విశ్లేషణ
ఒకపక్క దేశంలో వేలాది మంది ఎల్పీజీ సిలిండర్ల కోసం బారులు తీరి నిలబడితే మరోపక్క ప్రభుత్వం నుంచి ఒక విచిత్ర ప్రకటన వెలువడింది. వాతావరణ మార్పును అరికట్టేందుకు ఉద్గారాలను మరింతగా తగ్గించుకుంటామని ప్రకటించింది. శిలాజేతర ఇంధన వనరుల వైపు మళ్ళే విషయంలో నిర్దేశించుకుంటున్న లక్ష్యాలను పెంపొందించుకోవడం వినడా నికి చెవులకింపుగానే ఉంటుంది. కానీ, వంట చేసుకునేందుకు, స్కూటర్లకు, కార్లకు అవసరమైన ఇంధనం నిమిత్తం జనం అవస్థలు పడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడటమే చోద్యం. వాతావరణ మార్పును నిరోధించే ఐక్యరాజ్య సమితి ఒడంబడిక కింద దేశాలు ప్రకటించవలసి ఉన్న లక్ష్యాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. సందర్భమే వింత గొలిపేదిగా ఉంది.
ఎందుకీ హెచ్చుతగ్గులు?
శిలాజేతర ఇంధన వనరుల వాటాను (2031 నుంచి 2035 మధ్య కాలంలో) 60 శాతానికి పెంచుకుంటామని ప్రభుత్వం మాటి చ్చింది. వాటిని జాతీయ దృఢసంకల్ప వాగ్దానా (ఎన్డీసీ)లుగా పిలుస్తున్నారు. దానికి మార్చి 25న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 2035 నాటికి ఉండే విద్యుదుత్పాదన సామర్థ్యంలో 60 శాతం వాటా శిలాజేతర ఇంధన వనరుల ద్వారా సమ కూరుతుందని అర్థం. మన దేశం 2026 ఫిబ్రవరి నాటికే శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 52.57% మేరకు సాధించినట్లు ప్రభుత్వం చెప్పుకొంది. ప్రకటించిన తేదీల కన్నా ముందే తమ వాగ్దానాలను నిలబెట్టుకున్నామని కూడా గొప్పగా చాటుకుంది. వాస్తవంలో అటు వంటి విద్యుదుత్పాదన సామర్థ్యం 22% మాత్రమే.
దేశంలో 2026 ఫిబ్రవరి నాటికి నెలసరి విద్యుదుత్పాదన సామర్థ్యంలో పునరుత్పాదక (భారీ జలవిద్యుచ్ఛక్తి, సౌర శక్తి) ఇంధన వనరుల వాటా 22.73% మాత్రమేనని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పేర్కొంది. మొత్తం మీద (2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్ర వరి మధ్య కాలానికి) సంఖ్యలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆ కాలంలోని మొత్తం విద్యుదుత్పాదనలో తాప(థర్మల్) విద్యుత్ వాటా 70.40% కాగా, పునరుత్పాదక ఇంధన వనరులది 26.16%. వాతావరణ పరిస్థితులు, వేసవి, శీతాకాలం, వర్షాకాలం వంటి అంశాల వల్ల విద్యుదుత్పాదనలో హెచ్చుతగ్గులను అర్థం చేసు కోవచ్చు. కానీ, ఇంతటి భారీ వ్యత్యాసానికి (30%) ఆ అంశాలు మాత్రమే కారణ మని అనుకోలేం.
సప్లై చెయిన్లు చైనా చేతిలో...
అంతర్జాతీయ ఒడంబడిక మేరకు ఐక్యరాజ్య సమితికి నివేదిస్తున్నవి కనుక ఈ సంఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఈ సంఖ్యలను ఉటంకిస్తూ ఇంధన పరిణామ క్రమంలో తాను గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్నట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో భారత్ ఘనతను చాటుకుంటోంది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్ళడం, బ్యాటరీలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు భౌగోళిక రాజకీయాలు, శిలాజ ఇంధనాల సరఫరాలకు దిగుమతులపై ఆధారపడటం వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. పవన, సౌర విద్యుదుత్పాదన కూడా ఒక రకంగా కీలక సామగ్రి, సబ్–సిస్టంలు, ఎక్విప్‌మెంట్ దిగుమతులపై ఆధారపడి ఉంది. తిరిగి ఈ దిగుమతు లలో చాలా భాగం గ్లోబల్ సప్లై చెయిన్లతో ముడిపడి ఉన్నాయి. వాటిలో చాలా భాగం చైనా అధీనంలో ఉన్నాయి.
పునరుత్పాదక ఇంధన వనరుల పరికరాల తయారీకి రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం. అవి చైనా చేతిలో ఉన్నాయి. బ్యాటరీలు, విండ్ టర్బైన్లు వంటి రేర్ ఎర్త్ ఇన్‌పుట్స్ హెచ్చుగా ఉన్న సబ్–సిస్టంల దిగుమతికి మనం ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతున్నాం. కాలుష్య రహిత శక్తి వినియోగంలో చాలా వాటికి లిథియం బ్యాట రీలు కావాలి. వాటిలో శక్తిని నిల్వ చేయడం కుదురుతుంది. తెలుపు రంగులో ఉండే ఈ క్షార లోహానికీ చైనాయే ప్రధాన సరఫరాదారు.
ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఫొటో–వోల్టాయిక్ వ్యాఫర్ ఉత్ప త్తిలో 2023 నాటికే 98% చైనా గుప్పెట్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విండ్ టర్బైన్ల తయారీలో 70% చైనాయే చేజిక్కించుకున్నట్లు చెబు తున్నారు. హరిత హైడ్రోజన్ ఉత్పాదనలో, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో చైనా 2024 నాటికే ఏకైక పెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిందని యూరోపియన్ యూనియన్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల జరిపిన అధ్య యనంలో వెల్లడైంది.
కీలక వస్తువుల ఎగుమతులు, టెక్నాలజీ బదిలీపై చైనా ఆంక్షలు విధించింది. మిగిలిన దేశాలు పారిశ్రామికంగా తనపై ఆధారపడ టాన్ని చైనా ఒక ఆయుధంగా మలుచుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళడం కూడా భౌగోళిక రాజకీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని తేలుతోంది. పరికరాల విషయంలో చైనాపై ఆధారపడటం వల్ల మరో బెడద ఉంది. దాని నుంచి గ్రిడ్లు దిగుమతి చేసుకుంటే, వాటిలో అది నిక్షిప్తం చేసిన కంట్రోళ్ళ వల్ల అవాంత రాలు ఏర్పడవచ్చు. భద్రతాపరంగా అది ముప్పే! సోలార్ ఇన్‌స్టలే షన్లతో బ్యాక్–డోర్ కమ్యూనికేషన్‌కు ఉద్దేశించిన ఇన్వెర్టర్లను చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. వాటిలో తమకు అంతు బట్టని మరికొన్ని భాగాలు ఉన్నట్లు అమెరికా గతేడాది గుర్తించింది.
ప్రత్యామ్నాయమే శరణ్యం
పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభానికి గురి చేసింది. ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలో, సరఫరాలో ఇంతటి విఘాతం ఎన్నడూ ఏర్పడలేదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ చెబుతోంది. ఎంతమాత్రం వీలున్నా సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని కోరాలని చెప్పింది. హైవేలలో వేగాన్ని గంటకు కనీసం 10 కిలోమీటర్ల మేరకైనా తగ్గించాలని చెప్పింది. ప్రైవేటు కార్ల బదులు బస్సులు, రైళ్ళ వాడకానికి మారాలని సూచించింది. వాహనాలు కూడా అన్నీ రోజూ రోడ్డుపైకి రాకుండా సరి, బేసి సంఖ్యల పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పింది.
ఎల్పీజీ వంటింటికి ఎక్కువ అవసరం కనుక, దాన్ని ఉపయోగించే వాహనాలు పెట్రో లుకు మారాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు ఉన్నపుడు విమాన ప్రయాణాల జోలికి వెళ్ళవద్దంది. చాలా దేశాలు తమ పరిస్థితులను బట్టి వాటిలో కొన్నింటిని అమలులోకి తెస్తు న్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సంప్రదాయ, పునరుత్పా దక ఇంధన వనరుల పరిశోధన–అభివృద్ధిపై గణనీయమైన పెట్టు బడులు పెట్టక తప్పదు.
ఇంధన రంగానికి అంకితమైన పరిశోధన కేంద్రాలు మన దేశంలోనూ చాలా ఉన్నాయి. కానీ, అవి పారిశ్రామిక స్థాయిలో ఆలోచించకుండా వేటికవి విడివిడిగా పనిచేస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనం వైపు ఏనాడో మళ్ళిన దేశాలలో భారత్ కూడా ఉంది. సోలార్ కుక్కర్లు, హీటర్లు, బయోమాస్, బయోగ్యాస్, చివరకు బ్యాట రీలతో నడిచే బస్సుల వాడకంలో కూడా చొరవ చూపిన దేశాల్లో మనమూ ఉన్నాం. 1973లో ఎదుర్కొన్న చమురు సంక్షోభంతోనే ఆ దిశగా ఆలోచించాం. భౌగోళిక రాజకీయ వాస్తవికతల నేపథ్యంలో ఇంధన భద్రత ప్రణాళికా పటాన్ని తిరిగి రూపొందించుకోవాలి.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత


