దాదాపుగా అన్ని దేశాల విషయంలో ఎన్నికైన ప్రభుత్వం, అధ్యక్షుడు, సైన్యం, పార్లమెంట్ వంటి వ్యవస్థలే ప్రధాన అధికార కేంద్రాలుగా కనిపిస్తాయి. కానీ ఇరాన్ విషయంలో పరిస్థితి కొంత భిన్నం. అక్కడ బాహ్యప్రపంచానికి కనిపించే ప్రభుత్వ వ్యవస్థలతో పాటు, మరొక సమాంతర శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. అదే ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్‌జీసీ). పర్షియన్ భాషలో దీనిని ‘సెపాహ్–ఎ పాస్దారాన్–ఎ ఎంగెలాబ్–ఎ ఇస్లామీ’ అని పిలుస్తారు. దీని అర్థం ఇస్లామిక్ విప్లవ పరిరక్షక దళం. పేరుకు ఇది భద్రతా సంస్థ మాత్రమే. కాలక్రమేణా ఇరాన్ రాజకీయ ముఖచిత్రం, విదే శాంగ వ్యూహం, సామాజిక నియంత్రణ, ప్రాంతీయ వ్యూహాత్మక కార్యకలాపాలు వంటి అనేక రంగాలను ప్రభావితం చేసే కేంద్రంగా పరిణమించింది. అందుకే పశ్చిమ దేశాల విశ్లేషణల్లో ఐఆర్‌జీసీని ‘దేశంలో మరో దేశం’గా అభివర్ణిస్తుంటారు.
1979 విప్లవంతో మొదలు...
ఈ సంస్థ ఆవిర్భావాన్ని ఆకళింపు చేసుకోవాలంటే 1979 ఇరాన్ విప్లవాన్ని పరిశీలించాలి. అప్పటివరకు ఇరాన్‌లో పాలన సాగించిన షా మహమ్మద్ రేజా పహ్లవి – పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా అమెరికా–బ్రిటన్‌లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. గణనీయ స్థాయి సహజ వనరులు కలిగిన ఇరాన్‌పై పాశ్చాత్య ప్రభావం పెరుగుతుండటం దేశంలో అసంతృప్తికి దారితీసింది. ఇస్లామిక్ వర్గాలు, జాతీయవాద శక్తులు, విద్యార్థులు, వామపక్షాలు ఐక్యంగా షా పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాయి. అప్పుడు మత పెద్దగా ఉన్న అయతుల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో జరిగిన విప్లవం షా పాలనకు చరమగీతం పాడింది. దాంతో, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అంకురార్పణ జరిగింది.
కొత్త ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తాయి: విప్లవం ద్వారా ఏర్పడిన ఈ కొత్త వ్యవస్థను దీర్ఘకాలం ఎలా కాపాడాలి? పాత శక్తులు తిరిగి పుంజుకోకుండా ఎలా నిరోధించాలి? చమురు సంపదపై దృష్టి పెట్టిన పాశ్చాత్య దేశాల జోక్యాన్ని ఎలా ఎదు ర్కోవాలి? ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ పాలనను అంత ర్గతంగా, బాహ్యంగా సవాలు చేసే శక్తులను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా, అప్పటి ప్రథమ సుప్రీం లీడర్ ఖొమేనీ నాయకత్వంలో ఐఆర్‌జీసీ పురుడు పోసుకుంది.
ఇక్కడే ఇరాన్ సంప్రదాయ సైన్యం ‘ఆర్టేష్’ అంటే అగ్ని, ఐఆర్‌జీసీ మధ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఇతర దేశాల సైన్యాల లాగానే ఆర్టేష్ విధులు దేశ సరిహద్దులను రక్షించడం, సాంప్రదాయ యుద్ధాలలో దేశాన్ని కాపాడటం. కానీ ఐఆర్‌జీసీ లక్ష్యం కేవలం భూభాగ పరిరక్షణ మాత్రమే కాదు, ఇస్లామిక్ విప్లవాన్నీ, దాని భావజాలాన్నీ కాపాడటం కూడా దీని ప్రధాన బాధ్యతగా నిర్దేశించ బడింది. అందువల్ల, బాహ్య శత్రువులతో పాటు అంతర్గత రాజ కీయ అస్థిరత, సామాజిక నిరసనల వంటి అంశాలను కూడా ఇది భద్రతా సమస్యలుగా పరిగణిస్తుంది. ఈ విస్తృత పాత్రే కాలక్రమేణా ఐఆర్‌జీసీకి ఎనలేని ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది.
ప్రభుత్వం వర్సెస్ ఐఆర్‌జీసీ
ఇరాన్ అధికార వ్యవస్థలో అత్యున్నత స్థానం ‘సుప్రీం లీడర్’ది. ఇది కేవలం రాజకీయ పదవి మాత్రమే కాదు; తొమ్మిది కోట్ల మంది ఇరానీయులను ఏకీకృతం చేయగల మతపరమైన అత్యున్నత అధి కార హోదా కూడా. ఖొమేనీ తర్వాత దశాబ్దాల పాటు అలీ ఖమేనీ ఆ పదవిలో తిరుగులేని అధికారం చలాయించారు. ప్రస్తుత ఉద్రి క్తతల నడుమ, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ ఆ బాధ్యత చేపట్టారు.
ఐఆర్‌జీసీ నేరుగా సుప్రీం లీడర్‌కు మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ఎన్నికైన అధ్యక్షుడు, పార్లమెంట్, మంత్రివర్గం వంటి వ్యవస్థలకు ఇది పూర్తిగా లోబడి ఉండదు. ఫలితంగా, ఒకవైపు ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుండగా, మరోవైపు సుప్రీం లీడర్‌కు నేరుగా అనుసంధానమైన ఐఆర్‌జీసీ కూడా సమాంతరంగా పని చేస్తోంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు వ్యవస్థల బాధ్యతల మధ్య స్పష్టమైన విభజన రేఖ లేకపోవడం బాహ్యప్రపంచాన్ని సందిగ్ధంలో పడేస్తుంది. ఈ ద్వంద్వ నిర్మాణమే ఇరాన్‌ను పశ్చిమాసియాలో ఇతర దేశాలకంటే భిన్నంగా నిలబెట్టింది.
కాలక్రమేణా ఐఆర్‌జీసీ ఒక విస్తృత భద్రతా వ్యవస్థగా ఎదిగింది. దీనిలో భూసేన, నౌకాదళం, వైమానిక విభాగం, క్షిపణి వ్యవస్థలు, గూఢచార యంత్రాంగం, సైబర్ సామర్థ్యాలు వంటి అనేక విభాగాలు ఉన్నాయి. ‘ఖతమ్ అల్–అన్బియా’ వంటి కేంద్ర కమాండ్ వ్యవస్థలు సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇందులో సుమారు 1–2 లక్షల సంఖ్యలో సిబ్బంది ఉన్నారని అంచనా. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చమురు, నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లో కూడా దీని అనుబంధ సంస్థల ప్రభావం గణనీయంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక మాజీ ఐఆర్‌జీసీ పదాధికారులు ఉత్తరోత్తరా ప్రభుత్వ వ్యవస్థలో కీలక పదవులు చేపట్టారు. పార్లమెంట్, మంత్రివర్గం, ప్రాంతీయ పరి పాలన, వ్యూహాత్మక సంస్థలు వంటి అనేక రంగాల్లో వీరి ప్రభావం విస్తరించింది.
ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలో ‘బసీజ్’ అనే అనుబంధ బలగం కీలక పాత్ర పోషిస్తుంది. ‘బసీజ్’ అంటే సమీకరణ అని అర్థం. ఇది సంప్రదాయ సైన్యం, పోలీసు, పారామిలిటరీ బలగాల వంటి వ్యవస్థీకృత విభాగం కాదు. విద్యార్థులు, కార్మికులు, ప్రభు త్వోద్యోగులు, వ్యాపారులు వంటి అనేక సామాజిక వర్గాలవారు
ఇందులో సభ్యులుగా ఉంటారు. అవసరమైనప్పుడు, ఐఆర్‌జీసీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా సేవలందిస్తారు. ఇటీవలి సంవత్స రాల్లో ఇరాన్‌లో జరిగిన నిరసనల సమయంలో, బసీజ్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ఉద్రిక్తతలను ఆపగలిగేది ఎవరు?
ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న అంతర్జాతీయ వివాదాల్లో కూడా ఐఆర్‌జీసీ పేరు తరచూ వినిపిస్తుంది. యురేనియం శుద్ధి స్థాయులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థను అణు కేంద్రాల తనిఖీ లకు అనుమతించడంలో నియంత్రణలు, అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనా అనే అనుమానాలు– ఈ అన్ని చర్చల్లో ఐఆర్‌జీసీ కీలకంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఒక వైపు కొనసాగుతుండగా; భద్రతా–భావజాల వ్యవస్థగా ఐఆర్‌జీసీ సమాంతరంగా ప్రభావాన్ని, ప్రాభవాన్ని కొనసాగిస్తోంది. అధికారిక నిర్ణయాలు ప్రభుత్వం పేరుతో వెలువడినా; వాటి నేపథ్యాన్ని, దిశను ప్రభావితం చేయడంలో దీని పాత్ర స్పష్టం.
ప్రస్తుతం ఇంకా పూర్తిగా సమసిపోని ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా ఉద్రిక్తతలను మరో మలుపు తిప్పగల సామర్థ్యం ఇరాన్ వ్యవస్థల్లో దేనికైనా ఉందంటే, అది ఐఆర్‌జీసీకేనని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్‌కు ప్రతి నిధిత్వం వహించిన భారీ బృందంలో ఐఆర్‌జీసీ సభ్యుల పాత్రే కీల కంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. హార్మూజ్ జలసంధి, దాని గుండా భారత్‌కు ప్రవహించే చమురు సరఫరాపై కూడా ప్రభావం చూపగల వ్యూహాత్మక స్థాయిలో ఐఆర్‌జీసీ నిలిచింది.

వ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు, పశ్చిమాసియాలో పనిచేశారు.


