విజయ్‌ (తమిళ్‌ స్టార్‌) రాయని డైరీ | TVK Vijay Rayani Diary | Sakshi
Sakshi News home page

విజయ్‌ (తమిళ్‌ స్టార్‌) రాయని డైరీ

May 3 2026 12:20 AM | Updated on May 3 2026 12:20 AM

TVK Vijay Rayani Diary

మాధవ్‌ శింగరాజు

‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌లోని నీలాంగరై బీచ్‌ హౌస్‌ బయట నా అభిమానులు చేస్తున్న నినాదాలు పోటెత్తిన వేసవి సాయంత్రపు అలల్లా వచ్చి నన్ను ఢీకొని, చల్లటి చిలకరింపుగా నా ముఖాన్ని తాకుతున్నాయి. ఎంత హాయి! వారి వైపు చూస్తూ చేతులు జోడించాను. ‘‘అలా కాదు తలపతీ, ఇలా...’’ అంటూ వెయ్యి పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేచాయి! వెయ్యిన్నొక్క చెయ్యిగా వారితో నా పిడికిలి కలిపాను. చేతిని గాలిలో ఊపుతూ... ‘‘ఎన్‌ నెంజిల్‌ కుడియిరుక్కుమ్‌’’ అని నేను అంటుండగానే, ‘‘ఎన్‌ అన్బు రసిగర్గళుక్కు వణక్కమ్‌’’ అని ఎప్పటిలా వారు నా మాటను చటుక్కున పూర్తి చేశారు! అది నాకూ, వారికి మధ్య ఏర్పడిన పద–బంధం. ‘‘నా హృదయంలో కొలువై ఉన్న...’’ అంటానా, ‘‘నా ప్రియమైన అభిమానులకు నమస్కారాలు...’’ అని వారు అందుకుంటారు.

యువ నావికుడికి దారి చూపటానికి చెన్నై నగరం నుంచి బీచ్‌ ఒడ్డుకు చేరుకున్న వెలుతురు నౌకలా ఉన్నారు వారంతా! ‘‘ధన్యవాదాలు స్నేహితులారా. ఇక చాలు. చీకటి పడుతోంది, క్షేమంగా ఇల్లు చేరండి. మన సోదరీమణులను జాగ్రత్తగా వాళ్ల ఇళ్ల దగ్గర దింపాకే మీరు వెళ్లండి’’ అని విజ్ఞప్తి చేసి లోపలికి వచ్చాను. లివింగ్‌ రూమ్‌లోకి రాగానే నిలువెత్తున వేలు నాచ్చియార్, అంజలై అమ్మాళ్‌!! ఈ వీరనారుల ధైర్య సాహసాలకు వారసులైన తమిళ మహిళలనేనా... ‘‘భద్రంగా ఇళ్ల దగ్గర దింపి వెళ్లండి’’ అని నేను నా యువసేనకు బాధ్యతలు అప్పగించింది! నాలో నేను నవ్వుకున్నాను. నాచ్చియార్‌ బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన 18వ శతాబ్దపు రాణి! అంజలై అమ్మాళ్‌ దక్షిణ ఆర్కాట్‌ స్వాతంత్య్ర సమరయోధురాలు!

వారి చిత్రపటాలనే చూస్తూ నిలబడి పోయాను. ఆ పక్కనే ఉన్న పెరియార్, అంబేడ్కర్, కామరాజ్‌ నవ్వుతూ నా వైపే చూస్తున్నట్లుగా ఉంది! ‘‘విజయ్, ఆల్‌ ద బెస్ట్‌ రా... సినిమాల అబ్బాయీ’’ అని నన్ను దీవిస్తున్నట్లుగానూ ఉంది. పెరియార్‌ ఎన్నడూ సినిమాలను ఇష్టపడలేదు. కానీ పెరియార్‌ సిద్ధాంతాలు సినిమాలుగా వచ్చాయి! ‘పరాశక్తి’, ‘వేలైక్కారి’, ‘నల్ల తంబి’ ఆయన సిద్ధాంతాల నుంచి తయారైన సినిమాలే. పెరియార్‌లా అంబేడ్కర్‌కు సినిమాలపై వ్యతిరేకత లేదు. జీవితాన్ని నవ్వుతూ స్వీకరించటం ఎలాగో సినిమా నేర్పిస్తుంది అనేవారట అంబేడ్కర్‌! కామరాజ్‌ కాంగ్రెస్‌ పార్టీలోని పెద్ద తరం నాయకులు. సినిమాలను, సినిమా వాళ్లను ఆయన చిన్నచూపు చూసేవారనీ, ‘‘ముఖాలకు రంగులు వేసుకునేవాళ్లు ప్రభుత్వాన్ని ఎలా నడపగలరు?’’ అనేవారనీ విన్నాను.
 
కానీ నడిపారు! సినిమాలకు రాసి, పాడి, అభినయించిన వారు, రాజకీయ నాయకులకు దీటుగా తమిళనాడును నడిపారు. అన్నాదురై సీఎం కావటానికి ముందు నాటక రచయిత. నాటకాల్లో నటించారు; కళైజ్ఞర్‌ కరుణానిధి సీఎం కావటానికి ముందు స్క్రీన్‌ రైటర్, పాటల రచయిత; ఎంజీ రామచంద్రన్‌ సీఎం కావటానికి ముందు సూపర్‌స్టార్‌; జయలలిత అమ్మ సీఎం కావటానికి ముందు తమిళ సినిమా సామ్రాజ్ఞి;  స్టాలిన్‌ సర్‌ కూడా సీఎం కావటానికి ముందు సినిమాల్లో నటించారు. తమిళనాడులో ప్రతి ముఖ్యమంత్రీ సినిమాలతో బంధమో, అనుబంధమో ఉన్నవాళ్లే. రంగుల లోకం నుంచి వచ్చి, ప్రజల జీవితాల్లో కాంతులు నింపినవాళ్లే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు. ‘‘సీఎం... సీఎం... సీఎం...!’’ అంటూ, నడిరేయిలో లీలగా హోరు వినిపిస్తోంది. నా నీలాంగరై బీచ్‌ హౌస్‌ను తాకి వెళుతున్నది అలలా... తమిళ ప్రజల కలలా?! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement