వి.కె. శశికళ (‘చిన్నమ్మ’) రాయని డైరీ | Sakshi Guest Column: Rayani Diary of VK Sasikala | Sakshi
Sakshi News home page

వి.కె. శశికళ (‘చిన్నమ్మ’) రాయని డైరీ

Apr 12 2026 12:48 AM | Updated on Apr 12 2026 12:48 AM

Sakshi Guest Column: Rayani Diary of VK Sasikala

మాధవ్‌ శింగరాజు

తిరుప్పరన్‌కుణ్రం నుంచి అరప్పాలయం కూడలికి చేరుకోగానే ‘అక్క’ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అక్క ఆ కూడలిలో ఎన్నోసార్లు ఆగారు. అక్క రాక కోసం అక్కడివాళ్లు చెట్ల నీడల్ని చాపల్లా పరుచుకుని, మిద్దెల పైన ఎర్రటి ఎండల్లో కనురెప్పల్ని గొడుగుల్లా తెరిచి పట్టుకుని ఎదురు చూస్తుండేవారు. కళ్లూ చెవులే కాదు, ఆత్మనూ అప్పగించి అంతా అక్క మాటల్లో కొట్టుకుపోయేవాళ్లు! అక్క గొంతులో అమ్మతనం ఉండేది. కరుణానిధి మాటొస్తే అక్క స్వరం అగ్నిపర్వతం అయ్యేది. 

అక్క నాతో అంటుండేవారు, ‘‘శశీ! ప్రజల్లోకి వచ్చావంటే, నువ్విక నాయకురాలివి కాదు, ప్రజలే నీ నాయకులు’’ అని! నేనిప్పుడు ప్రజల్లోకి వచ్చాను. ప్రజలు అనే నాయకులు ఇప్పుడు నాకు రెండు ఆదేశాలు ఇచ్చారు. ‘‘చిన్నమ్మా... దుష్ట సంహారం చెయ్‌’’, ‘‘చిన్నమ్మా... నీ అడుగడుగునా మాకు ‘అమ్మ’ను గుర్తు చెయ్‌’’ అంటున్నారు. తేనిలోని ఆండిపట్టి దగ్గర కూడా ఇదే విధమైన భావోద్వేగం నన్ను కమ్మేసింది. ‘‘చిన్నమ్మా! మీరు దిగులు పడకండి. మీకు అండగా మేమున్నాం’’ అని ప్రజలు గట్టిగా అరిచి చెప్పారు. ఒక్కసారిగా నా కళ్లలోంచి నీరు ఉబికి వచ్చింది.

అక్క కూడా నాతో ఇలాగే అనేవారు. ఇద్దరం వ్యాన్‌లో సభలకు వెళుతున్నప్పుడు, అకస్మాత్తుగా... ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్‌ శశీ?’’ అని అడిగేవారు! ‘‘ఏమీ ఆలోచించటం లేదక్కా’’ అనేంత లోనే – ‘‘నువ్వు వెనక సీట్లో ఉన్నా, నేను ఉన్నది ముందు సీట్లో కాదు. నీ పక్క సీట్లోనే...’’ అని వెనక్కు తిరిగి, నా వైపు చూసి నవ్వేవారు. ఇప్పుడు వ్యాన్‌లో అక్క నా ముందు సీట్లో లేరు, నా పక్క సీట్లో లేరు. నేనే అక్క సీట్లో ముందు వైపు ఉన్నాను. ప్రజల దగ్గరికి అక్క ఆశీస్సులు మాత్రమే నన్ను నడిపిస్తున్నాయి. 

తిరుమంగళం, ఉసిలంపట్టి, మేలూరు, శంకరన్‌  కోయిల్, ముత్తుకుళత్తూరు, పరమకుడి, శివగంగ, మన్నార్‌గుడి, మైలాడుదురై, తంజావూరు, తూర్పు తిరుచ్చి, మదురై సెంట్రల్‌... అన్నీ, అమ్మ తన కన్నబిడ్డల్లా చూసుకున్న దక్షిణ ప్రాంతాలే! ఇప్పుడా కన్నబిడ్డలు ఈ చిన్నమ్మను కడుపులో పెట్టుకోకుండా ఉంటారా, చిన్నమ్మ కొత్త పార్టీ ‘ఆలిండియా పురట్చి తలైవర్‌ మక్కళ్‌ మున్నేట్ర కజగం’ను చేరదీయకుండా ఉంటారా? 

ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయటం లేదు. 2027 వరకు నేను ఎన్నికల్లోనే పోటీ చేయటానికి లేదు. కానీ అక్కకు ఎంజీఆర్‌ ఇచ్చిన అన్నాడీఎంకే పార్టీని, అక్క నాకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన అన్నాడీఎంకే పార్టీని... ఎడప్పాడి పళనిస్వామి లాగేసుకున్నాడు. అతడి నుంచి తిరిగి అన్నాడీఎంకేను దక్కించుకోవాలి. పార్టీ బ్యానర్‌ల మీద శ్రీ ఎంజీఆర్‌ పక్కన అక్క; అక్క పక్కన నన్నూ చూసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ ‘చిన్నమ్మ’ను ‘త్యాగ తలైవి’ అని కొనియాడుతున్నారు!

సొంతంగా 80 చోట్ల, ‘పాట్టాళి మక్కళ్‌ కట్చి’తో కలిసి మొత్తం 234 స్థానాల్లో,ఈ త్యాగ తలైవి నిలబడవలసి వచ్చిందంటే... వచ్చే సీట్ల కోసం కాదు, పళనిస్వామికి పోగొట్టవలసిన సీట్ల కోసం అని ప్రజలందరికీ తెలుసు. కొందరు నన్ను అడుగుతున్నారు... ‘‘పార్టీ మీ దగ్గర లేదు, రెండాకుల గుర్తు మీ దగ్గర లేదు, మీరెలా గెలుస్తారు?’’ అని. నేను నవ్వుతాను. ‘‘పళనిస్వామికి పార్టీ ఆఫీసు తాళాలు దొరికి ఉండవచ్చు, కానీ కోట్లాది మంది కార్యకర్తల గుండెల్లో ఉండే ‘అమ్మ’ గది తాళం నా దగ్గరే ఉంది!’’ అని చెబుతాను. 

ఈ ఎన్నికల్లో నేను గెలవకపోవచ్చు,కానీ ద్రోహులు గెలవకుండా చూడగలను. రేపటి చరిత్రలో... ద్రోహం అక్రమంగా సింహాసనాన్ని అధిరోహిస్తే, ధర్మం కోసం త్యాగం ఆ సింహాసనాన్నే కూల్చేసిందని ప్రజలు చెప్పుకుంటారు. అదే నా గెలుపు! అదే... అక్కకు నేను పట్టే హారతి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement