విశ్లేషణ
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి మెగా ప్రాజెక్టుకు ఎట్టకేలకు 2026 ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యు నల్ (ఎన్‌జీటీ) పచ్చజెండా ఊపింది. దీనిపై వస్తున్న విమర్శలకు సమాధానమా అన్నట్లు, మే 1న ప్రభుత్వం ప్రశ్నలు – సమాధానాలను విడుదల చేసింది. బంగాళాఖాతంలో 467 కి.మీ. పొడవున ఉత్తర దక్షిణంగా విస్తరించిన 836 దీవుల సమూహమే అండమాన్–నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ ద్వీప సమూహంలో పూర్తి దక్షిణంగా ఉన్న దీవి గ్రేట్ నికోబార్. భారతదేశపు దక్షిణ బిందువు ఇందిరా పాయింట్/ పిగ్మాలియన్ పాయింట్ నికోబార్ చివరి ప్రాంతం. ఈ దీవులు భారతదేశంలో భాగమయినప్పటికీ, మయన్మార్, ఇండోనేషియాలకు దగ్గరగా ఉన్నాయి. ఉత్తరాన అండమాన్ దీవుల నుండి కేవలం 55 కి.మీ. దూరంలో మయన్మార్‌కు చెందిన కోకో దీవులున్నాయి. దక్షిణాన గ్రేట్ నికోబార్ దీవుల నుండి 150 కి.మీ. దూరంలో ఇండోనేషియా ఆబే దీవులున్నాయి. గ్రేట్ నికోబార్‌లోని గలాతియా నుండి కేవలం 74 కి.మీ. దూరంలో కీలకమైన మలక్కా జలసంధి ఉన్నది.
నీతి ఆయోగ్ 2021లో గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదించింది. భారత ప్రభుత్వం 2025లో రేవుపట్టణ ఆధారిత అభివృద్ధిని ఉద్దేశించి ప్రారంభించిన ‘సాగర్‌మాల’ బృహత్ ప్రణాళికలో ఈ పథకం ఒక భాగం. 166 చ.కి.మీ విస్తీర్ణంలో గ్రేటర్ నికోబార్ సమగ్ర అభివృద్ధికి మూడు దశలలో 81,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2047 కల్లా పూర్తి చేయాలని ఈ పథకాన్ని ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా నాలుగు భాగాలున్నాయి. 1. గలాతియా బే ఇంటర్నేషనల్ కంటెయినర్ ట్రాన్స్‌పోర్ట్ టర్మినల్ (ఐసీటీటీ). 2. గ్రేట్ నికోబార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. 3. గ్యాస్–సౌర ఆధారిత విద్యుచ్ఛక్తి కేంద్రం (450 ఎంవీఏ). 4. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులు. నౌకల మరమ్మత్తు, స్వేచ్ఛా వాణిజ్య మండలం ఏర్పాటుకూ వీలు కల్పించారు.
విమర్శలు దేనికి?
ప్రాజెక్టుకు అవసరమైన 166 చ.కి.మీ. భూభాగంలో సుమారు 131 చ.కి.మీ. అటవీ ప్రాంతం దట్టమైన సతత హరితారణ్యాలతో కూడి ఉన్నది. సుమారుగా 7.2 లక్షల వృక్షాలను నరికివేయాల్సి ఉంటుంది. తీరంలోని 20 వేల ప్రహళ సమూహాల (కోరల్ కాలనీస్)పై దుష్ప్రభావముంటుంది. అరుదైన సముద్ర తాబేళ్లకు ఈ దీవి తీరం బ్రీడింగ్ గ్రౌండ్. నిర్మాణ కార్యకలాపాల వలన ఈ సముద్ర తాబేళ్ళు అంతరించి పోవచ్చును. గ్రేట్ నికోబార్ దీవులు అంతరించిపోతున్న షాంపేన్, నికోబా రీస్ ఆదిమ తెగలకు ఆవాసం. వీరిని పర్టిక్యులర్లి వల్నేరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)గా గుర్తించారు. దీవుల అంతర్భాగంలో సుమారుగా 200–300 మంది షాంపేన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. తీరానికి దగ్గర్లో 1000–1100 మంది నికోబారీస్ తెగ ప్రజలు నివసిస్తున్నారు.
