సందర్భం
ఇటీవలి ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల్లో కొంతకాలం నిర్బంధాలకు గురైన జెరూసలేం నగరంలోని ప్రార్థనా స్థలాలు, కాల్పుల విరామ సమయంలో మళ్లీ తెరుచుకున్నాయి. ‘వెయిలింగ్ వాల్’గా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోడ వద్ద యూదులు; అల్–అఖ్సా మసీదులో మహమ్మ దీయులు; పరిశుద్ధ సమాధి ఆలయంలో క్రైస్తవులు– ఇలా మూడు ముఖ్య మతాలవారూ ఒకేసారి ప్రార్థనలు చేస్తున్న ఈ చిన్న నగరం ఎందుకు ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తోంది? యుద్ధ మేఘాల మధ్య కూడా ఆధ్యాత్మిక ఆకర్షణను ఎలా నిలబెట్టుకోగలుగుతోంది?
క్రీ. పూ. 1000 ఏళ్ల ప్రాంతంలో పాత ఇశ్రాయేలును పాలించే యూదురాజు దావీదు ‘జెబూసులు’ అనే స్థానిక తెగల నుంచి జెరూసలేం నగరాన్ని జయించి, దానిని ఏకీకృత ఇశ్రాయేలు రాజ్య రాజధానిగా చేశాడు. అతని కుమారుడు సాలమన్ ఆ నగరంలో నేడు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తున్న కొండపై మొట్ట మొదటి యూదు ఆలయం నిర్మించాడు. ఆ ఆలయాన్ని తరువాతి కాలంలో బాబిలోనియన్లు, ఆ తరువాత రోమన్లు ధ్వంసం చేశారు. మిగిలిన అవశేషమైన గోడను ఈ రోజు ‘ఏడ్పుల గోడ’గా పిలుస్తున్నారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ కొండ, దానిపై ఒకప్పుడున్న ఆలయం గుర్తుగా మిగిలిన అవశేషం యూదులకు పరమ పవిత్రమైన ప్రార్థనా స్థలాలు.
క్రైస్తవ మతానుయాయులకు, జెరూసలేం యేసుక్రీస్తు జీవితంతో ముడిపడి ఉంది. యేసు ఇక్కడే బోధించాడు, శిలువ వేయబడ్డాడు, పునరుత్థానం చెందాడు. నాలుగవ శతాబ్దంలో ‘పరిశుద్ధ సమాధి’ నిర్మాణంతో ఇది క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మారింది. ‘గోల్గతా’ లేదా ‘కల్వరి’గా పిలిచే శిలువ వేయబడిన స్థలం, క్రీస్తు సమాధి అయ్యి పునరుజ్జీవం పొందిన అనంతరం ఖాళీ అయిన సమాధి, శిక్షాస్థలి నుండి శిలువ వరకు క్రీస్తు నడిచి వెళ్ళిన ‘వేదన మార్గం’ (లేదా డోలోరోసా), సమాధికి వెళ్ళే మార్గంలో, క్రీస్తు అనుభూతులను జ్ఞప్తికి తెచ్చే 14 ముఖ్య ప్రాంతాలు– క్రైస్తవులకు పరమ పూజనీయాలు.
ముస్లింలు అల్–ఖుద్స్‌గా పిలుచుకునే జెరూసలేం నగరం వారికి మక్కా, మదీనాల తరువాత అత్యంత పవిత్రమైన స్థలం. ఇస్లాం మొదటి రోజుల్లో జెరూసలేం వైపే ఖిబ్లా, అంటే ‘నమాజు చేసే దిక్కు’ ఉండేది; తరువాతి రోజుల్లో కారణాంతరాల వల్ల ఈ దిక్కు మక్కాలోని ‘కాబా’ వైపునకు మారింది. మహమ్మద్ ప్రవక్త ఒక రాత్రి మక్కా నుంచి జెరూసలేం వచ్చి; హరామ్ అల్ షరీఫ్ (అదే ప్రాంతాన్ని యూదులు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తారు)లోని ‘పునాది శిల’ నుంచి స్వర్గారోహణ చేశాడని మహమ్మదీయులు విశ్వసిస్తారు. అదే శిలపై తరువాతి కాలంలో నిర్మించబడిన ‘రాతి గుమ్మటం’, దాని పరిసరాలలోని ‘అల్–అఖ్సా మసీదు’... ఇవన్నీ మహమ్మదీయులకు ఎనలేని ప్రాధాన్యం కలిగిన స్థలాలు. మహమ్మద్ ప్రవక్త స్వర్గారోహణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన ఇస్రా, మిరాజ్‌లకు కూడా ఈ ప్రాంతం కేంద్ర బిందువు.
ఒకే మూల పురుషుడు
ఆరాధనా స్థలాలలోనే కాదు, ఆవిర్భావంలో కూడా ఈ మూడు మతాలకు విశేషమైన సారూప్యత, సామీప్యత ఉన్నాయి. ‘ఒకే దైవం’ అనే సిద్ధాంతాన్ని విశ్వసించి, బోధించిన ప్రప్రథమ ప్రవక్త ‘అబ్రహమ్’ లేదా ‘ఇబ్రహీమ్’. ఆ ప్రవక్త కుమారుడైన ఇసాక్‌కు జాకబ్ జన్మించాడు. ‘ఇజ్రాయెల్’ అనే దైవదత్త నామాంతరం కలిగిన జాకబ్ నుండి యూదులు ఉద్భవించటంతో, వారి ప్రాంతం ‘ఇజ్రాయెల్’గా పేరొందింది. జన్మతః యూదు మతస్థుడైన క్రీస్తు మరణానంతరం... ఆయనను విశ్వసించే యూదు సమూహం వారి అసలు మతాన్నుండి విడివడటంతో క్రైస్తవులుగా వారిని పిలుస్తున్నారు. అబ్రహమ్ మరో కుమారుడైన ఇస్మాయిల్ నుండి ఇస్లాం ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. ఇలా ఒకే మూల పురుషుడు గలిగిన మూడు మతాలవారు, ఒకే భౌగోళిక ప్రాంతంలో తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు నిర్వహించడం అసాధారణం కాదు.
ఒకే ప్రవక్త నుండి ఉద్భవించి, ఒకే చరిత్రను పంచుకోవడం వల్ల జెరూసలేం మూడు మతాలవారికీ ముఖ్య కేంద్రంగా ఖ్యాతికెక్కింది. చిత్రంగా, అదే చారిత్రక వాస్తవం శతాబ్దాలుగా సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు – ఒక్కోసారి మానవ హననానికి కూడా కారణమవుతోంది. యుద్ధ విరామంలో ఈ పవిత్ర స్థలం తిరిగి అందరినీ అక్కున జేర్చుకోవడం సుస్థిరమైన శాంతిని స్థాపించే సుదీర్ఘ ప్రస్థానంలో చిన్న ఆశాకిరణం.
కృష్ణబాలాజీ పల్లపోతు
వ్యాసకర్త ఎస్‌బీఐలో, పశ్చిమాసియా దేశాల్లో విధులు నిర్వహించిన విశ్రాంత ఉన్నతాధికారి


