వేడెక్కుతున్న వేసవి విడుదులు | Sakshi Guest Column on Summer Tourist Places | Sakshi
Sakshi News home page

వేడెక్కుతున్న వేసవి విడుదులు

May 2 2026 3:29 AM | Updated on May 2 2026 3:29 AM

Sakshi Guest Column on Summer Tourist Places

దేశంలోని చాలా ప్రాంతాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఫలితంగా, జనం హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ లలోని వేసవి విడుదులకు ప్రయాణం కడుతున్నారు. సిమ్లా, కులు, మనాలి, నైనితాల్, ముసోరి, ధర్మశాల వంటి టూరిస్టు కేంద్రాలతోపాటు, పర్వత ప్రాంతాలలోని పుణ్య క్షేత్రాలకు కూడా తరలివెళుతున్నారు.ఏటా ‘చార్‌ ధామ్‌’ (బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్ర కూడా వేసవిలోనే మొదలవుతుంది. ఇటీవలి దశాబ్దాలలో ఆ ప్రాంతాలు పర్యావరణ ఉపద్రవాలను చవి చూశాయి. వాతావరణం క్షణానికో రకంగా మార్పులకు లోనవుతోంది. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నేలలు కుంగిపోతున్నాయి. దాంతో అడ్డూఆపూ లేని టూరిజంతో పర్వత ప్రాంతాలపై పడుతున్న ప్రభావం గురించి  ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

సున్నితమైన ప్రాంతాలు
వివిధ పుణ్య క్షేత్రాలు హిమాలయాల లోపలి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలు సన్నని లోయలు, హిమానీనదాలు ఏర్పరిచిన పల్లపు ప్రాంతాలతో కూడుకుని ఉన్నాయి. భూగర్భంలోని పలకలు కదులుతూంటాయి. వర్షం పడినా, భూకంపనాలు చోటుచేసుకున్నా ఆ ఒత్తిడికి వాలు ప్రాంతాల్లోని రాళ్ళు కిందకు జారిపడిపోతూంటాయి. ఎతై ్తన కొండ ప్రాంత గడ్డిభూములు, పర్వతాగ్రాలలోని సరస్సులు, పెళుసైన వృక్షజాల ప్రాంతాలు ఆ రకమైన ఒడుదుడుకులను తట్టుకుని తేలిగ్గా కోలుకోగల శక్తి కలిగినవి కావు.

అందుకనే, అనాది నుంచి అక్కడ మానవ ఆవాస ప్రాంతాలు తక్కువ. వాతావరణం అనుకూలంగా ఉండే సీజనులో వచ్చే యాత్రికుల వల్ల కూడా అక్కడి జీవావరణ వ్యవస్థ చెదిరిపోతోంది. పెద్ద సంఖ్యలో వచ్చే కార్లు, బస్సులు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వ్యర్థ పదార్థాలను సక్రమమైన రీతిలో జారవిడిచే సదుపాయాలు లేవు. పెరుగుతున్న మానవ కార్యకలాపాల (టూరిజం, నిర్మాణ కలాపాలు, భారీ ప్రాజెక్టులు వంటి వాటి) వల్ల హిమాలయాల జీవావరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోంది. కోర్టులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ఒత్తిడి వల్ల ఆ వాస్తవాన్ని విధాన నిర్ణేతలు గుర్తించకపోలేదు. 

కానీ, క్షేత్ర స్థాయిలో నివారణ చర్యలు అంతంతే.చార్‌ ధామ్‌కు వెళ్ళే దినసరి సందర్శకుల సంఖ్యపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఒక పరిమితిని విధిస్తున్నా, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటోంది. ఒక రోజులో బదరీనాథ్‌కు 1,000, కేదార్‌ నాథ్‌కు 800, గంగోత్రికి 600, యమునోత్రికి 400లకు మించి యాత్రికులను అనుమతించకూడదని 2021లో నిర్ణయించారు. ఆ యా ప్రాంతాలు తట్టుకోగల శక్తిని బట్టికాక, కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ  నిర్ణయానికి వచ్చారు.  ఈ ఏడాది కూడా, సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను మాత్రం తప్పనిసరి చేశారు. 

ఎంతమందిని అనుమతించొచ్చు?
కేదార్, బదరీ, గంగోత్రి, యమునోత్రి తట్టుకోగలిగిన సామర్థ్యానికి సంబంధించి ‘వీర్‌ చంద్ర సింగ్‌ గడ్‌వాలీ ఉత్తరాఖండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హార్టికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ’, ‘జి.బి. పంత్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ ఎన్విరాన్‌మెంట్‌’ సైంటిస్టులు 2025లో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ఎత్తు, వాలు, వృక్షజాల వ్యాప్తి అనే మూడు కీలక భౌగోళిక సూచికలను ఆధారం చేసుకుని వారు ఆ పత్రాన్ని రూపొందించారు. ఆ నాలుగు మందిరాల వద్ద, వాటి చుట్టుపక్కలనున్న హిమంతో కప్పుకున్న హిమానీనద ప్రాంతాలను విశ్లేషించినపుడు ఆ హిమనదాలు 2002–2020 మధ్యకాలంలో గణనీయంగా కుంచించుకుపోయినట్లు వెల్లడైంది. 

వాటిలో ఎక్కువగా (ఏడాదికి 22.36 మీటర్ల చొప్పున) 
గంగోత్రి, యమునోత్రి (ఏటా 20 మీటర్లు), బదరీనాథ్‌ (ఏటా17.32 మీటర్లు), కేదార్‌నాథ్‌ (14.14 మీటర్లు) కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఆ నాలుగు ప్రాంతాల్లో (1990–2020 మధ్య కాలానికి సంబంధించి) వాతావరణ డేటాను కూడా విశ్లేషించారు. ఆ ప్రదేశాలన్నింటిలోను, మూడు (వర్షాకాలానికి ముందు, వర్షాకాలంలో, వర్షాకాలం తర్వాత) సీజన్లలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ధోరణి కనిపించింది. నాలుగు ప్రదేశాలు సంరక్షణ ప్రాంతాల లోపల లేదా వాటి చుట్టుపక్కల పరిసరాలలో ఉన్నాయి. బదరీనాథ్‌ మందిరం ‘నందాదేవి నేషనల్‌ పార్క్‌’ పరిధిలోకి; ‘కేదార్‌నాథ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ పరిధిలోకి కేదార్‌నాథ్‌; ‘గంగోత్రి నేషనల్‌ పార్క్‌’ పరిధిలోకి గంగోత్రి; ‘గోవింద్‌ పశు విహార్‌ నేషనల్‌ పార్క్‌ అండ్‌ శాంక్చురీ’ పరిధిలోకి యమునోత్రి వస్తాయి. 

ఆ విశ్లేషణను ఆధారం చేసుకుని చార్‌ ధామ్‌ దినసరి సందర్శకుల సంఖ్యపై గణనీయమైన పరిమితి విధించాలని పరిశోధకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఒక రోజులో బదరీనాథ్‌కు (11,833 నుంచి 15,778), కేదార్‌నాథ్‌కు (9,833 నుంచి 13,111), గంగోత్రికి (6,133 నుంచి 8,178), యమునోత్రి (4,620 నుంచి 6,160) సందర్శకులను పరిమితం చేయాలని వారు కోరారు. వాహనాల క్రమబద్ధీకరణ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. కొండ ప్రాంతాల్లోని ఇతర నగరాలు, పట్టణాలకున్న భరణ శక్తిని గణించేందుకూ ఈ గ్రూపు అభివృద్ధిపరచిన పద్ధతిని వర్తింపజేసుకోవచ్చు. సిమ్లా కూడా దాని శక్తికి మించి సందర్శకులను భరిస్తున్నట్లు కొన్ని మదింపులలో తేలింది. 

ఏం చేయాలి?
భరణ సామర్థ్యాన్ని శాస్త్రీయమైన రీతిలో మదింపు చేస్తే, సముచితమైన చర్యలు తీసుకునే వీలుంటుందని సుప్రీంకోర్టు 2024 జూన్‌లో, మొత్తం 13 హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. నగరాలతో సహా వేసవి విడుదులు, పర్యావరణపరంగా సున్నితమైన మండలాల భరణ సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు 2020లోనే మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆ తర్వాత కోర్టుకు తెలియజేసింది. నిపుణుల కమిటీలను నియమించడం లేదా వాయు పరిశీలన పరికరాలను నెలకొల్పడం వంటి పైపై చర్యలకు పరిమితమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అరకొర విధానాలనే అనుసరిస్తున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలు తమ సమస్యను పరిష్కరించుకునేందుకు సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించుకోవాల్సి ఉంది. 

లేదంటే నిష్క్రియాపరత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేదార్‌ నాథ్‌ వరదల నుంచి జోషీమఠ్‌ కుంగిపోవడం వరకు ప్రకృతి ఉపద్రవాల పరంపరను ఇప్పటికే చవిచూశాం. తీవ్ర వాతావరణ పరిస్థితులు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటివాటికి పుడమి వేడిమితో ప్రపంచం మొత్తంమీద వాతావరణంలో వస్తున్న మార్పు, ఆ యా ప్రాంతాల్లోని భౌగోళిక స్థితిగతులు కారణం కావచ్చు. కానీ, టూరిజం, పరిమితికి మించి జనం మీదపడడం, ప్రణాళికాబద్ధత లేని పట్టణీకరణ, అడవులను నరికేయడం, భారీ ప్రాజెక్టులు చేపట్టడం వంటి మానవ ప్రేరేపిత చర్యలు ఉపద్రవాలకు మరింత ఊతం ఇస్తున్న సంగతిని మరువకూడదు. 

దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement