ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం | Sakshi Guest Column On Delimitation and women reservation | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం

Apr 15 2026 1:03 AM | Updated on Apr 15 2026 1:03 AM

Sakshi Guest Column On Delimitation and women reservation

సందర్భం

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా  తయారయింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెండు చట్టాలు, రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి.

చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతిపాదన దేశంలో దశాబ్దాలుగా నలుగుతోంది. చట్టం చేయాలన్న ఆలోచనలోనే పలు అవరోధాలు ఎదురై ఎట్టకే లకు 2023లో చట్టం ఏర్పడింది. అది కూడా 2024 సార్వత్రిక ఎన్ని కల వాకిట్లో ఆదరాబాదరాగా వచ్చిందే! అమలు ఎప్పట్నుంచి అన్న ప్రశ్న అప్పట్లోనే వివాదాస్పదమైంది. 2026 తర్వాత అందుబాటులో ఉండే తాజా జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్‌ అమలు పరచాలని నిర్ణయించి, దాన్నే చట్టంలో పొందుపరిచారు. 

కోవిడ్‌ కారణంగా 2021లో జరగని జనగణన 2025లో చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తారనీ, వెంటనే పునర్విభజన జరిపి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు జరపొచ్చనీ భావించారు. కానీ, 2025లో జన గణన మొదలు కాలేదు. ఇప్పుడు చేపట్టినా వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిచేయడం, ఆపై పునర్విభజన కమిషన్‌ ఏర్పరచి తాజా గణాంకాలతో ఆ ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ అమలు కష్టమనే కొత్త అభిప్రాయం బలపడింది. దాంతో, ఇక రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల్లోనే అనుకుంటు న్నారు. ఉన్నట్టుండి ‘లేదు లేదు, తాజా జనగణనతో నిమిత్తం లేకుండా పాత లెక్కలతోనే పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ అమలు చేసేద్దాం’ అని ఎన్డీయే పెద్దన్న బీజేపీ తీసిన కొత్త రాగమే భిన్నాభిప్రాయాలకు కారణమైంది.

మహిళా ఓట్లపై గురి
చట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఇప్పించడంలో మాకున్నంత పట్టుదల మరెవరికీ లేదని బీజేపీ నాయకత్వం చాటు కోవాలనుకుంటోంది. అందుకే తెలివిగా రిజర్వేషన్‌ అంశాన్ని పునర్విభజనతో ముడిపెట్టింది. 2023 మహిళా రిజర్వేషన్‌ చట్టంలో ఉన్నట్టుగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్‌ అంటే అది తప్పనిసరిగా జాప్యమౌతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. కానీ, 2029 లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా అంతకుముందే జరిగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, కర్టాటక, తెలంగాణ – పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల్లోనూ మహిళా ఓట్ల మొగ్గుతో లబ్ధి పొందవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. 

ఈ అంశంపై జరిగే చర్చ ద్వారా ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగాల్సివున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల మహిళా ఓటర్లనూ మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నది ఆశ! తాజా జనాభా లెక్కలు వచ్చాక, జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల సంఖ్యను పెంచితే ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దానికి విరుగుడుగా, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యకు ఏకరీతిలో అంతటా 50 శాతం పెంచడం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రచారం చేసేట్టు వ్యూహ రచన చేశారు. 

మరింత చర్చకు డిమాండ్‌
పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరింత చర్చ జరగాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. పెంపు వెంటనే చేపడితే మూడో వంతు సీట్లు (50 శాతం పెంపు ద్వారా) కొత్తగా వస్తాయి కనుక మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు పరచడంలో ఎవరికీ ఇబ్బందులుండవని పాలక పక్షం వివరిస్తోంది. అలా జరిగితే, తమకు రాజకీయంగా పట్టున్న అధిక జనాభా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఆధిక్యత లభిస్తుంది. తక్కువ మోతాదులో సీట్లు పెరిగే దక్షిణా రాష్ట్రాల్లో తమకు ఎలాగూ పట్టు లేదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడాల్సిన రాజకీయ అవసరం ఉండదనేది భరోసా! దీన్నే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరుగుదలకు కారణమైన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచి బహుమతినిస్తారా అని అవి ప్రశ్నిస్తున్నాయి.

చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యలోనే మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్‌ అమలు పరచాలని కాంగ్రెస్‌ అంటోంది. ఇందుకు పదిహేనేళ్లనాటి 2011 జనాభా లెక్కలు కాకుండా, వెంటనే జనగణన ముమ్మరం చేసి, 2027 మే నాటికి లభించే తాజా గణాంకాల్ని రిజర్వేషన్ల ఖరారుకు వాడుకోవాలని సూచిస్తోంది. ‘ఇండియా’ కూటమి అభిప్రాయం నేడు జరగనున్న వారి భేటీలో తేలవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి డీలిమిటేష న్‌ను జీఎస్డీపీకి లింక్‌ పెట్టాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు. దీనికి ఇతర రాష్ట్రాలు, పార్టీలు ఏ మేరకు మద్దతిస్తాయో చూడాలి.

ప్రత్యామ్నాయం పరిష్కారం
నియోజకవర్గాల పెంపు విషయంలో ఏ పద్ధతి అనుసరించాల న్నది ప్రశ్నార్థకంగా మారింది. అందరు ఓటర్లు విలువ సమానంగా, ఒకటిగానే ఉండాలని మొదట్లో భావించారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను, భౌగో ళిక స్వరూపాలను మార్చాలని నిర్ణయించారు. ఇందుకుగానూ ప్రతి పదేళ్లకోసారి ‘పునర్విభజన కమిషన్ల’ ఏర్పాటు ప్రతిపాదించారు. 1951, 1962, 1972లో అలా కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్‌సభ స్థానాల సంఖ్య 494 నుండి 522కు, 543కు పెరుగుతూ వచ్చింది. 

జనాభా ప్రాతిపదికగా నియోజక వర్గాల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుందనే ఆలోచన 1972 తర్వాత వచ్చింది. అందుకే నాటి లోక్‌సభ స్థానాల సంఖ్య 543కు కట్టడి విధించి, 2000 సంవత్సరం వరకు సంఖ్యను మార్చొ ద్దని నిర్ణయించారు. ఈ మేరకు 42వ రాజ్యాంగ సవరణ (1976)తో ఒకసారి, 84వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా మరోసారి సంఖ్యను పెంచకుండా 2026 వరకు కట్టడి చేయాల్సి వచ్చింది. 

1913 నుండి ‘ప్రతినిధుల సభ’ సభ్యుల సంఖ్యను అమెరికాలో 435కి కట్టడి చేసినట్టు మన దగ్గర కూడా కట్టడి చేయడమో, మరో హేతుబద్ధమైన ప్రత్యామ్నాయ విధానాన్నో వెతకాలి. జనాభా ప్రాతిపదికన ఏకరీతి సర్దుబాటు లోక్‌సభ స్థానాల్లో జరిపి, జనాభా నియంత్రించిన వారికి ప్రోత్సాహాలిచ్చే పద్ధతి రాజ్యసభ స్థానాల్లో కల్పించవచ్చనే సూచన వస్తోంది. అంతే తప్ప, ఏపీ సీఎం చంద్ర బాబు చెబుతున్నట్టు ‘ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనండి, మనకు నియోజక వర్గాలు పెరిగి ప్రాతినిధ్యం పెరుగుతుంది’ అన్నది పరి ష్కారం కాదు. అది తప్పు అవుతుంది.


దిలీప్‌ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్, పీపుల్స్‌ పల్స్‌ రిసెర్చి సంస్థ డైరెక్టర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement