మాధవ్ శింగరాజు
సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా లేడు. ఉదయించటానికి సంశయిస్తున్నట్లుగా ఉన్నాడు! తూర్పున, ‘అరుణ’వర్ణంలో ఏదో మార్పు! దేనికది సంకేతం?! మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి యుగాంతం సంభవించబోతోందా?! కేరళలో యుగాంతమే అయితే, ఈసారి అది ఒక్క కేరళలోనే కాదు, మొత్తం దేశంలోనే కమ్యూనిస్టు ప్రభుత్వాలకు యుగాంతం అయినట్లు! యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1976లో ఇలా జరిగింది. ఆ ఏడాది దేశంలో ఎక్కడా కమ్యూనిస్టు సూర్యుడే ఉదయించలేదు. ఆనాటి చీకట్లే మళ్లీ 2026లో దేశాన్ని కమ్ముకో బోతున్నాయా? ఈ ఎన్నికల్లో కేరళ కమ్యూనిస్టులు గెలవలేకపోతే జరిగేది అదే!
బాల్కనీ లోంచి తిరిగి నా గదిలోకి వచ్చాను. బయటి వెలుతురు కన్నా, లోపలి టేబుల్ లైట్ ఎక్కువ కాంతిమంతంగా ఉంది. టేబుల్ డెస్క్‌లోంచి అంబలప్పుళ నియోజకవర్గ ప్రజా సమస్యల ఫైల్‌ను బయటికి తీశాను. అంబలప్పుళ ఐదేళ్లుగా నా నియోజక వర్గం కాదు. అంబలప్పుళ ప్రజలు మాత్రం ఎప్పటికీ నావాళ్లే! 2021 వరకు వరుసగా మూడు టెర్మ్‌లు వాళ్లు నన్ను ఎన్నుకుంటూ వచ్చారు. తర్వాత ‘టూ–టెర్మ్ రూల్’ వచ్చింది. రూల్ ప్రకారం, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయటానికి లేదు! పార్టీ నియమాలు పార్టీ నాయకులను పొలిమేర దాటకుండా చేయగలవుగానీ, నియోజకవర్గ ప్రజల్ని తమనాయకుడి వైపు పూలదండను విసరకుండా ఆపగలవా?!
‘‘కామ్రేడ్! మీరు మళ్లీ రావాలి’’ అని గత ఐదేళ్లుగా నన్ను అడుగుతూనే ఉన్నారు అంబలప్పుళ ప్రజలు. వాళ్ల కోసం, కేవలం వాళ్ల కోసమే ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నేను పోటీ చేయవలసి వస్తోంది. ఆరు దశాబ్దాలకు పైగా ఏ జెండా నీడలోనైతే నడిచానో, ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఉన్నానో... ఈ రోజు అదే జెండాకు దూరంగా, ఒక ‘స్వతంత్ర’ గొంతుకతో నిలబడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఈ ఎన్నికల్లో నేను ఒంటరిని. ప్రజలు వెంట ఉండి, పోటీ చేయిస్తున్న అభ్యర్థిని. గోడలపై ఇప్పుడు నా పేరు పక్కన ‘కొడవలి–సుత్తి’ గుర్తు లేకపోవచ్చు. కానీ నా గుండెల్లో అవి ఎప్పటికీ చెరిగిపోవు.
నేను కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాననీ, పదవుల కోసం ఆశ పడుతున్నాననీ నా సొంత పార్టీ వాళ్లే నన్ను విమర్శిస్తున్నప్పుడు, ఆ విమర్శలు వింటూ సీఎం విజయన్ మౌనంగా ఉన్నారు! అంటే, ఆయన అనదలచుకున్నవే వారు అంటున్నారనా? ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట క్షణమైనా ఉండటం కమ్యూనిస్టు యోధుడి లక్షణం కాదు. వెంటనే పార్టీ నుండి బయటికి వచ్చేశాను. నేను కమ్యూనిస్టు పార్టీని వీడి రావచ్చు. కమ్యూనిజం నుంచి ఎప్పటికీ విడిపోను. సీఎం విజయన్ 1970లలో వరుసగా రెండుసార్లు, ’90లలో వరుసగా రెండుసార్లు, 2016 నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ‘టు–టైమ్ రూల్’ ఆయనకు వర్తించదా?!
ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనిప్పుడు పోటీ చేస్తున్నానంటే కారణం... అసమ్మతి కాదు, పార్టీ రూల్‌లోని అసమానతపై నిరసన. కేరళకు ఎంత గొప్ప చరిత్ర ఉంది! ప్రపంచంలో, ప్రజలు ఎన్నుకున్న తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళదే! తిరిగి కేరళతోనే ఇండియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు తుది దశకు చేరుకుంటాయా?! బెంగాల్, త్రిపుర, ఇక ఇప్పుడు కేరళ?! రాజకీయాల్లో మార్పు తేవటం అంటే, ప్రజల జీవితాల్లో మార్పు రావటం అనే సంగతిని విజయన్ విస్మరించినట్లున్నారు! కమ్యూనిస్టులు ఓడిపోవటానికి బయటి కారణాలు ఉండవు. బయటికి రాని కారణాలే ఉంటాయి.


