ఎం.కె. స్టాలిన్‌ (ముఖ్యమంత్రి) రాయని డైరీ | CM MK Stalin Rayani diary | Sakshi
Sakshi News home page

ఎం.కె. స్టాలిన్‌ (ముఖ్యమంత్రి) రాయని డైరీ

Apr 19 2026 5:20 AM | Updated on Apr 19 2026 5:20 AM

CM MK Stalin Rayani diary

మాధవ్‌ శింగరాజు

అసలొక మనిషిని పట్టించుకోకూడదని మనం అనుకుంటున్నామంటేనే, ఆ మనిషిని వదిలించుకోలేనంత గట్టిగా మనం పట్టుకొని ఉన్నామని! ‘అతడి’ పేరును నేను ర్యాలీలలో రానివ్వటం లేదు. మీటింగులలో రానివ్వటం లేదు. మాటల్లో, ‘మాటకు మాట’ల్లో కూడా రానివ్వటం లేదు. అతడిని నేను ఏదైనా అనాలని, అతడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు! ‘స్టాలిన్‌ అంకుల్‌’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ‘తీమై శక్తి’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ‘యాంటీ పీపుల్‌’ అన్నాడు. నేను పట్టించు కోలేదు. ఒకటీ రెండుసార్లు ‘చీఫ్‌ మినిస్టర్‌’ అని కూడా అన్నాడు! అదీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ‘స్టాలిన్‌ సర్‌’ అంటున్నాడు. అది మాత్రం నేనెందుకు పట్టించుకోవాలి? అతడివన్నీ సినిమా మాటలు! సినిమాల నుంచి వచ్చిన ఎంజీఆర్, డీఎంకేని ‘తీమై శక్తి’ అనేవారు. సినిమాల నుంచే వచ్చిన జయలలిత కూడా డీఎంకేని ‘తీమై శక్తి’ అన్నారు. ఇప్పుడు అదే మాటను అతడు పట్టుకున్నాడు!

‘తీమై శక్తి’ అంటే దుష్ట శక్తి. అదేం పెద్ద మాట కాదు కానీ, పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ అతడు ఇంకా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ‘‘ఈ ఎన్నికలు డీఎంకేకి, బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు; ప్రజలకు, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు’’ అని అంటున్నాడు. ప్రజలు అంటే అతడు, అవినీతి అంటే నేను! మంచి డైలాగే. ‘స్టాలిన్‌ అంకుల్‌’ అనటం కూడా ఒక ఎత్తుగడ. నన్ను ‘నిన్నటి తరం మనిషి’గా చూపించి, తను ‘రేపటి తరం నాయకుడి పాత్రను పోషించాలని చూస్తున్నాడు! వరదలు, విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు కావలసింది, తెడ్లతో పడవను నడుపుకుంటూ ఇంటి ముందుకు వచ్చే నాయకుడే కానీ, తెరపై కనిపించే కథానాయకుడు కాదు.

నేను చెన్నైలోని కొళత్తూర్‌ నుంచి పోటీ చేస్తున్నాను. అతడూ చెన్నై నుంచే పెరంబూర్‌లో పోటీ చేస్తున్నాడు. ఆ ఒక్కచోట నుంచి మాత్రమే కాదు, తూర్పు తిరుచ్చి నుంచి కూడా నిలబడ్డాడు. ఇంకో మూడు రోజుల్లో స్టాలినా, మోదీనా అన్నది తమిళనాడు ప్రజలు తేల్చేస్తారు. తమిళులకు, ఢిల్లీ నియంతలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. అతడు అంటున్నట్లుగా అతడికి, నాకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు. డీఎంకే, డీకేఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే ఒకవైపు; అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకె ఇంకో వైపు. ఈ రెండు వైపుల్లో ఏ వైపూ అతడు లేడు. లేడు కానీ, లేకుండానూ లేడు! చెన్నై, మదురై, తిరుప్పూర్‌ జిల్లాల్లో అతడి ‘షో’కి కొన్ని టిక్కెట్లు తెగొచ్చు. ఆ తెగేవీ, మిగతా చోట్లవీ కలిపి అతడి ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీకి 25 – 45 సీట్లు వస్తే కనుక, అతడిని పట్టించు కోకుండా ఉండటం కుదరకపోవచ్చు. 118 సీట్ల మెజారిటీ ఏ వైపూ రాకుంటే డీఎంకే, బీజేపీ రెండూ అతడి వైపే చూడాల్సిందే.

‘ఇళయ తలపతి’ యువతను ఆకట్టుకుంటున్నాడని అతడి గురించి డీఎంకే యూత్‌ వింగ్‌ చెబుతోంది. తమిళనాడులో వెండితెరకు, సచివాలయానికి మధ్య గీత కాగితమంత పలుచగా ఉంటుందని నాన్న చెప్పటం కూడా నాకు గుర్తుకొస్తోంది. అతడిని జాగ్రత్తగా డీల్‌ చేయాలి. మరీ గట్టిగా దాడి చేస్తే వీరుడు అవుతాడు. అసలే వదిలేస్తే ఏనుగంత ఐపోతాడు! మీడియా కెమెరాలు అతడిని ఎంతగానో ఇష్టపడటం నేనూ చూస్తున్నాను. కానీ గ్రామాల్లోని ప్రజలు అతడిని నమ్ముతారా? ఒకందుకైతే అతడిని మెచ్చుకుని తీరాలి. ఉదయించే సూర్యుడికి ఎదురెండలో నిలబడే ధైర్యం అతడిలో ప్రకాశిస్తూ ఉంది! పోలింగ్‌కి ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి. తమకు మూడు గంటల సినిమా హీరో కావాలా, లేక ఐదేళ్ల నాయకుడు కావాలా అన్నదిక పూర్తిగా ప్రజల నిర్ణయమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement