డెహ్రాడూన్: పవిత్రమైన ఛార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఆర్థిక సంజీవనిలా మారుతోంది. బుధవారం (ఏప్రిల్ 22) పవిత్ర కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ (ఏప్రిల్ 19, 2026) రోజున లాంఛనంగా ప్రారంభమైన ఈ మహా యాత్రకు ఈ ఏడాది మునుపెన్నడూ లేని స్థాయిలో భక్తులు పోటెత్తుతున్నారు. భక్తిశ్రద్ధలతో సాగే ఈ మహా ప్రవాహం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల రాబడిని తెచ్చిపెట్టే అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది.
భారీగా రిజిస్ట్రేషన్లు.. బద్దలవుతున్న రికార్డులు
ఇప్పటికే ఛార్ ధామ్ యాత్ర కోసం దాదాపు 20 లక్షల మంది యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత ఏడాది మొత్తం 51 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఈసారి ఆ గణాంకాలు సునాయాసంగా దాటిపోతాయని అంచనా. ‘ఈ ఏడాది యాత్రికుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశం ఉంది’ అని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డుకు చెందిన రోహిణి వెల్లడించారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఇప్పటికే తెరుచుకోగా, బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 23న, హేమకుండ్ సాహిబ్ తలుపులు మే 23న తెరుచుకోనున్నాయి.
ఉపాధికి ఊతం.. స్థానికులకు వరదానం
ఈ మహా యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే కాదు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు. ప్రయాణానికి అవసరమైన హెలికాప్టర్ సేవలు, గుర్రాలు, కంచరగాడిదల రవాణా ద్వారా భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. భక్తుల రద్దీతో హోటళ్లు, అతిథి గృహాల వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. స్థానికంగా ఆహారం, పూజాసామగ్రి, స్మారక చిహ్నాలు విక్రయించే చిరు వ్యాపారులకు సైతం ఈ యాత్ర చేతినిండా పని కల్పిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వం, ఆలయ ట్రస్టులతో పాటు సామాన్య ప్రజలకు విశేష లబ్ధి చేకూరుతోంది.
రాష్ట్ర ఖజానాకు కాసుల పంట
పశ్చిమ బెంగాల్‌కు చెందిన అడమాస్ యూనివర్సిటీ, విద్యానగర్ కళాశాలలు 2024లో సంయుక్తంగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ ఆర్థిక వ్యవస్థకు సగటున రూ.7,500 కోట్ల రాబడి వస్తోంది. 2025లో ఉత్తరాఖండ్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ.3.81 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2026-27 సంవత్సరానికి మొత్తం రెవెన్యూ వసూళ్లు రూ.67,525 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో దాదాపు 12 శాతం వంతు కేవలం ఈ యాత్ర ద్వారానే సమకూరుతుండటం విశేషం. పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ యాత్ర వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.
ఇది కూడా చదవండి: ‘కీమో వద్దు.. పసరు ముద్దు’.. క్యాన్సర్ రోగికి ఏఐ షాక్!