ఆధునిక నాగరికత ఛాయ కూడా పడకుండా వేల సంవత్సరాల జీవన విధానాన్ని వారు కొనసాగిస్తున్నారు. వీరు నివసిస్తున్న 751 చ.కి.మీ. ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్‌గా ప్రకటించారు. సుమారు 84 చ.కి.మీ. ట్రైబల్ రిజర్వ్ ప్రాంతం ప్రస్తుత ప్రాజెక్టు పరిధిలోనికి వస్తుంది. ఈ ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్ నుండి డీనోటిఫై చేయాల్సి ఉంటుంది. భూభౌతిక శాస్త్ర పరంగా ఆలోచిస్తే ఈ దీవి భూకంప ముప్పు అధికంగా ఉండి విస్తృత నిర్మాణ కార్య కలాపాలకు అనువయినది కాదు. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 6.5 లక్షల మంది స్థానికేతరులు అదనంగా రావటంతో స్థానిక తెగల సంస్కృతికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ వైఖరి
మే 1న ఎఫ్‌ఏక్యూ రూపంలో ప్రభుత్వం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ప్రాజెక్టులో జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ, స్థానిక తెగల సంరక్షణ అంశాలను సమీకృతం చేసినట్లుగా పేర్కొన్నది. హిందూ మహాసముద్రంలో విదేశీ నౌకా శక్తులను ఎదుర్కోవటానికి గ్రేట్ నికోబార్ దీవిలో శాశ్వత సైనిక బలం అవసరాన్ని నొక్కి వక్కా ణించింది. ప్రభావితమయ్యే అటవీ భూమి విస్తీర్ణం (131 చ.కి.మీ.) మొత్తం అండమాన్–నికోబార్ దీవుల విస్తీర్ణంలో 1.82 శాతమే. దీనికి ప్రతిగా మధ్యప్రదేశ్, హరియాణాల్లో కొత్తగా అడవుల పెంప కాన్ని ప్రతిపాదించింది. ఆదిమ తెగలను వారి నివాస ప్రాంతాల నుండి తరలించాల్సిన ఆవశ్యకత లేదని భరోసా ఇచ్చింది.
పర్యావరణ పరిరక్షణ పట్టించుకోని అభివృద్ధి నిలకడగా ఉండ దనేది నిర్వివాదాంశం. పర్యావరణానికి ఏమాత్రం హాని కలుగకుండా అభివృద్ధి సాధ్యపడదనేది కూడా వాస్తవం. స్థానిక అభివృద్ధి పథకాలను మదింపు చేసేటప్పుడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోణంలో నుండి పరిశీలించటం అభిలషణీయం కాదు. దేశ ప్రయో జనాల కోణం నుండే విశ్లేషించాలి. పాశ్చాత్య దేశాల అండతో నడిచే కొన్ని పర్యావరణ స్వచ్ఛంద సంస్థలు ప్రపంచ దేశాలలో అభివృద్ధికి మోకాలడ్డిన సందర్భాలు చాలా ఉన్నాయి. సంతులిత, నిలకడ కలిగిన అభివృద్ధి దిశగా భారత్ తనదైన శైలిలో అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకు కీలకం?
గలాతియాలో నిర్మించే రేవు పట్టణం సాధారణ నౌకాశ్రయం కాదు. ఇది ట్రాన్షిప్‌మెంట్ పోర్ట్ – అతి పెద్ద కంటెయినర్‌షిప్పుల నుండి సరకులను చిన్న చిన్న షిప్పులలోకి మార్చే సదుపాయం ఉంటుంది. భారీ కంటెయినర్ నౌకలు లంగరు వేయటానికి మన పోర్టులలో అవకాశం లేదు. అందువలన మన రేవులలో ఎగుమతి– దిగుమతి చిన్న నౌకలలోనే జరుగుతుంది. మన రేవులలో చిన్న నౌకలలోనికి ఎక్కించబడిన సరకులు కొలంబో, సింగపూర్, క్లాంగ్ (మలేషియా) ట్రాన్షిప్‌మెంట్ పోర్టులలో పెద్ద కంటెయినర్ షిప్పుల లోకి ఎక్కించబడుతున్నది. సాలీనా సుమారు 200–200 మిలియన్ డాలర్లను మనం చెల్లించాల్సి వస్తున్నది.
ఏప్రిల్ 2024న కేరళలోని విజింజామ్‌లో మొదటి ట్రాన్షిప్‌మెంట్ పోర్టును ప్రారంభించారు. కానీ ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి 5 గంటల కాలం పడుతుంది. కొలంబో కేవలం అర గంట దూరంలో ఉన్నది. గ్రేట్ నికోబార్‌లోని గలాతియా ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి అరగంట దూరంలో ఉండటం వలన కంటెయినర్ ట్రాన్షిప్‌మెంట్ పోర్టుకు అత్యంత అనుకూలం. హిందూ మహాసముద్రంలో అండమాన్–నికోబార్ దీవులను భారత్‌కు మొదటి రక్షణ శ్రేణిగా పరిగణించవచ్చు. సముద్రం గుండా వచ్చే దాడిని ఎదుర్కోవాలంటే అండమాన్–నికోబార్‌లో మన సైనిక శక్తిని కేంద్రీకరించాల్సిందే. ఈ వ్యూహంలో భాగంగానే అండమాన్‌లో మొట్టమొదటి ట్రైసర్వీస్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తర అండమాన్ నుండి గ్రేట్ నికోబార్ వరకు వరుసగా సైనిక–పౌర ఎయిర్–ఫీల్డ్స్, రేవు పట్టణాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్న కాంప్‌బెల్ బేలోని ఐఎన్‌ఎస్ బాజ్, గలాతియాలోని చింగాన్ ఎయిర్‌ఫీల్డ్‌లు మలక్కా జలసంధిపై నిరంతర నిఘా నేత్రంగా పని చేయనున్నాయి. ఉత్తర అండమాన్ సమీ పంలోని మయన్మార్‌కు చెందిన కోకో దీవిలో చైనా సైనిక కదలికల సమాచారం అందుతున్నది.
అవునన్నా కాదన్నా భారత్‌కు చైనానే ప్రధాన వైరి దేశం. చైనా ఆర్థిక, వాణిజ్య వ్యవస్థకు కీలకం మలక్కా జలసంధి. చైనా చమురు, ఇతర దిగుమతులంటూ సుమారుగా 80 శాతం మలక్కా జలసంధి ద్వారానే జరుగుతుంది. మలక్కాను దిగ్భందిస్తే చైనా ఆర్థిక వ్యవస్థను దిగ్భదించినట్లే. చైనా ప్రధాని హ్యూ జింటావో 2003లోనే దీన్ని ‘మలక్కా డైలమా’గా గుర్తించాడు. మలక్కాను దిగ్భందించే అవసరం/ సత్తా యూఎస్‌ఏ, జపాన్ లేదా భారత్‌లకు మాత్రమే ఉన్నది. లద్ధాఖ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ (హిమాలయా)లలో చైనా కవ్వింపులకు సరైన సమాధానం అండమాన్–నికోబార్‌ల నుండే జరగాలి. అరుణాచల్‌ప్రదేశ్‌లో సరైన రవాణా, విద్యుత్, సమాచార, సైనిక సదుపాయాల లేమి వలన 1962 యుద్ధంలో ఎంత నష్టపోయామో గుర్తించాలి.
గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);
సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు


