అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా? | KSR Comment: KCR Upper Hand On Revanth At Jagtial Sabha | Sakshi
Sakshi News home page

అదే కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారనుందా?

Apr 22 2026 10:17 AM | Updated on Apr 22 2026 10:23 AM

KSR Comment: KCR Upper Hand On Revanth At Jagtial Sabha

తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావులు ఇద్దరూ ఒకే రోజున బహిరంగ సభలు నిర్వహించి మాటా మాటా అనుకోవడంతో రాష్ట్రం మొత్తమ్మీద రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతు భరోసా నిధుల విడుదల సందర్భంలో రేవంత్‌ రెడ్డి.. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత,  టి.జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా రేవంత్‌, కేసీఆర్‌లు ఇద్దరూ ఈ బహిరంగ సభలు నిర్వహించారు. 

ఎన్నికల సమయంలో మినహా ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టుకోవడం చాలా అరుదు. దీన్నిబట్టి చూస్తే వీరి మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, సందేహాలు నిండి ఉండాలని అనిపిస్తుంది. అదే సమయంలో ఇరువురు నేతల ప్రసంగాల్లో స్పష్టమైన తేడా ఒకటి కనిపిస్తుంది. ఒకరు సెంటిమెంట్‌ రేకెత్తిస్తే.. ఇంకొకరు ఎదుటి పక్షాన్ని రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. కాళేశ్వరం వెళుతున్నానని తెలిసి జీవన్‌ రెడ్డి సభ పెట్టుకున్నాడని, రేవంత్‌.. జగిత్యాలలో తమ సభ ఉందని తెలిసి రేవంత్‌ కాళేశ్వరం వెళ్లాడని జీవన్‌ రెడ్డి ఆరోపణలు చేసుకున్నారు. జీవన్‌ రెడ్డి లాంటి సీనియర్‌ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌కు నష్టమే. బహశా అందుకే రేవంత్‌ ఆయన పేరు ‍ప్రస్తావించి ఉండాలి. 

‘‘బానిస బతుకు బతికేందుకు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాడు’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. 1984లో ఎన్టీఆర్‌కు నమ్మక  ద్రోహం చేశారని, దళితుడికి మంత్రి  పదవి ఇస్తే ఓర్వలేకపోయాడని, పాపాల భైరవుడి పార్టీలో చేరారని రేవంత్ ద్వజమెత్తారు. జీవన్ రెడ్డి కూడా తక్కువేమీ మాట్లాడలేదు. రేవంత్‌ను ఏకంగా తెలంగాణకు పట్టిన శని అని ఆరోపించారు. విశేషం ఏమిటంటే నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కరరావు ఏర్పాటు చేసిన కేబినెట్‌లో జీవన్‌రెడ్డి మంత్రిగా పనిచేయడం. రేవంత్‌ ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అప్పట్లో కాంగ్రెస్‌ చేసిన పనిని కూడా తప్పు పట్టినట్లు అయ్యింది. ఆ మాటకు వస్తే టీడీపీలో ఉండగా రేవంత్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎంత తీవ్రంగా దుయ్యబట్టింది అందరికి తెలిసిందే. 

జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి అయ్యారు. లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు కేసీఆర్‌పైనే పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలైనా ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్‌కు ఊపిరి పోశారు.ఈ మధ్య జరిగిన  మున్సిపల్  ఎన్నికలలో సొంతంగా తన కేడర్‌ను రంగంలో దింపి సత్తా చాటుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆయనతోనే అవగాహనకు వచ్చి మున్సిపాల్టీని కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో తన అభ్యర్ధికి అవకాశం ఇవ్వకపోవడం జీవన్ రెడ్డిలో మరింత అసంతృప్తి రాజేసింది. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉంది.  అయినా ఇటీవల జరిగిన  రాజ్యసభ ఎన్నికలలో జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉంటే ఈ వివాదం ఉండకపోయేదేమో!. రేవంత్ తన సన్నిహితుడు  వేం నరేంద్రరెడ్డికి ఇచ్చారు. దాంతో తనను అవమానిస్తున్నారని భావించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీని  ప్రభావం పార్టీపై పెద్దగా పడకుండా ఉండడానికి రేవంత్ ఆయనపై విమర్శలు చేసినట్లు  అనిపిస్తుంది. అయితే..  

ఈ పరిణామం  బీఆర్‌ఎస్‌కు మాత్రం కొంత ఉత్సాహం తెచ్చే విషయమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉండగానే  జీవన్‌ రెడ్డి లాంటి సీనియర్‌ కాంగ్రెస్‌ను వీడడం కార్యకర్తలలో ఆలోచనకు దారి తీస్తుంది. అలాగే  ప్రజలలో కాంగ్రెస్ దెబ్బతింటున్నదేమో అనే భావన కలగవచ్చు. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్‌ను, ఇటు జీవన్ రెడ్డిని కలిపి రేవంత్ విమర్శించారని చెప్పాలి. ఆ క్రమంలో రేవంత్ రెచ్చగొట్టే  వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. 

కాంగ్రెస్ కేడర్ లో అపనమ్మకం కలగకుండా ఉండడానికి రేవంత్‌  ఇలా చేసి ఉండవచ్చు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసిఆర్  ధీమా వ్యక్తం చేస్తే 2029లో ఆ పార్టీకి విపక్ష  హోదా దక్కనివ్వబోమని రేవంత్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవమే  అయినప్పటికీ దానినే ప్రమాణికంగా తీసుకోలేం. 

ఉదాహరణకు రేవంత్ 2018 శాసనసభ ఎన్నికలలో ఓటమి చెంది, 2019 లోక్‌సభ ఎన్నికలలో మేడ్చల్ నుంచి విజయం సాధించారు. అదే ఆయన  రాజకీయ జీవితంలో పెద్ద మలుపు అయింది. కేసీఆర్‌ను  పాపాల భైరవుడని.. ఆయన  చేసిన తప్పులకు ఉరి వేయాలని.. దమ్ముంటే రా కేసిఆర్ ..ఇలాంటి డైలాగులు చెప్పడం కేవలం  రెచ్చగొట్టడమే అనిపిస్తుంది.రాజకీయాలలో ఇదొక వ్యూహంగా చెప్పవచ్చు. 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాగే  తన రాజకీయ ప్రత్యర్దులపై పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయనకు శిష్యుడుగా భావించే రేవంత్ కూడా దానినే  ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇక కేసీఆర్ ప్రసంగం చూస్తే  ఆయన  ఒకటిరెండు అభ్యంతరకర పదాలు వాడినా  సెంటిమెంట్ పండించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా రేవంత్ పేరు కాని, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లు కాని తీయకుండా విమర్శలు చేయడం ప్రత్యేకతగా కనిపిస్తుంది. 

కాంగ్రెస్ గత ఎన్నికలలో ఇచ్చిన  ఆరు గ్యారంటీలను ప్రస్తావించి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని,కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, తాను ఆనాడే ఈ విషయం చెప్పానని, గోసపోతారని హెచ్చరించానని  చెప్పడానికి యత్నించారు. పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను  ఆయన గుర్తు చేసి అవి అమలు అయ్యాయా? అని ప్రజలను అడిగారు.  తాను సీఎంగా ఉండగా కరెంటు సరఫరాలో కాని, రైతులకు మేలు చేయడంలో కాని, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కాని ఎక్కడా అశ్రద్ద చేయలేదని, అలాంటిది ఇప్పుడు ఏమి రోగం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 

కాంగ్రెస్ హామీల గురించి కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు రేవంత్ జవాబు ఇచ్చినట్లు అనిపించదు. కాళేశ్వరం లోని మూడు  పిల్లర్లు  కుంగిన  అంశానికే ఎక్కువగా పరిమితం అయినట్లు అనిపిస్తోంది. రేవంత్ తీసుకువచ్చిన ఈ ప్రస్తావనకు కేసీఆర్ జవాబు ఇవ్వలేదు. ఇది ఈయన బలహీనత అయితే  హామీల అమలులో వైఫల్యాలు రేవంత్ వీక్నెస్‌గా కనిపిస్తుంది. 

తెలంగాణలో కలకలం రేపుతున్న హైడ్రా ను తాము అధికారంలోకి రాగానే  ఎత్తివేస్తామని కేసీఆర్‌ ప్రకటించడం కొత్త విషయంగా ఉంది. హైడ్రా వల్ల కాంగ్రెస్‌కు కొంత లాభం, మరికొంత నష్టం కలుగుతోంది. చెరువులలో నిర్మాణాలు, ఆక్రమణలు  తొలగించినప్పుడు ప్రభుత్వానికి మంచిపేరే వస్తోంది. కాని అదే టైమ్ లో పేదల ఇళ్లు కూల్చుతున్నారన్న విమర్శ, రాజకీయ ప్రేరేపితంగా ఇది పనిచేస్తోందన్న  డౌట్లు  రేవంత్ సర్కార్ ను ఆత్మరక్షణలో నెడుతున్నాయి. హైకోర్టు  కూడా ఈ హైడ్రా  పనితీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, కూల్చివేతలకు అడ్డుపడడం ప్రభుత్వానికి మైనస్ కింద లెక్క. 

ఉదాహరణకు పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆ ప్రాంతంలో కూల్చివేతలు  పెద్దగా జరగలేదట. ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు  చూపగానే హైడ్రాను ప్రయోగించారన్నది ఒక విమర్శగా ఉంది. ఇందులో నిజంగానే ఆక్రమణలు   ఉండవచ్చు. కానీ
రాజకీయ లక్ష్యాలతో పనిచేసినట్లు,బ్లాక్ మెయిల్ కు వాడుతున్నారన్న భావన జనంలో కలిగితే.. అన్యాయంగా తమ ఇళ్లను కూల్చారన్న అభిప్రాయం పెరిగితే..  అది కాంగ్రెస్‌కు పెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. 

రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం తదితర విషయాలు కూడా కేసీఆర్‌ లేవనెత్తారు. కాగా కేసీఆర్‌ రాజకీయ పునరేకీకరణ  అనే వ్యాఖ్య చేయడం విశేషం. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా? అనే చర్చకు అవకాశం ఇచ్చారు. అయితే  కాంగ్రెస్,ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారని.. అదే పునరేకీకరణ అని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇస్తున్నారు. 

ఏది ఏమైనా కేసీఆర్‌ నిజానికి తన  పూర్తి స్థాయి స్టైల్ లో ప్రసంగించలేదు. అయినా లాగూలు  పగిలేదాక.. అంటూ  కొన్ని పదాలు  వాడకుండా ఉంటే బాగుండేది. తన చావు ను కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారంటూ ప్రజలలో సెంటిమెంట్ ను తీసుకురావడానికి కేసీఆర్‌ యత్నించారు.  తన ప్రభుత్వం ఓడిపోయాక ,తెలంగాణ ఆగమైందని చెప్పడానికి కేసీఆర్‌ కృషి చేస్తే, తనది ప్రజాపాలన అని నమ్మించడానికి  రేవంత్ ప్రయత్నించారు. రెండు సభలను పోల్చి చూస్తే కేసీఆర్‌ కొంతమేర పైచేయి అయినట్లు  అనిపిస్తుంది. ఈ సభ ప్రభావం పరిమితం చేయడానికి రేవంత్ కాళేశ్వరం యాత్రను పెట్టుకున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement