Nicobar Islands
-
భద్రతా వ్యూహం... గ్రేట్ నికోబార్
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి మెగా ప్రాజెక్టుకు ఎట్టకేలకు 2026 ఫిబ్రవరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యు నల్ (ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది. దీనిపై వస్తున్న విమర్శలకు సమాధానమా అన్నట్లు, మే 1న ప్రభుత్వం ప్రశ్నలు – సమాధానాలను విడుదల చేసింది. బంగాళాఖాతంలో 467 కి.మీ. పొడవున ఉత్తర దక్షిణంగా విస్తరించిన 836 దీవుల సమూహమే అండమాన్–నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ ద్వీప సమూహంలో పూర్తి దక్షిణంగా ఉన్న దీవి గ్రేట్ నికోబార్. భారతదేశపు దక్షిణ బిందువు ఇందిరా పాయింట్/ పిగ్మాలియన్ పాయింట్ నికోబార్ చివరి ప్రాంతం. ఈ దీవులు భారతదేశంలో భాగమయినప్పటికీ, మయన్మార్, ఇండోనేషియాలకు దగ్గరగా ఉన్నాయి. ఉత్తరాన అండమాన్ దీవుల నుండి కేవలం 55 కి.మీ. దూరంలో మయన్మార్‌కు చెందిన కోకో దీవులున్నాయి. దక్షిణాన గ్రేట్ నికోబార్ దీవుల నుండి 150 కి.మీ. దూరంలో ఇండోనేషియా ఆబే దీవులున్నాయి. గ్రేట్ నికోబార్‌లోని గలాతియా నుండి కేవలం 74 కి.మీ. దూరంలో కీలకమైన మలక్కా జలసంధి ఉన్నది.నీతి ఆయోగ్ 2021లో గ్రేట్ నికోబార్ దీవుల అభివృద్ధి పథకాన్ని ప్రతిపాదించింది. భారత ప్రభుత్వం 2025లో రేవుపట్టణ ఆధారిత అభివృద్ధిని ఉద్దేశించి ప్రారంభించిన ‘సాగర్మాల’ బృహత్ ప్రణాళికలో ఈ పథకం ఒక భాగం. 166 చ.కి.మీ విస్తీర్ణంలో గ్రేటర్ నికోబార్ సమగ్ర అభివృద్ధికి మూడు దశలలో 81,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2047 కల్లా పూర్తి చేయాలని ఈ పథకాన్ని ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా నాలుగు భాగాలున్నాయి. 1. గలాతియా బే ఇంటర్నేషనల్ కంటెయినర్ ట్రాన్స్పోర్ట్ టర్మినల్ (ఐసీటీటీ). 2. గ్రేట్ నికోబార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 3. గ్యాస్–సౌర ఆధారిత విద్యుచ్ఛక్తి కేంద్రం (450 ఎంవీఏ). 4. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పులు. నౌకల మరమ్మత్తు, స్వేచ్ఛా వాణిజ్య మండలం ఏర్పాటుకూ వీలు కల్పించారు.విమర్శలు దేనికి?ప్రాజెక్టుకు అవసరమైన 166 చ.కి.మీ. భూభాగంలో సుమారు 131 చ.కి.మీ. అటవీ ప్రాంతం దట్టమైన సతత హరితారణ్యాలతో కూడి ఉన్నది. సుమారుగా 7.2 లక్షల వృక్షాలను నరికివేయాల్సి ఉంటుంది. తీరంలోని 20 వేల ప్రహళ సమూహాల (కోరల్ కాలనీస్)పై దుష్ప్రభావముంటుంది. అరుదైన సముద్ర తాబేళ్లకు ఈ దీవి తీరం బ్రీడింగ్ గ్రౌండ్. నిర్మాణ కార్యకలాపాల వలన ఈ సముద్ర తాబేళ్ళు అంతరించి పోవచ్చును. గ్రేట్ నికోబార్ దీవులు అంతరించిపోతున్న షాంపేన్, నికోబా రీస్ ఆదిమ తెగలకు ఆవాసం. వీరిని పర్టిక్యులర్లి వల్నేరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)గా గుర్తించారు. దీవుల అంతర్భాగంలో సుమారుగా 200–300 మంది షాంపేన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. తీరానికి దగ్గర్లో 1000–1100 మంది నికోబారీస్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఆధునిక నాగరికత ఛాయ కూడా పడకుండా వేల సంవత్సరాల జీవన విధానాన్ని వారు కొనసాగిస్తున్నారు. వీరు నివసిస్తున్న 751 చ.కి.మీ. ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్‌గా ప్రకటించారు. సుమారు 84 చ.కి.మీ. ట్రైబల్ రిజర్వ్ ప్రాంతం ప్రస్తుత ప్రాజెక్టు పరిధిలోనికి వస్తుంది. ఈ ప్రాంతాన్ని ట్రైబల్ రిజర్వ్ నుండి డీనోటిఫై చేయాల్సి ఉంటుంది. భూభౌతిక శాస్త్ర పరంగా ఆలోచిస్తే ఈ దీవి భూకంప ముప్పు అధికంగా ఉండి విస్తృత నిర్మాణ కార్య కలాపాలకు అనువయినది కాదు. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 6.5 లక్షల మంది స్థానికేతరులు అదనంగా రావటంతో స్థానిక తెగల సంస్కృతికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిమే 1న ఎఫ్ఏక్యూ రూపంలో ప్రభుత్వం ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ప్రాజెక్టులో జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ, స్థానిక తెగల సంరక్షణ అంశాలను సమీకృతం చేసినట్లుగా పేర్కొన్నది. హిందూ మహాసముద్రంలో విదేశీ నౌకా శక్తులను ఎదుర్కోవటానికి గ్రేట్ నికోబార్ దీవిలో శాశ్వత సైనిక బలం అవసరాన్ని నొక్కి వక్కా ణించింది. ప్రభావితమయ్యే అటవీ భూమి విస్తీర్ణం (131 చ.కి.మీ.) మొత్తం అండమాన్–నికోబార్ దీవుల విస్తీర్ణంలో 1.82 శాతమే. దీనికి ప్రతిగా మధ్యప్రదేశ్, హరియాణాల్లో కొత్తగా అడవుల పెంప కాన్ని ప్రతిపాదించింది. ఆదిమ తెగలను వారి నివాస ప్రాంతాల నుండి తరలించాల్సిన ఆవశ్యకత లేదని భరోసా ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ పట్టించుకోని అభివృద్ధి నిలకడగా ఉండ దనేది నిర్వివాదాంశం. పర్యావరణానికి ఏమాత్రం హాని కలుగకుండా అభివృద్ధి సాధ్యపడదనేది కూడా వాస్తవం. స్థానిక అభివృద్ధి పథకాలను మదింపు చేసేటప్పుడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోణంలో నుండి పరిశీలించటం అభిలషణీయం కాదు. దేశ ప్రయో జనాల కోణం నుండే విశ్లేషించాలి. పాశ్చాత్య దేశాల అండతో నడిచే కొన్ని పర్యావరణ స్వచ్ఛంద సంస్థలు ప్రపంచ దేశాలలో అభివృద్ధికి మోకాలడ్డిన సందర్భాలు చాలా ఉన్నాయి. సంతులిత, నిలకడ కలిగిన అభివృద్ధి దిశగా భారత్ తనదైన శైలిలో అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు కీలకం?గలాతియాలో నిర్మించే రేవు పట్టణం సాధారణ నౌకాశ్రయం కాదు. ఇది ట్రాన్షిప్మెంట్ పోర్ట్ – అతి పెద్ద కంటెయినర్షిప్పుల నుండి సరకులను చిన్న చిన్న షిప్పులలోకి మార్చే సదుపాయం ఉంటుంది. భారీ కంటెయినర్ నౌకలు లంగరు వేయటానికి మన పోర్టులలో అవకాశం లేదు. అందువలన మన రేవులలో ఎగుమతి– దిగుమతి చిన్న నౌకలలోనే జరుగుతుంది. మన రేవులలో చిన్న నౌకలలోనికి ఎక్కించబడిన సరకులు కొలంబో, సింగపూర్, క్లాంగ్ (మలేషియా) ట్రాన్షిప్మెంట్ పోర్టులలో పెద్ద కంటెయినర్ షిప్పుల లోకి ఎక్కించబడుతున్నది. సాలీనా సుమారు 200–200 మిలియన్ డాలర్లను మనం చెల్లించాల్సి వస్తున్నది.ఏప్రిల్ 2024న కేరళలోని విజింజామ్లో మొదటి ట్రాన్షిప్మెంట్ పోర్టును ప్రారంభించారు. కానీ ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి 5 గంటల కాలం పడుతుంది. కొలంబో కేవలం అర గంట దూరంలో ఉన్నది. గ్రేట్ నికోబార్‌లోని గలాతియా ప్రపంచ సముద్ర రవాణా మార్గం నుండి అరగంట దూరంలో ఉండటం వలన కంటెయినర్ ట్రాన్షిప్మెంట్ పోర్టుకు అత్యంత అనుకూలం. హిందూ మహాసముద్రంలో అండమాన్–నికోబార్ దీవులను భారత్‌కు మొదటి రక్షణ శ్రేణిగా పరిగణించవచ్చు. సముద్రం గుండా వచ్చే దాడిని ఎదుర్కోవాలంటే అండమాన్–నికోబార్‌లో మన సైనిక శక్తిని కేంద్రీకరించాల్సిందే. ఈ వ్యూహంలో భాగంగానే అండమాన్‌లో మొట్టమొదటి ట్రైసర్వీస్ కమాండ్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తర అండమాన్ నుండి గ్రేట్ నికోబార్ వరకు వరుసగా సైనిక–పౌర ఎయిర్–ఫీల్డ్స్, రేవు పట్టణాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్న కాంప్‌బెల్ బేలోని ఐఎన్ఎస్ బాజ్, గలాతియాలోని చింగాన్ ఎయిర్‌ఫీల్డ్‌లు మలక్కా జలసంధిపై నిరంతర నిఘా నేత్రంగా పని చేయనున్నాయి. ఉత్తర అండమాన్ సమీ పంలోని మయన్మార్‌కు చెందిన కోకో దీవిలో చైనా సైనిక కదలికల సమాచారం అందుతున్నది.అవునన్నా కాదన్నా భారత్‌కు చైనానే ప్రధాన వైరి దేశం. చైనా ఆర్థిక, వాణిజ్య వ్యవస్థకు కీలకం మలక్కా జలసంధి. చైనా చమురు, ఇతర దిగుమతులంటూ సుమారుగా 80 శాతం మలక్కా జలసంధి ద్వారానే జరుగుతుంది. మలక్కాను దిగ్భందిస్తే చైనా ఆర్థిక వ్యవస్థను దిగ్భదించినట్లే. చైనా ప్రధాని హ్యూ జింటావో 2003లోనే దీన్ని ‘మలక్కా డైలమా’గా గుర్తించాడు. మలక్కాను దిగ్భందించే అవసరం/ సత్తా యూఎస్ఏ, జపాన్ లేదా భారత్‌లకు మాత్రమే ఉన్నది. లద్ధాఖ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ (హిమాలయా)లలో చైనా కవ్వింపులకు సరైన సమాధానం అండమాన్–నికోబార్ల నుండే జరగాలి. అరుణాచల్‌ప్రదేశ్‌లో సరైన రవాణా, విద్యుత్, సమాచార, సైనిక సదుపాయాల లేమి వలన 1962 యుద్ధంలో ఎంత నష్టపోయామో గుర్తించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
చైనాకు చెమటలు పట్టిస్తోన్న అండమాన్ ప్రాజెక్టు
-
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం..
ఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవత్ర 6.2 గా నమోదైంది. అర్ధరాత్రి (జులై 29) రాత్రి 12:11 గంటల సమయంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాంప్‌బెల్ బే నుంచి 62 కి.మీ. పశ్చిమ-నైరుతి దిశలో, భూమి ఉపరితలం నుండి 10 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. అయితే దీని వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.హిందూ మహాసముద్రంలో, అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు.. దీని కేంద్రం ఇండోనేషియాలోని ఆషే ప్రావిన్స్‌లోని సబాంగ్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 259 కి.మీ దూరంలో ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. -
నికోబార్ వద్ద భారీ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ప్రాజెక్ట్
న్యూఢిల్లీ: గ్రేట్ నికోరాబ్ ఐలాండ్ వద్ద బంగాళాఖాతంలో ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రాజెక్ట్’కు కేంద్ర షిప్పింగ్ శాఖ ఆసక్తి వ్యక్తీకరణలను (ఈవోఐ) ఆహ్వానించింది. పీపీపీ కాంట్రాక్ట్ సంస్థ, ప్రభుత్వ పెట్టుబడులు కలసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.41,000 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్ వార్షికంగా 16 మిలియన్ కంటెయినర్ల నిర్వహణ సామర్థ్యంతో ఉంటుందని తెలిపింది. మొదటి దశ రూ.18,000 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని, 4 మిలియన్ టన్నులకు పైగా కంటెయినర్లను ఇది నిర్వహించగలదని వివరించింది. ఈ రవాణా పోర్ట్‌కు అనుబంధంగా ఎయిర్పోర్ట్, టౌన్షిప్, పవర్ ప్లాంట్ కూడా నిర్మించాలనేది ప్రణాళికగా షిప్పింగ్ శాఖ తెలిపింది. అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఈ పోర్ట్ ఏర్పాటు కానుందని, ఇదే మార్గంలో ప్రస్తుతం సింగపూర్, క్లాంగ్, కొలంబో పోర్ట్‌లు ఉన్నట్టు పేర్కొంది. -
భారతదేశం– భౌగోళిక స్వరూపాలు
ఇందిరా పాయింట్, నికోబార్ దీవుల , Indira Point , Nicobar Islands ,Bhavitha ఇందిరా పాయింట్: భారతదేశ దక్షిణ చివరి సరిహద్దును ‘ఇందిరా పాయింట్’గా పిలుస్తారు. ఇది నికోబార్ దీవుల దక్షిణ చివరన ఉంది. అంతర్వేది(Doab): రెండు నదుల మధ్య ఉండే మైదాన ప్రాంతం. ఇది చాలా సారవంతమైన భూభాగం. పూర్వం ఈ ప్రాంతంపై అధికారాన్ని చెలాయించేందుకు రాజుల మధ్య అనేక యుద్దాలు జరిగాయి. 4 మార్కుల ప్రశ్నలు – సమాధానాలు కింది పేరాగ్రాఫ్‌ను చదివి భారతదేశ శీతోష్ణస్ధితి, హిమాలయాల గురించి వ్యాఖ్యానించండి. (విద్యా ప్రమాణం: ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం) హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతుంది. ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దున రక్షణ కవచాలుగా ఉండి చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే తీవ్ర చలిగాలులను అడ్డుకుంటాయి. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ఉన్న ప్రాంతంలో రుతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇవి లేకపోతే దేశ ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. సమాధానం: ఒక ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఒక క్రమ పద్ధతిలో ఉండే వాతావరణ పరిస్థితులను శీతోష్ణస్థితిగా పిలుస్తారు. ఉష్ణోగ్రత, వర్షపా తం, పీడనం, పవనాలు, ఆర్ధ్రత మొదలైన భౌతికాంశాల సగటు స్థితి శీతోష్ణస్థితిని వివరిస్తుంది. భారతదేశ శీతోష్ణస్థితిని స్థూలంగా ‘ఉష్ణ మండల రుతుపవన శీతోష్ణస్థితి’గా పేర్కొంటారు. వివిధ ప్రదేశాల్లోని శీతోష్ణస్థితి లక్షణాల్లో తేడాలను నిర్ణయించడంలో దేÔ¶ వైశాల్యం, వివిధ భౌగోళిక స్వరూపాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి హిమాలయ పర్వతాలు. హిమాలయాలు జమ్ముకాశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు దేశ ఉత్తర సరిహద్దుగా సుమారు 2400 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. ఇవి శీతాకాలంలో మధ్య ఆసియా నుంచి వీచే అతిశీతల పవనాలను ఉత్తర మైదానంలోకి ప్రవేశించకుండా అడ్డగించి ఉత్తర భారతదేశాన్ని చలి నుంచిlకాపాడుతున్నాయి. వేసవి కాలంలో మైదానాల్లో వర్షపాతానికి; పశ్చిమ కనుమల తూర్పు, ఈశాన్య భాగాల్లో రుతుపవన శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. రుతుపవన శీతోష్ణస్థితి లేనట్లయితే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారి ఉండేది. అంతేకాకుండా హిమాలయాల్లోని హిమనీ నదాల నుంచి ప్రవహించే జీవనదుల వల్ల ఉత్తర మైదానాలు సారవంతంగా మారి ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విధంగా హిమాలయాల వల్ల భారతదేశ శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితమవుతోంది. భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి? (విద్యా ప్రమాణం: విషయావగాహన) సమాధానం: భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని ఆరు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అవి.. హిమాలయాలు, గంగా–సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరప్రాంత మైదానాలు, ఎడారులు, దీవులు. హిమాలయ ప్రాంతానికి, ద్వీపకల్ప పీఠభూమికి మధ్య పోలికలు, తేడాలు: ఉత్తర భారతదేశ ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 5 లక్షల చ.కి.మీ. దేశ ఉత్తర ‡మైదానానికి దక్షిణంగా ఉన్న విశాల పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమిగా పిలుస్తారు. ఇది 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి, దేశంలో అతి పెద్ద నైసర్గిక స్వరూపంగా గుర్తింపు పొందింది. మాలయాలు సముద్ర మట్టానికి సరాసరి 600 నుంచి 6100 మీటర్ల ఎత్తులో ఉండగా, ద్వీపకల్ప పీఠభూమి 600 నుంచి 900 మీటర్ల సాధారణ ఎత్తుతో క్రమరహితంగా ఉంది. హిమాలయాల్లో జన్మించిన గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదులు నిరంతరం ప్రవహిస్తూ ఉత్తర భారతదేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, నర్మద, తపతి వంటి నదులు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహిస్తూ ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. హిమాలయాల దక్షిణ భాగంలో గంగా–సింధు మైదానం ఉంది. ఇక్కడి సారవంతమైన నేల పలు పంటలు పండటానికి అనుకూలంగా ఉంది. ద్వీపకల్ప పీఠభూమిని ఆనుకొని పశ్చిమ, తూర్పు భాగాల్లో తీర మైదానాలు ఉన్నాయి. వీటిలోని సాగుభూమి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లోని భౌగోళిక నిమ్నోన్నతాలు ఆయా ప్రదేశాల్లో రుతుపవన వర్షపాతానికి దోహదపడుతున్నాయి. హిమాలయ ప్రాంతంలో దాల్, ఊలార్, కుమావున్, సోమర్ వంటి ప్రముఖ సరస్సులు ఉన్నాయి. చిల్కా, పులికాట్, కొల్లేరు, అష్టముడి వంటి సరస్సులు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానమైనవి. ఈ రెండు ప్రధాన భౌగోళిక స్వరూపాలు వివిధ రూపాల్లో దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నాయి. 2 మార్కుల ప్రశ్నలు ప్రపంచపటాన్ని పరిశీలించి భారతదేశ ఉనికి గురించి క్లుప్తంగా రాయండి. (విద్యా ప్రమాణం: పట నైపుణ్యాలు) భారతదేశ ఉనికి: భారతదేశం ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న భారతదేశం ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళాల్లో విస్తరించి ఉంది. భారతదేశం భౌగోళికంగా 8041 – 37061 ఉత్తర అక్షాంశాలు, 68071 – 970 251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశానికి మూడు వైపులా సముద్రం ఉండి, ఒక వైపు భూభాగ సరిహద్దు ఉంది. అందుకే మన దేశాన్ని ద్వీపకల్పంగా పరిగణిస్తారు. ఇది అక్షాంశాల పరంగా ఉత్తర, దక్షిణాలుగా 30 డిగ్రీల పొడవున, రేఖాంశాల పరంగా తూర్పు పడమరలుగా 30 డిగ్రీల వెడల్పున వ్యాపించి ఉంది. భారతదేశ భూభాగాలైన అండమాన్ నికోబార్, లక్ష దీవులు ప్రధాన భూభాగానికి దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. -
అండమాన్ నికోబార్‌లో భూకంపం
పోర్ట్‌బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు అయింది. అండమాన్‌లోని మోహిన్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. కాగా ఎక్కడ ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదు అయిన సంగతి తెలిసిందే. -
దీవులను కొందామా?
ఇల్లు, కారు.. కొనమన్నంత సులువుగా... ఏకంగా దీవినే కొనమంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా! మీరు చదివింది నిజమే! ఇల్లు, కారు ఇతర వస్తువులు కొన్నట్లుగానే డబ్బులుంటే ఏకంగా దీవులనే కొనుగోలు చేయవచ్చు. లేదంటే కొన్నాళ్ల వరకు వాటిని లీజుకు తీసుకోవచ్చు. ఇంకా కాదనుకుంటే ఆయా దీవులలోని నచ్చిన విల్లాను ఎంపిక చేసుకొని, సొంతం చేసుకోవచ్చు. తక్కువ కాలానికి అద్దెకు దొరికే విల్లా సదుపాయాలు కూడా దీవులలో ఎన్నో ఉన్నాయి. అలాంటి దీవుల కథాకమామీషు... - వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు అనేక చిన్నా పెద్దా దీవులు సొంతంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా యూరప్ దీవులలోనూ, మాల్దీవులలోనూ మాల్యా రిసార్ట్స్ నడుపుతున్నారు. - ఖతార్ రాజు షేక్ అహ్మద్ ఖలీప్ అలీకి సొంతంగా రెండు దీవులున్నాయి. హాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వర్జిన్ దీవుల సముదాయంలోని నెకర్ ఐలాండ్‌ను సొంతం చేసుకున్నాడు. మనకు అండమాన్, నికోబార్ దీవులు తెలుసు. మాల్దీవులు, కరేబియన్ దీవుల గురించి వినే వున్నాం. చుట్టూ నీళ్లు, మధ్యలో అందమైన ప్రకృతికి నెలవుగా తీరుగా ఉండే భూమి.. తీరాన ఇసుకతిన్నెలు, బారులు తీరినట్టుగా ఉండే పామ్ చెట్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి దీవులు పెట్టింది పేరు. అలాంటి చోటకు కొత్త దంపతులైతే హనీమూన్‌కి వెళతారు. ఇంకొందరు విశ్రాంతి కోసం వెళతారు. మరికొందరు దీవుల చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశోధించడానికి వెళతారు. ఎవరెందుకు వెళ్లినా దీవులు ఎప్పుడూ కనువిందు చేస్తూ వెనక్కి తిరిగి వెళ్లనివ్వకుండా ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటి చోట కొన్ని రోజులపాటు ఆనందానుభూతులను సొంతం చేసుకొని, వదిలి రావాలంటే మనసొప్పదు. అలాగని మనది కాని చోట ఎన్నాళ్లని ఉంటాంలే అని సర్దుబాటూ అవసరం లేదు. మీకు నచ్చిన దీవిని కొనేసుకుంటే ఎన్నాళ్లైనా అక్కడే ఉండిపోవచ్చు. అవసరం లేదనుకుంటే అద్దెలకు ఇచ్చుకోవచ్చు. వ్యాపార లావాదేవీలు కొనసాగించవచ్చు. కొన్నవాటిని తిరిగి అమ్మకానికి పెట్టవచ్చు. ఏదైనా ఒక దీవిని కొనాలనే ఆలోచన మీకుంటే చాలు ప్రపంచ స్థిరాస్తుల విపణిలో అందమైన దీవులు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సంపన్న వర్గాలు విలాసవంతమైన జీవనం కోసం దీవులను కొనుగోలు చేస్తుంటారు. ఆహ్లాదం కోసం కొనుగోళ్లు... అనేకమంది శ్రీమంతులు ఇప్పుడు దీవుల మీద దృష్టిసారిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మనసుకు నచ్చినట్టుగా గడపడం కోసం విలాసవంతులు దీవులను ఎంచుకుంటున్నారు. కొందరు తమ స్థోమతను బట్టి కొన్నేళ్లపాటు అద్దెకు తీసుకుంటే, దీవులు నచ్చితే ఎంత మొత్తమైనా పెట్టుబడిగా పెట్టి కొనుగోలు చేసి, పూర్తిగా తమ సొంతం చేసుకునేవారు కొందరుంటారు. అమెరికాలోని సంగీత దిగ్గజాలు ఫెయిత్ హిల్, టిమ్ మెక్గ్రోకి ఇలాగే బహమాస్‌లోని ఎక్స్‌మాస్ దీవిని కొనుగోలు చేశారు. దీంట్లో వీరు ఇటీవలే 15,000 చదరపు అడుగులలో అధునాతనమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆకర్షణీయమైన పెట్టుబడి... చిన్న చిన్న దీవులు పెద్ద ఆదాయానికి మార్గాలవుతున్నాయి. ఆకర్షణీయమైన పెట్టుబడిగా పలువురిని ఆకర్షిస్తున్నాయి. ద్వీపాలను కొనుగోలు చేసేవారిలో నూటికి 98 శాతం వ్యాపార దృక్కోణంలోనే చూస్తారు. ఇతర ఆస్తులపై పెట్టుబడి పెట్టినట్టుగానే దీవుల మీదా పెట్టుబడి పెడతారు. తమ సొంతం చేసుకున్న దీవులలో అద్భుతమైన వేసవి విడుదులు, హోటళ్లు నిర్మించి, వాటిని విహారయాత్రకు వచ్చేవారికి అద్దెలకు ఇస్తారు. ఇది లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ప్రముఖ వ్యాపారవేత్తలు ఏయే దీవులు టూరిస్టులను ఆకర్షించే విధంగా ఉన్నాయో శోధిస్తారు. ఉత్తమం అనదగ్గ వాటిని వేలం పాటల ద్వారా తమ సొంతం చేసుకునే వేటలో ఉంటారు. అయితే మరికొంత మంది దీంట్లో కూడా వైవిధ్యాన్ని చూపుతున్నారు. లండన్‌కి చెందిన ప్రపంచప్రసిద్ధ వన్యప్రాణుల ఫొటోగ్రాఫర్ పీటర్ బియార్డ్ మాత్రం తన పెంపుడు చిరుత పిల్లల కోసం కిందటేడాది కోటికి పైగా డాలర్లు వెచ్చించి మరీ యూరప్‌లో ఓ దీవిని సొంతం చేసుకున్నాడు. ఇండో కెనడియన్ బిలియనీర్ అయిన బాబ్ ధిల్లన్ కైతే ఏకంగా 2,300 ఎకరాలు గల మాసివ్ దీవి ఉంది. మధ్య అమెరికాలో ఉన్న ఈ దీవి పగడపు దిబ్బలలో ప్రపంచంలోనే విస్తీర్ణంలో రెండవదిగా పేరుగాంచింది. అభివృద్ధి వైపు పరిశీలన... కొన్ని దీవులు 2 నుంచి 12 ఎకరాలలోనే ఉంటాయి. వీటిని అతి చిన్న ద్వీపాలుగా పిలుస్తారు. 12 - 24 ఎకరాలలో ఉండేవి మధ్యస్థం. వీటిని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. 24 నుంచి 37 ఎకరాల వరకు ఉండేవి పెద్ద దీవులు. 37 నుంచి 50కి ఎకరాలకు పైగా ఉన్న దీవులలో పెద్ద భవనాలు, విల్లాలకు అనుకూలంగా ఇక్కడి భూమి ఉంటుంది. ఇలాంటి చోట అద్దెలకు, లీజులకు భవనాలు ఉంటాయి. వీటితో పాటు దీవి స్థలాకృతి, ఓడలకు వేసే లంగరుకు అనుకూలత, చుట్టుపక్కల పేరెన్నికగన్న బీచ్‌లు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. నాట్ ఫర్ సేల్... మన దేశంలో అండమాన్, నికోబార్ దీవులు ఉన్నాయి. బంగాళఖాతంలో తళతళ మెరిసేటి దృశ్యాలతో అత్యంత సుందరంగా ఉండే పగడపు దిబ్బలు ఉన్నాయి. భారతదేశ ప్రధాన భూభాగంలో తూర్పున 700 కి.మీ పొడవునా వ్యాపించి ఉన్న ఈ దీవులు నీలిరంగులో స్వచ్ఛంగా కనిపించే నీటితో, ఇసుక తిన్నెలతో కనువిందుచేస్తాయి. ఇవి మన కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి వీటి కొనుగోళ్లకు, అమ్మకాలకు అనుమతించరు. అయితే వీటిలో స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. ప్రైవేట్ దీవులు సముద్రపు నీటిలో భూభాగానికి దూరంగా ఉంటాయి. ఇవి వ్యక్తి లేదా సంస్థల చేతుల్లో ఉంటాయి. కొన్ని దీవులు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. గడచిన రెండేళ్లలో దీవుల కొనుగోళ్లు అమ్మకాలలో వృద్ధి రేటు రెట్టింపు అవుతూ వస్తోంది. వీటిని కొనుగోళ్లకు పెట్టినప్పుడు సొంతం చేసుకునేవీలుంటుంది. దీవుల అమ్మకాలు, కొనుగోళ్లలో ‘ప్రైవేట్ ఐల్యాండ్ ఆన్లైన్ డాట్ కామ్’ పేరెన్నిక గన్నది. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. - కూర్పు: ఎన్.ఆర్. -
నికోబర్ దీవుల్లో స్వల్ప భూకంపం
న్యూఢిల్లీ: అండమాన్ నికోబర్ దీవుల్లో ఆదివారం సాయంత్రం స్వల్ప భూకంపం వచ్చింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.


