ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ | Sakshi Guest Column On Tribal Talent and Khelo India | Sakshi
Sakshi News home page

ప్రతిష్ఠను పెంచే గిరిజన ప్రతిభ

Apr 3 2026 12:12 AM | Updated on Apr 3 2026 12:12 AM

Sakshi Guest Column On Tribal Talent and Khelo India

సందర్భం

మన దేశంలోని గ్రామీణ, అటవీ ప్రాంత బాలలు ప్రకృతి ఒడిలో ఎక్కువ సమయం గడపడం నేను గమనించాను. వాళ్లంతా రకరకాలుగా ఆడుకునే ప్రయత్నం చేస్తారు. నేలపై గీతలు గీయడం, కొన్ని ఆకారాలతో ఆట స్థలాలను సృష్టించడం, ఎండిన పండ్ల గింజలను పాచికలుగా – పావులుగా వాడటం వంటివి చేస్తుంటారు. ఎండిన ఆకులు, చింకిపాత లతో బంతులు చేస్తారు. వెదురు బొంగులతో హాకీ, ఫుట్‌బాల్‌ గోల్‌పోస్టులను తయారు చేస్తారు. చాలామంది బూట్లు లేదా జెర్సీలతో నిమిత్తం లేకుండా ఉత్సాహంగా ఆటపాటల్లో మునిగిపోతారు. చెరువులు, సరస్సులలో ఈదులాడుతూ ఆనందిస్తారు. ఒడిషాలోని జాజ్‌పూర్‌ వాస్తవ్యురా లైన 15 ఏళ్ల అంజలి ముండా ఇదే తరహాలో తనకు అందుబాటులో గల వనరులు, శిక్షణతో ఈతలో తన ప్రతిభకు సానబెట్టుకుని, ‘ఖేలో ఇండియా తొలి గిరిజన క్రీడలు–2026’లో తొలిరోజునే 3 స్వర్ణ పత కాలను కైవసం చేసుకుని యువతలో ఎనలేని స్ఫూర్తి నింపింది.

ఏకలవ్యుడి వారసత్వం
గిరిజనులకు విలువిద్యపై సహజంగా మక్కువ. సంథాల్‌ సమాజం తమపై దోపిడీని ఎదిరిస్తూ 1855లో బ్రిటిష్‌ పాలకులపై సాగించిన భీకర పోరాటం ‘సంథాల్‌ హూల్‌’ (తిరుగుబాటు)గా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. బ్రిటిష్‌ దళాలు ఆధునిక ఆయుధాలతో ఆ తిరుగుబాటును అణచివేసినప్పటికీ, సంథాల్‌ యోధుల యుద్ధ నైపుణ్యాన్ని ప్రత్యేకంగా గ్రంథస్థం చేశారు. నేను జార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అక్కడి ‘ఊరి –మారి’ గ్రామంలోగల ‘సంథాల్‌ హూల్‌’ వీరులు, అమర సోదరు లైన సిధో–కన్హు, చండ్‌–భైరవ్‌ సహా శౌర్యశీలురైన సోదరీమణులు ఫూలో–ఝానోల విగ్రహావిష్కరణ భాగ్యం నాకు దక్కింది. 

అసమాన విలుకాడిగా పూజలందుకునే ఏకలవ్యుని ఖ్యాతి
ఎంతటిదో భారతదేశంలోని ఏ బిడ్డను అడిగినా గొప్పగా వర్ణిస్తాడు. ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా గిరిజనులకు ఏకలవ్యుడు స్ఫూర్తి ప్రదాత మాత్రమేగాక విలువిద్యలో ఆదర్శప్రాయుడు. ఆయన వార సత్వానికి అనుగుణంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లోని ‘క్రీడా నైపుణ్య కేంద్రాలు’ బాలలకు ఆధునిక క్రీడా సౌకర్యాలు, విధా నాలను చేరువ చేస్తున్నాయి. నా వంతు కృషి ఫలితంగా మా స్వగ్రామంలోనూ నిరుపేద బాలల కోసం ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటైంది. మరికొంత ప్రయ త్నంతో ఆ పాఠశాల ప్రాంగణంలో విలువిద్యా శిక్షణకూ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు చిన్నచిన్న వ్యక్తిగత, సమష్టి ప్రయత్నాల ద్వారా గిరిజన బాలల్లో సహజ క్రీడా ప్రతిభ ఇనుమ డిస్తుందనడంలో సందేహం లేదు.

క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ
మా గ్రామంలోని ఇతర గిరిజన బాలల తరహాలోనే నేను కూడా చిన్నతనంలో ఈత కొట్టడం సహా ఇతర కసరత్తులు, క్రీడలపై ఆసక్తి చూపేదాన్ని. మా పాఠశాల క్రీడా పోటీలలో తరచూ ప్రథమ స్థానంలో నిలవడం నాకు పరిపాటి. అలాంటి ఓ పోటీ సందర్భంగా నా నేస్తానికి ప్రథమ బహుమతి ఆనందానుభూతినిచ్చే ఉద్దేశంతో నేను కావాలనే వెనుకబడటం ఓ మధుర జ్ఞాపకం. క్రీడలు బాలల్లో జట్టు స్ఫూర్తిని పెంచి, బలమైన సామాజిక స్నేహానుబంధాలకు తోడ్పడతాయి. మైదానంలో తీవ్రంగా పోటీపడే క్రీడాకారుల నడుమ సాధారణంగా స్నేహబంధం పటిష్ఠంగా ఉంటుందన్నది వాస్తవం.

మా సోదరుడు ఫుట్‌బాల్‌ చక్కగా ఆడేవాడు కానీ తీవ్ర గాయంతో ఆటలో కొనసాగలేకపోయాడు. మా కుటుంబ సభ్యు లందరూ వివిధ క్రీడలలో రాణించినవారే. గిరిజన కుటుంబాలకు ఉజ్వల క్రీడా సంప్రదాయం సహజాతమని చెప్పడానికే నా వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటున్నాను. వారి జీవితాల్లో క్రీడలు ఒక వినోదంగా, సామాజిక కార్యకలాపాల సాధనంగా మాత్రమే మిగిలి పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2018లో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కొన్ని క్రీడా సంస్థల సహకారంతో శ్రీకారం చుట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం నలు దిశలా నిబిడీకృతమైన ప్రతిభను విశేషంగా వెలుగులోకి తెస్తోంది.

మన దేశంలో కొన్నేళ్ల కిందటి దాకా కేవలం పెద్ద నగరాల్లోనే ఉత్తమ క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉండేవి. గిరిజన ప్రాంతాల్లో క్రీడల అకాడమీలు, శిక్షణ సౌకర్యాలు లభ్యమయ్యేవి కావు. కానీ, ఇవాళ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల్లో బాలలకు క్రీడా శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపటం నుంచి ‘ఖేలో ఇండియా గిరిజన క్రీడలు’ వంటి అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ఖేలో ఇండియా!
నా విద్యార్థి దశలో– అయిదారు గ్రామాల క్రీడా ఔత్సాహికులు ఏకమై, గ్రామీణులను సమీకరించి పోటీలు నిర్వహించడం నాకింకా గుర్తుంది. అలాగే, కొన్ని ఆధ్యాత్మిక–సాంస్కృతిక సంస్థలు కూడా గిరిజన ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ, అలాంటి పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు గ్రామీణ స్థాయిని దాటి ఎదగలేకపోయేవారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో భాగంగా కొన్నేళ్ల నుంచీ ప్రశంసనీయ కృషి సాగుతోంది. ‘ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌–2026’ అలాంటి చర్యలకు మరింత ఉత్తేజమిచ్చాయి. భారత్‌ తన క్రీడాకారుల సహజ ప్రతిభ వల్లనే 1928 ఒలింపిక్‌ క్రీడల్లో తొలి హాకీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆనాటి ఘన విజయంలో కీలక పాత్రధారులు గిరిజన క్రీడాకారులే. అప్పటి నుంచీ దిలీప్‌ టిర్కీ, సుబోధ్‌ లక్రా, సలీమా టెటే వంటి క్రీడాకారులు భారత కీర్తికిరీటంలో మణిమాణిక్యాలై హాకీ క్రీడకే వన్నెతెచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ క్రీడాభివృద్ధి కార్యక్రమం ‘ఖేలో ఇండియా’ కింద స్థానికం నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని భౌగోళిక ప్రాంతాలు, సామాజిక వర్గాలు, సంస్థలకు తగిన క్రీడావరణం కల్పించేందుకు కృషి కొనసాగుతోంది. ఈ కార్యక్రమం కింద ప్రధానంగా క్రీడలలో బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ‘అస్మిత’ పథకం అమలవుతోంది. దీనిద్వారా మన గిరి పుత్రికల సామర్థ్యం ఇనుమడించడమే కాకుండా జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌–2026’ ఇచ్చిన ఉత్తేజాన్ని నిరంతరం బలోపేతం చేయాలి. తదనుగుణంగా గిరిజన క్రీడాకారులను స్థిరంగా ప్రోత్సహిస్తే మన దేశాన్ని ప్రపంచ క్రీడారంగంలో అగ్రశక్తిగా నిలబెట్టగల క్రీడాకారుల సమూహం రూపొందుతుంది.

‘బస్తర్, సుర్గుజా ఒలింపిక్స్‌’లో ఏడు లక్షల మందికిపైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నక్సలిజాన్ని వీడి, క్రీడలనే సానుకూల మార్గంగా ఎంచుకున్న యువతరం కూడా వారిలో ఉన్నారు. గిరిజన వర్గాలు సహా మన యువతరం క్రీడాప్రతిభ, దేశానికి అమూల్య సామాజిక మూలధనం. ఈ వెలలేని వనరును సద్వినియోగం చేసుకోవడం ద్వారా జాతీయ క్రీడా రంగం ఎన్నో అద్భుత ప్రమాణాలను నెల కొల్పగలదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ‘ఖేలో ఇండియా! ఖూబ్‌ ఖేలోఇండియా!’ అంటూ నా వంతుగా నినదిస్తున్నాను.

ద్రౌపది ముర్ము 
భారత రాష్ట్రపతి
(మార్చి 25న ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలి ‘ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌’ నేటితో ముగియనున్నాయి.) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement