నిషేధం కాదు... కంటెంట్‌ కావాలి! | Sakshi Guest Column On Children Digital Addiction | Sakshi
Sakshi News home page

నిషేధం కాదు... కంటెంట్‌ కావాలి!

Apr 13 2026 12:27 AM | Updated on Apr 13 2026 12:28 AM

Sakshi Guest Column On Children Digital Addiction

విశ్లేషణ

సోషల్‌ మీడియాపై చర్చ కొత్త దశకు చేరుకుంది. 16 ఏళ్ల లోపు బాలల సోషల్‌ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తు న్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఇటీవల తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. డిజిటల్‌ వ్యసనం, ఆన్‌లైన్‌లో అపరిమిత కాలాన్ని వెచ్చిస్తున్నందువల్ల కొన్ని పరిమితులు తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు కూడా అదే బాట పట్టే అవకాశముందని వార్తలు సూచిస్తున్నాయి. సోషల్‌ మీడియా నుంచి మైనర్లను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ఒక చట్టం తెచ్చింది. అదే తరహా విధానాలు అనుసరించడంపై ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాలు చర్చిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, సైబర్‌ బెదిరింపులు, నిద్రలో అవాంతరాలు వంటి సమ స్యలు తలెత్తుతున్నమాట వాస్తవమే. ‘ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌’ వంటి సంస్థల అధ్యయనాలు కూడా ఆ సంగతిని ధ్రువీకరిస్తున్నాయి. బాలలు ఎలక్ట్రానిక్‌ తెరల ముందు రోజూ ఏడు గంటలకు పైగా గడుపుతున్నారని అవి తెలుపుతున్నాయి.

సోషల్‌ మీడియా ‘కత్తి’ లాంటిది!
ఎడతెగని ఫార్వర్డ్‌లు, సంచలనాత్మక అభిప్రాయాలు వ్యక్తపర చడం గురించి సోషల్‌ నెట్‌వర్క్‌ వాడకందారులు ఎవరికైనా వేరే చెప్పనవసరం లేదు. వాట్సాప్, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌) వంటి ప్లాట్‌ఫారాలు తప్పుడు సమాచారానికి కారణమవుతున్నాయని నిందలు మోస్తున్నాయి. ఎన్నికల సందర్భాలలోనైతే చెప్పనే అక్కర లేదు. ఏది బూటకమో, ఏది వాస్తవమో నిర్ధారణ కాకపోయినా ‘వాట్సాప్‌ యూనివర్సిటీ’ ముద్ర వేసుకుని వచ్చేస్తాయి. ఫలితాలను ప్రభావితం చేయడంలో, హింసకు పురిగొల్పడంలో వాటి పాత్రను తోసిపుచ్చలేం. ఢిల్లీలో 2020 నాటి అల్లర్లను దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నిషేధించడం, లేదా నియంత్రించడం తప్ప గత్యంతరం లేదు. కానీ, ఆ యా వేదికలది తప్పా, లేక వాటిని వినియోగించుకుంటున్న మన తీరులో లోపం ఉందా అనే ప్రశ్న వెన్నాడుతూనే ఉంటుంది. 

సోషల్‌ మీడియా దానికదే విషపూరితమైనది కాదు. క్యాట్‌ వీడియోలు, కుట్ర సిద్ధాంతాలు, కవ్వించే మాటల వంటి అల్పమైన విషయాల వరదలో టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఘర్షణ ప్రాంతాల నుంచి పౌరులు నేరుగా నివేదించే కథనాల వంటి మంచి సంగతులు కూడా కొట్టుకొస్తాయి. ఇస్రో రాకెట్‌ ప్రయోగాల ప్రత్యక్ష వీడియోల వంటివి యువతలో స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి సంగతులు మాధ్యమం తటస్థమైనదేననే సంగతిని గుర్తుచేస్తాయి. ఇదీ కత్తి లాంటిదే! దానితో కూరగాయలు తరగ వచ్చు. ఒంటికి గాయమూ చేసుకోవచ్చు. 

చరిత్ర నేర్పుతున్న పాఠాలు
గూటెన్‌బర్గ్‌ 1440లో ముద్రణా యంత్రం కనుగొనడంతో విషయ పరిజ్ఞానం అందరికీ అందడం మొదలైంది. పునరుజ్జీవన, సంస్కరణవాద ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. యూరప్‌లో అక్షరాస్యత 10 శాతం నుంచి దాదాపు నూరు శాతానికి చేరుకుంది. అదే సమయంలో మూఢ నమ్మకాలను, కక్ష సాధింపు ప్రాపగాండాను పెంపొందించే కరపత్రాలు కూడా పుట్టుకొచ్చాయి. అయినా, నిషేధాలు నిలువలేదు. టెక్నాలజీయే కొనసాగింది. 

రేడియో వాడుకలోకి వచ్చినప్పుడు కూడా అదే ధోరణి పునరా వృతమైంది. జర్మనీలో 1930లలో హిట్లర్‌ విద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తికి అది కారణమైంది. ఫ్రాంక్లిన్‌ డి.రూజ్‌వెల్ట్‌ ఉత్తేజపూరిత ప్రసంగాలు అమెరికా ఐక్యానికి దోహదపడ్డాయి. టెలివిజన్‌ రాకతో నిరాధారమైన ఆరోపణలతో ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేసే పద్ధతి ఊపందుకుంది. అదే సమయంలో, పౌర హక్కులకు రక్షణ కల్పించి, మార్పునకు చేయూతనందించింది. 

నేడు సోషల్‌ మీడియా కూడా అదే బాటలో ఉంది. 50 కోట్ల మంది యూజర్లు, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్‌గా మన దేశాన్ని మార్చారు. ‘నాసా’ కృష్ణబిల చిత్రాలను కొన్ని అందిస్తే, భ్రమలను తొలగిస్తూ నోబెల్‌ బహుమతి గ్రహీతలు చెప్పే మాటలను మరికొన్ని అందిస్తున్నాయి. వన్యప్రాణులపై డిస్కవరీ ఛానల్‌ రీల్స్‌ వస్తున్నాయి. అలా వేదికలు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. వదంతులను వ్యాప్తి చేస్తోందని ట్విట్టర్‌ను తిట్టుకున్నాం. కానీ, కోవిడ్‌ మృతుల విషయంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇచ్చిన తాజా సమాచారాన్ని కూడా ట్విట్టరే ఎప్పటికప్పుడు అందించింది. 

డిజిటల్‌ ఎకో సిస్టం
నిజమైన సవాల్‌ నిషేధించడంలో కాక, ఎకో సిస్టంను సుసంపన్నం చేయడంలో ఉంది. దేశంలోని 1.4 బిలియన్ల మందిలో మూడొంతుల మంది 35 ఏళ్ళ లోపువారు. వార్తలకు వారు డిజిటల్‌ మార్గాలపైనే ఆధారపడుతున్నారు. యువతలో 80 శాతం మంది సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి పొందు తున్నారు. ప్రజానిధులతో ప్రభుత్వం కూడా బోలెడంత సమాచా రాన్ని ఎత్తిపోస్తోంది. వాటిలో నీతి ఆయోగ్‌ నివేదికలు, విశ్వ విద్యాలయ గ్రాంట్ల సంఘ పరిశోధన పత్రాలు, రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ నవీకరణలు కూడా ఉన్నాయి. కానీ, అవన్నీ ప్రాచుర్యానికి నోచుకోని ఎక్కడెక్కడో సైట్లలో పీడీఎఫ్‌ల రూపంలో మూలుగుతున్నాయి. కొందరు ఉన్నత విద్యావంతులు మాత్రమే వాటిని చూస్తున్నారు. మంత్రిత్వ శాఖల నివేదికలలో 70 శాతం ఏటా వెయ్యికన్నా తక్కువ మంది చూపరుల దృష్టికి మాత్రమే ఆనుతున్నాయని 2023 నాటి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తేలింది. 

సోషల్‌ మీడియా ఒక పరిష్కారాన్ని ఇవ్వజూపుతోంది. వ్యవసాయ చట్టాలను, లేదా వాతావరణ డేటాను వివరించే రీల్స్‌ చేసేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లతో వివిధ మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యం కుదుర్చుకుంటే? ప్రాచీన చరిత్రపై విశ్వవిద్యాలయాలు టిక్‌టాక్‌ సిరీస్‌ చేస్తే? వేదాలను వైరల్‌ చేస్తే? నివేదికలను ఇన్ఫోగ్రాఫిక్స్‌గా మార్చేందుకు యువ క్రియేటర్ల సేవలను ఇస్రో, ఐఐటీలు, ఐసీఎంఆర్‌ వంటి ప్రభుత్వ సంస్థలు వినియోగించుకుంటే? వేదికలను సద్వినియోగం చేసుకునేటట్లు విద్యావేత్తలు, స్కాలర్లు తమ వంతు పాత్ర పోషించాలి. ‘పనికిమాలిన’వంటూ ప్లాట్‌ ఫారాలను చిన్నచూపు చూసే బదులు వారు క్వాంటమ్‌ ఫిజిక్స్, లేదా ఎన్నికల డేటాపై థ్రెడ్లను పోస్ట్‌ చేయవచ్చు. ఉన్నత ప్రమా ణాలతో కూడిన కంటెంట్‌ పెడుతున్నవారిని ఆ యా ప్లాట్‌ ఫారాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి.  

కాకపోతే విచక్షణా జ్ఞానంతో అన్వేషిస్తూ పోవాలి. మేరీ క్యూరీ 1 గ్రాము రేడియం కోసం 8 టన్నుల పిచ్‌ బ్లెండ్‌ను జల్లెడ పట్టవలసి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. సోషల్‌ మీడియా కూడా అదే రకమైన శ్రమను డిమాండ్‌ చేస్తోంది. చిందర వందర మధ్యలో అసలైన దాన్ని వెతికి పట్టుకోవాలి. సైట్‌ విశ్వస నీయతకు సంబంధించి న్యూస్‌ గార్డ్‌ వంటి టూల్స్‌ రేటింగ్‌ ఇస్తున్నాయి. ప్రభుత్వం కేవలం పోలీసుగానే వ్యవహరించకుండా, స్వయంగా క్వాలిటీ కంటెంట్‌ అందించాలి. వార్తాహరుడిని చంపే బదులు అతన్ని సమాచారంతో బలోపేతం చేయాలి.

శివప్రసాద్‌ ఖేనేడ్‌
వ్యాసకర్త సైన్స్‌ కమ్యూనికేటర్, మ్యూజియం
వృత్తి నిపుణుడు (‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement