అభిప్రాయం
‘‘నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికీ, ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువను కల్పించడానికీ ఉద్దేశించినది. జనాభా మార్పులకు అనుగుణంగా ప్రజల గొంతుక పార్లమెంటులో బలంగా వినిపించాలంటే డీలిమిటేషన్ అవసరం. ఏ ఒక్క రాష్ట్రానికి, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వబోం. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతూనే, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం.’’ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేసిన స్థిర సంకల్పం ఇది. కానీ ఏం జరిగింది? మోదీని ఓడించామన్న వికృతానందం కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఓడించాయి. వారు చెప్పింది దక్షిణాదికి అన్యాయం జరగకుండా చేశామని! వాస్తవంలో దక్షిణాదికి అన్యాయం చేశారు. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దారుణంగా నష్టపోయేది దక్షిణాదినే. ఏ మాత్రం నిష్పత్తి తగ్గకుండా, పార్లమెంట్ సీట్లు పెంచే 50 శాతం ఫార్ములాను కాలదన్నిన కాంగ్రెస్ తీరుతో దక్షిణాది సమస్యలను ఎదుర్కోబోతోంది.
భారతదేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేయగల ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు గతంలోనే పార్లమెంటులో ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్లీ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి బిల్లులో లోక్‌సభ సీట్ల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంది. అప్పటివరకూ ఆగకుండా ముందుగానే దక్షిణాదికి న్యాయం చేస్తూ డీలిమిటేషన్ ద్వారా 2029లోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని చట్టం చెబుతోంది. ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం ద్వారా విపక్షాలు దక్షిణాది గొంతు కోస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సంక్షోభంలో ప్రాతినిధ్య వ్యవస్థ
భారత ప్రజాస్వామ్య సౌధానికి పునాది వంటి ప్రాతినిధ్య వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఖరారైన 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను నాటి 54.8 కోట్ల జనాభా అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అప్పట్లో సగటున ప్రతి 10 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించేవారు. గత ఐదు దశాబ్దాల్లో దేశ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగి 145 కోట్లకు చేరుకున్నా, పార్లమెంటులోని సీట్ల సంఖ్య స్తబ్ధుగా ఉండిపోయింది. దీనివల్ల నేడు ఒక్కో ఎంపీ సుమారు 26.70 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మరే ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ ఒక ప్రజా ప్రతినిధిపై ఇంతటి జనాభా భారం లేదు. ఇది ఓటరుకు, ప్రతినిధికి మధ్య ఉండాల్సిన సాన్నిహిత్యాన్ని తగ్గించడమే కాకుండా, ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని కూడా నీరుగారుస్తోంది.
1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకూడదని స్తంభింపజేశారు. జనాభా నియంత్రణ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదనేది నాటి ప్రధానఉద్దేశ్యం. ఆ తర్వాత 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ గడువును మరో 25 ఏళ్లు పొడిగించి 2026 వరకు మార్చకూడదని నిర్ణయించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేక కొత్త జిల్లాలు, పట్టణాలు రూపుదిద్దుకున్నా, నియోజకవర్గాల సరిహద్దులు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడం వల్ల ఓటు విలువలో భారీ వ్యత్యాసాలు తలెత్తాయి. ఒక నియోజకవర్గంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, మరో చోట 30 లక్షల మంది ఉండటం ప్రాతినిధ్య సమానత్వానికి విరుద్ధం. ఈ స్తబ్ధతను బద్దలు కొట్టాల్సిన చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది. 2026తో ఈ గడువు ముగియనుండటంతో, కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అనివార్యం. ఇది సీట్ల పెంపు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య పునర్నిర్మాణ ప్రక్రియ.
దక్షిణాదికి న్యాయం జరగాలంటే...
మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో ఆమోదం పొందితే సరిపోదు. అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా అమలు కావాలంటే శాస్త్రీయమైన పునర్విభజన ప్రక్రియ కీలకం. రాజ్యాంగంలోని 128వ సవరణ స్పష్టంగా చెబుతున్నట్లుగా, ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్ నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించాలి. ఏయే నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలి, వాటిని రొటేషన్ పద్ధతిలో ఎలా మార్చాలి అనే అంశాలు ఊహాజనితంగా కాకుండా, జనాభా లెక్కల ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ క్రమానుగత ప్రక్రియను విస్మరించి రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం రాజ్యాంగబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విపక్షాల వాదన ఆకర్షణీయంగా అనిపించినా, అది ఆచరణలో సమస్యలను సృష్టిస్తుంది.
భారత సమాఖ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సమతుల్యతను కాపాడటం, జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం మన పార్లమెంటులో సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం, కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, అది దక్షిణాది రాష్ట్రాల పాలిట రాజకీయ మరణ శాసనంగా మారుతుందనడంలో సందేహం లేదు. జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడంలో విఫలమైన రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక సీట్లు కేటాయించడం అంటే, క్రమశిక్షణతో వ్యవహరించిన దక్షిణాదిని శిక్షించడమే అవుతుంది. ఈ అసమానతను తొలగించడానికి 50 శాతం పెంపు ఫార్ములా ఏకైక పరిష్కార మార్గం.
ఈ విధానం ప్రకారం, జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లను నేరుగా 50 శాతం పెంచుతారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య పొలిటికల్ రేషియో ఏమాత్రం మారదు. జనాభా లెక్కల ప్రకారం వెళ్తే తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్ (+13), తెలంగాణ (+9), తమిళనాడు (+20), కర్ణాటక (+14), కేరళ (+10) రాష్ట్రాలకు ఈ ఫార్ములా ద్వారా గణనీయమైన అదనపు సీట్లు లభిస్తాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అస్తిత్వానికి అసలైన రక్షణ కవచం. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలన్నా ఈ పునర్విభజన ప్రక్రియ పూర్తి కావడం సాంకేతికంగా అవసరం. సీట్ల సంఖ్యను పెంచకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అది మరిన్ని చిక్కులకు దారితీస్తుంది. సీట్ల సంఖ్యను పెంచి, అందులో మహిళలకు సీట్లు కేటాయించడం ద్వారా అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తర్కాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ విద్వేషంతో విపక్షాలు పునర్విభజనను అడ్డుకున్నాయి. జనాభా నియంత్రణ అనే దేశభక్తిని పాటించినందుకు దక్షిణాదికి రాజకీయ శిక్ష పడకుండా అడ్డుకోవాల్సిన చారిత్రక బాధ్యతను కాంగ్రెస్, డీఎంకే లాంటి పార్టీలు విస్మరించాయి.
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
వ్యాసకర్త బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు


