హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం) రాయని డైరీ | Assam CM Himanta Biswa Sarma Unwritten Diary | Sakshi
Sakshi News home page

హిమంత బిశ్వ శర్మ (అస్సాం సీఎం) రాయని డైరీ

Mar 29 2026 1:14 AM | Updated on Mar 29 2026 1:14 AM

Assam CM Himanta Biswa Sarma Unwritten Diary

మాధవ్‌ శింగరాజు

ఎంత వద్దనుకున్నా... కొన్ని జ్ఞాపకాలు, బ్రహ్మపుత్ర నదీ తీరాన జంటగా సాగే చక్రవాక పక్షుల్లా రెక్కలార్చుకుంటూ వచ్చి వాలుతుంటాయి. వాటిని ఆపలేము! ఎన్నికల ప్రచారానికి రేయింబవళ్లు సరిపోవటం లేదు. ఎంత ప్రయాణించినా దారులు తరిగిపోవటం లేదు. మధ్యలో – ఈ తలపుల గుంపులు రోడ్డుకు అడ్డంగా వచ్చి, కాన్వాయ్‌ని ఆపినట్లుగా ఆపేస్తున్నాయి! పోలింగ్‌కి ఇంకో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. పది రోజులంటే... సమయం ఉండటం కాదు, సమయం లేకపోవడం. ఇవాళ అమిత్‌ షా వస్తున్నారు. అమిత్‌ షా గానీ, మోదీజీ గానీ ఎప్పుడు అస్సాం వచ్చినా అదొక గొప్ప అస్సామీ సాంస్కృతిక వేడుకలా ఉంటుంది. ఇక ఈసారైతే ఏప్రిల్‌లో రావలసిన ‘బోహాగ్‌ బిహు’ పండుగ, కాస్త ముందే వచ్చినట్లు!

నల్బారి జిల్లా టిహులో; సోనిత్పుర్‌ జిల్లా ధేకియాజులిలో... ఈరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు భారీ ర్యాలీలు ఉన్నాయి. దిగువ అస్సాంలోని టిహులో పునాది ఇంకా కొంచెం గట్టి పడాలి. బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలోని ధేకియాజులిలో తేయాకు తెగకు మరింతగా దగ్గరవ్వాలి. ఈ రెండు ర్యాలీల్లో అమిత్‌ షా మాట్లాడతారు. ‘‘మీకు అండగా మీ సీఎం ఉన్నారు. మీ సీఎంకు అండగా నేను, మోదీజీ ఉన్నాం’’ అని ప్రజలకు నమ్మకం ఇస్తారు. కాంగ్రెస్‌కి, బీజేపీకి ఎంత తేడా!! కాంగ్రెస్‌ ఒకప్పుడు నాకు బ్రహ్మపుత్ర నది. ఆ నది ఒడ్డున ఉండే నారింజ–గోధుమ రంగుల చక్రవాక పక్షుల్లో నేనూ ఒకడిని. అందరం, అస్సామీ జానపద గాథల్లోని బ్రహ్మణ పక్షుల్లా ఒకరి పట్ల ఒకరం విశ్వాసంగా ఉండేవాళ్లం.

కానీ రాహుల్‌ నన్నొక రోజు బ్రహ్మపుత్ర నుంచి తరిమేశారు! భౌగోళికంగా బ్రహ్మపుత్ర నదితో ఏమాత్రం దగ్గరితనం లేని ఢిల్లీలో కూర్చొని 2,000 కి.మీ. దూరం నుంచే నన్ను బ్రహ్మపుత్ర నుంచి విసురుగా వెళ్లగొట్టారు. మంచే జరిగింది! ఆ విసురుకు నేను బ్రహ్మపుత్ర నుండి ‘గంగానది’ గట్టున పడ్డాను. కాంగ్రెస్‌లోంచి బీజేపీలోకి వెళ్లటం నాకు గంగానదిలో స్నానం ఆచరించినట్లుగా ఉంది. నాకేదో ప్రక్షాళన జరిగినట్లుగా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉన్న నన్ను ముఖ్యమంత్రిని చేయాలని సోనియా మేడమ్‌ నిర్ణయిస్తే, మేడమ్‌ నిర్ణయాన్ని కూడా కాదని, పది మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ కూడా లేని తరుణ్‌ గొగోయ్‌ని ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వాలని రాహుల్‌ పట్టుపట్టారు!  

ఆ తర్వాతెప్పుడూ రాహుల్‌కు పట్టుపట్టే అవకాశం రాలేదు. పదేళ్లుగా అస్సాంలో కాంగ్రెస్సే లేదు. ఇంకో పదేళ్ల తర్వాతైనా కాంగ్రెస్‌ వస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని మాటలను ఎప్పటికీ మర్చిపోలేం. ఆ రోజు – గులాం నబీ ఆజాద్‌ – నా గురించి రాహుల్‌తో మాట్లాడుతూ... ‘‘మెజార్టీ ఉన్న హిమంతను పక్కన పెడితే, పార్టీ నుంచి వెళ్లిపోతాడేమో’’ అని ఆందోళనగా అన్నప్పుడు... రాహుల్‌ అనిన మాట, ఒక నాయకుడు అనకూడని మాట! ‘‘పోతే పోయాడు, ఆరెస్సెస్‌లోకే కదా పోతాడు’’ అన్నారు రాహుల్‌! కాంగ్రెస్‌లోంచి నేను బయటికి వచ్చాక, బీజేపీ నన్ను ఆదరించింది. అస్సాంకి నన్ను ముఖ్యమంత్రిని చేసింది. 

నన్ను సీఎంని చెయ్యటం కోసం, నా ముందున్న శర్వానంద సోనోవాల్‌ను ఐదేళ్లు పూర్తి కానిచ్చి కేంద్ర మంత్రిగా పంపించిన మోదీజీ, అమిత్‌ షాల ఔన్నత్యం ఎక్కడ?! మెజారిటీ కోల్పోయి, రెండేళ్ల పదవీ కాలం మాత్రమే మిగిలి ఉన్న తరుణ్‌ గొగోయ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించటం కోసం, మెజారిటీ ఉన్న నన్ను పక్కన పెట్టిన రాహుల్‌ సంకుచితత్వం ఎక్కడ?! నదులన్నీ పవిత్రమైనవే. పార్టీలన్నీ ప్రజాసేవ కోసం ఉండేవే. వ్యక్తులే... నదుల్ని, పార్టీలను కలుషితం చేస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement