పొదుపు సత్యాగ్రహం పనికొచ్చేనా? | Sakshi Guest Column On PM Narendra Modi Savings Appeals | Sakshi
Sakshi News home page

పొదుపు సత్యాగ్రహం పనికొచ్చేనా?

May 15 2026 12:29 AM | Updated on May 15 2026 12:29 AM

Sakshi Guest Column On PM Narendra Modi Savings Appeals

విశ్లేషణ

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 11 నిర్దిష్ట అభ్యర్థనలు చేశారు. మరీ అవసరమైతే తప్పించి బంగారం కొనవద్దు, విదేశీ విహారయాత్రలకు వెళ్ళ వద్దు అన్నారు. ఎరువులు, వంటనూనెల వాడకం తగ్గించమన్నారు. సౌర శక్తితో నడిచే పంపుల ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. దీన్ని ప్రభుత్వం ధరలను పెంచేందుకు చేస్తున్న ముందస్తు సన్నాహంగా చాలామంది భావిస్తున్నారు. కానీ, మోదీ ప్రసంగంలో అంతకుమించిన పెద్ద ఆశయమే ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్‌) సంరక్షించుకోవడాన్ని సిసలైన జాతీయ ఉద్యమంగా మార్చాలన్నది ఆయన కోరిక. మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అలాంటి స్ఫూర్తితో మొత్తం జాతిని సమీకరించాలని ప్రధాని భావన. జాతీయ జెండాను ఎగురవేయడం దేశభక్తిని ఎలా చాటుతుందో... విదేశీ మారకద్రవ్య సంరక్షణకు తోడ్పడటం కూడా అంతే దేశభక్తి పూర్వకమైన చర్యకిందకు వస్తుందని ఆయన చెబుతున్నారు. ప్రధాని అభిమతం అభినందించదగిందే. ముడి చమురు, ఎరువుల తయారీకి అవసరమైన వస్తువులు, బంగారం, వంట నూనెలకు మనం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఈ బలహీనతను గుర్తించి దశాబ్దాలు గడుస్తున్నా విరుగుడు చర్యలను తీసుకున్నది లేదు. మోదీ దాన్ని ఇప్పుడు స్పష్టంగా వివరిస్తున్నారు. దైనందిన ‘ఫారెక్స్‌’ చెల్లింపులకు వ్యక్తిగత బాధ్యతను జోడిస్తున్నారు.

గత ఉదంతాలు
లాల్‌ బహదూర్‌ శాస్త్రి 1965లో ఆహారం విషయంలో ఇదే తరహాలో పిలుపునిచ్చారు. దేశం యుద్ధాన్ని, ఆహార ధాన్యాల కొర తను ఎదుర్కొంటున్న ఆ కాలంలో సోమవారం సాయంత్రాలు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండవలసిందిగా శాస్త్రి విజ్ఞప్తి చేశారు. సోషలిస్టు పార్లమెంటేరియన్‌ మధు లిమాయే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళారు. జాతీయ సంక్షోభాల సమయంలో స్వచ్ఛందంగా నిరాడంబర జీవితాన్ని గడపడం పౌరుల రాజ్యాంగపరమైన విధిగా లిమాయే ఒక సందర్భంలో పార్లమెంట్‌లో పేర్కొన్నారు. గాంధీ ఉప్పు సత్యాగ్రహం నైతిక శక్తిని సమీకరించుకోవడంలో  ఉప్పుపై బ్రిటిష్‌ వాళ్ళు వేసిన పన్ను కూడా కొంత దోహదపడింది.  ఉప్పుపైన పన్నుకన్నా దారుణమైన తిరోగమన చర్య మరొకటి ఉండదు. పైగా, అది పేదలను మరింత దెబ్బతీసింది. ఈ రకమైన అన్యాయం కారణంగానే గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టవలసి వచ్చింది. కానీ, ‘ఫారెక్స్‌’ సంరక్షణ ఉద్యమం ఏదో అన్యాయానికి వ్యతిరేకంగా చేపడుతున్నది కాదు. అసలది స్వభావరీత్యానే తిరోగ మనమైనది. విదేశీ పైకం తక్కువ ఉన్నవారిని బాధను మాత్రం ఎక్కువ పంచుకోవాల్సిందిగా కోరుతోంది.

లోపించిన సమానత్వం
ప్రధాని 11 అభ్యర్థనలను ఈ కోణం నుంచే చూడాలి. విదే శాలకు విహారయాత్రలకు వెళ్లడం, విదేశాల్లో ప్రత్యేక ప్రదేశాలకు వెళ్ళి పెళ్ళిచేసుకోవడం వంటివి పునరాలోచించవలసిన అవసరం ధనికులకే ఉంది. పేదవాళ్ళకు అది సంబంధం లేని విషయం. ఎలక్ట్రిక్‌ వాహనానికి మళ్ళాలన్నా దాన్ని కొనగలిగిన శక్తి ముందు ఉండాలి. ఇంటి నుంచి పనిచేయడం వైట్‌కాలర్‌ వృత్తి నిపుణులకు ఉన్న అవకాశం. దినసరి కార్మికులకు కాదు. వంట నూనె విలాసవంతమైన సరుకు కాదు. దాని వినియోగాన్ని తగ్గించుకోమనడం సాధా రణ ప్రజానీకానికి రుచించని విషయం. ప్రధాని అభ్యర్థనలలో కొన్ని సంపన్నులను దృష్టిలో పెట్టుకుని సరిగ్గా చేసినవే. మిగిలినవి మాత్రం దామాషాకు మించి త్యాగాన్ని కోరుతున్నాయి. 

ప్రస్తుతం మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ దాదాపు 1,600 నుండి 1,700 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయి. గత పది వారాల్లో ఈ నష్టం ఒక లక్ష కోట్లు దాటింది. పెట్రోల్‌ మీద లీటరుకు రూ. 14, డీజిల్‌ మీద రూ. 18 చొప్పున నష్టం వస్తోంది. సామాన్యులపై భారం పడకుండా ఎక్సైజ్‌ సుంకంలో పెడుతున్న కోతల వల్ల కోశాగారానికి నెలకు రూ. 14,000 కోట్లకు పైగా ఖర్చవు తోంది. ఎరువులపై సబ్సిడీలు రూ. 1.71 లక్షల కోట్లుగా బడ్జెట్‌ వేసుకున్నారు. ఇప్పుడవి రూ. 35,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లను మించిపోయేవిగా ఉన్నాయి. బంగారం దిగుమతులు తగ్గించుకోవడం, విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకోవడం వంటివి కరెంట్‌ అకౌంట్‌కు నిజంగానే సహాయపడతాయి. కానీ, ఇంధన ధరల పెంపు పూర్తిగా భిన్నమైంది. అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. 

ప్రభుత్వ ఆదాయ సమీకరణకు కూడా ఒత్తిడి పెరుగుతోంది. పన్నులు కట్టాలని ఆదాయ పన్ను శాఖ చేసిన డిమాండ్‌  కొన్ని అప్పీళ్లలో చెల్లుబాటు అయింది. దాని ప్రకారం రూ. 2.57 లక్షల కోట్ల వసూలుపై దృష్టి పెట్టవలసిందిగా 2026–27 ఆదాయ పన్ను శాఖ కేంద్ర కార్యాచరణ ప్రణాళిక నిర్దేశిస్తోంది. దీని ప్రకారం ‘పాన్‌’ కార్డులను ఆధారం చేసుకుని టాప్‌ 10 వేలమంది ఎగవేతదార్ల లావాదేవీలను పరిశీలిస్తారు. వర్గీకరించని బకాయిలు కూడా పెద్ద మొత్తంలో రూ. 7.88 లక్షల కోట్లుగా ఉన్నాయి. వాటిని జూలై నాటికి వర్గీకరించాలని నిర్ణయించారు. ముంబయ్‌ (రూ. 1.65 లక్షల కోట్లు), ఢిల్లీ (రూ. 1.21 లక్షల కోట్లు) వంటి మహా నగరాల నుంచే చాలా పన్నులు వసూలు కావలసి ఉన్నాయి. ఇలా బడా కంపెనీలు, పెద్ద మనుషుల నుంచి వసూలు కావలసిన పన్నులే రూ. 9 లక్షల కోట్ల మేరకు ఉండగా, వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవా లని ప్రభుత్వం ఎలా అడుగుతోంది? సమానత్వం లోపించిన నిరా డంబరత దేశభక్తి కిందకు రాదు.

ఆదాయ మార్గాలు
అత్యధిక ఆదాయాలు ఉన్నవారిపై తాత్కాలికంగా సంక్షోభ సర్‌చార్జినీ, ప్రస్తుత కల్లోల పరిస్థితుల నుంచి లాభం పొందుతున్న కమోడిటీ ట్రేడర్లు, దేశీయ చమురు శుద్ధి కంపెనీలు వంటి సంస్థలపై విండ్‌ఫాల్‌ లెవీనీ విధించవచ్చు. సంపద పన్ను విధానాన్ని రూపొందిస్తే బహుళ ప్రయోజనాలు నెరవేరుతాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)లో సభ్యత్వం ఉన్న దేశాలు ఒడంబడిక నియమంగా 90 రోజులకు సరిపడ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వులు ఉంచు కుంటాయి. మన దేశ నిల్వలు ప్రస్తుతం సుమారు 9 నుంచి 10 రోజుల డిమాండ్‌ను తీర్చగలిగినవిగా మాత్రమే ఉన్నాయి. మొత్తం చమురు నిల్వలు (వాణిజ్యపరమైనవి, రిఫైనరీల వద్ద ఉన్నవి కూడా కలిపితే) దాదాపు 74–75 రోజులకు సరిపోవచ్చు. 

సమానత్వం విషయంలో నైతికంగా అభిశంసనకు తావులేనివి కాబట్టే, గాంధీజీ ఉద్యమాలు సఫలమయ్యాయి. ఇది భారతదేశపు ‘ఫారెక్స్‌’ సత్యాగ్రహమైతే, ఆశయానికి తగ్గట్లుగానే దాని రూప కల్పన కూడా ఉండాలి. భారాన్ని పంచుకోవడంలో అది ప్రగతిశీల మైనదిగా ఉండాలి. అమలులో నిష్కర్షత్వం చూపాలి. సంస్థాగత మైన విరుగుడు, ధరల పెంపుదలలో నిజాయతీ లేకుండా స్వచ్ఛందంగా ఎవరెంత సంయమనం పాటించినా ఫలితం ఉండదు. 

అజీత్‌ రానాడే
వ్యాసకర్త ఆర్థికవేత్త (‘ద బిలియన్‌ ప్రెస్‌’ సౌజన్యంతో)  

Advertisement
 
Advertisement
Advertisement