ట్రంప్‌కు కళ్లెం వేసే మార్గమేమిటి? | Sakshi Guest Column On USA Donald Trump, Israel Iran War Issue | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు కళ్లెం వేసే మార్గమేమిటి?

Apr 16 2026 12:31 AM | Updated on Apr 16 2026 12:31 AM

Sakshi Guest Column On USA Donald Trump, Israel Iran War Issue

విశ్లేషణ

ఇరాన్‌తో 12వ తేదీన జరిగిన చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన గమనించదగ్గది. చాలా అంశాలలో ఇరాన్‌తో ఏకాభి ప్రాయం కుదిరిందనీ, అణ్వాయుధాల తయారీని ఆపటంపై వారు పట్టుదల విడవలేదనీ, అందుకే చర్చలు విఫల మయ్యాయనీ అన్నారు. వారికి అణ్వస్త్ర ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ దక్కనివ్వ బోమని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులలో ప్రపంచ నాయ కుల స్పందనలను గమనించగా, ఆయన మాటలను ఎవరూ విశ్వ సించటం లేదని అర్థమవుతున్నది. చర్చలు, ఒప్పందాల విషయమై తమను లోగడ రెండుసార్లు మోసం చేసిన ఆయన ఈసారి కూడా తమ విశ్వాసాన్ని పొందలేకపోయారన్న ఇరాన్‌ వ్యాఖ్యలు సరేసరి!

ఒప్పందం రద్దు ట్రంప్‌ పుణ్యమే!
చర్చల మినిట్స్‌ అందుబాటులో లేనందున అణుపరిశోధనలు, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల ఉత్పత్తి విషయమై నిర్దిష్టంగా ఎవ రేమి అన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ కీలకమైన అంశంపై చర్చలకు ముందూ, తర్వాతా ఎవరేమన్నారో తెలిసిందే. అదే విధంగా గతంలో జరిగిందేమిటో కూడా. వాటన్నింటిని పరి గణనలోకి తీసుకున్నప్పుడు, ఇస్లామాబాద్‌ చర్చలు విఫలం కావటా నికి కారణం ట్రంప్‌ వైఖరి అని తేలికగా అర్థమవుతుంది. అందుకే ఆయనకు మిత్రదేశాల నుంచి కూడా మద్దతు లభించటం లేదు. 

ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు, యురేనియం శుద్ధి విష యమై ఇరాన్‌కు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం గల అమె రికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లతో పాటు జర్మనీకి మధ్య 2015 లోనే ఒప్పందం జరిగింది. దానిని ‘జాయింట్‌ కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌’ అన్నారు. దాని ప్రకారం ఇరాన్‌ శాంతియుత అవస రాల కోసం యురేనియంను 3.67 శాతం వరకు శుద్ధి జరపవచ్చు. అణ్వాయుధాల తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం. ఈ శుద్ధి కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్‌స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయవచ్చు.

ఆ ప్రకారం 2015 నుంచి 2018 వరకు సజావుగానే సాగుతుండిన ఒప్పందాన్ని ట్రంప్‌ తన మొదటి హయాంలో ఆకస్మికంగా రద్దు చేయటంతో సమస్యలు మొదలయ్యాయి. అట్లా రద్దు చేసినా తమ వైపు నుంచి కొంతకాలం పాటు ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండిన ఇరాన్, ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకోక పోవటంవల్లనే యురేనియం శుద్ధి స్థాయిని 60 శాతం వరకు తీసుకువెళ్లి ఆపింది. అణ్వస్త్ర తయారీ మాత్రం తమ అజెండాలో లేదని అయతొల్లా ఖమేనీ ఫత్వా సైతం జారీ చేశారు. 

అటువంటి ఆయుధాల ఉత్పత్తి ఇస్లాంకు విరుద్ధమన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే గాక, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ముందు రోజు లలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఒమాన్‌ మధ్యవర్తిత్వం ద్వారా తిరిగి చర్చలు, అవి దాదాపు ఒక కొలిక్కి రానుండగా దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యాన్నంతా గుర్తు చేసుకోవటం ఎందుకంటే, అణ్వస్త్రాలను ఆపటమే తమ అత్యంత ప్రాధాన్య లక్ష్యమనీ,అందుకు ఇరాన్‌ కలిసి రానందునే చర్చలు ముందుకు సాగలేదనీ ట్రంప్‌ వాదించబూనటం తెంపరితనం మాత్రమే అవుతుంది. ప్రపంచం అందువల్లనే ఆయనను నమ్మటం లేదు.

దిగ్బంధనం– గందరగోళం
ఇస్లామాబాద్‌ చర్చలకు ముందే ఇరువురు తమ తమ షరతులు ప్రకటించారు. అవి ఇంచుమించు గత నెల షరతుల వంటివే. అయి నప్పటికీ, రాజీ అంటూ జరగాలి గనుక చర్చల సమయంలో కొంత పట్టువిడుపులు ఉంటాయనే భావన కలిగింది. ఇటువంటి దౌత్య చర్చలు ఎపుడైనా పలు విడతలుగా సాగుతూ క్రమంగా కొన్ని రాజీ లతో అంతిమ ఒప్పందం జరుగుతుంది. ఈసారి కూడా చర్చలు 21 గంటలపాటు సాగిన తర్వాత, రాగల రోజులలో తిరిగి చర్చలు ఉండగలవనే సంకేతాలు రెండు దేశాల ప్రతినిధుల నుంచి వినిపించాయి. కానీ, ‘ఖలునికి నిలువెల్ల విషముగదరా సుమతీ’ అన్నట్లు తన నిలువెల్ల ‘ఆయుధాలు, సైనిక బలం’ అన్న మిడిసిపాటు తప్ప దౌత్యనీతి అనే మాటకు చోటులేని ట్రంప్‌ మాత్రం వెంటనే హార్మూజ్‌ దిగ్బంధం అంటూ హెచ్చరించటంతో ఆగక, దిగ్బంధనం కోసం తమ నౌకా దళాలకు ఉత్తర్వులు జారీ చేశారు.

దానితో ఇరాన్‌ లొంగి వస్తుందని ఆయన అంచనా వేసిన ట్లున్నారు. కానీ, జరిగిందేమిటి? ప్రపంచమంతటా చమురు ధరలు పెరిగి, స్టాక్స్‌ పడిపోయాయి. చర్చలు నెరవేరగలవన్న ఆశాభావా లతో తగ్గిన చమురు, పెరిగిన స్టాక్స్, ఆయన పుణ్యమా అని తిరిగి గందరగోళంలో పడ్డాయి. నిజానికి హార్మూజ్‌ ద్వారా రవాణా అయ్యే చమురు, ఇతర సరకులు అన్నీ ఇరాన్‌వేమీ కాదు. అరబ్‌ దేశాలవి, బయటి దేశాలవి కూడా గణనీయంగా ఉన్నాయి. అది తర్వాత బోధ పడి కావచ్చు, మొత్తం హార్మూజ్‌ను కాకుండా ఇరాన్‌ రేవులను మాత్రమే దిగ్బంధిస్తామన్నారు. అందుకు ఇరాన్‌ తాము ఆ ప్రాంతంలోని అరబ్‌ రేవులన్నింటిపై దాడులు జరపగలమని హెచ్చరించింది. ఆ జలసంధిలో మైన్స్‌ మరొకవైపు ఉండనే ఉన్నాయి. ఈ హెచ్చరిక లతో మళ్లీ గందరగోళం మొదలైంది.

చట్టాలకు లోబడేట్టుగా...
ఒప్పందాలు, ఒప్పంద చర్చలను ప్రతిసారీ భంగపరుస్తున్న ఇజ్రాయెల్‌ ఈసారి కూడా ఆ పని చేస్తుండటం మొదటినుంచీ కనిపించిందే. యుద్ధ విరమణ లెబనాన్‌కు సైతం వర్తించాలన్న షర తును ఇరాన్‌ మొదటనే విధించగా, అందుకు ట్రంప్‌ పాకిస్తాన్‌ ద్వారా సమ్మతి తెలిపారు. కానీ ఇజ్రాయెల్‌ తమకు దానితో నిమిత్తం లేదంటూ దాడులు కొనసాగించగా, ట్రంప్‌ కూడా అది వేరే అంశమంటూ వాదించారు. చర్చలపట్ల ట్రంప్, నెతన్యాహూల ఆంతరంగిక ఆలోచనలకు అద్దంపట్టిన విషయాలలో ఇదీ ఒకటి. అందుకు తగినట్లుగానే  ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తుండగా, మధ్యవర్తి పాకిస్తాన్‌ చేష్టలుడిగి మిన్నకుంటున్నది.

అసలు వాస్తవం ఏమంటే, అమెరికాకు గానీ, ఇజ్రాయెల్‌కుగానీ ఇరాన్‌ అణు పరిశోధనలు వట్టి సాకు మాత్రమే. అమెరికాకు కావలసింది అక్కడ ఒక సామంత రాజ్యాన్ని నెలకొల్పి చమురు నిల్వలు తమ అధీనంలోకి తెచ్చుకోవటం. వెనిజులా వలెనే ఇరాన్‌ చమురు గురించి స్వయంగా ట్రంప్‌ చెప్పిందే. ఇజ్రాయెల్‌కు కావలసింది గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ ఏర్పడి, ఆ ప్రాంతంలో ఇరాన్‌ ఒక శక్తిగా మిగలక పోవటం. ప్రపంచమంతా ఇప్పటికే గుర్తించిన ఈ వాస్తవాలు తిరిగి రుజువవుతున్నాయి.

ట్రంప్‌ అరాచకానికి కళ్లెం వేయగల మార్గం ఒకే ఒకటి కని పిస్తున్నది. ఇది ఇట్లానే అందరినీ చుట్టుముట్టరాదంటే రష్యా, చైనా,  యూరోపియన్‌ యూనియన్, ఇండియా, ఆసియాన్‌ కూటమి, ఆఫ్రికన్‌ యూనియన్, బ్రెజిల్‌ వంటి దక్షిణ అమెరికా దేశాలు కలిసి, అమెరికా పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఐక్యరాజ్యసమితి ద్వారా మాత్రమే వ్యవహరించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఒక నిర్ణీత వ్యవధిలో అందుకు అంగీకరించనట్లయితే అమెరికా, ఇజ్రాయెల్‌లతో దౌత్య సంబంధాలు రద్దు చేసుకోకున్నా, సస్పెండ్‌ చేయగలమని హెచ్చరించాలి.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement
 
Advertisement
Advertisement