మాధవ్ శింగరాజు
గెలవటం ఏముంది?! నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్లెవరైనా ఒక్క అంగలో గెలిచేస్తారు. కానీ గెలుపు కోసం పరుగు ఆపకపోవటమే నిజంగా గెలవటం! ఐదేళ్లయినా, పదేళ్లయినా, ఇరవై ఏళ్లయినా, గెలుపోటములను పక్కన పెట్టి ప్రజల కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుండే ‘అసాధారణ విజేతలు’ ఏ కొద్దిమందో ఉంటారు. ఎమ్మెల్యేగా నాలుగు సార్లు, ఎంపీగా మూడు సార్లు... నేను గెలుపెరుగని పోరాటం చేశాను. అసాధారణ విజయం ఇది. అసాధారణ విజేతను నేను. భారత ఎన్నికల కమిషన్ అనొచ్చు, ‘‘ఎన్నికల్లో విజేతలు మాత్రమే ఉంటారు. మీరంటున్న అసాధారణ విజేతలు ఉండరు’’ అని! అందుకు ఎన్నికల కమిషన్ చెప్పే లెక్క ఇలా ఉండొచ్చు– ‘‘మైలాపూర్ నియోజక వర్గంలో టీవీకే నుంచి పి.వెంకట రమణన్, డీఎంకే నుంచి ధా.వేలు, బీజేపీ నుంచి మీరు, నామ్ తమిళర్ కచ్చి నుంచి అరుణ్ అయ్యంగార్ పోటీ చేశారు. వెంకట రమణన్‌కు 70,070 ఓట్లు, ధా.వేలుకు 41,098 ఓట్లు, మీకు 32,328 ఓట్లు, మీ తర్వాత అరుణ్ అయ్యంగార్‌కు 4,499 ఓట్లు వచ్చాయి. కనుక వెంకట రమణన్ మాత్రమే విజేత అవుతారు. మిగతా వారు పరాజితులు అవుతారు. అంతే తప్ప అసాధారణ విజేతలు అవరు’’ అని ఎన్నికల కమిషన్ అనొచ్చు.
కమిషన్ దగ్గర ఓట్ల లెక్కలు మాత్రమే ఉంటాయి. ఆగని పరుగుల లెక్కలు, వెనక్కి వేయని అడుగుల జాడలు ఉండవు. 2006లో రాధాపురం నుంచి నా పరుగు మొదలైంది. అక్కడి నుంచి నార్త్ చెన్నై (2009), అక్కడి నుంచి వేలచ్చేరి (2011), అక్కడి నుంచి విరుగంపాక్కం (2016), అక్కడి నుంచి తూత్తుకుడి (2019), అక్కడి నుంచి సౌత్ చెన్నైల (2024) మీదుగా... మొన్నటికి మైలాపూర్ (2026). రాధాపురం, వేలచ్చేరి, విరుగంపాక్కం, మైలాపూర్ అసెంబ్లీ ఎన్నికలు; నార్త్ చెన్నై, తూత్తుకుడి, సౌత్ చెన్నై లోక్‌సభ ఎన్నికలు – మొత్తం ఏడు ఎన్నికలు... ప్రజల కోసం పరుగులు తీస్తూనే ఉండే అసాధారణ విజేతగా నన్ను నిలబెట్టాయి. ‘‘కానీ, అక్కా... మీరు అంత పెద్ద పోస్టును కూడా వదులుకొని ఎన్నికల్లో పోటీ చేయటానికి వచ్చేశారు కదా, అది కరెక్టేనా?’’ అంటుంటారు పార్టీ కార్యకర్తలు. ‘‘అంత పెద్ద పోస్టు!’’ అని వారు అంటున్నది నేను వదిలేసి వచ్చిన గవర్నర్ పదవి గురించి! తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఐదేళ్ల కాలం పూర్తి కాకుండానే తిరిగి నేను ప్రజల దగ్గరకు వచ్చేయటానికి నాకు నేనుగా పరుచుకున్న రెడ్ కార్పెట్ అది.
మనసు ప్రజల కోసం ఆరాట పడుతున్నప్పుడు, రాజ్యాంగం ఎంతకాలమని ఒక మనిషిని రాజ్ భవన్‌లో బంధించి ఉంచుతుంది? నా దృష్టిలో గవర్నర్ కన్నా పెద్ద పోస్టు... ‘కార్యకర్త’ హోదా! వరుసగా ఏడుసార్లు ఓడిపోయిన వాళ్లకు ఈ భూమి మీద జీవించే హక్కు లేదన్నట్లే మాట్లాడుతుంటారు నా రాజకీయ ప్రత్యర్థులు! మరి, గెలిచాక ప్రజల మధ్య ఉండని వాళ్లకు ఏ స్వర్గంలో జీవించే హక్కు ఉంటుంది?! నా చేతిని అందుకోవటానికి ఒక్క చెయ్యీ ముందుకు రానప్పుడు, ఒక్క హృదయాన్నైనా నేను స్పృశించలేక పోయినప్పుడు... అప్పుడు కదా నిజంగా నేను ఓడిపోవడం!! వరుసగా ఏడుసార్లు ఓడిపోవటానికి, వరుసగా ఏడుసార్లు గెలవటానికి ఉండే ఒకే ఒక్క తేడా... సభలో ఒక సీటు వరుసగా ఏడుసార్లు ఖాళీగా ఉండటం లేదా సభలో ఒక సీటు వరుసగా ఏడుసార్లు ఖాళీగా లేకుండా ఉండటం మాత్రమే. సీటు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏడేడు కాలాలు స్థిరంగా ఉండేది... ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పబలం ఒక్కటే. ఆ బలమే నన్ను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పుడిక నా దిశ 2029 లోక్ సభ ఎన్నికలు!


