50 శాతం ఫార్ములాతో దక్షిణాదికి మేలు | Sakshi Guest Column On Delimitation and women reservation | Sakshi
Sakshi News home page

50 శాతం ఫార్ములాతో దక్షిణాదికి మేలు

Apr 29 2026 1:03 AM | Updated on Apr 29 2026 1:03 AM

Sakshi Guest Column On Delimitation and women reservation

అభిప్రాయం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా 1996 సెప్టెంబర్‌ 13న మహిళా ఎంపీలందరూ పార్టీలకతీతంగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఏకతాటిపైకి వచ్చారు. లోక్‌సభలో ఈ విషయంపై గళమెత్తారు. మహిళా బిల్లును జాయింట్‌ కమిటీకి పంపడంపై దివంగత నేత సుష్మా స్వరాజ్‌ ‘దేశ మహిళలపై జరిగిన భారీ కుట్ర’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లును జాయింట్‌ కమిటీకి పంపి వెంటనే లోక్‌ సభను రద్దు చేశారు. దీంతో మళ్లీ మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి 27 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. 

మోదీ ప్రభుత్వం 2023లో ‘నారీశక్తి వందన్‌ అధినియం’ బిల్లు తీసుకొచ్చింది. 2034 నాటికి రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉండగా, 2029 నాటికే మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి, రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ, స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50%గా ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించి, డీలిమిటేషన్‌ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం చేజారింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ఈ రెండు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినవి. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం, ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలపరచడం– ఇవి రెండూ దేశ భవిష్యత్తును నిర్ధారించే కీలకమైన అంశాలు.

దాదాపు 3 దశాబ్దాలుగా ఈ బిల్లును తీసుకురావాలని, మహిళా లోకానికి సాధికారత కల్పించాలని చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు దీన్ని అడ్డుకున్నాయి. 1996లో దేవేగౌడ హయాంలో... ఆ తర్వాత 1998, 1999, 2002లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బిల్లును కాంగ్రెస్‌ అడ్డుకుంది. ఎన్డీయే ఒత్తిడితో యూపీఏ హయాంలో 2008–10 మధ్యలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా, తమ మిత్రపక్షాలతో కలిసి  ముందుకు సాగకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది.
 
అనవసర దుష్ప్రచారం
డీలిమిటేషన్‌పై చర్చలు మొదలైనప్పటినుంచే, విపక్షాలు దక్షిణాదిపై ఎక్కడలేని ధృతరాష్ట్ర ప్రేమను కురిపించాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. కాంగ్రెస్‌ ఆడిన ఈ నాటకానికి డీఎంకే, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు వంతపాడాయి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమని ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పదే పదే చెప్పినా దుష్ప్రచారం ఆగలేదు.

అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% సీట్లు పెంచేందుకు తీసుకొచ్చిన డీలిమిటేషన్‌ బిల్లును కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న 129 సీట్లు 50% పెరిగి 195 సీట్లకు చేరే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 26కు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి పెరిగేందుకు వీలుండేది. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెంచేలా మోదీ సర్కారు సరికొత్త ఫార్ములాను రూపొందించింది. దీని ద్వారా దక్షిణాది సీట్లకు ‘జనాభా ప్రాతిపదికన’ నష్టం జరగకుండా, ఆ మాటకొస్తే ప్రత్యేకమైన లాభం జరిగేలా ఈ ఫార్ములా మేలు చేకూర్చేది. 

దీనివల్ల ఆ యా పార్టీలకు ఏం ఒరిగిందో తెలియదు కానీ... 70 కోట్ల మంది మహిళలకు, 30 కోట్ల మంది దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచే అవకాశాన్ని కూడా కాంగ్రెస్, వారి మిత్ర పక్షాలు దెబ్బకొట్టాయి. ప్రస్తుతం దక్షిణాదిలో ఎస్సీలకు 21 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు రిజర్వేషన్లుండగా... 50% సీట్లను పెంచితే, ఎస్సీలకు 32 స్థానాలు, ఎస్టీలకు 8 స్థానాలు దక్కేందుకు వీలుండేది. 

అలాచేస్తే దక్షిణాదికి నష్టం
మహిళా బిల్లు విషయంలోనే కాదు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాల విషయాల్లోనూ కాంగ్రెస్‌ ఇలాగే వ్యవహరించింది. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసినప్పుడు, ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిసినా వ్యతిరేకించింది. ఆర్టికల్‌ 370 రద్దు చేసి దేశ సమగ్రతను బలపరిచే ప్రయత్నం చేసినప్పుడూ వ్యతిరేకించింది. రైతుల అభివృద్ధి కోసం తెచ్చిన సంస్కరణలను రాజకీయ కారణాలతో వ్యతిరేకించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అర్థంలేని కొత్త ఫార్ములాను తీసుకొచ్చారు. దీని ప్రకారం... తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15కు తగ్గుతాయి. 

ఇది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అన్యాయం. రేవంత్‌ రెడ్డి ఫార్ములా ప్రకారం తెలంగాణే కాదు, దక్షిణాది రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కాకుండా, ఈ ఫార్ములా ప్రకారం... ఏపీ 16 సీట్లు, తెలంగాణ 11 సీట్లు, కర్ణాటక 16 సీట్లు, కేరళ 16 సీట్లు, తమిళనాడు 27 సీట్లు... ఇలా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు 86 సీట్లు నష్టపోనున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు. దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చైతన్యవంతులు. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది. మహిళల గౌరవం, దేశ సమగ్రత, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. 


జి.కిషన్‌ రెడ్డి
వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి 

Advertisement
 
Advertisement
Advertisement