విశ్లేషణ
మళ్లీ అధికారం మాదే అని అసోమ్‌లో బీజేపీ నేతృత్వపు ‘ఎన్‌యీడీఏ’ ధీమాగా ఉంటే, కేరళంలో కమ్యూనిస్టు నేతృత్వపు ‘లెఫ్ట్ డెమాక్రటిక్ ఫ్రంట్’ (ఎల్డీఎఫ్) ఆపసోపాలు పడుతోంది. రెండు చోట్ల అవే కూటములు రెండో పర్యాయం అధికారంలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి మరో ప్రభుత్వం నడుస్తున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాలక కూటమే ముందంజలో ఉంది. ఈ నెల 9న పోలింగ్ జరగాల్సి ఉన్న ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. తమిళనాడు (ఏప్రిల్ 23), పశ్చిమ బెంగాల్ (ఏప్రిల్ 23, 29)లలో ప్రచారహోరు తీవ్ర స్థాయికి చేరింది. సిద్ధాంతాలు, నిబద్ధతల కన్నా ‘పొలిటికల్ న్యారేటివ్స్’ ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎన్నికల తుది ఫలితాలు తేలేది మాత్రం మే 4న ఓట్ల లెక్కింపు తర్వాతే!
ఎక్కడో 4 వేల కిలోమీటర్ల దూరంలోని పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ దక్షిణ ధ్రువపు కేరళం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా? 30 లక్షల మంది మలయాళీలు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉండటం, అత్యధికులు తరచూ స్వస్థలాలకు వస్తూ–పోతూ ఉండే స్వభావ రీత్యా ఎన్నికల్ని వారు ప్రభావితం చేస్తుంటారు. దేశ ఈశాన్యపు శీర్షాన ఉన్న అసోమ్ రాష్ట్రంలో 2023లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజన, ఫలితంగా తగ్గిన ముస్లిం ఆధిపత్య నియోజక వర్గాల సంఖ్య ఎన్ని కల సరళిని ప్రభావితం చేయనుంది. మూడు భౌగోళిక ముక్కలుగా ఉన్న పుదుచ్చేరికి ‘రాష్ట్ర హోదా కల్పించడమ’నే డిమాండ్ ప్రస్తుత ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశ ముంది.
ఓడినా, గెలిచినా చరిత్రే!
సంపూర్ణ చదువరుల రాష్ట్రం కేరళంలో ప్రతిసారీ విపక్షాలను గెలిపించే జనం నైజం వల్ల ఎల్డీఎఫ్, యూడీఎఫ్ (యునైటెడ్ డెమా క్రటిక్ ఫ్రంట్) ఒకటి తర్వాత మరొకటి రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయి. కానీ, 2021 ఎన్నికల్లో పాలక ఎల్డీఎఫ్ అధికారం తిరిగి నిలబెట్టుకొని చరిత్ర సృష్టించింది. మూడోసారి గెలిస్తే, కేరళంలో కొత్త చరిత్రే! లోగడ పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలుండేవి. ఓడిపోతే, దేశంలో ఎక్కడా కమ్యూ నిస్టు సర్కారు లేని పరిస్థితి వస్తుంది. 2021 ఎన్నికల తర్వాత యూడీఎఫ్ పుంజుకోవడం ఎల్డీఎఫ్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయిదేళ్లలో జరిగిన 5 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 4 చోట్ల గెలిచిన యూడీఎఫ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మంచి (18/20) ఫలితాలు పొందింది. 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో 565/941
పంచాయతీల్లో నెగ్గి కమ్యూనిస్టులకు షాకిచ్చింది.
మరోవైపు బీజేపీ పుంజుకోవడమూ ఎల్డీఎఫ్‌ను కలవరపరు స్తోంది. 2016, 2021 ఎన్నికల్లో 11 శాతం ఓటువాటా పొందిన బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం (త్రిస్సూర్–సురేశ్ గోపి) గెలవడంతో పాటు 11 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 98 చోట్ల పోటీ చేస్తున్నా, 15 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపి, వనరులన్నీ కేంద్రీకృతపరచి ప్రచారం నిర్వహిస్తోంది. సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వంపై లోగడ ఎప్పుడూ లేనంత అవినీతి ఆరోపణలు, తిరుగుబాట్లు, దన్నుగా ఉండే కులాలు, ఉపకులాల్లో చీలికలు ఎల్డీఎఫ్ నాయకత్వా నికి తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ పంచాయతీ ఉంది. అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ కు జనాదరణ ఉంటే, పార్టీ అధిష్ఠానంలో ముఖ్యుడైన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేశ్ చెన్నితల రేపటి సీఎం పదవికి పోటీ పడుతున్నారు. ప్రస్తుత, మాజీ ఎంపీలైన ప్రియాంక, రాహుల్ గాంధీ యూడీఎఫ్ ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నారు. వారి బాట లోనే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లి, ఎల్డీఎఫ్‌కు బీజేపీ దన్నుగా ఉందని చేస్తున్న విమర్శ వారికిక్కడ కమ్యూనిస్టులతో పొత్తుకేమీ ఇబ్బంది రాదా అన్నది ప్రశ్న!
స్థిరీకరణ బాటలో...
అధికారాన్ని సుస్థిరపరచుకునే అన్ని ఎత్తుగడల్నీ అసోమ్‌లో బీజేపీ అనుసరిస్తోంది. వరుసగా మూడోసారి అధికారం నిలుపుకొనే దిశగా సాగుతోంది. బీజేపీ ఏజీపీ, బీపీఎఫ్ తదితరులతో కూడిన ‘నార్త్ ఈస్ట్ డెమాక్రటిక్ అలయెన్ ్స’ (ఎన్ ఈడీఏ) ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ ట్రాకర్‌పోల్ సర్వే (2) ప్రకారం, ఈ కూటమికి 39 శాతం ఓటువాటా లభించనుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎఎస్‌ఎమ్’ 36.5 శాతం పొందే అవకాశాలున్నాయి. వ్యత్యాసం రెండున్నర శాతమే అయినా అధికార కూటమి పక్షాల మధ్య చక్కని సమన్వయం వల్ల సీట్ల సంఖ్య కాంగ్రెస్ మీద రెట్టింపు కన్నా ఎక్కువ బీజేపీకి సొంతంగానే లభించే సూచనలున్నాయి.
కాంగ్రెస్ కూటమి ముస్లిం ఓటర్ల సానుకూలతపై ఆధారపడ నుంది. అందుకే, 2023 నియోజకవర్గాల పునర్విభజనలో ముస్లిం ఆధిపత్యమున్న నియోజకవర్గాల సంఖ్యను 29 నుంచి 21కి ప్రభుత్వం నియంత్రించింది. అసోమ్‌లోనే కాక ఈశాన్య భారతంలో బీజేపీని వృద్ధి చేస్తున్న ‘వ్యవహార దక్షుడి’గా పేరుబడ్డ సీఎం హిమంత బిశ్వశర్మ నేతృత్వం వహిస్తున్న తొలి ఎన్నికలివి. 2021 ఎన్నికల్లో పార్టీని నాటి సీఎం శర్బానంద సోనోవాల్ నడిపారు. ప్రభుత్వంపై అవినీతి, అక్రమ మైనింగ్‌కు ప్రోత్సాహం, డ్రగ్స్‌పై ఉదాసీనత వంటి ఆరోపణలున్నాయి. 40 లక్షల మంది మహిళల అకౌంట్లలోకి రూ.9 వేల చొప్పున, ఏకంగా 3,600 కోట్లను మార్చి 10న ముఖ్యమంత్రి బట్వాడా చేశారు. ‘అరుణోదయ్’ స్కీమ్ కింద మొత్తం రూ.17,000 కోట్లు మహిళలకు పంపిణీ చేసినట్టు ఆయనే చెప్పారు. విభజన రాజకీయాలనే కీలకం చేస్తూ, ‘వలసదారుల్ని వదిలించుకుందాం’ అని పిలుపునిచ్చారు. విపక్షాల సీఎం అభ్యర్థిగా ఉన్న గౌరవ్ గొగోయ్ మూడు పర్యాయాలు కాంగ్రెస్ సీఎంగా ఉన్న తరుణ్ గొగోయ్ తనయుడు. కాంగ్రెస్ నుంచి బిశ్వశర్మ నిష్క్రమణకు కారణమైన ఆయన ఒంటెత్తు ‘వైఖరి’లో ఇప్పటికీ మార్పు లేదు.
రాష్ట్ర హోదా దక్కేనా?
పూర్వపు ఫ్రెంచ్ కాలనీ అయిన పుదుచ్చేరి భౌగోళిక స్వరూపం మూడు ముక్కలుగా ఉంది. తమిళనాడు పక్కనున్న ప్రధాన భూభాగంతో పాటు కాకినాడ సమీపంలోని ‘యానాం’, కేరళ సమీ పంలోని ‘నెహం’ కలిసి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ నుంచే విడిపోయిన ఎన్.రంగస్వామి, ‘ఎన్.ఆర్. కాంగ్రెస్’ ఏర్పరచి, బీజేపీ పొత్తుతో ముఖ్యమంత్రయ్యారు. నిరాడంబరంగా ఉండే రంగస్వామి జనంలో కలిసిపోయి, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామనీ, అది ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమనీ ప్రచారం చేస్తున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న సభలో కనీసం 14 గెలిచినా మ్యాజిక్ నంబర్ (17)ను (గవ ర్నర్ నామినేటెడ్ ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిపి) దాటుతారు కనుక ప్రభుత్వం వారిదే! విపక్ష ‘ఇండియా గుంపు’లో ఆఖరు నిమిషం వరకు సీట్ల పంపకాల్లో స్పర్థలున్నాయి. డీఎంకే బలమైన పక్షం (6 ఎమ్మెల్యేలు) అయినా 14 చోట్ల పోటీ చేస్తుంటే, ఇద్దరే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 16 చోట్ల పోటీ చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానంకైవసం చేసుకున్న కాంగ్రెస్, అప్పుడు మెజారిటీ (28/30) స్థానాల్లో తమకు ఆధిక్యం దక్కిందనే వాదనతో పొత్తుల్లో ఎక్కువ స్థానాలు పొందింది. నియోజకవర్గానికి 30–35 వేల ఓట్లే కావడంతో చిన్న రాజకీయ పరిణామం కూడా స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో గెలుపోట ముల్ని ప్రభావితం చేయొచ్చు.
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్


