడక తప్పని మార్పు ఎంత లోతైనదో అమెరికా, యూరోపియన్ యూనియన్ గ్రహించి, అసాధారణ పారిశ్రామిక విధానాలతో దానికనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి. ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, ఈయూ గ్రీన్ డీల్ ఆ కోవకు చెందినవే! ఇపుడు కనుక నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే, ప్రపంచానికే నాయకత్వం వహించగల ఈవీ ఎకోసిస్టంను మనం నిర్మించుకో గలం. దేశంలో రోడ్లపై కనిపించే వాహనాల్లో ఈ రెండు విభాగాలవే దాదాపు 80 శాతం. పెట్రోలు వాహనం కన్నా ఈవీని కొనడం, నడపడం దాదాపు 30 శాతం చౌకతో కూడిన పని. పట్టణాలు, నగరాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటిని విరివిగా వాడవచ్చు. ద్వి, త్రిచక్ర వాహనాలు విధిగా 2030 కల్లా బ్యాటరీలతో నడిచేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు కూడా స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. కంపెనీలు పరిశోధన–అభివృద్ధి, విడి భాగాల తయారీ, బ్యాటరీల ఉత్పత్తిపై సందేహించకుండా పెట్టుబడులు పెంచుకునేందుకు వీలవుతుంది. దేశంపై చమురు దిగుమతి భారం తగ్గుతుంది. నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. ఈయూ దేశాలతోపాటు, ఇండోనేషియా, థాయిలాండ్, తైవాన్ వంటి పెక్కు దేశాలు ఈవీలను ఇప్పటికే తప్పనిసరి చేశాయి. కార్ల వైపు కూడా దృష్టి!ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల వినియోగం వైపు మనం పూర్తిగా మళ్ళాలి. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న పురోగతు లకు తగ్గట్లుగా మన కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య (కఫే) నిబంధనలను మార్చుకోవాలి. కిలోమీటరుకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 93.5 గ్రాములకు మించకూడదనే నియమాన్ని ఈయూ అమలుపరుస్తోంది. మన దేశంలో ఇది ఇప్పటికీ కిలోమీటరుకు 113 గ్రాములుగా ఉంది. కర్బన ఉద్గారాలు తగ్గించుకోవలసిందేనని నిబంధన తెస్తే వాహన తయారీ సంస్థలు ఇంధన సామర్థ్య లక్ష్యాల సాధనపై శ్రద్ధ పెడతాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల (ఐసీఈ)లో క్రమానుగత మెరుగుదలకు ఉపక్రమిస్తాయి. ఆర్థికంగా ఎక్కువ భారం మోపని కార్ల తయారీ వైపు కంపెనీలను నడిపించాలి. లైట్–డ్యూటీ వాహన ‘కఫే’ ప్రమాణాల అమలుతో యూరప్‌లో ఈవీల వాటా ఒక్క ఏడాదిలోనే 3 నుంచి 11 శాతానికి పెరిగింది. ‘కఫే’ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల మూడు ప్రయో జనాలున్నాయి. కంపెనీలు కాలం చెల్లిన ఐసీఈ టెక్నాలజీలపై ఆధారపడే బదులు తదుపరి తరం ఈవీల తయారీలపై పెట్టు బడులు పెడతాయి. ప్రపంచ రెగ్యులేటరీ ప్రమాణాలతో భారత్ సమతూకం సాధిస్తుంది. ఫలితంగా, దేశంలోని కార్ల తయారీసంస్థలు ఎగుమతి మార్కెట్లో పోటీ పడగలుగుతాయి. మూడవది– భారతీయ వినియోగదారులకు సరసమైన ఎలక్ట్రిక్ కార్లు అందు బాటులోకి రావడం వేగం పుంజుకుంటుంది. ఛార్జింగ్ అడ్డంకులుదేశంలో ఈవీల వాడకం ఆశించినంత పెరగకపోవడానికి కారణం వాటి ధర, లేదా పనితీరు కారణం కాదు. ఆధారపడదగిన రీఛార్జి సదుపాయాలు లేకపోవడం. ఇళ్లు, ఆఫీసులు రెండింటి వద్ద ఈ సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 60 శాతం మందికి పైగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో నివసి స్తున్నారు. ఛార్జర్లను ఏర్పాటు చేసుకోవడం వారికి వ్యయ ప్రయాస లతో కూడిన పని. వాహనాలు ఛార్జి చేసుకోవడం భారతదేశంలో తక్షణం జాతీయ హక్కుగా మారాలి. వాహనాలను పార్కు చేసుకునే చోట ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోనివ్వాలి. ప్రాథమిక విద్యుత్, సురక్షితా నిబంధనలతో ఆ సదుపాయాలు అందుబాటు లోకి తేవచ్చు. లీగల్ ఫ్రేమ్ వర్కును కూడా మార్చుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తరహాలో రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు లేదా బిల్డింగ్ అసోసియేషన్ల నుంచి అనుమతి తీసుకోనవసరం లేకుండా ఏ పౌరుడైనా లీగల్ పార్కింగ్ స్పాట్ వద్ద ఛార్జర్ ఏర్పాటు చేసుకునేందుకు అధికారమివ్వాలి. వోల్టేజి తగ్గని విధంగా విద్యుత్ సరఫరా ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఈవీ–రెడీవైరింగు అమర్చాలి. స్లో, ఫాస్ట్ చార్జింగ్లకు వేర్వేరు ప్రదేశాలు నిర్ణ యించాలి. రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు సాముదాయిక రీఛార్జింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్ని ప్రభుత్వం, పురపాలక సంస్థలు వివిధ కానుకల రూపంలో ప్రోత్సహించాలి. దీన్ని కేవలం పర్యావరణపరమైన బాధ్యతగా భావించడం పొరపాటు. భారత్ బలమైన ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా అవత రించేందుకు ఇది ద్వారాలు తెరుస్తుంది. మనం శిలాజ ఇంధనాల దిగుమతిపై చాలా కాలంగా ఆధారపడుతూ వస్తున్నాం. దాన్ని తగ్గించుకోవచ్చు. ప్రజారోగ్య లక్ష్యాలను అందుకోవడంలో నగరాలకు సహాయపడినట్లు అవుతుంది. బ్యాటరీలు, పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి గ్రిడ్ల అధునికీకరణ, పునరుత్పాదక ఇంధన వనరుల దిశగా అధునా తన టెక్నాలజీలలో పెట్టుబడులను ఉద్దీపింపజేస్తుంది. ఈ రంగాన అగ్ర భాగాన నిలిచేందుకు భారత్ కృషి చేసి తీరాలి. ప్రపంచం గేరు మారుస్తున్నప్పుడు, ఇండియా కూడా యాక్సిలరేటర్ తొక్కాలి. ఎలక్ట్రిక్ వాహనాలతో నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. 2030 కల్లా విధిగా ద్వి, త్రిచక్ర వాహనాలు బ్యాటరీలతో నడి చేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. అలాగే విస్తృతంగా ఛార్జింగ్ సదుపాయా లను అందుబాటులోకి తేవాలి.అశోక్ ఝున్‌ఝున్‌వాలా వ్యాసకర్త ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
దాపరికం లేని సామ్రాజ్యవాదం
ఇందులో కొత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలేమీ లేవు. వెనిజులాపై సైనిక దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణలో ఉన్నది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే వివరించి చెప్పారు. అదీగాక, లాటిన్ అమెరికాతో కూడిన పశ్చిమార్ధ భూగోళం 1823 నాటి ‘మన్రో డాక్ట్రిన్’ నిర్దేశించినట్లు ఎప్పటికీ తమదిగానే ఉంటుందనీ, అందుకు అదనంగా ఇపుడు ‘ట్రంప్ డాక్ట్రిన్’ ప్రకారం అందుకోసం సైనిక బలాన్ని వినియోగించగలమనీ బాహాటంగా ప్రకటించారు. వెనిజులా ఆపరేషన్ తర్వాత ‘అందుకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యం ఇక ఎవరికీ ఉండద’ని హెచ్చరించారు. నిజానికి ఈ ఆపరేషన్‌కు ముందు నవంబర్‌లో విడుదల చేసిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో ఉన్నది కూడా ఇదే!ఏ చట్టాలూ పాటించరా?వెనిజులాలో అమెరికాది అతి నగ్నమైన సామ్రాజ్యవాద చర్యను ఇంత సూటిగా, అన్ని కోణాల నుంచి ట్రంప్ వివరించినట్లు ఆయన విమర్శకులు కూడా చెప్పలేరేమో! అమెరికా అధ్యక్షునిది అన్ని విషయాలలోనూ దాపరికం లేనితనమే. అందుకు ఆయనను అభినందించవచ్చు కూడా! ఒక్క విషయంలో మాత్రం మదురోపై అసత్య ప్రచారాలు చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి, అందుకోసం స్వయంగా ఒక కంపెనీని నడుపుతూ, అమెరికాకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని! ఇవి తప్పుడు ఆరోపణలని అమెరికన్ మీడియాయే పలుమార్లు రాసినందున ఆ విషయమై చర్చించటం వృథా. పైగా, డ్రగ్స్ రవాణా కేసులలో శిక్షలు సైతం పడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తదితరులకు క్షమాభిక్ష ప్రకటించి జైలు నుంచి విడుదల చేసిన ట్రంప్, మాదక ద్రవ్యాల కారణంగా మదురోపై చర్య తీసుకుంటున్నట్లు వాదించటం హాస్యాస్పదమని అమెరికన్ మీడియా కొట్టివేస్తున్నది. మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నదంటూ ఇటీవలి వారాలలో సుమారు 30 వెనిజులా పడవలపై బాంబింగ్ చేసి, 100 మందికి పైగా ప్రాణాలు తీసినదంతా ఎటువంటి ఆధారాలు చూపకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని అదే మీడియా గుర్తు చేస్తున్నది. అమెరికా ప్రజాప్రతినిధులు, నిపుణులు పలువురు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. వారిలో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్లు సైతం ఉన్నారు. చర్చలకు సిద్ధమని మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చర్య జరగటం గమనించదగ్గది.ఈ విధమైన దాడి చేయవలసిన అగత్యం ఇపు డేమి ఏర్పడింది? చమురు నిల్వల స్వాధీనం మాత్ర మేనా, మరేమైనా ఉందా? మదురోను పదవీచ్యుతు డిని చేయటంతో వెనిజులా తమ అధీనంలోకి వచ్చి నట్లేనా? మదురో స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షు రాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాము కోరుకున్నట్లు పాలించ గలరన్న సూచన జరిగేదేనా? అంతిమంగా అధికారం ‘భద్రంగా, సవ్యంగా, న్యాయబద్ధంగా’ మరొకరికి బదిలీ కావటం అంటే ఏమిటి? అంతవరకు వెని జులాను ‘తామే పాలించగల’మన్న ట్రంప్ ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యకుగానీ, ఆయన చేసిన ప్రకటనలకు గానీ అర్థం, అమెరికా తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ,అంతర్జాతీయ చట్టాలకు గానీ ఎంతమాత్రం కట్టుబడి ఉండబోదని స్పష్టంగా ప్రకటించటమేనా?మేమే బాస్!దాడికి కారణం చమురు నిల్వలన్నది విస్తారంగా వినవస్తున్న మాట. కానీ అది ఒక కోణం. ‘మన్రో డాక్ట్రిన్’ ప్రకారం తమ ఇలాకాగా పరిగణించే లాటిన్ అమెరికాలో తమను ధిక్కరించే ప్రభుత్వాలు గానీ, వామపక్ష ప్రభుత్వాలు గానీ ఏర్పడితే కూలదోయటం గత 70 ఏళ్లలో కనీసం 15 సార్లు జరిగింది. వెనిజులా ప్రభుత్వం కూల్చివేతకు హ్యూగో ఛావేజ్ కాలం నుంచి 20 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది నేపథ్యం కాగా, వెనిజులా సహా పలు లాటిన్ అమెరికన్ దేశాలలో కొంత కాలంగా రష్యా, చైనాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం ట్రంప్‌కు అన్నింటికీ మించిన ఆందో ళనగా మారింది. ప్రస్తుత దాడి సందర్భంగా ఆయన మన్రో డాక్ట్రిన్, ట్రంప్ డాక్ట్రిన్ ప్రస్తావనలు, పశ్చిమార్ధ గోళం వైపు ఇక ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరన్న హెచ్చరికలు, తమ సైనిక బలం గురించిన మాటలు, ఇవన్నీ అటువంటి ఆందోళన నుంచి వచ్చినవే. చమురు ఆ తర్వాతి సంగతి. అమెరికా ప్రాబల్యం ఇతరత్రా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా బలహీనపడుతున్నందున, పశ్చిమార్ధ గోళంలో, దానితో పాటు పశ్చిమాసియాలో తమ బలాన్ని ఏ విధంగానైనా నిలుపుకొని తీరాలన్నది ట్రంప్ పట్టుదల. వెనిజులాపై దాడి, అదే పని చేయగలమంటూ ఇరాన్‌కు హెచ్చరికలు, ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా ఆక్రమణ వంటి చర్యల ద్వారా ఆ లక్ష్యం దీర్ఘకాలంలో ఎంతవరకు నెరవేరగలదన్నది వేచి చూడాల్సిన విషయం.పోతే, వెనిజులాలో ఉపాధ్యక్షురాలి నాయకత్వాన కొనసాగుతున్న ప్రభుత్వం, సైన్యం కూడా ట్రంప్ దాడిని ఖండిస్తూ, ‘తమ దేశం ఎప్పటికీ అమెరికన్ వలస కాబోద’ని స్పష్టం చేశాయి. అటువంటి స్థితిలో అధి కారం ‘భద్రంగా న్యాయబద్ధంగా’ బదిలీ కావటం ఏ విధంగా ఆచరణ సాధ్యం? బలమైన సోషలిస్టు శక్తులు, ఆ ప్రాంతమంతటా గెరిల్లా గ్రూపులు, అదే మూడ్‌లో ఉన్న వెనిజులా సైన్యం దృష్ట్యా పరిణామాలు ఏవిధంగా ఉండవచ్చు? కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక జోక్యాలు, ఎన్నికైన ప్రభుత్వాలను ‘నియంతృత్వ’మనే ప్రచారాలతో పడగొట్టడాలతో లాటిన్ అమెరికా అంతటా ప్రజాభిప్రాయం చాలావరకు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాపై విమర్శలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం దృష్టి నుంచి అంతిమంగా తేలే ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉదారవాద వ్యవస్థలు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పరస్పర సంబంధాలు, దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం వంటివి బలహీనపడుతున్నా ఇంకా నిలిచి ఉంటాయా, లేక అమెరికా సామ్రాజ్యవాదానికి మరింత బలవుతాయా అన్నది. బలి చేయటమేనన్నది నిర్ణయమైతే ట్రంప్ గురి క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, ఎస్సీఓ, డీ–డాలరైజేషన్ ప్రయత్నాల వైపు మళ్లుతుంది. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
ఒక అజేయ స్ఫూర్తి సంకేతం
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ‘‘సౌరాష్ట్రే సోమనాథం చ...’’ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటిచెబుతుంది: ‘‘సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే‘ లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్’’ అంటే– ‘‘సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు’’ అని అర్థం. కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే, సోమనాథ్‌కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.అఖండ ధైర్యానికి నిర్వచనంసోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారత దేశంపైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్‌కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశదేశాలకు విసృతంగా మోసుకెళ్లారు. తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్పై పదేపదే దాడులకు ‘ప్రేరేపించింది.’ దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. ఎందరో మహానుభావులుకానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్‌నాథ్‌లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్‌ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నయ్ నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా– ‘‘దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతోపాటు గుజరాత్‌లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీవన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంత శక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జాతీయ మనోభావనం జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మనాశనం, వినాశమే!’’ స్వాతంత్య్రానంతరం సమర్థుడైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్... అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్‌లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్‌పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్‌కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మున్షీని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. ‘సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ద ష్రైన్ ఎటర్నల్)’ గ్రంథంతోపాటు... సోమనాథ్పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి, మున్షీ తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు... ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వతత్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందన్తి శస్త్రాణి’ అని గీతలో చెప్పినట్టు – అది ధ్వంసం చేయ శక్యంగాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్‌ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు? ఒక ఆశాగీతంవందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొని నిలబడి... నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే... మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్‌ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్‌కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం... ‘భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య’ అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – ‘‘లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ... రాగద్వేషాలనూ, సమస్త క్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాలు’’ అని అర్థం. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్‌కు ఉంది. 1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా... సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలెన్ని ఎదురైనా... ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మంపై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే... మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కల్యాణమే పరమావధిగా... మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది. జై సోమనాథ్! నరేంద్ర మోదీభారత ప్రధాని, శ్రీ సోమనాథ్ ట్రస్టు చైర్మన్ -
జోహ్రాన్ మమ్దానీ (న్యూయార్క్ మేయర్) రాయని డైరీ
నీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారన్నది నీ బలాన్ని తెలుపుతుంది. నువ్వు ఎవరి పక్కన నిలబడి ఉంటున్నావన్నది వారి పట్ల నీలోని బలమైన ఆపేక్షను చూపుతుంది.నేను, న్యూయార్క్ సిటీ... నా బాల్య మిత్రులం. ఎప్పటికీ ఒకరి పక్కన ఒకరం నిలబడి ఉండేవాళ్లం.హడ్సన్ నది ఒడ్డున , న్యూయార్క్ సిటీ నా భుజం పైన చెయ్యేసి నడుస్తుంది. నాకెంతో ఇష్టమైన గోధుమ పిండి ‘బురిటో’ను క్వీన్స్ – బ్రూక్లిన్ స్టేషన్ల మధ్య తిరుగుతుండే ‘క్యూ’ ట్రైన్లో తనతో ఇష్టంగా పంచుకోనిస్తుంది. వలస వచ్చిన వారిని కలవనివ్వటం అంటే, రమ్మని పిలిచి కలవటం కాదు. రావచ్చా అని అడిగి వెళ్లి కలవటం. న్యూయార్క్ మర్యాదగల మనిషి. మానవ మర్యాదల కోసం చూడని నగరం. ఇలాగే కదా నాగరికత ఉండాల్సింది! జనవరి 1 అర్ధరాత్రి... కొత్త ప్రయాణికుడిలా ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్లో దిగాన్నేను. లగేజ్ లేదు. లగేజ్‌లు మోయటానికి వచ్చినవాడి దగ్గర లగేజ్ ఎందుకు ఉంటుంది?‘‘ఎవరతను, ఈ టైమ్‌లో దిగాడు?’’‘‘న్యూయార్క్ సిటీ కొత్త మేయర్!’’‘‘అది తెలుసు. ఎవరతను?’’‘‘డెమోక్రాటిక్ సోషలిస్ట్!’’‘‘అదీ తెలుసు. ఎవరతను?’’‘‘ఒక యువకుడు!’’‘అది తెలుస్తూనే ఉంది. ఎవరతను?’’‘‘వలస వచ్చినవాడు’’ ‘‘అది కూడా తెలుసు. ఎవరతను?’’‘‘ఒక ముస్లిం’’ ‘‘ఓరి దేవుడా! న్యూయార్క్ సిటీ ఒక ముస్లింని, ఒక వలస మనిషిని, ఒక డెమోక్రాటిక్ సోషలిస్ట్ని, ఒక అనుభవం లేని వాడిని తన మేయర్‌గా ఎన్నుకుందా? ఏం కర్మ ఈ 400 ఏళ్ల మహా నగరానికి?!’’నాతో తలపడి నన్ను గెలిపించిన ఆండ్రూ క్యూమో, కర్టిస్ స్లివా, ఎరిక్ ఆడమ్స్ ఆత్మలు సబ్వేలో బాధతో మూలుగుతున్నట్లుగా అనిపించింది!ఇందులో దేనికి నేను క్షమాపణలు చెప్పి ఈ ఆత్మల ఘోషను చల్లార్చాలి? వలస వచ్చినందుకా? ముస్లింని అయినందుకా? యువకుడిని అయినందుకా? డెమోక్రాటిక్ సోషలిస్టును అయినందుకా?... లేక, ఇవన్నీ అయి కూడా, న్యూయార్క్ సిటీ మేయర్‌గా ఓడిపోనే పోనందుకా?!న్యూయార్క్ వలసల నగరం. వలసలు నిర్మించిన నగరం. వలసల శ్రమతో నడిచే నగరం. ఇక నుంచి ఒక వలసదారుడు నడిపే నగరం కూడా.ఈ మూడు పరాజిత ఆత్మలు నాతో పాటుగా రోజూ సిటీ హాల్లోని మేయర్ ఆఫీస్‌కి వచ్చి, డ్యూటీ చేసి వెళుతుంటాయా? వెంటాడే వాళ్లు, వేటాడేవాళ్లు ఎక్కడికైనా వస్తారు!ఇకపై వాషింగ్టన్ నుంచి వచ్చిన వారెవరైనా న్యూయార్క్ సిటీలోని ఒక వలసదారుడిని తాకాలంటే, ముందుగా జోహ్రాన్ మమ్దానీ అనే ఈ కొత్త న్యూయార్క్ మేయర్‌ను దాటే వెళ్లాలి.కర్టిస్ స్లివా వ్యథాత్మ అసహనంగా అంటోంది: ‘‘జోహ్రాన్, నువ్వు ఎవరివైనా, ఎక్కడి నుంచి వచ్చినా... ప్రమాదకారివి అవటం మాత్రం మొదట నువ్వు డెమోక్రాటిక్ సోషలిస్ట్వి అయినందువల్లనే...’’నవ్వొస్తోంది నాకు. మనిషన్న వారెవరైనా డెమోక్రాటిక్ సోషలిస్ట్ అవకుండా ఉండగలరా? కర్టిస్ రిపబ్లికన్. మేయర్ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు గెలుచుకున్న కర్టిస్ కానీ; 41 శాతం ఓట్లు సాధించిన ఆండ్రూ క్యూమో కానీ; పాయింట్ 3 శాతం ఓట్లు పొందిన ఎరిక్ ఆడమ్స్ కానీ, వ్యక్తులుగా డెమోక్రాటిక్ సోషలిస్ట్లు కాకుండా పోతారా?!డెమోక్రాటిక్ సోషలిస్ట్గానే నేను ఎన్నికయ్యాను. డెమోక్రాటిక్ సోషలిస్టుగానే న్యూయార్క్ సిటీని నడిపిస్తాను. ఆ నడక నాకు న్యూయార్క్ సిటీ నేర్పిందే! -
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎల్లో మీడియా పెను శాపమవుతోంది. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఈ మీడియా ప్రజలపై వేల కోట్ల భారాన్ని కూడా నిస్సిగ్గుగా సమర్థించే స్థితికి చేరుకుంది. జర్నలిజం ప్రమాణాలకు ఎన్నడో తిలోదకాలు ఇచ్చిన ఈ మీడియాపై ప్రజలు మండిపడుతున్నారు. జగన్ సీఎంగా ఉండగా వదంతులతో, కల్పిత కథలతో విష ప్రచారం చేసిన మీడియా ధోరణి ఇప్పటికీ మారలేదు. ఆంధ్రజ్యోతి కొన్ని రోజులు క్రితం ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అన్న శీర్షికతో ప్రచురించిన కథనం దీనికో ఉదాహరణ. ఏపీలో వాహన కొనుగోలుదారులపై పది శాతం సెస్ వేయడాన్ని సమర్థించింది ఆంధ్రజ్యోతి తరఫున వచ్చిన ‘‘బాదుడు కాదు.. బాగుకే’’ అనే కథనం. పైగా ఇందులోనే సెస్‌కు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ఇచ్చిన కథనంపై తన అక్కసునంతా వెళ్లగక్కింది. సెస్‌ను ప్రభుత్వం సమర్థించుకుంటోందని రాసి ఉంటే అదో పద్ధతి అనుకునేవాళ్లు. కానీ.. పత్రిక స్వయంగా భుజానికెత్తుకోవడం సరైన నిర్ణయమంటూ రాసేయడంతోనే సమస్య. వాహనాల లైఫ్ టాక్స్‌పై మాత్రమే సెస్ అని, ఒక్కో వాహన కొనుగోలుదారుపై పడే భారం రూ.1200 అని ఈ కథనం చెబుతుంది. సాక్షి కూడా ఇదే కదా రాసింది. రాష్ట్రంలో సగటున నెలకు 73 వేల వాహనాలు అమ్ముడుపోతూంటే సెస్ వల్ల ఏడాదికి రూ.270 కోట్ల భారం ప్రజలపైపడుతుందని సాక్షి రాసింది. కానీ ఎల్లోమీడియా దృష్టిలో ఇది పెద్ద భారమే కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వారికి బాగా గిట్టుబాటు అవుతోంది మరి. ఇలాంటి అంశాల్లో మీడియా అనేది ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలా పన్నులు వేయడంలోని హేతుబద్దతను ప్రశ్నించాలి. అప్పులు తేకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పన్నుల బాదుడు లేకుండా ప్రభుత్వాన్ని నడిపి, సంపద సృష్టించి అన్ని హామీలను అమలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎన్నికల సమయంలో పలికిన బీరాలను గుర్తు చేయాలి. అలా చేయకపోగా రోడ్లు బాగు చేయాలని, మద్యం తాగి నడిపే వారిని పట్టుకునేందుకు బ్రీత్ ఎనలైజర్లు, వేగం నియంత్రణకు స్పీడ్గన్లు ఏర్పాటు చేయాలని రాస్తోంది. ఇదే రకమైన బుద్ధో మరి? కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ బాగు చేసేశామని ఆ మధ్య ఎప్పుడో చెప్పారు కదా? అంతలోనే ఏమైంది?అవినీతి పుణ్యమా అని గోతులమయం అయ్యాయా? పైగా రహదారుల కోసం ఇప్పటికే సెస్‌లు ఉండగా అదనంగా ఎందుకు? పెట్రోల్, డీజిల్ ధరలపై ఇప్పుడున్న సెస్ ఎంత? ఆ మొత్తాన్ని రోడ్లకు వాడడం లేదు ఎందుకు? ఎన్నికలై 19 నెలలైనా ఇచ్చిన హామీ మేరకు పెట్రోలు, డీజిళ్ల ధరలు ఎందుకు తగ్గించలేదు? ఈ అంశాలపై ఎల్లో మీడియా ఎన్నడైనా వార్తలు ఇచ్చిందా?. జగన్ టైమ్‌లో చెత్త పన్ను కోట్లు వసూలు చేశారట. కాని ఎక్కడి చెత్త అక్కడ ఉందట. తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారంటే రాజకీయం అనుకోవచ్చు కానీ.. ఆంధ్రజ్యోతి ఇంత పచ్చిగా అబద్దాలను ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం? ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్థానిక సంస్థలలో నెలకు రూ.50 - 100 వసూలు చేసి పారిశుద్ధ్యం పనులు చేపట్టారు. వీటి ద్వారానే ప్రభుత్వానికి రూ.కోట్లు వచ్చాయట. ఇందులో ఇసుమంతైనా నిజం ఉందా? ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తివేశామని చెప్పిన తర్వాత అనేక గ్రామాలు, పట్టణాలలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో తెలియదా? ప్రస్తుతం పిఠాపురం వంటి చోట్ల ఈ చెత్త పన్ను వసూలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. చెత్త పన్నుతో కోట్ల వచ్చాయట. ఇప్పుడేమో లైఫ్ టైమ్ టాక్స్ పై పది శాతం సెస్ వేస్తే కాని రోడ్లు బాగు చేయలేరట.అది కోట్ల మొత్తం కాదని వీరు చెబుతున్నారా? వైసీపీ హయాంలో చెత్త పన్ను వేస్తున్నారని, చెత్త ప్రభుత్వం అని తప్పుడు ప్రచారం చేశారు. పెద్ద సంస్కరణవాదిని అంటూ గతంలో ఆస్పత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేయించిన చంద్రబాబు అధికారంలో ఇంకో పార్టీ ఉంటే మాత్రం ఇలా చెబుతుంటారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా రోడ్డు కావాలంటే స్థానికు ప్రజలు ఏభై శాతం భరించాలని ‘జన్మభూమి’ పథకం కింద నిబంధన పెట్టిన విషయంబ మరచిపోయారా? ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక ఆ షరతు తొలగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణం చేస్తుందట. ప్రైవేటు వ్యక్తులు చెత్త తొలగించడానికి ఏభయ్యో, వందో తీసుకుంటేనే తప్పు అని చెప్పిన చంద్రబాబు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా, వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మాత్రం ప్రైవేటు వారికి అప్పనంగా ధారాదత్తం చేస్తారట. జగన్ చేస్తే బాదుడు ..చంద్రబాబు చేస్తే బాగుకే అని రాయడం అంటే పాఠకులను, ప్రజలను మోసం చేయడం కాకుండా మరొకటి అవుతుందా?.. గత నవంబర్ ఆఖరు వారంలో ఇదే పత్రిక ఒక కథనం ఇచ్చింది. సెస్సులు వేసి రోడ్లు వేయాలని రహదారుల శాఖ ప్రతిపాదన పెట్టింది. దాని ప్రకారం పెట్రోలు, డీజిల్, గనులు,రిజిస్ట్రేషన్లపైన సెస్ వేసి స్టేట్ హైవేలను అభివృద్ది చేయాలని తలపెట్టారట. దీనిని ప్రజలపై భారం మోపడం అని అంగీకరించరా? ఈ భారం సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉండవచ్చని ఇతర మీడియాలో కథనాలు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉంటే ఎంత బాదుడు బాదినా ఆహా,ఓహో అని పొగుడుతారా? అదే జగన్ ప్రభుత్వం ఉంటే అడ్డగోలుగా రాస్తారా?.. ఇప్పటికే కరెంటు చార్జీల సర్దుబాటు రూపంలో సుమారు రూ.17వేల కోట్లు మళ్లీ మరో రూ.15651 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారా?లేదా? భూముల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో అదనంగా రూ.వెయ్యి కోట్లు ఆదాయం సమకూర్చుకుంటున్నారా? లేదా? గ్రామాలలో రక్షిత నీటి సరఫరాపై యూజర్ ఛార్జీలను వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందా? లేదా? ఒక వైపు దాదాపు మూడు లక్షల కోట్ల అప్పుతో రికార్డు సృష్టించిన ప్రభుత్వం మళ్లీ అదనంగా ఈ బాదుడు ఏమిటి అని అడగవలసిన ఈ ఎల్లో మీడియా నిర్లజ్జగా బాజా కొడుతోంది.కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించినప్పుడు ఇదే ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేసింది? జీఎస్టీ తగ్గించడంతో అన్ని రకాల వ్యాపారాలు పెరిగిపోయాయని, ప్రబుత్వానికి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తోందని కదా? ఇప్పుడేమో ప్రభుత్వం ఆదాయం తగ్గపోయిందని ఎందుకు సన్నాయిరాగం తీస్తున్నట్లు? మరో సంగతి చెప్పాలి. వైసీపీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లుల బకాయిలు ఇస్తోందట. అది తప్పట. పనులు చేయించుకున్న తర్వాత బిల్లులు చెల్లించవద్దని ఏ మీడియా అయినా రాయగలుగుతుందా? పనులలో ఏదైనా తేడా ఉంటే అది వేరే విషయం అసలు రాజకీయ కక్షలతో పాలన సాగించాలని ఒక మీడియా చెప్పడం ఉన్మాదం కాక మరేమవుతుంది. ఇక్కడ ఈనాడు మీడియా గురించి కూడా ఒక మాట చెప్పాలి. జగన్ టైమ్‌లో ఇండోసోల్ అనే కంపెనీకి ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తే ఈ మీడియా అది జగన్ బినామీ కంపెనీ అని ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీకి సుమారు రూ.14 వేల కోట్ల విలువైన రాయితీలు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని ఎక్కడా తప్పుపట్టకుండా ఈనాడు మీడియా జాగ్రత్తపడింది.అంటే ఇప్పుడు చంద్రబాబు బినామీ కంపెనీ అయిందా? లేక ఇండోసోల్ తో ఏదైనా బేరం కుదిరిందా? అన్న విమర్శ చేస్తే ఆ మీడియా వద్ద సమాధానం ఉంటుందా? అందుకే ఈ ఎల్లో మీడియా ఏపీ ప్రజలపాలిట శాపంగా మారినట్లు పలువురు భావిస్తున్నారు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పేరుకు అభివృద్ధి... 'చేసేది విధ్వంసం'
బొగ్గు గనులు ‘ఇంధన భద్రత’గా మారాయి. రేవులు ‘వ్యూహాత్మక మౌలిక వసతులు’ అయ్యాయి. సఫారీ పార్కులు ‘సంరక్షణ’ ముద్ర వేసుకుంటున్నాయి. వీటిని ఒకే తాటిపైకి తెస్తున్నది జాగ్రఫీ కాదు, వాటి రాజకీయ ఆర్థిక వ్యవస్థ. హరిత ఆవరణ వ్యవస్థ అడవులు,కొండలు, దీవులను అభివృద్ధి పేరిట పెట్టుబడి ఆస్తులుగా మార్చేస్తోంది. హరియాణాలో ఆరావళి పర్వత శ్రేణిలో 3,800 ఎకరాలకు పైగా ప్రాంతాన్ని మెగా సఫారీ పార్కుగా మార్చాలన్న ప్రతిపాదన అందుకు తిరుగులేని నిదర్శనం. ఎకో టూరిజం, జీవవైవిధ్య పెంపుదల పేరు చెప్పి అది టూరిస్టులకు కన్నుల పండువను, డెవలపర్లకు లాభాలను వాగ్దానం చేస్తోంది. కానీ, అది అడవుల ఆవరణకు, జల వనరులకు, గ్రామాల ఉమ్మడి ఆస్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఆరావళికి మాత్రమే పరిమితమైంది కాదు. హసదేవ అరండ్లో బొగ్గు బ్లాకుల నుంచి దేహింగ్ పటకాయీలో చమురు, మైనింగ్; గ్రేట్ నికోబార్‌లో ట్రాన్స్– షిప్మెంట్ పోర్టు వరకు, భారతదేశపు అత్యంత బలహీనమైన జీవావరణ వ్యవస్థలు, అభివృద్ధికి పొలిమేరలుగా పునర్నిర్మాణం చెందుతున్నాయి. సఫారీ అనేది మినహాయింపు కాదు. అదొక నమూనా! జీవనాధార వ్యవస్థకు ముప్పుఆరావళి పర్వతాలు గుజరాత్లో మొదలై రాజస్థాన్, హరి యాణా గుండా సాగి ఢిల్లీ వరకు 670 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థగా దీన్ని చెబుతారు. ఇది భౌగోళిక అవశేషం కాదు. జీవావరణ మౌలిక వ్యవస్థ. థార్ ఎడారి తూర్పు వైపు మరింత విస్తరించకుండా ఇవి దాన్ని కాస్త మందగింపజేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాయవ్య భారతాన భూగర్భ జలాల రీఛార్జీకి ఇవి ఉపయోగ పడుతున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ వంటి జిల్లాల్లో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. ఆ జిల్లాలకు ఆరావళి పర్వతాలే జీవనాడి. అవి రుతుపవన వర్షాలను పీల్చుకుంటూ భారీ స్పాంజ్‌లుగా ఉపయోగపడుతున్నాయి. నీటికి ఎంతో కటకటలాడే ప్రాంతంలో జలవనరులు అంతో ఇంతో నిండటానికి తోడ్పడుతున్నాయి. పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో, పులిమీద పుట్రలా సుప్రీం కోర్టు భౌగోళిక శాస్త్ర ప్రమాణాలను ఉటంకిస్తూ, ‘సైన్స్’ పేరుతో ఆరావళి పర్వతాల రూపురేఖలకు ఆ మధ్య కొత్త నిర్వచనం ఇచ్చింది. చుట్టుపక్కల భూమి కన్నా కనీసం 100 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలని పేర్కొంది. ఈ విషయంలో అది రెగ్యులేటరీ అస్పష్టతను తొలగించేందుకు కేంద్రం ఇచ్చిన నిర్వచనం పైనే ఆధారపడింది. కాగితాలపై ఇది సాంకేతిక సునిశితత్వంగా కనిపించవచ్చు. వాస్తవంలో, ఇది లీగల్ భూకంపం లాంటిది.ఆరావళులలో చాలా భాగాలు ముఖ్యంగా హరియాణా, రాజస్థాన్ లోనివి తక్కువ ఎత్తులోనే ఉంటాయి. అవి కోర్టు చెప్పిన ఎత్తును అందుకోలేకపోవచ్చు. కానీ, జీవావరణ పరంగా అత్యంత కీలకమైనవి. పర్వతాలను పునర్ నిర్వచించడం ద్వారా భారీ భూభాగాలను పరిరక్షణ నుంచి మినహాయిస్తే, అవి గనుల తవ్వ కాలు, రియల్ ఎస్టేట్, హైవేలు, సఫారీ లాంటి ప్రాజెక్టులకు ఆల వాలం అవుతాయి. (అయితే, సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును పునఃపరిశీలిస్తోంది.)చెప్పేదొకటి... చేసేదొకటి!వన్య ప్రాణులను సంరక్షిస్తామని సఫారీ ప్రాజెక్టు చెబుతోంది. కానీ, పెళుసుగా ఉన్న ప్రాంతంలో రోడ్లు, లాడ్జీలు, పార్కింగ్ లాట్లు, ఇతర ఎన్క్లోజర్లు నిర్మించడం ద్వారా చేసే పనులు సంరక్షణ కిందకు రావు. అడవులకు కంచె నిర్మిస్తారు. ప్రజలను వాటిని దాటి వెళ్ళ నివ్వరు. ఉన్నత వర్గాల సరదాలకు అనుగుణంగా ప్రకృతిని తాము ఎంచుకున్న పద్ధతిలో నిర్వహిస్తారు. గురుగ్రామ్, నుహ్లలోని స్థానిక ప్రజానీకం పశుగ్రాసం, కట్టెలు, నీరు, రుతువులను బట్టి లభించే ఉపాధి మార్గాలకు ఆరా వళులపైనే ఆధారపడుతోంది. ఇది ఉన్నవి లాగేసుకోవడం ద్వారా వేరే వారికి పోగేసిపెట్టడమే! దాన్ని ‘ఎకో–టూరిజం’గా రీప్యాకేజీ చేయడమే. మధ్యభారతంలోని విస్తారమైన అడవుల్లో ఛత్తీస్‌గఢ్‌లోని హసదేవ అరండ్ ఒకటి. టేకు చెట్లకు, ఇనుమద్ది, సాళువ, గుగ్గిలం చెట్లుగా పిలిచే రకం చెట్లకు ఇది ప్రసిద్ధి. ఇంధన భద్రత పేరుతో బొగ్గుకు ఈ ప్రాంతాన్ని త్యాగం చేశారు. అధికారుల ప్రోద్బలంతో మైనింగ్ బ్లాకులు తెరిచారు. ఆరావళికి ఎకో–టూరిజం మాదిరిగానే హసదేవకు బొగ్గు ఎసరు పెట్టింది. రెండు ఉదంతాల్లో పేర్లు మారినా వాటిల్లే హాని ఒక్కటే!కాగితాలపై పచ్చదనం... ఆచరణలో అరాచకం అస్సాంలోని దేహింగ్ పటకాయీని ‘అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్’గా అభివర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణకు, బొగ్గు గనుల తవ్వకానికి అనుమ తించారు. రెగ్యులేటరీ మినహాయింపులనిచ్చారు. అనుమతులకు ముందే పనులు చకచకా సాగిపోయాయి. మొదట తవ్వి తీయడం, తరువాతే పరిశీలనలు. టెక్నోక్రాటిక్ పరిభాషతో ఆ ప్రాజెక్టులను సమర్థిస్తున్నారు. ప్రభావం మదింపు, నిపుణుల కమిటీలు, నష్టాన్ని తగ్గించే ప్రణాళికలు అంటారు. కానీ, ఈ మంత్రాంగాలు సంరక్షణ చర్యలగా కన్నా, ముందే నిర్ణయించిన ఫలితాలను చట్టబద్ధం చేసే సాధనాలుగానే ఎక్కువ ఉపయోగపడతాయి. జాతీయ భద్రత, వ్యూహాత్మక మౌలిక వసతుల పేరుతో గ్రేట్ నికోబార్‌లో మెగా ట్రాన్స్–షిప్మెంట్ పోర్టును, విమానాశ్రయాన్ని, టౌన్ షిప్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్షారణ్యాలకు, కోరల్ ఎకోసిస్టవ్ులకు, స్థానిక శోంపెన్ జనజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. ఇక్కడ గ్రీన్ ఎన్‌క్లోజర్ భౌగోళిక రాజ కీయాల ముసుగు వేసుకుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవా వరణం సలాం చేయవలసిందే. ఈ ఉదంతాలన్నింటిలోనూ చట్టం లోపించలేదు. దాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. ఆరావళి, హసదేవ, ఇతర దుర్బల మండ లాలను కాపాడేందుకు సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అడపాదడపా జోక్యం చేసుకుంటూనే ఉన్నాయి. 1900 నాటి పంజాబ్ భూసంరక్షణ చట్టం వంటివి భూ వినియోగ మార్పుపై కొన్ని పరిమితులను విధించగలిగాయి. అయినా, కమిటీలు, పునర్ వర్గీకరణలు, నీరుగార్చిన మదింపులు, ఇప్పుడు ఏకంగా మారిన నిర్వచనాలను కవచాలుగా ధరించి మెగా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.దేవాశీస్ చక్రవర్తివ్యాసకర్త అంతర్జాతీయ మీడియా స్కాలర్,సామాజిక శాస్త్రవేత్త (‘యూరేసియా రివ్యూ’ సౌజన్యంతో) -
కేసుల మాఫీపై నయా రోల్‌మోడల్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో అక్రమ ట్రెండ్‌కు తెరతీశారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునే విషయంలో ఇతర అవినీతి నేతలందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్కామ్‌లపై పెట్టిన కేసులను తానే ఎత్తేసుకుంటున్నారు మరి! రాష్ట్ర నేర విచారణ సంస్థ సీఐడీ అన్ని కోణాల్లో విచారించిన తరువాత పెట్టిన కేసులివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల మేరకు నమోదైనవి. చంద్రబాబు వీటిల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్ సంపాదించుకుంటే ఒక కేసులో మాత్రం జైలుకెళ్లారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిందే తడవు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను ఎత్తేయించుకున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసునూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పథకంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నది ఈ స్కిల్‌స్కామ్. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం అంటే రూ.300 కోట్లు పెడితే.. సీమెన్స్ రూ.3000 కోట్లు పెడుతుందని ఊరించారు. పైగా సీమెన్స్ కంపెనీ పైసా చెల్లించకుండానే ప్రభుత్వం రూ.330 కోట్లు కట్టేసింది. పుణేలోని జీఎస్టీ అధికారులు ఈ తేడాను గుర్తించారు. సీమెన్స్ అసలు, జీఎస్టీ రెండూ కట్టలేదని సమాచారమిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బట్టబయలైంది. అసలు సీమెన్స్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగమే కాదన్న బోగస్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లావాదేవీలతో తమకు సంబంధం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు మొత్తం కథ నడిపినట్లు విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఇందులో చిక్కుకుందా? లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా రూ.330 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి విడుదల చేసిందని వెల్లడైంది. సీఎం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్‌తో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం దుర్వినియోగమైందని సీఐడీ గుర్తించింది. ఈ స్కామ్‌లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని అరెస్టు చేసింది. సీఎం హోదాలో చంద్రబాబు పాత్ర సాంతం నిర్ధారణ అయ్యాక ఆయనను కూడా అరెస్టు చేసింది. దీంతో రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు ఈ స్కామ్ డబ్బు వెళ్లిందని, అక్కడి నుంచి సుమారు రూ.70 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి చేరాయని సీఐడీ అధికారులు కనిపెట్టారు. సీఐడీ ఇంత పక్కాగా దర్యాప్తు చేసినా టీడీపీ, జనసేనలు ఇదో అక్రమ కేసు అనే ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ చిందులు తొక్కింది. చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతకరమైన కథనాలు ప్రచురించింది. చివరకు చంద్రబాబు కేసుతో నిమిత్తం లేకుండా..ఆనారోగ్య కారణాలు చూపి హైకోర్టులో బెయిల్ పొందాల్సి వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడం.. విడుదలైన మరుక్షణమే చంద్రబాబు వాటిని బేఖాతరు చేయడం జరిగిపోయాయి. అది వేరే సంగతి.ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తన కేసులను ఎలా తొలగించుకునే బాధ్యతను ఒక లీగల్ ప్రముఖుడికి అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్‌లపై విచారణ జరిపిన అధికారులపై, వైసీపీ నేతలపై రకరకాల కేసులు సృష్టించారు. పలువురిని అరెస్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించారు. ఇంకో వైపు తన కేసుల మాఫీకి చర్యలు తీసుకున్నారు. అంతేకానీ... తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సిద్దపడలేదు. వెనుకటి రోజుల్లో తాను టెక్నికల్‌గా, లీగల్‌గా దొరకనని సభలలో అంటుండే వారు. కాని గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయట పడడానికి చంద్రబాబు కోర్టు విచారణ బదులు కొత్తమార్గం కనిపెట్టారు. మద్యం, ఫైబర్‌నెట్ స్కామ్‌లలో తనపై ఫిర్యాదు చేసిన అధికారులను భయపెట్టి ఉపసంహరణ పిటిషన్లు వేయించారు. ఇది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్‌లో ‘మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్’ అని ఇంకో వ్యూహం ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీసు పంపి, ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరారట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్‌లో ఎవరు అభ్యంతరం చెబుతారు? నిజానికి అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి స్కామ్‌పై ఫిర్యాదు చేశారట. కాని ఆయన అభిప్రాయం తీసుకోవడం లేదట. ఇలా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన అవినీతి కేసులను తొలగించుకునే రీతిని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అన్నది చర్చనీయాంశం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కింది కోర్టులు ఇలాంటి వాటిపై నిర్ణయాలు చేయరాదు. హైకోర్టులో జరగాలి. చిత్రమేమిటంటే ఇంతవరకు చంద్రబాబుకు చెందిన రెండు కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీలు న్యాయ స్థానం కూడా ఇవ్వడం లేదట. ఎందుకు కోర్టు ఇలా గోప్యత పాటిస్తుంది అనేదానిపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికే స్కిల్ కేసును ఈడీ అధికారులు విచారించారు. కాని కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయాలు, రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్న రీత్యా వారికి వ్యతిరేకంగా కేసును ముందుకు సాగనివ్వదని భావిస్తున్నారు. ఈడీతో నిమిత్తం లేకుండా సీఐడీ ఈ కేసును ఎలా నీరుకార్చుతుందన్న ప్రశ్న వస్తుంది. సీఐడీ అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్టు చేసింది? ఇప్పుడు అదే సీఐడీలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్టప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? అనే మీమాంస కూడా ఉంది. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న వారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా?. గతంలో బీహారు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను గడ్డి స్కామ్‌లో సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఆయన పదవికి రాజీనామా చేయగా, సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. కేసు విచారణ తర్వాత ఆయనకు శిక్ష పడింది. అలాగే హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాల కూడా టీచర్ల నియామక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షకు గురై జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా విచారణను ఎదుర్కున్నారు. వారికి కూడా ఇలాంటి కేసు ఉపసంహరణ మార్గాలకు సంబందించిన ఐడియాలు వచ్చి ఉంటే జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదేమో!. బహుశా ఇలాంటి వాటినన్నటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు లీగల్ టీమ్ వ్యూహాత్మకంగా అసలు కేసులు విచారణకే రాకుండా చేయడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చని భావించినట్లు ఉంది. అందుకు తగ్గట్లు ఆయా కేసులలో గతంలో ఫిర్యాదు చేసిన అధికారులతోనే కేసును విరమింప చేయిస్తున్నారు. లేదంటే ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కొత్త వ్యూహం అమలు చేయాలని అనుకుని ఉండవచ్చు. ఇప్పటికే రెండు కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు స్కిల్ స్కామ్ కు కూడా అదే ప్లాన్ చేసినట్లు అనుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు టీమ్ వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు ఒక మార్గం చూపినట్లవుతుందా, న్యాయ వ్యవస్థ ఇలాంటి పెడపోకడలకు చెక్ పెడుతుందా? పెట్టదా?అనేవి ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఈ యేటి మేటి మాట... ట్రంపిజం
ఈ ఏడాది ఎక్కువసార్లు పతాక శీర్షికలకు ఎక్కిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేననడంలో సందేహం లేదు. ఐదు భిన్నమైన కారణాల రీత్యా ఆయన వార్తల్లో అగ్రభాగాన నిలిచారు. ఒకటి– అమెరికా ఫస్ట్ విధానం. రెండు– ఆయన సుంకాల యుద్ధం. మూడు– దక్షిణం, పశ్చిమం, ఆగ్నేయాసియా నుంచి యూరప్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ద్వైపాక్షిక ఘర్షణల్లో తల దూర్చా లని కోరుకోవడం. నాలుగు– అమెరికా, చైనా, రష్యాల మధ్య సమీక రణలను మార్చడం. చివరగా, వ్యక్తిగత లైంగిక జీవితానికి సంబంధించి వార్తల కెక్కడమే కాకుండా, దర్యాప్తునకు లోనవడం!భద్రతా వ్యూహంతో మరోసారి...తాజాగా ట్రంప్ పాలనా యంత్రాంగం రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది అమెరికా భద్రతా వ్యూహంలో పశ్చిమ అర్ధ గోళానికున్న ప్రాధాన్యాన్ని చాటడమే కాకుండా, ఆ ప్రయోజనాలను కాపాడు కునేందుకు సైనిక చర్యను ప్రతిపాదించింది. దౌత్య, సైనికపరంగా అమెరికా వాస్తవిక ప్రవర్తనను ప్రభా వితం చేయడంలో ఈ వ్యూహం ఎంత ముఖ్యమైనదిగా పరిణ మిస్తుందనేది వేచి చూడవలసి ఉంది. మన దేశంలో చాలావరకు, మనతో సంబంధాలు నెరపడంలో వ్యూహ పత్రం దృక్కోణం ఏమిటి? ట్రంప్ ప్రపంచ వీక్షణం, ‘పెద్ద వ్యూహం’లో భారత్ స్థానం ఎక్కడ? అమెరికా–భారత్ సంబంధాలు మున్నెన్నడూ ఎరుగనంతగా క్షీణించిపోయాయనే అందరూ అంటున్నమాట. ముఖ్యంగా, నాయకత్వ స్థాయి సాంగత్య స్వరూప స్వభావాలలో, ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి అపనమ్మకం తిరిగి చోటు చేసుకుంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆమె గురించి నీచంగా మాట్లా డారు. భారత్ కూడా దానికి తగ్గట్లుగానే తలుపులు బిడాయించుకుని కూర్చుంది. భారత్, దాని నాయకత్వం గురించి వాషింగ్టన్ చర్చలలో ఎంత హీనంగా ప్రస్తావనకు వచ్చిందీ, ఆ తర్వాత బహిరంగపరచిన రహస్య పత్రాలు, కొందరు రాసుకున్న జ్ఞాపకాల పుస్తకాల ద్వారా వెల్లడైంది. ఇపుడు టెలివిజన్, సోషల్ మీడియాలో క్షణాల్లో అవి వెలికి వస్తున్నాయి. కనుక, ఇది స్నేహ సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపి తీరుతుంది. మూడు ముఖ్య సంగతులువ్యూహ పత్రం విషయానికొస్తే, ఇంతవరకు మూడు సంగతులు స్పష్టమయ్యాయి. ఒకటి–దాడులు, ప్రమాదాల నుంచి సామూహిక స్వీయ రక్షణకు ‘ఒక గ్రూపు’గా ఏర్పడే ధోరణిని కొనసాగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికాలను ‘బయటి’ శక్తులకు ‘అందని దుర్గాలు’గా ప్రకటించి, పశ్చిమ అర్ధ గోళంపై పట్టు సంపాదించాలనుకుంటున్నారు. కొన్ని విధాలుగా ఇది ఆసియాలోని అభిప్రాయాలనే ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలోని ఈ భాగంవారు కూడా అమెరికాను ‘బయటి’ శక్తిగానే భావిస్తారు. అయితే, ఆసియా నుంచి అమెరికా సేనలను ట్రంప్ ఉపసంహరించుకుంటారనీ, ఈ ప్రాంత భద్రతను ప్రాంతీయ శక్తుల చేతులకే విడిచిపెడతారనీ అనడానికి ఆధారాలు కనిపించడం లేదు. రెండు– మిగిలిన వాటన్నింటి కన్నా చైనాతో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా అటు సవాల్‌గానూ, ఇటు సమ వుజ్జీగా పరిగణించి వ్యవహరించవలసిన శక్తిగానూ కూడా ఉంది. ‘జి–2’ ఆలోచనతో ఆయన చేసిన ట్వీట్ ఆసియాలో కలకలం సృష్టించింది. ఇంచుమించు రష్యా కోరుకుంటున్న విధంగానే, యూరప్‌లో యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచంలోని మూడు పెద్ద (అమెరికా, రష్యా, చైనా) శక్తులు తమ భద్రత, పరపతి ఉన్న ప్రాంతాలకు పరిమితమయ్యే హక్కు ఉందనే లోపాయకారీ అవగాహనను బలపరుస్తున్నారు. కానీ, భారత్‌పై దీని పర్యవసానాలుంటాయి. చివరగా, వ్యూహ పత్రాన్ని అమెరికా విరమణ ప్రకటనగా, దేశ, విదేశాలలో ముఖ్యంగా యూరప్‌లో చాలా మంది భాష్యం చెబుతున్నారు. కానీ, ఆ రకమైన నిర్ధారణకు రావడం ట్రంప్ ప్రపంచ వీక్షణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి దాని వ్యూహ పత్రంలో ఎక్కడా ఒక్క మాట లేదు. అమెరికా శైలి మాఫియాప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 750 సైనిక స్థావరాలలో 1,60,000కు పైగా అమెరికా సైనిక దళాలు న్నాయి. అమెరికా సాయుధ దళాలున్న అత్యంత ముఖ్యమైన కేంద్రాలు జర్మనీ, జపాన్, ఇటలీ, కొరియాలలో ఉన్నాయి. అవి రెండవ ప్రపంచ యుద్ధకాలం నుంచి అమెరికా ‘అధీనం’లో ఉన్నాయి. ‘నాటో’ కూటమి దేశాల్లోనూ, పశ్చిమాసియా ‘క్లయింట్’ దేశాల్లో ముఖ్యంగా బహరైన్, కువైట్‌లలోనూ అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఈ స్థావరాల నిర్వహణకు ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనాలున్నాయి. సేనలు లేదా స్థావరాల సంఖ్యను తగ్గించుకోవడం గురించి వ్యూహ పత్రం ఎక్కడా మాట్లాడలేదు. మరింతగా ‘భారాన్ని పంచుకోవలసిన’ అవసరం గురించి మాత్రం అది ప్రస్తావించింది. ‘నాటో’ కూటమి దేశాలు, జపాన్, కొరియా, గల్ఫ్ దేశాలు వాటి రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని అమెరికా కోరుతోంది. ఇతర దేశాల్లో అమెరికా సేనల ఉనికి అవసరం ఏమిటో, అది ఎంతకాలమో, ట్రంప్ గానీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా అధ్యక్షులైన ఇత రులు గానీ వివరించిన పాపాన పోలేదు. భారతదేశంతో సహా ఇంకా అనేక దేశాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాల రీత్యా మాత్రమే అమెరికా సేనలు పరిమిత సంఖ్యలో కనిపి స్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగానే, కొన్ని దేశాల్లో అవి పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నది వాస్తవం. ఆ యుద్ధం ముగిసేనాటికి అమెరికా ‘విముక్తి’ కల్పించిన ‘ఆక్రమించిన’ దేశాల్లో అమెరికా సేనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వ్యూహ పత్రం, ఆ యా భూభాగాల నుంచి సేనల ఉపసంహరణ లేదా తగ్గింపునకు పిలుపు ఇవ్వలేదు. అవి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా సేనల నిర్వహణకు ఆయా దేశాలు కొంత పైకాన్ని చెల్లించాలని మాత్రమే అది అడుగుతోంది. ఇది కళాత్మక మాఫియా శైలి అవుతుంది. ఇతర పెద్ద శక్తుల నుంచి ఎదురు కాగల బెడద నుంచి ‘రక్షణ’ కల్పిస్తున్నందుకు ‘మామూలు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నమాట!ఇది చూడండి: యూరప్, ఆసియాలలో శక్తిమంతమైన సైనిక యంత్రాలుగా చైనా, రష్యా నడుచుకునేందుకు అమెరికా అనుమతి స్తుంది. చైనా, రష్యా పొరుగునున్న దేశాలు ప్రపంచ శక్తి అయిన అమెరికా పెత్తనం నుంచి తమను కాపాడుకునేందుకు ఈ ప్రాంతీయ శక్తుల పంచన చేరవచ్చు. ఇక సేనల తగ్గింపు ప్రసక్తి ఎక్కడ? ట్రంపి జంగా అభివర్ణించదగిన ఈ విధానంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉండబోతోందన్నది 2020లలో కాలగతిని నిర్వచించనుంది.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పరిహారం ‘అణు’వంతేనా?
భారత రూపాంతరీకరణకు ఉద్దేశించిన ‘అణు శక్తి స్థిర వినియోగ–పురోగతి బిల్లు (శాంతి) 2025’కు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది అణు శక్తికి సంబంధించి మూడు కీలక అంశాలపై చిరకాలంగా ఉన్న చర్చను మళ్ళీ రేకెత్తించింది. అవి: అణుశక్తి అభివృద్ధి–నియంత్రణ; ప్రమాదాలు సంభవించినపుడు సివిల్ లయబిలిటీ; అణు శక్తి ఉత్పాదనలో ప్రైవేటు భాగస్వామ్యం. అటామిక్ ఎనర్జీ చట్టం (1962), సివిల్ లయబిలిటీ–న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. అణుశక్తి అభివృద్ధి –వినియోగానికి 1962 నాటి చట్టం వీలు కల్పిస్తే, అణు ప్రమాదాలు సంభవించిన పక్షంలో బాధ్యత వహించడం, పరిహారం చెల్లించడా నికి సంబంధించి ఒక చట్రాన్ని 2010 నాటి చట్టం అందించింది. స్వతంత్ర నియంత్రణకు సుముఖం కాదా?విద్యుదుత్పాదనకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్) అందుబాటులోకి రావడం, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యు దుత్పాదన గడించాలనే ఆశావహ లక్ష్యసాధనకు ప్రైవేటు రంగ భాగస్వామ్యం అవసరమవడం అనే రెండు కారణాల రీత్యా కొత్త చట్టం అవసరమైందని ప్రభుత్వం వివరించింది. అణు విద్యుదుత్పాదనలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెర వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... నియంత్రణ, లయబిలిటీ చట్రాలు రెండూ అత్యంత ముఖ్యమైనవిగా పరిణమించాయి. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. నియంత్రణకు సంబంధించి కొత్త చట్టం యథాతథ స్థితినే కొనసాగించింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) గతంలో మాదిరిగానే పని చేస్తుంది. అణుశక్తి అభివృద్ధి మొగ్గ తొడుగుతున్న 1960లలో, రేడియేషన్ సదుపాయాలలో రేడియేషన్ సురక్షణను అమలుపరచేందుకు, అటా మిక్ ఎనర్జీ శాఖ (డీఏఈ)కు వెలుపల డైరెక్టరేట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (డీఆర్పీ) ఏర్పాటు చేశారు. హోమీ భాభా తర్వాత అణుశక్తి శాఖ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ సారాభాయ్, స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారుగానీ, ఆ భావన అమలుకు నోచుకోక ముందే, ఆయన కన్నుమూశారు. ఆయన వారసుడు హోమి ఎన్.సేత్నా ఏఈఆర్ఏ ఆలోచనను పక్కనపెట్టి, డీఆర్పీని కొనసాగించాలని నిర్ణయించారు. రాజా రామన్న 1983లో నియంత్రణ సంస్థ (ఏఈఆర్బీ)కు పచ్చ జెండా ఊపారు. కానీ, అది ఇతర రంగాలలోని అదే రకమైన సంస్థలలాగా పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినది కాదు. ఈ 2025 చట్టం కూడా ప్రస్తుత ఏఈఆర్బీ చట్రాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచనకు అణుశక్తి వ్యవస్థ సానుకూలంగా లేదని స్పష్టమవుతోంది. అణుశక్తి శాఖ పరిధిలోనే ఏఈఆర్బీ పనిచేస్తున్నప్పటికీ, గతంలో అది నీళ్ళు నమలకుండా పనిచేసిన దాఖలాలు లేకపోలేదు. వివిధ సందర్భాలలో నియమాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించినపుడు ఏఈఆర్బీ–ముఖ్యంగా ఎ. గోపాలకృష్ణన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు– విద్యుదుత్పాదన కేంద్రాలు, ఇతర సంస్థలపై ఆంక్షల రూపంలో కొరడా ఝళిపించింది. పరిహారానికి పరిమితులా?ఇపుడు ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తున్నారు కనుక, నిజాయతీగా పనిచేసే, సాంకేతికంగా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ అవసరం ఉంది. దేశ పురోగతి ముసుగులోనే అయినప్పటికీ, ఏఈఆర్బీ యథాతథ స్థితిని కొనసాగించడం శుభ సూచకం కాదు. ప్రైవేటు రంగాన్ని అనుమతించిన అంతరిక్ష రంగంలో కూడా ప్రభుత్వం స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడానికి బదులుగా ఇన్–స్పేస్ పేరుతో, ఏ ఎండకా గొడుగు పట్టే సంస్థనే సృష్టించింది. ఒక విధానాన్ని ప్రోత్సహించే, నియంత్రించే రెండూ ఒకే చూరు కింద ఉండకూడదన్నది మూలసూత్రం కావాలి. అణు దుర్ఘటనలు సంభవిస్తే కలిగే నష్టానికి లయబిలిటీ విషయంలో నియంత్రణ సంస్థ ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న. నియంత్రణ కఠినంగా లేకపోతే, ప్రమాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. లయబిలిటీకి సంబంధించి అంతర్జాతీయంగా పాటించే నియమాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జాతీయ చట్టాలు కూడా వాటికి అనుగుణంగా రూపొందాలి. అణు ప్రమాదం సంభవించిన చోట మూడవ పక్షానికి పరిహారం చెల్లించే బాధ్యత న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఆపరేటర్ పైనే ఉంటుందని అంతర్జాతీయ కట్టుబాట్లు చాలా వరకు నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ కిందనే లెక్క. కానీ, ఇతర సదుపాయాలున్న న్యూక్లియర్ సైట్ వద్ద కూడా దుర్ఘటన సంభవించవచ్చు. లయబిలిటీని అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ప్రస్తుత చట్టంలో పరిహారంపై రూ. 3,000 కోట్ల పరిమితి విధించడం, దాన్ని న్యూక్లియర్ ప్లాంట్ ప్రదేశంతో ముడిపెట్టడం అసంబద్ధం. చిన్న రియాక్టర్లకు (150 మెగావాట్ల నుంచి 750 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్నవి) లయబిలిటీని మరీ తక్కువగా రూ. 300 కోట్లుగా నిర్ణయించారు. ఇక 150 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాటికి కేవలం రూ. 100 కోట్లనే నిర్ణయించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ప్రోత్సహిస్తున్న సంస్థలను మచ్చిక చేసుకునేందుకే అలా నిర్ణయించారని తేటతెల్లమవుతోంది. హెచ్చు సామర్థ్యమున్న భారీ అణు విద్యుదుత్పాదన కేంద్రాలను నెలకొల్పేందుకు పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అవసరమవుతాయి. అవి నిర్మాణం పూర్తి చేసుకుని, ఉత్పాదన ప్రారంభించేందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. అణు విపత్తులలో లయబిలిటీ చట్రాన్ని సడలించడం ద్వారా, మాడ్యులర్ రియాక్టర్ల వల్ల పెద్ద నష్టం ఉండ బోదని ఆ పరిశ్రమ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. లయబిలిటీలను వర్గీకరించడం ద్వారా కొత్త చట్టం ఆ పరిశ్రమను సంతృప్తి పరచింది. భోపాల్ దుర్ఘటన పాఠాలు నేర్చుకున్నామా?అణు రియాక్టర్ల వద్ద (అణు ఇంధన వలయ సదుపాయాలతో కూడుకుని) తలెత్తే ప్రమాదాలను కొత్త చట్టం నిర్వచించి, లయబిలి టీలను కూడా నిర్ణయించింది. కానీ, ‘అణు సదుపాయాలు’గా నిర్వ చించిన చోట్ల ప్రమాదాలు సంభవిస్తే, లేదా అణు ధార్మికత వెలు వడితే ఏమిటన్న దానిపై మౌనం వహించింది. అలాంటి పరిస రాలలో ఏదైనా సంభవిస్తే ఆ నష్టాలకు పరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది? ‘న్యూక్లియర్ డ్యామేజీ’ అనే దానికి మాత్రం చట్టంలో విçస్తృతార్థం ఇచ్చారు. ప్రాణ నష్టం, గాయపడటం, ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, అణు ప్రమాదం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు అయ్యే వ్యయం అంటూ దానిలో చాలా వాటిని చేర్చారు. కానీ, లయబిలిటీ పరిమితిని మాత్రం రూ. 100 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లుగా పేర్కొన్నారు. 2010లో సంభవించిన సముద్ర ప్రమాదానికి గానూ బ్రిటిష్ పెట్రోలియం సంస్థ 65 బిలియన్ డాలర్లు చెల్లించింది. అదే భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకవడాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ఉపద్రవంగా చెబుతారు. కానీ దాని బాధితుల్లో పరిహారం కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా ఉన్నారు. పర్యావరణ నష్టానికి ఎవరూ చెల్లించింది ఏమీ లేదు. మళ్లీ మధ్యవర్తిత్వం నెరపే ప్రయత్నమూ లేదు. అణుశక్తి విషయంలో అడుగు ముందుకేసే ముందు గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పెంపొందించే పని, నియంత్రణ ఒకే చూరు కింద సంసారం చేయకూడదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ కామెంటేటర్ -
ఉపాధి పెంపునకు అవకాశాలెన్ని?
ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి భారత్‌లో అభివృద్ధికి నూతన మార్గాలుగా రూపొందినప్పటికీ ఉపాధి సృష్టి, సమానత్వ సాధనలో వ్యత్యాసాలు పెరగడానికీ కారణమయ్యాయి. ఆధునిక ఆర్థిక వృద్ధి లక్ష్యసాధనలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మధ్య వనరుల పునఃపంపిణీ ప్రక్రియను నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. చారిత్రకంగా, వివిధ దేశాలు ఈ నిర్మాణాత్మక మార్పులో భాగంగా రెండు దశలను చవి చూశాయి. వ్యవసాయ రంగం నుండి తయారీ; తయారీ రంగం నుండి సేవా రంగానికి శ్రామికుల బదిలీ. తక్కువ ఉత్పాదకతతో కూడిన ప్రాథమిక కార్యకలాపాల నుండి ఆధునిక, అధిక ఉత్పాదకతతో కూడిన రంగాల వైపు శ్రామిక, మూలధన, సాంకేతికత లాంటి వనరుల బదిలీ; ఉపాధి పంపిణీ, విలువ జోడించిన పంపిణీ, అంతిమ వినియోగ పంపిణీలో తయారీ, సేవా రంగాల వాటా అధికంగా ఉండటం; భౌతిక, మూల ధన కల్పన; గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వల సలు; జనన, మరణ రేట్లలో తగ్గుదల లాంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పునకు సూచికలుగా భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో 2011–12 తదుపరి కాలంలో ఈ నిర్మాణాత్మక మార్పులలో తగ్గుదలను గమనించవచ్చు.ఎందుకీ మందగమనం?గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగినప్పటికీ, ఉపాధిలో పెరుగుదల కనీసం రెట్టింపు కాలేదు. శ్రామిక మార్కెట్లో దృఢత్వం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, సమగ్ర ఆర్థిక విధానాలు అమలు చేయక పోవడం, ఆహారానికి సంబంధించి సాపేక్ష ధరలలో పెరుగుదల, పరపతి వృద్ధి తక్కువగా ఉండటం, తూర్పు ఆసియాలో మాదిరి వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాల వైపు శ్రామికుల బదిలీలు తక్కువగా ఉండటం, తక్కువ వేతనంతో కూడిన నిర్మాణ రంగం, అసంఘటిత రంగంలో ఉపాధిలో తక్కువ నైపుణ్యత కల్గిన అధిక శ్రామిక శక్తి కేంద్రీకృతం కావడం లాంటి అంశాలు భారత్‌లో నిర్మాణాత్మక మార్పు ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. సంస్కరణల అమలు కాలంలో నిర్మాణాత్మక మార్పు వేగంగా ఉండగలదని భావించినప్పటికీ సప్లయ్ వైపు వ్యవసాయ రంగాన్ని తయారీ రంగం అధిగమించినప్పటికీ, డిమాండ్ వైపు తయారీ రంగం వ్యవసాయ రంగాన్ని అధిగమించలేక పోయింది. తయారీ రంగ ఉత్పత్తి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతున్నప్పటికీ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ఉపాధి వృద్ధిలో ఆశించిన పెరుగుదల సంభవించలేదు.యువతలో ఉపాధిభారత్ మొత్తం జనాభాలో 15–29 వయో వర్గ జనాభా 27 శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో వీరి వాటా 26.9 శాతం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, యువతలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 5.7 శాతం నుండి 2023లో 10 శాతానికి పెరిగింది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన యువత తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2022లో యువతలో నిరుద్యోగిత భారత్‌లో 23.2 శాతం కాగా మొత్తం నిరుద్యోగం 7 శాతంగా అంచనా. అంత ర్జాతీయ శ్రామిక సంస్థ అంచనా ప్రకారం, 2023లో భారత్‌లోని మొత్తం గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 42.3 శాతం. నియంత్రణతో కూడిన శ్రామిక చట్టాల వల్ల సంఘటిత రంగంలో ఉపాధి తగ్గుదల, సేవారంగ ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం, ఆటోమేషన్ కారణంగా ఉపాధి క్షీణించటం; ఐటీ, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ లాంటి రంగాలలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రీకృతం కావడం, వివిధ అంశాలలో లింగ సంబంధిత అసమానతలు, నాణ్యతతో కూడిన శిక్షణ కొరత, నూతన సాంకే తికతకు అనుగుణంగా తగిన నైపుణ్యత శ్రామికులలో లేకపోవడం వంటివి నిరుద్యోగం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. వివిధ దేశాల అనుభవాలుమానవ మూల ధనం, సేవలు, నవకల్పనలపై అధిక పెట్టు బడుల ద్వారా సింగపూర్ శ్రమ సాంద్రత ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ స్థితి అధిక వేతనాలు, ఉపాధి నాణ్యత పెరుగుదలకు దారి తీసింది. వృత్తి విద్య, శిక్షణకు జర్మనీ ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో ఆధునిక తయారీ, అధిక నైపుణ్యత అవసరమైన సేవలలో ఉపాధి అవకాశాలు పెరి గాయి. చైనాలో నిర్మాణాత్మక మార్పులు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి కావడానికీ, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల పెరుగుదలకూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య లింకేజెస్ పెరగడానికీ దోహదపడ్డాయి. మలేషియాలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ప్రాథమిక వస్తువులపై ఆధారపడటం తగ్గి తయారీ, సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో మలేషియా అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆదాయ స్థిరీకరణ సాధించింది. దక్షిణ కొరియా, తైవాన్ నిర్మాణాత్మక మార్పుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల నుండి పారి శ్రామిక పవర్ హౌసెస్‌గా రూపాంతరం చెందాయి. తక్కువ ఉత్పా దకతతో కూడిన వ్యవసాయ రంగం నుండి అధిక ఉత్పాదకతతో కూడిన తయారీ రంగానికి శ్రామికుల బదిలీ ఆయా దేశాల ఆర్థిక సామర్థ్య పెరుగుదలకు దారి తీసింది.యువతలో ఉపాధి పెంపునకు చర్యలుభారత్లో ముఖ్య ఆర్థిక రంగాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం 2030 నాటికి యువతలో ఉపాధి వృద్ధి అధికంగా వ్యవ సాయం, దాని అనుబంధ రంగాలలో ఉంటుంది. ఈ రంగం నైపుణ్యత లేని, తక్కువ నైపుణ్యత కల్గిన శ్రామిక శక్తికి ఉపాధినందిస్తుంది. ప్రస్తుత ఉపాధి వృద్ధిని కొనసాగించడంతో పాటు, పెరుగు తున్న ఉపాధి డిమాండ్‌ను తీర్చాలంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల మందికి వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పించాలి. యువతలో ఆర్థిక అవకాశాలు మెరుగుపర్చడానికి ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌పై ఆసక్తి కనబరచే విధంగా వారిని ప్రోత్సహించాలి. 2022–23లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 13.4 శాతంగా నమోదైంది. ఉపాధి సామర్థ్య రంగాలైన డిజిటల్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, ఈ–కామర్స్; చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ఉన్నత విద్యలో పరిశ్రమల లింకేజ్‌ను పటిష్టపరచడం ద్వారా, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా కరికులంలో మార్పులు చేయాలి. నియంత్రణల సడలింపు ద్వారా ప్రైవేటు రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు యువతలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచ గలవు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికమైన నవ కల్పనలు యువతలో ఉపాధి క్షీణతకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో బ్లూ కలర్ ఉపాధి సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. శ్రమ సాంద్రత పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల ద్వారా తయారీ రంగాన్ని పటిష్ట పరచాలి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్చార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం.. .. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.:::సిమ్మాదిరప్పన్న -
నేపాల్ దారి అగమ్యగోచరం
నేపాల్‌లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ 1990లో ఏర్పడిన 35 సంవత్సరాల తర్వాత, రాచరిక వ్యవస్థ పూర్తిగా 2008లో రద్దయిన 17 సంవత్సరాలకు, ఆ దేశ భవిష్యత్తు ‘అగమ్యగోచరమేనా?’ అనే ప్రశ్న వేసుకోవలసి రావటం నిజంగానే విచిత్రమైన పరిస్థితి. గత సెప్టెంబర్ నాటి జెన్–జీ భూకంపం సృష్టించిన స్థితిగతులు, రేకెత్తించిన ప్రశ్నల కారణంగా దేశం ఈ దశలోకి ప్రవేశించింది.2008 వరకు ఒకవైపు రాచరికాన్ని, మరొకవైపు ప్రజాస్వామిక పార్టీల ద్వంద్వ పాలనను, 2008లో రాచరికం రద్దు తర్వాత నుంచి మధ్యేమార్గ పార్టీలు, సాధారణ కమ్యూనిస్టులు, మావోయిస్టుల పాలనను చూసిన యువతరం, దానికి మద్దతుగా నిలిచిన సమాజం కలిసి అగ్నిపర్వత విస్ఫోటనం వంటి తిరుగుబాటు చేశాయి. అనగా అది ప్రస్తుత తరపు తిరుగుబాటు. మరి ఈ తరం గడిచిపోయి మరొక 15–20 సంవత్సరాలకు కొత్త తరం ఉనికిలోకి వచ్చే సమ యానికి పరిస్థితి ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారణమైన పరి స్థితులు అప్పటికి మారుతాయా? మారగలవన్న హామీని ఇపుడున్న రాజకీయ పార్టీలు యువతరానికి, ప్రజలకు ఇవ్వగలవా?కనీసం ప్రశ్నించుకోని వైనంఈ ప్రశ్నలను ఇంతే సూటిగా అన్ని ప్రధాన పార్టీల నాయ కులను నేను అడిగాను. ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ఏ ఒక్క పార్టీ కూడా సెప్టెంబర్ పరిణామాల అనంతర కాలంలో ఈ ప్రశ్నలను తనకు తాను వేసుకోలేదు. ప్రశ్నలు వేయగానే అందరిలో కన్పించిన మొదటి స్పందన నా వైపు శూన్యంగా చూడటం. కొద్దిసేపటికి తేరు కుని స్పష్టాస్పష్టంగా కొద్ది మాటలేవో చెప్పటం. ప్రస్తుతం మిత వాదులు, మధ్యేమార్గీయుల నుంచి మావోయిస్టుల వరకు అందరూ తమను తాము కూడదీసుకోవటం, పార్టీలలో తలెత్తిన అంతర్గత సంక్షోభాలను, చీలిక అవకాశాలను నియంత్రించటం, చీలినవారు ఇతరులతో కలిసి కొత్త పార్టీలు ఏర్పాటు చేయటం, మార్చి 5న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడటం వంటి పనులలో తలమునకలై ఉన్నారు.మరొకవైపు చూడగా, తిరిగి అధికారంలోకి రావాలనే కోరికలో నైతే ఎటువంటి మార్పు లేదు. తిరుగుబాటు తరాన్ని ఎట్లా చల్లబరచటం, వీలైనన్ని జెన్–జీ గ్రూపులను తమ వైపు ఏ విధంగా ఆకర్షించటం, ప్రజలలో తమ పార్టీలకు ఉండిన సంప్రదాయికమైన నెట్వర్క్ ఇటీవలి పరిణామాల వల్ల చెదిరి పోకుండా తిరిగి ఎట్లా కూడదీయటమన్నవి అందరి ప్రాధాన్యాలుగా మారాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా అందరి నోటినుంచి దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు నిత్య పారాయణం వలె వినవస్తున్నాయి. అవి: జెన్–జీ ఆలోచనలూ, మావీ ఒకటే; వారి డిమాండ్లన్నీ సమంజసమైనవే; వారూ, మేమూ కలిసి పని చేయాలని భావిస్తున్నాము. అందరి మాటల సారాంశం స్థూలంగా ఇదే. ఇటువంటి మొక్కుబడి మాటలు బయటకు మాట్లాడటం తప్ప, తమవైపు నుంచి గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగవలసిన మార్పుల గురించి అంతర్గతంగా ఏ పార్టీ కూడా ఒక పద్ధతిలో చర్చించలేదని ఆ యా పార్టీల సీనియర్ నాయకులే నాతో స్వయంగా చెప్పారు.రాజకీయ శూన్యంజెన్–జీ గ్రూపులు కొన్ని ఇటీవలి వారాలలో వేర్వేరు పార్టీలతో చేరినా, అసలు పార్టీ నాయకులు, వారి తీరు, ఒకవేళ గెలిచినట్లయితే పరిపాలన ఎంతవరకు మారవచ్చుననే ప్రశ్నపై ఆ యువకులలో పూర్తి ఆశాభావం కన్పించటం లేదు. ఏ పార్టీతో చేరని గ్రూపులే ఎక్కువ. వాటి గురించి చెప్పనక్కర లేదు. అవి తమ వాదనలు, ఒత్తిడులు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. విషయం ఏమంటే, ఆ నాయకులు ఏమి చెప్తున్నా ఇప్పటికీ తిరిగి విశ్వాసం కలగటం లేదు. అందుకే ఇటీవలి ఒపీనియన్ పోల్‌లో ఏ నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. ఇందులోని విచారకర స్థితి ఏమంటే, స్వయంగా జెన్–జీ గ్రూపులు ఏకమై ఒక దేశవ్యాప్త పార్టీని ఏర్పాటు చేయటంగానీ, లేదా ఇపుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని పొందగల ఒక కొత్త పార్టీగానీ ముందుకు రాకపోవటం వల్ల రాజకీయంగా అతి పెద్ద శూన్యం కనిపిస్తున్నది. మొదటినుంచి గల పార్టీలు విశ్వాసాన్ని కోల్పోయి, అటువంటి కొత్త ప్రత్యా మ్నాయాలూ ఏర్పడనపుడు, సమస్యలూ, అసంతృప్తులూ అదే విధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, నేపాల్ దేశ భవిష్యత్తు ఏమిటి? ఆ స్థితి అగమ్యగోచరంగా తోస్తున్నదనటం అందు వల్లనే!పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానంగా కొద్దిమంది నాయకులు మాత్రం నాతో కొన్ని మాటలు అన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని పార్టీల అగ్రనాయకత్వాలు కూడా జెన్–జీకి, ప్రజలకు మూర్తీభవించిన విలన్లుగా కనిపిస్తున్నందున అందరూ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగి ఇతరులకు నాయకత్వం అప్పగించాలి. కొత్త కార్యవర్గాలలో యువకులకు భారీగా అవకా శాలు కల్పించాలి. నాయకులంతా అవినీతిని, బంధుప్రీతిని పూర్తిగా వదలుకోవాలి. అధికారంలోకి వచ్చినట్లయితే పారదర్శక పాలన, సమర్థవంతమైన పాలన, సమర్థులూ నిజాయితీపరులైన వారికి అధికారంలో స్థానం, వేగవంతమైన, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, యువతకు ఉపాధి అవకాశాలు అనే వాటిపై చిత్తశుద్ధి చూపగలమని ప్రకటించి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రస్తుత జెన్–జీ తరంగానీ, లేదా కొత్త తరం గానీ ఇంతకన్న తీవ్రమైన తిరుగుబాటు చేయగలదు. రాజకీయ పార్టీలకు ఇది చివరి అవకాశం వంటిది.కోల్పోయిన విశ్వాసంవీరు ఇట్లా అంటున్నట్లు బయట వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలతో నేను ప్రస్తావించాను. వారిలో ఒక్కరు కూడా ఆ మాటలను నమ్మలేదు. గతంలో పలుమార్లు ఈ తరహా మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. మరి భవిష్యత్తేమిటి? అది వారికీ అగమ్య గోచరంగానే ఉంది. నిజానికి రాచరిక వ్యవస్థలోనే బహుళ పార్టీల ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ కోసం 30 ఏళ్లపాటు తీవ్రమైన ఉద్యమాలు జరిపి సాధించిన నేపాలీ కాంగ్రెస్, సాధారణ కమ్యూనిస్టులూ సక్రమంగా పాలించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మావోయిస్టులు దశాబ్దంపాటు భీకరమైన పోరాటం సాగించి, కేవలం ప్రభుత్వానికి అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఇండియా ఆధునిక ఆయుధాలు సమకూర్చటం వల్ల, చివరి దశలో వెనుకకు తగ్గారు. అయినా ఇతరులతో కలిసి 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వామ పక్షాలే పాలించాయి. వీరి పాలన సవ్యంగా సాగినా ఈ విపత్తు ఎదురయేది కాదు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి 47 సంవత్సరాల పాటు విఫలమై, అందరికందరూ విశ్వాసాన్ని కోల్పోయినందునే, ప్రత్యామ్నాయ సృష్టి అయినా జరగనందునే, నేపాల్ భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వెనిజులా ముడిచమురుపై డేగకన్ను
అమెరికా చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఖర్చు బిల్లును 2026 సంవత్సరానికి గానూ 90,100 కోట్ల డాలర్లతో ప్రతినిధుల సభ ఆమో దించింది. లాటిన్ అమెరికాలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యయ బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే జూలైలో కేటాయించిన 15,600 కోట్ల డాలర్ల అనుబంధ సైనిక వ్యయ నిధులతో కలిపితే, 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడానికి అమెరికా మొత్తం లక్షా 5,700 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. ‘ఆపరేషన్ దక్షిణ గోళం’ పేరిట కరేబి యన్ ప్రాంతానికి ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లు, యుద్ధనౌకలను తరలించడం... 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత అతిపెద్ద సైనిక మోహరింపుగా పరిగణించవచ్చు. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను అణచివేసే ఇఎ18జి వార్జెట్లు ఇప్పటికే ప్యూర్టోరికో చేరు కున్నాయి.అమెరికా చూపు ఇప్పుడు వెనిజులాలోని అపారమైన ముడి చమురు నిల్వలపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 20 శాతం ముడిచమురు నిల్వలు (సుమారు 30,000 కోట్ల బారెల్స్) ఈ చిన్న దక్షిణ అమెరికా దేశంలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. గతంలో అధ్యక్షుడు ఛావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేసి, 2005లో భూసంస్కరణల ద్వారా సామాన్య రైతాంగాన్ని భూస్వాముల నుండి విముక్తి చేశారు. అదే ఏడాది 13 లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడి స్వల్ప ధరలకే ముడిచమురును అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. 2008లో బ్యాంకులను జాతీయం చేయడం, రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యాన్ని వెనిజులా తగ్గించింది. ఇవన్నీ అమెరికాకు మింగుడుపడని అంశా లుగా మారాయి.ప్రస్తుతం ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాదం’ ముసుగులో మదూరో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాషింగ్టన్ కుయుక్తులు పన్నుతోంది. ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే సంస్థతో వెనిజులా నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తుండగా, అధ్యక్షుడు మదూరో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వాదనలను తిరస్క రిస్తున్నారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.యుద్ధ తంత్రాన్ని అమెరికా మరింత క్రూరంగా మార్చి, నేరుగా భూభాగంలోకి సైన్యాన్ని పంపకుండా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో దాడులు చేసే వ్యూహంలో ఉంది. ఇటీవల డ్రోన్ల దాడిలో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. ఆయుధ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తోంది.గత నాలుగేళ్లలో ఉక్రెయిన్‌కు 17,000 కోట్ల విలువైన ఆయుధాలను, ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తూ అమెరికా తన యుద్ధ దాహాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమా సియాలో చమురు ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్‌ను అంగరక్షకుడిగా వాడుకున్నట్లే, ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. 1946 నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు సుమారు 35,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించిన అమెరికా, ఇప్పుడు సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వెనిజులాపై దాడికి సిద్ధమవు తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ సాగుతున్న ఈ యుద్ధ క్రీడలో వెనిజులా ఇప్పుడు బలిపీఠంపై ఉంది.– జమిందార్ బుడ్డిగఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
మయన్మార్‌లో ఎన్నికల తంతు
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.ప్రధాన రాజకీయ పార్టీ ఎన్ఎల్డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు. 2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది. అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.అదుపు సాధించని సైన్యంవేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్‌లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్‌యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్‌యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.భారత్‌కు భద్రతా సమస్యభారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్‌లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్‌తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.పాలు పోని ఇండియాసూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది. ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజల సొమ్ము పంచడమే బాబు సంస్కరణలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ దినపత్రిక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందించింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులు ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ పత్రిక ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రజానీకం, ఆర్థిక నిపుణులు కొందరు అంటున్నది ఏమిటంటే.. ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెడుతున్నందుకే ఈ అవార్డు అని! పైగా మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులున్నాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే.. సీఎం లేదా ప్రభుత్వంలో బాగా పలుకుబడి ఉన్న నేతలకు ఇలా అవార్డులు ఇస్తూంటారన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాదు.. ఈ మీడియా సంస్థలు ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున ప్రకటనలు తీసుకుని ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతూండటం గమనార్హం. ఎకనమిక్ టైమ్స్ అలా ఇచ్చిందా? లేదా? అన్నదానికి జోలికి వెళ్లడం లేదు. కాని ఈ పత్రిక గ్రూపు నిర్వహించిన ఒక సదస్సుకు ఏపీ ప్రభుత్వం రూ.కోటిన్నరతో పాటు రూ.27 లక్షలు జీఎస్టీగా చెల్లించడం విమర్శలకు కారణమవుతోంది. ఈ అవార్డు ఎంపిక కమిటీలో చాలామంది ప్రముఖులే ఉన్నారు. ఆయా సందర్భాల్లో వీరు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన విషయం బహిరంగమే. ఓకే కానీ... ఏ కొలమానాల ప్రకారం చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. 18 నెలల అధికార అవధిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా వచ్చిన పరిశ్రమలేవీ లేవు. మంత్రి లోకేశ్ వంటి వారు.. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తోనే బోలెడన్ని పరిశ్రమలు వచ్చేస్తాయని గొప్పలు చెప్పుకున్నా వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగానే ఉంది. కూటమి సర్కారు విశాఖపట్నంతోపాటు మరికొన్ని చోట్ల కొన్ని కంపెనీలకు ఎకర భూమి రూ.99 పైసలకే లీజు లేదా గంపగుత్తగా ఇస్తున్నా అవే కంపెనీలు హైదరాబాద్‌లో వందల కోట్ల రూపాయలతో భూములు కొంటున్నాయి. రహేజా వంటి సంస్థలకు అంత తక్కువ ధరకు భూములిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, వేల కోట్ల లాభాలు ఆర్జించే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు.. ఊరు పేరూ లేని ఉర్సా అనే కంపెనీలు ఈ చౌక బేరంతో లబ్ధి పొందాయి. చంద్రబాబు సన్నిహితుడిగా చెప్పే లూలూ మాల్ అధిపతి అహ్మదాబాద్‌లో రూ.519 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంటే విశాఖ, విజయవాడలలో కాణీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో భూమి పొందారు. విజయవాడలో వందల కోట్ల రూపాలయ విలువైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదాని డేటా సెంటర్‌కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు చూస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా? లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థలలో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి. అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం కాని, ఆ భూములవల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్ పాట్ వంటిదే. పరిశ్రమలకు భూమి, రాయితీలు ఇవ్వడం కొత్త కాదు.కాని ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటువారికే మేలు కలిగేలా ,వారికే సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే వ్యాపార సంస్కరణలు ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏమి చేయగలం? ఇవే కాదు.. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చి వందల కోట్ల విలువైన భూములు కేటాయించి, నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల సంపదను సృష్టిస్తే, వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చేస్తున్నారు. అయితే ఇది కూడా వ్యాపార సంస్కరణ అనే ఆ అవార్డు కమిటీ భావించిందేమో.ఆంధ్రప్రదేశ్ ప్రాథమికంగా వ్యవసాయాధార రాష్ట్రం. కాని అక్కడ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా పలుమార్లు రైతులు తమ పంటలను పారబోస్తున్నారు. చాలా సందర్భాల్లో వ్యాపారులకు ఈ పంటలు కారుచౌకగా దొరుకుతున్నాయి.రైతులేమో నష్టాల్లో కూరుకుపోతున్నారు. వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రైతుల సంక్షేమం కాంక్షించి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరు కార్చేయడంతో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. యూరియా కొరతను అదనుగా చేసుకున్న వ్యాపారులు అందినంత దండుకున్నారు. ఆ రకంగా వారికి చంద్రబాబు అంటే మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, వైద్య సామాజిక రంగాలలో జగన్ సంస్కరణలు తేగా, ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేటు సంస్థల దోపిడీకి వదలి వేసే విధానాలు తీసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయకుండా మొత్తం ప్రైవేటు బీమా కంపెనీల చేతిలో పెట్టడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలన సంస్కరణలు తెచ్చి ప్రజలకు పౌరసేవలను వారి ఇంటివద్దే అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్ని ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైమ్‌లో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధర అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానితో భేటీ అయిన వెంటనే దానికి ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంతేకాక సోలార్ పవర్‌ను యూనిట్‌కు రూ.మూడు కంటే ఎక్కువ ధరకు కొనడానికి సిద్దపడుతున్నారు. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదలి పెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతి సిమెంట్తోసహా మరో రెండు సిమెంట్ కంపెనీల లీజును కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా వ్యాపార సంస్కరణ అవుతుంది? ఏది ఏమైనా చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా? భయపడతారా? అన్నది చెప్పలేం. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులు, వ్యాపారులకు అణాకు, బేడాకు విలువైన రైతుల, ప్రభుత్వ భూములను కట్టబెట్టకుండా ఉంటే అదే పదివేలు అన్నది జనాభిప్రాయంగా ఉంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఐదు ముక్కల్లో జగన్ మార్కు అభివృద్ధి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు, ఆయన హయాంలో ఏర్పాటైన పారిశ్రామిక సంస్థల గురించి జరిగిన ప్రచారం ఒకటి.. అసలు వాస్తవం ఇంకోటి. ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు కోవిడ్-19తోనే సరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కొరత కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అడ్డంకి కానే కాలేదు. అన్ని ఇబ్బందులను అధిగమించి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో అందరి ప్రశంసలు అందుకుంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి జగన్ ఒక్కటొక్కటిగా పునాదులు వేస్తూ పోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి స్థూలంగా ఐదు ముక్కల్లో...1. భారీ పెట్టుబడులు..ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఐదేళ్ల కాలంలో ఆమోదం తెలిపిన పెట్టుబడులు ఏకంగా రూ.1.44 లక్షల కోట్లు. అంతేకాదు.. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో 17.5 గిగావాట్ల విద్యుదుత్పత్తికి అనుమతులు ఇవ్వడం ద్వారా రికార్డు సృష్టించింది. మిగిలిన రాష్ట్రాలు సౌర, పవన విద్యుత్తులకు మాత్రమే పరిమితమైతే.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్‌లో పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గ్రీన్కో సంస్థ సుమారు రూ.28 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సంప్రదాయేతర ఇంధన రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కోల్ ఇండియా, ఏఎం గ్రీన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కారణంగా గ్రీన్ అల్యూమినియం, హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యమైంది. ఎకోరెన్ గ్రూపు రూ.11 వేల కోట్లు అకార్డ్ గ్రూపు రూ.పదివేల కోట్లు, సెంచురీ ప్లైబోర్డ్స్ రూ.2600 కోట్లతో, ఆంధ్ర పేపర్ మిల్లు రూ.3400 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ రూ.1087 కోట్లు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు, విస్తరణలకు పెట్టుబడులుగా పెట్టింది కూడా జగన్ హయాంలోనే!2. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. 2023లో విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 340 వరకూ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి మొత్తం విలువ రూ.13 లక్షల కోట్లు. సుమారు 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఏర్పడింది. ఇదే సమ్మిట్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వర్చువల్ పద్ధతిలో రూ.3841 కోట్ల విలువైన పరిశ్రమలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిద్వారా సుమారు తొమ్మిదివేల ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జి.మోహన్ రావు (జీఎంఆర్ గ్రూపు), నవీన్ జిందల్ (జిందల్ స్టీల్ అండ్ పవర్), అదానీ గ్రూపు ప్రతినిధులు ఇతర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం గమనార్హం.3. పోర్టులు.. ఇతర మౌలిక సదుపాయాలు..సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్రాభివృద్ధికి మెట్టుగా మార్చాలని వై.ఎస్.జగన్ సంకల్పించారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన హాయంలో మచలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం పడింది. రికార్డు సమయంలో మచలీపట్నం పోర్టు పూర్తయ్యి 2023 మే నెలలో ప్రారంభమైంది కూడా. వీటితోపాటు అప్పటికే ఉన్న వైజాగ్, కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల ఆధునికీకరణ, విస్తరణ కూడా చేపట్టారు. ఫలితంగా 2022లో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది. ఆ ఏడాది దేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 38 శాతం! నౌకాశ్రయాల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పలు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి కూడా వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు. పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ ఎగుమతులు కేంద్రంగా విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటైతే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలను బెంగళూరు- చెన్నై కారిడార్లతో కలిపే ప్రయత్నం జరిగింది.4. పారిశ్రామిక విధానం..సంక్షేమం పునాదిగా.. పారిశ్రమలే చోదక శక్తిగా జగన్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతానికి కారణమవుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, పెట్రోకెమికల్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులు ఇచ్చేపద్ధతిని మొదలుపెట్టారు. వీటన్నింటి కారణంగానే ఆంధ్రప్రదేశ్ 2019-2024 మధ్యకాలంలో వరుసగా మూడేళ్లు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోగలిగింది. సంక్షేమ పథకాలకు పారిశ్రామిక ప్రగతికి ముడిపెట్టిన జగన్ రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసేందుకు పలు స్కిల డెవలప్మెంట్ కోర్సులను అమలు చేశారు. అపారెల్ పార్క్, ఆటో క్లస్టర్లను గ్రామీణ యువత, మహిళలకు నైపుణ్యాలను అందించే పథకాలకు జోడించారు. వీరిలో అత్యధికులు అమ్మ ఒడి, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లబ్ధిదారులే.5. పండుగలా వ్యవసాయం..2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం పండుగల మారింది. రైతు భరోసా ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఏటా రూ.13,500 పంపిణీ చేయడం మాత్రమే కాదు.. ఉచిత బోర్‌వెల్స్, సాగునీటి ప్రాజెక్టులు, పంట బీమా పథకాలు రైతు కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఎప్పటికప్పుడు రైతు అవసరాలను గమనించి తీర్చేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పదివేలకుపైగా రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వలసలు తగ్గాయి. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు కూడా రైతు పురోగతిలో తమ వంత పాత్ర పోషించాయి. పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి 774 కోట్ల డాలర్ల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అనితర సాధ్యుడు
ధరిత్రిలో చరిత్ర సృష్టించేవాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తుంచుకుంటుంది. సమ కాలీన భారత రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమా నమై నిలిచింది. ఆ తరంగం పేరే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునేది ‘జగన్’ అని! ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం – జగన్. అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్త్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు సమాజపు అట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్‌కే చెల్లింది. 125 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, ఛీత్కరించి తన అసామాన్య, అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయటం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది.ప్రియమైన వారసుడుమహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్యవిధాత అయిన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా అందర్నీ వీడి పోతే... ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధవీరుడు. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చేసి చూపిన యోధుడు.పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతి క్షణం వెనక్కి లాగుతున్నా, ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్‌ను అణిచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలిసిందే.మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడి పోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసు కున్నారు. తన తండ్రి కోసం తనువులు వీడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలవొగ్గి జగన్మోహన్రెడ్డికి గిరి గీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ.బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదనీ, తానే వారి దగ్గరికి వెళ్లి పలకరించడం భార తీయ ధర్మం, సంప్రదాయం అనీ ఆయన చెప్పినా అంగీకరించ లేదు సోనియా గాంధీ. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తలవంచడం తెలి యని జగన్, ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తనే స్వయంగా వెళ్ళటానికి నిర్ణయించి అడుగు ముందుకు వేశాడు. అది అభిమాన జనప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు, ప్రజా సముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజంమీద చేయి వేస్తూ ఉంటే, చేయి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, ‘నేను ఉన్నాను’ అని నమ్మకం ఇస్తూ ఉంటే, ఆంధ్ర ప్రజలు ఆప్యాయ తతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నా డని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడు, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు.అవిశ్రాంత యోధుడుజగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి, ప్రత్య ర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్ను కుట్టింది, వెన్ను జలదరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదికి కుట్రతో ఉరికిన కురు మూకల మాదిరి ప్రత్యర్థులు సోనియాగాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచు కోకున్నా సీబీఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బెయిలు కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్నా జగన్ మనోబలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయా లన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కుచెదరని అసాధారణ సాధనతో, మనో నిబ్బరం సడలని బలంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోద కాలు ఇచ్చి, కాడె పారేసి కదలి వెళ్లిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యం అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏ మాత్రం జంక లేదు. ఏ మాత్రం తొణకలేదు. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కదన రంగంలోకి కొదమ సింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం.అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు, చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు, ప్రజల పక్షాన నిలబడటం మానలేదు. ఆయనకు కావాల్సింది అధి కారం కాదు, జన క్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్ర బాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం, పేదల కోసం గళం ఎత్తుతూనే ఉన్నాడు.సహృదయ నాయకుడుజనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరొక చరిత్ర. తండ్రిలాగే తాను జనం మధ్యకు వెళ్లాలనీ, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలనీ, రైతుల గోడు వినాలనీ, నిరుద్యోగుల, ఉద్యోగుల, ఆడపడుచుల బాధలు వినాలనీ, ఓదార్చాలనీ, ధైర్యం చెప్పాలనీ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించినా కాదని ప్రజల కోసం ఎండనకా, వాననకా అడుగులు వేశాడు. కాళ్లు బొబ్బలు ఎక్కాయి, హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు, హత్యా ప్రయత్నం జరిగింది, ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజూ ఇరవై వేల మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం ఇస్తూ కదిలాయి ఆయన పాదాలు. ఆ పాదస్పర్శకు నేలతల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది.పేదలు, వృద్ధులు, రోగగ్రస్థులు, ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుళ్ళి రసి కారుతూ దగ్గరకు వెళ్ళటానికి జుగుప్స కలిగించే వారిని సైతం ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్ మోహన్ రెడ్డి గారిది. ముగ్గుబుట్ట వంటి తలా, ముడ తలు దేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతిదైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహి తంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే! అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు.అపూర్వమైన సంస్కారం ఆయనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ ‘అన్నా’ అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడూ ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచాడు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం. చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల. కన్నీటి కథలకు, వెతలకు, కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం.ఒకే ఒక్కడు2019 ఎన్నికలు వచ్చాయి. ఒక్కడే ఒకే దీక్షతో నారాయణ ధనుర్ముక్త బాణంలా జనంలోకి వచ్చాడు. పర్జన్య గర్జన్యం వంటి ఆయన వాక్కు హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలనీ, తన మ్యానిఫెస్టో తన ఖురాను, బైబిలు, భగవద్గీత అనీ, కడుపు నిండని పేద తన దేవుడనీ నమ్మి పరిపాలన సాగించాడు.తను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాడు మూడు పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్య మిచ్చాడు. వారి ఇంటి ముంగిటకే తీసుకువెళ్లి రేషన్ అందించాడు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభు త్వాన్ని వారి ఇంటి పక్కన నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, అదృష్టం. రెండు సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థికపరంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకమూ ఆగలేదు. ఏ నిరుపేదా ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యు లకు రెండు పూటలా ఆహార పొట్లాలు అందించాడు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకుని మూలన పడుకుంటే ప్రజలకు చేరువగా జగన్ ఉన్నాడు.ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటి సారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్. పేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా, లక్షల ఇళ్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థికసహాయం పథకం మరింత మెరుగు పరిచాడు. ప్రతి పేద పిల్లవాడూ చదువుకోవాలనీ, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలనీ ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించాడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాడు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు. పిల్లలను స్కూల్‌కు పంపితే చాలు... ఆ తల్లుల అకౌంట్లలో ఏటా రూ. 15 వేలు వేళకు ఇస్తూ, ‘అమ్మ ఒడి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక లాప్‌టాప్‌లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫాం అందించి, పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారన్న మాట, కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాలా నిజం. ప్రజలు కొనియాడిన సత్యం.ధీరోదాత్తుడుదేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరి గింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలు ఆడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామనీ, ఉచితాలు అందజేస్తామనీ, అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజ లను ఆశపెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరచి, మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకా లకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఏమీ అమలపరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహా నాయకుడిని మాయ మాటల వల్ల ఓడించి ఓడిపోయామని బాధపడుతున్నారు. అన్ని వర్గాల వారూ విలపిస్తున్నారు.గతంలో ఓడిపోయిన చంద్రబాబు మూడు సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే – ఓటమిని, ప్రజల తీర్పును, హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల కలంగా, గళంగా, బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తున్నారు, ప్రజలను మేల్కొల్పుతున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రెండేళ్లు కరోనాకు పోయినా, అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల హృదయాలలో, పేదల మనసులలో, సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు. నేత అన్న పదానికి అర్థం చెప్పిన ప్రజా సేవకుడు. ఓటమికి కుంగని ధీరోదాత్తుడు. ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడు. వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వర ప్రదాత, సహాయానికి సహస్ర హస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్ భాగ్యప్రదాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండటం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం... సమున్నత గర్వం.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
దీపం వివాదం ఓట్లు తెచ్చేనా?
2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వ్యూహరచనలో ఇప్పటికీ హిందూత్వమే అగ్ర భాగాన ఉంది. తిరుప్పరన్ కుండ్రంలో దీపం వివాదం అంతర్లీనంగా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది.బిహార్‌లో ఇటీవల ఘన విజయం సాధించిన బీజేపీ, 2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పెను సవాళ్ళనే ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ప్రాభవం కనిపించదు. తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే), పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి కూడా తమ సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తమిళనాట డీఎంకేతో సర్దుబాటు చేసుకుని, సంతృప్తి చెందేందుకే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ, బెంగాల్లో దానికి ఆ మాత్రం ఊతం కూడా లభించడం లేదు. అందులోనూ బిహార్‌లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను తోడు తీసుకెళ్ళేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. మరోపక్క బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ సమరానికి సై అంటోంది. ఒంటరిగానే సై!అయితే, బెంగాల్లో 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాలతో, ఇక ఆ తూర్పు రాష్ట్రాన్ని ‘జయించడం’ తనకు చిటికెలో పనిగా బీజేపీ భావించింది. తీరా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. మొత్తం 294 స్థానాల్లో 200 కైవసం చేసు కోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, 77 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, పోలైన ఓట్లలో 38 శాతం గడించి, ముఖ్య ప్రతిపక్షంగా అవతరించినందుకు కొంత సంతృప్తి చెందింది. ఈ గణాంకాలు అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా, బిహార్‌లో విజయఢంకా మోగించాక ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాల యంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘‘గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తుంది’’ అని ప్రకటించారు. అది ఏదో ప్రాసంగికంగా దొర్లిన విషయంలా లేదు. బెంగాల్ విపుల ప్రణాళికపై కార్యాచరణకు హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యూహరచనలో హిందూత్వమే ఇప్పటికీ అగ్ర భాగాన ఉంది. కానీ, పశ్చిమ బెంగాల్, తమిళ నాడుల్లో అది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. దీప ప్రజ్వలన వివాదంతిరుప్పరన్ కుండ్రంలో దీపం వెలిగించడానికి సంబంధించి ఇటీవల రేగిన వివాదం అంతర్లీనంగా ఆ అంశాన్నే ప్రతిబింబించింది. తమిళులు ‘మురుగా!’ అంటూ విపరీతంగా ఆరాధించే సుబ్ర హ్మణ్య స్వామికి చెందిన ఆరు పవిత్ర క్షేత్రాలలో తిరుప్పరన్ కుండ్రం ఒకటి. అక్కడి ఆలయానికి కొద్ది మీటర్ల దూరంలోనే సుల్తాన్ సికందర్ ఔలియా దర్గా ఉంది. చెదురుమదురు ఘర్షణలను మినహా యిస్తే అక్కడ కార్తీక దీపోత్సవం శాంతియుతంగానే సాగిపోయింది. కాకపోతే, దర్గాకు కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్న దీపత్తూన్గా పిలిచే ప్రాచీన స్తంభంపై దీపం వెలిగించేందుకు కోర్టు ఉత్తర్వు తెచ్చుకోవలసి వచ్చింది. దీపాన్ని వెలిగించే కార్యక్రమానికి అను మతి కోరుతూ మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనం ముందు ఈసారి పిటిషన్ దాఖలైంది. కోర్టు దీపారాధనకు అనుమతించడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరం చేసుకున్నాయి. కానీ, జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయడంతో, పోలీసులు వాటిని అమలుపరచవలసి వచ్చింది. ‘‘ఆశించిన ఫలితం సాధించడానికి హిందువులలో చైతన్యాన్ని రేకెత్తిస్తే చాలు’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య అవసరమైతే ఘర్షణకు దిగవలసిందని పరోక్షంగా సూచించి నట్లయింది. తమిళనాడు సాంస్కృతిక, మత సమ్మేళనాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీకి ‘ప్రాథమికమైన లోపం’ ఉందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘తమిళ నాడు ప్రజానీకానికి దైవభక్తి ఎక్కువ. కానీ, మతాన్ని రాజకీయా లతో మిళితం చేసి చూడరు’’ అని ఆయన అన్నారు. చిన్నాచితక ప్రాంతాల్లో తప్పించి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తమిళ నాడులో పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు లేవు. అయినా, అవి దీపారా ధనపై వివాదాన్ని నిలకడగా కొనసాగించగలిగితే, ఓటర్ల మనసును కొంత వరకు పట్టుకోవచ్చు. కానీ, తమిళనాడు రాజకీ యాలు చాలావరకు ద్రావిడ కళగం నాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి సిద్ధాంతాలతో ప్రభావితమైనవి. ఆయన చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమంలో ముస్లింలను కూడా దళితులుగా చిత్రించడం ఒక కీలకమైన అంశం. హిందూయిజంలో అంతర్లీనంగా ఉన్న కుల అణచివేత నుంచి తప్పించుకునేందుకు దళితులు ఇస్లాంలోకి మారారన్నది ఆయన సిద్ధాంతాలలో ఒకటి.ఓటుబ్యాంకుకు దెబ్బపశ్చిమ బెంగాల్లో టీఎంసీ వరుసగా మూడు విడతలుగా అధికారంలో ఉంది. ఆరోపణల తీవ్రతతో ఈసారి టీఎంసీ దుర్బల మైనదిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధేయులు పాల్పడినట్లుగా చెబుతున్న అవినీతి వాటిలో ప్రధానమైనది. అలాగే, కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వీధులకెక్కాయి. పాలక పార్టీకి చెందిన గూండాలు, దళారీలకు తృణమో పణమో చెల్లిస్తేనే పనులు అవుతాయనీ, రక్షణ లభిస్తుందనీ ప్రజలు చెబుతున్న దృష్టాంతాలున్నాయి. దాంతో, తాము వామపక్ష కూటమి పాలన నాటి రోజుల్లోకే తిరిగి వెళ్ళినట్లుందని వారు అంటున్నారు. అయితే, అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఒక రకంగా తానే చిక్కుల్లో పడింది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం వలస దారుల కన్నా హిందూ వలసదారుల సంఖ్యే ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల సునిశిత సవరణ (సర్) బీజేపీ ఓటు బ్యాంకు లోపల కూడా ఆందో ళనను రేకెత్తించింది. బెంగాలీ భాషను ఢిల్లీ పోలీసులు ‘బంగ్లాదేశీ భాష’గా పేర్కొంటూ మరింత అపకీర్తిని తెచ్చిపెట్టారు. హిందూ పూజారులకు నెలసరి జీతాలు చెల్లించడం, దుర్గా ఉత్సవాలను నిర్వహించడం వంటి చర్యల ద్వారా తనను ‘హిందు వుల ఆప్తురాలు’గా చిత్రించుకునేందుకు మమత గట్టిగానే కృషి చేస్తున్నారు. కానీ, హిందూత్వపై బీజేపీతో పోటీ పడటం ప్రతి పక్షా లకు ఇప్పటికీ కష్టమవుతోందని ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు బలమైన ప్రాంతీయ గుర్తింపుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చడానికి లేదు. అక్కడి ఓటర్లు హిందూత్వతో సునాయాసంగా మమేకమవుతారు. హిందూత్వ థీమ్‌లోకి భాష, సంస్కృతులను కూడా బీజేపీ ఈసారి అంతర్లీనం చేయ గలుగుతుందా? అన్నదే ప్రశ్న. వ్యాసకర్త: రాధికా రామశేషన్సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
దేవుడా... అలసిపోయావా?
అంతర్యామి అలసితి సొలసితి...అంటూ అన్నమయ్య నీరసంగా ఆపసోపలు పడుతూ పాడారే కానీ...ఇపుడు ఆ దేముడికే అలసట వచ్చిపడుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామికి క్షణం తీరిక దొరకట్లేదు. వేళాపాళ లేకుండా భక్తాదులు వచ్చి వాకిట నిలబడుతుండటంతో వారి ఆలనా పాలనా చూసుకోవాల్సిన పెనుబాధ్యత స్వామి వారి భుజస్కందాలపై ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అయినా భక్తులు దర్శనమీయాల్సిందే....మా మొర ఆలకించాల్సిందే అంటూ మొండికేస్తున్నారు. పైగా వడ్డీకాసుల వాడి చెంత ఉత్త చేతులతో ఎలాగూ పోలేరు...పాలకమ్మన్యులు పోనివ్వరు కూడా. పోనీ రాత్రి బాగా పొద్దుపోయాక కాసింత నడుం వాలుద్దామన్నా...కళ్ళు మూసి తెరిచేలోగా సుప్రభాత సేవలు షురూ అయిపోతున్నాయి. అంతలోనే అర్చకులు, భక్తులు కమలాకుచ చూచుక కుంకుమ...అంటూ శ్లోకాలు అందుకుం టున్నారు. స్వామివారు బిక్కమొగం వేసుకుని తన ఇరు దేవేరులను చూస్తూ భక్తులకు విసుగు కనిపించనీయకుండా ప్రసన్నచిత్తులై దర్శనమీవాలి. ఒక్కసారి గమనించండి దేముడికి ఎంత కష్టం వచ్చిందో.అందుకే సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఏంటసలు మీ తీరు...భక్తి సరే...భగవంతుడి మాటేంటి? స్వామి వారిని కనీసం నిద్రకూడా పోనివ్వరా? అనేక దంతం భక్తానాం అంటారా సరే..మరి కోట్లాది మంది భక్తులు నిరంతరం స్వామి చెంత నిలుచునుంటే...దేముడికి కాసింత పర్సనల్ స్పేస్ అక్కర్లేదా? కాసులకు కక్కుర్తిపడి గర్భగుడి తలుపులు వేళలు పాటించకుండా తెరిచేస్తారా? ఇది మీరు దేముడికి చేస్తున్న అపచారం కాదా? అంటూ బృందావన్ లోని బంకీ బిహారీ ఆలయ వ్యవహారంపై మండిపడింది. శక్తి కొద్ది భక్తి అన్నారు కానీ కరెన్సీ కొద్ది భక్తి అనలేదు కదా...మరి డబ్బున్న భక్తుల కోసం ఆ దేముడ్ని ఎందుకండీ ఇబ్బంది పెడతారు అంటూ సుప్రీం సీరియస్ అయ్యింది.బంకీ బిహారీ జీ ఆలయంలో పాలకుల తీరుతెన్ను చూసి మండిపోయిన ఓ భక్తాగ్రేసరుడు సుప్రీం చెంతకు చేరాడు. నాస్వామిని వీళ్ళందరూ రాచి రంపాన పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దర్శన వేళలతోపాటు ఆలయ సంప్రదాయాల్లో తెచ్చిన మార్పుల్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడంతో ...సుప్రీం స్పందించక తప్పలేదు. ఆలయవేళల్లో మార్పు చేయడంతోపాటు దెహ్రి వంటి పలు ముఖ్యమైన ఆచారాలను బంద్ చేశారని పిటిషనర్ వాపోయారు. పోనీలే కనీసం ఓ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడని బంకీ బిహారీజీ అమందానంద కందళిత హృదయారవిందులై ఉప్పొంగి పోయుంటారుఈ సమస్య ఒక బంకీ బిహారీజీ...వేంకటేశ్వస్వామీ...సింహాద్రి అప్నన్న సామిలదే కాదు. అసలే మనకు ముప్పది మూడు కోట్ల దేముళ్ళు. కానీ కొందరికే భక్త పరంపర హెచ్చుగా ఉంటుంది. దాన్ని మనం తర్కించలేం. భక్తుని కష్టాలు భగవంతుడికే తెలుసంటారు...మరి భగవంతుడి కష్టాలు భక్తులకు తెలుసా? కనీసం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతసేపూ సేవలకు సొమ్ముకట్టామా....కాయకొట్టామా....ముడుపులు వేశామా...కొండవీటి చాంతాడంత కోరికల లిస్ట్ స్వామి ముందుంచామా....ఇదే తప్ప...అరె స్వామివారికి మనవల్ల ఎంత మనస్తాపం కలుగుతుంది...అసలు వారికి విశ్రాంతి దొరుకుతోందా అని ఎప్పుడైనా అనుకున్నామా? ఇదేం చోద్యం దేముడికి రెస్ట్ కూడా ఉంటుందా అని కొందరు ఎగతాళి చేస్తుంటారు...మరి ఆ స్లీపింగ్ స్లాటే లేకుంటే...ఉయ్యాల సేవలు...నిద్రపుచ్చే పాటలు ఎలా వచ్చాయండి? అని మరికొందరు లా పాయింటు లేవదీసి మరీ వాదిస్తుంటారు.ఇక తిరుమల వేంకటేశ్వరుడు...వారి భక్తిసామ్రాజ్యం ఎంత సువిస్తారమో....అక్కడ రాజకీయాలు అంతకన్నా విస్తారం. గత వైకుంఠఏకాదశి పుణ్యదినం కోసం ఎందరు భక్తులు టికెట్ల రద్దీలో చితికి ప్రాణాలు వదిలేశారో మనకు తెలుసు కదా. అదే సమయంలో గరికపాటివారి వ్యంగ్య ప్రసంగం తెగ వైరల్ కాలేదూ. అసలు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యం దక్కుతుంది...ముక్తి ప్రాప్తమవుతుందని అశేష ఆస్తికమహాశయుల ప్రగాఢ నమ్మిక. అయితే శక్తి లేనివారిలో భక్తులుండరా? నీ కొండకు నీవే రప్పించుకో...ఆపదమొక్కలు మాతో ఇప్పించుకో అని ఘంటసాల ఎంత ఆర్డ్రంగా పాడారు. భక్తుడు రావాలా...లేదా తనే ఆతని వద్దకు వెళ్లాలా అని డిసైడ్ చేయాల్సింది భగవంతుడు. కానీ మన సర్కారు మహత్తరంగా...ప్రచారాలు చేసి మీకు మోక్షం దక్కాలన్నా...పున్నెం రావాలన్నా తెల్లారు జాము ఉత్తర దర్శనం తప్పని సరి అది ఈరోజే అంటూ ఊదరగొట్టినందుకే కదా తొక్కిసలాట...మరణాలు సంభవించింది. దీని పై సర్కారు స్పందన ఉండదు....కానీ లడ్డూలో కల్తీ అంటూ రాజకీయం చేయడానికి సిద్ధం. సాక్షాత్తు సుప్రీం కోర్టే సర్కారును నిలదీసి...తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రచారాలు ఎలా చేస్తారు? భక్తుల మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తన మహాప్రసాదం...భక్తులు భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించే లడ్డూపైన వివాదలు పుట్టించడం గమనించిన ఆ దేవదేవుడి మనసు ఎంత వ్యాకులత చెంది ఉంటుందో కదా. అయినా ఆలయాల్లో రాజకీయాలేంటి అని స్వామివారు చిరాకుపడ్డా ఇపుడు లాభం లేదు. ఎందుకంటే తిరుమల ఆ దశను దాటిపోయింది. అక్కడ ప్రతీది రాజకీయమే. దర్శనంతో మొదలు లడ్డూ దాకా...భక్తుని మొదలు పాలక మండలి దాకా అంతా రాజకీయమే. ఇంత జరుగుతున్నా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గట్లేదంటే అది స్వామివారి వైభవం...వైభోగం అంతే. ఒక తిరుపతే కాదు దేశంలో ఏ ఆలయమైనా భక్తులతో కిటకిటలాడుతునే ఉంటుంది. ఈ దేశంలో మనుషులతో కిక్కిరిసి కనిపించేవి రెండే రెండు...ఇకటి ఆలయం...రెండోది ఆసుపత్రి.ఏది ఏమైనా సుప్రీం జోక్యంతో అయినా బంకీ బిహారీ జీ ...తిరుపతి వెంకన్నలకు కాసింత ఊరట లభిస్తే అదే పదివేలు.:::ఆర్ఎం -
‘‘బాబుగోరు.. మీరు గుడ్డో గుడ్డూ’’
ఏది ఏమైనా బాబుగోరు మీరన్నా...మీ పాలన అన్నా చెవి కోసుకుంటా. అసలు మీలా పాలించేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? నాకైతే డౌటనుమానమే. గత ఎన్నికల్లో మీరు గొప్ప మనసు చేస్కొని మమ్మల్ని మీతో కలవనివ్వబట్టే కదా ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టా ...సెంటర్ లో మన సర్కారు నిలబెట్టా. మేం కూటమి అంటున్నామే కానీ అదంతా మీ చలవ కాకపోతే మరేందనుకుంటున్నారు. మీరు మాతో జట్టుకట్టబట్టే కదా ఈ పుణ్యం పురుషార్థం మాకు దక్కింది. అయినా బాబుగోరు మీ గొప్పతనం మీకు తెల్వదు... ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికక్కెడికో తీసుకెళ్లి పోతున్నారంటే నిజం నన్ను నమ్మండి..అసలు మీకున్న విజను...మీకున్న లిజను ఎవరికుంది చెప్పండి? కానీ విజన్ లేని వారికి ఏం తెలిసొస్తుంది చెప్పండి. ఒక్కోసారి వీరంతా ఎందుకొచ్చారా రాజకీయాల్లోకి అనిపించేస్తుందంటే నమ్మండి సుమండీ. అయినా కోటిజన్మల పుణ్యఫలం వల్లే కదా మీ స్నేహం మాకు దక్కింది. మీరాదరి మేమీ దరిని ఉన్నా....చెగువీరాను పూనిన ఆ అద్భుత వ్యక్తే కదా మనల్ని కలిపింది..లేదంటే మేమెంత ఒంటరి పక్షులమైపోయేవాళ్ళమో తలచుకుంటేనే గుండె తరుక్కుపోతుందంటే నమ్మండి సుమండి..అయినా ఎవరెవరో ఏదో అంటుంటారు...మనం అదంతా పట్టించుకోరాదు బాబుగోరు. అలా పట్టించుకుంటే రాజకీయాల్లో ఉండగలమా? అయినా నా చాదస్తం గానీ మీకు ఇవన్నీ కొట్టినపిండేగా. నిజమే అప్పుడెప్పుడో పాత ఎన్నికలప్పుడు మమ్మల్ని మీరు మనసారా దూషించారు. కానీ మీ తిట్లే మాకు దీవెనలని అనుకోలేదూ..అయినా బాబుగోరు మమ్మల్ని మీరు అప్పుడెంత దూషించారో...ఆ క్షణాన కాస్త కోపం వచ్చినా...మళ్ళీ మాతో కలవాలని మీరు పదే పదే కలవరించారు చూడండీ...అదీ మీ గొప్పతనం. మన మధ్య స్నేహబంధం నాగార్జునా సిమెంట్ కన్నా దృఢమైంది. కాకుంటే ఇన్నిసార్లు మీరు ఇన్నేసి మాటలన్నా...మళ్ళీ లటుక్కున వచ్చి మమ్మల్ని అతుక్కుపోయారు చూడండి...అబ్బబ్బా ఏమన్నా పొలిటికల్ విజనా మీది. .ఇక మీ సైనికుని గురించి ఏం చెప్పమంటారు...ఎంతని చెప్పమంటారు? ఇపుడు వారు మాకూ ఆంతరంగికులై పోయారు. అసలు వారిని మీరు బలే తయారు చేశారు బాబుగోరు. ఏ ఇజాలు తెలీకపోయినా...నిజాలు రాకపోయినా పర్వాలేదు పైకి మాత్రం గంభీరంగా ఎస్వీరంగారావులాగా తలూపుకొంటూ తిరుగుతుండాలి. ఆయన అచ్చం అలానే చేస్తున్నారాయే. మమ్మల్ని కలవక ముందు చెగువీరా అన్నారా...ఎర్రెర్రని జెండా ఎన్నీయల్లో... అని పాటలు కూడా పాడేశారా...ఇపుడు చూడండి నుదుటిపై ఇంతేసి బొట్టు పెట్టుకుని , కాషాయం చుట్టుకుని...నా ధర్మం...నేచూస్తా...నే కాస్తా అంటూ ఎర్రజెండా పట్టుకున్నోరిలా రంకెలు వేస్తున్నారు. అసలు మీ ట్రైనింగ్ ఇక్కడే కనిపిస్తోంది. నేను మారాను అని చెప్పకుండానే చేసి చూపిస్తున్నారు. జనాలు ఎలాగూ నమ్మరనుకోండి ...అది మా సిలబస్ కాదు కదా. చూశారా ఇదీ కదా సేవ..సారీ స్నేహధర్మమంటే..గత ఎన్నికల్లో మీతో కలిసి వెళ్ళడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నానని బలే ప్రచారంలో పెట్టారు బాబుగోరు. అయినా అన్నామో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక...దాందేముంది లేండి...ఆ ప్రచారం వల్ల మీరు కుషీ అయితే అదే పదివేలు. గిట్టని వారు అది అబద్దమంటారని పీల్ కాకండి బాబుగోరు. మనం మనం బాగుంటే చాలు కదా...ఏదో మీ తృప్తి కోసం అలా అన్నారే అనుకోండి...మరీ అంత ప్రచారంలో పెడితే ఎలా? వదిలేయండి బాబుగోరు...మీ విజన్ కు అది ఆనదు గాక ఆనదు. అదేదో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మెడికల్ కళాశాలలు ప్రైవేటు వద్దంటూ కోటి సంతకాలు చేయిస్తున్నారటగా... నిరసనలు కూడా చేస్తున్నారటగా...జనాలూ వస్తున్నారటగా...ఆ మీరు బెదరుతారా ఏంది? అయినా ప్రైవేటైజేషన్ అంటే మీకు ఎంత ప్రేమో మాకు తెలీదా ఏంటి? మేం కూడా విశాఖ ఉక్కును ఎవరికైనా అప్పగిద్దామనే కదా అనుకుంటున్నది....కానీ గట్టిగా అనరాదు వేరెవరూ వినరాదు...మన సర్కారుకు ఇంకా బోల్డంత టైముంది ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది...ఇదే కదా బాబుగోరు మీ మనసులో మాట....అరే మా మనసులోనూ ఇదే. కానీయండి అలా ముందుకెళదాం..సివారఖరికి మేము చెప్పొచ్చేదేంటంటే.. ప్రతిపక్షాలు కదా కాస్త ఘాటుగానే వ్యవహరిస్తుంటాయి. కానీ మనం కూడా తక్కువేం కాదుగా అంతకంతకు నాటుగానే ఉంటున్నాం. మీరు మాత్రం తగ్గేదేలా అన్నట్లుండండి. విజన్ అంటూ ఊదరగొట్టండి. అసలు జనాలు మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేక బిక్కమొగం వేసుకోవాలి. వారు తేరుకునేలోగా మన పుణ్యకాలం ఎలాగూ పూర్తయిపోతుంది. మరి ఆతర్వాతో అంటారా...సినబాబు చూసుకుంటారు లెండి. మన ప్యూచరేంటి అంటారా? నందో రాజో భవిష్యతి అనుకుని గ్లాసు నీళ్లు గటగటా తాగేయడమే. సరే మరి నేనుంటా మీరలాగే ముందుకు వెళ్ళిపోతూనే ఉండండేం.. పొరపాటున కూడా ఆగకండి.::ఆర్ఎం -
సంప్రదాయ ఫార్మసీలు నిలబడాలి!
ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఔషధ మార్కెట్‌పై గుత్తాధిపత్యం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ–ఫార్మసీ రంగంలోకి దిగుతున్నాయి. 2021 జూన్‌లో టాటా గ్రూప్‌కు చెందిన ‘టాటా డిజిటల్’ సుమారు రూ. 1,500 కోట్లతో ‘1ఎమ్జీ’ అనే ఈ–ఫార్మసీ స్టార్టప్‌లో 65% వాటాను కొనుగోలు చేసి, ఈ ప్రక్రియకు పునాదులు వేసింది. 2024లో సుమారు రూ. 28 వేల కోట్లుగా ఉన్న భారతదేశ ఆన్ లైన్ ఫార్మసీ మార్కెట్ విలువ 2025–2033 కాలానికి 16.65% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ను నమోదు చేస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సంప్రదాయ ఫార్మసీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలున్నాయి. ఆన్ లైన్ ఔషధాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తమిళనాడు డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ 2018లో దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, తరువాత ఆన్లైన్ విక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ–ఫార్మసీ డ్రాఫ్ట్ రూల్స్–2018’ని రూపొందించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో నమోదైన కేసులోనూ ఇదే డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తామని ఈ–ఫార్మసీలు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు వివిధ హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ ఆన్లైన్ విక్రయాలకు అనుమతించింది. రాబోయే ఈ–ఫార్మసీల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా ఈ–ఫార్మసీ సంస్థలు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన షెడ్యూల్–ఎక్స్ (నార్కోటిక్, సైకోట్రోపిక్, ట్రాంక్విలైజర్లు, ఔషధాలు) మాత్రం అమ్మడం లేదు. షెడ్యూల్–హెచ్ మందులను కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నాయి. ముసాయిదాలో చెప్పినట్టు ఎలక్ట్రానిక్ కాపీని నిల్వ చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేపు రాబోయే చట్టం ఈ–ఫార్మసీలకు మరింత సాధికారతను ప్రసాదించబోతుందన్నది సుస్పష్టం. ప్రజలు కూడా ఆన్లైన్ మందుల కొనుగోలుకు మద్దతునిస్తున్నారన్న విషయం అనేక పరిశోధన పత్రాలు రూఢి చేస్తున్నాయి.కరోనా మహమ్మారి తదనంతర కాలంలో ప్రజలకు విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగంలోకి రావడం, 30 నిమిషాల్లో హోం డెలివరీ వంటి సేవలు, ఈ–ఫార్మసీలోకి పెద్ద కార్పొరేట్లు ప్రవేశించడం, సంప్రదాయ ఫార్మసీల కన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వంటి అంశాలు అటు మిలీనియల్స్నూ, ఇటు జెనరేషన్ జెడ్నూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సంప్రదాయ ఫార్మసీలు ఆన్లైన్ బాట పట్టకపోతే వాటి మనుగడకు తీవ్రమైన ముప్పు తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ ఫార్మసీలు–కస్టమర్లకు అనుసంధానంగా నడుస్తున్న ఈ–ఫార్మా మార్కెట్ ప్లేస్ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలిస్తే మళ్లీ రిటైల్ ఫార్మసీ రంగం భద్రంగా ఉంటుంది. లేదంటే దేశంలో ఉన్న దాదాపు 10 లక్షల ఫార్మసీలలో పనిచేస్తున్న కోటిమందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.– శ్రీపాద రమణ ‘ ఔషధ రంగ నిపుణులు -
క్రైస్తవానికి పునాది లౌకికవాదం!
సమాజం లార్వా నుండి ప్యూపా రూపంలోకి, అటునుండి సీతాకోక చిలుకలా మారే ఒక నిరంతర ప్రక్రియలో ఉంటుంది. సమాజ గతి చలనం ఎన్ని సంస్కృతులు, ఎన్ని జాతులు, మతాలు, ఖండాలు ఏర్పడినా... అది ఒక సమూహంగా మనడానికి గతి మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని అనుభవ రీత్యా నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. కొన్ని శాస్త్రీయ పరిణామాలు ఉంటాయి. వీటన్నిటికీ కావాల్సిన ఫౌండేషన్ – ఒక బేసిక్ సోషల్ ఫ్యాబ్రిక్. అది సమాజం మొత్తానికీ ఉమ్మడిగా సమ్మతమైన మోరల్ కోడ్, సోషల్ కోడ్! ఇది వ్యక్తిగత అభిరుచులు, నమ్మకాలు, హక్కులకు అతీతంగా సామూహిక ప్రయోజనాల మీద నిలబడి ఉండాలి. లేనప్పుడు– వ్యక్తిగత హక్కులు, సామూహిక నిబంధనలకు లోనై– ఒక ఘర్షణ పూరితమైన, ఒక తిరోగమన సమాజానికి దారి తీస్తుంది. ఈ కోడ్ – సమానత్వం, సౌభ్రాతృత్వంతో సమ్మిళితమైన స్వేచ్ఛ కలిగి ఉండాలి. స్వేచ్ఛ పరిమాణం ఎంత అన్నది మరో ప్రశ్న. తిరిగి అది ‘ర్యాడికల్ ఇండివిడ్యువలిజం’ను ప్రేరేపిస్తే అది మరో తిరోగమన రూపాన్ని తీసుకుంటుంది. ఈ బ్యాలన్స్ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇప్పటికీ ఎవాల్వ్ అవుతూ ఉంది. అయితే – ఎంతో విపరీతమైన ఘర్షణ రూపంలో కొన్ని తిరోగమన సమాజాలలో ఎంతో రక్తపాతం తర్వాత వస్తుంది. అందుకే వీటన్నిటికీ కావాల్సిన సత్తా ఉండే సోషల్, మోరల్ ఫ్యాబ్రిక్– ఒక మతమే! మతం అంటే ‘కల్ట్’లా ఉండటం కాదు. రోజుకు ఎన్ని సార్లు పూజించాలి, ఏం బట్టలు కట్టాలి, మీసాలు ఎలా పెంచాలి... ఇలాంటి ‘రూల్స్’ మతాన్ని పోషించడం మొదలు పెడితే అది ‘కల్ట్’ అవుతుంది. ఆ ‘కల్ట్’ ఒక మూస పోసిన విధానంలో మను షులను సామాజిక సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు అతీతంగా తయారు చేస్తుంది. అటు నుండి ఒక పిడివాదం మొదలవుతుంది. అది ఒక ఫండమెంట లిజానికి దారి తీస్తుంది. దైవ విశ్వాసాలకు, సోషల్ లాజిక్కు సరిగ్గా కుట్లు వేసి అందంగా తీర్చగలిగేదే ఆదరించదగ్గ మతం అవుతుంది. దేవుడు ఒక సామాజిక అవసరం.ఒక మతానికి కావాల్సిన లిట్మస్ టెస్ట్ అంబేడ్కర్ చెప్తాడు: ‘మతం అన్నది ముఖ్యంగా నియమ సూత్రాలకు సంబంధించినది అయి ఉండాలి. ఎప్పుడైతే అది నిబంధనల చుట్టూ తిరుగుతుందో మతానికి ఉండాల్సిన సారమైన (సామాజిక) బాధ్యతను చంపేస్తుంది’ (‘కుల నిర్మూలన’ నుండి). మత ప్రాతిపదిక మీదనే–అంబే డ్కర్ ప్రగతి వాద కోణంలో మాట్లాడితే– దేవుడు ఈ ‘లిట్మస్ టెస్ట్’కు నిలబడలేని మనిషి/ ఆత్మ/ శక్తి అయితే ఆ దేవుడు నీతిమంతుడు కాలేడు. సమాజంలో ఒకరి అభిప్రాయాలకు, నమ్మకాలలో ఎన్ని తేడా, తారతమ్యాలు ఉన్నా... కలిసి ఒక సామూహిక ప్రయోజనాన్ని పండించడం కోసం ప్రజలు నడవడం ఈ రోజు సమాజానికి కావాల్సిన అత్యవసరమైన అంశం. యేసు క్రీస్తు యోహాను సువార్త గ్రంథంలో ఇలా అంటాడు: ‘నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు కూడ ఒకరిని మరొకరు ప్రేమించవలెను.’ అదే రకంగా మార్కు సువార్త గ్రంథంలో ‘నీవు నీ పొరుగువానిని నీలాగునే ప్రేమింపవలెను’ అంటాడు. ఇది సింపుల్‌గా కనిపించవచ్చు. కానీ చాలా డెప్త్ ఉన్న స్టేట్మెంట్. ఇక్కడ పొరుగు క్రైస్తవుడిని ప్రేమించ మని యేసు క్రీస్తు చెప్పలేదు. లేదా నాస్తికుడిని ప్రేమించవద్దు అని చెప్పలేదు. హంతకుడు, దొంగ ఎవరైనా సరే వాళ్ళను ప్రేమించవద్దు అని చెప్పలేదు. పది మంది కుష్టువాళ్ళను బాగు చేస్తే అందులో ఒక కుష్టువాడు మాత్రమే జీసస్‌ను ఫాలో అవుతాడు. ఆయన ‘ముందుగా నన్ను ఫాలో అయితేనే నిను బాగుపరుస్తా’ అనే కండి షన్ పెట్టి బాగుపరచలేదు. జీసస్ విధానం పూర్తిగా పక్షపాత రహితం, రాజకీయ స్వార్థాల నుండి దూరం, అందరినీ చేరదీసే స్వభావం, విశ్వమానవతా దృష్టి కలిగినది. ఆ అర్థంలో ఆయన ఆచరణలో ‘లౌకికత’ ఉంటుంది. ముగింపుగా – క్రిస్టియానిటీ ఎదగడానికి ప్రభుత్వ చట్టాలు అవసరం లేదు. క్రిస్టియానిటీ యుద్ధాలు చేసి ఎదగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే– క్రిస్టియానిటీకి మూలం సెక్యులరిజం!– పి. విక్టర్ విజయ్ కుమార్ ‘ రచయిత, విమర్శకుడు(క్రిస్మస్ ఆగమన కాలం సందర్భంగా) -
ఓపెన్ చెరసాల కాదు... అది ఉత్తమ కళాశాల!
నేను 1983లో నాగార్జున సాగర్‌లోని ఏపీ గురుకుల జూనియర్ కళాశాలలో సీటు దొరికిందని తెలిసి ఎంతో సంతోషించాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం. అలా ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జునసాగర్‌కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాలలో గడిపిన మూడేళ్ల రోజుల్ని ‘సెంట్రల్ జైలు’గా భావించిన నేను, ‘ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలులా ఉండొచ్చ’ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను.అయితే వారంలోనే అది ఓపెన్ చెరసాల కాదు, ఉత్తమ భవి ష్యత్ తయారీశాల అని అర్థమై గొప్ప ఊరట కలిగింది. ఆదివారంతో బాటు, పండగ సెలవొస్తే చాలు... విజయపురి సౌత్‌లో రామ కృష్ణ థియేటర్, అందులోంచి ఆట మొదలవ్వడానికి ముందు విని పించే ‘నమో వేంకటేశా ’పాట తెచ్చిన ఉత్సాహం, భాను వీడియో అంటూ బస్టాండ్ దగ్గర ఉన్న వీడియో థియేటర్, డ్యామ్‌కి అటు చివర మూడు కిలోమీటర్ల దూరంలోని హిల్ కాలనీ వరకూ క్రమం తప్పని పాదయాత్ర... అన్నీ నిన్నమొన్నటి విషయాల్లాగానే ఉన్నాయి. ఇక, మా సీనియర్లు ఎవ్వరూ ర్యాగింగ్ చెయ్యలేదు... కాకపోతే అందరినీ ‘సర్’ అని పిలవాలి. మా బోటనీ సర్ ఎప్పుడూ ‘ఇలాగే చదువు, నువ్వు డాక్టర్ అయిపోయినట్టే’ అంటూ ప్రోత్సహించే వారు. అభిమానం కనబడేది. రెండుసార్లూ టీచర్స్ డేకి నేను బోటనీ క్లాస్ తీసుకున్నాను (పిల్లలతో ఆ రోజు చెప్పించేవారు). క్లాస్ లాస్ట్‌లో ఆయన్ని అనుకరిస్తూ గొంతు మార్చి కామెడీ చేస్తే ఒక్కడు కూడా నవ్వలేదు. ఏమిటా అని చూస్తే ఆయన ఎప్పుడు వచ్చి కూర్చున్నారో తెలియదు కానీ లాస్ట్ బెంచ్ నుండి లేచి వచ్చారు. బిక్కచచ్చిన నన్ను ‘వెరీ గుడ్’ అంటూ కదిలిపోయారు. ఇంకోసారి ఇంగ్లీష్ సర్ దివాకర్ గారు బోర్డు వైపు తిరిగి క్లాస్ చెప్తుంటే ఏదో చిన్నతనపు అల్లరి చేశాం. ఆయన చూడలేదనుకున్నాం. కానీ ముద్దా యిలందరినీ లేపారు. నన్నులేపి ‘చేసిందంతా చేసి, ఎంత అమాయ కపు మొహం పెట్టావు రా నాయనా’ అని నవ్వేశారు. చాలా చిక్కని స్నేహాలు. అరమరికలు లేనివి. ఇంట్లోంచి తెచ్చు కున్న ఊరగాయలు, జంతికలు ఉమ్మడి ఆస్తి. కలిసి పోటీగా చదువు కోవడం, ఒకరి డౌట్లు ఒకరు తీర్చుకోవడం మాత్రమే కాదు... ఆట లైనా, పాటలైనా, షికార్లయినా, జట్లుగానే! రష్యా, ఉక్రెయిన్ స్థాయిలో గొడవపడినా రెండో రోజుకి సంధి కుదిరిపోవాల్సిందే. ఒక సారి సెలవులు ఇచ్చిన టైమ్‌కి వరదలు. ట్రైన్లు లేక బస్సుల్లో బయ లుదేరాం. అవి కూడా డైరెక్ట్‌గా లేవు. ఉత్తరాంధ్ర వాళ్ళం నలుగురం కలిసి రాజమండ్రి చేరుకున్నాం. ఎవరి దగ్గరా డబ్బులు మిగల్లేదు. అయినా భయం లేదు. అందులో రవిది వైజాగ్. ధైర్యం చెప్పాడు. ‘నా చేతికి వాచీ ఉందిరా, ఏం ఫరవాలేదు’ అని. బస్టాండ్‌లో ఒకా యన్ని పరిచయం చేసుకుని, పరిస్థితి చెప్పి మా నలుగురికీ టికెట్స్ తీయమని చెప్పాడు. తన వాచీ ఉంచుకుంటే, తర్వాత రోజు కలిసి డబ్బులిచ్చి రిటర్న్ తీసుకుంటానన్నాడు. ఆయన ‘అదేమీ వద్దులే ’ అని చెప్పి మాకు టికెట్స్ తీసి ఇచ్చాడు. మేం వైజాగ్‌లో రవి ఇంటికి చేరిపోయి, వారి ఆతిథ్యం పొంది, మరుసటిరోజు మా ఇళ్లకు చేరాం.ఇలా చెప్తూ పోతే బోలెడు. నా పేరు అచ్చులో చూసుకోవడం మొదటిసారి అక్కడే. ‘ఆశాజీవులు’ అని కవిత రాస్తే ఆ సంవత్సరం మేగజైన్లో అచ్చయింది. చదువుతో బాటు అందమైన అనుభవాలు, స్నేహాలు, జీవిత పాఠాలు మిగిల్చిన మా ‘ఏపీ గురుకుల జూనియర్ కళాశాల’ మా అందరికీ ఉన్నతి కలుగ జేసిన మేధా తయారీ శాల.– డా‘‘ డి.వి.జి. శంకరరావు ‘ పార్వతీపురం మాజీ ఎంపీ(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల ఆరంభమై రేపటికి 50 ఏళ్ళు) -
‘ఆత్మనిర్భరత’కు రష్యాయే ఆలంబన
భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు – విక్రేతకు మధ్య ఉండే వాటి కన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్‌వేర్ సమీకరించు కున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞా నాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఉక్రెయిన్‌పై యుద్ధం 2022లో మొద లెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల న్యూఢిల్లీకి రెండు రోజుల పర్యటనపై వచ్చి వెళ్ళడం ఇదే మొదటి సారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆతిథేయిగా వ్యవహరించిన ఈ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య చెక్కు చెదరకుండా నిలిచిన వ్యూహాత్మక భాగ స్వామ్యం ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో శ్రీకారం చుట్టుకున్న సహకారాన్ని ఉభయ దేశాలు కొన్ని దశాబ్దాలుగా పెంపొందించుకుంటూ వస్తున్నాయి.ఉక్రెయిన్‌పై యుద్ధానికిగాను రష్యా అధ్యక్షుడిని ఏకాకిని చేయా లని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు కోరు కోవడంతో ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి వ్యక్తమైంది. ఉక్రెయిన్‌పై యుద్ధ నేరాలకు సంబంధించి అంత ర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌కు అరెస్టు వారంట్లు జారీ చేసింది. అయినా ఘనంగా, సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పల కాలన్న భారత్ నిర్ణయంలో స్వీయ వ్యూహాత్మక ప్రాధాన్యముంది.రష్యా నుంచి చమురు దిగుమతులను, రక్షణ సామగ్రి కొను గోళ్ళను తగ్గించుకోవాలని అమెరికా నుంచి మనపై ఒత్తిడి పెరుగు తున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. తమ సంబంధాలు ‘బాహ్య ఒత్తిడులకు లోబడేవి కావు’ అని రెండు పక్షాలూ పునరు ద్ఘాటించాయి. ఉభయ సేనల మధ్య సాంకేతిక సహకారం ఒక ముఖ్య అంశంగా కొనసాగుతోందని సంయుక్త ప్రకటనలో నామ మాత్రంగా ప్రస్తావించి వదిలేశారు. రష్యా నుంచి వచ్చిన ఆయు ధాలు, ఇతర రక్షణ సామగ్రి నిర్వహణకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య క్రమం కింద టెక్నాలజీ బదలీ ద్వారా భారతదేశంలోనే స్పేర్ పార్టులు, పరికరాలు, చిన్నాచితక వస్తువులు, ఇతర ఉత్పత్తులను సంయుక్తంగా తయారు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. భారత సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు సంయుక్త సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించారు.భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు–విక్రేతకు మధ్య ఉండే వాటికన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్ వేర్ (మొదటి మిగ్ పోరాట విమానం, పెత్య/కమోర్త తరగతి నౌకలు, ట్యాంకులను) సమీకరించుకున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞానాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఆ విధంగా సోవియట్/రష్యా మూలాలున్న పరికరాలలో చాలా భాగం భారతదేశంలో ‘తయారైనట్లు’ పైకి కనిపించినప్పటికీ, అది చాలా వరకు దిగుమతి చేసుకున్న కిట్లు/కాంపొనెంట్ల కూర్పు నకు మాత్రమే పరిమితమైంది. ఆయుధాల ఫ్యాక్టరీలలో, లేదా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్.ఎ.ఎల్)లో సాగింది ప్రాథమికంగా విడి భాగాల అసెంబ్లింగ్ కలాపం మాత్రమే. రివర్స్–ఇంజనీరింగ్ లేదా దేశీయ డిజైన్ చేపట్టేందుకు జరిగిన కృషి అతి స్వల్పం లేదా అసలు ఏమీ లేదనే చెప్పాలి.చైనాతో పోల్చుకుంటే, డిజైన్ డొమైన్‌లోకి దిగడంలో అశక్తత /విముఖత కనిపిస్తుంది. సోవియట్ హయాం నాటి సైనిక సామగ్రిని చైనా ఎంతో విజయవంతంగా రివర్స్–ఇంజనీరింగ్ చేసి విజయం సాధించింది. సుఖోయ్ ఎస్ యు–27 ఫ్లాంకర్ ను ఆధారం చేసుకుని అది షెన్యాంగ్ జె–11యుద్ధ జెట్ విమానాన్ని అభివృద్ధి చేసింది. లైసెన్సు పొందిన ఉత్పత్తి ఒప్పందం కింద పీపుల్స్ లిబ రేషన్ ఆర్మీ 1990లలో రష్యా నుంచి సు–27 ఎస్కే యుద్ధ విమా నాలను సమీకరించింది. తర్వాత, రష్యా సరఫరా చేసిన కిట్లను ఉపయోగించుకుని, 2000ల మధ్య నాటికి ఆ విమాన రివర్స్–ఇంజ నీరింగ్‌లో సఫలమై జె–11ఎ విమానాలుగా తయారు చేసింది.సు–27 సోవియట్ యూనియన్‌లో 1970లలో డిజైన్ అయి, 1985లో సర్వీసులో ప్రవేశించింది. ఈ సోవియట్ టెక్నాలజీని మక్కికి మక్కి కాపీ కొట్టి చైనా జె–11 తయారు చేసుకుంది. డిజైన్‌లో సాధించిన ఈ పురోగతితో చైనా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకుంది. స్వయం సమృద్ధిని సమీకరించుకుంది. తర్వాత, ఇదే యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ (అదే పెద్ద కొనుగోలు దారు)కు విక్రయించింది.భారత్ మొదటి సుఖోయ్ సు–30ని 1997లో సమీకరించుకుంది. కానీ, దేశంలో అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా, దిగుమతు లపై ఆధారపడడం కొనసాగింది. యుద్ధ విమాన (రఫేల్) ప్రత్యా మ్నాయ సరఫరాదారుగా ఫ్రాన్స్ ముందుకొచ్చింది. పుతిన్ పర్యట నతో ఐదవ తరం సు–57 యుద్ధ విమానాలపై మళ్ళీ ఆసక్తి రేగుతోంది. భారత్ సోర్స్ కోడ్ యాక్సెస్‌ను, స్టెల్త్ ఉన్నతీకరణలను కోరుతోంది. దీన్ని సమీకరించుకోవడం వల్ల దేశీయ ‘తేజస్’కు ఏమైనా ఊతం చేకురుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కొన్ని నవీన రంగాలలో అమూల్యమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయాన్ని మాస్కో (సోవి యట్ యూనియన్‌గా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా) భారతదేశానికి సమకూర్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. క్షిపణులు, అణుశక్తి చోదిత జలాంతర్గత ప్రొపల్షన్ (ఐ.ఎన్.ఎస్. అరిహంత్) అందుకు నిదర్శనం. ఇక సంయుక్త రంగ బ్రహ్మోస్‌ది దిగ్విజయ మైన గాథ. తేలిక రకం బ్రహ్మోస్‌ను తయారు చేయడం ప్రస్తుత సమావేశ చర్చనీయాంశాలలో చేరింది. ప్రధాన సైనిక సామగ్రి డిజైన్, తయారీ పరిజ్ఞానం ఒక దేశాని కుండే వజ్ర వైడూర్యాల లాంటివి. ఇది అలమారాలో పెట్టి అమ్మే పరిజ్ఞానం కాదు. అందు కనే, భారత–రష్యాల మధ్య సైనిక సరఫరాలలో ఎంత పటిష్ఠమైన బంధం ఉన్నా డిజైన్ పరిజ్ఞానాన్ని పంచుకోవడమన్నది లేదు.ఆత్మనిర్భరతను వీలైనంత త్వరగా, పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్ళే దృఢ నిశ్చయాన్ని భారత్ కనబరిస్తే పుతిన్ పర్యటన తద నంతర ఫలాలపై ఆశ పెట్టుకోవచ్చు. నిజంగానే, రెండు దేశాలు రక్షణ రంగ పరిశోధన–అభివృద్ధిలో, వస్తూత్పత్తిలో సహకారముంటే మరింత ప్రగతిని సాధించవచ్చు. కానీ, ఈ విషయంలో భారత్ తొలగించుకోవలసిన సాలెగూళ్ళు చాలానే ఉంటాయి.మాస్కోకి కూడా ఢిల్లీతో గాఢమైన సైనిక సహకారం విషయంలో కొన్ని లక్ష్మణ రేఖలున్నాయి. అది బీజింగ్ సందేహాలను కూడా తీర్చవలసి ఉంటుంది. అదే మాదిరిగా, భారత్ కూడా రష్యాతో కలసి అడుగులేయడంలో అమెరికా పెడుతున్న తంపులను గుర్తెరిగి ప్రవర్తించవలసి ఉంటుంది. పుతిన్ పర్యటన ద్వైపాక్షిక స్నేహ సంబంధానికి మెరుగులు దిద్దింది. కానీ, రెండు దేశాలకూ కొత్త సవాళ్ళు కూడా ముందుకొచ్చి నిలుస్తున్నాయి. సి. ఉదయ భాస్కర్,వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ -
సంక్షోభంలో నేపాల్ పార్టీలు
జెన్–జీ అనూహ్యమైన తిరుగుబాటు ఉధృతితో నేపాల్ రాజకీయ పార్టీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయంటే అతిశ యోక్తి కాదు. పార్టీల నాయకత్వం, సిద్ధాంతాలు, జెన్–జీ రేకెత్తించిన ప్రశ్నలు, వారంటే ఇంకా కొనసాగుతున్న భయం – ఇట్లా అనేక విషయాలు ఒక్కుమ్మడిగా తుఫాను వలె కమ్ముకు రావటంతో పార్టీ అగ్రస్థాయి నాయకత్వాలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏమి చేయాలనే స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెన్–జీ ఆందోళన సెప్టెంబర్ ఆరంభంలో జరిగి, మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలలే మిగిలి ఉండగా ఇదీ పరిస్థితి.ఒక్కో పార్టీ... ఒక్కో సమస్యఅన్నింటికన్న పెద్దది అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా తొలగిపోవాలంటూ జాతీయ కౌన్సిల్ సభ్యు లలో 54 శాతం మంది నోటీసు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గగన్ థాపా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తూ, దేవుబా తప్పుకోనట్లయితే పార్టీని చీల్చగలమని హెచ్చరించారు. రెండవ పెద్దది అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ ఎంఎల్) అధ్యక్షుడు, ఉద్యమ కారణంగా పదవీభ్రష్టుడైన ప్రధానమంత్రి కె.పి. ఓలీ రాజీ నామా చేయాలని పట్టుబడుతున్న అసమ్మతి వర్గం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తీరాలని ఒత్తిడి చేసి ఒప్పించింది. మూడవ పెద్దది అయిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఉరఫ్ ప్రచండ, తనంతట తానే రాజీనామా చేసి, పార్టీని సైతం రద్దుపరచి, కొన్ని ఇతర వామ పక్షాలతో ఐక్యమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌ను ప్రారంభించారు. దానికి ఆయన సమన్వయకర్త మాత్రమే! ఆ తర్వాతది అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్య క్షుడు, ప్రచండ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండిన రాబీ లమీ ఛానే, ఒక కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలపై అరెస్టయి ఇటీవలే జైలుకు వెళ్లారు. తన పార్టీ స్తబ్ధతలో ఉంది. ప్రచండ తర్వాతి స్థానంలో ఉండి ప్రధానిగా కూడా పనిచేసి, తర్వాత నయాశక్తి పార్టీ ప్రారంభించిన జెఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి, రాచరికం పతనం తర్వాత ప్రజాస్వామిక రాజ్యాంగ రచనకు ఆధ్వర్యం వహించిన డా‘‘ బాబూరాం భట్టరాయ్, తమ పార్టీని రద్దు చేసి, మరికొందరితో కలిసి ప్రగతిశీల్ లోక్ తాంత్రిక్ పార్టీని నెలకొల్పారు. దానికి ఆయన ‘పార్టీ పేట్రన్’ మాత్రమే! రాచరికం తిరిగి రావాలి, లేదా కానిస్టిట్యూషనల్ మోనార్కీ కావాలనే హిందూవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ (ఆర్పీపీ)లో నాయకత్వ సమస్యలైతే తలెత్తలేదుగానీ, జెన్–జీ ఉద్యమ కారణంగా తెలిసీ తెలియని సవాళ్లు ఏవి ఎదురు కాగలవోనన్న అయోమయం వారిని ఆవరించింది.జెన్–జీ నేర్పిన పాఠాలేమిటి?ఇదంతా నాయకత్వాలు, పార్టీ నిర్మాణాల పరిస్థితి కాగా, ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు, లేదా ఇప్పటికే గల పార్టీలలో మరిన్ని చీలికలు, పునరేకీకరణలు, ఐక్య సంఘటనల ఆవిర్భావం జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయదలచుకునే పార్టీల రిజిస్ట్రేషన్ తొలి గడువు ముగిసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆ గడువును పొడిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన విషయం, జెన్–జీ గ్రూపులు కొన్నికొన్ని కలిసి ఇప్పటికే మూడు పార్టీలను ప్రారంభించాయి. మరి రెండింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెన్–జీలంతా కలిసి ఒకే పార్టీగా ఏర్పడక పోవటం పట్ల ప్రజలలో తగినంత నిరాశ కనిపిస్తున్నది.ఆందోళన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అన్నింటికన్న ముఖ్య మైన విషయాలు కొన్నున్నాయి. యువతరం ఆగ్రహం, ఆందోళన రాజకీయ పార్టీలకు ఇచ్చిన షాక్ ఎంత తీవ్రమైనది? దానినిబట్టి వారు తమ సిద్ధాంతాలు, విధానాలు, వ్యక్తిగత వ్యవహరణలలోని లోపాలను చిత్తశుద్ధితో గుర్తించి సమీక్షించుకున్నారా? లేక కొంత కాలానికి అంతా సమసిపోయి పాత పద్ధతులలో వ్యవహారాలు సాగించవచ్చుననుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు తటస్థులైన పరిశీలకులకు తోచటం అట్లుంచి, నేపాల్ సామాజికుల నుంచి కూడా విన్న నేను, వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ప్రశ్నలు వేసి వారి ఆలోచనలను గ్రహించేందుకు ప్రయత్నించాను.వారి సమాధానాలను బట్టి, మిశ్రమాభిప్రాయాలు కలిగాయి. వాస్తవానికి యువతరం లేవనెత్తిన విషయాల తీవ్రత, రెండు రోజుల పాటు అగ్నిపర్వతం వలె బద్దలైన నిరసనల తీవ్రతలను బట్టి పార్టీ లలో మిశ్రమాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ, కనిపించిందేమిటి? కొందరు నిజంగానే తమ వైఫల్యాలను గుర్తించారు. మావోయిస్టుల సాయుధ ఉద్యమం ఫలితంగా రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి, పూర్తి స్థాయిలో ఆధునిక పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 17 సంవత్సరాలుగా పరిపాలనలు సవ్యంగా సాగి ఉంటే, ఈ రోజున జెన్–జీకి గానీ, ప్రజలకు గానీ ఇంతటి అసంతృప్తికి అవ కాశం ఉండేది కాదని ఈ వర్గం అరమరికలు లేకుండా అంగీకరించింది. అవినీతి పోవటం, సమర్థమైన పారదర్శక పాలన, సామాజిక న్యాయంతో కూడిన వేగవంతమైన అభివృద్ధి అనే మూడు తప్పని సరి అనీ, అది జరగాలన్నదే జెన్–జీ తమకు నేర్పిన పాఠమనీ ఈ వర్గం అభిప్రాయపడుతున్నది. వేర్వేరు పార్టీలకు చెందిన వేర్వేరు నాయకుల మాటలు వేరైనా, వారి నుంచి సారాంశం ఇదే!అదే మొండి ధోరణిఇందుకు భిన్నమైన పరిస్థితి కూడా మరొకవైపు గమనించాను. వారు, 2008 నుంచి అభివృద్ధి తగినంత చేశామని లెక్కలు చెప్తు న్నారు. ఆ లెక్కలు నిజమే అయినా సమస్య ఏమంటే, 2008 తర్వాత ప్రజల ఆకాంక్షలకు, చదువులూ, నైపుణ్యాలూ గణనీయంగా పెరుగు తున్న యువతరం అవసరాలకు, నిజాయితీగా పరిపాలిస్తే సాధించ గలిగిన వాటికి పొంతన కుదరటం లేదు. ఇది చాలదన్నట్లు మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీల విచ్చలవిడి అవి నీతి! ఈ రెండవ వర్గం ప్రచారం, జెన్–జీ ఆందోళన వెనుక విదేశీ ఎన్జీఓలు ఉన్నాయని! తమకు గల పార్టీ యంత్రాంగం, డబ్బు బలంతో తిరిగి అధికారానికి రాగలమన్నది వీరి నమ్మకం. ఆందోళ నల వల్ల అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని ఓలీ ఈ ధోరణికి ప్రతినిధి కావటం విశేషం. ఆయన నేర రికార్డు గల వ్యక్తి ఆధ్వర్యాన ప్రైవేట్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు. ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్‌లో ఏ ఒక్క నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మార్చి ఎన్నికలలో ఏమయేదీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. 2008 నుంచి 17 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారిన తీవ్ర అస్థిరతల రికార్డు ఇప్పటికే ఉండగా, రాగల కాలంలో ఏమి జరగవచ్చునో ఊహించటం కూడా కష్టమే.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దిక్కుతోచని ఉక్రెయిన్
నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. నిజానికి 2022లో ఉక్రెయిన్‌కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు. ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్‌ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్‌కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి.


