చర్యలు వద్దు.. కేసీఆర్‌, హరీష్‌కు భారీ ఊరట | Big Relief To KCR And Harish Rao In High Court | Sakshi
Sakshi News home page

చర్యలు వద్దు.. కేసీఆర్‌, హరీష్‌కు భారీ ఊరట

Apr 22 2026 10:42 AM | Updated on Apr 22 2026 11:44 AM

Big Relief To KCR And Harish Rao In High Court

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. ఇదే సమయంలో కమిషన్‌ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది. కాగా, ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. 

అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ జరిపిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై తుది తీర్పు వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేసింది. దీన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్‌ మాజీ అధికారి ఎస్‌.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టి ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. కమిషన్‌ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్‌ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.

మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ వేసినట్లు తెలిపారు. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్‌లను కొట్టివేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement