మాధవ్ శింగరాజు
పనంటే పూర్తయ్యేది కాదు. మొదలయ్యేది! ఇది మానవజన్మ సుకృతమా, లేక, మోదీజీ నాయకత్వానికి మాత్రమే పరిమితమైన శ్రమైక జీవన సౌందర్యమా?! ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్. ఆ రోజుతో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలూ పూర్తయినట్లు. ఎన్నికలు ‘పూర్తవడం’ అన్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కే గానీ, భారతీయ జనతా పార్టీ చీఫ్‌కి కాదు. పనితో మొదలై, మళ్లీ పనితోనే మొదలయ్యే ఆదీ అంతమూ లేని పదవీ కాలం బీజేపీ అధ్యక్షుడిది. అధ్యక్షుడిదే కాదు, పైనుంచి కింది వరకు పార్టీలోని ప్రతి కార్యకర్తదీ. జనవరిలో నేను జాతీయ అధ్యక్షుడిగా పనిలో పడ్డాక తొలిసారి జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలివి. ఉన్నచోట ఉన్నట్లు లేదు. తిన్న చోట తిన్నట్లు లేదు. పనే, నా కాలమూ దూరము, వేగము.
మొత్తం 34 రోజులు, 65 రోడ్ షోలు! పశ్చిమ బెంగాల్‌లో 11 రోజులు, 22 రోడ్ షోలు; అస్సాంలో 9 రోజులు, 18 రోడ్ షోలు; కేరళలో 7 రోజులు; 12 రోడ్ షోలు; తమిళనాడులో 5 రోజులు; 8 రోడ్ షోలు; పుదుచ్చేరిలో 2 రోజులు, 5 రోడ్ షోలు. పనిలో ఉన్నవారికి అలసట ఉండదు. ప్రజల మధ్య ఉన్నవారికి భూమీ, ఆకాశం; బిహార్, ఢిల్లీ ఉండవు. బాలుర్‌ఘాట్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు బాలకృష్ణుడి చేతి నిండా వెన్న ముద్ద పెట్టినట్లుగా, బెంగాల్ ప్రజలు ప్రతిచోటా నాకు తియ్యటి ‘మిష్టీదోయి’ తినిపించారు. నా గుండె నిండింది కానీ... గొంతు గడ్డ పెరుగు అయింది. 24 పరగణాల జిల్లాలోని నైహతిలో కూడా మిష్టీదోయిని నా నోటికి అందివ్వ బోయిన వారిని ఆత్మీయంగా ప్రతిఘటించి, ‘‘ఈ పెరుగుకు బదులుగా ఒక గ్లాసు మామూలు నీళ్లు ఇవ్వగలరా?’’ అని వేడుకున్నాను. మదురై రోడ్ షోలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం రెండూ కలిసి ఉప్పొంగినట్లుగా జనం! నాలోంచీ భావావేశం ఉబికి వచ్చింది! తమిళంలో ‘‘వణక్కం’’ అంటూ చేతులు జోడించాను. ‘‘ఓ..’’ అంటూ ప్రజా హోరు! ఆ ఉద్వేగంలో పొరపాటున ‘‘భయ్యా..’’ అనేశాను. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ వెంటనే కేరింతలు కొడుతూ నవ్వులు. ‘‘నన్బా’’ అనబోయి అలవాటుగా ‘‘భయ్యా’’ అని అన్నానని తమిళ ప్రజలు నన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ‘‘నా హృదయం బిహార్‌దే కావచ్చు. అంతకన్నా విశాలమైన సముద్రం మీ హృదయం..’’ అని వారికి ధన్యవాదాలు తెలిపాను.
అస్సాంలోని కమల్‌పుర్ సమీపంలో ఒక ఏనుగు నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో నా కాన్వాయ్ 15 నిముషాలు ఆగిపోవటం నాకొక ఆహ్లాదకరమైన జ్ఞాపకం. ఆ ‘వీఐపీ’ని ఫొటో తియ్యటం కోసం కారు దిగి వెళ్లాను. వన్యప్రాణుల రాజసానికి మోదీజీ ఒక్కరే దీటైనవారు అని ఆ క్షణాలలో నాకు అనిపించింది! ఆయనలో గర్జించే సింహమూ కనిపిస్తుంది, మనసుకు హాయినిచ్చే మయూరమూ పురి విప్పుతుంది. కేరళలో నిమ్మరసం, ఘాటైన మసాలాలు కలిపి తయారు చేసే అక్కడి సంప్రదాయ ‘సులేమానీ’ బ్లాక్ టీని గుటకేయటం కాస్త కష్టంగానే ఉన్నా, అందులో వారు జోడించిన ఆతిథ్య భావన పచ్చని కొబ్బరి చెట్ల వంటి ఆ రాష్ట్ర ప్రజలకు నన్ను కట్టిపడేసింది.
పుదుచ్చేరిలో పార్టీ మండల అధ్యక్షులతో అర్ధరాత్రి జరిగిన సమావేశమైతే నాకొక ‘అత్యున్నత’ స్థాయి!! నాలోని జాతీయ అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్షుడిగా మారిపోయాడు. పనినే మోదీజీగా భావించే వారికి పదవుల పట్టింపులు ఉంటాయా? మే 4న కౌంటింగ్. ఆ రోజున వచ్చేవి ఎన్నికల ఫలితాలు కావు. ఆ ఐదు రాష్ట్రాల ప్రజలు మోదీజీకి చేతి నిండా కల్పించే పనులు. ఆయన చేతుల మీదుగా పార్టీ కార్యకర్తల దోసిళ్లలోకి కురిసే బాధ్యతల బంగారు నాణేలు!


