ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు! | Sakshi Guest Column On China, USA Issues Regarding Taiwan | Sakshi
Sakshi News home page

ఇటు అంగీకారాలు, అటు హెచ్చరికలు!

May 18 2026 12:24 AM | Updated on May 18 2026 12:24 AM

Sakshi Guest Column On China, USA Issues Regarding Taiwan

విశ్లేషణ

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల చర్చలు ఇరువురూ కోరుకున్నట్లే సాగాయి. బీజింగ్‌ ప్రయాణానికి ముందు ట్రంప్‌ మాట్లాడుతూ, తమకు ‘అన్నింటికన్న వాణిజ్యం ముఖ్య’మన్నారు. షీ చెప్పిన ప్రధానమైన లక్ష్యాలు, ‘అమెరికాతో నిర్మాణాత్మకమైన సంబంధాలు, వ్యూహాత్మకమైన స్థిరత్వం’. నాయకులిద్దరి మధ్య మే 14, 15 తేదీలలో రెండు విడతల సమావేశం తర్వాత, అంతా సజావుగా జరిగిందన్నది ఉభయుల సంతృప్తి. అదే సమయంలో చైనా అధ్యక్షుడు తైవాన్‌ విషయమై అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు చేసి ఆశ్చర్యపరిచారు. ట్రంప్‌ నుంచి మౌనమే సమాధానమైంది.

‘ఒకే చైనా’కు ఒప్పుకొంటారా?
మిగిలినదంతా సవ్యంగానే జరిగినందున, అపశృతిగా మారిన తైవాన్‌ అంశంపై జరిగిందేమిటో ముందు చూడాలి. చారిత్రకంగా చూసినా, అంతర్జాతీయ చట్టాల ప్రకారమైనా తైవాన్‌ దీవి చైనాలో భాగం. అమెరికా సహా ప్రపంచమంతా ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీ కరిస్తున్నాయి. తైవాన్‌తో దౌత్య సంబంధాలు లేవు. అదే సమయంలో గమనించదగ్గదేమంటే... అమెరికా, దాని మిత్ర దేశాలు కేవలం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం తైవాన్‌కు భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తూ, పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తైవాన్‌ చైనాదేననీ, కానీ వారికి ఇష్టం లేకుండా చైనాలో విలీనం చేసుకునేందుకు అంగీకరించ బోమనీ విచిత్రమైన వాదన చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాను సాధారణ దౌత్య మార్గంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ వచ్చిన చైనా అధ్యక్షుడు, అమెరికా ‘సవ్యంగా వ్యవహరించని పక్షంలోరెండు దేశాల మధ్య విభేదాలు, చివరకు ఘర్షణ తప్పక పోవచ్చు’ నని ట్రంప్‌ను హెచ్చరించారు.

విషయ తీవ్రత దృష్ట్యా ఇందు గురించి మరికొన్ని వివరాలు చూద్దాము: ఒకవైపు ‘ఒకే చైనా’ సూత్రాన్ని అంగీకరిస్తూనే, మరొక వైపు తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా, తన ద్వంద్వ నీతికి ‘వ్యూహాత్మక అస్పష్టత’ (స్ట్రాటెజిక్‌ ఆంబిగ్విటీ) అనే పేరు తానే పెట్టింది. తైవాన్‌ను కాపాడటం తమ లక్ష్యమంటూ చట్టమే చేసింది. ఒకవేళ తైవాన్‌ను చైనా స్వాధీనపరచుకొనజూస్తే తాను తైవాన్‌కు సహాయం మాత్రమే చేస్తుందా లేక స్వయంగా యుద్ధంలో పాల్గొంటుందా అనే ప్రశ్నకు అవుననిగానీ, కాదనిగానీ స్పష్టం చేయటం లేదు. మరొకవైపు బైడెన్‌ ప్రభుత్వం ప్రకటించిన ఇండో– పసిఫిక్‌ స్ట్రాటెజీ (2022), ట్రంప్‌ తన రెండవ హయాంలో ప్రకటించిన నేషనల్‌ సెక్యూరిటీ స్ట్రాటెజీ (2025), నేషనల్‌ డిఫెన్స్‌ స్ట్రాటెజీ (2026) పత్రాలను పరిశీలించినప్పుడు, తైవాన్‌ను ఉపయోగించు కుని చైనాను నియంత్రించటం వారి ఉద్దేశమని లిఖితపూర్వకంగా, బహిరంగంగా ప్రకటించటం కనిపిస్తుంది.

మౌనం ప్రస్తుతానికేనా?
ఈ దిశలో అమెరికా ఇంకా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న పరిస్థితిలోనే చైనా అధ్యక్షుడు, బహుశా విసుగెత్తి కావచ్చు, గతంలో ఎన్నడూ లేని రీతిలో పై విధమైన హెచ్చరికను ముఖాముఖీగా చేశారు. సమావేశాల సమయంలో, అంతకుముందూ ఇంకా ఏమేమి మాటలు వినిపించాయో గమనించాలి. తక్కిన విషయాలన్నీ ఎట్లున్నా, చైనాకు గల ‘ముఖ్యమైన ప్రయోజనాలలో అతి ముఖ్యమైన ప్రయోజనం’ తైవాన్‌ అన్నారాయన. ఈ అంశం సవ్యంగా తేలనట్లయితే ‘అత్యంత తీవ్రమైన ప్రమాదకర పరిస్థితికి’ దారి తీయగలదన్నారు. అమెరికా– చైనా సంబంధాలు యావత్తు ప్రమాదకరమవుతాయని హెచ్చరించారు. తైవాన్‌ స్వాతంత్య్రం, ఆ ప్రాంతంలో శాంతి అన్న రెండు మాటలు నీళ్లు–నిప్పు వంటివనీ, రెండింటికి పొసిగే ప్రసక్తి లేదనీ అన్నారు.

తైవాన్‌ గురించి ఇంతింత చెప్పుకోవటం ఎందుకంటే, 1949లో చైనాలో కమ్యూనిస్టు విప్లవం రావటానికి ముందు, వారికి చెందిన తైవాన్‌ దీవిని జపాన్‌ సైనికంగా ఆక్రమించింది. తర్వాత, మావోతో ఓడిపోయిన చాంగ్‌ కై షేక్‌ వర్గం తైవాన్‌కు పారిపోగా, ఆ వర్గాన్ని అమెరికా కూటమి, జపాన్‌ మద్దతిచ్చి నిలబెట్టాయి. మొదటి నుంచి చైనాకు చెందిన ఆ దీవిని తిరిగి తమ దేశంలో విలీనం చేసుకోవటం చైనా నాయకత్వానికి ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ లక్ష్యంగా మారింది. ఇపుడు ట్రంప్‌తో చర్చల సందర్భంగా చైనా అధ్యక్షుడు ఈ విషయమై ఎన్నడూ లేనంత తీవ్రంగా మాట్లాడటానికి వెనుక ఈ సుదీర్ఘ నేపథ్యం ఉంది. విషయం అమెరికా పక్షానికి తెలియనిది కాదు. పరిస్థితి శాంతియుతంగా తేలనట్లయితే ఎప్పటికైనా సరే తైవాన్‌ను బలప్రయోగం ద్వారానైనా విలీనం చేసుకోగలమన్నది కూడా చైనా చెప్తున్న మాటే. జిన్‌పింగ్‌ హెచ్చరికలకు 14వ తేదీన ట్రంప్‌ స్పందించలేదు. 

కానీ ముందు రోజున ఆయన విదేశాంగ మంత్రి మార్కో రూబియో ‘మా విధానంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు. చైనా సైనిక చర్యకు పాల్పడితే అది పొరపాటు అవుతుంది’ అని మాత్రం అన్నారు. కొద్ది నెలల క్రితం ట్రంప్‌ ఒక ప్రశ్నకు జవాబిస్తూ, ‘చైనా అభిప్రాయాలు తెలుసు. వారు తైవాన్‌ విషయమై పట్టుదలగా ఉన్నారు. కనీసం నా అధ్యక్ష కాలంలో సైనిక చర్య తీసుకోబోదని ఆశిస్తాను’ అన్నారాయన. గమనించవలసింది ఏమంటే, అధికారంలో ఉన్నది రిపబ్లికన్లా, డెమోక్రాట్లా అన్న దానితో నిమిత్తం లేకుండా, పసిఫిక్‌ ప్రాంతంలో తమ ప్రయోజ నాలకు, చైనాను కట్టడి చేసేందుకు తైవాన్‌ తమ పలుకుబడిలో ఉండాలన్నది అమెరికా వ్యూహం. ఇపుడు చైనా అధ్యక్షుని హెచ్చరిక ప్రభావం ఎట్లుండవచ్చునన్నది వేచి చూడవలసిన విషయం.

ట్రాప్‌లో పడొద్దు!
చర్చల వివరాలను ఇతరత్రా గమనించినప్పుడు, ప్రధానమై నది పరస్పర ఆర్థిక సంబంధాలు. వాణిజ్యపరంగా ‘గొప్ప ఒప్పందాలు’ జరిగినట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఆయన వెంట సుమారు 30 అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలను తీసుకువెళ్లటంలోని ఉద్దేశమూ అదే. అమెరికాలోనూ అదే పద్ధతిలో చైనా ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశ మిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో అమెరికా, చైనాలు భాగస్వా ములుగా పరస్పరం సహకరించుకోవాలి తప్ప పోటీదారులు కారా దనీ, ఇరువురి సంబంధాలు స్థిరమైన విధంగా సాగాలనీ షీ అన్న మాటలు ట్రంప్‌కు నచ్చినట్లే కనిపించాయి. తమ సంబంధాలు ‘గతంలో ఎన్నడూ లేనంతగా’ ముందుకు పోగలవన్నారాయన.

చైనా అధ్యక్షుడు తన పరస్పర సహకార సూచనలకు మద్దతుగా, క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలో స్పార్టా, ఏథెన్స్‌ల మధ్య జరిగిన ఒక యుద్ధాన్ని ఉదహరించారు. అగ్రస్థానంలో ఉండిన స్పార్టా, రెండవ స్థానంలో ఉండిన ఏథెన్స్‌ తనను మించి పోగదలనే భయంతో ముందస్తు యుద్ధం వంటిది చేస్తుంది. అట్లా భయంలో చిక్కుకోవటాన్ని తుసిడిడీస్‌ అనే చరిత్రకారుడు విశ్లేషించి చెప్పాడు. అప్పటినుంచి ఆ భయాందోళనల స్థితిని ‘తుసిడిడీస్‌ ట్రాప్‌’ అంటున్నారు. అమెరికా, చైనా అటువంటి ట్రాప్‌లో చిక్కు కోకుండా పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని జిన్‌పింగ్‌ సూచించగా, అటువంటి సహకారం గతంలో ఎన్నడూ లేనంతగా ఉండగలదన్నది ట్రంప్‌ ఇవ్వబూనిన భరోసా!

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement