మండిన ఎండ... కరిగిన గుండె | Sakshi Guest Column On YS Rajasekhara Reddy Padayatra | Sakshi
Sakshi News home page

మండిన ఎండ... కరిగిన గుండె

Apr 9 2026 1:40 AM | Updated on Apr 9 2026 1:40 AM

Sakshi Guest Column On YS Rajasekhara Reddy Padayatra

సందర్భం

జనం గుండెల్లో ఉండేవాడు, జనక్షేమం కోసం పరితపించేవాడు, జనం మధ్య ఉంటూ, జనం మధ్య తింటూ బతుకంతా సమాజానికి ఇచ్చేవాడు నిజమైన ప్రజా నాయకుడు. అలాంటి వ్యక్తి ఉన్నా లేకున్నా ప్రజలు అతడిని స్మరిస్తారు, కొలుస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో డా‘‘ వైఎస్‌.రాజశేఖర రెడ్డి చిరునవ్వు నిత్య హరితం, నిత్య స్మరితం. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం అంటే 2003 ఏప్రిల్‌ 9వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చేవెళ్ళ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన, మొదటి సుదీర్ఘ పాదయాత్ర అది. అదంతా నిన్న మొన్న జరిగినట్లు ఉంది. ఆ యాత్ర ఒక చరిత్ర. ఓ పరిపాలనా విప్లవానికి నాంది. రాజశేఖరరెడ్డి నాకు గురువు, దైవం, హితుడు, స్నేహితుడు, ఆత్మీయుడు... అన్నీ! ఆ యాత్రలో ఆయనతో పాటు నేనూ ఉండటం నా అదృష్టం. ఆ అరవై అయిదు రోజుల్లో ప్రతిరోజూ ఓ కొత్త విషయం తెలుసుకున్నాను. కొత్తపాఠం నేర్చుకున్నాను. ముఖ్యంగా రాజశేఖరరెడ్డిలోని మంచితనపు విశ్వరూపాన్ని చూశాను.

చుట్టంలా... స్నేహితుడిలా...
వైఎస్‌ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు. వారి నమ్మ కాన్ని ఆయన వందశాతం నిలుపుకొన్నారన్నది సత్యం. పాదయాత్రకు ముందు ఆయన నిరంతర అంతర్మథనానికి గురయ్యాడు. నిత్యం వేలాది మంది ఆయనను కలిసి కష్టసుఖాలు చెప్పుకునేవారు. ‘మనం ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది కర్ణా’ అనేవాడు. రాష్ట్రంలో ఉన్న కర్షకుల స్థితి, కార్మికుల స్థితి, ఉద్యో గులు, విద్యార్థులు, మహిళలు, చేతివృత్తులవారు, చిన్న వ్యాపా రులు, రోడ్లు, సౌకర్యాలు, వైద్యం, ఆదాయం, విద్యుత్తు – అన్నీ ప్రత్యక్షంగా చూస్తే తప్ప వారికి ఏం చేయాలో తెలుసుకోలేం అన్నది ఆయన ఆలోచన. 

‘ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే అధికారంలోకి వచ్చాక ప్రజలకు అవన్నీ చేయవచ్చు. రాకపోతే అవన్నీ చేయాలని ప్రతిపక్షంలో ఉండి పోరాడవచ్చు. అందుకే జనం మధ్యకు నడుచు కుంటూ వెళ్తాను. ఓ చుట్టంలా, స్నేహితుడిలా పలకరిస్తాను. రైతు పొలంలోని బురదలోకి దిగి మాట్లాడతాను. అతని బావిలో నీరు ఉందో లేదో స్వయంగా తొంగి చూస్తాను. చెట్టు కొమ్మన, చీర ఉయ్యాలలో పసిపాపను నిద్ర పుచ్చుతున్న తల్లి గుడిసెలోకి వెళ్ళి ఆ కుండల్లో కూడుందో లేదో చూస్తాను’... అలా ఆయన దీక్షగా చెబుతూవుంటే మాకు తెలియని కొత్త రాజశేఖరరెడ్డిని చూస్తున్న ట్లుగా అనిపించింది. 

ఎండలో... వానలో...
2003, ఏప్రిల్‌ 9. ఎండ మండిపోతూ ఉంది. మాకు ఎండ కనిపిస్తోంది. ఆయన జనం గుండెల్ని, వాటి వెనక బాధల్ని చూస్తున్నారు. వాటి వెనక ఉన్న కన్నీటి కథలను చూస్తున్నారు. కాలిన పెనంలా రోడ్డు. అయినా చిరునవ్వుతోనే నడక సాగిస్తున్నారు. మొత్తం జనం, పల్లెలు, పట్టణాలు కదలివస్తున్నాయి ఆయనను చూడటానికి, మాట్లాడటానికి! వారి మాటలు వింటూ ఉంటే అప్పటి చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సమస్యలు తప్ప మరేవీ లేవు అనిపించింది. కరవు, నిరుద్యోగం, అనారోగ్యం. కరెంటు లేకపోవడం, అప్పులు, వడ్డీలు, ఎముకల గూడు లాంటి మనుషులు, ఎడారిని తలపిస్తున్న పొలాలు, ఎటుచూసినా దైన్యం. అదంతా చూసి రాజశేఖరరెడ్డి ఎంత చలించిపోయారంటే అనేకసార్లు ఆయన కన్ను చెమ్మగిల్లడం చూశాను. అసలు ఆ ఎండలో, ఆ ఉక్కలో, ఏ సౌకర్యాలు లేక అలా ప్రయాణించడం ఆయనకు తప్ప మరే నాయకుడికీ సాధ్యం కాదు.

పాదయాత్రలో ఒకసారి జోరున వర్షం కురిసింది. తడవకుండా పక్కనే ఉన్న జీపు ఎక్కాను నేను. కానీ ఆయన అలా తడుస్తూనే, నడుస్తూనే ఉంటే, అది చూచి నాకు ఎంత బాధనిపించిందో! ‘ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది వానకు తడిసి, నిలువ నీడలేక నిల బడుతున్నారో కర్ణా! అందరికీ ఇళ్ళు ఇవ్వాలి. అప్పుడే ఆనందం’ అన్నాడాయన. కరవు కాటకాల్ని, బరువు గుండెలను చూశారు రాజశేఖరరెడ్డి. అందుకే ప్రజలు ఆయనను అంతగా ప్రేమించారు, నమ్మారు. గ్రామాలు, పట్టణాలు ‘మండుటెండలో రాజన్నా... మహాత్ముని అడుగుజాడల్లో నీవన్నా’ అన్న నినాదాలు గోడల మీద రాసి ఆయనను ఆహ్వానించాయి. మాట ఇస్తే మన్నించే మనిషిగా ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు.

మోసం చేసి మీసం తిప్పుతున్న ఈనాటి ప్రజాకంటక పాలకు లకు జగన్‌మోహన్‌ రెడ్డి గారు తిరిగి ప్రజలలోకి వస్తున్నారనే భయం పట్టుకుంది. వస్తే ఆయనకు లభించే జనాదరణను తట్టుకోలేమన్న విషయం వారికి తెలుసు. ఇరవై మూడు సంవత్సరాలైనా ఆ రాజశేఖరుడి పాదస్పర్శ ఈ నేల తల్లి మరచిపోలేదని తెలిసి ఆనందంగా ఉంది. ఆయన రాజశేఖరుడు. ఆయన కుమారుడు జగన్మోహనుడు. కదిలితే... కాలం తెల్లబోతుంది. జన ప్రవాహ సునామీ చుట్టు ముడుతుంది. జేజేల నాదాలు గగనాన్ని కంపిస్తాయి. ఆసత్య ప్రచార గ్రామసింహాలు తోక ముడుస్తాయి. అది గుర్తు చేసుకుంటూ... రాజశేఖరుని రాజస ధర్మదీక్షా దక్షతకు, సుపరిపాలనకు నమస్కరించి, తిరిగి స్వాగతం పలుకుతున్నాను.


భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్‌
(ఏప్రిల్‌ 9: 2003లో వైఎస్‌ పాదయాత్ర ప్రారంభమైన రోజు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement