'ప్రత్యామ్నాయం' వైపు పలు దేశాలు | Sakshi Guest Column On European countries attend Colombia meetings | Sakshi
Sakshi News home page

'ప్రత్యామ్నాయం' వైపు పలు దేశాలు

May 6 2026 12:12 AM | Updated on May 6 2026 12:12 AM

Sakshi Guest Column On European countries attend Colombia meetings

విశ్లేషణ

హార్మూజ్‌ దిగ్బంధనాల అడకత్తెరలో చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతున్న వేళ, దక్షిణ అమెరికాలోని కొలంబియా అనే చిన్న దేశంలో గమనార్హమైన సమావేశాలు జరిగాయి. ఏప్రిల్‌ 24 నుంచి 29 వరకు సుమారు 60 దేశాల భాగస్వామ్యంతో జరిగిన ఆ సమావేశాల అజెండా – పెట్రోల్, గ్యాస్‌ వంటి శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు మళ్లటం ఎట్లాగన్నది. ఇది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సాగిస్తున్న యుద్ధంవల్ల ఏర్పడిన ఒత్తిడికి పర్యవసానం. పర్యావరణ అంశాలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన 30 సంవత్సరాలకు పైగా సదస్సులు జరుగుతుండటం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు గురించి తీర్మానాలు, ఒప్పందాల మాట తెలి సిందే. కానీ ఇపుడు మొదటిసారిగా ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా, అమెరికాను కనీసం ఆహ్వానించకుండా ఈ సమావేశాలు జరగటం విశేషం. 

పెద్ద దేశాలకు లేదు ఆహ్వానం
అమెరికాయే కాదు. రష్యా, చైనా, ఇండియా, గల్ఫ్‌ దేశాల వంటివి కూడా అందులో పాల్గొనలేదు. కానీ, సమావేశాలకు సహనిర్వాహకురాలైన నెదర్లాండ్స్‌తో పాటు పలు యూరోపియన్‌ దేశాలు వెళ్లాయి. ఇందులో అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ను న్నాయి. అమెరికాను ఆహ్వానించకపోవటం ఎందువల్ల? దీనికి నిర్వాహకులు చెప్పిన సమాధానం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన ఎన్నో సమావేశాలు జరిగినా ఆ తీర్మానాలను అమెరికా వీటో చేస్తూ వస్తున్నది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ అయితే అసలు శిలాజ ఇంధనాల వినియోగం సమస్యే కాదంటూ కొట్టివేసి ప్యారిస్‌ ఒప్పందం నుంచి నిష్క్రమించారు.  తక్కిన పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలావరకు ఇటువంటి ఇంధనాలతోనే ముడిబడి ఉన్నాయి. వారు ప్రత్యామ్నాయాల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా, చైనాలో తప్ప ఇతరచోట్ల మందకొడిగానే సాగుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య మిగిలిన దేశాలు శిలాజ ఇంధనాల పరిధి నుంచి వీలైనంత వేగంగా బయట పడటం తప్పనిసరి అవుతున్నది. ఇదెంత అత్యవసరమో ఉక్రెయిన్‌ యుద్ధ సందర్భంలో ఒకసారి తెలిసి రాగా, ఇపుడు ఇరాన్‌ యుద్ధంవల్ల మరింత తీవ్ర రూపంలో అర్థమవుతున్నది. చమురును, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే దేశాలు, వాటి వ్యాపారాన్ని నియంత్రించే కంపెనీలు గల రాజ్యాలు, వాటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు మొత్తం శిలాజ ఇంధన రంగం బందీ అయిపోయింది. ఇంధన ఉత్పత్తులు, ధరల నియంత్రణను కొందరు తరచు ఆయుధంగా ఉపయోగించుకున్నారు. అటువంటి ఇంధన వనరులు గల ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకునేందుకు రాజకీయంగా, సైనికంగా అనేకం చేశారు. ఈ స్థితి ఇప్పుడు ఇరాన్‌ యుద్ధ సందర్భంగా పరాకాష్ఠకు చేరింది. ఇంత క్లిష్ట స్థితి చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నది నిపుణుల మాట.

యుద్ధంతో పెరిగిన ఒత్తిడి
ఈ ప్రభావాలు చిన్న దేశాలపై సరేసరి కాగా అభివృద్ధి చెందిన యూరప్‌పై కూడా పడుతున్నాయి. అందువల్లనే కొలంబియా సమావేశాలకు నెదర్లాండ్స్‌ సహ నిర్వాహకురాలు కాగా, వచ్చే సంవత్సరం పసిఫిక్‌ ద్వీప దేశమైన తువాలూ సమావేశాలకు ఐర్లండ్‌ సహనిర్వాహకురాలు కావాలని నిర్ణయించారు. పర్యావరణ మార్పులతో సముద్ర జలాల స్థాయి పెరిగి 2100 నాటికి తువాలూ దేశం 90 శాతం మునుగుతుందన్నది అంచనా. కొలంబియా సమా వేశాలకు పలు యూరోపియన్‌ దేశాలు వెళ్లటాన్ని బట్టి, ఇరాన్‌ యుద్ధంతో తలెత్తిన శిలాజ ఇంధన సమస్యలు వారికి కూడా ఎంత ఇబ్బందికరంగా మారాయో గ్రహించవచ్చు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు  బొగ్గు, చమురు, గ్యాస్‌ వినియోగాలను 2050 నాటికి దశల వారీగా నిలిపి వేయాలని నిర్ణయించాయి కూడా.

కొలంబియాలో జరిగిన నిర్ణయాలు అన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి దేశాలూ, కంపెనీలూ, వాటిని నియంత్రించే శక్తులతో ప్రమేయం ఉండని విధంగా ఇతర ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లాలని. అవి, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, అణు విద్యుత్తు, ఎలక్ట్రికల్, బ్యాటరీ రంగాలు, జల విద్యుత్తు, సముద్ర కెరటాల విద్యుత్తు వంటివి. ఇవి శిలాజ ఇంధన రంగం నుంచి విముక్తం చేయటంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చి పర్యావరణ సమస్యల నుంచి పరిష్కారాలను చూపుతాయి. వీటన్నింటి ప్రభావంతో బయటి శక్తుల ప్రభావాలు తగ్గి, దేశాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటివి సులభమవుతాయి. అమెరికా, జర్మనీలకు చెందిన మాజీ ఇంధన మంత్రులైతే, ఒక దాదాకు, గుత్తాధికారం గల శక్తికి గల ప్రభావం నుంచి బయట పడేందుకే ఈ ప్రయత్నాలు జరుగు తున్నాయని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఈ విధమైన వివిధ అంచనాలను గమనించినపుడు, శిలాజ ఇంధనాలన్న ఒక్క అంశంతో ముడిబడి ఎన్నెన్ని ఉన్నాయనే ఆశ్చర్యం కలుగుతుంది.

పర్యావరణ ప్రజాస్వామ్యం
కొలంబియా సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆ దేశ పర్యావరణ మంత్రి ఐరీన్‌ వెలెజ్‌ టోర్రెస్, ‘ప్రపంచ పర్యావరణ ప్రజాస్వామ్యానికి ఈ చర్చలు ఆరంభ’మని అన్నారు. మరొక విధంగా చెప్పాలంటే, ప్రపంచంలోని ‘పెట్రో నియంతృత్వాలకు, ఎలక్ట్రో ప్రజాస్వామ్యాలకు మధ్య విభజనకు ఇది నాంది అవుతున్న’ దని ప్రకటించారు. ఈ పరిణామాలను గమనించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అధిపతి సైమన్‌ స్టియెల్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై చమురు పరిశ్రమ ఆధిపత్యం కారణంగానే ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వాలు కళ్లు తెరిచాయని అన్నారు. జాతీయ భద్రతలు, ఆర్థిక సుస్థిరతలు, విధానపరమైన స్వయం నిర్ణయాలు, మౌలికమైన రీతిలో సార్వభౌమాధికారాల పరిరక్షణల కోసం కూడా ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థలు అవసరమని స్పష్టం చేశారు. కొన్ని దేశాల సైనిక సలహాదారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది.

అయితే, కొలంబియాలో 60 దేశాలు చూపిన చొరవ, ఆ దిశగా ఆయా దేశాలు వచ్చే సమావేశాల నాటికి ప్రణాళికలు రూపొందించనుండటం గొప్ప విషయమేగానీ, లక్ష్యసాధనకుగల సమస్యలు తక్కువ కాదు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు కాగల ఖర్చు శిలాజ ఇంధనాల కన్న చాలా తక్కువే. ఆ పని దశల వారీగా కూడా చేయవచ్చు. అసలు సమస్య సాంకేతిక నైపుణ్యాలు, ప్రత్యామ్నాయ ఇంధన పరికరాల ఉత్పత్తికి సంబంధించినది. ఈ రెండు విషయాలలోనూ చైనా అగ్రస్థానంలో ఉంది. వారు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయగలరుగానీ, ఇతర దేశాల స్వయం సమృద్ధికి సహకరించగలరా? అదెట్లున్నా కొలంబియా చొరవ హర్షించదగ్గది.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement
 
Advertisement
Advertisement