విశ్లేషణ
పాశ్చాత్యులు ‘చీకటి ఖండ’మని పిలిచి 500 వందల సంవత్సరాలకు పైగా భౌగోళిక వలస పాలనను, ఆర్థిక వలస పాలనను సాగించిన ఆఫ్రికాలో కొత్త చైత న్యాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి వీటిని రెండవ విడత చైతన్యాలనాలి. ఉద్యమాల ద్వారా, ఎక్కువగా సాయుధ తిరుగుబాట్లతో 1950ల నుంచి ఆరంభించి రాజకీయ స్వాతంత్య్రాలను సాధించుకున్న తర్వాత, ఇపుడు ఆర్థిక స్వాతంత్య్రం కోసం కదలుతున్నారు.
లిథియం ఎగుమతులపై నిషేధం
అరుదైన లోహాలు, ఖనిజాల కోసం గత కొద్ది నెలలుగా పారిశ్రామిక దేశాలు హోరాహోరీన తలపడుతుండగా, జింబాబ్వే గత నెలలో ఆకస్మికంగా చిన్న భూకంపాన్నే సృష్టించింది. బంగారం, వజ్రాలు, ప్లాటినంతోపాటు, ప్రస్తుత పరిణామాలలో కీలకంగా మారిన లిథియం ఎగుమతులను నిషేధించింది. లిథియం ఉత్పత్తిలో జింబాబ్వేది ప్రపంచంలో నాల్గవ స్థానం. ఎగుమతుల నిషేధానికి వారు చెప్పిన కారణం, తమ వనరులను ముడిసరకుల రూపంలో ఎగుమతి చేయటం వల్ల తమకు లభిస్తున్నది అతి స్వల్పం కాగా, వాటిని శుద్ధి చేసి ఉపయోగించుకుంటున్న దేశాలు, కంపెనీలు అనేక రెట్లు లాభపడుతున్నాయి. ఆ శుద్ధి తమ దేశంలోనే జరిగితే ధర ఎంతో ఎక్కువగా వస్తుంది. కనుక, ఆ కార్యక్రమం కోసం నిషేధిస్తున్నామని! అదే రోజుల్లో జాంబియా అదే పని చేసింది.
లిథియం కీలకంగా మారినందున జింబాబ్వే, జాంబియా చర్యలు సంచలనమైనాయి గాని, 2023 మొదలుకొని 13 ఆఫ్రికన్ దేశాలు అనేక ఖనిజాలు, లోహాలను ముడి ఉత్పత్తుల రూపంలో ఎగుమతి చేయటం ఆపివేశాయి. ఆఫ్రికా ఖండంలో దక్షిణాదిన గల జింబాబ్వే, జాంబియాల నుంచి ఒకసారి ఉత్తరాన వాయవ్య దిశలో గల నిజేర్ (ఫ్రెంచ్ ఉచ్చారణ) అనే చిన్న దేశానికి వెళదాము.
రెండేళ్ల కిందట నిజేర్, దానికి పొరుగున గల బుర్కినా ఫాసో,మాలి అనే మరొక రెండు చిన్న దేశాలు కలిసి కూటమిగా ఏర్ప డ్డాయి. మూడింటా యురేనియం తదితర విలువైన నిల్వలు భారీగా ఉన్నాయి. గతంలో తమ వలసలు అయిన ఈ మూడింటిలో నిజేర్ నిల్వలను వినియోగంలోకి తెచ్చిన ఫ్రెంచ్ కంపెనీలు కిలో యురేనియంకు 0.25 డాలర్లు చెల్లించి, దానిని శుద్ధి చేసిన తర్వాత కెనడాకు 25 డాలర్లకు (వంద రెట్లు) అమ్ముతుండేవి. పై మూడు దేశాలలో స్థానిక యువ నాయకత్వాలు తిరుగుబాట్లు చేసి అధికా రానికి వచ్చిన తర్వాత, ఒక కూటమిగా ఏర్పడి, అదే 25 డాలర్లు తమకు చెల్లిస్తే తప్ప యురేనియంను ఎగుమతి చేయబోమన్నాయి. చివరకు ఫ్రెంచ్ కంపెనీలు నిష్క్రమించక తప్పలేదు.
ఫ్రెంచ్ సైనిక స్థావరాల మూత
యురేనియం ఒక్కటే కాదు. ఆ మూడు దేశాలలో బంగారం సహా అనేక నిక్షేపాలున్నాయి. వారు ఆ గనులన్నింటిని ఫ్రాన్స్ అధీనం నుంచి స్వాధీనపరచుకోవటమే గాక, తమతోపాటు మరో మూడు దేశాలలోని ఫ్రెంచ్ సైనిక స్థావరాలను మూసి వేయించారు. ఇందుకు ప్రతీకారంగా ఆ కూటమి నాయకుడైన బుర్కినా అధ్యక్షుడు ట్రవోరేపై ఇప్పటికి అయిదుసార్లు కుట్రలు జరిగాయి. ఆర్థిక స్వాతంత్య్రం లేనిదే రాజకీయ స్వాతంత్య్రం బలపడ దన్నది తెలిసిందే. ఇది లోగడనే గుర్తించిన ఆఫ్రికన్ దేశాలు, ఖనిజాలు, లోహాల విషయంలో తాము ఎంత సంపన్నమైనవో తెలిసినందున, ఆ విషయమై సమావేశాలు, సంస్థల ఏర్పాటు అయితే 30 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాయి. కానీ తమ వనరులను తామే వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్తు తగినంత లేనందున ఆ కార్యక్రమం వేగంగా సాగటం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ నేతలు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఫిబ్రవరిలో సమావేశమై, ఈ దిశగా తమ చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించటం గమనించదగ్గది.
విలువైన ఖనిజాలు, లోహాలు, చమురు, అటవీ సంపదలు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉండగా, ఆ విషయంలో అగ్రస్థానంలో గల ఏడు దేశాలు – దక్షిణాఫ్రికా, నైజీరియా, ఆంగోలా, ఘనా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గబోన్, జింబాబ్వేల ఉమ్మడి విలువ సంవత్సరానికి సుమారు 260 బిలియన్ డాలర్లు. ఈ ఉత్పత్తుల నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నది బయటి దేశాలే. అందువల్లనే ఆఫ్రికా ఇంత పేదదిగా మిగిలిపోయి ప్రజలు కనీస ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస పోవలసిన దుఃస్థితికి గురవుతున్నారు.
నమ్మశక్యం కాని ప్రగతి
వివిధ సంస్థల అంచనాల ప్రకారం ప్రపంచంలోని బంగారం నిల్వలలో 30 శాతం, అత్యధిక భాగం వజ్రాలు, 50 శాతం కోబాల్ట్, అభ్రకం, 20 శాతం రాగి, బాక్సయిట్, అవిగాక ప్లాటినం,లిథియం, యురేనియం భారీ నిక్షేపాలు అక్కడున్నాయి. వాటి నుంచి మొదటినుంచి పాశ్చాత్య దేశాలు, ఇటీవల చైనా ఎంత తర లించుకుపోతున్నా ఆఫ్రికా ఒక తరగని గనిగానే ఉంది. ఇవి గాక అటవీ సంపద మాట తెలిసిందే. సారవంతమైన భూములు విస్తా రంగా ఉండి, వాటిని సాగులోకి తెచ్చే సాధనాలు స్థానికులకు లేనందున బయటివారు ఒక్కొక్కరే అక్షరాలా లక్షలకు లక్షల ఎకరాలను దీర్ఘకాలిక లీజులకు తీసుకుని స్థానికులను కూలీలుగా మార్చు తున్నారు. ఇటువంటి లీజులలో కొన్నింటిని నేను స్వయంగా చూశాను. వాటిలో భారతీయులవి కూడా ఉన్నాయి.
ఇంతింత దోపిడీ సాగుతున్నా ఆఫ్రికా ఆర్థిక పురోగమనాన్ని చూస్తే, ఒక వేళ వారు ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధిస్తే మరెంత అద్భు తంగా ఉండగలదో అనిపిస్తుంది. ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొన్న దానినిబట్టి ఈ 2026లో ఆఫ్రికా ఆర్థిక ప్రగతి ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ఆసియాను మించిపోనున్నది. ఆసియాలో చైనా, జపాన్, ఇండియా, ఆసియాన్ కూటమి వంటి దిగ్గజాలు ఉండటంతో ఈ అంచనాలు ఎంతో నమ్మశక్యం కాకుండా తోస్తు న్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న 20 దేశాలలో సగం ఆఫ్రికాలోనే ఉన్నాయి. విచారం ఏమంటే, భారతదేశం వలెనే శతాబ్దాల పాటు వలస దోపిడీకి గురై సుదీర్ఘ ఉద్యమాల ద్వారా స్వతంత్రమైన ఆఫ్రికా గురించి మనకు తెలుస్తు న్నది స్వల్పం.
ఆఫ్రికాలో ఈ కొత్త చైతన్యాలకు కారణాలున్నాయి. అక్కడి ప్రజలలో, ముఖ్యంగా యువతలో కొత్త చదువులు, ప్రాపంచిక దృక్పథాలు, తమ దేశాల భవిష్యత్తు గురించిన స్పృహలు కలుగుతున్నాయి. మేధావి, రచయిత వర్గాలు కదలుతున్నాయి. కొత్త రాజకీయ నాయకత్వాలు వస్తుండగా వాటిపై ఈ ప్రభావాలు పడుతున్నాయి. ఎన్నెన్నో ఆధునీకరణలతో ప్రపంచం పురోగమిస్తుండగా, సకల వనరులూ గల తాము ఇంకా ఎంత కాలం బయటి వారికి ఉపయోగపడుతూ వెనుకబడి ఉండాలనే భావనలు బలపడు తున్నాయి. అంతకన్నా కావలసింది ఏమున్నది!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


